కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మారుతున్న మా పరిస్థితులను సుదూర ప్రాంతాల్లో సాక్ష్యమిచ్చేందుకు ఉపయోగించుకున్నాం

మారుతున్న మా పరిస్థితులను సుదూర ప్రాంతాల్లో సాక్ష్యమిచ్చేందుకు ఉపయోగించుకున్నాం

జీవిత కథ

మారుతున్న మా పరిస్థితులను సుదూర ప్రాంతాల్లో సాక్ష్యమిచ్చేందుకు ఉపయోగించుకున్నాం

రికార్డో మాలిక్‌సీ చెప్పింది

నా క్రైస్తవ తటస్థత కారణంగా నేను నా ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు, మా భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకొనేందుకు మాకు సహాయం చేయమని నేను, నా కుటుంబ సభ్యులు యెహోవాకు విన్నవించుకున్నాం. మా పరిచర్యను విస్తృతం చేసుకోవాలనే మా కోరికను మేము మా ప్రార్థనలో వ్యక్తం చేశాం. కొంతకాలం తర్వాత, సంచారకులుగా మేము ప్రారంభించిన ప్రయాణం మమ్మల్ని రెండు ఖండాలలోని ఎనిమిది దేశాలకు తీసుకువెళ్ళింది. తత్ఫలితంగా, మేము సుదూర ప్రాంతాల్లో పరిచర్య చేయగలిగాం.

నేను 1933లో ఫిలిప్పీన్స్‌లో పుట్టాను, నా కుటుంబం ఫిలిప్పీన్స్‌ ఇండిపెండెంట్‌ చర్చ్‌తో సన్నిహితంగా సహవసించేది. నా కుటుంబ సభ్యులందరూ అంటే మొత్తం 14 మంది ఆ చర్చికి వెళ్ళేవారు. నాకు దాదాపు 12 ఏండ్ల వయసున్నప్పుడు, నిజమైన విశ్వాసం వైపు నన్ను నడిపించమని దేవుణ్ణి ప్రార్థించాను. నా ఉపాధ్యాయుల్లో ఒకరు నన్ను మతసంబంధమైన తరగతిలో చేర్చారు, అలా నేను నిష్ఠగల ఒక క్యాథలిక్కును అయ్యాను. శనివారం కన్ఫెషన్‌కు, ఆదివారం మాస్‌కు తప్పకుండా వెళ్ళేవాణ్ణి. అయినా నాలో అనుమానం, అసంతృప్తి వృద్ధి చెందాయి. చనిపోయిన వారికి ఏమవుతుంది అనే ప్రశ్న, నరకాగ్ని, త్రిత్వం గురించిన ప్రశ్నలు నన్ను కలవరపెట్టేవి. మతనాయకులు ఇచ్చే జవాబులు అర్థరహితంగా, అసంతృప్తిగా ఉండేవి.

సంతృప్తికరమైన జవాబులు పొందడం

కాలేజీలో చదువుతున్నప్పుడు నేను ఒక వర్గంలో చేరాను, అది నేను పోరాటాల్లో, జూదంలో, పొగత్రాగడంలో, ఇతర అనైతిక కార్యకలాపాల్లో పాల్గొనేలా నన్ను పురికొల్పింది. ఒకరోజు సాయంత్రం నేను నా తోటివిద్యార్థి వాళ్ళ అమ్మను కలిశాను. ఆమె ఒక యెహోవాసాక్షి. నేను నా మత బోధకులను అడిగిన ప్రశ్నలనే ఆమెనూ అడిగాను. ఆమె నా ప్రశ్నలన్నింటికీ బైబిలునుండి జవాబిచ్చింది, తద్వారా ఆమె చెప్పింది సత్యమనే నమ్మకం నాకు కలిగింది.

