మీరు బోధిస్తున్నవారిలో సత్యం ఫలిస్తోందా?
మీరు బోధిస్తున్నవారిలో సత్యం ఫలిస్తోందా?
యౌవనస్థుడైన ఎరిక్, యెహోవాసాక్షిగా గుర్తించబడడం ఇక తనకు ఇష్టం లేదని చెప్పినప్పుడు అతని తల్లిదండ్రులు కృంగిపోయారు. ఎరిక్ అలా తయారవుతున్నాడని వారు గమనించనేలేదు. ఎరిక్ బాలునిగా ఉన్నప్పుడు కుటుంబ బైబిలు అధ్యయనంలో పాల్గొనేవాడు, క్రైస్తవ కూటాలకు హాజరయ్యేవాడు, సంఘంతోపాటు ప్రకటనా పనిలో కూడా భాగం వహించేవాడు. అతను సత్యంలో ఉన్నట్లే కనిపించాడు. అయితే అతను ఇల్లు వదిలి వెళ్ళేసరికి, అతను బైబిలు సత్యాన్ని సొంతం చేసుకోలేదని తల్లిదండ్రులకు అర్థమయ్యింది. ఆ సంఘటన వారిని దిగ్భ్రాంతికి గురిచేయడమే కాక, ఎంతో నిరుత్సాహపరచింది కూడా.
ఒక బైబిలు విద్యార్థి హఠాత్తుగా అధ్యయనం చేయడం మానేసినప్పుడు ఇతరులు కూడా ఇలాంటి భావాలతోనే బాధపడ్డారు. అలాంటప్పుడు వారు ‘ఇలా జరుగుతుందని నేనెందుకు గ్రహించలేదు?’ అని తమను తాము ప్రశ్నించుకుంటారు. ఆధ్యాత్మిక విపత్తు ముంచుకురాక ముందే, మనం బోధిస్తున్నవారిలో సత్యం ఫలిస్తోందో లేదో తెలుసుకోవడం సాధ్యమేనా? ఆ మాటకొస్తే, సత్యం మనలోనూ మనం బోధించే వారిలోనూ ఫలిస్తోందని మనం ఎలా నిశ్చయపర్చుకోవచ్చు? విత్తువాడి గురించి చెప్పిన ఉపమానంలో యేసు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి సహాయపడే వివరణ ఇచ్చాడు.
సత్యం హృదయాన్ని చేరుకోవాలి
“విత్తనము దేవుని వాక్యము. మంచి నేలనుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు” అని యేసు చెప్పాడు. (లూకా 8:11, 15) కాబట్టి రాజ్య సత్యం మన బైబిలు విద్యార్థుల్లో ఫలించడం ప్రారంభించడానికి ముందు అది వారి సూచనార్థక హృదయంలో నాటుకోవాలి. మంచి విత్తనము మంచి నేలపై పడగానే పెరగడం ప్రారంభించినట్లు దైవిక సత్యం మంచి హృదయాన్ని తాకగానే, దానిపై ప్రభావం చూపించి ఫలించడం ప్రారంభిస్తుందని యేసు మనకు చెప్పాడు. అయితే మనం దేని కోసం చూడాలి?
మనం కేవలం పై రూపాన్ని కాకుండా హృదయ లక్షణాలను గమనించాలి. ఒక పద్ధతి ప్రకారం ఆరాధన చేసినంత మాత్రాన అది ఒక వ్యక్తి హృదయాలోచనలను వెల్లడి చేయదు. (యిర్మీయా 17:9, 10; మత్తయి 15:7-9) మనం ఇంకా లోతుగా చూడాలి. ఆ వ్యక్తి కోరికల్లోను, ఉద్దేశాల్లోను, ప్రాధాన్యతల్లోను ఖచ్చితమైన మార్పులు కనిపించాలి. ఆ వ్యక్తి దేవుని చిత్తానికి పొందికగా ఉండే నవీన స్వభావాన్ని పెంపొందించుకోవాలి. (ఎఫెసీయులు 4:20-24) ఉదాహరణకు, థెస్సలోనీకయులు సువార్తను విన్నప్పుడు అది దేవుని వాక్యమని వారు వెంటనే అంగీకరించారని పౌలు చెప్పాడు. అయితే వారు ఆ తర్వాత చూపించిన సహనం, విశ్వాసం, ప్రేమలవల్లనే సత్యం ‘[వారిలో] కార్యసిద్ధి కలుగజేస్తోందనే’ విషయం వెల్లడయ్యింది.—1 థెస్సలొనీకయులు 2:13, 14; 3:6.
