కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ఎల్లప్పుడూ సరైనదే చేస్తాడు

యెహోవా ఎల్లప్పుడూ సరైనదే చేస్తాడు

యెహోవా ఎల్లప్పుడూ సరైనదే చేస్తాడు

“యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు.”​—⁠కీర్తన 145:17.

వాస్తవాలేవీ తెలుసుకోకుండా మీ పనులను లేదా ఉద్దేశాలను ప్రశ్నిస్తూ మీ విషయంలో ఎవరైనా ఎప్పుడైనా ఒక తప్పుడు నిర్ణయానికి వచ్చారా? ఒకవేళ అలా జరిగివుంటే, మీరు బహుశా చాలా నొచ్చుకొని ఉంటారు. అది అర్థం చేసుకోదగిన విషయమే. దీనినుండి మనమొక ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు: మనకు వాస్తవాలన్నీ తెలియనప్పుడు త్వరపడి ఒక ముగింపుకు రావడం జ్ఞానయుక్తం కాదు.

2 యెహోవా దేవుని గురించి ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఈ పాఠాన్ని మనం గుర్తుంచుకోవడం మంచిది. ఎందుకు? ఎందుకంటే మొదట్లో అర్థం చేసుకోవడానికి కాస్త కష్టంగా ఉన్నట్లనిపించే బైబిలు వృత్తాంతాలు కొన్ని ఉన్నాయి. బహుశా దేవుని ఆరాధకుల్లో కొందరి క్రియలకు లేదా దేవుని గత తీర్పులకు సంబంధించిన వృత్తాంతాల్లో మన సందేహాలన్నింటికీ జవాబులివ్వడానికి సరిపడినన్ని వివరాలు లేకపోవచ్చు. అయితే విచారకరంగా, కొందరు అలాంటి వృత్తాంతాలను విమర్శించడమే కాక, దేవునికి అసలు నీతి న్యాయాలున్నాయా అని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే “యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు” అని బైబిలు చెబుతోంది. (కీర్తన 145:​17) ఆయన ‘దుష్కార్యము చేయడని’ కూడా ఆయన వాక్యం మనకు హామీ ఇస్తోంది. (యోబు 34:​12; కీర్తన 37:28) కాబట్టి, ఇతరులు ఆయన గురించి తప్పుడు నిర్ణయాలకు వచ్చినప్పుడు ఆయనెలా భావిస్తాడో ఊహించండి!

3 యెహోవా తీర్పులను మనమెందుకు అంగీకరించవచ్చనే దానికి ఐదు కారణాలను మనం పరిశీలిద్దాం. ఆ తర్వాత, ఆ కారణాలను మనసులో ఉంచుకొని, అర్థం చేసుకోవడానికి కొందరికి కష్టంగా అనిపించే రెండు బైబిలు వృత్తాంతాలను మనం పరిశీలిద్దాం.

యెహోవా తీర్పులను ఎందుకు అంగీకరించాలి?

4 మొదటిగా, సంబంధిత అంశం గురించిన అన్ని వాస్తవాలు యెహోవాకు తెలుసుగానీ మనకు తెలియదు కాబట్టి, దేవుని చర్యలను పరిశీలించేటప్పుడు మనం వినయం ప్రదర్శించాలి. ఉదాహరణకు, నిష్పక్షపాతంగా నిర్ణయాలు చేస్తాడనే గొప్ప పేరున్న ఒక న్యాయమూర్తి ఒక కోర్టు కేసులో తీర్పు చెప్పాడనే అనుకోండి. అసలు వాస్తవాలేవీ తెలుసుకోకుండా లేదా సంబంధిత చట్టాలను నిజంగా అర్థం చేసుకోకుండా ఆ న్యాయమూర్తి నిర్ణయాన్ని విమర్శించే వ్యక్తిని గురించి మీరేమనుకుంటారు? ఎవరైనా సరే విషయం పూర్తిగా తెలుసుకోకుండా విమర్శించడం అవివేకం. (సామెతలు 18:13) అలాంటప్పుడు, అల్ప మానవులు “సర్వలోకమునకు తీర్పు తీర్చు” దేవుణ్ణి విమర్శించడం ఇంకెంత అవివేకమో కదా!​—⁠ఆదికాండము 18:25.