నేను ఒక బైబిలు కొని సాక్షులతో అధ్యయనం చేయడం ప్రారంభించాను. కొంతకాలంలోనే నేను యెహోవాసాక్షుల కూటాలన్నిటికీ హాజరవడం మొదలుపెట్టాను. “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అనే జ్ఞానవంతమైన బైబిలు హితవుని అనుసరించి, అనైతిక స్నేహితుల సాంగత్యాన్ని విడిచిపెట్టాను. (1 కొరింథీయులు 15:​33) ఇది, నా బైబిలు అధ్యయనంలో ప్రగతి సాధించడానికి, తుదకు యెహోవాకు నన్ను నేను సమర్పించుకోవడానికి నాకు సహాయం చేసింది. నేను 1951లో బాప్తిస్మం తీసుకున్న తర్వాత, కొంతకాలం పూర్తికాల పరిచారకునిగా (పయినీరుగా) సేవ చేశాను. ఆ తర్వాత 1953 డిసెంబరులో ఆరెయా మెండోజా క్రొస్‌ నా జీవిత భాగస్వామి, పరిచర్యలో నమ్మకమైన తోటి సహచరిణి అయింది.

మా ప్రార్థనలకు జవాబు

పయినీర్లుగా సేవ చేయాలనే కోరిక మాకు ఉండేది. అయితే, యెహోవాకు సంపూర్ణంగా సేవ చేయాలనే మా కోరిక వెంటనే నెరవేరలేదు. అయినా, యెహోవా సేవ చేసేందుకు అవకాశాలు ఇవ్వమని ఆయనను అడగడం మేము మానుకోలేదు. మా జీవితం కష్టాలతో నిండివుండేది. అయినా మేము ఆధ్యాత్మిక లక్ష్యాలను మనస్సులో ఉంచుకున్నాం, 25 ఏండ్ల వయస్సులో యెహోవాసాక్షుల సంఘంలో నేను సంఘ సేవకునిగా, సంఘ పైవిచారణకర్తగా బాధ్యతలు చేపట్టాను.

బైబిలు జ్ఞానం సంపాదించుకోవడంలో పురోభివృద్ధి సాధించి, యెహోవా సూత్రాలను చక్కగా అవగాహన చేసుకున్న తర్వాత, నా ఉద్యోగం ఒక తటస్థ క్రైస్తవునిగా నా మనస్సాక్షికి అంగీకృతంకాదని గుర్తించాను. (యెషయా 2:​2-4) రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది నా విశ్వాసాన్ని పరీక్షించింది. నేను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోగలను? మళ్లీ ప్రార్థనలో యెహోవాను సమీపించాం. (కీర్తన 65:⁠2) మా చింతలను, మా భయాలను ఆయన దగ్గర వెలిబుచ్చాం. అంతేకాక, రాజ్య ప్రచారకుల అవసరత అధికంగా ఉన్న ప్రాంతంలో సేవ చేయాలనే మా కోరికను కూడా ఆయనకు తెలియజేశాం. (ఫిలిప్పీయులు 4:​6, 7) మాకు అనేక అవకాశాలు లభిస్తాయని మేమెప్పుడూ ఊహించలేదు.

మా ప్రయాణాన్ని ప్రారంభించడం

1965 ఏప్రిల్‌లో, లావోస్‌లోని వియంటైన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్నిమాపక దళానికి చెందిన రక్షక అధికారి ఉద్యోగాన్ని నేను అంగీకరించడంతో, మేము అక్కడికి వెళ్ళాం. వియంటైన్‌ నగరంలో అప్పుడు 24 మంది సాక్షులు ఉన్నారు, మిషనరీలతో, కొందరు స్థానిక సహోదరులతో కలిసి ప్రకటనా పనిని చేయడంలో మేము ఆనందించాం. ఆ తర్వాత నేను థాయ్‌లాండ్‌లోని ఉడాన్‌తాని విమానాశ్రయానికి బదిలీ అయ్యాను. అప్పుడు ఉడాన్‌తాని నగరంలో సాక్షులు ఎవరూ లేరు. కుటుంబంగా వారపు కూటాలన్నిటినీ మేమే నిర్వహించుకున్నాం. మేము ఇంటింటా ప్రకటించి, పునర్దర్శనాలు చేసి, బైబిలు అధ్యయనాలను ప్రారంభించాం.

