కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ కాలంలో ‘అమూల్యమైన ముత్యాన్ని’ సంపాదించుకోవడానికి కృషి చేయడం

ఈ కాలంలో ‘అమూల్యమైన ముత్యాన్ని’ సంపాదించుకోవడానికి కృషి చేయడం

ఈ కాలంలో ‘అమూల్యమైన ముత్యాన్ని’ సంపాదించుకోవడానికి కృషి చేయడం

“ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును.”​—⁠మత్తయి 24:​14.

యేసు ఈ భూమ్మీదికి వచ్చేసరికి యూదుల్లో దేవుని రాజ్యం అత్యంత ఆసక్తికరమైన అంశంగా ఉంది. (మత్తయి 3:1, 2; 4:23-25; యోహాను 1:49) అయితే, వారిలో చాలామంది మొదట్లో దాని విస్తారతను, అధికారాన్ని పూర్తిగా గ్రహించలేదు, అంతేగాక అది పరలోక ప్రభుత్వమనే విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోలేదు. (యోహాను 3:1-5) యేసు అనుచరులుగా మారినవారిలో కూడా కొందరు దేవుని రాజ్యమంటే ఏమిటో, క్రీస్తు సహ పరిపాలకులయ్యే ఆశీర్వాదం పొందడానికి తాము ఏమి చేయాలో పూర్తిగా అర్థం చేసుకోలేదు.​—⁠మత్తయి 20:20-22; లూకా 19:11; అపొస్తలుల కార్యములు 1:6.

2 సమయం గడిచేకొద్దీ యేసు తన శిష్యులకు, ముందరి ఆర్టికల్‌లో పరిశీలించిన అమూల్యమైన ముత్యానికి సంబంధించిన ఉపమానంతో సహా అనేక పాఠాలు ఓపికగా బోధిస్తూ, వారు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి తీవ్రంగా కృషి చేయవలసిన ప్రాముఖ్యతను సూచించాడు. (మత్తయి 6:​33; 13:45, 46; లూకా 13:23, 24) అది వారి హృదయాలపై ప్రగాఢంగా ముద్రవేసి ఉంటుంది, ఎందుకంటే వారు రాజ్య సువార్తను అవిశ్రాంతంగా, ధైర్యంగా భూదిగంతముల వరకు ప్రకటించారు, ఈ వాస్తవాన్ని అపొస్తలుల కార్యముల పుస్తకం ధృవీకరిస్తోంది.​—⁠అపొస్తలుల కార్యములు 1:8; కొలొస్సయులు 1:23.

3 మరి నేటి విషయమేమిటి? దేవుని రాజ్యాధికారం క్రింద భూపరదైసు ఆశీర్వాదాలు అనుభవించే అవకాశం కోట్లాదిమందికి ఇవ్వబడుతోంది. “యుగసమాప్తికి” సంబంధించిన తన గొప్ప ప్రవచనంలో యేసు ప్రత్యేకంగా ఇలా చెప్పాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:3, 14; మార్కు 13:​10) తీవ్రమైన ఆటంకాలు, సవాళ్లు, చివరకు హింస ఉన్నప్పటికీ ఈ బృహత్తర కార్యం కొనసాగుతుందని కూడా ఆయన వివరించాడు. అయితే, “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును” అని ఆయన హామీ ఇచ్చాడు. (మత్తయి 24:9-13) దీనంతటికీ, యేసు ఉపమానంలోని వర్తకుడు ప్రదర్శించిన స్వయం త్యాగం, అంకితభావం అవసరం. రాజ్యంలో ప్రవేశించడానికి కృషి చేయడంలో నేడు అలాంటి విశ్వాసాన్ని, ఆసక్తిని ప్రదర్శిస్తున్న వ్యక్తులు ఉన్నారా?

