కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సాబా ద్వీపంలోని ద బాటమ్‌ అనే పల్లెకు ఎక్కివెళ్లడం

సాబా ద్వీపంలోని ద బాటమ్‌ అనే పల్లెకు ఎక్కివెళ్లడం

సాబా ద్వీపంలోని ద బాటమ్‌ అనే పల్లెకు ఎక్కివెళ్లడం

డచ్‌ ద్వీపమైన సాబా, ఒకప్పుడు కరీబియన్‌ సముద్రపు దోపిడీ దొంగలకు ఆశ్రయంగా ఉపయోగపడింది. నేడు, ప్యూర్టోరికోకు తూర్పుదిక్కున దాదాపు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న ద్వీపం జనాభా 1,600 మంది, వారిలో ఐదుగురు యెహోవాసాక్షులు. అయితే ధైర్యవంతులైన ఈ ప్రచారకులు మాత్రం దోపిడీ వస్తువుల కన్నా ఎంతో అమూల్యమైన దానికోసం అక్కడ వెదకుతున్నారు. వారు “నిత్యజీవంపట్ల సరైన మానసిక వైఖరిగల” వారి కోసం పట్టుదలతో వెదకుతున్నారు.​—⁠అపొస్తలుల కార్యములు 13:​48, NW.

యెహోవాసాక్షులు నడిపించిన 18 మీటర్ల పొడవైన సిబియా అనే పేరుగల రెండు తెరచాపల ఓడ 1952 జూన్‌ 22న సాబా తీరంలో ఆగినప్పుడు, ఆ ద్వీపానికి మొదటిసారిగా దేవుని రాజ్య సువార్త చేరుకుంది. (మత్తయి 24:​14) మిషనరీలైన గెస్త్‌ మాకీ, స్టాన్లీ కార్టర్‌లు అక్కడ దిగిన తర్వాత సాబా రాజధానిగావున్న ద బాటమ్‌ అనే పల్లెకు చేరుకోవడానికి దాదాపు 500 రాతిమెట్లతో ఉన్న ద ల్యాడర్‌ అనే మార్గంలో ఎక్కి వెళ్ళారు. * ఆ ద్వీపవాసులను చేరుకోవడానికి ఆ ఇరుకు మార్గమే శతాబ్దాలపాటు ఏకైక మార్గంగా ఉంది.

సాబాలో జరుగుతున్న సాక్ష్యపు పని గురించి, 1966 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం (ఆంగ్లం)లో మొదటిసారిగా నివేదిక ప్రచురించబడింది. ఆ నివేదిక ప్రకారం, అప్పుడు ఆ ద్వీపంలో కేవలం ఒకే ఒక క్రియాశీల సాక్షి ఉన్నాడు. తర్వాత, కెనడా నుండి వచ్చిన ఒక కుటుంబం చాలా సంవత్సరాలు అక్కడ సువార్త ప్రకటించింది. ఇటీవలి కాలంలో, ఉద్యోగ విరమణ చేసిన రస్సెల్‌, క్యాథీల జంట అమెరికా నుండి వచ్చి సాబాలో ప్రకటనా పనిలో భాగం వహించారు. వారి కథను పరిశీలించండి.

సాబాను సందర్శించడం

రొనాల్డ్‌ అతిథులుగా నేను, నా భార్య విమానంలో అక్కడికి చేరుకున్నాం, 1990వ దశకమంతటిలో ఆయన ఒక్కడే సాక్షి. మా అతిథేయి మా కోసం విమానాశ్రయంలో ఎదురు చూస్తున్నాడు. మేము ఒక చిన్న పెట్టెలో ఆయనకు కానుకగా తెచ్చిన కూరగాయలు చూసి ఆయన సంతోషించాడు, ఎందుకంటే ఆ ద్వీపంలో వ్యవసాయం వాణిజ్య దృష్టితో చేయరు. మేము చిన్న ట్రక్కు ఎక్కి, మౌంట్‌ సీనరీ మీద వంకరటింకరగా ఉన్న రోడ్డుపైన మెల్లగా వెళ్తూ నిర్జీవ అగ్ని పర్వత శిఖరం వైపు మా ప్రయాణం ప్రారంభించాం.