5 దేవుని తీర్పులు అంగీకరించడానికిగల రెండవ కారణం, దేవుడు హృదయాలను చదవగలడు, కానీ మానవులు అలా చదవలేరు. (1 సమూయేలు 16:7) ఆయన వాక్యం ఇలా చెబుతోంది: “ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.” (యిర్మీయా 17:10) కాబట్టి, దేవుని తీర్పుల గురించిన బైబిలు వృత్తాంతాలను మనం చదువుతున్నప్పుడు, సర్వం చూడగల ఆయన కన్నులు తన వాక్యంలో వ్రాయబడని రహస్య తలంపులను, ఆలోచనలను, ఉద్దేశాలను పరిగణలోకి తీసుకున్నాయనే విషయాన్ని మనం మరచిపోకూడదు.​—⁠1 దినవృత్తాంతములు 28:9.

6 యెహోవా తీర్పులను అంగీకరించడానికిగల మూడవ కారణాన్ని గమనించండి: వ్యక్తిగతంగా ఎంత త్యాగం చేయవలసి వచ్చినా ఆయన తన నీతియుక్త ప్రమాణాలకు కట్టుబడి ఉంటాడు. ఒక ఉదాహరణ పరిశీలించండి. విధేయత చూపించే మానవజాతిని పాపమరణాల నుండి విమోచించేందుకు తన కుమారుణ్ణి విమోచన క్రయధనముగా ఇవ్వడంలో యెహోవా తన నీతి న్యాయాల ప్రమాణాన్ని సంపూర్ణంగా పాటించాడు. (రోమీయులు 5:18, 19) దీని కారణంగా, యెహోవాకు తన ప్రియ కుమారుడు బాధపడి హింసాకొయ్య మీద చనిపోవడాన్ని చూడడం విపరీతమైన బాధను కలిగించి ఉంటుంది. ఇదంతా మనకు దేవుని గురించి ఏమి చెబుతోంది? “క్రీస్తుయేసునందలి విమోచనము” గురించి బైబిలు ఇలా చెబుతోంది: “[దేవుడు] తన నీతిని కనుపరచవలెనని . . . ఆలాగు చేసెను.” (రోమీయులు 3:24-26) మరో అనువాదంలో రోమీయులు 3:⁠25 ఇలా ఉంది: “దేవుడు ఎల్లప్పుడూ సరైనదే, న్యాయమైనదే చేస్తాడని ఇది చూపించింది.” (న్యూ సెంచరీ వర్షన్‌) అవును, విమోచన క్రయధనం ఏర్పాటు చేయడానికి యెహోవా ఎలాంటి త్యాగాన్నైనా చేసేందుకు ఇష్టపడిన వైనం ‘సరైన, న్యాయమైన’ విషయాల్లో ఆయనకున్న అత్యున్నత శ్రద్ధను చూపిస్తోంది.

7 కాబట్టి, దేవుడు న్యాయంగా, సరిగా చర్య తీసుకున్నాడా లేదా అని కొందరికి సందేహం కలిగించేదేదైనా మనం బైబిల్లో చదివినప్పుడు మనం ఈ విషయం గుర్తుంచుకోవాలి: యెహోవా తన నీతి న్యాయాల ప్రమాణం విషయంలో తనకున్న యథార్థతనుబట్టి, తన సొంత కుమారుడు బాధామయ మరణం అనుభవించకుండా ఆయనను తప్పించలేదు. అలాంటప్పుడు, ఇతర విషయాల్లో ఆ ప్రమాణానికి సంబంధించి ఆయన రాజీపడతాడా? అయితే వాస్తవమేమిటంటే, యెహోవా తన నీతి న్యాయాల ప్రమాణాన్ని ఎన్నడూ ఉల్లంఘించడు. కాబట్టి, ఆయన ఎల్లప్పుడూ సరైనదీ, న్యాయమైనదీ చేస్తాడని నమ్మేందుకు మనకు తగిన కారణముంది.​—⁠యోబు 37:23.

