కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సేవకు మీరు ‘బలవంతము చేయబడినప్పుడు’

సేవకు మీరు ‘బలవంతము చేయబడినప్పుడు’

సేవకు మీరు ‘బలవంతము చేయబడినప్పుడు’

“ఏయ్‌, నిన్నే! ఆ పని ఆపుజేసి వచ్చి ఈ బస్తా మోసుకెళ్ళు.” మొదటి శతాబ్దపు యూదుడు తన పని చేసుకుంటుంటే ఒక రోమా సైనికుడు వచ్చి అతనిని అలా గదమాయిస్తే, ఆ యూదుడు ఎలా స్పందించి ఉండేవాడని అనుకుంటున్నారు? యేసు కొండమీద ఇచ్చిన ప్రసంగంలో ఈ సలహా ఇచ్చాడు: “ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము.” (మత్తయి 5:41) ఆ సలహాను యేసు శ్రోతలు ఎలా అర్థం చేసుకోవాలి? అది నేడు మనకు ఎలా వర్తిస్తుంది?

ఆ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడానికి మనం ప్రాచీన కాలాల్లోని నిర్బంధ సేవా పద్ధతి గురించి తెలుసుకోవాలి. ఆ పద్ధతి గురించి యేసు కాలంలోని ఇశ్రాయేలు నివాసులకు బాగా తెలుసు.

నిర్బంధ సేవ

సమీప ప్రాచ్య దేశాల్లో నిర్బంధ సేవ (లేదా, వెట్టిచాకిరీ) సా.శ.పూ. 18వ శతాబ్దంనుండే ఉనికిలో ఉందనడానికి రుజువులు ఉన్నాయి. ప్రాచీన సిరియన్‌ నగరమైన ఏలెలెక్‌కు చెందిన అధికారిక గ్రంథాలు, వ్యక్తిగత సేవ కోసం ప్రభుత్వమే బలవంతంగా నియమించిన వెట్టిచాకిరీ గుంపుల గురించి పేర్కొంటున్నాయి. సిరియన్‌ తీర ప్రాంతంలోని యూగరీట్‌లో, భూమిని కౌలుకు తీసుకునే రైతులకు రాజునుండి మినహాయింపు లభిస్తే తప్ప ఇలాంటి వెట్టిచాకిరీ తప్పేది కాదు.

యుద్ధంలో ఓడిపోయిన ప్రజలతో వెట్టిచాకిరీ చేయించేవారనే విషయం వేరే చెప్పనక్కర్లేదు. ఐగుప్తు అధికారులు ఇశ్రాయేలీయులను తమకు బానిసలుగా చేసుకొని వారితో బలవంతంగా ఇటుకలు చేయించారు. తర్వాత ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోని కనాను దేశస్థులను బానిసలుగా చేసుకొని వారితో చాకిరీ చేయించుకున్నారు, దావీదు సొలొమోనులు కూడా అలాగే చేశారు.​—⁠నిర్గమకాండము 1:13, 14; 2 సమూయేలు 12:31; 1 రాజులు 9:20, 21.

ఇశ్రాయేలీయులు తమకు రాజు కావాలని అడిగినప్పుడు, ఆ రాజుకు ప్రజలతో ఏమేమి చేయించుకొనే అధికారం ఉందో సమూయేలు వివరించాడు. ఆ రాజు తన పౌరులను రథసారథులుగా, గుర్రపు రౌతులుగా, భూమి దున్నడానికి, పంట కోయడానికి, యుద్ధాయుధాలు చేయడానికి ఉపయోగించుకుంటాడని ఆయన వివరించాడు. (1 సమూయేలు 8:4-17) అయితే యెహోవా ఆలయ నిర్మాణమప్పుడు అన్యులచేత బలవంతముగా వెట్టిచాకిరీ చేయించబడింది, “అయితే ఇశ్రాయేలీయులలో ఎవనినైనను సొలొమోను దాసునిగా చేయలేదు; వారు రాణువవారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి.”​—⁠1 రాజులు 9:22.

నిర్మాణ పనుల్లో ఉపయోగించబడిన ఇశ్రాయేలీయుల గురించి 1 రాజులు 5:13, 14 వచనాలు ఇలా చెబుతున్నాయి: “రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిచేతను వెట్టిపని చేయించెను; వారిలో ముప్పదివేలమంది వెట్టిపని చేయువారైరి, వీరిని అతడు వంతుల చొప్పున నెలకు పదివేలమందిని లెబానోనునకు పంపించెను; ఒక నెల లెబానోనులోను రెండు నెలలు ఇంటియొద్దను వారు ఉండిరి.” “ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు తమ నిర్మాణ పనుల కోసం లేదా తమ భూములలో పని చేయడం కోసం జీతమివ్వకుండానే పనివాళ్ళను రప్పించుకోవడానికి వెట్టిచాకిరీ పద్ధతిని ఉపయోగించేవారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు” అని ఒక విద్వాంసుడు చెప్పాడు.

