కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ గుర్తింపును కాపాడుకోవడం

మన క్రైస్తవ గుర్తింపును కాపాడుకోవడం

మన క్రైస్తవ గుర్తింపును కాపాడుకోవడం

“మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.”​—⁠యెషయా 43:12.

రాజ్యమందిరంలో ఉన్నప్పుడు, ఒకసారి చుట్టూ పరికించి చూడండి. ఆ ఆరాధనా స్థలంలో మీకు ఎవరు కనబడతారు? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శ్రద్ధగా నేర్చుకుంటున్న యథార్థవంతులైన యౌవనులు మీకు కనబడవచ్చు. (కీర్తన 148:​12, 13) కుటుంబ జీవితాన్ని దిగజారుస్తున్న ఈ లోకంలో జీవిస్తూనే దేవుణ్ణి సంతోషపెట్టడానికి కృషి చేస్తున్న కుటుంబ యజమానులు మీకు కనబడవచ్చు. అలాగే వృద్ధాప్య సమస్యలు ఉన్నప్పటికీ యెహోవాకు చేసుకున్న సమర్పణకు అనుగుణంగా నమ్మకంగా జీవిస్తున్న ప్రియమైన వృద్ధులు కూడా మీ దృష్టికి రావచ్చు. (సామెతలు 16:​31) అందరూ యెహోవాను ప్రగాఢంగా ప్రేమిస్తున్నవారే. వారితో ఆయన సంతోషంగా తన బంధాన్ని స్థిరపరచుకున్నాడు. అందుకే దేవుని కుమారుడు, “నన్ను పంపిన తండ్రి ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు” అని నొక్కిచెప్పాడు.​—⁠యోహాను 6:37, 44, 65.

2 మనం యెహోవా ఆమోదం, ఆశీర్వాదం ఉన్న ప్రజల్లో ఒకరిగా ఉండడానికి సంతోషించమా? అయితే, ‘అపాయకరమైన ఈ అంత్యదినాల్లో’ క్రైస్తవులముగా మన గుర్తింపును గురించిన బలమైన అవగాహనను జాగ్రత్తగా కాపాడుకోవడం ఒక సవాలే. (2 తిమోతి 3:⁠1) ప్రత్యేకించి క్రైస్తవ కుటుంబాల్లో పెరుగుతున్న యౌవనుల విషయంలో ఇది నిజం. ఒక యౌవనుడు, “నేను క్రైస్తవ కూటాలకు హాజరవుతున్నా, నాకు ఎలాంటి ఆధ్యాత్మిక లక్ష్యాలూ లేవు, నిజానికి యెహోవాను సేవించాలనే కోరికే నాకు లేదు” అని ఒప్పుకున్నాడు.

3 కొందరు, యెహోవాను సేవించాలని యథార్థంగా కోరుకుంటున్నప్పటికీ, తోటివారి తీవ్ర ఒత్తిడి, ప్రాపంచిక ప్రభావాలు, పాపభరిత స్వభావాల కారణంగా తప్పుదారి పట్టవచ్చు. మనం ఒత్తిడికి గురైనప్పుడు అది క్రమేణా మనం మన క్రైస్తవ గుర్తింపును పోగొట్టుకునేలా చేయవచ్చు. ఉదాహరణకు, నేడు ప్రపంచంలో చాలామంది, బైబిలు నైతిక ప్రమాణాలు పాతబడిపోయాయనీ లేదా అవి మన ఆధునిక ప్రపంచానికి పనికిరావనీ భావిస్తున్నారు. (1 పేతురు 4:⁠4) కొందరేమో దేవుడు నిర్దేశించిన దానికి అనుగుణంగా ఆయనను ఆరాధించడం అంత ప్రాముఖ్యం కాదని అనుకుంటారు. (యోహాను 4:​24) పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో ఈ లోకపు ‘శక్తి’ లేదా ఈ లోకంలో ప్రబలంగా ఉన్న వైఖరి గురించి మాట్లాడాడు. (ఎఫెసీయులు 2:⁠2) ఆ వైఖరి, యెహోవా గురించి తెలియని సమాజపు ఆలోచనలకు కట్టుబడి ఉండాలని ప్రజల మీద ఒత్తిడి తెస్తుంది.