సత్యాన్ని కనుగొనడంవల్ల కలిగే ఆనందం

4 యేసు ఉపమానంలోని వర్తకుడు తాను ఒక ‘అమూల్యమైన ముత్యం’ కనుగొన్నానని గ్రహించినప్పుడు ఎంతో ఆనందించాడు. ఆ ఆనందం ఆ ముత్యాన్ని సొంతం చేసుకోవడానికి తన చేతనైనంత వరకు ప్రతీ ప్రయత్నం చేసేలా ఆయనను పురికొల్పింది. (హెబ్రీయులు 12:1) నేడు, దేవుని గురించిన, ఆయన రాజ్యం గురించిన సత్యం ప్రజలను అదేరీతిలో ఆకర్షిస్తూ ప్రేరేపిస్తోంది. ఫెయిత్‌ ఆన్‌ ద మార్చ్‌ అనే పుస్తకంలో దేవుని కోసం, మానవాళి విషయంలో దేవుని సంకల్పం కోసం తాను చేసిన వ్యక్తిగత అన్వేషణ గురించి సహోదరుడు ఏ. హెచ్‌. మాక్‌మిలన్‌ వ్రాసిన మాటలను గుర్తుచేస్తోంది. ఆయన ఇలా వ్రాశాడు: “నేను కనుగొన్నదే ఇంకా వేలాదిమంది ప్రతీ సంవత్సరం కనుగొంటున్నారు. అన్ని దేశాల, జాతుల, జీవనగతుల, వయస్సుల నుండి వస్తున్న ఆ ప్రజలు మీలాంటి నాలాంటి వారే. సత్యానికి పక్షపాతం లేదు. అది అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది.”

5 ప్రతీ సంవత్సరం లక్షలాది మంది యథార్థ హృదయులు, దేవుని రాజ్య సువార్తతో పురికొల్పబడి యెహోవా చిత్తం చేయడానికి ఆయనకు తమ జీవితాన్ని సమర్పించుకోవడంలో ఆ మాటల సత్యత్వాన్ని గమనించవచ్చు. 2003 సెప్టెంబరు నుండి 2004 ఆగస్టు వరకు కొనసాగిన 2004వ సేవా సంవత్సరంలోనూ ఆ విషయాన్ని చూడవచ్చు. ఆ 12 నెలల్లో 2,62,416 మంది యెహోవాకు సమర్పించుకుంటున్నట్లు బహిరంగ సూచనగా నీటి బాప్తిస్మం తీసుకున్నారు. ఇది 235 దేశాల్లో జరిగింది, ఈ దేశాల్లో యెహోవాసాక్షులు అనేక దేశాల, జాతుల, భాషల నుండి వచ్చిన అన్ని వర్గాల ప్రజలు దేవుని వాక్యంలోని ప్రాణరక్షణ సత్యాన్ని గ్రహించేలా సహాయం చేయడానికి ప్రతీ వారం 60,85,387 గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నారు.​—⁠ప్రకటన 7:9.

6 ఇదంతా ఎలా సాధ్యమైంది? సరైన మనోవైఖరి గలవారిని యెహోవా ఆకర్షిస్తాడనడంలో సందేహం లేదు. (యోహాను 6:65; అపొస్తలుల కార్యములు 13:48) అలాగని, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కృషి చేసినవారి నిస్వార్థాన్ని, అవిశ్రాంత ప్రయత్నాలను తక్కువ చేయకూడదు. సహోదరుడు మాక్‌మిలన్‌ తన 79వ ఏట ఇలా వ్రాశాడు: “వ్యాధిగ్రస్థమై మరణిస్తున్న మానవాళికి చేయబడిన వాగ్దానాలను నేను మొదటిసారి విన్నప్పటి నుండి ఇప్పటి వరకు బైబిలు వెల్లడి చేస్తున్న సందేశంలోని నా నిరీక్షణ సడలిపోలేదు. నాలాగే సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని గురించీ, మానవాళి విషయంలో ఆయనకున్న మేలైన సంకల్పాల గురించీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నవారికి సహాయం చేయగలిగేలా, బైబిలు బోధిస్తున్నదేమిటో నేను మరింత తెలుసుకోవాలని ఆ క్షణమే తీర్మానించుకున్నాను.”

