కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘అమూల్యమైన ముత్యమును కనుగొనడం’

‘అమూల్యమైన ముత్యమును కనుగొనడం’

‘అమూల్యమైన ముత్యమును కనుగొనడం’

‘పరలోకరాజ్యంలో ప్రవేశించాలనే లక్ష్యంతో మనుష్యులు పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు, అలా ప్రయత్నిస్తున్నవారు దానిని సొంతం చేసుకుంటున్నారు.’​—⁠మత్తయి 11:​12, Nw.

మీసర్వస్వాన్ని ధారపోసైనా సరే సొంతం చేసుకోవాలనేంత ప్రశస్తమని మీరు పరిగణించేది ఏదైనా ఉందా? ఒక లక్ష్య సాధనకు అంటే డబ్బును, ఖ్యాతిని, అధికారాన్ని లేదా హోదాను పొందాలని చేసే కృషిలో భాగంగా ప్రజలు అంకితభావం గురించి మాట్లాడినా, తన సర్వస్వం ధారపోసైనా దానిని సాధించాలని ఒక వ్యక్తి కోరుకునేది తారసపడడం చాలా అరుదు. చాలా తక్కువమందిలో కనిపించేదే అయినా ఎంతో ప్రశంసించదగిన ఈ లక్షణం గురించి యేసుక్రీస్తు, దేవుని రాజ్యానికి సంబంధించి తాను చెప్పిన ఆలోచన రేకెత్తించే అనేక ఉపమానాల్లో ఒకదానిలో ప్రస్తావించాడు.

2 ఆ ఉపమానాన్ని యేసు తన శిష్యులతో ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పాడు, అది సాధారణంగా అమూల్యమైన ముత్యం గురించిన ఉపమానం లేదా దృష్టాంతం అని పిలువబడుతుంది. ఆయన ఇలా చెప్పాడు: “పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును.” (మత్తయి 13:36, 45, 46) ఈ ఉపమానం నుండి తన శ్రోతలు ఏమి నేర్చుకోవాలని యేసు ఆశించాడు? యేసు మాటల నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

ముత్యాలకున్న అమూల్యమైన విలువ

3 పూర్వకాలాల్లో ముత్యాలు విలువైన అలంకారిక వస్తువులుగా పరిగణించబడ్డాయి. రోమా విద్వాంసుడైన ప్లిని ది ఎల్డర్‌ అభిప్రాయం ప్రకారం, ముత్యాలు “విలువైన వస్తువులన్నింటిలో అతి ఉన్నతస్థానాన్ని” ఆక్రమించాయని ఒక గ్రంథం చెబుతోంది. బంగారం, వెండి లేదా అనేక రత్నాలు లభ్యమవుతున్నట్లు కాకుండా ముత్యాలను జీవమున్న ప్రాణులే తయారుచేస్తాయి. కొన్నిరకాల గుల్లచేపలు తమలో ప్రవేశించే ఇసుక రేణువులవంటి పదార్థాలచుట్టూ నాక్రే అనే ద్రవాన్ని స్రవింపజేసి ఆ ద్రవాన్ని వాటిపై పొరలు పొరలుగా కప్పుతూ వాటిని అందమైన ముత్యాలుగా మారుస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రాచీన కాలాల్లో, శ్రేష్ఠమైన ముత్యాలు ప్రాముఖ్యంగా ఎర్రసముద్రం నుండి, పర్షియా సింధుశాఖ నుండి, హిందూ మహాసముద్రం నుండి సేకరించబడేవి, ఈ మూడు ప్రాంతాలు ఇశ్రాయేలు దేశానికి ఎంతో దూరాన ఉన్నాయి. అందుకే యేసు, ఎంతో దూరం ప్రయాణించి “మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని” గురించి మాట్లాడాడు. నిజంగా విలువైన ముత్యాలను కనుగొనేందుకు, తీవ్రంగా కృషి చేయవలసి వచ్చేది.

