కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేటి లోకంలో వివాహం విజయవంతం కాగలదు

నేటి లోకంలో వివాహం విజయవంతం కాగలదు

నేటి లోకంలో వివాహం విజయవంతం కాగలదు

“పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.”​—⁠కొలొస్సయులు 3:14.

మనం క్రైస్తవ సంఘంలో 10, 20, 30 లేదా ఇంకా ఎక్కువ సంవత్సరాలు తమ భాగస్వామిపట్ల యథార్థంగా నిలిచిన ఎంతోమంది దంపతులను గమనించడం చూడముచ్చటగా ఉండదా? వారు అన్నిరకాల పరిస్థితుల్లోనూ తమ భాగస్వామిని హత్తుకునే ఉన్నారు.​—⁠ఆదికాండము 2:24.

2 తమ వివాహం ఒడిదుడుకులు లేకుండా ఏమీలేదని వారిలో అధికశాతం మంది అంగీకరిస్తారు. ఒక పరిశీలకురాలు ఇలా వ్రాసింది: “సంతోషభరిత వివాహాలు చీకూచింతా లేనివేమీ కాదు. అందులో సుఖదుఃఖాలు ఉంటాయి . . . అయితే ఆధునిక జీవితపు [కష్టాల] కడలిలోనూ ఆ భాగస్వాములు . . . ఏదో విధంగా సంతోషభరిత దంపతులుగానే నిలబడ్డారు.” విజయవంతమైన దంపతులు, ప్రత్యేకంగా పిల్లలను కని పెంచిన దంపతులు జీవిత ఒత్తిళ్లవల్ల కలిగే విపత్తులతో, కష్టాలతో ఎలా వ్యవహరించాలో నేర్చుకున్నారు. అలాంటి దంపతులకు నిజమైన ప్రేమ “శాశ్వతకాలముండును” అని జీవితానుభవం నేర్పించింది.​—⁠1 కొరింథీయులు 13:8.

3 దీనికి భిన్నంగా కోట్లాది వివాహాలు విచ్ఛిన్నమై పోయాయి. ఒక నివేదిక ఇలా చెబుతోంది: “నేడు అమెరికాలో సగం వివాహాలు విడాకులతోనే ముగుస్తాయని అంచనా వేయబడింది. ఆ విడాకుల్లో సగం వివాహమైన మొదటి ఏడెనిమిది సంవత్సరాల్లోపే తీసుకోబడతాయి . . . మళ్లీ పెళ్లి చేసుకునే 75 శాతం మందిలో 60 శాతం మంది తిరిగి విడాకులు తీసుకుంటారు.” గతంలో విడాకుల స్థాయి తక్కువగా ఉన్న దేశాల్లో సైతం ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఉదాహరణకు, జపాన్‌లో ఇటీవల సంవత్సరాల్లో విడాకుల సంఖ్య దాదాపు రెండింతలైంది. ఈ పరిస్థితులకు దారితీసిన, కొన్ని సందర్భాల్లో క్రైస్తవ సంఘంలోకూడా ప్రభావం చూపడానికి దారితీసిన ఒత్తిళ్లు కొన్ని ఏమిటి? వివాహ ఏర్పాటును బలహీనపరచడానికి సాతానుచేసే ప్రయత్నాల మధ్యనూ దానిని విజయవంతం చేసుకోవడానికి ఏమి అవసరం?

తప్పించుకోవలసిన ప్రమాదాలు

4 వివాహాన్ని బలహీనపరచగల కారకాలను అర్థం చేసుకోవడానికి దేవుని వాక్యం మనకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, ఈ అంత్యదినాల్లో నెలకొనే పరిస్థితుల గురించి అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటలను పరిశీలించండి: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.”​—⁠2 తిమోతి 3:1-5.

5 పౌలు మాటలను మనం విశ్లేషించినప్పుడు, ఆయన పేర్కొన్న అనేక లక్షణాలు వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయగలవని మనం చూస్తాం. ఉదాహరణకు, “స్వార్థప్రియులు” కేవలం తమను తాము ప్రేమించుకునే వారిగా ఉండడమే కాక, ఇతరులపట్ల వారికి ఏ మాత్రం శ్రద్ధ ఉండదు. తమను తామే ప్రేమించుకునే భర్తలు లేదా భార్యలు తాము కోరుకున్నదే జరగాలని పట్టుబడతారు. వారు సర్దుబాటు చేసుకోవడానికి కూడా ఇష్టపడనంతటి కఠినాత్ములుగా ఉంటారు. అలాంటి స్వభావం సంతోషభరిత వివాహానికి తోడ్పడుతుందా? ఎంతమాత్రం తోడ్పడదు. అపొస్తలుడైన పౌలు జ్ఞానయుక్తంగా, దంపతులతోపాటు క్రైస్తవులకు ఇలా హితవు చెప్పాడు: “[మీరు] కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.”​—⁠ఫిలిప్పీయులు 2:3, 4.