4 అయితే యెహోవా సమర్పిత సేవకులముగా మనం వృద్ధులమైనా, యౌవనులమైనా మన క్రైస్తవ గుర్తింపును కోల్పోవడం శోచనీయమైన విషయమని గ్రహించాలి. క్రైస్తవ గుర్తింపును గురించిన ఆరోగ్యదాయకమైన అవగాహన కేవలం యెహోవా ప్రమాణాల మీద, మన విషయంలో ఆయన కోరే అంశాల మీద మాత్రమే ఆధారపడి ఉండగలదు. ఎంతైనా, మనమాయన స్వరూపంలో సృష్టించబడ్డాం. (ఆదికాండము 1:26; మీకా 6:⁠8) స్పష్టమైన మన క్రైస్తవ గుర్తింపును బైబిలు, మనం ధరించే వస్త్రాలకు పోలుస్తుంది, అవి అందరికీ కనబడతాయి. మన కాలాల గురించి యేసు ఇలా హెచ్చరించాడు: “ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు.” * (ప్రకటన 16:​15) మనం మన క్రైస్తవ లక్షణాలను, ప్రవర్తనా ప్రమాణాలను విడిచిపెట్టి సాతాను లోకం ప్రకారం మారాలని కోరుకోము. ఒకవేళ అలా జరిగితే మనం మన ‘వస్త్రాలను’ పోగొట్టుకున్నవాళ్ళమవుతాం. అయితే అలాంటి పరిస్థితి విషాదకరంగా, అవమానకరంగా ఉంటుంది.

5 క్రైస్తవ గుర్తింపును గురించిన లోతైన అవగాహన, ఒక వ్యక్తి జీవన విధానం మీద బలమైన ప్రభావం చూపిస్తుంది. ఎలా? యెహోవా ఆరాధకుడు ఎవరైనా తన గుర్తింపును గురించిన స్పష్టమైన అవగాహనను పోగొట్టుకుంటే, ఆయన సరైన నిర్దేశం లేదా లక్ష్యాలు లేక అనిశ్చిత స్థితిలోవున్న వ్యక్తిగా తయారవుతాడు. అలాంటి అనిశ్చిత స్థితి గురించి బైబిలు పదేపదే హెచ్చరిస్తోంది. “సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు” అని శిష్యుడైన యాకోబు హెచ్చరించాడు.​—⁠యాకోబు 1:6-8; ఎఫెసీయులు 4:14; హెబ్రీయులు 13:9.

6 మనం మన క్రైస్తవ గుర్తింపును ఎలా కాపాడుకోవచ్చు? సర్వోన్నతుని ఆరాధకులముగా మనకున్న మహాగొప్ప ఆధిక్యత విషయంలో మన అవగాహనను మెరుగుపరచుకోవడానికి మనకు ఏమి సహాయం చేయగలదు? దయచేసి ఈ క్రింది మార్గాలను పరిశీలించండి.

మీ క్రైస్తవ గుర్తింపును స్థిరపరచుకోండి

7యెహోవాతో మీ సంబంధాన్ని అనునిత్యం బలపరచుకోండి. ఒక క్రైస్తవునికి ఉన్న అమూల్యమైన ఆస్తి దేవునితో ఆయనకున్న వ్యక్తిగత సంబంధమే. (కీర్తన 25:14; సామెతలు 3:​32) మన క్రైస్తవ గుర్తింపు విషయంలో మనకు సందేహాలు రావడం ఆరంభమైతే, అది దేవునితో మనకున్న సంబంధ నాణ్యతను, ప్రగాఢతను జాగ్రత్తగా పరిశీలించుకోవలసిన సమయం. కీర్తనకర్త సముచితంగానే ఇలా వేడుకున్నాడు: “యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము; నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము.” (కీర్తన 26:⁠2) అలా పరీక్షించుకోవడం ఎందుకు ఆవశ్యకం? ఎందుకంటే మన లోతైన ఉద్దేశాలేమిటో, మన అంతరంగ కోరికలేమిటో మనంతట మనమే ఖచ్చితంగా గ్రహించలేము. ఒక్క యెహోవా మాత్రమే మన అంతరంగ పురుషుణ్ణి అంటే మన ఉద్దేశాలను, తలంపులను, భావావేశాలను అర్థం చేసుకోగలడు.​—⁠యిర్మీయా 17:9, 10.