‘మీరు బహుగా ఫలించండి’ అని యేసు తన శిష్యులకు ఇచ్చిన ఉపదేశాన్ని మేము జ్ఞాపకం ఉంచుకున్నాం. (యోహాను 15:⁠8) కాబట్టి వారి ఆదర్శాన్ని అనుసరించాలనే కృతనిశ్చయంతో సువార్తను ప్రకటించడంలో కొనసాగాం. కొద్దికాలంలోనే మేము ఫలితాలను చూసి ఆనందించాం. ఒక థాయ్‌ యువతి సత్యాన్ని అంగీకరించి మా ఆధ్యాత్మిక సహోదరి అయింది. ఇద్దరు ఉత్తర అమెరికన్‌లు సత్యాన్ని అంగీకరించి కొద్దికాలం తర్వాత క్రైస్తవ పెద్దలు అయ్యారు. ఉత్తర థాయ్‌లాండ్‌లో మేము పది కన్నా ఎక్కువ సంవత్సరాలు సువార్తను ప్రకటించడంలో కొనసాగాం. ఉడాన్‌తానిలో ఇప్పుడు ఒక సంఘం ఉందని తెలుసుకొని ఎంతో సంతోషిస్తున్నాం! మేము నాటిన కొన్ని విత్తనాలు ఇంకా ఫలిస్తున్నాయి.

విచారకరంగా, మేము మళ్ళీ మరోచోటికి వెళ్ళాల్సివచ్చింది, ప్రకటనా పనిలో భాగం వహిస్తూ ఉండేందుకు సహాయం చేయమని “కోత యజమానుని” మేము వేడుకున్నాం. (మత్తయి 9:⁠38) మేము ఇరాన్‌ రాజధాని అయిన టెహరాన్‌కు బదిలీ అయ్యాం. అప్పుడు ఆ దేశాన్ని షా పరిపాలిస్తున్నాడు.

సవాళ్ళతో కూడిన క్షేత్రంలో ప్రకటించడం

మేము టెహరాన్‌కు చేరుకున్న తర్వాత మన ఆధ్యాత్మిక సహోదరులను వెంటనే కనుగొన్నాం. 13 దేశాలకు చెందిన సాక్షులతో కూడిన చిన్న సాక్ష్యపు గుంపుతో మేము సహవసించాం. ఇరాన్‌లో సువార్త ప్రకటించడానికి మేము కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి వచ్చింది. మాకు పూర్తి వ్యతిరేకత ఎదురవకపోయినా, మేము జాగ్రత్తగా ఉండవలసి వచ్చింది.

ఆసక్తి చూపిన వారికి ఉన్న పని సమయాల కారణంగా, మధ్యరాత్రి లేక ఆ తర్వాత అంటే తెల్లవారుజామువరకు మేము బైబిలు అధ్యయనాలను నిర్వహించాల్సివచ్చేది. అయినా, మా శ్రమకు ఫలితం లభించడం చూసి మేము ఎంత సంతోషించామో! ఎన్నో ఫిలిప్పీనో, కొరియా కుటుంబాలు క్రైస్తవ సత్యాన్ని అంగీకరించి, యెహోవాకు తమను తాము సమర్పించుకున్నాయి.

నా తదుపరి పని నియామకం బంగ్లాదేశ్‌లోని ఢాకా పట్టణం. మేము అక్కడికి 1977 డిసెంబరులో చేరుకున్నాం. మన ప్రకటనా పని చేయడం సులభం కాని దేశాల్లో ఇది ఒకటి. అయితే, ప్రకటనా పనిలో క్రియాశీలంగా ఉండాలనే విషయాన్ని మేము ఎప్పుడూ మనస్సులో ఉంచుకున్నాం. యెహోవా ఆత్మ నడిపింపు సహాయంతో, మేము ఎన్నో నామకార్థ క్రైస్తవ కుటుంబాలను కనుగొనగలిగాం. వారిలో కొందరు పరిశుద్ధ లేఖనాల్లో ఉండే పునరుత్తేజం కలిగించే సత్యవాక్యపు నీళ్ళ కోసం దప్పికతో ఉన్నారు. (యెషయా 55:⁠1) ఆ కారణంగా, మేము ఎన్నో బైబిలు అధ్యయనాలను ప్రారంభించాం.