8 యెహోవా తీర్పులను మనమెందుకు అంగీకరించవచ్చో తెలిపే నాల్గవ కారణాన్ని పరిశీలించండి: యెహోవా మానవుణ్ణి తన స్వరూపంలో చేశాడు. (ఆదికాండము 1:​27) అందువల్లే, మానవులకు నీతి న్యాయాల విచక్షణతో సహా దేవునికి ఉన్నటువంటి లక్షణాలు అనుగ్రహించబడ్డాయి. మనలోవున్న నీతి న్యాయాల విచక్షణ, అవే లక్షణాలు యెహోవాలో లోపించాయని ఊహించేలా చేస్తే అది పొందికలేనిదిగా ఉంటుంది. ఒకానొక బైబిలు వృత్తాంతం విషయంలో మనకు ఇబ్బందిగా ఉంటే, వారసత్వంగా మనకు లభించిన పాపం కారణంగా మన నీతి న్యాయాల విచక్షణ అపరిపూర్ణంగా ఉందని గుర్తుంచుకోవాలి. అయితే మనం ఎవరి స్వరూపంలో చేయబడ్డామో ఆ యెహోవా దేవుడు నీతి న్యాయాల్లో పరిపూర్ణుడు. (ద్వితీయోపదేశకాండము 32:4) మానవులు దేవునికన్నా ఎక్కువ నీతి న్యాయాలు కలిగి ఉండగలరని ఊహించడమే హాస్యాస్పదంగా ఉంటుంది.​—⁠రోమీయులు 3:​4, 5; 9:14.

9 యెహోవా తీర్పులు అంగీకరించడానికున్న ఐదవ కారణం, ఆయనే “సర్వలోకములో మహోన్నతుడు.” (కీర్తన 83:18) కాబట్టి మానవులకు తన చర్యలను వివరించవలసిన లేదా సమర్థించుకోవలసిన అవసరం ఆయనకు లేదు. ఆయన గొప్ప కుమ్మరి, మట్టిముద్దలాంటి మనల్ని ఆయన ఘటాలుగా రూపించాడు కాబట్టి ఆయన మనతో తన ఇష్టానుసారంగా వ్యవహరించవచ్చు. (రోమీయులు 9:19-21) ఆయన చేసిన ఘటాలుగా ఆయన నిర్ణయాలను లేదా చర్యలను ప్రశ్నించడానికి మనమెవరం? మానవాళితో దేవుని వ్యవహారాలను పితరుడైన యోబు తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు, “నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువా?” అని ప్రశ్నిస్తూ యెహోవా ఆయనను సరిదిద్దాడు. యోబు తాను అర్థం చేసుకోకుండా మాట్లాడానని గ్రహించి, ఆ తర్వాత పశ్చాత్తాపపడ్డాడు. (యోబు 40:⁠8; 42:6) దేవునినే తప్పుపట్టే అపరాధం మనమెన్నటికీ చేయకుందము గాక!

10 స్పష్టంగా, యెహోవా ఎల్లప్పుడూ సరైనదే చేస్తాడని నమ్మేందుకు మనకు గట్టి కారణాలు ఉన్నాయి. యెహోవా మార్గాలను అర్థం చేసుకొనే ఈ పునాది ఆధారంగా, కొందరికి అర్థం చేసుకోవడానికి కష్టమనిపించే రెండు బైబిలు వృత్తాంతాలను మనం పరిశీలిద్దాం. మొదటిది దేవుని ఆరాధకుల్లో ఒకరి క్రియలకు సంబంధించినది, రెండవది స్వయంగా దేవుడే తీర్పు తీర్చిన సంఘటనకు సంబంధించినది.

లోతు ఆవేశపూరిత అల్లరిమూకకు తన కుమార్తెలను ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడ్డాడు?

11 మానవ శరీరాలు ధరించిన ఇద్దరు దేవదూతలను దేవుడు సొదొమకు పంపినప్పుడు జరిగిన సంఘటనను వివరించే వృత్తాంతాన్ని మనం ఆదికాండము 19వ అధ్యాయంలో చూస్తాం. లోతు ఆ సందర్శకులను పట్టుబట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఆ రాత్రి ఆ పట్టణపు అల్లరిమూక ఆయన ఇంటిని చుట్టుముట్టి తమ లైంగిక వాంఛ తీర్చుకోవడానికి ఆ సందర్శకులను బయటకు తీసుకురమ్మని బిగ్గరగా కేకలు వేశారు. ఆ అల్లరిమూకకు సర్ది చెప్పేందుకు లోతు విఫల ప్రయత్నం చేశాడు. తన అతిథులను కాపాడే ప్రయత్నంలో లోతు వారితో, “అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి; ఇదిగో పురుషుని కూడని యిద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసికొని వచ్చెదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఈ మనుష్యులు నా యింటినీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని” చెప్పాడు. అయితే ఆ అల్లరిమూక అతని మాట వినక తలుపు పగులగొట్టేంత పని చేశారు. చివరకు సందర్శించ వచ్చిన ఆ దేవదూతలే పిచ్చిపట్టిన ఆ గుంపుకు గుడ్డితనం కలిగేలా మొత్తారు.​—⁠ఆదికాండము 19:1-11.