8 మనల్ని పరీక్షించమని యెహోవాను అడగడం ద్వారా, మనల్ని పరిశీలించమని ఆయనను ఆహ్వానిస్తాం. అప్పుడాయన మన నిజ ఉద్దేశాలను, హృదయ స్థితిని వెల్లడిచేసే పరిస్థితులు తలెత్తడానికి అనుమతించవచ్చు. (హెబ్రీయులు 4:12, 13; యాకోబు 1:​22-25) మనం అలాంటి పరీక్షల కోసం ఎదురుచూడాలి, ఎందుకంటే అవి యెహోవాపట్ల మనకు ఎంత యథార్థత ఉందో కనబరిచే అవకాశాన్నిస్తాయి. అలాంటి పరీక్షలు మనం ‘సంపూర్ణులుగా, అనూనాంగులుగా ఏ విషయంలోనూ కొదువలేని వారిగా’ ఉన్నామో లేదో చూపిస్తాయి. (యాకోబు 1:​2-4) అలాంటి పరీక్షలను ఎదుర్కోవడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశముంది.​—⁠ఎఫెసీయులు 4:​22-24.

9అధ్యయనం ద్వారా బైబిలు సత్యాన్ని మీకు మీరు నిరూపించుకోండి. యెహోవా సేవకులముగా మన గుర్తింపు విషయంలో మన అవగాహన, లేఖనాల పరిజ్ఞానం మీద బలంగా ఆధారపడకపోతే అది బలహీనం కాగలదు. (ఫిలిప్పీయులు 1:​9, 10) వృద్ధుడైనా, యౌవనుడైనా ప్రతీ క్రైస్తవుడు తాను నమ్ముతున్నది నిజంగా బైబిల్లోవున్న సత్యమే అని తనకు సంతృప్తి కలిగేలా నిర్ధారించుకోవాలి. పౌలు తన తోటి విశ్వాసులకు ఇలా ఉద్బోధించాడు: “సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.” (1 థెస్సలొనీకయులు 5:​21) దైవభక్తిగల కుటుంబాల్లోని యౌవన క్రైస్తవులు, తాము కేవలం తమ తల్లిదండ్రుల విశ్వాసం ఆధారంగా నిజ క్రైస్తవులుగా చెలామణి కాలేమని గ్రహించాలి. సొలొమోను తండ్రి అయిన దావీదు ఆయనకు ఇలా చెప్పాడు: ‘నీ తండ్రియొక్క దేవుడైన యెహోవాను నీవు తెలిసికొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము.’ (1 దినవృత్తాంతములు 28:⁠9) యువ సొలొమోను, తన తండ్రి యెహోవా మీద విశ్వాసాన్ని ఎలా వృద్ధిచేసుకున్నాడో గమనిస్తేనే సరిపోదు. ఆయన తనకు తానుగా యెహోవాను తెలుసుకోవాలి, ఆయన అలాగే తెలుసుకున్నాడు. ఆయన దేవుణ్ణి ఇలా వేడుకున్నాడు: “నేను ఈ జనులమధ్యను ఉండి కార్యములను చక్క పెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము.”​—⁠2 దినవృత్తాంతములు 1:10.

