కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవులారా—మీ గుర్తింపునుబట్టి అతిశయించండి!

క్రైస్తవులారా—మీ గుర్తింపునుబట్టి అతిశయించండి!

క్రైస్తవులారా​—⁠మీ గుర్తింపునుబట్టి అతిశయించండి!

“అతిశయించువాడు ప్రభువునందే [‘యెహోవానందే,’ Nw] అతిశయింపవలెను.”​—⁠1 కొరింథీయులు 1:31.

“మత ఉదాసీనత.” చాలామందికి తమ విశ్వాసం విషయంలో ఉన్న దృక్పథాన్ని వర్ణించడానికి మత వ్యవహారాల సంబంధిత వ్యాఖ్యాత ఒకరు ఇటీవల ఈ మాటను ఉపయోగించారు. ఆయన ఇలా వివరించారు: “ఆధునిక మతంలో అత్యంత గమనార్హంగా పరిణమించిన ప్రవృత్తి అసలు మతసంబంధమైనదే కాదు, కాబట్టి ఆ ప్రవృత్తిని ‘మత ఉదాసీనత’ అని వర్ణించడమే సమంజసంగా ఉంటుంది.” మత ఉదాసీనతను ఇంకా విశదీకరిస్తూ, “అది ఒక వ్యక్తిలో అతని సొంత మతానికి సంబంధించిన కార్యాలన్నిటిపట్ల సన్నగిల్లిన ఆసక్తి” అని ఆయన వివరించారు. చాలామందికి “దేవుని మీద విశ్వాసం ఉంది . . . ; అయితే ఆయన గురించిన పట్టింపే వారికి లేదు” అని ఆయన అభిప్రాయపడ్డారు.

2 ఈ ఉదాసీన వైఖరి బైబిలు విద్యార్థులకు ఆశ్చర్యం కలిగించదు. (లూకా 18:⁠8) ఇక మతాల విషయానికి వస్తే, అలాంటి అనాసక్తిని ఎదురుచూడవలసిందే. అబద్ధ మతం మానవజాతిని చాలాకాలంగా మోసగిస్తూ నిరుత్సాహపరచింది. (ప్రకటన 17:​15, 16) అయితే సర్వత్రా వ్యాపించిన అర్ధహృదయ స్వభావం, అనాసక్తి నిజ క్రైస్తవులకు ప్రమాదకరమైనది. మన విశ్వాసాన్ని పోగొట్టుకుని దేవుని సేవ విషయంలో, బైబిలు సత్యం విషయంలో ఉదాసీనంగా ఉండడం మనకు విషాదకర పర్యవసానాలు తేగలదు. లవొదికయలో నివసిస్తున్న మొదటి శతాబ్దపు క్రైస్తవులను మందలిస్తూ యేసు అలాంటి నులివెచ్చని స్వభావం గురించి ఇలా హెచ్చరించాడు: “నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు . . . నులివెచ్చనగా ఉన్నావు.”​—⁠ప్రకటన 3:15-18.

మనం ఎవరమో గ్రహించడం

3 ఆధ్యాత్మిక ఉదాసీనతను ఎదిరించడానికి, క్రైస్తవులు తామెవరో స్పష్టంగా గ్రహించడమే కాక, తమ విశిష్ఠ గుర్తింపునుబట్టి సముచిత రీతిలో అతిశయించాలి. యెహోవా సేవకులుగా, క్రీస్తు శిష్యులుగా, బైబిలు వర్ణనల్లో మనం ఎవరమో చూడవచ్చు. చురుకుగా ఇతరులకు “సువార్త” ప్రకటించే మనం యెహోవాకు “సాక్షులు”గా, “దేవుని జతపనివా[రిగా]” ఉన్నాం. (యెషయా 43:10; 1 కొరింథీయులు 3:9; మత్తయి 24:​14) మనం ‘ఒకరి నొకరం ప్రేమించుకునే’ ప్రజలం. (యోహాను 13:​34) నిజ క్రైస్తవులు “అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు.” (హెబ్రీయులు 5:​14) మనం “లోకమందు జ్యోతుల[ము].” (ఫిలిప్పీయులు 2:16) ‘అన్యజనుల మధ్యను మంచి ప్రవర్తనగలవారమై ఉండడానికి’ మనం కృషి చేస్తున్నాం.​—⁠1 పేతురు 2:12; 2 పేతురు 3:11, 14.