మేము హెల్స్‌ గేట్‌ అనే పల్లెలో ఆగాం, అక్కడి సార్వజనిక సమాచార బోర్డు మీద ఆదివారం ఇవ్వబడే బహిరంగ ప్రసంగపు ఆహ్వాన పత్రిక ఇంకా అంటించబడి ఉందో లేదోనని రొనాల్డ్‌ చూశాడు. అది అంటించబడి ఉండడం చూసి మేము ఆనందించాం. ఆయన ట్రక్కులోకి ఎక్కిన తర్వాత ఆ ద్వీపంలోని పెద్ద పల్లె అయిన విండ్‌వర్డ్‌సైడ్‌ వైపుగా మేము ఎక్కడం కొనసాగించాం. ఆ అందమైన పల్లె ద్వీపానికి గాలి వీచే దిశలో, సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తులో ఉంటుంది. రొనాల్డ్‌ ఇంటికి వెళ్ళే మార్గంలోకి రాగానే, ఆయన ఇంటి ముఖద్వారం మీద యెహోవాసాక్షుల రాజ్యమందిరం అని రంగురంగుల అక్షరాలతో ఉన్న బోర్డును మేము చూశాం.

మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు, “సాబాలో మీరు రాజ్య ప్రచారకులుగా ఎలా అయ్యారు?” అని మా సందర్శనానికి కారణమైన ప్రశ్నను ఆయనను అడిగాను.

“1993లో ప్యూర్టోరికోలో యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయ నిర్మాణం పూర్తి అయినప్పుడు, నేనూ నా భార్యా విదేశీ నియామకంలోనే ఉండాలని ఇష్టపడ్డాం” అని రొనాల్డ్‌ అన్నాడు. “అంతకుముందు మేము వేరే పయినీరు జంటతో కలిసి సాబాను సందర్శించాం, అప్పుడు ఇక్కడి జనాభా 1,400 అనీ, అయితే సాక్షులు ఎవరూ లేరనీ మాకు తెలిసింది. కాబట్టి, మేము ఇక్కడికి మారడం గురించి ప్యూర్టోరికో బ్రాంచి కమిటీతో మాట్లాడాం.

“పరిస్థితులు ఒకదాని తరువాత మరొకటి అనుకూలంగా మారాయి, చివరకు ఇక్కడికి మారడానికి మాకు అవసరమైన అనుమతి లభించింది. దుఃఖకరంగా, రెండు సంవత్సరాల తర్వాత నా భార్య తీవ్ర అనారోగ్యానికి గురైంది, దాంతో మేము కాలిఫోర్నియాకు తిరిగివెళ్ళాం. ఆమె చనిపోయిన తరువాత నేను సాబాకు తిరిగి వచ్చాను. ఎందుకంటే, ప్రారంభించిన పనిని ముగించకుండా ఉండడం నాకు ఇష్టం లేదు.”

సాబాలో ఇంటింటి పరిచర్య

నూరు సంవత్సరాల పురాతనమైన రొనాల్డ్‌ ఇంట్లోని ముందు గదిని రాజ్య మందిరంగా కూడా ఉపయోగిస్తున్నారు. * మేము బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తూ, పరిచర్యకు వెళ్ళేందుకు సిద్ధపడుతుండగా, అటునుండి వెళ్తున్న మేఘాలుకమ్మి వర్షం పడడంతో ఆరుబయట వంట చేసే ప్రాంతమంతా తడిసిపోయింది. అల్పాహారం అయిన తరువాత, మేఘాలు తేలిపోవడంతో మేము ద బోటమ్‌లో ఉదయకాలపు ఇంటింటి సాక్ష్యం ఇవ్వడానికి బయలుదేరాం. రొనాల్డ్‌ ప్రతి ఇంట్లో గృహస్థుడ్ని పేరుతో సంబోధించి పలకరించాడు. మా చర్చను ఇటీవలే స్థానికంగా జరిగిన ఘటనపై వచ్చిన వార్త మీద కేంద్రీకరించాం. రొనాల్డ్‌, ఆయన చేసే పరిచర్య చాలామందికి తెలుసు, అంతేకాక వారిలో చాలామంది బైబిలు సాహిత్యాన్ని ఇష్టంగా అంగీకరిస్తారు.