10 బలమైన విశ్వాసం పరిజ్ఞానమనే పునాది మీద కట్టబడుతుంది. అయితే “వినుట వలన విశ్వాసము కలుగును” అని పౌలు చెప్పాడు. (రోమీయులు 10:​17) అలా చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? దేవుని వాక్యానుసారమైన పరిజ్ఞానం సంపాదించుకోవడం ద్వారా మనం యెహోవా మీద, ఆయన వాగ్దానాల మీద, ఆయన సంస్థ మీద మన విశ్వాసాన్నీ నమ్మకాన్నీ వృద్ధి చేసుకుంటామని ఆయన సూచిస్తున్నాడు. బైబిలుకు సంబంధించిన ప్రశ్నలను నిష్కపటంగా అడగడం నమ్మదగిన జవాబులు పొందడానికి దారితీస్తుంది. అంతేగాక, మనం రోమీయులు 12:2లో పౌలు ఇచ్చిన ఈ సలహాను చూస్తాం: “ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొ[నుడి].” కానీ మనం ఎలా పరీక్షించగలం? “సత్యవిషయమైన అనుభవజ్ఞానము” సంపాదించుకోవడం ద్వారా. (తీతు 1:⁠1) కష్టతరమైన అంశాలను సైతం అర్థం చేసుకోవడానికి యెహోవా ఆత్మ మనకు సహాయం చేయగలదు. (1 కొరింథీయులు 2:​11, 12) ఏదైనా విషయం అర్థం చేసుకోవడం మనకు కష్టంగా ఉంటే దేవుని సహాయం కోసం మనం ప్రార్థించాలి. (కీర్తన 119:​10, 11, 27) మనం తన వాక్యాన్ని అర్థం చేసుకోవాలనీ, దానిని నమ్మాలనీ, దానికి లోబడాలనీ యెహోవా కోరుకుంటున్నాడు. సరైన ఉద్దేశంతో నిష్కపటంగా అడిగే ప్రశ్నలను ఆయన స్వాగతిస్తాడు.

దేవుణ్ణి సంతోషపెట్టాలని నిశ్చయించుకోండి

11మనిషిని కాదుగానీ దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. మనం ఒక గుంపుకు చెందడం ద్వారా మన గుర్తింపును స్థాపించుకోవడం సహజమైనదే. మనలో ప్రతి ఒక్కరికీ స్నేహితులు అవసరం, ఇతరులు మనల్ని అంగీకరించడం మనకు సంతోషాన్నిస్తుంది. యౌవనంలోనూ ఆ తర్వాతి జీవితంలోనూ తోటివారి ఒత్తిడి బలంగా ఉండవచ్చు, అది ఇతరులను అనుకరించాలనే లేదా సంతోషపెట్టాలనే తీవ్రమైన కోరిక కలిగేలా చేస్తుంది. కానీ స్నేహితులు, తోటివారు అన్ని సందర్భాల్లో మన శ్రేయస్సు విషయంలో శ్రద్ధ చూపించరు. కొన్నిసార్లు వారు కేవలం తప్పు చేయడానికి మన సాంగత్యాన్ని కోరుకుంటారు. (సామెతలు 1:​11-19) ఒక క్రైస్తవుడు తోటివారి ప్రతికూల ఒత్తిడికి లొంగిపోయినప్పుడు, ఆయన సాధారణంగా తన గుర్తింపును దాచిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. (కీర్తన 26:⁠4) అందుకే అపొస్తలుడైన పౌలు “ఈ లోకం తీరును అనుసరిస్తూ జీవించకండి” అని హెచ్చరించాడు. (రోమీయులు 12:​2, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మనం లొంగిపోయేలా చేసే, బయటి నుండి వచ్చే ఎలాంటి ఒత్తిడినైనా ఎదిరించేందుకు మనకు అవసరమైన అంతరంగ శక్తిని యెహోవా ఇస్తాడు.​—⁠హెబ్రీయులు 13:6.