7 అదే విధమైన ఆసక్తిని నేటి యెహోవా సేవకుల్లో కూడా చూడవచ్చు. ఉదాహరణకు, ఆస్ట్రియాలోని వియన్నాలో ఉన్న డానియేలా విషయమే తీసుకోండి. ఆమె ఇలా చెబుతోంది: “నా చిన్నప్పటి నుండి దేవుడంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఎప్పటి నుండో ఆయన పేరు తెలుసుకోవాలని కోరుకున్నాను, ఎందుకంటే ‘దేవుడు’ నాకెంతో దూరంగా ఉన్నట్లు అనిపించేది. అయితే నేను 17 సంవత్సరాలు వచ్చేవరకు అంటే యెహోవాసాక్షులు మా ఇంటి తలుపు తట్టేంతవరకు వేచి ఉండాల్సి వచ్చింది. నేను దేవుని గురించి తెలుసుకోవాలనుకున్న అన్ని విషయాలు వారు వివరించారు. చివరకు నేను సత్యం తెలుసుకున్నాను, అది చాలా అద్భుతం! నేనెంత ఉప్పొంగిపోయానంటే, వెంటనే ప్రతీ ఒక్కరికి ప్రకటించడం ఆరంభించాను.” ఆమె చూపించిన ఉత్సాహం త్వరలోనే తోటి విద్యార్థుల అపహాస్యానికి దారితీసింది. “అయితే అది నాకు బైబిలు ప్రవచనం నెరవేరడం చూస్తున్నట్లు అనిపించింది, ఎందుకంటే యేసు తన అనుచరులు తన నామం నిమిత్తం ద్వేషించబడి, హింసలకు గురవుతారని చెప్పాడని నాకు తెలుసు. అందువల్ల నేను చాలా సంతోషించాను, ఎంతో ఆశ్చర్యపోయాను” అని డానియేలా వివరించింది. అనతి కాలంలోనే డానియేలా తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకొని, నీటి బాప్తిస్మం తీసుకొని మిషనరీ సేవ చేయడం ఆరంభించింది. వివాహం చేసుకున్న తర్వాత డానియేలా, ఆమె భర్త హెల్మూట్‌ వియన్నాలోని ఆఫ్రికా, చైనా, ఫిలిప్పీన్స్‌, ఇండియా దేశాలకు చెందిన ప్రజలకు ప్రకటించడం మొదలుపెట్టారు. డానియేలా, హెల్మూట్‌ ఇప్పుడు నైరృతి ఆఫ్రికాలో మిషనరీలుగా సేవ చేస్తున్నారు.

వారు విడిచిపెట్టరు

8 యెహోవా ప్రజలు నేడు దేవునిపట్ల తమ ప్రేమనూ, ఆయన రాజ్యం విషయంలో తమ విశ్వాసాన్నీ ప్రదర్శించే మార్గాల్లో ఒకటి మిషనరీ సేవ. యేసు ఉపమానంలోని వర్తకునిలా ఈ సేవను చేపట్టేవారు రాజ్యం కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికైనా వెనుకాడడం లేదు. అయితే ఈ మిషనరీలు రాజ్య సువార్తను కనుగొనేందుకు ప్రయాణించడం లేదుగానీ, ప్రపంచ మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఆ రాజ్య సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు శిష్యులయ్యేలా వారికి బోధిస్తూ సహాయం చేయడానికి అలా ప్రయాణిస్తున్నారు. (మత్తయి 28:19, 20) వారు అనేక దేశాల్లో, అసాధారణమైన కష్టాలను సహించవలసి ఉంటుంది. అయితే వారి సహనానికి గొప్ప ప్రతిఫలం లభిస్తోంది.

9 ఉదాహరణకు, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌నే తీసుకోండి, అక్కడ గత సంవత్సరం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు 16,184 మంది హాజరయ్యారు, ఇది ఆ దేశంలోని ప్రచారకులకన్నా ఏడురెట్లు ఎక్కువ. ఆ దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా లేని కారణంగా ప్రజలు సాధారణంగా తమ రోజువారీ పనులను బయట చెట్ల నీడలో చేసుకుంటారు. కాబట్టి మిషనరీలు కూడా ఆ రీతిగానే తమ పని చేసుకుపోవడం అంటే బయటే చెట్టు నీడలో బైబిలు అధ్యయనాలు నిర్వహించడం సహజమే. ఆరుబయట మంచి వెలుగుతోపాటు చల్లగా ఉండడమే కాక మరో ప్రయోజనం కూడా ఉంది. బైబిలంటే అక్కడి ప్రజలకు సహజంగానే ఇష్టం, పైగా మతసంబంధ అంశాలు చర్చించడం అక్కడ సర్వసాధారణం. తరచూ, అటుగా వెళ్లేవారు అక్కడ జరుగుతున్నది గమనించి, పిలవకుండానే వచ్చి బైబిలు అధ్యయనంలో కూర్చుంటారు.