12 ఈ వృత్తాంతం కొందరి మనస్సులో ప్రశ్నలు లేవదీసిందనే విషయం అర్థం చేసుకోదగినదే. ‘కామతప్తులైన ఆ అల్లరిమూకకు తన కుమార్తెలను ఇవ్వజూపి లోతు తన అతిథులను కాపాడే ప్రయత్నమెలా చేయగలడు? ఆయన అయుక్తంగా, చివరకు పిరికివానిగా ప్రవర్తించలేదా?’ అని వారు ఆలోచిస్తారు. ఈ వృత్తాంతం దృష్ట్యా, లోతును “నీతిమంతుడు” అని పిలిచేలా దేవుడు పేతురును ఎందుకు ప్రేరేపించాడు? లోతు దేవుని ఆమోదంతోనే అలా ప్రవర్తించాడా? (2 పేతురు 2:7, 8) మనమొక తప్పుడు నిర్ణయానికి రాకుండా ఉండేందుకు ఈ విషయాన్ని తర్కబద్ధంగా పరిశీలిద్దాం.

13 మొట్టమొదట గమనించవలసిన విషయం ఏమిటంటే, లోతు చర్యలను ఆమోదించడానికి లేదా ఖండించడానికి బదులుగా బైబిలు కేవలం జరిగిన విషయాన్ని మాత్రమే నివేదిస్తోంది. లోతు ఆలోచన ఏమిటో ఆ విధంగా ప్రవర్తించడానికి ఆయనను పురికొల్పిందేమిటో కూడా బైబిలు మనకు చెప్పడం లేదు. ‘నీతిమంతుల పునరుత్థానంలో’ ఆయన తిరిగి లేచినప్పుడు బహుశా వివరాలు వెల్లడి చేయవచ్చు.​—⁠అపొస్తలుల కార్యములు 24:​14-15.

14 లోతు పిరికివాడు కానేకాదు. ఆయనొక క్లిష్ట పరిస్థితిలో ఇరుక్కున్నాడంతే. ఆ సందర్శకులు తన “యింటినీడకు” వచ్చారని చెప్పడం ద్వారా, వారికి ఆశ్రయమిచ్చి కాపాడే బాధ్యత తనకుందనే భావాన్ని లోతు సూచించాడు. అయితే అదంత సులభమైన పని కాదు. సొదొమ పట్టణస్థులు “మనుష్యులపట్ల అన్యాయంగా ప్రవర్తిస్తూ, దేవునిపట్ల ఏ మాత్రం భక్తిలేని వారనీ, . . . కొత్తవారిని వారు ద్వేషిస్తూ కామవిలాప చేష్టలతో తమనుతాము పాడు చేసుకున్నారనీ” యూదా చరిత్రకారుడైన జోసీఫస్‌ వ్రాస్తున్నాడు. అయినప్పటికీ, లోతు ఆ విద్వేషపూరిత అల్లరిమూకను చూసి భయపడలేదు. బదులుగా, ఆయన బయటకు వెళ్లి కోపోద్రిక్తులైన ఆ మనుష్యులతో తర్కించాడు. ఆయన “తన వెనుక తలుపు” కూడా వేశాడు.​—⁠ఆదికాండము 19:6.

