కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అద్భుతాలు వాస్తవాలా కల్పితాలా?

అద్భుతాలు వాస్తవాలా కల్పితాలా?

అద్భుతాలు వాస్తవాలా కల్పితాలా?

ఆ వ్యక్తి దృష్టిని, అటుగా వెళ్తున్న ఒక కారు వెనుక అంటించివున్న, “అద్భుతాలు జరుగుతాయి​—⁠దేవదూతలను అడగండి” అనే ఒక పెద్ద స్టిక్కర్‌ వెంటనే ఆకట్టుకుంది. ఆయన మతసంబంధమైన విషయాలపట్ల ఆసక్తిగల వ్యక్తే అయినప్పటికీ దాని అర్థమేమిటో ఆయనకు సరిగా స్ఫురించలేదు. ఆ స్టిక్కర్‌ అర్థం ఆ డ్రైవర్‌కు అద్భుతాలపై నమ్మకం ఉందనా? లేక అది అద్భుతాలమీద దేవదూతలమీద నమ్మకం లేకపోవడాన్ని హాస్యధోరణిలో సూచించడమా?

అద్భుతం అనే పదం పాఠకులను, విభేదించుకునే రెండు గుంపులుగా విడదీస్తుంది” అని జర్మన్‌ రచయిత మాన్‌ఫ్రెడ్‌ బార్తెల్‌ చేసిన వ్యాఖ్యానం మీకు ఆసక్తి కలిగించవచ్చు. అద్భుతాలను నమ్మేవారు అవి జరుగుతాయనీ, అదీ తరచుగా జరుగుతాయనీ నమ్ముతారు. * ఉదాహరణకు గ్రీసులో, గత కొద్ది సంవత్సరాల్లో, దాదాపు నెలకొకసారి అద్భుతాలు జరుగుతాయని విశ్వాసులు చెప్పినట్లు నివేదించబడింది. అది ఒక గ్రీకు ఆర్థడాక్స్‌ చర్చి బిషప్పు ఇలా హెచ్చరించడానికి కారణమైంది: “విశ్వాసులు దేవుణ్ణి, మరియను, పరిశుద్ధులను మానవులుగా దృష్టించడానికి మొగ్గు చూపుతారు. విశ్వాసులు ఇలాంటి విషయాలను కొండంతలు చేసి చెప్పకూడదు.”

మరికొన్ని దేశాల్లో అద్భుతాలను ప్రజలు అంత ఎక్కువగా నమ్మడం లేదు. జర్మనీలో 2002లో జరిగిన ఒక ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం, జర్మనీ పౌరుల్లో 71 శాతం మంది అద్భుతాలు కల్పితాలని, అవి వాస్తవాలు కావని భావిస్తున్నారు. అయితే, మూడింట ఒక వంతు కంటే తక్కువమంది మాత్రమే అద్భుతాలను విశ్వసిస్తున్నారు, వారిలో తాము కన్య మరియ నుండి సందేశం పొందామని చెప్పిన స్త్రీలు ముగ్గురున్నారు. వారు చెప్పుకున్నట్లుగా, వారికి మరియతోపాటు దేవదూతలు, పావురం ఉన్నట్లు కనిపించిన కొన్ని నెలల తర్వాత, వెస్ట్‌ఫాలెన్‌పోస్ట్‌ అనే జర్మన్‌ వార్తాపత్రిక ఇలా నివేదించింది: “ఇప్పటివరకూ దాదాపు 50,000 మంది, అంటే స్వస్థత పొందాలని చూస్తున్నవారు, కుతూహలం ఉన్నవారు ఈ స్త్రీలు చూసిన దర్శనాలపట్ల ఎంతో ఆసక్తి చూపించారు.” మరియ మళ్లీ కనిపిస్తే చూద్దామనే ఉద్దేశంతో ఇంకా 10,000 మంది గ్రామంలోకి వస్తారని అంచనా వేయబడుతోంది. 1858లో ఫ్రాన్స్‌లోని లూర్దుజ్‌లో, 1917లో పోర్చుగల్‌లోని ఫాతిమలో కన్య మరియకు సంబంధించిన అలాంటి దర్శనాలే కనబడినట్లు చెప్పబడుతోంది.

క్రైస్తవేతర మతాల విషయమేమిటి?

