కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు చూసిన అద్భుతాలు!

మీరు చూసిన అద్భుతాలు!

మీరు చూసిన అద్భుతాలు!

అద్భుతం అనే పదానికి “ఎంతో విశేషమైన లేదా అసాధారణమైన సంఘటన, సంగతి లేక కార్యం” అనే రెండవ అర్థం కూడా ఉంది. దేవుడు నేరుగా జోక్యం చేసుకోకుండా జరిగే ఇలాంటి అద్భుతాన్ని మనమందరం చూశాము.

ప్రకృతిలోని భౌతిక సూత్రాలకు సంబంధించిన జ్ఞానం అధికంగా సంపాదించుకోవడం మూలంగా మానవులు ఒకప్పుడు సాధారణంగా అసాధ్యమని భావించబడిన వాటిని ఇప్పుడు సాధించగలుగుతున్నారు. ఉదాహరణకు, వంద సంవత్సరాల క్రితం, నేడు కంప్యూటర్లు, టీవీ, అంతరిక్ష సాంకేతికత, అలాంటివే ఆధునిక దిన అభివృద్ధులు సాధిస్తున్నవాటిని చాలామంది బహుశా అసాధ్యమని తలంచి ఉండవచ్చు.

కొంతమంది శాస్త్రజ్ఞులు దేవుని సృష్టిలోని వైజ్ఞానిక అద్భుతాలకు సంబంధించి తమకు కేవలం పాక్షిక జ్ఞానమే ఉందని గుర్తించి, ఇప్పుడిక ఏదైనా పూర్తిగా అసాధ్యమని ఖచ్చితంగా చెప్పలేము అని అంగీకరిస్తున్నారు. అలా జరగకపోవచ్చు అని మాత్రమే చెప్పడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఆ విధంగా వాళ్ళు భవిష్యత్‌ “అద్భుతాలకు” మార్గాన్ని తెరిచి ఉంచుతున్నారు.

“సహజాతీత మూలం వల్లనే జరుగుతున్నాయని చెప్పబడుతున్న” వాటిని సూచిస్తూ, మనం “అద్భుతానికి” ఉన్న ప్రాథమిక అర్థాన్ని తీసుకున్నా, మనలో ప్రతి ఒక్కరం అద్భుతాలను చూశామని చెప్పవచ్చు. ఉదాహరణకు, మనం సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను చూస్తాము, ఇవన్నీ “సహజాతీత మూలం” నుండి అంటే స్వయంగా సృష్టికర్త నుండి ఉత్పన్నమైనవే. అంతేగాక, మానవ శరీరం ఎలా పనిచేస్తుందో, మెదడు ఎలా పనిచేస్తుందో, లేక మానవ పిండం ఎలా వృద్ధి చెందుతుందో ఎవరు పూర్తిగా వివరించగలరు? ద బాడీ మెషీన్‌ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “కేంద్రనాడీ వ్యవస్థచే నియంత్రించబడి, సమన్వయంతో పనిచేసే మానవ శరీరం సంక్లిష్టమైన జ్ఞానేంద్రియాల పరికరం, స్వీయ నియంత్రణతో కదిలే యంత్రం, స్వీయ పునరుత్పాదక కంప్యూటర్‌. అది అద్భుతమైన, అనేక విధాలుగా అగమ్యగోచరమైన సృష్టి.” మానవ శరీరాన్ని సృష్టించిన దేవుడు నిజంగా ఒక అద్భుతాన్ని చేశాడు, అది ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తోంది. అయితే మీరు చూసిన ఇతర విధాలైన అద్భుతాలు కూడా ఉన్నాయి, కానీ మీరు వాటిని అద్భుతాలని గుర్తించి ఉండకపోవచ్చు.

ఒక పుస్తకం ఒక అద్భుతం కాగలదా?