12 లోకం నుండి వచ్చే ఒత్తిడి మన క్రైస్తవ గుర్తింపును గురించిన అవగాహనను పాడుచేసే ప్రమాదం కనబడినప్పుడు, ప్రజాభిప్రాయం కన్నా లేదా అధికశాతం ప్రజలు సాధారణంగా భావించేదానికన్నా దేవునిపట్ల విశ్వసనీయంగా ఉండడమే మరెంతో ప్రాముఖ్యం అని మనం గుర్తుంచుకోవాలి. నిర్గమకాండము 23:2లోని ఈ మాటలు, అందుకు సురక్షిత సూత్రంగా పనిచేస్తాయి: “దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు.” ఇశ్రాయేలీయుల్లో అధికశాతం మంది, వాగ్దానాలు నెరవేర్చే విషయంలో యెహోవా సామర్థ్యాన్ని శంకించినప్పుడు కాలేబు వారితో ఏకీభవించకుండా స్థిరంగా ఎదిరించాడు. దేవుని వాగ్దానాలు విశ్వసనీయమైనవని ఆయన గట్టిగా నమ్మాడు, ఆ వైఖరి కారణంగా ఆయన మంచి ప్రతిఫలం పొందాడు. (సంఖ్యాకాండము 13:30; యెహోషువ 14:​6-11) అదే విధంగా, మీరు కూడా దేవునితో మీకున్న సంబంధాన్ని కాపాడుకోవడానికి, అధికశాతం ప్రజల నుండి వచ్చే ఒత్తిడిని స్థిరంగా ఎదిరించడానికి ఇష్టపడుతున్నారా?

13మీ క్రైస్తవ గుర్తింపును వెల్లడి చేయండి. మన క్రైస్తవ గుర్తింపును సమర్థించుకునే విషయానికి వచ్చినప్పుడు, చొరవ తీసుకోవడమే శ్రేష్ఠమైన రక్షణ అనే సూత్రం వర్తిస్తుంది. ఎజ్రా కాలంలో నమ్మకస్థులైన ఇశ్రాయేలీయులు, యెహోవా చిత్త ప్రకారం చేస్తున్న తమ ప్రయత్నాలకు వ్యతిరేకత ఎదురైనప్పుడు ఇలా అన్నారు: “మేము భూమ్యాకాశముల దేవునియొక్క సేవకులము.” (ఎజ్రా 5:​11) మనం వ్యతిరేకుల ప్రతికూల క్రియలకు, విమర్శలకు గురైనప్పుడు భయంతో కుంచించుకుపోవచ్చు. అందరినీ మెప్పించాలనే తలంపు మన ప్రయోజకత్వాన్ని బలహీనం చేస్తుంది. కాబట్టి భయపడకండి. మీరు ఒక యెహోవాసాక్షి అని ఇతరులకు స్పష్టంగా తెలియజేయడం అన్ని సమయాల్లో మంచిది. గౌరవంగానే అయినా స్థిరంగా క్రైస్తవునిగా మీ విలువలు, మీ నమ్మకాలు, మీ స్థానం గురించి ఇతరులకు మీరు వివరించవచ్చు. నైతిక విషయాల్లో మీరు యెహోవా ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండడానికి నిశ్చయించుకున్నట్లు ఇతరులకు తెలియనివ్వండి. మీ క్రైస్తవ యథార్థత రాజీపడేది కాదని స్పష్టం చేయండి. మీ నైతిక ప్రమాణాలు మీకు అతిశయ కారణమని చూపించండి. (కీర్తన 64:​10) స్థిరమైన క్రైస్తవునిగా ప్రత్యేకంగా ఉండడం మిమ్మల్ని బలపరచి, కాపాడడమే కాక, ఇంకా కొందరు యెహోవా గురించి, ఆయన ప్రజల గురించి తెలుసుకోవడానికి కూడా పురికొల్పుతుంది.

14 కొందరు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు. (యూదా 17, 18) కానీ మీ విలువలను వివరించాలనే మీ ప్రయత్నాలకు ఇతరుల నుండి సానుకూలమైన ప్రతిస్పందన రానప్పుడు నిరుత్సాహపడకండి. (యెహెజ్కేలు 3:​7, 8) మీరెంత దృఢసంకల్పంతో ఉన్నా, ఒప్పుకోవాలనే కోరికలేని ప్రజలను మీరు ఒప్పించడం అసాధ్యం. ఫరో విషయమే తీసుకోండి. ఏ ఒక్క తెగులు లేదా అద్భుతం కూడా​—⁠చివరకు అతని జ్యేష్ఠ కుమారుని మరణం కూడా, మోషే యెహోవా తరఫున మాట్లాడుతున్నాడని ఫరోను ఒప్పించలేకపోయాయి. కాబట్టి మనుష్యుల భయం మీరు కుంచించుకుపోయేలా చేయనివ్వకండి. భయాన్ని అధిగమించడానికి దేవుని మీది విశ్వాసనమ్మకాలే మనకు సహాయం చేయగలవు.​—⁠సామెతలు 3:​5, 6; 29:25.