15 అయినాసరే, ‘లోతు తన కుమార్తెలను ఎందుకు ఇవ్వజూపాలి’ అని కొందరు అడగవచ్చు. ఆయన ఉద్దేశాలు చెడ్డవని తలంచే బదులు, కొన్ని సాధ్యతలను మనమెందుకు పరిశీలించకూడదు? మొట్టమొదట, లోతు బహుశా మంచి విశ్వాసంతో ప్రవర్తించి ఉండవచ్చు. అలాగని ఎలా చెప్పవచ్చు? తన చిన్నాన్న అయిన అబ్రాహాము భార్య శారాను యెహోవా ఎలా కాపాడాడో నిస్సందేహంగా లోతుకు తెలుసు. శారా సౌందర్యవతియైన కారణంగా, ఇతరులు తనను చంపి ఆమెను తీసుకెళ్లకుండా ఉండేందుకు తాను ఆమె సహోదరుడినని చెప్పమని అబ్రాహాము ఆమెను అడిగాడనే విషయం గుర్తుతెచ్చుకోండి. * ఆ తర్వాత, శారా ఫరో ఇంటికి తీసుకెళ్లబడింది. అయితే, శారాకు ఏ హానీ కలుగకుండా యెహోవా జోక్యం చేసుకొని ఫరోను అడ్డగించాడు. (ఆదికాండము 12:​11-20) తన కుమార్తెలు కూడా అదే విధంగా కాపాడబడతారనే విశ్వాసం లోతుకు ఉండే అవకాశం ఉంది. గమనార్హంగా, యెహోవా తన దూతల ద్వారా జోక్యం చేసుకున్నాడు, ఆ యువతులు సురక్షితంగా ఉండిపోయారు.

16 మరొక సాధ్యతను పరిశీలించండి. లోతు ఆ మనుష్యులను విభ్రాంతిపరిచేందుకు లేదా కలవరపెట్టేందుకు కూడా ప్రయత్నిస్తుండవచ్చు. సొదొమ పట్టణస్థుల సలింగ కామతప్తత కారణంగా ఆ గుంపు తన కుమార్తెలను ఇష్టపడకపోవచ్చని ఆయన నమ్మి ఉండవచ్చు. (యూదా 7) అంతేకాక, ఆ యువతులు ఆ పట్టణస్థులకు ప్రధానం చేయబడ్డారు కాబట్టి తనకు కాబోయే అల్లుళ్ల బంధువులు, స్నేహితులు లేదా వ్యాపార సహవాసులు కూడా ఆ గుంపులో ఉండవచ్చు. (ఆదికాండము 19:14) ఆ బంధుత్వం కారణంగా ఆ అల్లరిమూకలోని కొందరు తన కుమార్తెల పక్షాన మాట్లాడతారని లోతు ఆశించి ఉండవచ్చు. ఆ విధంగా, ఆ అల్లరిమూక విభాగించబడితే అదంత ప్రమాదకరంగా ఉండదు. *

17 లోతు తర్కాలు, ఉద్దేశాలు ఏవైనా, మనమీ విషయంలో నిశ్చయతతో ఉండవచ్చు: యెహోవా ఎల్లప్పుడూ సరైనదే చేస్తాడు కాబట్టి లోతును ‘నీతిమంతునిగా’ దృష్టించడానికి ఆయనకు మంచి కారణమే ఉండి ఉంటుంది. సొదొమవాసులైన ఆ పిచ్చిపట్టిన అల్లరిమూక క్రియలను మనం పరిశీలించినప్పుడు, ఆ దుష్ట పట్టణ నివాసుల మీద యెహోవా తీర్పు విధించడం పూర్తిగా సమర్థనీయమని చెప్పడంలో ఎలాంటి సందేహానికైనా తావుండే అవకాశముందా?​—⁠ఆదికాండము 19:23-25.

ఉజ్జా చనిపోయేలా యెహోవా ఎందుకు మొత్తాడు?

