కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వార్ధక్యం “సొగసైన కిరీటము” అయినప్పుడు. . .

వార్ధక్యం “సొగసైన కిరీటము” అయినప్పుడు. . .

“యెహోవా వలననే నాకు సహాయము కలుగును”

వార్ధక్యం “సొగసైన కిరీటము” అయినప్పుడు. . .

“ఇంతకన్నా ఉత్తమమైన జీవితం లేదు” అని 101 ఏళ్ళ మ్యూరియల్‌ అంది. “నిజంగా ఇదొక ప్రత్యేక అవకాశం!” అని 70 ఏళ్ళ థియోడోరోస్‌ సంగ్రహంగా చెప్పింది. “నేను నా జీవితాన్ని ఇంతకన్నా సరైన రీతిలో ఉపయోగించగలిగే దాన్నే కాదు” అని 73 ఏళ్ళ మారియా పేర్కొంది. వీరందరూ యెహోవా దేవునికి సేవ చేస్తూ తమ జీవితాన్ని గడిపారు.

ఈ వయోధికులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది క్రియాశీలక యెహోవా ఆరాధకులకు ప్రతీకగా ఉన్నారు. మీద పడుతున్న వయస్సు, ఆరోగ్య చింతలు, ఇతర ప్రతికూల పరిస్థితులు ఉన్నా వారు ఇప్పటికీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి సేవిస్తున్నారు. క్రైస్తవ సంఘంలో, ఇలాంటి నమ్మకస్థులైన వయోధికులు దైవభక్తికి గౌరవనీయ ఉదాహరణలుగా ఉన్నారు. వయోధికుల పరిస్థితులు వారు చేయగలిగే వాటిని పరిమితం చేసినప్పటికీ, యెహోవా వారి సేవను ఎంతో విలువైనదిగా ఎంచుతాడు. *​—⁠2 కొరింథీయులు 8:​12.

కీర్తనల పుస్తకం, నమ్మకస్థులైన వయోధికులు తాము పొందగలమని ఆశించే జీవిత నాణ్యత గురించి సముచితంగా వ్యాఖ్యానిస్తోంది. వారు ఇంకా ఫలిస్తూ ఉన్న మహావృక్షంలాగ ఉండగలరు. నమ్మకస్థులైన వయోధికుల గురించి కీర్తనకర్త ఇలా పాడాడు: “వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా నుందురు.”​—⁠కీర్తన 92:​15.

వార్ధక్యం కారణంగా తమ శక్తి సన్నగిల్లినప్పుడు తమను ఎవరూ పట్టించుకోరేమోనని కొందరు భయపడుతుండవచ్చు. దావీదు దేవుణ్ణి ఇలా వేడుకున్నాడు: “వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము.” (కీర్తన 71:⁠9) వార్ధక్యంలో క్షీణించిపోవడానికీ వర్ధిల్లడానికీ మధ్య తేడా చూపించేది ఏమిటి? దైవిక లక్షణమైన నీతి. “నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయుదురు” అని కీర్తనకర్త పాడాడు.​—⁠కీర్తన 92:​12.

దేవునికి నమ్మకంగా సేవ చేయడంలోనే తమ జీవితాలను గడిపినవారు, సాధారణంగా తమ వార్ధక్యపు సంవత్సరాల్లోనూ మంచి ఫలాలను ఫలించడానికే మొగ్గు చూపుతారు. వాస్తవానికి, వారు తమ జీవితంలో లేదా ఇతరుల జీవితంలో నాటిన అనేక విత్తనాలు మొలకెత్తి మంచితనం అనే పంటగా ఎదుగుతాయి. (గలతీయులు 6:​7-10; కొలొస్సయులు 1:​9-12) అయితే దేవుని మార్గాలను నిర్లక్ష్యం చేసే స్వార్థపూరిత లక్ష్యాలతో తమ జీవితాలను వృధా చేసుకున్నవారికి, వార్ధక్యంలో ఏ విలువా ఉండదు.

నీతి, వార్ధక్యానికి ఆభరణం అని కూడా బైబిలు పుస్తకమైన సామెతలు నొక్కి చెబుతోంది. అక్కడ మనమిలా చదువుతాం: “నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి యుండును.” (సామెతలు 16:⁠31) అవును నీతి అంతరంగ సౌందర్యాన్ని ప్రదర్శిస్తుంది. సుదీర్ఘ జీవితకాలంలో నీతిని వెంబడించడం గౌరవాన్ని తెస్తుంది. (లేవీయకాండము 19:​32) నెరసిన వెంట్రుకలతో పాటు జ్ఞానము, వివేచన ఉంటే తత్ఫలితంగా ఘనత లభిస్తుంది.​—⁠యోబు 12:​12.

యెహోవా సేవలో నీతిగా గడిపిన జీవితం, ఆయనను సంతోషపరుస్తుంది. లేఖనాలు ఇలా అంటున్నాయి: “ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే [యెహోవానే] తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే. నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే. నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.” (యెషయా 46:⁠4) ప్రేమగల మన పరలోకపు తండ్రి, తనకు నమ్మకంగా ఉండేవారిని ఆదుకొని అండగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడని తెలుసుకోవడం ఎంతటి ఓదార్పునిస్తుందో కదా!​—⁠కీర్తన 48:​14.