10 ఆ విధంగా ఒక మిషనరీ ఆరుబయట ఒక బైబిలు అధ్యయనం నిర్వహిస్తుండగా, పక్క వీధిలో నివసిస్తున్న ఒక యువకుడు అక్కడికి వచ్చి, ఆ మిషనరీ తనను సందర్శించ లేదు కాబట్టి ఆ మిషనరీ తన దగ్గరకు వచ్చి, తనతో కూడా బైబిలు అధ్యయనం చేయాలని కోరాడు. అందుకు ఆ మిషనరీ సంతోషంగా ఒప్పుకున్నాడు, ఇప్పుడు ఆ యువకుడు వేగంగా అభివృద్ధి సాధిస్తున్నాడు. ఆ దేశంలో పోలీసులు తరచూ రోడ్డుమీదే సాక్షులను ఆపుతారు, అయితే సమన్లు జారీ చేయడానికో, జరిమానా వసూలు చేయడానికో కాదుగానీ కావలికోట, తేజరిల్లు! తాజా సంచికలను అడగడానికి లేదా తమకు ప్రత్యేకంగా నచ్చిన ఆర్టికల్‌ గురించి అభినందించడానికి వారు అలా ఆపుతారు.

11 దాదాపు 40, 50 సంవత్సరాల క్రితం మిషనరీ సేవలో ప్రవేశించినవారు క్షేత్రంలో ఇంకా నమ్మకంగా సేవ చేస్తున్నారు. విశ్వాసం, పట్టుదల విషయంలో మనందరికీ అదెంత చక్కని మాదిరో కదా! ఒక మిషనరీ జంట గత 42 సంవత్సరాల్లో మూడు దేశాల్లో సేవ చేశారు. భర్త ఇలా చెబుతున్నాడు: “మేము కష్టాలు ఎదుర్కొన్నాం. ఉదాహరణకు, మేము దాదాపు 35 సంవత్సరాలు మలేరియాతో పోరాడాము. అయినప్పటికీ, మిషనరీలుగా సేవచేయాలన్న మా నిర్ణయం విషయంలో మేమెన్నడూ బాధపడలేదు.” ఆయన భార్య ఇలా అంటోంది: “కృతజ్ఞతా భావంతో ఉండడానికి ఎప్పుడూ ఎన్నో అవకాశాలు లభించేవి. క్షేత్ర పరిచర్య ఎంత ఆనందంగా ఉండేదంటే, బైబిలు అధ్యయనాలను ఇట్టే ఆరంభించగలిగే వాళ్లం. బైబిలు విద్యార్థులు కూటాలకు రావడం, ఒకరినొకరు పరిచయం చేసుకోవడం చూసినప్పుడు, ప్రతీసారీ ఆ దృశ్యం ఒక కుటుంబ సమావేశంలా ఉండేది.”

వారు “సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నారు”

12 ఆ వర్తకుడు అమూల్యమైన ఒక ముత్యాన్ని కనుగొన్నప్పుడు, ఆయన ‘పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొన్నాడు.’ (మత్తయి 13:​46) రాజ్యపు గొప్ప విలువను ఘనమైనదిగా పరిగణించేవారిలో తాము విలువైనదని ఎంచిన దానిని వదులుకోవడానికి ఇష్టపడే స్వభావం ఉంటుంది. క్రీస్తుతోపాటు రాజ్య పరిపాలనలో భాగం వహించేవారిలో ఒకరిగా అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: ‘నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొను నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.’​—⁠ఫిలిప్పీయులు 3:​8-10.

13 అదే విధంగా నేడు చాలామంది రాజ్యాశీర్వాదాలు పొందేందుకు తమ జీవితాల్లో పెద్ద మార్పులు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఉదాహరణకు, 2003 అక్టోబరులో ఛెక్‌ రిపబ్లిక్‌లో 60 ఏళ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయునికి బైబిలు అధ్యయన సహాయక పుస్తకమైన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము లభించింది. దానిని చదివిన తర్వాత, బైబిలు అధ్యయనం కోసం ఆయన వెంటనే తన ప్రాంతంలోని యెహోవాసాక్షులను సంప్రదించాడు. ఆయన చక్కగా ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడంతోపాటు కూటాలన్నింటికీ హాజరవడం ఆరంభించాడు. అయితే మేయరు పదవి కోసం, సెనెటర్‌ అయ్యేందుకు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా ఆయనకు ఉండేది, మరి ఆయన ఏమి చేశాడు? దానికి బదులు ఆయన మరో రకమైన పందెంలో అంటే జీవపు పరుగుపందెంలో రాజ్య ప్రచారకుడిగా, ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఇలా చెప్పాడు: “నేను నా విద్యార్థులకు బైబిలు సాహిత్యాలను విస్తారంగా ఇవ్వగలిగాను.” 2004 జూలైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన తన సమర్పణకు సూచనగా నీటి బాప్తిస్మం తీసుకున్నాడు.