సొలొమోను కాలంలో అలాంటి వెట్టిచాకిరీ మరింత భారంగా తయారయ్యింది. అది ప్రజలకు ఎంత భారంగా తయారయ్యిందంటే రెహబాము ప్రజల భారాన్ని పెంచుతానని బెదిరించినప్పుడు, ఇశ్రాయేలీయులందరూ తిరుగుబాటు చేసి వెట్టిచాకిరీ చేయించడానికి తమపై నియమించబడిన అధికారిని రాళ్ళతో కొట్టి చంపారు. (1 రాజులు 12:12-18) అయితే ఆ పద్ధతి మాత్రం రద్దు చేయబడలేదు. గెబ, మిస్పా పట్టణాలను నిర్మించడానికి రెహబాము మనవడైన ఆసా యూదా ప్రజలను పిలిపిస్తూ, “యెవరును నిలిచిపోకుండ యూదాదేశపు వారందరు రావలెనని” ఆజ్ఞాపించాడు.​—⁠1 రాజులు 15:22.

రోమా అధికారంలో

సేవ చేయడానికి ‘బలవంతము చేయబడే’ అవకాశం గురించి మొదటి శతాబ్దపు యూదులకు తెలుసని యేసు కొండమీద ఇచ్చిన ప్రసంగం చూపిస్తోంది. ఆ మాటలు అగారెవో అనే గ్రీకు పదంనుండి అనువదించబడ్డాయి, ఆ పదం ప్రాథమికంగా పర్షియన్‌ వార్తాహరుల పనికి సంబంధించినది. ప్రజా వ్యవహారాలను తొందరగా ముగించడానికి మనుష్యులను, గుర్రాలను, ఓడలను లేదా అవసరమైన దేనినైనా బలవంతంగా ఉపయోగించే అధికారం వారికి ఉండేది.

యేసు కాలంలో ఇశ్రాయేలు దేశం రోమీయుల అధికారంలో ఉంది, వారు కూడా అలాంటి పద్ధతినే పాటించేవారు. ప్రాచ్య మండలాల్లో సాధారణ పన్నులతోపాటు ప్రజలకు క్రమంగా లేదా అప్పుడప్పుడు నిర్బంధ సేవ కూడా విధించబడేది. అలాంటి సేవను ప్రజలు అస్సలు ఇష్టపడేవారు కాదు. అంతేకాకుండా రాష్ట్ర రవాణా కోసం జంతువులను, సారథులను, రథాలను అనధికారికంగా స్వాధీనం చేసుకోవడం కూడా సర్వసాధారణంగా జరిగేది. చరిత్రకారుడైన మైకల్‌ రొస్టాఫ్‌ట్జెఫ్‌ ప్రకారం, పరిపాలకులు “[ఈ పద్ధతికి] నియమాలు స్థాపించి దానిని క్రమబద్ధం చేయడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు, ఎందుకంటే ఆ పద్ధతి ఉనికిలో ఉన్నంతకాలం అది ఖచ్చితంగా దుష్ఫలితాలనే తీసుకువస్తుంది. వెట్టిచాకిరీ ద్వారా అధికారాన్ని క్రూరంగా ఉపయోగించడాన్ని, ప్రజలను అణచివేయడాన్ని ఆపుచేయాలని యథార్థంగా ప్రయత్నించిన అధికారులు ఎన్నో నియమాలను జారీ చేశారు. . . . కానీ ఆ పద్ధతి క్రూరంగా అలాగే కొనసాగింది.”

“సైన్యం సామానులను కొంత దూరం వరకూ మోయడానికి ఎవరినైనా బలవంతం చేయవచ్చు, రోమన్లు తమకు నచ్చిన పనిని ఎవరితోనైనా బలవంతంగా చేయించవచ్చు” అని ఒక గ్రీకు విద్వాంసుడు చెప్పాడు. కురేనీయుడైన సీమోను విషయంలో అదే జరిగింది, రోమా సైనికులు యేసు హింసా కొయ్యను మోయడానికి ఆయనను ‘బలవంతము చేశారు.’​—⁠మత్తయి 27:32.