అయితే ఎరిక్ ఉదాహరణ చూపిస్తున్నట్లుగా, ఒక విద్యార్థి హృదయాలోచనలు ఇప్పుడు కాకపోతే తర్వాతైనా అతని ప్రవర్తనలో కనిపిస్తాయి. (మార్కు 7:21, 22; యాకోబు 1:14, 15) విచారకరమైన విషయమేమిటంటే, కొన్ని చెడు అలవాట్లు ఒక వ్యక్తి చర్యల్లో స్పష్టంగా కనిపించేసరికి సమయం మించిపోవచ్చు. కాబట్టి అలాంటి బలహీనతలు ఆధ్యాత్మిక హానిని కలుగజేయకముందే వాటిని పసిగట్టడానికి ప్రయత్నించడమే ఇప్పుడు మనముందున్న సవాలు. మనం వారి హృదయంలోని విషయాలను తెలుసుకోవాలి. మనం ఎలా తెలుసుకోవచ్చు?
యేసునుండి నేర్చుకోండి
యేసు ఇతరుల హృదయాలను స్పష్టంగా చదవగలిగేవాడు. (మత్తయి 12:25) మనమెవ్వరమూ అలా చేయలేము. అయితే మనం కూడా ఒక వ్యక్తి కోరికలను, ఉద్దేశాలను, ప్రాధాన్యతలను గ్రహించవచ్చని ఆయన చూపించాడు. ఒక మంచి వైద్యుడు రోగి గుండెకు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వేర్వేరు పద్ధతులను ఉపయోగించినట్లే, యేసు సాధారణ ప్రజలకు కనిపించని “హృదయముయొక్క తలంపులను ఆలోచనలను” ‘పైకి చేదడానికి’ అంటే వాటిని గుర్తించడానికి దేవుని వాక్యాన్ని ఉపయోగించేవాడు.—హెబ్రీయులు 4:12; సామెతలు 20:5.
ఉదాహరణకు, ఒక సందర్భంలో యేసు ఆ తర్వాత ఒక అవరోధంగా మారిన బలహీనతను గుర్తించడానికి పేతురుకు సహాయం చేశాడు. పేతురు తనను ప్రేమిస్తున్నాడని యేసుకు తెలుసు. నిజానికి యేసు అంతకుముందే పేతురుకు “రాజ్యముయొక్క తాళపుచెవులు” ఇచ్చాడు. (మత్తయి 16:13-19) అయితే సాతాను అపొస్తలులను తన గురిగా పెట్టుకున్నాడనే విషయం కూడా యేసుకు తెలుసు. ముందుముందు వారు రాజీపడాలనే తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. తన శిష్యుల్లో కొంతమందికి విశ్వాస సంబంధ బలహీనతలు ఉన్నాయని యేసు గ్రహించాడు. కాబట్టి వారు ఏయే విషయాల్లో మెరుగుపడాలో వారికి చెప్పడానికి ఆయన సందేహించలేదు. ఆ విషయం గురించి చర్చించడాన్ని ఆయన ఎలా ప్రారంభించాడో చూడండి.
మత్తయి 16:21 ఇలా చెబుతోంది: ‘అప్పటినుండి తాను హింసలు పొంది, చంపబడడం అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయడం మొదలుపెట్టాడు.’ యేసు తనకు ఏమి జరుగుతుందో వారికి కేవలం చెప్పి ఊరుకోకుండా వారికి తెలియజేశాడు అంటే వారికి చూపించాడు అని గమనించండి. ఆయన బహుశా బైబిలు లేఖనాలను అంటే మెస్సీయ హింసలు అనుభవించి చనిపోవాలని సూచించే కీర్తన 22:14-18 లేదా యెషయా 53:10-12 వంటి లేఖనాలను ఉపయోగించి ఉండవచ్చు. ఏదేమైనా, యేసు లేఖనాలను నేరుగా చదవడం ద్వారా లేదా ఎత్తి చెప్పడం ద్వారా పేతురుకు, ఇతరులకు తమ హృదయాలనుండి స్పందించే అవకాశాన్ని ఇచ్చాడు. తాను అలా హింసించబడతానని చెప్పినప్పుడు వారు ఎలా ప్రతిస్పందించారు?
