కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జ్యోతిష్కులు, బైబిలు

జ్యోతిష్కులు, బైబిలు

జ్యోతిష్కులు, బైబిలు

బైబిలు తరచూ జ్యోతిష్కుల కార్యకలాపాల గురించి పేర్కొంటుంది. ఉదాహరణకు, సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో యెషయా ప్రవక్త, నాశనం కాబోతున్న నగరాన్ని రక్షించుకోమని చెబుతూ నక్షత్రాలను గమనించే జ్యోతిష్కులను ఇలా సవాలు చేశాడు: “నీ విస్తారమైన యోచనలవలన నీవు [బబులోను] అలసియున్నావు. జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము.”​—⁠యెషయా 47:⁠13.

అయితే, హీబ్రూ లేఖనాల్లో ‘జ్యోతిష్కుడు’ అని అనువదించబడిన గాజెరిన్‌ అనే పదం, దానియేలు పుస్తకంలో, అరమిక్‌ భాషలో వ్రాయబడిన భాగంలో మాత్రమే కనబడుతుంది. (దానియేలు 2:4బి–7:⁠28) దానికి “కోసి తీయు” అనే మూలార్థం ఉంది, ఈ పదం ఆకాశాన్ని వివిధ రూపాలుగా విభజించే వారిని సూచిస్తుందని భావించబడుతోంది. ఈ జోతిష్కుల తెగకు చెందిన వారు, “జనన సమయంలో నక్షత్రాలున్న స్థానాన్ని బట్టి, లెక్కలు వేయడం, సోదె చెప్పడం లాంటి వివిధ కళల ద్వారా. . . . వ్యక్తుల విధిని నిర్ధారిస్తారు.” (జెసినియసస్‌ హీబ్రూ అండ్‌ క్యాల్డి లెక్సికన్‌, 166, 167) వాస్తవానికి జ్యోతిష్యం అనేక దేవుళ్ళ ఆరాధనకు సంబంధించినది; బహుశా అది దిగువ మెసొపొతమియ లోయలో, జలప్రళయం సంభవించిన కొద్దికాలం తర్వాత ప్రజలు యెహోవా స్వచ్ఛారాధనను వదిలేసినప్పుడు ఆరంభమై ఉండవచ్చు. ఆ తర్వాత కొంతకాలానికి కల్దీయుడు అనే పేరు “జ్యోతిష్కుడు” అనే పదానికి పర్యాయపదం అయింది.

ఆకాశంలోని ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క దేవుడు పరిపాలిస్తున్నాడని ఈ అబద్ధ శాస్త్రమైన జ్యోతిష్యంలో నమ్ముతారు. ఆకాశంలో జరిగే సూర్యోదయం, సూర్యాస్తమయం, రాత్రింబవళ్ళు సమంగా ఉండే కాలాలు, అయినములు, చంద్రుని దశలు, గ్రహణాలు, తోకచుక్కలు లాంటి ప్రతీ ఖగోళ కదలిక, ప్రక్రియ ఈ దేవుళ్ళు చేసేదేనని నమ్ముతారు. ఈ ఖగోళ కదలికలను ఎల్లప్పుడూ గమనిస్తూ వాటికి సంబంధించిన విస్తృతమైన పటాలు, పట్టికలు తయారు చేసేవారు, వాటి ద్వారా మానవ వ్యవహారాల గురించీ భూసంబంధిత ఘటనల గురించీ చెప్పేవారు. ప్రజా సంబంధమైన, వ్యక్తిగతమైన విషయాలన్నీ పరలోకంలోని ఈ దేవుళ్ళే నియంత్రిస్తారని నమ్మేవారు. ఆ కారణంగానే, జ్యోతిష్కులు వచ్చి శకునాలు చదివి వాటి అన్వయం చెప్పి తమకు సలహాలు ఇచ్చేంత వరకూ రాజకీయపరమైన లేక సైనికపరమైన నిర్ణయాలు తీసుకొనేవారు కాదు. ఈ విధంగా మతనాయక వర్గానికి ఎక్కువ అధికారం లభించడంతో వారు ప్రజల జీవితాల మీద ఎంతో ప్రభావం చూపించడం మొదలుపెట్టారు. ఈ మతనాయకులు తమకు సహజాతీత శక్తి, అంతర్దృష్టి, గొప్ప జ్ఞానం ఉన్నాయని చెప్పుకునేవారు. బబులోనులోని ప్రముఖ ఆలయాలన్నిటిలోనూ ఖగోళ పరిశీలనా కేంద్రాలు ఉండేవి.