ప్రజలు ద్వేషించిన ఈ పద్ధతి గురించి రబ్బీల వ్రాతలు కూడా పేర్కొంటున్నాయి. ఉదాహరణకు, గొంజి చెట్లను ఒక ప్రాంతానికి చేరవేయడానికి ఒక రబ్బీ బలవంతపెట్టబడ్డాడు. యజమానుల దగ్గరనుండి పనివాళ్లను తీసుకెళ్లి ఇతర పనులు చేయడానికి కూడా నియమించేవారు, అయితే ఆ పనివాళ్ళకు జీతాలు చెల్లించవలసిన బాధ్యత మాత్రం యజమానులకే వదిలేయబడేది. బరువులు మోసే పశువులు, ఎద్దులు కూడా స్వాధీనం చేసుకోబడేవి. ఒకవేళ అవి తిరిగి ఇవ్వబడినా, మళ్ళీ పని చేయడానికి పనికిరాని స్థితిలోనే అవి తిరిగి ఇవ్వబడేవి. ఇలా తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడం శాశ్వతంగా జప్తు చేసుకోవడంగా ఎందుకు దృష్టించబడేదో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక యూదా సామెత ఇలా ఉంది: “అగారియా అంటే అది చావుకిందే లెక్క.” ఒక చరిత్రకారుడు ఇలా చెప్పాడు: “అగారియా కోసం బరువులు మోసే పశువులకు బదులు పొలం దున్నే ఎద్దులను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఒక గ్రామం మొత్తాన్నే నాశనం చేయవచ్చు.”

ఇలాంటి పద్ధతులను ప్రజలు ఎంతగా ద్వేషించేవారో మీరే ఊహించుకోవచ్చు, ఎందుకంటే అవి అహంకారంతో, అన్యాయంగా అమలు చేయబడేవి. అన్యులు తమను పరిపాలించడాన్ని ద్వేషించే యూదులు, ఇలా కష్టించి పనిచేయడానికి బలవంతం చేయబడే అవమానకరమైన పద్ధతిని తీవ్రంగా అసహ్యించుకునేవారు. ఒక వ్యక్తిని ఎంత దూరం వరకూ బరువు మోయించవచ్చు అనే విషయాన్ని మనకు అందుబాటులోవున్న మూలాల్లోని నియమాలేవీ ఖచ్చితంగా చెప్పడంలేదు. అయితే శాసనం నిర్దేశించినదానికంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి చాలామంది ఇష్టపడరు.

అయితే యేసు, “ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతముచేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము” అని చెప్పినప్పుడు ఆ పద్ధతి గురించే మాట్లాడుతున్నాడు. (మత్తయి 5:41) ఆ మాటలు విన్నప్పుడు కొంతమంది ఆయన చాలా అన్యాయంగా మాట్లాడుతున్నాడని అనుకొని ఉండవచ్చు. అయితే ఆయన మాటల్లోని భావమేమిటి?

క్రైస్తవులు ఎలా స్పందించాలి?

సరళంగా చెప్పాలంటే, ఒక న్యాయసమ్మతమైన పని చేయమని ఎవరైనా అధికారి బలవంతం చేస్తే, దానిని సుముఖంగా సణగకుండా చేయాలని యేసు తన శ్రోతలకు చెబుతున్నాడు. అలా వారు ‘కైసరువి కైసరుకు చెల్లిస్తూనే’ ‘దేవునివి దేవునికి చెల్లించవలసిన’ తమ బాధ్యతను నిర్లక్ష్యం చేయకూడదు.​—⁠మార్కు 12:17. *

అంతేకాకుండా అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఇలా ఉద్బోధించాడు: “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండ వలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; . . . నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు.”​—⁠రోమీయులు 13:1-4.

అలా యేసు మరియు పౌలు, ఒక రాజుకు లేదా ఒక ప్రభుత్వానికి తమ ఆజ్ఞలను ఉల్లంఘించినవారిని శిక్షించే హక్కు ఉందని ఒప్పుకున్నారు. వారు ఎలాంటి శిక్ష విధించవచ్చు? సా.శ. ఒకటవ, రెండవ శతాబ్దాలకు చెందిన గ్రీకు తత్త్వవేత్త ఎపిక్టెటస్‌ ఆ ప్రశ్నకు ఈ రకంగా సమాధానం ఇస్తున్నాడు: “అనుకోని అవసరం ఏర్పడి ఒక సైనికుడు నీ గాడిదను తీసుకుంటే, దానిని వెళ్ళనివ్వు. అడ్డు చెప్పకు, సణగకు, లేకపోతే నీకు దెబ్బలు తగలడమే కాకుండా నీ గాడిదను కూడా పోగొట్టుకుంటావు.”