4 పూర్వం ఎప్పటినుండో మంచి ముత్యాలు ఎంతో ఖరీదైనవిగా పరిగణించబడుతున్నప్పటికీ, యేసు ఉపమానంలోని ముఖ్యపాఠం వాటి ఖరీదుకు సంబంధించినది కాదు. ఈ ఉపమానంలో యేసు, దేవుని రాజ్యాన్ని కేవలం ఒక అమూల్యమైన ముత్యంతో పోల్చలేదు; ఆయన “మంచి ముత్యములను కొనడానికి వెదకుచున్న వర్తకుని”వైపు, దానిని కనుగొన్న తర్వాత ఆయన ప్రతిస్పందించిన విధానంవైపు అవధానం మళ్లించాడు. ఆ ముత్యాల వర్తకుడు లేదా వ్యాపారి మామూలు దుకాణదారుడు కాదుగానీ, ముత్యం అసాధారణమైనదని గుర్తించే గుణాలను, సూక్ష్మ భేదాలను కనిపెట్టగల సునిశిత దృష్టిగల లేదా గ్రహణశక్తిగల వర్తక నిపుణుడు అని పిలవదగిన వ్యక్తి. ఆయన ముత్యాన్ని చూసిన వెంటనే అదెంత నాణ్యమైనదో గ్రహించగలడు కాబట్టి నాసిరకం ముత్యాలను లేదా నకిలీ ముత్యాలను గుర్తుపట్టలేక మోసపోడు.

5 ఈ వర్తకునిలో గమనించవలసిన ఇంకొక ప్రత్యేక అంశం ఉంది. సాధారణ వర్తకుడు ఆ ముత్యానికి ఎంత చెల్లించవచ్చో తేల్చుకోవడానికి, దానికి మార్కెట్‌లో ఎంత ధర పలుకుతుందో ముందు తెలుసుకుంటాడు. అలాంటి ముత్యాన్ని త్వరగా అమ్మగలిగేలా దానికి గిరాకీ ఉందా లేదా అనేది కూడా పరిశీలిస్తాడు. ఇంకో విధంగా చెప్పాలంటే, ముత్యాన్ని తనకోసం ఉంచుకొనే బదులు తన పెట్టుబడిపై సత్వర లాభం సంపాదించాలనే చూస్తాడు. అయితే యేసు ఉపమానంలోని వర్తకుడు అలాంటి వాడు కాడు. ఆయనకు డబ్బు లేదా భౌతిక లాభం సంపాదించుకునే ఆసక్తి లేదు. వాస్తవానికి, ఆయన తాను వెదకుచున్నది పొందడానికి “తనకు కలిగినదంతయు” అంటే బహుశా తన వ్యక్తిగత ఆస్తిపాస్తులన్నింటినీ త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు.

6 అధికశాతం వర్తకుల దృష్టిలో, యేసు ఉపమానంలోని వ్యక్తి చేసినది తెలివితక్కువ పనిగా ఉండవచ్చు. తెలివిగల వర్తకుడు అలాంటి సాహసం చేయడం గురించి ఆలోచించడు. కానీ యేసు ఉపమానంలోని వర్తకునికి మరో విధమైన ప్రమాణాలు ఉన్నాయి. ఆయనకు లభించే ప్రతిఫలం ఆర్థిక లాభార్జన కాదుగానీ అత్యంత అమూల్యమైనదొకటి తన సొంతం అయ్యిందన్న ఆనందం మరియు సంతృప్తి. దీనికి సమాంతరముగా యేసు చెప్పిన మరో ఉపమానంలో ఈ అంశం స్పష్టం చేయబడింది. ఆయన ఇలా చెప్పాడు: “పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును.” (మత్తయి 13:44) అవును, ధనరాశిని కనుగొని, దానిని సొంతం చేసుకోవడంలో ఉన్న ఆనందం తన సర్వస్వాన్ని వదులుకోవడానికి ఆ వ్యక్తిని పురికొల్పింది. నేడు అలాంటి వ్యక్తులు ఉన్నారా? అలాంటి త్యాగానికి తగిన ధనరాశి ఏదైనా ఉందా?