చరిత్ర గమనంలో దానియేలు, ఆయన ముగ్గురు సహచరులు ఈ జ్యోతిష్కుల దేశంలో బంధీలయ్యారు. ఈ హెబ్రీయులు “తన రాజ్యమందంతటనుండు శకునగాండ్రకంటెను గారడీవిద్య గలవారందరికంటెను పదియంతలు శ్రేష్ఠులని” బబులోను రాజు గ్రహించాడు. (దానియేలు 1:​20) ఆ తర్వాత దానియేలు “శకునగాండ్ర అధిపతి” అని పిలువబడ్డాడు. (దానియేలు 4:9) అయితే నక్షత్రాలను చూసి ‘ఆకాశ విభజన చేసే వానిగా’ కావడానికి ఆయన యెహోవా ఆరాధనను ఎన్నడూ వదలలేదు. జ్యోతిష్కులు, ఇతర “జ్ఞానులు” నెబుకద్నెజరు కన్న కల భావాన్ని వివరించలేకపోయినప్పుడు దానియేలును రాజ సముఖమునకు తీసుకువచ్చారు, అప్పుడు ఆయన ఇలా అన్నాడు: “మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు,” అంతేకానీ “మనుష్యులకందరికంటె నాకు విశేష జ్ఞానముండుటవలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు.”​—⁠దానియేలు 2:28, 30.

ఇశ్రాయేలులో మొలెకు, జ్యోతిశ్శాస్త్రం

కొన్నిసార్లు ఎద్దు తలగా చిత్రీకరించబడిన మొలెకుకు చేసే ఆరాధనకూ జ్యోతిశ్శాస్త్రానికీ దగ్గరి సంబంధం ఉందని చూపించే రుజువు ఉంది. బబులోనీయులు, కనానీయులు, ఐగుప్తీయులు, ఇతరులు మార్దుక్‌, మొలెకు, బయలు వంటి దేవతలకు చిహ్నంగా ఎద్దును ఆరాధించేవారు. రాశిచక్రంలోని అతి ముఖ్యమైన విభాగాల్లో ఒకటి ఎద్దు, అదే వృషభరాశి. ఎద్దులు తరచూ సూర్య దేవునికి ప్రాతినిధ్యం వహించేవి, ఎద్దు కొమ్ములు కిరణాలకు చిహ్నంగా, ఎద్దుకున్న బలమైన పునరుత్పత్తి శక్తి “జీవదాతగా” సూర్యునికున్న శక్తికి చిహ్నంగా భావించేవారు. ఆవుకు కూడా సమానమైన గౌరవం ఇవ్వబడేది, దాన్ని ఇష్తార్‌కు లేక అష్టారోతుకు చిహ్నంగా భావించేవారు, ఈ దేవత వివిధ పేర్లతో పిలువబడేది. అందుకే అహరోను, యరొబాములు ఇశ్రాయేలులో అలాంటి ఎద్దు ఆరాధనను (దూడ ఆరాధనను) ప్రవేశపెట్టినప్పుడు అది యెహోవా దృష్టిలో ఘోరమైన పాపం అయింది.​—⁠నిర్గమకాండము 32:4, 8; ద్వితీయోపదేశకాండము 9:⁠16; 1 రాజులు 12:28-30; 2 రాజులు 10:⁠29.

మతభ్రష్ట, పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యం ఈ జ్యోతిశ్శాస్త్ర తెగలో చేరినందుకు నిందల పాలైంది. దక్షిణాన ఉన్న రెండు గోత్రాల రాజ్యపు దుష్ట రాజైన ఆహాజు, అతని మనవడైన మనష్షే నక్షత్ర దేవుళ్ళను ఆరాధించడంతో పాటు తమ పిల్లలను సజీవంగా, క్రూరంగా వాటికి బలి అర్పించడంలో కూడా నాయకత్వం వహించారు. (2 రాజులు 16:3, 4; 21:3, 6; 2 దినవృత్తాంతములు 28:3, 4; 33:​3, 6) అయితే మంచి రాజైన యోషీయా మాత్రం ‘అర్చకులను, బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేసే వారిని నిలిపివేశాడు.’​—⁠2 రాజులు 23:​5, 10, 24.