4 యెహోవా సత్యారాధకులకు తాము ఎవరు కాదో కూడా తెలుసు. తమ నాయకుడైన యేసుక్రీస్తు ఎలా లోకసంబంధి కాడో అదే ప్రకారం వారు కూడా “లోకసంబంధులు కారు.” (యోహాను 17:​16) వారు ‘అంధకారమైన మనస్సుగలవారై దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడిన అన్యజనుల’ నుండి వేరుగా ఉంటారు. (ఎఫెసీయులు 4:​17, 18) ఫలితంగా యేసు అనుచరులు “భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి . . . ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్ర[తికే]” ప్రజలుగా ఉంటారు.​—⁠తీతు 2:​12,13.

5 మన గుర్తింపుకు సంబంధించిన స్పష్టమైన దృక్కోణం, విశ్వ సర్వాధిపతితో మనకున్న సంబంధం మనం ‘ప్రభువునందే [‘యెహోవానందే,’ NW] అతిశయించడానికి’ మనలను పురికొల్పుతాయి. (1 కొరింథీయులు 1:​31) అది ఏ విధమైన అతిశయం? యెహోవా మన దేవునిగా ఉన్నందుకు నిజ క్రైస్తవులముగా మనం ఎంతో ఆనందిస్తూనే ఈ ఉపదేశాన్ని అనుసరిస్తాం: “అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను.” (యిర్మీయా 9:​24) దేవుణ్ణి తెలుసుకునేందుకు లభించిన ఆధిక్యతనుబట్టి, ఇతరులకు సహాయం చేయడానికి ఆయన మనల్ని ఉపయోగించుకోవడాన్నిబట్టి మనం ‘అతిశయిస్తున్నాం.’

ఆ గ్రహింపును కాపాడుకోవడంలోని సవాలు

6 క్రైస్తవులముగా మన విశిష్ఠ గుర్తింపుకు సంబంధించిన ఆ సునిశిత గ్రహింపును కాపాడుకోవడం అన్ని సందర్భాల్లో సులభం కాదని ఒప్పుకోవలసిందే. క్రైస్తవునిగా పెరిగిన ఒక యువకుడు తాను కొంతకాలం ఆధ్యాత్మిక బలహీనతా స్థితిని అనుభవించడాన్ని ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “కొన్ని సందర్భాల్లో, నేను ఎందుకు యెహోవాసాక్షిగా ఉన్నానో నాకు తెలియదన్నట్లే భావించాను. చిన్నప్పటి నుండి నాకు బైబిలు సత్యమేమిటో నేర్పించబడింది. నేను కొన్నిసార్లు ఇది కూడా కేవలం మరో స్థాపిత మతం అనే భావించాను.” కొందరైతే ఈ లోక సంబంధ వినోదం, విస్తృత ప్రసార మాధ్యమాలు, జీవితం గురించి ప్రస్తుతం ఉన్న భక్తిహీన దృక్కోణాలు తమ గుర్తింపును రూపుదిద్దడానికి అనుమతించి ఉండవచ్చు. (ఎఫెసీయులు 2:​2, 3) మరికొంతమంది క్రైస్తవులు అప్పుడప్పుడు తమలోనే సందేహాలు తలెత్తే పరిస్థితినీ, తమ ప్రమాణాల, గమ్యాల విలువను పునఃపరిశీలించుకొనే పరిస్థితినీ ఎదుర్కోవచ్చు.