18 అర్థం చేసుకోవడానికి కొందరికి కష్టంగా అనిపించే మరో వృత్తాంతం, నిబంధనా మందసాన్ని యెరూషలేముకు తీసుకురావడానికి దావీదు ప్రయత్నించిన సంఘటనకు సంబంధించినది. ఉజ్జా, ఆయన సహోదరుడు నడుపుతున్న ఒక బండి మీద ఆ మందసం ఉంచబడింది. బైబిలు ఇలా చెబుతోంది: “వారు నాకొను కళ్లము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జామీద రగులుకొనెను. అతడు చేసిన తప్పునుబట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను.” కొన్ని నెలల తర్వాత దేవుడు నిర్దేశించిన విధంగా, లేవీ వంశస్థులైన కహాతీయులు తమ భుజాల మీద మోస్తూ మందసాన్ని తరలించడానికి చేసిన ప్రయత్నం విజయవంతమైంది. (2 సమూయేలు 6:​6, 7; సంఖ్యాకాండము 4:​15; 7:9; 1 దినవృత్తాంతములు 15:1-14) ‘ఉజ్జా కేవలం మందసాన్ని కాపాడేందుకే ప్రయత్నించాడు కదా, అలాంటప్పుడు యెహోవా ఎందుకు అంత తీవ్రంగా స్పందించాడు?’ అని కొందరు అడగవచ్చు. మనమొక తప్పుడు నిర్ణయానికి రాకుండా ఉండాలంటే, సహాయకరమైన కొన్ని వివరాలను పరిశీలించడం మంచిది.

19 యెహోవా అన్యాయంగా ప్రవర్తించడం అనేది అసంభవం అని మనం గుర్తుంచుకోవాలి. (యోబు 34:10) ఆయన అలా ప్రవర్తిస్తే అది ప్రేమరహితంగా ఉంటుంది. కానీ మన బైబిలు అధ్యయనమంతటి ప్రకారం “దేవుడు ప్రేమాస్వరూపి” అని మనం తెలుసుకున్నాం. (1 యోహాను 4:8) దానికితోడు “నీతిన్యాయములు [దేవుని] సింహాసనమునకు ఆధారములు” అని లేఖనాలు మనకు చెబుతున్నాయి. (కీర్తన 89:14) అలాంటప్పుడు, యెహోవా అన్యాయంగా ఎలా ప్రవర్తించగలడు? అలాచేస్తే ఆయన తన సర్వాధిపత్యపు పునాదులనే బలహీనపరచుకున్నట్లు అవుతుంది.

20 ఉజ్జాకు విషయం బాగా తెలిసే ఉంటుందనే సంగతి మరచిపోకండి. ఆ మందసం యెహోవా ప్రత్యక్షతకు ప్రాతినిథ్యం వహిస్తుంది. ఆ మందసాన్ని అనధికార వ్యక్తులెవరూ ముట్టుకోకూడదనీ, ఆ నియమాన్ని ఉల్లంఘించిన వారికి మరణశిక్ష తప్పదనీ ధర్మశాస్త్రం స్పష్టంగా హెచ్చరించింది. (సంఖ్యాకాండము 4:​18-20; 7:89) కాబట్టి, ఆ పవిత్ర మందసాన్ని తరలించడాన్ని తేలికగా తీసుకోకూడదు. ఉజ్జా (యాజకుడు కాకపోయినా) లేవీయుడై ఉంటాడు, అందువల్ల అతనికి ధర్మశాస్త్రం బాగా తెలిసే ఉంటుంది. అంతేకాక, అనేక సంవత్సరాల పూర్వం, సురక్షితంగా ఉంచడానికి ఆ మందసం అతని తండ్రి ఇంటికి తీసుకెళ్లబడింది. (1 సమూయేలు 6:20-7:1) దావీదు దానిని తరలించాలని నిర్ణయించేంత వరకు అంటే దాదాపు 70 సంవత్సరాలపాటు అది అక్కడే ఉంది. కాబట్టి ఉజ్జాకు తన చిన్నతనం నుండే ఆ మందసానికి సంబంధించిన నియమాలన్నీ బహుశా తెలిసే ఉంటాయి.