అమూల్యమైన విలువను గ్రహించినవారు

7 ఆ ఉపమానం చెబుతున్నప్పుడు యేసు “పరలోకరాజ్యము” గురించి మాట్లాడాడు. ఆ రాజ్య విలువను ఆయన స్వయంగా అర్థం చేసుకున్నాడనే విషయంలో సందేహం లేదు. సువార్త వృత్తాంతాలు ఆ వాస్తవాన్ని బలంగా రుజువు చేస్తున్నాయి. యేసు సా.శ. 29లో బాప్తిస్మం తీసుకున్న తర్వాత, “పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పె[ట్టాడు]”. ఆయన ఆ రాజ్యం గురించి మూడున్నర సంవత్సరాలపాటు అనేక జనసమూహాలకు బోధించాడు. “దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము” చేస్తూ ఆయన దేశం నలుమూలలా ప్రయాణించాడు.​—⁠మత్తయి 4:17; లూకా 8:1.

8 యేసు ఆ దేశమంతటా రోగులను స్వస్థపరచడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం, ప్రకృతిని అదుపు చేయడం, అంతేగాక చనిపోయిన వారిని పునరుత్థానం చేయడం వంటి అనేక అద్భుతాలు చేయడం ద్వారా, దేవుని రాజ్యం ఏమి సాధిస్తుందో కూడా చూపించాడు. (మత్తయి 14:14-21; మార్కు 4:37-39; లూకా 7:11-17) చివరకు, ఆయన హింసా కొయ్య మీద హతసాక్షిగా మరణించి తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా దేవునిపట్ల, ఆ రాజ్యంపట్ల తన యథార్థతను నిరూపించుకున్నాడు. ‘అమూల్యమైన ముత్యం’ కోసం ఆ వర్తకుడు ఇష్టపూర్వకంగా తన సర్వస్వాన్ని ఇచ్చేసినట్లే, యేసు ఆ రాజ్యం కోసం జీవించాడు, దాని కోసమే మరణించాడు.​—⁠యోహాను 18:37.

9 యేసు ఆ రాజ్యం మీద తన దృష్టిని కేంద్రీకరించడమే కాక, ఒక చిన్న అనుచరుల గుంపును కూడా సమకూర్చాడు. వీరు కూడా ఆ రాజ్యానికున్న అమూల్యమైన విలువను బాగా అర్థం చేసుకున్న వ్యక్తులే. వీరిలో అంద్రెయ ఉన్నాడు, ఈయన ముందు బాప్తిస్మమిచ్చే యోహానుకు శిష్యునిగా ఉన్నాడు. యేసే “దేవుని గొఱ్ఱెపిల్ల” అని యోహాను చెప్పిన వెంటనే అంద్రెయ, యోహాను శిష్యుల్లో మరొకరు​—⁠ఈ వ్యక్తి బహుశా జెబెదయి కుమారుల్లో ఒకరైన యోహాను అయ్యుండవచ్చు​—⁠యేసును అనుసరించడం ఆరంభించి విశ్వాసులయ్యారు. అయితే విషయం అంతటితో ఆగిపోలేదు. ఆ వెంటనే అంద్రెయ తన సహోదరుడైన సీమోను దగ్గరకు వెళ్లి “మేము మెస్సీయను కనుగొంటిమి” అని చెప్పాడు. ఇక ఆ తర్వాత సీమోను, (ఆ తర్వాత ఈయనే కేఫా అని లేదా పేతురు అని పిలువబడ్డాడు) అలాగే ఫిలిప్పు, అతని స్నేహితుడైన నతనయేలు యేసును మెస్సీయగా గుర్తించారు. నిజానికి, నతనయేలు యేసుతో, “నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు” అని చెప్పేంతగా పురికొల్పబడ్డాడు.​—⁠యోహాను 1:35-49.