6 ధనాపేక్ష భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టగలదు? పౌలు ఇలా హెచ్చరించాడు: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.” (1 తిమోతి 6:​9, 10) పౌలు ఇచ్చిన హెచ్చరిక నేడు అనేక వివాహాల్లో నిజం కావడం విచారకరం. చాలామంది తమ ధనాన్వేషణ కారణంగా తమ భాగస్వామికి అవసరమయ్యే భావోద్రేక మద్దతు, క్రమమైన అనురాగపూరిత సాంగత్యం వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తారు.

7 ఈ అంత్యదినాల్లో కొందరు “అనురాగరహితులు, అతిద్వేషులు, . . . ద్రోహులు[గా]” ఉంటారని కూడా పౌలు చెప్పాడు. వివాహ ప్రమాణం ఒక గంభీరమైన వాగ్దానం కాబట్టి అది శాశ్వత బంధానికే దారితీయాలి తప్ప విశ్వాసఘాతుకానికి కాదు. (మలాకీ 2:​14-16) అయితే కొందరు తమ భాగస్వామి కానివారిపట్ల మోహం కనబరిచారు. భర్త విడిచిపెట్టిన 30 ఏళ్లు పైబడిన ఒక భార్య తనను విడిచిపెట్టడానికి ముందు కూడా అతడు ఇతర స్త్రీలతో మరీ చనువుగా, ప్రేమగా ప్రవర్తించేవాడని చెబుతోంది. ఎలాంటి ప్రవర్తన వివాహిత పురుషునికి అనుచితమో అతడు గుర్తించలేకపోయాడు. ఇలా జరగడం చూసినప్పుడు ఆమె చాలా నొచ్చుకొని, అతని ప్రమాదకర ప్రవర్తన గురించి యుక్తిగా హెచ్చరించడానికి ప్రయత్నించింది. అయినా, అతడు వ్యభిచారంలో పడిపోయాడు. ప్రేమపూర్వకంగా అతనికి హెచ్చరికలు చేసినా తప్పుచేసిన ఆ భాగస్వామి వాటిని పెడచెవినబెట్టాడు. అతను లక్ష్యపెట్టక వెళ్లి ఉరిలో చిక్కుకున్నాడు.​—⁠సామెతలు 6:27-29.

8 వ్యభిచారం లేదా జారత్వం విషయంలో బైబిలు ఇస్తున్న హెచ్చరిక ఎంత స్పష్టమో కదా! “జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు; ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే.” (సామెతలు 6:​32) సాధారణంగా, వ్యభిచారం అనుకోకుండా క్షణికావేశంలో చేసేదికాదు. బైబిలు రచయిత యాకోబు సూచించినట్లుగా సాధారణంగా వ్యభిచారంలాంటి పాపం మొదట ఆలోచనల్లో మెదిలి, ఆ తర్వాత అది పరిపక్వమైనప్పుడే జరుగుతుంది. (యాకోబు 1:​14, 15) తప్పుచేస్తున్న భాగస్వామి తాను జీవితాంతం నమ్మకంగా ఉంటానని ప్రమాణం చేసిన అతని లేదా ఆమెపట్ల యథార్థంగా ఉండడం క్రమంగా తగ్గిపోతుంది. యేసు ఇలా చెప్పాడు: “వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగా—ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.”​—⁠మత్తయి 5:27, 28.

9 కాబట్టి సామెతల పుస్తకంలో ప్రోత్సహించిన ఈ విధానమే జ్ఞానయుక్తమైనది, విశ్వసనీయమైనది: “నీ ఊట దీవెన నొందును. నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందుచుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము. నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?”​—⁠సామెతలు 5:18-20.