దాదాపు అన్ని మతాల వారు అద్భుతాలను నమ్ముతున్నారు. ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రెలీజియన్‌ బౌద్ధ, క్రైస్తవ, మహమ్మదీయ మతాల సంస్థాపకులకు అద్భుతాల గురించి వివిధ దృక్కోణాలు ఉన్నాయని వివరిస్తోంది. అయితే, “అద్భుతాలు, అద్భుతాలకు సంబంధించిన వృత్తాంతాలు మానవుని మత జీవితంలో ముఖ్య భాగమయ్యాయని ఈ మతాల తర్వాతి చరిత్ర స్పష్టంగా చూపిస్తోంది” అని ఆ గ్రంథం పేర్కొన్నది. “కొన్ని సందర్భాల్లో బుద్ధుడు కూడా అద్భుతాలు చేశాడు” అని కూడా ఆ గ్రంథం చెబుతోంది. ఆ తర్వాత “బౌద్ధమతం చైనాలో స్థాపించబడినప్పుడు దాని మత ప్రచారకులు తరచూ తమ అద్భుత శక్తులను ప్రదర్శించడానికి పూనుకున్నారు.”

ఆ సర్వసంగ్రహ నిఘంటువు, జరిగాయని చెప్పబడుతున్న అలాంటి అద్భుతాల గురించి ప్రస్తావించిన తర్వాత చివరిలో ఇలా చెబుతోంది: “భక్తిపరులైన జీవిత చరిత్రకారులు చెప్పిన ఈ అద్భుతాల నివేదికలన్నింటినీ అంగీకరించడానికి ఒకరు సిద్ధంగా ఉండకపోవచ్చు. అయితే అవి, ఉత్సాహవంతులైన తన అనుచరులకు అలాంటి అద్భుత శక్తులను అనుగ్రహించగలిగిన బుద్ధుడిని మహిమపరచాలనే మంచి ఉద్దేశంతోనే సృష్టించబడ్డాయనడంలో సందేహం లేదు.” ఇస్లాం మతం గురించి అదే గ్రంథం ఇలా చెబుతోంది: “మహమ్మదీయ మతసమాజంలోని అనేకులు అద్భుతాలు జరుగుతాయని ఎదురుచూస్తూనే ఉన్నారు. మహమ్మదు అనేక సందర్భాల్లో బహిరంగంగా అద్భుతాలు చేసినట్లు సాంప్రదాయక గ్రంథాల్లో (హాదిత్‌లలో) ప్రస్తావించబడింది. . . . పరిశుద్ధులు మరణించిన తర్వాత కూడా విశ్వాసుల ప్రయోజనార్థం తమ సమాధుల దగ్గర అద్భుతాలు చేస్తారని విశ్వసించబడుతోంది, పరిశుద్ధులు తమకు సహాయం చేయాలని ప్రజలు భక్తిపూర్వకంగా వారిని వేడుకుంటారు.”

క్రైస్తవమత సంబంధ అద్భుతాల మాటేమిటి?

క్రైస్తవ మతాన్ని స్వీకరించిన అనేకులు ఈ విషయంలో వివిధ అభిప్రాయాలు కలిగివున్నారు. యేసుక్రీస్తు లేదా క్రీస్తుపూర్వ కాలాల్లో దేవుని సేవకులు చేసిన అద్భుతాల గురించి బైబిలు ఇస్తున్న నివేదికలను కొంతమంది వాస్తవాలుగా అంగీకరిస్తారు. అయినప్పటికీ, చాలామంది ప్రొటస్టెంట్‌ మతసంస్కర్త మార్టిన్‌ లూథర్‌తో ఏకీభవిస్తారు. ఆయన గురించి ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రెలీజియన్‌ ఇలా చెబుతోంది: “అద్భుతాల కాలం ముగిసిందని, అవి జరుగుతాయని ఎదురుచూడకూడదని లూథర్‌, కాల్విన్‌ ఇద్దరూ వ్రాశారు.” క్యాథలిక్‌ చర్చి, “అద్భుతాలు ఎలా జరిగాయో వివరించడానికి ప్రయత్నించకుండా” వాటిని విశ్వసించడం కొనసాగించిందని ఆ గ్రంథమే చెబుతోంది. అయితే, “ప్రొటస్టెంట్‌ సమాజంలోని మేధావులు క్రైస్తవత్వ ఆచరణ చాలామేరకు నైతికతకు సంబంధించినదనీ, దేవుడుగానీ ఆధ్యాత్మిక లోకంగానీ అసలైన మానవజీవితాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేరనీ విశ్వసించడం ఆరంభించింది.”