చర్య తీసుకునేలా పురికొల్పబడ్డారు

10 మెస్సీయను గుర్తించినప్పుడు అంద్రెయ, పేతురు, యోహాను ఇంకా ఇతరులు పొందిన ఆనందాన్ని, అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్న వర్తకుడు పొందిన ఆనందంతో పోల్చవచ్చు. ఆ తర్వాత వారేం చేశారు? వారు యేసును మొదటిసారి కలిసిన తర్వాత, వెంటనే ఏమి చేశారనే దాని గురించి సువార్తలు మనకు ఎక్కువేమీ చెప్పడం లేదు. బహుశా వారిలో చాలామంది తమ సాధారణ జీవితానికి తిరిగి వెళ్లి ఉంటారు. అయితే, దాదాపు ఆరు నెలల నుండి సంవత్సరం లోపల, యేసు మళ్లీ ఒకసారి గలిలయ సముద్రం దగ్గర చేపలుపట్టే తమ వృత్తిలో నిమగ్నులైయున్న అంద్రెయ, పేతురు, యోహాను, యోహాను సహోదరుడైన యాకోబుల దగ్గరకు వెళ్లాడు. * యేసు వారిని చూసి “నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతును” అని అన్నాడు. దానికి వారెలా స్పందించారు? పేతురు అంద్రెయల గురించి మత్తయి వృత్తాంతం ఇలా చెబుతోంది: “వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.” యాకోబు యోహానుల గురించి మనం ఇలా చదువుతాం: “వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.” లూకా వృత్తాంతం, వారు “సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి” అని కూడా చెబుతోంది.​—⁠మత్తయి 4:18-22; లూకా 5:1-11.

11 ఆ శిష్యుల సత్వర స్పందన వారు తొందరపడి తీసుకున్న నిర్ణయమా? కానేకాదు! వారు యేసును మొదటిసారి కలుసుకున్న తర్వాత చేపలు పట్టే తమ కుటుంబ వృత్తికి తిరిగి వెళ్లినప్పటికీ, ఆ మొదటి సందర్భంలో వారు చూసిందీ, విన్నదీ వారి హృదయాల మీద, మనస్సుల మీద చెరగని ముద్ర వేసిందనడంలో సందేహం లేదు. ఆ తర్వాత గడచిన సుమారు సంవత్సర కాలం, ఆ విషయాలను ధ్యానించడానికి కావలసినంత సమయాన్ని వారికిచ్చింది. ఇప్పుడు వారు నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చింది. అమూల్యమైన ఒక ముత్యాన్ని కనుగొన్న వెంటనే ఆ ముత్యాన్ని కొనాలని పురికొల్పబడి, “పోయి తనకు కలిగినదంతా” అమ్మాడని యేసు వర్ణించిన వర్తకునిలా వారు ఉంటారా? అవును ఉంటారు. వారు చూసింది, విన్నది వారిని పురికొల్పింది. తాము చర్య తీసుకోవలసిన సమయం వచ్చిందని వారు గుర్తించారు. కాబట్టి, ఆ వృత్తాంతం మనకు చెబుతున్నట్లుగా, ఇక ఏ మాత్రం వెనకాడక వారు సర్వస్వం వదులుకొని యేసు అనుచరులయ్యారు.

12 సువార్త వృత్తాంతాల్లో ఆ తర్వాత పేర్కొనబడిన వేరేవారికంటే ఈ నమ్మకస్థులు ఎంత భిన్నంగా ఉన్నారో కదా! యేసు స్వస్థపరచిన, ఆహారమిచ్చిన చాలామంది తమ దైనందిన వ్యవహారాల్లో మునిగిపోయారు. (లూకా 17:17, 18; యోహాను 6:26) తన అనుచరులవమని యేసు ఆహ్వానించినప్పుడు కొందరు సాకులు చెప్పి తప్పించుకున్నారు. (లూకా 9:59-62) అయితే వారికి పూర్తి భిన్నంగావున్న నమ్మకస్థుల గురించి యేసు ఆ తర్వాత ఇలా చెప్పాడు: ‘బాప్తిస్మం ఇచ్చు యోహాను కాలంనుండి ఇప్పటి వరకు పరలోకరాజ్యంలో ప్రవేశించాలనే లక్ష్యంతో మనుష్యులు పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు, అలా ప్రయత్నిస్తున్నవారు దానిని సొంతం చేసుకుంటున్నారు.’​—⁠మత్తయి 11:​12, NW.