ఎడారిలో ఇశ్రాయేలీయులు చేసిన తిరుగుబాటు గురించిన స్తెఫను వృత్తాంతంలో మొలెకు ఆరాధనకూ, దూడ ఆరాధనకూ, జ్యోతిశ్శాస్త్రానికీ మధ్య ఉన్న సంబంధం వివరించబడింది. “మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము” అని వారు అహరోనుతో చెప్పినప్పుడు, యెహోవా ‘ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది​—⁠మీరు బలి పశువులను అర్పణములను నాకు అర్పించలేదు. మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలొకు గుడారమును రొంఫాయను దేవతయొక్క నక్షత్రమును మోసికొనిపోతిరి.’​—⁠అపొస్తలుల కార్యములు 7:40-43.

బాల యేసును సందర్శించిన మేజై

మేజై (జ్ఞానులు) బాల యేసు కోసం కానుకలు తీసుకువచ్చారు. గ్రీకు భాషలో వీళ్ళను మేగోయి అని పిలిచేవారు. (మత్తయి 2:⁠1) ఈ మేగోయి ఎవరో వ్యాఖ్యానిస్తూ ది ఇంపీరియల్‌ బైబిల్‌ డిక్షనరీ (IIవ సంపుటి, 139వ పేజీ) ఇలా చెబుతోంది: “హెరొడోటస్‌ ప్రకారం, కలల భావం చెప్పగలమని చెప్పుకున్న మేజై, మాదీయ తెగకు చెందినవారు, వీరికి పవిత్రమైన మతాచారాలు నిర్వహించే అధికారం ఉండేది . . . సంక్షిప్తంగా చెప్పాలంటే, వీరు విద్యావంతులైన పూజారి తరగతికి చెందినవారు, పుస్తకాలలోని భావాలను తెలుసుకొనగలిగే నైపుణ్యం ద్వారా, నక్షత్రాలను గమనించడం ద్వారా జరగబోయే ఘటనల గురించి వారికి మానవాతీత పరిజ్ఞానం ఉండేదని భావించేవారు . . . తర్వాత జరిగిన పరిశోధనలు, పూర్తిగా వృద్ధి చెందిన మేజైనిజమ్‌కు కేంద్రం మాదీయ పారసీక దేశాలు కాదు గానీ బబులోను అని వెల్లడి చేశాయి. ‘అయితే వారి పూజారి తెగకు మేజై అనే పేరు కల్దీయులు ఇచ్చారు, మేజై మాదీయ తెగకు చెందినవారని హెరొడోటస్‌ చెప్పిన దానిని మనమలా వివరించవచ్చు’”

కాబట్టి పసివాడైన యేసును సందర్శించిన మేగోయిలు జ్యోతిష్కులని చెప్పడానికి పరిస్థితుల నుండి ఏర్పడిన సాక్ష్యం బలంగా ఉంది. అంతేకాక వారు అబద్ధ దేవతల సేవకులు, వారు తెలిసో తెలియకో, కదిలే “నక్షత్రము”గా కనిపించినదానిని అనుసరించారు. “యూదుల రాజు” పుట్టాడనే వాస్తవాన్ని వారు హేరోదుకు చెప్పి ఆయనను అప్రమత్తం చేశారు, వెంటనే హేరోదు యేసును చంపడానికి ప్రయత్నించాడు. యెహోవా జ్యోతిష్యుల దుష్ట దేవతల కన్నా ఎంతో ఉన్నతుడు కాబట్టి వారి పన్నాగం విఫలమయింది; ఈ జ్యోతిష్కులు హేరోదు దగ్గరకు తిరిగి వెళ్ళే బదులు, “స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై” వేరే మార్గంలో తమ ఇళ్లకు వెళ్ళారు.​—⁠మత్తయి 2:2, 12.

జ్యోతిశ్శాస్త్రాన్ని దేవుడు ఖండిస్తున్నాడు

ఒక గొప్ప సత్యం ఇలా స్పష్టంగా చెప్పబడింది: “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను,” దీనిలో మన సౌరకుటుంబంలోని గ్రహాలు, తమ నక్షత్రరాశులలో స్థిరంగా ఉన్న నక్షత్రాలు ఉన్నాయి. (ఆదికాండము 1:​1, 16; యోబు 9:​7-10) అయితే ఇంతటి మహత్తర సృష్టి నుండి మానవుడు దేవుళ్ళను చేసుకోవాలనేది యెహోవా చిత్తం కాదు. అందుకే తన ప్రజలు ‘ఆకాశములో ఉండే ఏ రూపాన్నైనా’ ఆరాధించడాన్ని ఆయన ఖచ్చితంగా నిషేధించాడు. (నిర్గమకాండము 20:​3, 4) అన్ని రకాల జ్యోతిశ్శాస్త్రం నిషేధించబడింది.​—⁠ద్వితీయోపదేశకాండము 18:​10-12.