గతం నుండి నేర్చుకుంటూ భవిష్యత్తును నిర్మించుకోండి

15మీ ఆధ్యాత్మిక వారసత్వాన్ని విలువైనదిగా పరిగణించండి. దేవుని వాక్యపు వెలుగులో, తమ సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని ధ్యానించడం ద్వారా క్రైస్తవులు ప్రయోజనం పొందుతారు. ఈ వారసత్వంలో యెహోవా వాక్య సత్యం, నిత్యజీవ నిరీక్షణ, సువార్త ప్రచారకులుగా దేవునికి ప్రాతినిథ్యం వహించే ఘనత ఉన్నాయి. ఆయన సాక్షుల్లో అంటే, రాజ్యాన్ని ప్రకటించే రక్షణార్థమైన పని చేసే ఆధిక్యత ఇవ్వబడిన ప్రజల్లో మీ పాత్ర ఏమిటో మీరు చూడగలుగుతున్నారా? “మీరే నాకు సాక్షులు” అని నొక్కిచెప్పింది ఎవరోకాదు స్వయంగా యెహోవాయేనని గుర్తుంచుకోండి.​—⁠యెషయా 43:10.

16 మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఈ ఆధ్యాత్మిక వారసత్వాన్ని నేను ఎంత విలువైనదిగా ఎంచుతున్నాను? దాన్ని నేను నా జీవితంలో దేవుని చిత్తం చేయడమే అత్యంత ప్రధాన అంశంగా చేసుకునేంత అమూల్యమైనదిగా పరిగణిస్తున్నానా? ఆ వారసత్వం విషయంలో నాకున్న కృతజ్ఞతా భావం, దాన్ని పోగొట్టుకోవడానికి దారితీసే ఎలాంటి శోధననైనా ఎదిరించేంత బలంగా ఉందా?’ మన ఆధ్యాత్మిక వారసత్వం, కేవలం యెహోవా సంస్థతో ఉన్నవారు మాత్రమే అనుభవించే, ఆధ్యాత్మికంగా సురక్షితంగా ఉన్నామనే ప్రగాఢమైన భావాన్ని కూడా మనలో కలిగించగలదు. (కీర్తన 91:​1, 2) యెహోవా సంస్థ యొక్క ఆధునిక చరిత్రలోని అసాధారణ సంఘటనలను సమీక్షించడం, ఏ వ్యక్తైనా లేదా మరేదైనా యెహోవా ప్రజలను భూమ్మీద నుండి తుడిచివేయడం అసాధ్యమనే నమ్మకాన్ని మనలో బలంగా కలిగిస్తుంది.​—⁠యెషయా 54:17; యిర్మీయా 1:19.

17 అయితే, మనం మన ఆధ్యాత్మిక వారసత్వం మీదే పూర్తిగా ఆధారపడలేము. మనలో ప్రతీ ఒక్కరం దేవునితో సన్నిహిత సంబంధాన్ని వృద్ధి చేసుకోవాలి. ఫిలిప్పీలోని క్రైస్తవుల విశ్వాసాన్ని బలపరచడానికి తీవ్రంగా శ్రమించిన తర్వాత పౌలు వారికి ఇలా వ్రాశాడు: “కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమేగాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.” (ఫిలిప్పీయులు 2:​12) మన రక్షణ కోసం మనం మరెవరి మీదనో ఆధారపడలేం.