అయితే ప్రాచీన కాలాల్లోనూ ఆధునిక కాలాల్లోనూ క్రైస్తవులు తమ మంచి మనస్సాక్షినిబట్టి ప్రభుత్వ ఆజ్ఞలకు విధేయత చూపించలేమని భావించారు. అలా వారు నిరాకరించినందుకు కొన్నిసార్లు పర్యవసానాలు గంభీరంగా ఉండేవి. కొందరు క్రైస్తవులకు మరణ శిక్ష విధించబడింది. ఇతరులు తమ తటస్థ వైఖరికి విరుద్ధమైనవిగా అనిపించిన కార్యకలాపాల్లో పాల్గొనడానికి నిరాకరించినందుకు అనేక సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. (యెషయా 2:4; యోహాను 17:16; 18:36) మరికొన్ని సందర్భాల్లో క్రైస్తవులు తమనుండి కోరబడినవాటికి లోబడాలని భావించారు. ఉదాహరణకు, సమాజానికి ఉపయోగపడే సాధారణ పని ఇమిడివున్న పౌరసంబంధ నిర్వహణ క్రింద పని చేయడానికి తమ మంచి మనస్సాక్షి అభ్యంతరపడదని కొందరు క్రైస్తవులు భావించారు. ఆ పనుల్లో వృద్ధులకు లేదా వికలాంగులకు మద్దతునివ్వడం, అగ్నిమాపక దళంలో పని చేయడం, సముద్ర తీరాలను శుభ్రం చేయడం, ఉద్యానవనాల్లో, అడవుల్లో, గ్రంథాలయాల్లో పని చేయడం వంటివి ఉన్నాయి.

అయితే ఆయా దేశాలనుబట్టి పరిస్థితులు మారవచ్చు. కాబట్టి తమనుండి కోరబడినవాటికి లోబడాలా వద్దా అని నిర్ణయించుకునేటప్పుడు ప్రతి క్రైస్తవుడు తన బైబిలు శిక్షిత మనస్సాక్షిని అనుసరించాలి.

రెండు మైళ్ళు వెళ్ళడం

న్యాయసమ్మతమైన కోరికలను నెరవేర్చడానికి సుముఖంగా ఉండాలని యేసు బోధించిన సూత్రం, ప్రభుత్వ శాసనాలకే కాక ప్రతిదిన మానవ సంబంధాలకు కూడా అన్వయిస్తుంది. ఉదాహరణకు, అధికారంలో ఉన్న వ్యక్తి మీరు చేయడానికి ఇష్టపడకపోయినా దేవుని నియమాలకు విరుద్ధంగా లేని పని చేయమని మిమ్మల్ని అడిగాడనుకోండి. మీరు ఎలా స్పందిస్తారు? ఆ వ్యక్తి మీ సమయాన్ని మీ శక్తిని ఉపయోగించుకోవడానికి అన్యాయంగా పని కల్పిస్తున్నాడని మీరు భావించవచ్చు, కాబట్టి మీరు కోపంతో ప్రతిస్పందించవచ్చు. దాని ఫలితం వైరం తప్ప ఇంకేమీ కాదు. మరోవైపున మీరు అయిష్టంగానే ఒప్పుకుంటే, మీకు మనశ్శాంతి ఉండదు. మరి పరిష్కారమేమిటి? యేసు ఇచ్చిన సలహాను పాటించండి, రెండు మైళ్ళు వెళ్ళండి. కోరబడినది మాత్రం చేసి ఊరుకోకుండా దానికంటే ఎక్కువే చేయండి. ఇష్టపూర్వకంగా చేయండి. ఆ వైఖరితో చేసినప్పుడు, ఇతరులు తమ స్వలాభానికి మిమ్మల్ని వాడుకుంటున్నారని మీకు అనిపించదు, పైగా మీరు చేసే పనిని మీరే ఎంపిక చేసుకున్నవారవుతారు.