మరే పుస్తకమూ బైబిలు అంతగా పంపిణీ చేయబడడం లేదు. దానిలో మీకు ఏదైనా అద్భుతం కనిపిస్తోందా? దాని ఉనికిని మనం “సహజాతీత మూలానికి” ఆపాదించవచ్చా? నిజమే, బైబిలు మానవులు వ్రాసిన పుస్తకమే, కానీ వారు దానిలో తమ స్వంత తలంపులు కాదుగానీ దేవుని తలంపులు వ్యక్తం చేశారు. (2 సమూయేలు 23:1, 2; 2 పేతురు 1:​20, 21) దీని గురించి ఆలోచించండి. బైబిలును వ్రాసింది దాదాపు 40 మంది వ్యక్తులు, వారు 1,600 కంటే ఎక్కువ సంవత్సరాల కాలనిడివిలో జీవించిన వ్యక్తులు. వారు గొఱ్ఱెలకాపరులు, సైనికులు, జాలరులు, ప్రభుత్వోద్యోగులు, వైద్యులు, యాజకులు, రాజులు వంటి విభిన్న నేపథ్యాల నుండి వచ్చినవారు. అయినప్పటికీ, వారు సత్యవంతమైన, ఖచ్చితమైన నిరీక్షణగల ఐక్య సందేశాన్ని అందజేయగలిగారు.

యెహోవాసాక్షులు జాగ్రత్తగా అధ్యయనం చేసి, అపొస్తలుడైన పౌలు వ్రాసినట్లుగా, బైబిలును “మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని” అంగీకరిస్తారు. (1 థెస్సలొనీకయులు 2:​13) వారి ప్రచురణలు గడిచిన అనేక సంవత్సరాల్లో, బైబిల్లో పరస్పర విరుద్ధమని పిలువబడే అంశాలను దాని యావత్‌ సందేశంతో ఎలా పొందికపరచవచ్చో చూపించాయి. దానిలోని అంతర్గత సామరస్యమే దేవుడు దాని రచయిత అనడానికి నిదర్శనం. *

బైబిలును నాశనం చేయడానికి జరిగినన్ని తీవ్రమైన ప్రయత్నాలు మరే పుస్తకం విషయంలోనూ జరగలేదు. అయినా అది ఇప్పటికీ ఉనికిలో ఉంది, అదీ కనీసం కొంత భాగమైనా 2,000 కంటే ఎక్కువ భాషల్లో లభ్యమవుతోంది. ఒక పుస్తకంగా అది ఉనికిలో ఉండడం, దాని అంతర్గత సామరస్యత చెక్కు చెదరకుండా ఉండడం దైవిక జోక్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. బైబిలు నిజంగా ఒక అద్భుతమే!

‘సజీవమైన, బలముగల’ అద్భుతం

గత కాలాల్లో జరిగిన అద్భుతాలు అంటే అద్భుతమైన స్వస్థతలు, పునరుత్థానాలు ఇక జరగవు. కానీ రాబోయే దేవుని నూతనలోకంలో మళ్ళీ అలాంటి అద్భుతాలు, ఈసారి భూగోళవ్యాప్తంగా జరుగుతాయని నమ్మడానికి మనకు మంచి కారణం ఉంది. అవి శాశ్వత ఉపశమనాన్ని తీసుకువస్తాయి, మన ప్రస్తుత గ్రహింపుకు అందని విధంగా ఉంటాయి.

మనకు అద్భుతరీతిగా లభించిన బైబిలు, ప్రజలు తమ వ్యక్తిత్వాలను మంచిగా మార్చుకోవడానికి ప్రేరేపించడం ద్వారా, నేడు కూడా అద్భుతాలు అనదగిన వాటిని చేయగలదు. (8వ పేజీలో, “దేవునివాక్య శక్తి” అనే బాక్సులోవున్న ఒక ఉదాహరణ చూడండి.) హెబ్రీయులు 4:⁠12 ఇలా చెబుతోంది: “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” అవును, భూవ్యాప్తంగా నివసిస్తున్న 60 లక్షలకంటే ఎక్కువమందికి జీవితంలో ఒక సంకల్పాన్ని, భవిష్యత్తు కోసం అద్భుతమైన నిరీక్షణను ఇచ్చి వారి జీవితాలను మార్చేయడంలో బైబిలు కీలకపాత్ర వహించింది.

మీ జీవితంలో కూడా ఒక అద్భుతం చేయడానికి బైబిలును ఎందుకు అనుమతించకూడదు?

[అధస్సూచి]

^ పేరా 8 పరస్పర విరుద్ధమని పిలువబడుతున్న అంశాలను ఎలా పొందికపరచవచ్చనే విషయం గురించి మరింతగా పరిశోధించి చూడాలని మీరు కోరుకుంటే, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు​—⁠దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) అనే పుస్తకంలోని 7వ అధ్యాయంలో అనేక ఉదాహరణలు పరిశీలించబడ్డాయి.

