కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రూతు పుస్తకంలోని ముఖ్యాంశాలు

రూతు పుస్తకంలోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

రూతు పుస్తకంలోని ముఖ్యాంశాలు

అది ఇద్దరు స్త్రీలకు ఒకరిపట్ల ఒకరికి ఉన్న విశ్వాస్యతకు సంబంధించిన, హృదయాన్ని కదిలించే నిజ జీవిత కథ. అది యెహోవా దేవునిపట్ల కృతజ్ఞతను, ఆయన ఏర్పాటుపై నమ్మకాన్ని చూపించే వృత్తాంతం. అది మెస్సీయ వంశావళి విషయంలో యెహోవాకున్న ప్రగాఢమైన శ్రద్ధను ఉన్నతపరిచే కథ. అది ఒక కుటుంబానికి సంబంధించిన సుఖదుఃఖాలను చూపించే హృదయ విదారక కథ. అదే రూతు అనే బైబిలు పుస్తకం, ఆ పుస్తకంలో పైన పేర్కొనబడినవే కాక మరెన్నో విశేషాలు ఉన్నాయి.

రూతు పుస్తకం ఇశ్రాయేలులో “న్యాయాధిపతులు ఏలిన దినములయందు” దాదాపు 11 సంవత్సరాల చరిత్రను తెలియజేస్తోంది. (రూతు 1:1) దానిలోని సంఘటనలు న్యాయాధిపతుల కాలం ప్రారంభంలో జరిగివుండవచ్చు, ఎందుకంటే ఈ నిజ జీవిత కథలోని ఒక పాత్రధారి భూస్వామియైన బోయజు, యెహోషువ కాలానికి చెందిన రాహాబు కుమారుడు. (యెహోషువ 2:1, 2; రూతు 2:1; మత్తయి 1:5) ఈ పుస్తకాన్ని సా.శ.పూ. 1090లో బహుశా సమూయేలు ప్రవక్త వ్రాసి ఉంటాడు. బైబిల్లో ఈ ఒక్క పుస్తకానికి మాత్రమే ఇశ్రాయేలీయురాలు కాని స్త్రీ పేరు ఇవ్వబడింది. దానిలోని సందేశం ‘సజీవమైనది, బలముగలది.’​—⁠హెబ్రీయులు 4:​12.

“నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను”

(రూతు 1:1-2:23)

నయోమి రూతులు బేత్లెహేముకు చేరుకున్నప్పుడు, అందరి అవధానాన్ని చూరగొన్నారు. వాళ్ళిద్దరిలో పెద్దదైన నయోమిని సంబోధించి ఆ పట్టణ స్త్రీలు “ఈమె నయోమి గదా?” అని ప్రశ్నించడం ప్రారంభించారు. దానికి నయోమి, “సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధిగల దాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను” అని చెప్పింది.​—⁠రూతు 1:19-21.

ఇశ్రాయేలులో కరువు కారణంగా నయోమి కుటుంబం బేత్లెహేము నుండి మోయాబు దేశానికి తరలి వెళ్ళినప్పుడు ఆమె ‘సమృద్ధిగలదిగా’ వెళ్ళింది ఎందుకంటే ఆమెకప్పుడు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే వాళ్ళు మోయాబు దేశంలో నివాసమేర్పరచుకున్న కొంతకాలానికి ఆమె భర్త ఎలీమెలెకు మరణించాడు. ఆ తర్వాత ఆమె ఇద్దరు కుమారులు మోయాబు స్త్రీలైన ఓర్పాను, రూతును పెళ్ళి చేసుకున్నారు. దాదాపు పది సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఇద్దరు కుమారులు పిల్లలు లేకుండానే మరణించారు, దానితో ఆ ముగ్గురు స్త్రీలు ఒంటరిగా మిగిలారు. నయోమి యూదాకు తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆమె కోడళ్ళు కూడా ఆమెతోపాటే బయలుదేరారు. అయితే మార్గ మధ్యలో నయోమి, తన కోడళ్ళను మోయాబుకు తిరిగి వెళ్ళిపోయి అక్కడ తమ సొంతవారిని ఎవరినైనా పెళ్ళి చేసుకొమ్మని కోరింది. ఓర్పా దానికి ఒప్పుకొని తిరిగి వెళ్ళిపోయింది. అయితే రూతు మాత్రం నయోమినే అంటిపెట్టుకొని, “నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు” అని చెప్పింది.​—⁠రూతు 1:16.