14 ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది రాజ్య సువార్తకు ఇదే విధంగా ప్రతిస్పందించారు. వారు ఈ దుష్ట ప్రపంచాన్ని విడిచిపెట్టడమే కాక, తమ పాత స్వభావాన్నీ, పాత సహవాసులనూ వదులుకొని తమ ప్రాపంచిక లక్ష్యాలను త్యజించారు. (యోహాను 15:19; ఎఫెసీయులు 4:22-24; యాకోబు 4:4; 1 యోహాను 2:15-17) వారు ఇదంతా ఎందుకు చేశారు? ఎందుకంటే ప్రస్తుత విధానం ఇవ్వగల దేనికంటే కూడా దేవుని రాజ్యాశీర్వాదాలను వారు ఎంతో ఉదాత్తమైనవిగా, ఉన్నతమైనవిగా పరిగణించారు. రాజ్య సువార్త విషయంలో మీరూ అలాగే భావిస్తున్నారా? యెహోవా ప్రమాణాలకు అనుగుణంగా మీ జీవన విధానంలో, విలువల్లో, లక్ష్యాల్లో అవసరమైన మార్పులు చేసుకోవడానికి మీరు దాని ద్వారా పురికొల్పబడుతున్నారా? అలా చేయడం మీకు ఇప్పుడూ, భవిష్యత్తులోనూ అనేక ఆశీర్వాదాలు తీసుకొస్తుంది.

కోత చరమాంకానికి చేరుకోవడం

15 కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు.” అలా ఇష్టపూర్వకంగా వచ్చినవారిలో ‘మంచువంటి యౌవనస్థులలోని శ్రేష్ఠులు,’ సువార్త ‘ప్రకటించే స్త్రీల గొప్ప సైన్యము’ ఉన్నారు. (కీర్తన 68:​11; 110:⁠3) ఈ అంత్యదినాల్లో యెహోవా ప్రజల్లోని స్త్రీపురుషుల, యౌవనుల, వృద్ధుల శ్రద్ధ, స్వయంత్యాగాల ఫలితమేమిటి?

16 ఇండియాలో ఒక పయినీరు లేదా పూర్తికాల రాజ్య ప్రచారకురాలు, ఆ దేశంలో 20 లక్షలకు పైగా ఉన్న బధిరులు రాజ్యం గురించి తెలుసుకొనేందుకు వారికి సహాయం చేయడమెలా అని ఆలోచించింది. (యెషయా 35:5) సంజ్ఞాభాష నేర్చుకోవడానికి ఆమె ఆ భాషా సంబంధిత సంస్థలో చేరింది. అక్కడ ఆమె అనేకమంది బధిరులతో రాజ్య నిరీక్షణను పంచుకోగలిగింది, బైబిలు అధ్యయన గుంపులు ఏర్పడ్డాయి. కొన్ని వారాల్లోపే ఒక డజనుకన్నా ఎక్కువమంది రాజ్యమందిరంలో కూటాలకు రావడం ఆరంభించారు. ఆ తర్వాత ఒక వివాహ విందులో ఆ పయినీరు కోల్‌కత నుండి వచ్చిన ఒక బధిరుణ్ణి కలిసింది. ఆయనకు చాలా సందేహాలు ఉండడమే కాక, యెహోవా గురించి తెలుసుకోవాలనే ప్రగాఢ ఆసక్తిని కూడా కనబరిచాడు. అయితే, ఒక సమస్య వచ్చిపడింది. అదేమిటంటే, ఆ యువకుడు దాదాపు 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్‌కతకు తిరిగి వెళ్లి, తన చదువు ఆరంభించాలి, అక్కడ సంజ్ఞా భాష వచ్చిన సాక్షులెవరూ లేరు. తన బైబిలు అధ్యయనం కొనసాగించగలిగేలా, బెంగుళూరులోనే చదువు కొనసాగిస్తానని తన తండ్రిని అతికష్టం మీద ఒప్పించాడు. ఆయన చక్కని ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించి ఒక సంవత్సరం తర్వాత, తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకున్నాడు. ఆయన తిరిగి, తన చిన్ననాటి స్నేహితునితో సహా అనేకమంది బధిరులతో బైబిలు అధ్యయనాలు ఆరంభించాడు. ఇండియాలోని బ్రాంచి కార్యాలయం ఇప్పుడు ఆ క్షేత్రంలో సహాయం చేయడానికి, పయినీర్లు సంజ్ఞాభాష నేర్చుకునే ఏర్పాట్లు చేస్తోంది.