[7వ పేజీలోని బాక్సు/చిత్రం]

చనిపోయాడా లేక ఇంకా బ్రతికే ఉన్నాడా?

యోహాను 19:33, 34 వచనాల ప్రకారం, యేసు మరణించిన తర్వాత, “సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.” అయితే, మత్తయి 27:​49, 50 వచనాల దగ్గర ఇవ్వబడిన అధస్సూచిని కలుపుకుని ఆ వచనాలను చదివితే, ఇది జరిగినప్పుడు యేసు ఇంకా బ్రతికే ఉన్నాడనే అర్థం స్ఫురిస్తుంది. ఎందుకీ తేడా?

నేరస్థుడిని రాత్రివేళ మ్రాను మీద అలాగే వదిలేయకూడదని మోషే ధర్మశాస్త్రం తెలియజేసింది. (ద్వితీయోపదేశకాండము 21:​22, 23) కాబట్టి యేసు కాలంలో, మ్రానుమీద వ్రేలాడదీయబడిన నేరస్థుడు సాయంకాలమవుతున్నా ఇంకా బ్రతికే ఉంటే, అతడు త్వరగా చనిపోయేలా అతని కాళ్ళు విరగగొట్టడం ఆనవాయితీ. అలా విరగగొడితే అతడు ఊపిరి తీసుకోవడానికి తనను తాను నిటారుగా నిలుపుకోలేడు. సైనికులు యేసుతోపాటు మ్రానున వ్రేలాడదీయబడిన ఇద్దరు దొంగల కాళ్ళను విరగగొట్టి యేసు కాళ్ళను విరుగగొట్టకపోవడం ఆయన చనిపోయాడనే వాళ్ళనుకున్నారని సూచిస్తోంది. సందేహ నివృత్తికి, అలాగే ఆయన పునరుత్థానం చేయబడ్డాడని ఆ తర్వాత అబద్ధంగా ప్రకటించబడకుండా ఉండేందుకూ సైనికులు బహుశా ఆయన ప్రక్కలో పొడిచి ఉంటారు.

అయితే మత్తయి 27:⁠49, 50 వచనాల దగ్గర ఇవ్వబడిన అధస్సూచిని కలుపుకుని ఆ వచనాలను చదివితే, సంఘటనల క్రమం మరో విధంగా ఉంటుంది. అక్కడిలా ఉంది: “మరియొకడు ఈటె యెత్తికొని ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్ళును కారెను. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.” అయితే ఇటాలిక్కులలో చూపించబడిన, అధస్సూచిలోని ఆ వాక్యం అన్ని ప్రాచీన బైబిలు వ్రాత ప్రతులలోనూ కనిపించదు. అది ఆ తర్వాత యోహాను సువార్తలో నుండి ఇందులోకి ఎత్తివ్రాయబడి, దురుద్దేశంతో సరైన స్థానంలో ఉంచబడలేదని చాలామంది ప్రామాణికులు విశ్వసిస్తున్నారు. అందుకే చాలా అనువాదాలు ఆ వాక్యాన్ని బ్రాకెట్ల్‌లో పెడతాయి లేదా వివరణాత్మక అధస్సూచినిస్తాయి లేదా ఆ వాక్యాన్ని మొత్తానికే విడిచిపెట్టేస్తాయి.

నూతనలోక అనువాదము (ఆంగ్లం)కు ఆధారంగా, విస్తృతంగా ఉపయోగించబడిన వెస్ట్‌కాట్‌ మరియు హార్ట్‌ సంపుటీకరించిన మూలప్రతి ఈ వాక్యాన్ని డబుల్‌ బ్రాకెట్ల్‌లో పెడుతుంది. ఈ వాక్యం “నకలు వ్రాసినవారు ప్రవేశపెట్టి ఉంటారనే బలమైన అభిప్రాయం క్రింద ఉంచబడాలి” అని అది పేర్కొంటోంది.

కాబట్టి తిరుగులేని నిదర్శనం ఏమిటంటే, యోహాను 19:33, 34 వచనాలు వాస్తవమైనవి, రోమా సైనికుడు ఈటెతో పొడవక ముందే యేసు మరణించాడు.