13 ‘పట్టుదలగా ప్రయత్నించడం’ అనే మాటల భావమేమిటి? ఈ మాటలకు ఆధారమైన గ్రీకు క్రియాపదం గురించి వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ అండ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌ ఇలా చెబుతోంది: “ఆ క్రియాపదం తీవ్రమైన కృషిని సూచిస్తోంది.” ఈ వచనం గురించి, బైబిలు విద్వాంసుడైన హైన్‌రిక్‌ మెయెర్‌ ఇలా చెబుతున్నాడు: “సమీపిస్తున్న మెస్సీయ రాజ్యం కోసం ఆతురతతో, తీవ్రమైన ఆకాంక్షతో కృషి చేయడం, పోరాడడం ఈ విధంగా వర్ణించబడింది . . . ఆ రాజ్యానికి సంబంధించిన ఆసక్తి (నెమ్మదిగా, నిరీక్షిస్తున్నట్లుగా కాక) ఎంతో ఆతురత గలదిగా, ఎంతో శక్తిమంతమైనదిగా ఉంటుంది.” ఆ వర్తకునిలాగే ఈ కొద్దిమంది నిజంగా ప్రశస్తమైనదేమిటో వెంటనే గుర్తించి, ఆ రాజ్యం కోసం తమ సమస్తాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డారు.​—⁠మత్తయి 19:27, 28; ఫిలిప్పీయులు 3:8.

అన్వేషణలో ఇతరులు చేరారు

14 యేసు తన పరిచర్యను కొనసాగిస్తూ ఆ రాజ్యానికి అర్హులు కావడానికి ఇతరులకు శిక్షణ ఇచ్చి సహాయం చేశాడు. మొదట ఆయన తన శిష్యుల్లో నుండి 12 మందిని ఏర్పరచుకొని వారిని అపొస్తలులుగా లేదా తాను పంపిస్తున్న వ్యక్తులుగా నియమించాడు. యేసు వీరికి తమ పరిచర్యను ఎలా కొనసాగించాలనే విషయంలో వివరణాత్మక ఆదేశాలు ఇవ్వడంతోపాటు, వారికి ఎదురయ్యే సవాళ్ల గురించి, కష్టాల గురించి కూడా హెచ్చరించాడు. (మత్తయి 10:1-42; లూకా 6:12-16) ఆ తర్వాత సుమారు రెండు సంవత్సరాలు వారు యేసుతో సన్నిహిత సంబంధాన్ని ఆనందిస్తూ ప్రచార యాత్రల్లో ఆయనతోపాటు దేశమంతా సంచరించారు. వారు ఆయన బోధలు విన్నారు, ఆయన చేసిన శక్తిమంతమైన కార్యాలు గమనించారు, ఆయన వ్యక్తిగత ఆదర్శాన్ని చూశారు. (మత్తయి 13:16, 17) ఇవన్నీ వారిని ఎంత ప్రగాఢంగా పురికొల్పాయంటే, ఆ వర్తకునిలాగే వారు కూడా ఆ రాజ్యంలో ప్రవేశించడానికి అత్యంత ఆసక్తితో, పూర్ణ హృదయంతో పట్టుదలతో కృషి చేశారు.

15 ఆ 12 మంది అపొస్తలులకు తోడుగా యేసు “డెబ్బదిమంది యితరులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా” పంపించాడు. అంతేగాక, భవిష్యత్తులో వచ్చే పరీక్షల గురించి, కష్టాల గురించి వారికి తెలియజేస్తూ, “దేవుని రాజ్యము సమీపించి యున్నది” అని ప్రజలకు చెప్పమని వారిని ఆదేశించాడు. (లూకా 10:1-12) ఆ 70 మంది అమిత సంతోషంతో తిరిగి వచ్చి, “ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని” యేసుకు వివరించారు. అయితే, వారిని బహుశా ఆశ్చర్యపరుస్తూ, రాజ్యం విషయంలో వారికి ఉన్న ఆసక్తి కారణంగా వారు భవిష్యత్తులో మరెంతో ఆనందిస్తారని యేసు వెల్లడించాడు. ఆయన వారికి ఇలా చెప్పాడు: “దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడి.”​—⁠లూకా 10:17, 20.