7 కాబట్టి మనం కొంతమేరకు జాగ్రత్తగా స్వీయ పరిశీలన చేసుకోవడం తప్పా? కానేకాదు. క్రైస్తవులు తమనుతాము పరీక్షించుకుంటూ ఉండాలని అపొస్తలుడైన పౌలు ప్రోత్సహించాడని మీరు గుర్తు తెచ్చుకోవచ్చు. ఆయన ఇలా వ్రాశాడు: “మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి.” (2 కొరింథీయులు 13:⁠5) సరిదిద్దుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో, క్రైస్తవులు తమలో బహుశా ఏవైనా ఆధ్యాత్మిక బలహీనతలు ఏర్పడ్డాయేమో గ్రహించేందుకు గట్టిగా ప్రయత్నించాలని అపొస్తలుడు వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఒక క్రైస్తవుడు తాను విశ్వాసంలో ఉన్నాడో లేడో పరీక్షించుకునేటప్పుడు, తన మాటలు, క్రియలు తాను చెప్పుకునే విశ్వాసానికి పొందికగా ఉన్నాయో లేదో కూడా ధృవీకరించుకోవాలి. అయితే ఆ స్వీయ పరిశీలన సరైన దిశలో సాగకపోతే, అంటే అది మన వ్యక్తిగత “గుర్తింపు” కోసం చూడడానికి మనలను ప్రోత్సహిస్తే లేక యెహోవాతోనూ క్రైస్తవ సంఘంతోనూ మన సంబంధానికి వెలుపల పరిష్కారాలు అన్వేషించమని మనలను పురికొల్పితే, అలాంటి పరిశీలన నిష్ప్రయోజనమే కాక అది మన ఆధ్యాత్మిక వినాశనానికి కూడా దారితీయగలదు. * మన ‘విశ్వాసం విషయంలో ఓడ బద్దలైనవారిగా’ ఉండాలని మనమెన్నటికీ కోరుకోము.​—⁠1 తిమోతి 1:19.

సవాళ్లకు మనం అతీతులం కాదు

8 అప్పుడప్పుడు సందేహాలు కలిగే క్రైస్తవులు తాము విఫలమయ్యామని భావించాలా? అవసరం లేదు! నిజానికి, అలాంటి భావాలు కొత్తకాదని తెలుసుకుని వారు ఓదార్పు పొందాలి. పూర్వకాలాల్లో దేవుని నమ్మకమైన సాక్షులు అలాంటి భావాలనే అనుభవించారు. ఉదాహరణకు, అసాధారణ విశ్వాసాన్ని, యథార్థతను, భక్తిని ప్రదర్శించిన మోషే విషయమే తీసుకోండి. చాలా పెద్దదిగా అనిపించిన పనికి నియమించబడినప్పుడు, భయపడుతూ ఆయన ఇలా అన్నాడు: ‘నేను ఎంతటివాడను?’ (నిర్గమకాండము 3:​11) అప్పుడాయన మనస్సులో ‘నేనంత ప్రముఖుణ్ణి కాదు’ లేదా ‘నాకంత సామర్థ్యం లేదు’ అనే తలంపు ఉందనేది స్పష్టం. మోషే నేపథ్యానికి సంబంధించిన వివిధ కారణాలు ఆయన తాను అర్హుడు కాదని భావించేలా చేసి ఉండవచ్చు, ఆయన బానిస జనాంగానికి చెందినవాడు. ఇశ్రాయేలీయులు ఆయనను తిరస్కరించారు. ఆయన అనర్గళంగా మాట్లాడలేడు. (నిర్గమకాండము 1:​13, 14; 2:​11-14; 4:​10) ఆయన గొర్రెలకాపరి, ఆ వృత్తిని ఐగుప్తీయులు అసహ్యించుకునేవారు. (ఆదికాండము 46:​34) కాబట్టి బానిసలుగా ఉన్న దేవుని ప్రజలను విమోచించే అర్హత తనకు లేదని ఆయన భావించడంలో ఆశ్చర్యం లేదు.

9 యెహోవా రెండు శక్తిమంతమైన వాగ్దానాలు చేస్తూ మోషేకు ఇలా అభయమిచ్చాడు: “నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరు.” (నిర్గమకాండము 3:​12) వెనుకంజ వేస్తున్న తన సేవకునికి, నిరంతరం తోడుగా ఉంటానని యెహోవా చెబుతున్నాడు. అంతేకాక, తన ప్రజలను తప్పక విడిపిస్తానని కూడా ఆయన సూచిస్తున్నాడు. సహాయానికి సంబంధించిన అలాంటి వాగ్దానాలను దేవుడు అన్ని కాలాల్లో చేశాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలు జనాంగం వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి ముందు మోషే ద్వారా వారికి ఇలా చెప్పాడు: “భయపడకుడి . . . నీతోకూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు.” (ద్వితీయోపదేశకాండము 31:⁠6) యెహోషువకు కూడా యెహోవా ఇలా అభయమిచ్చాడు: ‘నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును. నీకు తోడైయుందును. నిన్ను విడువను నిన్ను ఎడబాయను.’ (యెహోషువ 1:⁠5) ఆయన క్రైస్తవులకు ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.” (హెబ్రీయులు 13:⁠5) అలాంటి బలమైన సహాయం, క్రైస్తవులముగా మనం అతిశయించేలా చేయాలి!