[8వ పేజీలోని బాక్సు/చిత్రం]

దేవునివాక్య శక్తి

విడిపోయిన దంపతుల బిడ్డగా, టీనేజి కుర్రవానిగా డెట్‌లెఫ్‌ క్రమంగా మాదక ద్రవ్యాలకు, త్రాగుడుకు, హెవీ మెటల్‌ సంగీతానికి అలవాటుపడ్డాడు. * ఆయన స్కిన్‌హెడ్‌ అని పిలువబడే గుంపులో చేరి, దౌర్జన్యపూరిత ప్రవర్తన మూలంగా పోలీసుల చేతుల్లో పడ్డాడు.

1992లో, ఈశాన్య జర్మనీలో ఒక బార్‌లో 60 మంది స్కిన్‌హెడ్‌లకు 35 మంది పంకర్‌లకు మధ్య పెద్ద గలాటా జరిగింది. థామస్‌ అనే ఒక పంకర్‌కు బాగా దెబ్బలు తగలడంతో ఆయన చనిపోయాడు. డెట్‌లెఫ్‌తో సహా ఆ గుంపులోని కొంతమంది ముఖ్యులు న్యాయవిచారణ తర్వాత జైలుపాలయ్యారు, ఈ విషయాలన్నీ వార్తల్లో విశేష ప్రాచుర్యాన్ని పొందాయి.

డెట్‌లెఫ్‌ జైలు నుండి విడుదల చేయబడిన తర్వాత, యెహోవాసాక్షులు ఆయనకొక కరపత్రం ఇచ్చారు. దాని పేరు “జీవితం ఎందుకు ఇంతగా సమస్యలతో నిండివుంది?” దానిలో తెలియజేయబడిన విషయాల సత్యత్వాన్ని డెట్‌లెఫ్‌ వెంటనే గుర్తించి, సాక్షులతో బైబిలు అధ్యయనం ప్రారంభించాడు. ఇది ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. 1996 నుండి ఆయన చురుకైన యెహోవాసాక్షిగా ఉన్నాడు.

గతంలో పంకర్‌గా ఉన్న జెక్‌ఫ్రీట్‌, మరణించిన థామస్‌కు మంచి స్నేహితుడు; జెక్‌ఫ్రీట్‌ కూడా ఆ తర్వాత సాక్షి అయ్యి ఇప్పుడు సంఘ పెద్దగా సేవ చేస్తున్నాడు. ఆయన ఒక బైబిలు ప్రసంగం ఇవ్వడానికి డెట్‌లెఫ్‌ సంఘాన్ని (అయితే, థామస్‌ తల్లి కూడా కూటాలకు అప్పుడప్పుడూ ఆ సంఘానికే వస్తుంది) సందర్శించినప్పుడు, డెట్‌లెఫ్‌ ఆయనను భోజనానికి ఆహ్వానించాడు. అదే పది సంవత్సరాల క్రితమైతే, వారి ద్వేషాగ్నిని అదుపు చేయడం కష్టమై ఉండేది. నేడు, వారి సహోదర ప్రేమ సుస్పష్టంగా కనిపిస్తోంది.

డెట్‌లెఫ్‌ అలాగే జెక్‌ఫ్రీట్‌ భూపరదైసులో థామస్‌ను తిరిగి జీవానికి ఆహ్వానించాలని ఎదురు చూస్తున్నారు. డెట్‌లెఫ్‌ ఇలా చెబుతున్నాడు: “దాని గురించి ఆలోచిస్తేనే నాకు కన్నీళ్ళు వస్తాయి. నేను చేసినదానికి ఎంతో బాధపడుతున్నాను.” యెహోవా గురించి తెలుసుకుని, బైబిలు ఇస్తున్న నిరీక్షణను బట్టి సంతోషించడానికి తాము ఇతరులకు ఇప్పుడు సహాయం చేస్తున్నట్లుగానే, అప్పుడు థామస్‌కు కూడా సహాయం చేయాలన్నదే వారిద్దరి కోరిక.

అవును, దేవుని వాక్యానికున్న శక్తి అటువంటిది!

[అధస్సూచి]

^ పేరా 25 పేర్లు మార్చబడ్డాయి.

[6వ పేజీలోని చిత్రం]

మానవ శరీరం ఒక అద్భుత సృష్టి

[చిత్రసౌజన్యం]

Anatomy Improved and Illustrated, London, 1723, Bernardino Genga