17 ఈ పత్రికలోని 19 నుండి 22 పేజీల్లో యెహోవాసాక్షుల 2004వ సేవా సంవత్సరపు క్షేత్ర సేవా ప్రపంచవ్యాప్త నివేదికను మీరు చూస్తారు. దానిని పరిశీలించేందుకు కొంచెం సమయం తీసుకోవడమే కాక, మీకై మీరు నేడు భూవ్యాప్తంగా యెహోవా ప్రజలు “అమూల్యమైన యొక ముత్యమును” సంపాదించుకోవడానికి కృషి చేయడంపైనే దృష్టి కేంద్రీకరించారనేందుకు రుజువును చూడండి.

‘రాజ్యమును మొదట వెదకుడి’

18 వర్తకుని గురించిన యేసు ఉపమానాన్ని మళ్లీ ఒకసారి పరిశీలిస్తే, ఆయన తనకు కలిగినదంతా అమ్మిన తర్వాత జీవితమెలా నెట్టుకొస్తాడనే దాని గురించి యేసు ఏమీ చెప్పకపోవడం గమనించండి. వాస్తవిక దృష్టితో కొందరిలా ప్రశ్నించవచ్చు, ‘ఆ వర్తకునికి ఇక మిగిలిందేమీ లేదు కదా, అలాంటప్పుడు అతనికి ఆహారం, వస్త్రాలు, నివాసం ఎక్కడ నుండి లభిస్తాయి? ఆ అమూల్యమైన ముత్యం అతనికి దేనికి పనికొస్తుంది?’ భౌతిక దృక్కోణం నుండి చూస్తే ఆ ప్రశ్నలు సమంజసమైనవే అనిపించవచ్చు. అయితే యేసు తన శిష్యులకు, “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” అని చెప్పలేదా? (మత్తయి 6:31-33) ఆ ఉపమానపు ముఖ్యాంశం ఏమిటంటే, దేవునిపట్ల సంపూర్ణ భక్తిని, రాజ్యం విషయంలో సంపూర్ణ ఆసక్తిని ప్రదర్శించడమే. దీనిలో మనకేదైనా పాఠం ఉందా?

19 మనం అద్భుతమైన సువార్త గురించి ఇటీవలే తెలుసుకున్నా లేక ఆ రాజ్యంలో ప్రవేశించడానికి కృషి చేస్తూ దశాబ్దాలుగా దాని ఆశీర్వాదాల గురించి ఇతరులకు చెబుతున్నా, మనం ఆ రాజ్యాన్ని మన ఆసక్తికి, అవధానానికి కేంద్ర బిందువుగా చేసుకోవడంలో కొనసాగాలి. ఇవి కష్టభరిత కాలాలే, అయితే ముత్యాన్ని కనుగొన్న ఆ వర్తకుడిలాగే, మనం సంపాదించుకోవడానికి కృషి చేస్తున్నది వాస్తవమైనదనీ, సాటిలేనిదనీ నమ్మడానికి మనకు బలమైన కారణాలున్నాయి. మనం “యుగసమాప్తి”లో జీవిస్తున్నామని అనడానికి ప్రపంచ సంఘటనలు, నెరవేరిన బైబిలు ప్రవచనాలు నమ్మదగిన రుజువునిస్తున్నాయి. (మత్తయి 24:3) కాబట్టి ఆ వర్తకునిలాగే మనమూ దేవుని రాజ్యం విషయంలో సంపూర్ణ ఆసక్తిని ప్రదర్శిస్తూ సువార్తను ప్రకటించే ఆధిక్యతను బట్టి ఆనందించుదాం.​—⁠కీర్తన 9:1, 2.

మీరు జ్ఞాపకం తెచ్చుకుంటారా?

గడచిన సంవత్సరాల్లో సత్యారాధకుల అభివృద్ధికి ఏది దోహదపడింది?

మిషనరీలుగా సేవచేస్తున్న వారిలో ఎలాంటి స్ఫూర్తిని చూడవచ్చు?