“మనుష్యులందరు రక్షణపొం[దాలి]” అనేది దేవుని చిత్తం అనే విషయాన్ని మనస్సులో ఉంచుకున్నాం. (1 తిమోతి 2:⁠4) సంతోషకరంగా మాకు సమస్యలు సృష్టించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఎలాంటి వివక్షనైనా ఎదుర్కొనేందుకు మేము స్నేహపూర్వకంగా సంభాషించేలా జాగ్రత్తపడ్డాం. పౌలులానే మేము ‘అందరికి అన్నివిధముల’ వారిగా ఉండడానికి ప్రయత్నించాం. (1 కొరింథీయులు 9:​22) మా సందర్శనానికి కారణమేమిటి అని ఎవరైనా అడిగితే, మేము వినయంగా వారికి వివరించేవాళ్లం, చాలామంది స్నేహపూర్వకంగా ఉన్నట్లు మేము తెలుసుకున్నాం.

మేము ఢాకాలో ఒక స్థానిక సాక్షిని కనుగొని మన క్రైస్తవ కూటాలకు, ఆ తర్వాత ప్రకటనా పనిలో మాతో కలవమని ఆమెను ప్రోత్సహించాం. అదే సమయంలో నా భార్య ఒక కుటుంబంతో బైబిలు అధ్యయనం చేసి వారిని మన కూటాలకు ఆహ్వానించింది. యెహోవా కృపతో కుటుంబం మొత్తం సత్యంలోకి వచ్చారు. ఆ తర్వాత, వారి ఇద్దరు కూతుర్లు బైబిలు సాహిత్యాలను బెంగాలీలోకి అనువదించడంలో సహాయం చేశారు, వారి బంధువులు ఎందరో యెహోవాను తెలుసుకున్నారు. ఎందరో ఇతర బైబిలు విద్యార్థులు సత్యాన్ని అంగీకరించారు. వారిలో చాలామంది ఇప్పుడు పెద్దలుగా, పయినీర్లుగా సేవ చేస్తున్నారు.

ఢాకా అధిక జనాభాగల నగరం కాబట్టి, ప్రకటనా పనిలో మాకు సహాయం చేయడానికి మేము మా కుటుంబ సభ్యులలో కొందరిని ఆహ్వానించాం. చాలామంది ప్రతిస్పందించి, బంగ్లాదేశ్‌లో మాతో కలిసి పనిచేశారు. ఆ దేశంలో సువార్త ప్రకటించడంలో భాగం వహించే అవకాశం దొరికినందుకు మేము ఎంతో ఆనందించాం, అందుకు యెహోవాకు ఎంతో కృతజ్ఞులం. ఒకే ఒక వ్యక్తితో మొదలైన ఆ సేవ ఇప్పుడు బంగ్లాదేశ్‌లో రెండు సంఘాలుగా అభివృద్ధి పొందింది.

1982 జూలైలో మేము బంగ్లాదేశ్‌ విడిచి వెళ్లవలసి వచ్చింది. చెమర్చిన కళ్ళతో మేము సహోదరులకు వీడ్కోలు చెప్పాం. ఎంతోకాలం గడవక ముందే, నాకు ఉగాండాలోని ఎంటెబె అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్యోగం దొరికింది, మేము నాలుగు సంవత్సరాల ఏడు నెలలు అక్కడే ఉన్నాం. ఈ దేశంలో యెహోవా గొప్ప నామాన్ని ఘనపరచడానికి మేము ఏమి చేయవచ్చు?