వివాహానికి తొందరపడకండి

10 ఒక జంట తొందరపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ వివాహంలో సమస్యలు తలెత్తవచ్చు. వారు చిన్నవారిగా, అనుభవం లేనివారిగా ఉండవచ్చు. లేదా వారు పరస్పరం అంటే వారి ఇష్టాయిష్టాలను, జీవిత లక్ష్యాలను, కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకొనేంత సమయం తీసుకోకపోవచ్చు. కాబట్టి ఓపిక ప్రదర్శించడం, కాబోయే భాగస్వామిని తెలుసుకోవడానికి సమయం తీసుకోవడం జ్ఞానయుక్తం. ఇస్సాకు కుమారుడైన యాకోబు విషయమే తీసుకోండి. ఆయన రాహేలును పెళ్లి చేసుకోవడానికి ముందు తనకు కాబోయే మామ దగ్గర ఏడు సంవత్సరాలు సేవ చేయవలసి వచ్చింది. అలా చేయడానికి కారణం ఆయన భావాలు కేవలం శారీరక ఆకర్షణ మీద కాదుగానీ నిజమైన ప్రేమ మీద ఆధారపడ్డాయి.​—⁠ఆదికాండము 29:20-30.

11 వివాహం కేవలం ప్రణయాత్మక బంధం మాత్రమే కాదు. వివాహమనేది విభిన్న నేపథ్యాలు, భిన్న వ్యక్తిత్వాలు, భావోద్రేకాలు, తరచూ విభిన్న విద్యా నేపథ్యాలున్న ఇద్దరు వ్యక్తులను జతపరుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది రెండు విభిన్న సంస్కృతుల, రెండు భాషల వ్యక్తులను జతపరచడం కూడా కావచ్చు. ఇదేదీ కాకపోతే, అది కనీసం అన్ని విషయాలపై విభిన్న అభిప్రాయాలు వెలిబుచ్చే సామర్థ్యంగల రెండు స్వరాలను ఒక చోటకు చేరుస్తుంది. వివాహ బంధంలో ఆ రెండు స్వరాలు ముఖ్యపాత్ర వహిస్తాయి. అవి తదేకంగా కఠినంగా, ఫిర్యాదుచేసేవిగా లేదా ఆప్యాయంగా ప్రోత్సహించేవిగా, బలపరిచేవిగా ఉండవచ్చు. అవును, మన మాటలతో మన భాగస్వామిని మనం గాయపరచవచ్చు లేదా నయం చేయవచ్చు. హద్దులేని మాటలు వివాహాన్ని నిజంగా పరీక్షించగలవు.​—⁠సామెతలు 12:​18; 15:​1, 2; 16:24; 21:⁠9; 31:26.

12 కాబట్టి, కాబోయే భాగస్వామిని నిజంగా తెలుసుకోవడానికి సమయం తీసుకోవడం జ్ఞానయుక్తం. అనుభవజ్ఞురాలైన ఒక క్రైస్తవ సహోదరి ఒకసారి ఇలా చెప్పింది: “కాబోయే భాగస్వామిని చూసేటప్పుడు మీరు ఆ వ్యక్తిలో బహుశా పది ప్రాథమిక విషయాలు చూడాలని కోరుకోవాలి. అయితే మీకు ఆ వ్యక్తిలో ఏడు విషయాలే కనబడితే, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి ‘ఆ వ్యక్తిలో కనబడని ఆ మూడు విషయాలను నేను పట్టించుకోకుండా ఉండడానికి ఇష్టపడుతున్నానా? దైనందిన జీవితంలో నేను ఆ లోపాలను భరించగలనా?’ మీకు ఈ విషయంలో ఏమైనా సందేహాలుంటే, ఆగి మళ్లీ ఆలోచించుకోండి.” అయితే మీరు వాస్తవిక దృక్పథంతో ఉండాలి. మీరు వివాహం చేసుకోవాలనుకుంటే, మీకు ఎన్నటికీ పరిపూర్ణ భాగస్వామి లభించరని గ్రహించండి. అలాగే చివరకు మీరు పెళ్లి చేసుకునే వ్యక్తికీ పరిపూర్ణ భాగస్వామి లభించరు!​—⁠లూకా 6:41.

13 వివాహంలో త్యాగాలు చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్నే నొక్కి చెబుతూ పౌలు ఇలా అన్నాడు: “మీరు చింతలేనివారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయి యుండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది.”​—⁠1 కొరింథీయులు 7:32-34.

కొన్ని వివాహాలు ఎందుకు విఫలమవుతాయి?

14 ఒక క్రైస్తవ స్త్రీ 12 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఇటీవల తన భర్త తనను విడిచిపెట్టి మరో స్త్రీతో సంబంధం పెట్టుకుని తనకు విడాకులు ఇచ్చినప్పుడు విపరీతంగా బాధపడింది. విడిపోవడానికి ముందు ఆమె హెచ్చరికా సూచనలను ఏమైనా గమనించిందా? ఆమె ఇలా వివరిస్తోంది: “ఆయన ప్రార్థన చేయడాన్నే మానేసే స్థితికి చేరుకున్నాడు. క్రైస్తవ కూటాలకు రాకపోవడానికి, ప్రకటనా పనిలో పాల్గొనకపోవడానికి ఆయన కుంటి సాకులు చెప్పేవాడు. పనిలో తనకు తీరిక దొరకడం లేదనో, నాతో గడపడానికి సమయం లేనంతగా అలసిపోయాననో చెప్పేవాడు. ఆయన నాతో మాట్లాడేవాడు కాదు. ఆధ్యాత్మిక విషయాలేవీ నాతో చర్చించేవాడు కాదు. ఆయన చెప్పలేనంతగా మారిపోయాడు. ఆయన నేను పెళ్లి చేసుకున్నప్పటి వ్యక్తి కాదు.”

15 ఇతరులు కూడా అలాంటి సూచనలనే అంటే వ్యక్తిగత బైబిలు అధ్యయనాన్ని, ప్రార్థనను లేదా క్రైస్తవ కూటాలకు హాజరవడాన్ని నిర్లక్ష్యం చేయడం ఇమిడివున్న ఆధ్యాత్మిక బలహీనతను పేర్కొన్నారు. వేరే మాటల్లో చెప్పాలంటే, చివరకు తమ భాగస్వాములను విడిచిపెట్టిన చాలామంది యెహోవాతో తమ సంబంధం బలహీనపడడానికి అనుమతించారు. ఫలితంగా వారి ఆధ్యాత్మిక దృష్టి మందగించింది. యెహోవా వారికిక ఎంతమాత్రం జీవముగల దేవునిగా లేడు. వారికి వాగ్దత్త నీతియుక్త నూతనలోకం ఇక ఏ మాత్రం వాస్తవికంగా లేదు. కొందరి విషయంలో, వంచనకు పాల్పడిన భాగస్వామి వివాహేతర సంబంధం పెట్టుకోకముందే ఈ ఆధ్యాత్మిక బలహీనత ఏర్పడింది.​—⁠హెబ్రీయులు 10:​38, 39; 11:6; 2 పేతురు 3:13, 14.

16 ఈ పరిస్థితికి భిన్నంగా, చాలా సంతోషంగా ఉన్న ఒక జంట తమ వివాహ విజయానికి బలమైన ఆధ్యాత్మిక బంధాన్నే ముఖ్య కారణంగా పేర్కొంటున్నారు. వారు కలిసి ప్రార్థిస్తారు, కలిసి అధ్యయనం చేస్తారు. భర్త ఇలా అంటున్నాడు: “మేము కలిసి బైబిలు చదువుతాం. మేము కలిసే పరిచర్యకు వెళతాం. మేము కలిసి పనిచేయడంలో ఆనందిస్తాం.” అందులోని పాఠం స్పష్టం: యెహోవాతో చక్కని సంబంధం కాపాడుకోవడం వివాహ స్థిరత్వానికి ఎంతగానో తోడ్పడుతుంది.

వాస్తవిక దృక్పథంతో ఉండండి, సంభాషించండి

17 వివాహం విజయవంతం కావడానికి తోడ్పడే మరో రెండు విషయాలు: క్రైస్తవ ప్రేమ, సంభాషణ. ఇద్దరు వ్యక్తులు పరస్పరం ప్రేమించుకున్నప్పుడు, ఒకరి తప్పులను మరొకరు చూసీచూడనట్లుండే అవకాశముంటుంది. ఒక జంట తాము ప్రేమ కథల్లో చదివిన లేదా సినిమాల్లో చూసిన వాటి ఆధారంగా, అతిశయోక్తిగల అపేక్షలతో వివాహం చేసుకోవచ్చు. అయితే చివరకు ఆ జంట వాస్తవిక పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటప్పుడు, చిన్నచిన్న తప్పులు లేదా కాస్తోకూస్తో చికాకు కలిగించే అలవాట్లు పెద్ద సమస్యలుగా తయారవుతాయి. అలా జరిగితే క్రైస్తవులు ఆత్మఫలాలను ప్రదర్శించాలి, వాటిలో ఒకటి ప్రేమ. (గలతీయులు 5:​22) ప్రణయాత్మక ప్రేమ కాదుగానీ, క్రైస్తవ ప్రేమ నిజంగా చాలా శక్తిమంతమైనది. అలాంటి క్రైస్తవ ప్రేమను వర్ణిస్తూ పౌలు ఇలా అన్నాడు: “[ప్రేమ] దీర్ఘకాలము సహించును, దయ చూపించును. . . . [అది] స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. . . . అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.” (1 కొరింథీయులు 13:​4-7) కాబట్టి నిజమైన ప్రేమ మానవ బలహీనతలను పరిగణలోకి తీసుకుంటుంది. వాస్తవిక దృక్పథంతో, అది పరిపూర్ణతను అపేక్షించదు.​—⁠సామెతలు 10:12.

18 సంభాషణ కూడా ప్రాముఖ్యం. వివాహమై ఎన్ని సంవత్సరాలు గడిచినా, దంపతులిద్దరూ పరస్పరం సంభాషించుకుంటూ, ఒకరు చెప్పేది మరొకరు శ్రద్ధగా వినాలి. ఒక భర్త ఇలా చెబుతున్నాడు: “మేము బాహాటంగానే అయినా స్నేహపూర్వకంగా మా భావాలను వ్యక్తపరచుకుంటాము.” అనుభవాన్నిబట్టి భర్త లేదా భార్య తన భాగస్వామి చెప్పినదే కాదు, చెప్పనిది కూడా గ్రహించడం నేర్చుకుంటారు. మరో విధంగా చెప్పాలంటే, సంవత్సరాలు గడిచేకొద్దీ సంతోషభరిత దంపతులు మదిలోని తలంపులను, వ్యక్తపరచని భావాలను అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. కొంతమంది భార్యలు తమ భర్తలు తాము చెప్పేది నిజంగా వినరని అన్నారు. కొందరు భర్తలు తమ భార్యలు అత్యంత అననుకూల సమయంలో మాట్లాడాలని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తోందని ఫిర్యాదు చేశారు. సంభాషణలో కనికరం, అర్థం చేసుకోవడం ఇమిడివుంటాయి. సమర్థమైన సంభాషణ భార్యాభర్తలిద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.​—⁠యాకోబు 1:19.

19 సంభాషణల్లో కొన్నిసార్లు క్షమాపణ అడగడం ఉంటుంది. అది అన్ని సమయాల్లో అంత సులభం కాదు. తప్పు ఒప్పుకోవడానికి వినయం అవసరం. అయితే అలా చేయడం వివాహానికి ఎంతగా సహాయం చేస్తుందో కదా! యథార్థంగా క్షమాపణ అడగడం జరగబోయే వాగ్యుద్ధాన్ని నివారించడమే కాక, నిజమైన క్షమాపణకు, సమస్య పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుంది. పౌలు ఇలా అన్నాడు: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.”​—⁠కొలొస్సయులు 3:13, 14.

20 వివాహంలో పరస్పర మద్దతు కూడా ఆవశ్యకం. క్రైస్తవ భార్యాభర్తలు పరస్పరం నమ్మాలి, ఒకరిపై ఒకరు ఆధారపడాలి. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరూ మరొకరిని బలహీనపరచకూడదు లేదా ఇతరవిధాలుగా అతని లేదా ఆమె నమ్మకాన్ని వమ్ముచేయకూడదు. దంపతులమైన మనం మన భాగస్వామిని మెచ్చుకుంటాం; మనం వారిని కఠినంగా విమర్శించం. (సామెతలు 31:​29బి) అవివేకంగా, అనాలోచితంగా వారిని హేళన చేస్తూ వారి గౌరవాన్ని భంగపరచం. (కొలొస్సయులు 4:⁠6) ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుకోవడం ద్వారా అలాంటి పరస్పర మద్దతు బలపరచబడుతుంది. అనురాగం నిండిన స్పర్శ లేదా మాట “నేనింకా ప్రేమిస్తూనే ఉన్నాను. నాకు తోడుగా ఉన్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను” అని చెప్పగలదు. దంపతుల సంబంధాన్ని ప్రభావితం చేస్తూ, నేటి లోకంలో వివాహం విజయవంతం కావడానికి సహాయం చేసే కారకాల్లో ఇవి కొన్ని. ఇతర కారకాలు కూడా ఉన్నాయి, వాటితోపాటు వివాహాన్ని ఎలా విజయవంతం చేసుకోవాలో తెలియజేసే అదనపు లేఖనాధారిత మార్గనిర్దేశాలను తర్వాతి ఆర్టికల్‌ అందిస్తుంది. *

[అధస్సూచి]

^ పేరా 26 మరింత వివరణాత్మక సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకం చూడండి.

మీరు వివరించగలరా?

వివాహాన్ని బలహీనపరచగల కొన్ని విషయాలు ఏమిటి?

తొందరపడి వివాహం చేసుకోవడం ఎందుకు జ్ఞానయుక్తం కాదు?

వివాహం మీద ఆధ్యాత్మికత ఎలా ప్రభావం చూపిస్తుంది?

వివాహాన్ని స్థిరంగా ఉంచుకునేందుకు ఏ కారకాలు సహాయం చేస్తాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) క్రైస్తవ సంఘానికి సంబంధించి ఏ విషయం ప్రోత్సాహకరంగా ఉంది? (బి) విజయవంతమైన వివాహం అంటే ఏమిటి?

3. వివాహం, విడాకుల గురించి గణాంకాలు ఏమి సూచిస్తున్నాయి, తద్వారా ఏ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి?

4. వివాహాన్ని బలహీనపరిచే కొన్ని లక్షణాలు ఏమిటి?

5. ‘స్వార్థప్రియులైన’ వ్యక్తులు తమ వివాహాన్ని ఎందుకు ప్రమాదంలో పడవేసుకునే వారిగా ఉంటారు, ఈ విషయంలో బైబిలు సలహా ఏమిటి?

6. ధనాపేక్ష వివాహ బంధాన్ని ఎలా బలహీనపరచగలదు?

7. కొందరి విషయంలో ఎలాంటి ప్రవర్తన వివాహ అవిశ్వసనీయతకు దారితీసింది?

8. వ్యభిచారానికి ఏది నడిపించగలదు?

9. సామెతలు 5:18-20లో ఎలాంటి జ్ఞానయుక్తమైన సలహా ఉంది?

10. కాబోయే భాగస్వామిని తెలుసుకోవడానికి సమయం తీసుకోవడం ఎందుకు జ్ఞానయుక్తం?

11. (ఎ) వివాహ బంధం వేటిని ఒక దగ్గరకు చేరుస్తుంది? (బి) వివాహ జీవితంలో జ్ఞానయుక్తంగా మాట్లాడడం ఎందుకు ఆవశ్యకం?

12, 13. వివాహం విషయంలో ఎలాంటి వాస్తవిక దృక్పథం ప్రోత్సహించబడుతోంది?

14, 15. వివాహబంధం బలహీనపడడానికి ఏది కారణం కాగలదు?

16. వివాహాన్ని ఏది బలపరుస్తుంది?

17. (ఎ) వివాహం విజయవంతం కావాలంటే ఏ రెండు విషయాలు దోహదపడతాయి? (బి) క్రైస్తవ ప్రేమను పౌలు ఎలా వర్ణించాడు?

18. సంభాషణ ఒక బంధాన్ని ఎలా బలపరుస్తుంది?

19. (ఎ) క్షమాపణ అడగడం ఎందుకు కష్టంగా ఉంటుంది? (బి) క్షమాపణ అడగడానికి మనలను ఏది పురికొల్పుతుంది?

20. క్రైస్తవుడు తన వివాహిత భాగస్వామితో ఇటు ఏకాంతంలో అటు ఇతరుల సమక్షంలో ఎలా వ్యవహరించాలి?

[12వ పేజీలోని చిత్రం]

వివాహమంటే ప్రణయాత్మక సంబంధం మాత్రమే కాదు

[14వ పేజీలోని చిత్రాలు]

యెహోవాతోవున్న బలమైన సంబంధం, దంపతులు తమ వివాహాన్ని విజయవంతం చేసుకోవడానికి సహాయం చేస్తుంది