21 ముందు ప్రస్తావించబడినట్లుగా, యెహోవా హృదయాలను చదవగలడు. ఉజ్జా చేసిన పనిని దేవుని వాక్యం అతను “చేసిన తప్పు” అని చెబుతోంది కాబట్టి, ఆ వృత్తాంతంలో ప్రత్యేకంగా వెల్లడి చేయబడని స్వార్థపూరిత ఉద్దేశాన్ని యెహోవా చూసివుంటాడు. ఉజ్జా బహుశా న్యాయసమ్మత హద్దులను అతిక్రమించడానికి మొగ్గుచూపిన అహంకారి అయ్యుండవచ్చా? (సామెతలు 11:⁠2) విడిగా తమ కుటుంబమే కాపాడిన ఆ మందసాన్ని ప్రజల మధ్య తరలించడాన్ని వ్యక్తిగత ప్రాముఖ్యతగా భావించి అతను గర్వించాడా? (సామెతలు 8:13) యెహోవా ప్రత్యక్షతను సూచించిన ఆ పవిత్ర మందసాన్ని నిలకడగా ఉంచే విషయంలో యెహోవా బాహుబలం తక్కువైందని తలంచేంత విశ్వాసరహితంగా ఉజ్జా ప్రవర్తించాడా? విషయమేదైనా, యెహోవా సరైనదే చేశాడని మనం నమ్మకంతో ఉండవచ్చు. ఉజ్జాపై తక్షణమే తీర్పు విధించడానికి తగిన కారణమేదో ఆయన అతని హృదయంలో చూసి ఉంటాడు.​—⁠సామెతలు 21:2.

నమ్మకానికి సరైన ఆధారం

22 యెహోవా వాక్యం కొన్నిసార్లు ఆయా వివరాలు ఇవ్వకపోవడంలో ఆయన సాటిలేని జ్ఞానాన్ని చూడవచ్చు. ఆ విధంగా యెహోవా, ఆయన మీద మనకున్న నమ్మకాన్ని ప్రదర్శించే అవకాశాన్ని మనకు ఇస్తున్నాడు. యెహోవా తీర్పులను అంగీకరించేందుకు మనకు సరైన కారణాలు ఉన్నాయని మనం పరిశీలించిన విషయాల నుండి స్పష్టమవడం లేదా? అవును, మనం దేవుని వాక్యాన్ని యథార్థ హృదయంతో విశాల భావంతో అధ్యయనం చేసినప్పుడు, యెహోవా ఎల్లప్పుడూ నీతి న్యాయాలే జరిగిస్తాడని ఒప్పించబడే ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం. కాబట్టి, కొన్ని బైబిలు వృత్తాంతాల్లో మనకు వెంటనే స్పష్టమైన జవాబులు లభించని సందేహాలు ఉత్పన్నమైనప్పుడు, యెహోవా సరైనదే చేశాడనే పూర్తి నమ్మకంతో ఉందాం.

23 యెహోవా భావికార్యాల విషయంలో కూడా మనం అలాంటి నమ్మకంతోనే ఉండవచ్చు. కాబట్టి, సమీపిస్తున్న మహాశ్రమల్లో ఆయన తీర్పు విధించేటప్పుడు, ఆయన “దుష్టులతోకూడ నీతిమంతులను నాశనము” చేయడనే నమ్మకంతో మనం ఉండవచ్చు. (ఆదికాండము 18:23) నీతి న్యాయాల విషయంలో ఆయనకున్న ప్రేమ, ఆయనలా చేయడానికి ఎన్నటికీ అనుమతించదు. రాబోయే నూతనలోకంలో ఆయన అత్యుత్తమ రీతిలో మన అవసరాలన్నీ తీరుస్తాడనే పూర్తి నమ్మకంతో కూడా ఉండవచ్చు.​—⁠కీర్తన 145:16.

[అధస్సూచీలు]

^ పేరా 19 అబ్రాహాము భయం సరైనదే, ఎందుకంటే ఒక ఫరో తన సాయుధ పురుషులచేత ఒక అందమైన స్త్రీని చెర పట్టించి ఆమె భర్తను చంపించాడని ఒక ప్రాచీన పాపిరస్‌ చెబుతోంది.

^ పేరా 20 అదనపు పరిశీలనాంశాల కోసం కావలికోట (ఆంగ్లం) డిసెంబరు 1, 1979 31వ పేజీ చూడండి.

మీరు జ్ఞాపకం తెచ్చుకుంటారా?

ఏ కారణాలనుబట్టి మనం యెహోవా తీర్పులను అంగీకరించాలి?

లోతు కోపోద్రిక్తులైన అల్లరిమూకకు తన కుమార్తెలను ఇవ్వజూపిన విషయంలో మనమొక తప్పుడు నిర్ణయానికి రాకుండా ఉండేందుకు మనకేది సహాయం చేయవచ్చు?