తూర్పు ఆఫ్రికాలో యెహోవాను సేవించడం

ఎంటెబె అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, మమ్మల్ని మా వసతిగృహానికి తీసుకువెళ్ళడానికి ఒక డ్రైవరు వచ్చాడు. విమానాశ్రయం నుండి బయలుదేరుతుండగా నేను ఆ డ్రైవరుకు దేవుని రాజ్యం గురించి ప్రకటించడం మొదలుపెట్టాను. “మీరు యెహోవాసాక్షులా?” అని ఆయన నన్ను అడిగాడు. నేను అవును అని జవాబు ఇవ్వడంతో, “మీ సహోదరులలో ఒకరు కంట్రోల్‌ టవర్‌లో పనిచేస్తారు” అని ఆ డ్రైవరు చెప్పాడు. వెంటనే, నన్ను అక్కడికి తీసుకువెళ్ళమని ఆయనను అడిగాను. ఆ సహోదరుణ్ణి మేము కలిశాం, ఆయన మమ్మల్ని చూసి చాలా సంతోషించాడు, కూటాలకు, క్షేత్ర సేవకు ఏర్పాట్లు జరిగాయి.

ఉగాండాలో అప్పుడు కేవలం 228 మంది రాజ్య ప్రచారకులే ఉన్నారు. ఎంటెబెలోని ఇద్దరు సహోదరులతో కలిసి సత్యపు విత్తనాలను నాటడంలో మేము మా మొదటి సంవత్సరం గడిపాం. అక్కడి ప్రజలకు చదవడం అంటే ఇష్టం ఆ కారణంగా మేము అనేక సాహిత్యాలతోపాటు, వందలాది పత్రికలను కూడా అందించగలిగాం. వారాంతాలలో ఎంటెబె క్షేత్రంలో ప్రకటించడానికి మాకు సహాయంగా రాజధానియైన కంపాలా నుండి సహోదరులను ఆహ్వానించాం. అక్కడ నేను ఇచ్చిన మొదటి బహిరంగ ప్రసంగానికి నాతోపాటు ఐదుగురు హాజరయ్యారు.

తర్వాతి మూడు సంవత్సరాలు మేము ఎవరికైతే బోధించామో వారు ప్రతిస్పందించి త్వరితగతిన ప్రగతి సాధించడం చూసి మేము జీవితంలో ఆనందకరమైన క్షణాలను చవిచూశాం. (3 యోహాను 4) ఒక ప్రాంతీయ సమావేశంలో మా బైబిలు విద్యార్థులలో ఆరుగురు బాప్తిస్మం తీసుకున్నారు. పూర్తికాల ఉద్యోగాలు ఉన్నా పయినీర్లుగా మేము చేస్తున్న సేవ చూసి పూర్తికాల పరిచర్య చేసేందుకు తాము ప్రోత్సాహం పొందామని వారిలో చాలామంది చెప్పారు.

మేము పనిచేసే స్థలం కూడా ఫలవంతమైన క్షేత్రం కావచ్చని మేము గుర్తించాం. ఒక సందర్భంలో విమానాశ్రయ అగ్నిమాపక దళానికి చెందిన అధికారిని సమీపించి భూపరదైసులో జీవితానికి సంబంధించిన బైబిలు ఆధారిత నిరీక్షణ గురించి ఆయనతో మాట్లాడాను. విధేయులైన మానవజాతి సమాధాన ఐక్యతలతో జీవిస్తూ ఇకమీదట బీదరికాన్ని, ఇళ్ళ కొరతను, యుద్ధాన్ని, అనారోగ్యాన్ని లేదా మరణాన్ని అనుభవించదని ఆయన బైబిలు నుండే ఆయనకు చూపించాను. (కీర్తన 46:9; యెషయా 33:24; 65:21, 22; ప్రకటన 21:​3, 4) తన సొంత బైబిలు నుండే ఈ విషయాలు చదవడం ఆయనలో ఆసక్తిని రేకెత్తించింది. ఆ వెంటనే నేను ఆయనతో బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించాను. ఆయన కూటాలన్నిటికీ హాజరయ్యాడు. అనతికాలంలోనే ఆయన యెహోవాకు తనను తాను సమర్పించుకొని బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ తర్వాత పూర్తికాల పరిచర్యలో మాతో కలిసి పనిచేశాడు.