“చాలామంది తమ జీవితమంతటిలోనూ ఎవరో బలవంతంగా చేయమన్న పనులను మాత్రమే చేస్తారు. వాళ్ళకు జీవితమే ఒక కష్టమైన అనుభవంలా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడూ అలసిపోతుంటారు. ఇతరులు తాము చేయవలసిన దానికంటే ఎక్కువ చేసి ఇష్టపూర్వకంగా ఇతరులకు సహాయం చేస్తారు” అని ఒక రచయిత చెప్పాడు. చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి బలవంతంగా కేవలం ఒక మైలు వెళ్ళాలా, రెండు మైళ్ళు వెళ్ళాలా అని నిర్ణయించుకోవలసి వస్తుంది. ఒక్క మైలు వెళ్ళడానికే ఎంపిక చేసుకునే వ్యక్తి తన హక్కుల గురించే ఎక్కువ ఆలోచిస్తాడు. రెండు మైళ్ళు వెళ్ళాలని నిర్ణయించుకునే వ్యక్తికి అత్యంత ఆశీర్వాదకరమైన అనుభవాలు ఎదురవుతాయి. మీరు ఎలాంటి వ్యక్తిగా ఉన్నారు? మీరు మీ కార్యకలాపాలను కేవలం బాధ్యతలుగా లేదా మీరు చేయవలసిన పనులుగా దృష్టించకుండా మీరు చేయడానికి ఇష్టపడే పనులుగా దృష్టిస్తే మీరు మరింత సంతోషంగా, మరింత ఫలవంతంగా ఉంటారు.

మీరు అధికారంగల వ్యక్తి అయితే అప్పుడెలా? మీరు కోరేవాటిని చేయడానికి ఇతరులకు ఇష్టం లేకపోయినా వారిని బలవంతం చేయడానికి మీ అధికారాన్ని ఉపయోగించడం ప్రేమపూర్వకమైనది కాదు, స్పష్టంగా అది క్రైస్తవుల లక్షణం కాదు. “అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురు . . . వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురు” అని యేసు చెప్పాడు. కానీ అది క్రైస్తవ విధానం కాదు. (మత్తయి 20:25, 26) అధికారంతో అడిగి పనులు చేయించుకోవడంవల్ల ఫలితాలు రావచ్చు కానీ సముచితమైనవాటిని మాత్రమే కోరుతూ దయాపూర్వకంగా అడగడం, వాటికి గౌరవపూర్వకంగా ఇష్టపూర్వకంగా లోబడడం జరిగితే ప్రజల మధ్య సంబంధాలు ఎంత మెరుగ్గా ఉంటాయో కదా! అవును ఒక మైలు మాత్రమే కాకుండా రెండు మైళ్ళు వెళ్ళడానికి సుముఖంగా ఉండడం మీ జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 18 ‘కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించడం’ అంటే ఏమిటో వివరణాత్మక చర్చ కోసం కావలికోట, మే 1, 1996, 15-20 పేజీలు చూడండి.

[25వ పేజీలోని బాక్సు]

ప్రాచీన కాలాల్లో నిర్బంధ సేవ దుర్వినియోగం

నిర్బంధ సేవ తరచూ అన్యాయంగా పనులు చేయించుకోవడానికి అదనుగా ఉపయోగించబడేది అనే వాస్తవం, దానిని దుర్వినియోగపరచడాన్ని ఆపుచేయడానికి చేయబడిన శాసనాలనుబట్టి తెలుస్తోంది. తన అధికారులు “దేశ నివాసులను తమ స్వంత పనులు చేయమని బలవంతపెట్టకూడదు, వారి పశువులను తమ స్వంత పనుల కోసం స్వాధీనం చేసుకోకూడదు,” అంతేకాక “తమ స్వంత పనుల కోసం ఎవ్వరూ . . . పడవలను స్వాధీనం చేసుకోకూడదు” అని సా.శ.పూ. 118లో ఐగుప్తుకు చెందిన టాలమీ యూర్జెటిజ్‌ II ఆజ్ఞాపించాడు. ఐగుప్తులోని టెంపుల్‌ ఆఫ్‌ ద గ్రేట్‌ ఓయాసిస్‌లో సా.శ. 49లో చెక్కబడిన మాటల్లో రోమన్‌ అధికారి వెర్గీలియల్‌ క్యాపిటో, సైనికులు చట్టవిరుద్ధమైన కోరికలు కోరేవారని ఒప్పుకున్నాడు, ఆయన “తననుండి లిఖితపూర్వక ఆదేశం ఉంటేనే తప్ప . . . ఎవ్వరూ దేనినీ స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు” అని ఆజ్ఞాపించాడు.

[24వ పేజీలోని చిత్రం]

కురేనీయుడైన సీమోను సేవకు ‘బలవంతము చేయబడ్డాడు’

[26వ పేజీలోని చిత్రం]

చాలామంది సాక్షులు తమ క్రైస్తవ స్థానానికి కట్టుబడి ఉన్నందుకు జైలు శిక్ష అనుభవించారు