కొంతమంది మతనాయకులతో సహా, క్రైస్తవులమని చెప్పుకునే ఇతరులు బైబిలులో ప్రస్తావించబడిన అద్భుతాలు వాస్తవమైనవేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు, బైబిలులో నిర్గమకాండము 3:1-5 వచనాల్లో నివేదించబడిన మండుచున్న పొదకు సంబంధించిన వృత్తాంతాన్ని తీసుకోండి. దీన్ని చాలామంది జర్మన్‌ పండితులు అద్భుతానికి సంబంధించిన వాస్తవమైన వృత్తాంతంగా పరిగణించరని వాట్‌ ద బైబిల్‌ రియల్లీ సేస్‌ అనే పుస్తకం వివరిస్తోంది. బదులుగా, అది “మోషే మనస్సాక్షి బాధించడం మూలంగా, ఎంతో వేదన అనుభవిస్తూ ఆయన చేసిన అంతరంగ పోరాటానికి గుర్తు” అని వారు చెబుతారు. ఆ పుస్తకం ఇంకా ఇలా చెబుతోంది: “దైవ సాన్నిధ్య సూర్యకాంతిలో భళ్లున వికసించిన పువ్వులుగా కూడా ఆ మంటలను చూడవచ్చు.”

అలాంటి వివరణ మీకు సంతృప్తి కలిగించకపోవచ్చు. కాబట్టి మీరేమి విశ్వసించాలి? అద్భుతాలు జరిగాయని విశ్వసించడం సరైనదేనా? మరి ఆధునిక దిన అద్భుతాల మాటేమిటి? మనం దేవదూతలను అడగలేము కాబట్టి మనం ఎవరిని అడగవచ్చు?

బైబిలు దృక్కోణం

గత కాలాల్లో దేవుడు మానవుల కోసం అసాధ్యమైన క్రియలు చేయడానికి జోక్యం చేసుకున్నాడని బైబిలు ఇస్తున్న నివేదికలను ఎవరూ కాదనలేరు. ఆయన గురించి మనమిలా చదువుతాము: “సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహా బలముకలిగి, చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి, ఐగుప్తు దేశములోనుండి నీ ప్రజలను రప్పించి[తివి].” (యిర్మీయా 32:​21) మోషే కాలంలో అత్యంత శక్తిమంతమైనదిగా ఉన్న రాజ్యం, జ్యేష్ఠకుమారుని మరణంతో సహా దేవుడు పంపిన పది తెగుళ్ళ కారణంగా అవమానానికి గురికావడం గురించి ఆలోచించండి. ఆ తెగుళ్ళు నిజంగా అద్భుతాలే!​—⁠నిర్గమకాండము, 7 నుండి 14 అధ్యాయాలు.

శతాబ్దాల తర్వాత, నలుగురు సువార్త రచయితలు యేసు చేసిన దాదాపు 35 అద్భుతాల గురించి వర్ణించారు. వాస్తవానికి, వారు నివేదించిన వాటికంటే ఇంకా ఎక్కువ సహజాతీత కార్యాలను ఆయన చేశాడని వారి మాటలు సూచిస్తున్నాయి. ఈ నివేదికలు వాస్తవాలా లేక కల్పితాలా? *​—⁠మత్తయి 9:35; లూకా 9:​11.

అందులో చెప్పబడినట్లుగా, బైబిలు నిజంగానే దేవుని సత్య వాక్యమైతే దానిలో వ్రాయబడివున్న అద్భుతాలను మీరు నమ్మడానికి గట్టి ఆధారం ఉంటుంది. గత కాలాల్లో జరిగిన అద్భుతాల గురించి అంటే అద్భుతమైన స్వస్థతల గురించి, పునరుత్థానాల గురించి, ఇంకా అలాంటి వాటి గురించి బైబిలు స్పష్టంగా నివేదిస్తోంది, అయితే అలాంటి అద్భుతాలు ఇక జరగవనే విషయాన్ని కూడా అది అంతే స్పష్టంగా వివరిస్తోంది. (4వ పేజీలో ఉన్న “గతంలో జరిగినలాంటి అద్భుతాలు ఇప్పుడు ఎందుకు జరగడంలేదు?” అనే బాక్సు చూడండి.) కాబట్టి బైబిలు వాస్తవమైనదని నమ్మేవారు కూడా ఆధునిక దినాల్లో జరుగుతున్న అద్భుతాలకు ఆధారం లేనట్లు పరిగణిస్తారని దీని భావమా? జవాబు కోసం దయచేసి తర్వాతి ఆర్టికల్‌ చూడండి.