ఆశ్చర్యకరంగా ఎంతో ధైర్యవంతుడనీ ఉత్సాహవంతుడనీ పేరు పొందిన పేతురు ఆ సందర్భంలో ప్రతిస్పందించిన తీరు ఆయన ఆలోచనా విధానంలో ఒక గంభీరమైన లోపం ఉందని వెల్లడి చేసింది. ఆయన “ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదు” అని అన్నాడు. పేతురు ఆలోచనా విధానం తప్పుదోవ పట్టిందని స్పష్టమవుతోంది, ఎందుకంటే యేసు చెప్పినట్లుగా పేతురు ‘మనుష్యుల సంగతులనే తలంచాడు గాని దేవుని సంగతులను తలంచలేదు.’ అది తీవ్రమైన పర్యవసానాలకు దారితీయగల గంభీరమైన లోపం. అప్పుడు యేసు ఏమి చేశాడు? పేతురును మందలించిన తర్వాత యేసు పేతురుకు ఇతర శిష్యులకు ఇలా చెప్పాడు: “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.” ఆయన కీర్తన 49:8, 62:12లోని తలంపులను వివరిస్తూ రక్షణ కల్పించలేని మనుష్యులు కాదుగానీ, దేవుడు మాత్రమే నిత్యజీవపు ఉత్తరాపేక్షను ఇవ్వగలడని ప్రేమగా వారికి గుర్తు చేశాడు.—మత్తయి 16:22-28.
పేతురు ఆ తర్వాత తాత్కాలికంగా మనుష్యులకు భయపడి యేసును మూడుసార్లు నిరాకరించినా, ఈ చర్చ, అలాగే యేసు ఆయనతో అంతకుముందు చర్చించిన విషయాలు ఆయన వేగంగా ఆధ్యాత్మికంగా కోలుకోవడానికి సహాయం చేశాయనడంలో సందేహం లేదు. (యోహాను 21:15-19) కేవలం 50 రోజుల తర్వాత పేతురు యేసు పునరుత్థానం గురించి సాక్ష్యమివ్వడానికి ధైర్యంగా యెరూషలేములోని జనసమూహాల ఎదుట నిలబడ్డాడు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల వరకు ఆయన పదేపదే చెరసాలలో వేయబడినా, కొట్టబడినా, బంధించబడినా, వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని నిర్భయంగా తన యథార్థతను కాపాడుకోవడంలో అసాధారణమైన మాదిరి ఉంచాడు.—అపొస్తలుల కార్యములు 2:14-36; 4:18-21; 5:29-32, 40-42; 12:3-5.
మనం దానినుండి ఏమి నేర్చుకోవచ్చు? పేతురు హృదయాలోచనలను వెల్లడి చేయడానికి యేసు ఏమి చేశాడో గమనించారా? మొదటిగా పేతురు శ్రద్ధ వహించవలసిన విషయంపైకి ఆయన అవధానాన్ని మళ్ళించడానికి కొన్ని సముచితమైన లేఖనాలను ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత పేతురు హృదయంలోనుండి స్పందించడానికి ఒక అవకాశమిచ్చాడు. చివరిగా పేతురు తన ఆలోచనా విధానాన్ని తన భావాలను సరిచేసుకోవడానికి సహాయం చేసేందుకు అదనపు
లేఖనాధారిత ఉపదేశాన్ని ఇచ్చాడు. ఈ పద్ధతిలో బోధించడం మీ శక్తికి మించిన పని అని మీరు అనుకోవచ్చు, కానీ బాగా సిద్ధపడడం ద్వారా, యెహోవాపై ఆధారపడడం ద్వారా మనలో ప్రతి ఒక్కరమూ యేసు మాదిరిని అనుసరించవచ్చని చూపించే రెండు ఉదాహరణలను మనం పరిశీలిద్దాము.హృదయంలో ఉన్నదానిని పైకి చేదడం
ఒకటో తరగతి, రెండవ తరగతి చదువుతున్న తన కుమారులిద్దరూ ఉపాధ్యాయుని బల్లపైనుండి మిఠాయిలు దొంగిలించారని తెలుసుకున్న ఒక క్రైస్తవ తండ్రి వారిని కూర్చోబెట్టి వారితో తర్కించాడు. వారు చేసిన పని హానిరహితమైనదని, అది పిల్లలు చేసే అల్లరి మాత్రమేనని కొట్టి పారేయకుండా “ఆ చెడ్డ పని చేయడానికి వారిని ప్రేరేపించినదేమిటో వారి హృదయాలనుండి రాబట్టడానికి నేను ప్రయత్నించాను” అని ఆ తండ్రి చెప్పాడు.