16 చివరగా, యేసు తన అపొస్తలులతో గడిపిన చివరి రాత్రి అంటే సా.శ. 33 నీసాను 14న, ప్రభువు రాత్రి భోజనము అని ఆ తర్వాత నుండి పిలువబడుతున్న ఆచరణను నెలకొల్పడమే కాక, ఆ సంఘటనను జ్ఞాపకార్థంగా ఆచరించాలని కూడా వారికి ఆజ్ఞాపించాడు. ఆ రాత్రి, తనతోపాటు ఉన్న 11 మందికి యేసు ఇలా చెప్పాడు: “నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు మీరే; గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని, సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.”​—⁠లూకా 22:19, 20, 28-30.

17 యేసు పలికిన ఆ మాటలు విన్నప్పుడు అపొస్తలుల హృదయాలు ఎంతటి సంతోషంతో, సంతృప్తితో నిండివుంటాయో కదా! వారికి ఏ మానవుడైనా పొందాలని ఆశించే అత్యున్నత ఘనత, ప్రత్యేక ఆధిక్యత ఇవ్వబడుతుంది. (మత్తయి 7:13, 14; 1 పేతురు 2:9) ఆ వర్తకునిలాగే, రాజ్యంలో ప్రవేశించేందుకు కృషి చేయడంలో యేసును అనుసరించడానికి వారు సమస్తాన్ని వదులుకున్నారు. కాబట్టి వారు అప్పటివరకు చేసిన త్యాగాలు ఊరకనేపోవు అనే అభయం వారికివ్వబడింది.

18 రాజ్యం మూలంగా ప్రయోజనం పొందేది, ఆ రాత్రి యేసుతో ఉన్న అపొస్తలులు మాత్రమే కాదు. ఆ మహిమాన్విత పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు సహ పరిపాలకులుగా రాజ్య నిబంధనలోకి మొత్తం 1,44,000 మందిని తీసుకోవాలన్నది యెహోవా చిత్తం. దానికితోడు, అపొస్తలుడైన యోహాను ఒక దర్శనంలో ‘ఎవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి​—⁠సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి’ చెప్పడాన్ని చూశాడు. వీరు ఆ రాజ్యంలో భూమ్మీద నివసించే ప్రజలుగా ఉంటారు. *​—⁠ప్రకటన 7:​9, 10; 14:1, 4.

19 యేసు పరలోకానికి ఎక్కిపోవడానికి కొన్నిరోజుల ముందు ఆయన తన నమ్మకమైన అనుచరులకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.” (మత్తయి 28:​19, 20) ఆ విధంగా, అన్ని దేశాల జనులు యేసుక్రీస్తు శిష్యులవుతారు. మంచి ముత్యం విషయంలో ఆ వర్తకుడు చేసినట్లే, పరలోక జీవం కోసమైనా లేదా భూసంబంధ జీవితం కోసమైనా, తమ హృదయాన్ని ఆ రాజ్యం మీదే నిలుపుతారు.

20 శిష్యులను చేసే ఈ పని చివరకు “యుగసమాప్తి” వరకు కొనసాగుతుందని యేసు మాటలు సూచించాయి. కాబట్టి, మనకాలంలోనూ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కృషి చేయడంలో తమ సమస్తాన్నీ ధారపోయగల ఆ వర్తకునిలాంటి వ్యక్తులు ఉన్నారా? ఈ ప్రశ్న తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలించబడుతుంది.

[అధస్సూచీలు]

^ పేరా 15 జెబెదయి కుమారుడైన యోహాను యేసును మొదటిసారి కలిసిన తర్వాత ఆయనను అనుసరిస్తూ ఆయన చేసిన కొన్ని పనులను ప్రత్యక్షంగా చూసి ఉండవచ్చు, అందుకే ఆయన తన సువార్త వృత్తాంతంలో విషయాలను అంత స్పష్టంగా వ్రాయగలిగాడు. (యోహాను, 2-5 అధ్యాయాలు) అయితే, యేసు ఆయనను మళ్లీ పిలవడానికి ముందు ఆయన కొంతకాలంపాటు చేపలుపట్టే తన కుటుంబ వృత్తిలో కొనసాగాడు.