18క్రైస్తవ కార్యకలాపాల్లో నిమగ్నులై ఉండండి. “ఒక వ్యక్తి చేసే పని అతని వ్యక్తిగత గుర్తింపును తీర్చిదిద్దుతుంది” అని అంటారు. నేడు క్రైస్తవులు, స్థాపించబడిన దేవుని రాజ్య సువార్తను ప్రకటించే ఆవశ్యకమైన పని చేయాలన్న ఆజ్ఞ కింద ఉన్నారు. పౌలు ఇలా ప్రకటించాడు: ‘నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక నా పరిచర్యను ఘనపరచుచున్నాను.’ (రోమీయులు 11:​14) మన ప్రకటనా పని, లోకంలో మనల్ని విభిన్నమైన వారిగా చేయడమే కాక, ఆ పనిలో భాగం వహించడం మన క్రైస్తవ గుర్తింపును మరింత స్పష్టం చేస్తుంది. క్రైస్తవ కూటాలు, ఆరాధనా స్థలాలు నిర్మించే కార్యక్రమాలు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నించడం వంటి క్రైస్తవ సంఘ కార్యకలాపాల్లో నిమగ్నులమై ఉండడం క్రైస్తవులముగా మన గుర్తింపును గురించిన అవగాహనను మరింత ప్రగాఢం చేయగలదు.​—⁠గలతీయులు 6:9, 10; హెబ్రీయులు 10:23, 24.

స్పష్టమైన గుర్తింపు నిజమైన ఆశీర్వాదాలు తెస్తుంది

19 మనం నిజ క్రైస్తవులముగా ఉన్నందుకు మనకు లభిస్తున్న దీవెనల గురించి, ప్రయోజనాల గురించి ఒక క్షణం ఆలోచించండి. యెహోవాచే వ్యక్తిగతంగా గుర్తించబడే ఆధిక్యత మనకు లభించింది. మలాకీ ప్రవక్త ఇలా చెప్పాడు: “యెహోవాయందు భయభక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.” (మలాకీ 3:​16) దేవుడు మనల్ని తన స్నేహితులుగా దృష్టిస్తాడు. (యాకోబు 2:​23) మన జీవితాలు స్పష్టమైన సంకల్పంతో, లోతైన అర్థంతో, ఆరోగ్యదాయకమైన ఫలవంతమైన లక్ష్యాలతో సుసంపన్నం చేయబడ్డాయి. మనకు నిత్య భవిష్యత్తుకు సంబంధించిన నిరీక్షణ ఇవ్వబడింది.​—⁠కీర్తన 37:9.

20 మీ నిజమైన గుర్తింపు, దాని విలువ దేవుడు మిమ్మల్ని ఎలా అంచనా వేస్తాడనే దాని మీదే ఆధారపడి ఉంటుంది కానీ, ప్రజలు మీ గురించి ఏమనుకుంటారనే దాని మీద కాదని గుర్తుంచుకోండి. మానవులు, అపరిపూర్ణ మానవ ప్రమాణాల ప్రకారం మన విలువను అంచనా వేయవచ్చు. అయితే దేవుని ప్రేమ, ఆయన వ్యక్తిగత శ్రద్ధ మన నిజ విలువకు ఆధారాన్నిస్తుంది, మనం ఆయన వారము. (మత్తయి 10:​29-31) తిరిగి, దేవునిపట్ల మనకున్న ప్రేమ మన గుర్తింపును గురించిన గొప్ప అవగాహనను, మన జీవితాలకు స్పష్టమైన నిర్దేశాన్ని ఇవ్వగలదు. “ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైనవాడే.”​—⁠1 కొరింథీయులు 8:⁠3.

[అధస్సూచి]

^ పేరా 6 ఈ మాటలు యెరూషలేము దేవాలయ విధులను నిర్వహించే అధిపతిని సూచిస్తూ మాట్లాడి ఉండవచ్చు. దేవాలయాన్ని కావలికాసే లేవీయులు తమ స్థానాల్లో మెలకువగా ఉన్నారో లేక నిద్రపోతున్నారో చూసేందుకు ఆ అధిపతి రాత్రి దేవాలయం చుట్టూ తిరిగి వచ్చేవాడు. నిద్రపోయిన కావలివానిని కర్రతో కొట్టడంతోపాటు, అవమానకరమైన శిక్షగా అతని పైవస్త్రం కాల్చివేయబడేది.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

క్రైస్తవులు తమ ఆధ్యాత్మిక గుర్తింపును కాపాడుకోవడం ఎందుకు ఆవశ్యకం?