యెహోషువ 7వ అధ్యాయంలో చెప్పబడినట్లు ఆకానుకు ఏమి జరిగిందో గుర్తు తెచ్చుకోమని ఆ తండ్రి వారికి చెప్పాడు. దానితో ఆ పిల్లలిద్దరికీ విషయం వెంటనే అర్థమయ్యింది, వారు తమ తప్పును ఒప్పుకున్నారు. వారి మనస్సాక్షి అప్పటికే వారిని బాధించడం ప్రారంభించింది. కాబట్టి వాళ్ళ నాన్న ఎఫెసీయులు 4:27వ వచనాన్ని వాళ్ళతో చదివించాడు, అక్కడ ఇలా ఉంది: “దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము . . . పనిచేయుచు కష్టపడవలెను.” ఆ పిల్లలు మిఠాయిలు కొని తమ ఉపాధ్యాయునికి ఇచ్చేలా చేయడం ద్వారా వాళ్ళ తండ్రి తాను వారికి ఇచ్చిన లేఖనాధారిత ఉపదేశాన్ని మరింత శక్తిమంతంగా నొక్కిచెప్పాడు.
“పిల్లల్లో చెడు ఉద్దేశాలు కనిపించిన వెంటనే వాటిని తీసివేయడానికి, వారితో తర్కించడం ద్వారా వారిలో మంచి ఉద్దేశాలను నాటడానికి మేము ప్రయత్నించాము” అని ఆ తండ్రి చెప్పాడు. ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించేటప్పుడు యేసును అనుకరించడం ద్వారా క్రమేణా మంచి ఫలితాలను సాధించారు. ఆ ఇద్దరు కుమారులూ బ్రూక్లిన్ బెతెల్ ప్రధాన కార్యాలయంలో సభ్యులుగా సేవ చేసేందుకు ఆహ్వానించబడ్డారు, వారిలో ఒకాయన ఇప్పటికి 25 సంవత్సరాలుగా అక్కడే సేవ చేస్తున్నాడు.
మరో క్రైస్తవురాలు తన బైబిలు విద్యార్థినికి ఎలా సహాయం చేయగలిగిందో పరిశీలించండి. ఆ బైబిలు విద్యార్థిని కూటాలకు హాజరవడం పరిచర్యలో పాల్గొనడం ప్రారంభించడమే కాక, తనకు బాప్తిస్మం తీసుకోవాలని ఉందనే కోరికనూ వ్యక్తం చేసింది. అయితే ఆమె యెహోవాపై కాక తనపై తానే ఎక్కువగా ఆధారపడుతున్నట్లు కనిపించేది. “ఒంటరి స్త్రీగా తాను ఎవ్వరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా తయారయ్యిందని ఆమె గ్రహించలేదు. దానివల్ల ఆమె శారీరకంగా లేదా ఆధ్యాత్మికంగా ప్రమాదానికి గురవుతుందని నేను ఎంతో చింతించేదాన్ని” అని ఆ సాక్షి గుర్తు చేసుకుంటోంది.