ఉజ్జా మరణించేలా యెహోవా అతనిని ఎందుకు మొత్తాడో అర్థం చేసుకోవడానికి ఏ వాస్తవాలు మనకు సహాయం చేయవచ్చు?

యెహోవా భావికార్యాల విషయంలో మనం ఎలాంటి నమ్మకంతో ఉండవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. మీ విషయంలో ఎవరైనా ఒక తప్పుడు నిర్ణయానికి వస్తే మీరెలా భావిస్తారు, అలాంటి అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

2, 3. ప్రతీ ప్రశ్నకు జవాబివ్వడానికి సరిపడా వివరాల్లేని బైబిలు వృత్తాంతాల విషయంలో కొందరెలా ప్రతిస్పందిస్తారు, అయినప్పటికీ యెహోవా గురించి బైబిలు మనకేమి చెబుతోంది?

4. దేవుని చర్యలను పరిశీలించేటప్పుడు మనమెందుకు వినయంగా ఉండాలి? ఉదహరించండి.

5. ఆయా వ్యక్తులపై దేవుని తీర్పుల గురించిన బైబిలు వృత్తాంతాలను చదువుతున్నప్పుడు మనం ఏ విషయం మరచిపోకూడదు?

6, 7. (ఎ) యెహోవా వ్యక్తిగతంగా తానెంత త్యాగం చేయవలసి వచ్చినా తాను తన నీతి, న్యాయాల ప్రమాణానికి కట్టుబడి ఉంటాడని ఎలా ప్రదర్శించాడు? (బి) దేవుడు న్యాయంగా, సరిగా చర్య తీసుకున్నాడా లేదా అని సందేహం కలిగించేదేదైనా బైబిల్లో చదివినప్పుడు మనం ఏ విషయం గుర్తుంచుకోవాలి?

8. మానవులు యెహోవాలో నీతి న్యాయాలు ఎలాగో లోపించాయని అనుకోవడం ఎందుకు పొందికలేనిదిగా ఉంటుంది?

9, 10. మానవులకు తన చర్యలను వివరించవలసిన లేదా సమర్థించుకోవలసిన అవసరం యెహోవాకు ఎందుకు లేదు?

11, 12. (ఎ) మానవ శరీరాలు ధరించిన ఇద్దరు దేవదూతలను దేవుడు పంపినప్పుడు ఏమి జరిగిందో వివరించండి. (బి) ఈ వృత్తాంతం కొందరి మనస్సులో ఎలాంటి ప్రశ్నలను లేవదీసింది?

13, 14. (ఎ) లోతు చర్యల గురించిన బైబిలు వృత్తాంతానికి సంబంధించి ఏ విషయాన్ని గమనించాలి? (బి) లోతు పిరికివానిగా ప్రవర్తించలేదని ఏది చూపిస్తోంది?

15. లోతు మంచి విశ్వాసంతో ప్రవర్తించి ఉంటాడని ఎందుకు చెప్పవచ్చు?

16, 17. (ఎ) లోతు సొదొమ పట్టణస్థులను విభ్రాంతిపరచడానికి లేదా కలవరపెట్టడానికి ఏ విధంగా ప్రయత్నిస్తుండవచ్చు? (బి) లోతు తర్కమేదైనా, ఏ విషయంలో మనం నిశ్చయతతో ఉండవచ్చు?

18. (ఎ) మందసాన్ని దావీదు యెరూషలేముకు తీసుకు రావడానికి ప్రయత్నించినప్పుడు ఏమి జరిగింది? (బి) ఈ వృత్తాంతం ఏ ప్రశ్నను లేవదీస్తుంది?

19. యెహోవా అన్యాయంగా ప్రవర్తించడం ఎందుకు అసంభవం?

20. ఏ కారణాలనుబట్టి ఉజ్జాకు మందసాన్ని గురించిన నియమాలు తెలిసే ఉండాలి?

21. ఉజ్జా విషయంలో, యెహోవా హృదయ ఉద్దేశాలను పరిశీలించాడని గుర్తుంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

22. యెహోవా వాక్యం కొన్నిసార్లు ఆయా వివరాలు ఇవ్వకపోవడంలో ఆయన జ్ఞానమెలా కనబడుతుంది?

23. యెహోవా భావికార్యాల విషయంలో మనం ఎలాంటి నమ్మకంతో ఉండవచ్చు?