10 మోషే తర్వాత దాదాపు ఐదు శతాబ్దాలకు, నమ్మకస్థుడైన లేవీయుడగు ఆసాపు తనలో కలిగిన సందేహాల గురించి, యథార్థంగా నడుచుకోవడంలోని విలువ గురించి నిజాయితీగా వ్రాశాడు. పరీక్షలు, శోధనల మధ్య కూడా ఆయన దేవుని సేవ చేస్తుండగా, దేవుణ్ణి ఎగతాళి చేసేవారు మరింత శక్తిమంతంగా ఎదగడాన్ని, సుభిక్షంగా ఉండడాన్ని చూశాడు. అది ఆసాపుపై ఎలాంటి ప్రభావం చూపించింది? “నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని” అని ఆయన ఒప్పుకున్నాడు. యెహోవా ఆరాధకునిగా ఉండడంలోని విలువను ఆయన సందేహించడం ప్రారంభించాడు. “నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది” అని ఆసాపు తలంచాడు.​—⁠కీర్తన 73:2, 3, 13, 14.

11 కలవరపరిచే అలాంటి భావావేశాలతో ఆసాపు ఎలా వ్యవహరించాడు? ఆయన వాటిని కొట్టిపారేశాడా? లేదు. మనం 73వ కీర్తనలో చూస్తున్నట్లుగా ఆయన వాటిని ప్రార్థనలో దేవునికి తెలియజేశాడు. ఆసాపు పరిశుద్ధాలయాన్ని సందర్శించినప్పుడు ఆయన దృక్కోణంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఆయన అక్కడ ఉన్నప్పుడు, దేవునిపట్ల భక్తి కలిగివుండడమే శ్రేష్ఠమైన మార్గం అని గ్రహించాడు. తనలో ఆధ్యాత్మిక కృతజ్ఞతాభావం మళ్లీ జీవం పోసుకోవడంతో, యెహోవా చెడును ద్వేషిస్తాడనీ దుష్టులు యుక్తకాలంలో నాశనమవుతారని ఆయన అర్థం చేసుకున్నాడు. (కీర్తన 73:​17-19) ఆసాపు సరిదిద్దుకున్న దృక్పథంతో యెహోవా ఉదాత్తమైన సేవకునిగా తన గుర్తింపు భావాన్ని బలపరచుకున్నాడు. ఆయన దేవునితో ఇలా అన్నాడు: “అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను. నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు. నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు.” (కీర్తన 73:​23, 24) ఆసాపు తన దేవుని విషయంలో మళ్లీ అతిశయించడం మొదలుపెట్టాడు.​—⁠కీర్తన 34:2.

తమ గుర్తింపు ఏమిటో వారికి బాగా తెలుసు

12 మన క్రైస్తవ గుర్తింపును బలపరచుకొనే ఒక మార్గం ఏమిటంటే, ప్రతికూల పరిస్థితులున్నా దేవునితో తమకున్న సంబంధాన్నిబట్టి అధికంగా ఆనందించిన నమ్మకమైన యథార్థ సేవకుల విశ్వాసాన్ని పరిశీలిస్తూ, వారిని అనుకరించడమే. యాకోబు కుమారుడైన యోసేపు విషయమే పరిశీలించండి. ఆయన చిన్న వయస్సులోనే విశ్వాసఘాతుకానికి గురై బానిసగా అమ్ముడుపోయి దైవభక్తిగల తన తండ్రికీ, ఆప్యాయతా ఆసరా లభించే ఇంటి వాతావరణానికీ దూరంగా వందలాది కిలోమీటర్ల దూరంలోవున్న ఐగుప్తుకు వెళ్ళాల్సి వచ్చింది. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయనకు దైవిక సలహా ఇవ్వగల మనిషే లేడు, పైగా ఆయన నైతిక విలువలను, దేవుని మీద ఆయనకున్న నమ్మకాన్ని పరీక్షించే కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అయితే, దేవుని సేవకునిగా తన గుర్తింపును కాపాడుకోవడానికి ఆయన స్పష్టంగా మనఃపూర్వక ప్రయత్నం చేసి, సరైనదని తనకు తెలిసిన దానికి నమ్మకంగా కట్టుబడి ఉన్నాడు. ప్రతికూల పరిసరాల మధ్య కూడా ఆయన యెహోవా ఆరాధకునిగా ఉండడం ఒక గొప్ప విషయంగా భావించాడే తప్ప, తన భావాలను వ్యక్తం చేయడానికి ఆయన వెనుకంజ వేయలేదు.​—⁠ఆదికాండము 39:7-10.

13 దాదాపు ఎనిమిది శతాబ్దాల తర్వాత, సిరియన్ల చేత చెరపట్టబడి సిరియా సైన్యాధిపతియైన నయమానుకు దాసురాలైన ఇశ్రాయేలు బాలిక, యెహోవా ఆరాధకురాలిగా తన గుర్తింపును మరచిపోలేదు. ఆమె ఎలీషాను సత్యదేవుని ప్రవక్తగా గుర్తిస్తూ తనకు అవకాశం లభించినప్పుడు, యెహోవా గురించి ధైర్యంగా చక్కని సాక్ష్యమిచ్చింది. (2 రాజులు 5:​1-19) అది జరిగిన అనేక సంవత్సరాల తర్వాత, యౌవనుడైన యోషీయా రాజు, రాజ్యంలో అవినీతి నిండి ఉన్నప్పటికీ, సుదీర్ఘ మత సంస్కరణలు తీసుకొచ్చి, దేవుని ఆలయాన్ని బాగుచేయించి, జనాంగాన్ని తిరిగి యెహోవా వైపుకు మళ్లించాడు. ఆయన తన విశ్వాసంలో, ఆరాధనలో అతిశయించాడు. (2 దినవృత్తాంతములు 34, 35 అధ్యాయాలు) బబులోనులో దానియేలు ఆయన ముగ్గురు సహవాసులు ఒత్తిడి, శోధన ఎదుర్కొన్నప్పటికీ తాము యెహోవా సేవకులమనే గుర్తింపును ఎన్నటికీ మరచిపోకుండా తమ యథార్థతను నిలుపుకున్నారు. వారు యెహోవా సేవకులుగా ఉండడానికి అతిశయించారనే విషయం స్పష్టం.​—⁠దానియేలు 1:8-20.

మీ క్రైస్తవ గుర్తింపునుబట్టి అతిశయించండి

14 ఈ దేవుని సేవకులు విజయం సాధించారు, ఎందుకంటే వారు దేవుని ఎదుట తమ స్థానం విషయంలో ఆరోగ్యదాయకమైన అతిశయాన్ని అలవరచుకున్నారు. నేడు మన విషయమేమిటి? మన క్రైస్తవ గుర్తింపునుబట్టి అతిశయించడంలో ఏమి ఇమిడివుంది?

15 ప్రాథమికంగా దీనిలో యెహోవా నామానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలుగా ఉన్నందుకు, ఆయన ఆశీర్వాదం, ఆమోదం పొందుతున్నందుకు ప్రగాఢమైన కృతజ్ఞతా భావం కలిగివుండడం ఒక భాగం. తనకు చెందిన వారెవరనే విషయంలో దేవునికి సందేహం లేదు. మతపరంగా కాస్త గజిబిజిగా ఉన్న కాలంలో జీవించిన అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ప్రభువు [‘యెహోవా,’ NW] తనవారిని ఎరుగును.” (2 తిమోతి 2:19; సంఖ్యాకాండము 16:⁠5) “తనవారి” విషయంలో యెహోవా ఎంతో అతిశయిస్తాడు. ఆయన ఇలా ప్రకటిస్తున్నాడు: ‘మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడని యెంచుతాను.’ (జెకర్యా 2:⁠8) యెహోవా మనలను ప్రేమిస్తున్నాడనడంలో సందేహం లేదు. కాబట్టి ఆయనతో మన సంబంధం కూడా ఆయనపట్ల మనం చూపించే ప్రగాఢమైన ప్రేమ మీదే ఆధారపడి ఉండాలి. పౌలు ఇలా వ్రాశాడు: “ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైనవాడే.”​—⁠1 కొరింథీయులు 8:⁠3.

16 యెహోవాసాక్షులుగా పెంచబడిన యౌవనులు, దేవునితో తమ వ్యక్తిగత సంబంధం మీద ఆధారపడి తమ క్రైస్తవ గుర్తింపు బలంగా ఉందో లేదో పరిశీలించుకోవాలి. వారు కేవలం తమ తల్లిదండ్రుల విశ్వాసం మీదే ఆధారపడలేరు. దేవుని ప్రతీ సేవకుని గురించి పౌలు ఇలా వ్రాశాడు: “నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే.” పౌలు ఇంకా ఇలా అన్నాడు: “మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.” (రోమీయులు 14:​4, 11) అందువల్ల అర్ధహృదయంతో కుటుంబ ఆరాధనలో కొనసాగడం యెహోవాతో సన్నిహితమైన, దీర్ఘకాలిక సంబంధాన్ని కాపాడలేదు.

17 యెహోవాకు సాక్ష్యమిచ్చిన సేవకులు చరిత్రంతటా చాలామంది ఉన్నారు. వారి క్రమం దాదాపు 60 శతాబ్దాల పూర్వం నమ్మకస్థుడైన హేబెలు మొదలుకొని ఆధునిక సాక్షుల “గొప్పసమూహము” వరకు కొనసాగడమే కాక నిరంతర భవిష్యత్తు అనుభవించే యెహోవా ఆరాధకుల అనేక జనసమూహాలతో నిండి ఉంటుంది. (ప్రకటన 7:9; హెబ్రీయులు 11:⁠4) ఈ నమ్మకమైన ఆరాధకుల క్రమంలో మనం ప్రస్తుతకాల ఆరాధకులుగా ఉన్నాం. మనకెంత ఘనమైన ఆధ్యాత్మిక వారసత్వం ఉందో కదా!

18 మన క్రైస్తవ గుర్తింపులో మనలను క్రైస్తవులుగా గుర్తించే నిర్ణీత విలువలు, లక్షణాలు, ప్రమాణాలు, నడవడి ఉన్నాయి. అదొక ‘మార్గం,’ ఆ ఒక్క మార్గమే దేవుణ్ణి సంతోషపెట్టగల విజయవంతమైన జీవన మార్గం. (అపొస్తలుల కార్యములు 9:2; ఎఫెసీయులు 4:​22-24) క్రైస్తవులు “సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేప[డతారు].” (1 థెస్సలొనీకయులు 5:21) క్రైస్తవత్వానికీ, దేవునినుండి వేరైన లోకానికీ చాలా వ్యత్యాసముందనే స్పష్టమైన అవగాహన మనకుంది. సత్యారాధనకు, అబద్ధ ఆరాధనకు మధ్యవున్న వ్యత్యాసం విషయంలో ఎలాంటి సందేహానికీ యెహోవా తావివ్వడం లేదు. ఆయన తన ప్రవక్తయైన మలాకీ ద్వారా ఇలా ప్రకటించాడు: “నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.”​—⁠మలాకీ 3:18.

19 తికమకతో, గజిబిజితో నిండిన ఈ లోకంలో యెహోవానుబట్టి అతిశయించడం చాలా ప్రాముఖ్యం కాబట్టి, దేవుని విషయంలో ఆరోగ్యదాయక అతిశయాన్నీ మన క్రైస్తవ గుర్తింపు విషయంలో మన అప్రమత్తతనూ కాపాడుకోవడానికి మనకేది సహాయం చేయగలదు? దీనికి సహాయకరమైన సూచనలు తర్వాతి ఆర్టికల్‌లో ఉన్నాయి. మీరు వాటిని పరిశీలిస్తుండగా, నిజ క్రైస్తవులు ఎన్నటికీ “మత ఉదాసీనతకు” బలికారనే విషయాన్ని స్థిరంగా నమ్మవచ్చు.

[అధస్సూచి]

^ పేరా 11 ఇక్కడ కేవలం మన ఆధ్యాత్మిక గుర్తింపు మాత్రమే ప్రస్తావించబడింది. కొన్నిరకాల మానసిక ఆరోగ్య సమస్యలకు వృత్తిపరమైన చికిత్స అవసరం కావచ్చు.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

క్రైస్తవులు ‘యెహోవానందు’ ఎలా అతిశయించవచ్చు?

మోషే, ఆసాపు ఉదాహరణల నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?

బైబిల్లో ఎవరెవరు తమ దేవుని సేవనుబట్టి అతిశయించారు?

మన క్రైస్తవ గుర్తింపునుబట్టి అతిశయించడంలో ఏమి ఇమిడివుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1. ప్రజల్లో మతానికి సంబంధించి ఎలాంటి దృక్పథం స్పష్టంగా కనిపిస్తోంది?

2. (ఎ) ప్రజలు ఆధ్యాత్మికంగా ఉదాసీనంగా తయారు కావడం ఎందుకు ఆశ్చర్యం కలిగించకూడదు? (బి) ఉదాసీనత నిజ క్రైస్తవులకు ఎలాంటి ప్రమాదాన్ని తెస్తుంది?

3. క్రైస్తవులు తమ గుర్తింపుకు సంబంధించిన ఏ విషయాలనుబట్టి అతిశయించవచ్చు?

4. యెహోవా ఆరాధకుడు తాను ఎవరు కాదో ఎలా నిర్ణయించుకోవచ్చు?

5. ‘యెహోవానందే అతిశయించాలనే’ ఉపదేశ భావమేమిటి?

6. క్రైస్తవులుగా తమ గుర్తింపుకు సంబంధించిన సునిశిత గ్రహింపును కాపాడుకోవడం కొందరికి ఎందుకు సవాలుగా ఉండవచ్చు?

7. (ఎ) దేవుని సేవకులకు ఎలాంటి స్వీయ పరిశీలన సరైనది? (బి) అయితే ప్రమాదం ఎక్కడ పొంచివుంది?

8, 9. (ఎ) మోషే తనలో కలిగిన సందేహ భావాలను ఎలా వ్యక్తం చేశాడు? (బి) మోషే అనర్హతా భావాల విషయంలో యెహోవా ఎలా ప్రతిస్పందించాడు? (సి) యెహోవా ఇచ్చిన అభయాన్నిబట్టి మీరెలా ప్రభావితం అవుతున్నారు?

10, 11. యెహోవాకు సేవ చేసే విషయంలో సరైన దృక్పథాన్ని కాపాడుకోవడానికి లేవీయుడైన ఆసాపుకు సహాయం ఎలా లభించింది?

12, 13. దేవునితో తమకున్న సంబంధాన్నిబట్టి అతిశయించిన బైబిల్లోని వ్యక్తుల ఉదాహరణలు ఇవ్వండి.

14, 15. మన క్రైస్తవ గుర్తింపునుబట్టి అతిశయించడంలో ఏమి ఇమిడివుంది?

16, 17. యౌవనులు, వృద్ధులు అనే తేడా లేకుండా క్రైస్తవులందరూ తమ ఆధ్యాత్మిక వారసత్వం విషయంలో ఎందుకు అతిశయించవచ్చు?

18. మన విలువలు, ప్రమాణాలు మనలను లోకం నుండి ఎలా వేరుగా ఉంచుతాయి?

19. నిజ క్రైస్తవులకు ఎన్నటికీ సంభవించనిది ఏమిటి?

[14వ పేజీలోని చిత్రం]

ఒక సందర్భంలో మోషేకు తనలోనే సందేహభావాలు ఉన్నాయి

[15వ పేజీలోని చిత్రం]

ప్రాచీనకాల యెహోవా సేవకులు అనేకులు తమ విశిష్ఠ గుర్తింపును బట్టి అతిశయించారు