కాబట్టి ఆ సాక్షి మత్తయి 6:33ను ఉపయోగించి తన విద్యార్థినితో తర్కించడానికి చొరవ తీసుకొని, ఆమె తన ప్రాధాన్యతలను సరిచేసుకోవాలని, రాజ్యాన్ని ముందుంచాలని, పనులు సక్రమంగా జరగాలంటే యెహోవాపై నమ్మకముంచాలని ఆమెను ప్రోత్సహించింది. ఆమె తన బైబిలు విద్యార్థినిని సూటిగా ఇలా అడిగింది: “నువ్వు నీ సొంతగా జీవిస్తున్నావు కాబట్టి ఇతరులపై ఆధారపడడం, యెహోవాపై ఆధారపడడం కూడా నీకు కష్టంగా అనిపిస్తుందా?” దానికి ఆ బైబిలు విద్యార్థిని తాను యెహోవాకు ప్రార్థించడాన్ని దాదాపు మానేశానని ఒప్పుకుంది. అప్పుడు ఆ ప్రచారకురాలు కీర్తన 55:22లోని సలహాను పాటించి తన భారాన్ని యెహోవామీద మోపమని ఆమెను ప్రోత్సహించింది, ఎందుకంటే ఆయన ‘మన గురించి చింతించుచున్నాడని’ 1 పేతురు 5:7 మనకు హామీ ఇస్తోంది. ఆ మాటలు ఆమె హృదయాన్ని స్పృశించాయి. “ఆమె నా ఎదుట ఏడ్వడం చాలా అరుదు, అయితే ఆ రోజు మాత్రం తన దుఃఖం ఆపుకోలేక నా ముందు ఏడ్చేసింది” అని ఆ సాక్షి చెప్పింది.
సత్యం మిమ్మల్ని ప్రభావితం చేయనివ్వండి
మనం బోధించేవారు బైబిలు సత్యానికి ప్రతిస్పందించడం చూసినప్పుడు మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. అయితే ఇతరులకు సహాయం చేయడానికి మనం చేసే కృషి మంచి ఫలితాలు సాధించాలంటే మనం స్వయంగా మంచి మాదిరి ఉంచాలి. (యూదా 22, 23) మనమందరమూ “భయముతోను వణకుతోనూ [మన] సొంత రక్షణను కొనసాగిం[చాలి].” (ఫిలిప్పీయులు 2:12) అంటే లేఖనాలు క్రమంగా మన హృదయాలను పరిశోధించడానికి అనుమతిస్తూ మనం సరిచేసుకోవలసిన వైఖరులు, కోరికలు, భావనలు మనలో ఉన్నాయేమో పరిశీలించుకోవాలి.—2 పేతురు 1:19.
ఉదాహరణకు, ఈ మధ్య క్రైస్తవ కార్యకలాపాలపట్ల మీ ఆసక్తి సన్నగిల్లిందా? అలా జరిగితే, ఎందుకు జరిగింది? దానికి ఒక కారణం, మీరు మీపై అవసరమైనదానికంటే ఎక్కువగా ఆధారపడడం కావచ్చు. మీకు ఆ సమస్య ఉందని మీరు ఎలా తెలుసుకోవచ్చు? హగ్గయి 1:2-11 చదివి, తమ స్వదేశానికి తిరిగివచ్చిన యూదులతో యెహోవా తర్కించిన విధానాన్ని నిజాయితీగా ధ్యానించండి. ఆ తర్వాత మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను ఆర్థిక భద్రత గురించి, వస్తుపరమైన సౌకర్యాల గురించి మరీ ఎక్కువగా చింతిస్తున్నానా? నేను ఆధ్యాత్మిక విషయాలకు ప్రాముఖ్యతనిస్తే యెహోవా నా కుటుంబాన్ని చూసుకుంటాడని నేను నిజంగా నమ్ముతున్నానా? లేదా నాకు కావలసినవాటిని స్వయంగా నేనే సమకూర్చుకోవాలని నేను భావిస్తున్నానా?’ మీ ఆలోచనా విధానంలోనూ, భావాల్లోనూ మార్పు చేసుకోవాల్సి వస్తే వెనుకాడకండి. లేఖనాధారిత ఉపదేశం అంటే, మత్తయి 6:25-33, లూకా 12:13-21, 1 తిమోతి 6:6-12 వంటి లేఖనాల్లోని ఉపదేశం మనం వస్తుపరమైన అవసరతల విషయంలో, ఆస్తుల విషయంలో సమతుల్యమైన దృక్కోణం కలిగి ఉండడానికి సహాయం చేస్తుంది, అలాంటి దృక్కోణం ఉన్నవారిని యెహోవా ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు.—మలాకీ 3:10.