^ పేరా 24 మరిన్ని వివరాల కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంలో 10వ అధ్యాయం చూడండి.

మీరు వివరించగలరా?

వర్తకుని ఉపమానంలోని ముఖ్యమైన పాఠం ఏమిటి?

రాజ్యానికున్న అధిక విలువను తాను అర్థం చేసుకున్నానని యేసు ఎలా చూపించాడు?

అంద్రెయ, పేతురు, యోహాను ఇంకా ఇతరులు యేసు పిలిచిన వెంటనే స్పందించేలా చేసినదేమిటి?

అన్ని దేశాల ప్రజలకు ఎలాంటి అద్భుత అవకాశం అందుబాటులో ఉంది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) రాజ్యం గురించి తాను చెప్పిన ఒక ఉపమానంలో యేసు చాలా తక్కువమందిలో కనిపించే ఏ లక్షణాన్ని వర్ణించాడు? (బి) అమూల్యమైన ముత్యం గురించిన ఉపమానంలో యేసు ఏమి చెప్పాడు?

3. పూర్వకాలాల్లో మంచి ముత్యాలు ఎందుకు అంత విలువైనవిగా పరిగణించబడ్డాయి?

4. వర్తకుని గురించిన యేసు ఉపమానంలోని ముఖ్యమైన పాఠం ఏమిటి?

5, 6. (ఎ) యేసు ఉపమానంలోని వర్తకుని విషయంలో ఏది ప్రత్యేకంగా గమనించదగిన విషయం? (బి) దాచబడిన ధనానికి సంబంధించిన ఉపమానం వర్తకుని గురించి ఏమి వెల్లడి చేస్తోంది?

7. యేసు రాజ్యానికున్న అమూల్యమైన విలువను తాను బాగా అర్థం చేసుకున్నట్లు ఎలా చూపించాడు?

8. రాజ్యం సాధించేదాన్ని చూపించడానికి యేసు ఏమి చేశాడు?

9. యేసు తొలి శిష్యుల్లో అరుదైన ఏ లక్షణం కనబడింది?

10. యేసు తన శిష్యులను మొదటిసారి కలిసిన కొద్దికాలం తర్వాత వారిని మళ్లీ కలిసి, పిలిచినప్పుడు వారెలా స్పందించారు?

11. యేసు ఇచ్చిన పిలుపుకు ఆ శిష్యులు సత్వరమే స్పందించడానికి కారణమేమై ఉండవచ్చు?

12, 13. (ఎ) యేసు మాటలు విన్న అనేకులు ఎలా స్పందించారు? (బి) యేసు తన నమ్మకస్థులైన శిష్యుల గురించి ఏమి చెప్పాడు, ఆయన మాటలు ఏమి సూచిస్తున్నాయి?

14. రాజ్య ప్రకటనా పని కోసం యేసు తన అపొస్తలులను ఎలా సిద్ధం చేశాడు, దాని ఫలితమేమిటి?

15. యేసు తన అనుచరుల సంతోషానికి అసలు కారణం ఏమిటని చెప్పాడు?

16, 17.(ఎ) యేసు తన నమ్మకమైన అపొస్తలులతో ఉన్న చివరి రాత్రి వారికి ఏమి చెప్పాడు? (బి) అపొస్తలులకు యేసు మాటలు ఎలాంటి సంతోషాన్ని, అభయాన్ని ఇచ్చాయి?

18. రాజ్యం మూలంగా ఆ 11 మంది అపొస్తలులతోపాటు చివరకు ఇంకా ఎవరుకూడా ప్రయోజనం పొందుతారు?

19, 20. (ఎ) అన్ని దేశాల జనులకు ఎలాంటి అవకాశం అందుబాటులో ఉంది? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏ ప్రశ్న పరిశీలించబడుతుంది?

[10వ పేజీలోని చిత్రం]

‘వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు’

[12వ పేజీలోని చిత్రం]

యేసు పరలోకానికి ఎక్కిపోవడానికి ముందు, శిష్యులను చేయమని తన అనుచరులకు ఆజ్ఞాపించాడు