కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ భవిష్యత్తును ఏమి నియంత్రిస్తుంది?

మీ భవిష్యత్తును ఏమి నియంత్రిస్తుంది?

మీ భవిష్యత్తును ఏమి నియంత్రిస్తుంది?

“భవిష్యత్తులో జరిగేదాన్ని నియంత్రించుకునే సామర్థ్యం జంతువులకు లేనట్లే మానవులకూ లేదు” అని జాన్‌ గ్రే అనే పరిణామవాది వ్రాశాడు. అయితే ష్మూలీ బోటియాక్‌ అనే గ్రంథకర్త యాన్‌ ఇంటెలిజెంట్‌ పర్సన్స్‌ గైడ్‌ టు జుడాయిజమ్‌ అనే తన పుస్తకంలో దానికి పూర్తి విరుద్ధమైన దృక్కోణాన్ని వ్యక్తం చేశాడు. ఆయనిలా అంటున్నాడు: “మనిషి ఒక జంతువు కాదు, కాబట్టి అతని భవిష్యత్తు ఎల్లప్పుడూ అతని చేతుల్లోనే ఉంటుంది.”

చాలామంది గ్రే అభిప్రాయంతో ఏకీభవిస్తూ, మానవాళి భవిష్యత్తును తాము అదుపు చేయలేని ప్రకృతి శక్తులు నియంత్రిస్తాయని నమ్ముతారు. మరికొందరు, మానవుడు తన భవిష్యత్తును నియంత్రించుకోగల సామర్థ్యం ఉన్న దేవుని సృష్టి అని భావిస్తారు.

కొందరు తమ భవిష్యత్తును బలమైన మానవ శక్తులు నియంత్రిస్తాయని అనుకుంటారు. రాయ్‌ వెదర్‌ఫోర్డ్‌ అనే రచయిత ప్రకారం, “మానవ అణచివేత, దోపిడిలాంటి నిర్దిష్ట కారణాలను బట్టి చూస్తే . . . లోకంలోని అధిక శాతం మందికి, ప్రత్యేకించి ఎక్కువమంది స్త్రీలకు తమ సొంత జీవితాల మీద ఎలాంటి అధికారం లేదా నియంత్రణ లేదు.” (ది ఇంప్లికేషన్స్‌ ఆఫ్‌ డిటర్మినిజమ్‌) పోటీతత్వ రాజకీయ శక్తులు లేదా సైనిక శక్తుల కారణంగా చాలామంది సంతోషకరమైన భవిష్యత్తు కోసం తాము కన్న కలలు భగ్నమవడం చూశారు.

తమ భవిష్యత్తును మానవాతీత శక్తులు నియంత్రిస్తున్నాయని తలంచిన కారణంగా చరిత్రలో కొందరు తమ జీవితాలను నిస్సహాయంగా గడిపారు. “ప్రాచీన గ్రీకులు, ముందుగానే నిర్ధారించబడిన భవితవ్యాన్ని మానవుడు మార్చలేడు కాబట్టి, ఎలాంటి ఆశలు పెట్టుకోవడమైనా వ్యర్థమే అనే స్థిర భావాన్ని ఏర్పరచుకున్నారు” అని బోటియాక్‌ చెబుతున్నాడు. ప్రతీ వ్యక్తి భవితవ్యాన్ని చంచల దేవతలు నిర్ణయిస్తారని వారు భావించారు. ఆ దేవతలు, ఒక వ్యక్తి ఎప్పుడు మరణించాలనే విషయంతోపాటు, అతను తన జీవితమంతటిలో ఎంత కష్టాన్ని, ఎంత బాధను అనుభవించాలో కూడా ఖచ్చితంగా నిర్ణయిస్తారని వారు నమ్మారు.

ఒక వ్యక్తి భవితవ్యాన్ని మానవాతీత శక్తి నియంత్రిస్తుందనే నమ్మకం నేడు సర్వసాధారణం. ఉదాహరణకు, మానవుడు చేసే క్రియల పర్యవసానాలను, అతడు మరణించాల్సిన సమయాన్ని దేవుడు ముందే నిర్ణయించాడు అని చాలామంది నమ్ముతారు. మరికొందరు సర్వశక్తిమంతుడైన దేవుడు ‘ప్రతీ మనిషి చివరికి మోక్షం పొందుతాడా లేదా నాశనమవుతాడా అన్నది ముందే నిర్ణయిస్తాడు’ అని నమ్ముతారు. క్రైస్తవులు అని చెప్పుకునే చాలామంది ఈ బోధను నమ్ముతున్నారు.

మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఏ మాత్రం అదుపు చేయలేని శక్తులు మీ భవిష్యత్తును ఇప్పటికే నిర్ధారించాయా? లేక “మనుష్యులు కొన్నిసార్లు తమ తలరాతలను తామే వ్రాసుకుంటారు” అని వ్రాసిన ఆంగ్ల నాటక రచయిత విలియమ్‌ షేక్స్‌పియర్‌ అన్న మాటల్లో ఏమైనా సత్యం ఉందంటారా? ఈ విషయం గురించి బైబిలు ఏమి చెబుతుందో పరిశీలించండి.