మేము ఉగాండాలో ఉన్నప్పుడు అక్కడ రెండుసార్లు అంతర్గత పోరాటాలు చెలరేగాయి, అయితే అవి మా ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఆటంకం కాలేదు. అయితే అంతర్జాతీయ సంస్థలలో పనిచేసే వారి మీద ఆధారపడివున్న కుటుంబ సభ్యులను మాత్రం ఆరు నెలల కోసం కెన్యాలోని నైరోబీకి పంపించారు. ఉగాండాలోనే ఉండిపోయిన మేమందరం, వివేకంగా, జాగ్రత్తగా ఉండాల్సి వచ్చినా మన క్రైస్తవ కూటాలను, ప్రకటనా పనిని కొనసాగించాం.

1988 ఏప్రిల్‌లో నా ఉద్యోగ నియామకం ముగిసింది, మేము మళ్ళీ అక్కడి నుండి మరోచోటికి వెళ్ళాం. అక్కడ జరిగిన ఆధ్యాత్మిక పురోభివృద్ధిపట్ల ప్రగాఢమైన సంతృప్తితో ఎంటెబె సంఘాన్ని విడిచివెళ్ళాం. 1997 జూలైలో ఎంటెబె సంఘాన్ని మళ్లీ సందర్శించే అవకాశం మాకు దొరికింది. అప్పటికల్లా ముందు మా బైబిలు విద్యార్థులుగా ఉన్న కొందరు ఇప్పుడు పెద్దలుగా సేవ చేస్తున్నారు. బహిరంగ కూటానికి 106 మంది హాజరవడం చూసి మేము ఎంతగానో పులకించిపోయాం!

సాక్ష్యం అందని ప్రాంతాలకు వెళ్ళడం

సేవ చేసేందుకు మాకు ఇంకా కొత్త అవకాశాలు లభిస్తాయా? తప్పకుండా! నా తదుపరి పని నియామకం సోమాలియాలోని మొగడిషు అంతర్జాతీయ విమానాశ్రయం. సాక్ష్యం అందని ప్రాంతాల్లో సేవ చేసే ఈ కొత్త అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని మేము దృఢంగా నిశ్చయించుకున్నాం.

ఎంబసీలో పనిచేసేవారికి, ఫిలిప్పీనో పనివారికి, ఇతర విదేశీయులకే మా ప్రకటనా పని పరిమితమయింది. తరచూ మేము వారిని మార్కెట్‌లో కలుసుకొనేవాళ్ళం. ప్రేమపూర్వకంగా వారి ఇళ్ళను కూడా సందర్శించేవాళ్ళం. చాతుర్యం, భావనాశక్తి, వివేకాన్ని ఉపయోగించడంతోపాటు యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచడం ద్వారా మేము బైబిలు సత్యాలను ఇతరులతో పంచుకోగలిగాం, అది వివిధ దేశాల వారిలో ఫలాలను ఫలించింది. రెండు సంవత్సరాల తర్వాత, యుద్ధం ప్రారంభం కాకముందే మేము మొగడిషును వదిలివెళ్ళాం.

అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థవారు మ్యాన్‌మార్‌లోని యాగూన్‌లో నాకు తర్వాతి నియామకం ఇచ్చారు. యథార్థ హృదయంగలవారు దేవుని సంకల్పాల గురించి నేర్చుకొనేలా సహాయం చేయడానికి మాకు మళ్లీ మంచి అవకాశాలు లభించాయి. మ్యాన్‌మార్‌ తర్వాత టాంజానియాలోని డార్‌ ఎస్‌ సలామ్‌లో మాకు నియాకం ఇచ్చారు. డార్‌ ఎస్‌ సలామ్‌లో ఇంటింటా సువార్త ప్రకటించడం చాలా సులభంగా ఉండేది ఎందుకంటే అక్కడ ఆంగ్లం మాట్లాడే ప్రజలు ఉన్నారు.

మేము పని చేసిన అన్ని దేశాల్లో, చాలా సందర్భాల్లో, యెహోవాసాక్షుల పని మీద ఆంక్షలు ఉన్నప్పటికీ పరిచర్యలో పాల్గొనేటప్పుడు మాకు చాలా తక్కువ సమస్యలు ఎదురయ్యాయి. నా పనికి ఉన్న హోదా కారణంగా నేను ప్రభుత్వంతో లేక అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయవలసివచ్చేది, ఆ కారణంగా మా కార్యకలాపాల గురించి ఎవరూ ప్రశ్నించలేదు.

నా లౌకిక ఉద్యోగం కారణంగా నేను నా భార్య మూడు దశాబ్దాలు సంచారకులుగా జీవించాల్సి వచ్చింది. అయినా నా ఉద్యోగాన్ని మేము, మా ప్రధాన లక్ష్యాన్ని సాధించేందుకు ఒక సాధనంగా మాత్రమే భావించాం. దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలకు మద్దతు ఇవ్వడమే ఎప్పటికీ మా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. మారుతున్న పరిస్థితులను సద్వినియోగం చేసుకొనేందుకు మాకు సహాయం చేసినందుకు, సుదూర ప్రాంతాలలో సువార్తను వ్యాప్తిచేసే గొప్ప ఆధిక్యతను ఆనందించే అవకాశం ఇచ్చినందుకు యెహోవాకు మేము కృతజ్ఞులం.

మేము ప్రారంభించిన స్థలానికే తిరిగి రావడం

యాభై ఎనిమిది ఏండ్ల వయస్సులో నేను స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి ఫిలిప్పీన్స్‌కు తిరిగి రావడానికి నిర్ణయించుకున్నాను. మేము తిరిగి వచ్చిన తర్వాత మా మార్గాన్ని నిర్దేశించమని యెహోవాకు ప్రార్థించాం. కావిటి రాష్ట్రంలోని ట్రెసి మార్‌టిరెస్‌లోని ఒక సంఘంలో మేము సేవ చేయడం ప్రారంభించాం. మేము అక్కడికి వచ్చినప్పుడు కేవలం 19 మంది దేవుని రాజ్య ప్రచారకులే ఉన్నారు. ప్రతీరోజు ప్రకటనా కార్యక్రమం ఉండేటట్లు సంస్థీకరించబడింది, ఎన్నో బైబిలు అధ్యయనాలు ప్రారంభించబడ్డాయి. సంఘం పెరగనారంభించింది. ఒక సమయంలో నా భార్య 19 గృహ బైబిలు అధ్యయనాలను, నేను 14 గృహ బైబిలు అధ్యయనాలను నిర్వహించాం.

కొద్దికాలానికి రాజ్యమందిరం సరిపోలేదు. ఈ విషయం గురించి యెహోవాకు ప్రార్థించాం. ఒక ఆధ్యాత్మిక సహోదరుడు, ఆయన భార్య కొంత స్థలాన్ని విరాళంగా ఇచ్చారు, కొత్త రాజ్యమందిర నిర్మాణానికి బ్రాంచి కార్యాలయం రుణాన్ని ఆమోదించింది. కొత్త నిర్మాణం ప్రకటనా పని మీద చాలా ప్రభావం చూపింది, ప్రతీవారం హాజరయ్యే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం, మేము 17 మంది ప్రచారకులున్న వేరే సంఘానికి సహాయం అందించేందుకు వెళ్లడానికి గంటకన్నా ఎక్కువసేపు ప్రయాణిస్తాం.

నేను నా భార్య వివిధ దేశాల్లో సేవచేయడానికి దొరికిన ఆధిక్యతను విలువైనదిగా ఎంచుతున్నాం. సంచారకులుగా మేము గడిపిన జీవితాన్ని మననం చేసుకున్నప్పుడు, యెహోవా గురించి ఇతరులు తెలుసుకొనేందుకు సహాయం చేయడం ద్వారా సాధ్యమైనంత శ్రేష్ఠంగా ఉపయోగించామని తెలుసుకొని మేము ఎంతో సంతృప్తిని అనుభవిస్తున్నాం!

[24, 25వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

టాంజానియా

ఉగాండా

సోమాలియా

ఇరాన్‌

బంగ్లాదేశ్‌

మ్యాన్‌మార్‌

లావోస్‌

థాయ్‌లాండ్‌

ఫిలిప్పీన్స్‌

[23వ పేజీలోని చిత్రం]

నా భార్య ఆరెయాతో