రాజ్య సువార్త కారణంగా ఆయా వ్యక్తులు ఎలాంటి మార్పులు చేసుకున్నారు?

అమూల్యమైన ముత్యం గురించిన యేసు ఉపమానం నుండి మనం ఏ విలువైన పాఠాన్ని నేర్చుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) యేసు కాలంనాటి యూదులు దేవుని రాజ్యం గురించి ఏమి తలంచారు? (బి) రాజ్యం గురించి సరైన అవగాహన కలిగించేందుకు యేసు ఏమి చేశాడు, దాని ఫలితాలు ఎలా ఉన్నాయి?

3. మన కాలానికి సంబంధించి, రాజ్యం గురించి యేసు ఏమి చెప్పాడు?

4. రాజ్య సత్యం నేడు ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోంది?

5. ఈ 2004వ సేవా సంవత్సరపు నివేదికలో ఎలాంటి ఆసక్తికరమైన ఫలితాలు ఉన్నాయి?

6. సంవత్సరాలుగా జరుగుతున్న స్థిరమైన అభివృద్ధికి కారణమేమిటి?

7. బైబిలు సత్యం కనుగొన్నవారి ఆనందాన్ని, ఆకాంక్షను ఏ అనుభవం ఉదహరిస్తోంది?

8. చాలామంది దేవునిపట్ల తమ ప్రేమనూ, ఆయన రాజ్యం విషయంలో తమ విశ్వాసాన్నీ ప్రదర్శించే ప్రతిఫలదాయక మార్గాల్లో ఒకటి ఏమిటి?

9, 10. మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌ వంటి సుదూర ప్రాంతాల్లో మిషనరీలకు ఎలాంటి ఉత్తేజకరమైన అనుభవాలు ఎదురవుతున్నాయి?

11. పరీక్షలు ఎదురైనప్పటికీ, దీర్ఘకాల మిషనరీలు తమ సేవ గురించి ఎలా భావిస్తున్నారు?

12. ఒక వ్యక్తి తాను రాజ్యపు గొప్ప విలువను ఘనమైనదిగా పరిగణిస్తున్నట్లు ఎలా చూపించవచ్చు?

13. ఛెక్‌ రిపబ్లిక్‌లోని ఒక వ్యక్తి రాజ్యం విషయంలో తన ప్రేమను ఎలా ప్రదర్శించాడు?

14. (ఎ) రాజ్య సువార్త లక్షలాదిమంది ఏమి చేసేలా పురికొల్పింది? (బి) మనలో ప్రతీ ఒక్కరూ ఏ గంభీరమైన ప్రశ్నలు వేసుకోవచ్చు?

15. అంత్యదినాల్లో దేవుని ప్రజలు ఏమి చేస్తారని ప్రవచించబడింది?

16. రాజ్యం గురించి ఇతరులు తెలుసుకోవడానికి సహాయపడేందుకు దేవుని సేవకులు ఎలా కృషి చేస్తున్నారో ఒక ఉదాహరణ చెప్పండి.

17. ఈ పత్రికలోని 19 నుండి 22 పేజీల్లో ఉన్న 2004వ సంవత్సరపు సేవా నివేదికలో మీకు ప్రత్యేకంగా ప్రోత్సాహకరంగా అనిపించింది ఏమిటో వివరించండి.

18. వర్తకుని గురించిన ఉపమానంలో యేసు ఏ సమాచారం ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు?

19. అమూల్యమైన ముత్యం గురించిన యేసు ఉపమానం నుండి మనం ఎలాంటి కీలక పాఠం నేర్చుకోవచ్చు?

[19-22వ పేజీలోని చార్టు]

ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2004వ సేవా సంవత్సరపు నివేదిక

(బౌండ్‌ వాల్యూమ్‌ చూడండి)

[14వ పేజీలోని చిత్రం]

“సత్యం . . . అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది.”​—⁠ఏ. హెచ్‌. మాక్‌మిలన్‌

[15వ పేజీలోని చిత్రం]

డానియేలా, హెల్మూట్‌ వియన్నాలో వేరే భాషా ప్రజలకు ప్రకటించారు

[16, 17వ పేజీలోని చిత్రాలు]

ఆ వర్తకునిలానే నేడు మిషనరీలు కూడా బహుగా ఆశీర్వదించబడ్డారు

[17వ పేజీలోని చిత్రం]

“నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు”