పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
2 సమూయేలు 12:31, 1 దినవృత్తాంతములు 20:3 వచనాలను చదివి కొందరు భావిస్తున్నట్లుగా, దేవునికి ఇష్టుడైన దావీదు తన బందీలను క్రూరంగా హింసించాడా?
లేదు. దావీదు అమ్మోనీయుల బందీలతో కేవలం బలవంతంగా పనిచేయించాడు. కొన్ని బైబిలు అనువాదాలు ఈ వచనాలను అనువదించిన తీరునుబట్టి దావీదు చర్యలు కొన్ని తప్పుగా అర్థం చేసుకోబడ్డాయి.
అమ్మోనీయులకు దావీదు అమలుచేసిన శిక్షను వర్ణించినప్పుడు అలాంటి బైబిలు అనువాదాలు దావీదును అమానుషమైన, క్రూరమైన వ్యక్తిగా చిత్రీకరించాయి. ఉదాహరణకు, పరిశుద్ధ గ్రంథము ప్రకారం 2 సమూయేలు 12:31లో ఇలా ఉంది: “పట్టణములో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపములచేతను పదునుగల యినుప పనిముట్లచేతను ఇనుప గొడ్డండ్లచేతను వారిని తుత్తునియలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీయుల పట్టణములన్నిటికి అతడు ఈలాగు చేసెను.” 1 దినవృత్తాంతములు 20:3లోని వృత్తాంతం కూడా అదే విధంగా అనువదించబడింది.
అయితే బైబిలు విద్వాంసుడైన సామ్యూల్ రోల్స్ డ్రైవర్ వ్యాఖ్యానించినట్లుగా, దావీదు క్రూరంగా ప్రవర్తించాడనే అభిప్రాయం “ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన స్వభావం గురించి మనకు తెలిసిన విషయాలన్నింటికీ” విరుద్ధంగా ఉంది. కాబట్టి ది యాంకర్ బైబిల్‌లోని ఒక వ్యాఖ్యానం ఇలా చెబుతోంది: “దావీదు తాను గెలిచిన దేశంనుండి ఆర్థిక ప్రయోజనం పొందడానికి బందీలను పనిచేసే గుంపులుగా ఏర్పాటు చేశాడు, అప్పట్లో విజయం సాధించిన రాజులు సాధారణంగా అలా చేసేవారని రుజువులు చూపిస్తున్నాయి.” అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తూ ఆడమ్ క్లార్క్ ఇలా వ్యాఖ్యానించాడు: “కాబట్టి దాని భావం, దావీదు వారిని బానిసలుగా చేసుకొని రంపపు పనికి, ఇనుప సమ్మెటలను తయారు చేయడానికి, లేదా సొరంగాలు త్రవ్వడానికి . . . కలప నరకడానికి, ఇటుకలు తయారు చేయడానికి వారిని ఉపయోగించుకున్నాడు. దావీదు అమ్మోనీయులతో క్రూరంగా ప్రవర్తించడం ఎలా సరైనది కాదో అలాగే మనుష్యులను రంపాలతో కోయడం, రెండుగా చీల్చడం, ముక్కలుగా నరకడం, కోయడం అని ఆ లేఖనాలను అర్థం చేసుకోవడం కూడా సరైనది కాదు.”
ఈ మరింత ఖచ్చితమైన అవగాహనను ప్రతిబింబిస్తూ ఎన్నో ఆధునిక అనువాదాలు, దావీదు అమానుషంగా ప్రవర్తించాడని నిందించడం తప్పని స్పష్టం చేశాయి. * పరిశుద్ధ బైబల్, ఈజీ-టు-రీడ్ వర్షన్‌లో ఆ వచనాలు ఎలా అనువదించబడ్డాయో గమనించండి: “దావీదు రబ్బా నగర వాసులను బయటకు తీసుకొని వచ్చాడు. వారందరినీ రంపములతోను, పలుగులతోను, గొడ్డళ్లతోను పని చేయించాడు. వారందరినీ ఇటుకలతో కట్టడాలను నిర్మించేలా చేశాడు. అమ్మోనీయుల నగరాలన్నిటిలో దావీదు ఇలాగే చేయించాడు.” (2 సమూయేలు 12:31) “రబ్బా నగర వాసులను దావీదు తీసుకొనివచ్చి వారిచే రంపాలతోను, ఇనుప సమ్మెటలతోను, గొడ్డళ్లతోను బలవంతంగా పని చేయించాడు. ప్రతి అమ్మోనీయుల నగరంలోను దావీదు ఈ విధంగానే చేసాడు.” (1 దినవృత్తాంతములు 20:3) పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితంలోని అనువాదంలో కూడా ఈ వచనాలు విద్వాంసుల ప్రస్తుత అవగాహన ప్రకారమే ఉన్నాయి: “అక్కడి వాళ్ళను బయటికి తెప్పించి రంపాలతో, పదునుగల ఇనుప పనిముట్లతో, గొడ్డండ్లతో పని చేసేలా ఇటికలు చేసేలా దావీదు చేశాడు.” (2 సమూయేలు 12:31) “అక్కడివాళ్ళను బయటికి తెప్పించి రంపాలతో, వాడి అయిన ఇనుప పనిముట్లతో, గొడ్డండ్లతో వాళ్ళచేత పని చేయించాడు. అమ్మోనువాళ్ళ పట్టణాలన్నిటికీ అతడు ఆ విధంగా చేశాడు.”—1 దినవృత్తాంతాలు 20:3.
దావీదు తాను జయించిన అమ్మోనీయులను చిత్రహింసలు పెట్టి సామూహికంగా సంహరించలేదు. ఆయన తన కాలంలోని పాశవికమైన, క్రూరమైన యుద్ధాచారాలను పాటించలేదు.
[అధస్సూచి]
^ పేరా 6 హీబ్రూ మూలంపాఠంలోని అక్షర రూపం మారితే దానిని “వారిని రంపాలతో కోయించెను” అని చదవవచ్చు లేదా “రంపాలతో వాళ్ళచేత పని చేయించెను” అని చదవవచ్చు. అంతేకాకుండా “ఇటుక ఆవము” అని అనువదించబడిన పదానికి “ఇటుక అచ్చు” అనే అర్థం కూడా ఉంది. ఒక వ్యక్తిని అలాంటి అచ్చులో వేయడానికి అది మరీ చిన్నగా ఉంటుంది.