యెహోవా సేవలో నీతిగా గడిపిన జీవితం, ఆయనను సంతోషపరుస్తుంది కాబట్టి, అది ఇతరుల గౌరవాన్ని కూడా పొందడానికి యోగ్యమైనది కాదా? మనం దేవుని దృక్కోణాన్ని ప్రతిబింబిస్తూ, మన తోటి వయోధిక విశ్వాసులను విలువైనవారిగా ఎంచుతాం. (1 తిమోతి 5:⁠1, 2.) కాబట్టి మనం వారి అవసరాలను తీర్చడంలో క్రైస్తవ ప్రేమను చూపించడానికి ఆచరణాత్మకమైన మార్గాలను వెదకుదాం.

జీవితపు మలి దశలో నీతి మార్గంలోకి రావడం

“నీతిమార్గమునందు జీవము కలదు” అని సొలొమోను మనకు హామీ ఇస్తున్నాడు. (సామెతలు 12:​28) ఒక వ్యక్తి తన జీవితపు మలి దశలో ఈ మార్గంలోకి రావాలనుకుంటే, మీద పడుతున్న వయస్సు ఆయనను ఆటంకపరచదు. ఉదాహరణకు మాల్డోవాలో, 99 ఏళ్ళ ఒకవ్యక్తి తన యవ్వనమంతా కమ్యూనిస్టు ఆలోచనా విధానాలను విస్తరింప చేయడంలోనే గడిపేశాడు. ఆయన వి. ఐ. లెనిన్‌ వంటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకులతో వ్యక్తిగతంగా సంభాషించడాన్ని గర్వకారణంగా భావించాడు. అయితే కమ్యూనిజం బలహీనపడి పతనమైపోవడంతో, ఈ పెద్దాయన జీవితానికి సంకల్పమూ, మార్గదర్శకమూ లేకుండా పోయింది. కానీ, మానవాళి సమస్యలకు దేవుని రాజ్యమే నిజమైన పరిష్కారం అని యెహోవాసాక్షులు ఆయనకు చూపించినప్పుడు, ఆయన బైబిలు సత్యాన్ని స్వీకరించి ఆసక్తిగల బైబిలు విద్యార్థి అయ్యాడు. విషాదకరంగా, బాప్తిస్మం తీసుకొని యెహోవా సేవకునిగా తయారుకాక ముందే ఆయన చనిపోయాడు.

హంగేరికి చెందిన 81 ఏళ్ళ స్త్రీ, దేవుని నైతిక ప్రమాణాల గురించి నేర్చుకుంటున్నప్పుడు, తాను చాలా సంవత్సరాల నుండి కలిసి జీవిస్తున్న వ్యక్తిని పెళ్ళి చేసుకోవలసిన అవసరం ఉందని గ్రహించింది. ఆమె ధైర్యాన్ని కూడగట్టుకొని తన బైబిలు ఆధారిత దృక్కోణాన్ని తన భాగస్వామికి వివరంగా చెప్పింది. ఆమెకు ఆశ్చర్యానందాలు కలిగిస్తూ, ఆయన ఆమెను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించాడు. వారి బంధాన్ని చట్టబద్ధం చేసుకున్న తర్వాత, ఆమె చాలా వేగంగా ఆధ్యాత్మిక ప్రగతి సాధించింది. బైబిలు అధ్యయనం ఆరంభించాక ఎనిమిది నెలల్లోనే ఆమె బాప్తిస్మం తీసుకొనని ప్రచారకురాలు అయింది, ఆ తర్వాత కొద్దికాలానికే ఆమె బాప్తిస్మం తీసుకుంది. నీతి, వయోధికులు నిజ సౌందర్యాన్ని కనబరిచేలా చేయగలదనే మాట ఎంత సత్యమో కదా!

అవును, నమ్మకస్థులైన వయోధిక క్రైస్తవులు తమపై దేవుని శ్రద్ధ ఉందనే నమ్మకంతో ఉండవచ్చు. యెహోవా తనకు నమ్మకంగా ఉండేవారిని విడిచిపెట్టడు. బదులుగా వారికి మార్గదర్శకాన్ని, మద్దతును ఇస్తాననీ, వారి వార్ధక్యంలో కూడా వారికి అండగా ఉంటాననీ ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వారు కీర్తనకర్త మాటలను ధృవీకరిస్తారు: “యెహోవావలననే నాకు సహాయము కలుగును.”​—⁠కీర్తన 121:⁠2.

[అధస్సూచి]

^ పేరా 4 యెహోవాసాక్షుల క్యాలెండర్‌ 2005 (ఆంగ్లం)లో జనవరి/ఫిబ్రవరి చూడండి.

[9వ పేజీలోని బ్లర్బ్‌]

“నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి యుండును.”​సామెతలు 16:​31.

[8వ పేజీలోని బాక్సు]

యెహోవా తన వయోధిక సేవకులను శ్రద్ధగా చూసుకుంటాడు

“తల నెరసినవానియెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను.”​—⁠లేవీయకాండము 19:​32.

“ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే.”​—⁠యెషయా 46:⁠4.