[అధస్సూచీలు]

^ పేరా 3 ఈ ఆర్టికల్‌లో “అద్భుతాలు” అనే పదం ఒక బైబిలు నిఘంటువులో నిర్వచించబడిన భావంలోనే ఉపయోగించబడింది. ఆ నిఘంటువు దానిని ఇలా నిర్వచించింది: “అవి మనకు తెలిసిన మానవశక్తులకు లేక ప్రకృతిశక్తులకు అతీతంగా ఉండే భౌతిక ప్రపంచపు ప్రభావాలు కాబట్టి, అవి సహజాతీత మూలం వల్లనే జరుగుతున్నాయని విశ్వసించబడుతోంది.”

^ పేరా 14 బైబిలు నమ్మదగినది అనడానికిగల నిదర్శనాన్ని మీరు పరిశీలించవచ్చు. అలాంటి నిదర్శనం యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు​—⁠దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) అనే పుస్తకంలో ఉంది.

[4వ పేజీలోని బాక్సు]

గతంలో జరిగినలాంటి అద్భుతాలు ఇప్పుడు ఎందుకు జరగడంలేదు?

బైబిలులో వివిధ రకాలైన అద్భుతాల గురించి ప్రస్తావించబడింది. (నిర్గమకాండము 7: 19-21; 1 రాజులు 17:1-7; 18:22-38; 2 రాజులు 5:1-14; మత్తయి 8:24-27; లూకా 17:11-19; యోహాను 2:1-11; 9:​1-7) వీటిలో అనేక అద్భుతాలు యేసును మెస్సీయగా గుర్తించడానికి తోడ్పడ్డాయి, ఆయనకు దేవుని మద్దతు ఉందని అవి నిరూపించాయి. యేసు తొలి అనుచరులు భాషలలో మాట్లాడడం, ప్రేరేపిత వాక్యాలను అర్థం చేసుకోవడం వంటి అద్భుతమైన వరాలను ప్రదర్శించారు. (అపొస్తలుల కార్యములు 2:5-12; 1 కొరింథీయులు 12:​28-31) క్రైస్తవ సంఘం స్థాపించబడిన తొలికాలాల్లో అలాంటి అద్భుతమైన వరాలు ఆ సంఘానికి ఉపయోగకరంగా ఉన్నాయి. ఎలా?

అప్పట్లో లేఖనాల ప్రతులు చాలా తక్కువగా ఉన్నాయి. సాధారణంగా, ఎలాంటి గ్రంథపు చుట్టలైనా లేక పుస్తకాలైనా ధనికుల దగ్గరే ఉండేవి. క్రైస్తవేతర దేశాల్లో, బైబిలు గురించి దాని గ్రంథకర్త అయిన యెహోవా గురించి ప్రజలకు తెలియదు. క్రైస్తవ బోధ కేవలం మౌఖికంగానే ఇతరులకు అందజేయబడాలి. క్రైస్తవ సంఘాన్ని దేవుడు ఉపయోగించుకుంటున్నాడని చూపించడానికే ఆ అద్భుతమైన వరాలు ఉపయోగపడ్డాయి.

ఈ వరాలు ఇక అవసరం లేనప్పుడు అవి లేకుండా పోతాయని పౌలు వివరించాడు. “ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును; మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.”​—⁠1 కొరింథీయులు 13:​8-10.

నేడు, ప్రజలకు బైబిళ్ళు, అలాగే పదవిషయ సూచికలు, సర్వసంగ్రహ నిఘంటువులు అందుబాటులో ఉన్నాయి. 60 లక్షలకంటే ఎక్కువమంది సుశిక్షిత క్రైస్తవులు బైబిలు ఆధారిత దైవిక జ్ఞానాన్ని పొందడానికి ఇతరులకు సహాయం చేస్తున్నారు. కాబట్టి, యేసుక్రీస్తు దేవుడు నియమించిన విమోచకుడని ధృవీకరించడానికి లేదా యెహోవా తన సేవకులకు మద్దతు ఇస్తున్నాడనేందుకు నిదర్శనం చూపించడానికి అద్భుతాలు ఇక అవసరం లేదు.