మనం మన క్రైస్తవ గుర్తింపును స్థిరంగా ఎలా స్థాపించుకోగలం?

ఎవరిని సంతోషపెట్టాలనే ప్రశ్న ఎదురైనప్పుడు, మనం సరైన నిర్ణయం తీసుకోవడానికి ఏ వాస్తవాలు సహాయం చేయగలవు?

గుర్తింపును గురించిన బలమైన అవగాహన, క్రైస్తవులముగా మన భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దగలదు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యెహోవా తన దగ్గరకు ఎలాంటి ప్రజలను ఆకర్షించుకుంటాడు?

2, 3. క్రైస్తవ గుర్తింపును గురించిన బలమైన అవగాహనను జాగ్రత్తగా కాపాడుకోవడం ఎందుకు ఒక సవాలుగా ఉండగలదు?

4. క్రైస్తవులముగా మన స్పష్టమైన గుర్తింపును కాపాడుకునే మన అవసరతను యేసు ఎలా నొక్కిచెప్పాడు?

5, 6. ఆధ్యాత్మిక స్థిరత్వం ఎందుకు ఆవశ్యకం?

7. మనలను పరీక్షించమని యెహోవాను వేడుకోవడం ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది?

8. (ఎ) యెహోవా అనుమతించే పరీక్షల ద్వారా మనమెలా ప్రయోజనం పొందవచ్చు? (బి) క్రైస్తవునిగా అభివృద్ధి సాధించేందుకు మీకు ఎలాంటి సహాయం లభించింది?

9. బైబిలు బోధించేది సత్యమని మనకు మనం నిరూపించుకోవడం ఎందుకు అవసరం? వివరించండి.

10. సరైన ఉద్దేశంతో నిష్కపటమైన ప్రశ్నలు అడగడం ఎందుకు తప్పు కాదు?

11. (ఎ) ఎలాంటి సహజమైన కోరిక మనకు ఒక ఉచ్చుగా మారగలదు? (బి) తోటివారి ఒత్తిడిని తట్టుకోవడానికి మనమెలా ధైర్యం తెచ్చుకోవచ్చు?

12. దేవుని మీది నమ్మకానికి సంబంధించి స్థిరంగా ఉండేందుకు మనకు ఏ సూత్రం, ఎవరి ఉదాహరణ సహాయం చేయగలవు?

13. మనం క్రైస్తవులముగా మన గుర్తింపును వెల్లడి చేయడం ఎందుకు జ్ఞానయుక్తం?

14. ఎగతాళి లేదా వ్యతిరేకత మనకు నిరుత్సాహం కలిగించాలా? వివరించండి.

15, 16. (ఎ) మన ఆధ్యాత్మిక వారసత్వం అంటే ఏమిటి? (బి) దేవుని వాక్య వెలుగులో, మన ఆధ్యాత్మిక వారసత్వం గురించి ధ్యానించడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

17. కేవలం మన ఆధ్యాత్మిక వారసత్వం మీద ఆధాపడడం కన్నా ఇంకా ఎక్కువ ఏమి అవసరం?

18. క్రైస్తవ కార్యకలాపాలు మన క్రైస్తవ గుర్తింపును గురించిన అవగాహనను ఎలా మరింత ప్రగాఢం చేయగలవు?

19, 20. (ఎ) క్రైస్తవునిగా ఉన్నందుకు వ్యక్తిగతంగా మీరెలాంటి ప్రయోజనాలు అనుభవించారు? (బి) మన నిజమైన గుర్తింపుకు ఏది మనకు ఆధారాన్నిస్తుంది?

[21వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవ కార్యకలాపాల్లో నిమగ్నులమై ఉండడం మన క్రైస్తవ గుర్తింపును మరింత స్పష్టం చేయగలదు