ఇలాంటి యథార్థమైన స్వయం పరిశీలన ఆలోచింపజేసేదిగా ఉంటుంది. మన బలహీనతలు మనకు చూపించబడినప్పుడు వాటిని ఒప్పుకోవడం భావోద్వేగపరంగా కష్టంగా ఉండవచ్చు. అయితే ఒక విషయం ఎంత వ్యక్తిగతమైనదైనా లేదా ఎంత సున్నితమైనదైనా సరే మీ పిల్లలకు, మీ బైబిలు విద్యార్థులకు సహాయం చేయడానికి లేదా స్వయంగా మీకే సహాయం చేసుకోవడానికి మీరు చొరవ తీసుకుంటే, ఆ వ్యక్తి జీవితాన్ని లేదా మీ స్వంత జీవితాన్ని కాపాడుకోవడం దిశగా మీరు మీ మొదటి అడుగు వేస్తుండవచ్చు.—గలతీయులు 6:1.
అయితే మీ కృషికి సత్ఫలితాలు రావడంలేదు అనిపిస్తే అప్పుడెలా? వెంటనే ఆశలు వదులుకోకండి. ఒక అపరిపూర్ణమైన హృదయాన్ని సరిదిద్దే పని చాలా సున్నితమైనదిగా, ఎక్కువ సమయం తీసుకునేదిగా, కొన్నిసార్లు విసుగు పుట్టించేదిగా ఉండవచ్చు. అయితే అది ఆశీర్వాదకరంగా కూడా ఉండవచ్చు.
మొదట్లో ప్రస్తావించబడిన ఎరిక్ చివరకు తన తప్పు తెలుసుకొని మళ్ళీ ‘సత్యమును అనుసరించి నడుచుకోవడం’ ప్రారంభించాడు. (2 యోహాను 4) “నేను ఏమి పోగొట్టుకున్నానో గ్రహించేంత వరకూ నేను యెహోవావైపుకు తిరగలేదు” అని ఆయన చెప్పాడు. తన తల్లిదండ్రుల సహాయంతో ఎరిక్ ఇప్పుడు దేవుణ్ణి నమ్మకంగా సేవిస్తున్నాడు. తన హృదయాన్ని పరిశీలించుకునేలా చేయాలని తన తల్లిదండ్రులు పదేపదే చేసిన ప్రయత్నాలను ఎరిక్ ఒకప్పుడు ఇష్టపడకపోయినా, ఇప్పుడు ఆయన తన తల్లిదండ్రులు చేసినదాన్ని బట్టి ఎంతో కృతజ్ఞుడిగా ఉన్నాడు. “నా తల్లిదండ్రులు చాలా మంచివారు, వారు నన్ను ప్రేమించడం మానలేదు” అని ఆయన చెప్పాడు.
మన బైబిలు విద్యార్థుల హృదయాలపై దేవుని వాక్యపు వెలుగును ప్రకాశింపజేయడం ప్రేమపూర్వకమైన పని. (కీర్తన 141:5) మీ పిల్లల్లో, మీ బైబిలు విద్యార్థుల్లో కొత్త క్రైస్తవ వ్యక్తిత్వం నిజంగానే పెంపొందుతుందని నిశ్చయపర్చుకోవడానికి వారి హృదయాలను పరిశోధిస్తూనే ఉండండి. ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించడం’ ద్వారా ఇతరుల్లోనూ మీలోనూ సత్యం కార్యసిద్ధి కలుగజేసేలా చూసుకోండి.—2 తిమోతి 2:15.
[29వ పేజీలోని చిత్రం]
యేసు మాటలు పేతురులోని బలహీనతను వెల్లడి చేశాయి
[31వ పేజీలోని చిత్రం]
హృదయంలోవున్న దానిని పైకి చేదడానికి బైబిలును ఉపయోగించండి