పల్లెవాసులతో మీరు చిరపరిచితులు కానట్లయితే రాజ్య సందేశం మీద ఆసక్తి చూపించిన వారి గురించిన వివరాలు గుర్తుంచుకోవడం సులభమైన పని కాదు. ఎందుకు? ఎందుకంటే రొనాల్డ్‌ చెబుతున్నట్లు “ఇళ్ళన్నిటికీ ఒకే రంగుతో రంగులు వేయాలని చట్టం ఆదేశించింది.” అది నిజమే, నేను చుట్టూ చూసి సాబాలోని ఇళ్ళన్నీ తెల్లని రంగుతో, ఎర్రటి పైకప్పుతో ఉన్నట్లు గమనించాను.

బైబిలు చర్చ ముగించిన తర్వాత, మేము గృహస్థుడ్ని రాజ్యమందిరంలో ఆదివారం నిర్వహిస్తున్న బైబిలుకు సంబంధించిన బహిరంగ ప్రసంగానికి ఆహ్వానించాం. రొనాల్డ్‌ ద్వీపంలోనే ఉంటే ప్రతివారం బహిరంగ ప్రసంగాన్ని ఇస్తాడు. ప్రస్తుతం సాబాలో 17 బైబిలు అధ్యయనాలు నిర్వహించబడుతున్నాయి. 2004లో జరిగిన క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు ఇరవైమంది హాజరయ్యారు. ఆ సంఖ్య చాలా చిన్నదే అనిపించినా అది సాబా పూర్తి జనాభాలో ఒక శాతానికి ప్రాతినిథ్యం వహిస్తోంది!

అవును, యెహోవాసాక్షులు దేవుని రక్షణ సందేశంతో సాధ్యమైనంత మందిని చేరుకోవడానికి ఎంతో కృషి చేస్తారు. అది సాబా లాంటి చిన్న ద్వీపమే కానివ్వండి లేక పూర్తిగా ఒక ఖండమే కానివ్వండి, యెహోవాసాక్షులు “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అనే ఆజ్ఞను నమ్మకంగా పాటిస్తున్నారు.​—⁠మత్తయి 28:​19.

మా సందర్శన ముగిసిపోవడంతో మేము చాలా విచారించాం. మేము విమానం ఎక్కే ముందు వీడ్కోలు చెప్పాం. సాబాకు మా సందర్శనాన్ని, ద బోటమ్‌ను ఎక్కిపోవడానికి మేము వెచ్చించిన సమయాన్ని మేము ఎప్పుడూ గుర్తుంచుకుంటాం!

[అధస్సూచీలు]

^ పేరా 3 బహుశా అది అగ్నిపర్వత శిఖర బిలానికి క్రింద ఉందని దోపిడి దొంగలు భావించారు కాబట్టి వారు దానిని ద బాటమ్‌ అని పిలిచారు.

^ పేరా 12 2003 సెప్టెంబరు 28న, అమెరికాలోని ఫ్లోరిడా నుండి వచ్చిన స్వచ్ఛంద సేవకులు సాబాకు వెళ్ళి దగ్గర్లో ఉన్న భవనానికి కొన్ని మార్పులు చేశారు, ఇప్పుడు దానిని రాజ్యమందిరంగా ఉపయోగిస్తున్నారు.

[10వ పేజీలోని మ్యాపులు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ప్యూర్టోరికో

[10వ పేజీలోని చిత్రసౌజన్యం]

నేపథ్యం: www.sabatourism.com