అప్పుడు ఆ ఇద్దరు విధవరాండ్రు, అంటే నయోమి రూతులు, యవలు కోతకొచ్చే సమయానికి బేత్లెహేముకు చేరుకున్నారు. దేవుని ధర్మశాస్త్రము చేసిన ఏర్పాటును సద్వినియోగం చేసుకుని రూతు వెంటనే ఒక పొలంలో పరిగె ఏరుకోవడం ప్రారంభించింది. ఆ పొలం ఎలీమెలెకు బంధువు, వయస్సు మళ్ళిన యూదుడు అయిన బోయజు పొలం అని వారికి ఆ తర్వాతే తెలిసింది. రూతు బోయజు ఆదరం పొంది “యవలకోతయు గోధుమల కోతయు ముగియువరకు” ఆయన పొలములోనే పరిగె ఏరుకుంది.​—⁠రూతు 2:23.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:​8​—⁠నయోమి తన కోడళ్ళతో తమ తండ్రుల ఇళ్ళకు వెళ్ళమని చెప్పకుండా “మీరు మీ తల్లుల యిండ్లకు తిరిగి వెళ్లుడి” అని ఎందుకు చెప్పింది? ఆ సమయంలో ఓర్పా తండ్రి బ్రతికి ఉన్నాడా లేడా అనే సంగతి మనకు తెలియజేయబడలేదు. అయితే రూతు తండ్రి అప్పటికింకా బ్రతికే ఉన్నాడు. (రూతు 2:11) అయినా కూడా నయోమి తల్లుల ఇళ్ళ గురించే మాట్లాడింది, తల్లుల గురించి ప్రస్తావించడం ద్వారా వారికి తమ తల్లుల అనురాగాన్ని గుర్తు చేయాలని ఆమె అలా మాట్లాడి ఉండవచ్చు. తమ ప్రియమైన అత్తను విడిచిపెట్టి వెళ్తున్నందువల్ల వారికి కలిగే బాధను తట్టుకోవడానికి అది సహాయం చేస్తుందని ఆమె అనుకొని ఉండవచ్చు. అంతేకాకుండా, నయోమి పరిస్థితికి భిన్నంగా రూతు, ఓర్పాల తల్లులకు స్థిర నివాసాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేయడానికి కూడా ఆమె అలా అనివుండవచ్చు.

1:​13, 21​—⁠యెహోవా నయోమి జీవితాన్ని కష్టాలపాలు చేసి ఆమెను బాధించాడా? లేదు. నయోమి దేవునిపై ఎలాంటి నిందా మోపలేదు. అయితే ఆమె తనకు జరిగినదంతా చూసి యెహోవా తనకు విరోధముగా ఉన్నాడని భావించింది. ఆమె నిరాశానిస్పృహలకు లోనయ్యింది. అంతేకాక ఆ రోజుల్లో పిల్లలు ఉండడం దేవుని ఆశీర్వాదంగాను, గొడ్రాలిగా ఉండడం శాపంగాను భావించేవారు. మనవలు మనవరాళ్ళు లేకపోవడం, దానికితోడు తన ఇద్దరు కుమారులు కూడా చనిపోవడంతో నయోమి యెహోవా తనను అవమానపరిచాడు అని తలంచింది.

2:​12​—⁠రూతుకు యెహోవానుండి ఎలాంటి “సంపూర్ణమైన బహుమానం” లభించింది? రూతు ఒక కుమారుణ్ణి కని చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యమైన వంశానుక్రమంలో అంటే యేసుక్రీస్తు వంశానుక్రమంలో భాగంగా ఉండే ఆధిక్యతను పొందింది.​—⁠రూతు 4:13-17; మత్తయి 1:5, 16.

మనకు పాఠాలు:

1:⁠8; 2:​20. నయోమి కష్టాలు అనుభవించాల్సి వచ్చినా కూడా యెహోవా ప్రేమపూర్వక దయపై తనకున్న నమ్మకాన్ని కాపాడుకుంది. మనం కూడా, ప్రాముఖ్యంగా, తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు అలాగే చేయాలి.

1:⁠9. ఇల్లు కుటుంబ సభ్యులందరూ భోజనం చేసి విశ్రమించే స్థలంగా మాత్రమే ఉండకూడదు. అది విశ్రాంతిని ఓదార్పును ఇచ్చే శాంతియుతమైన స్థలంగా ఉండాలి.

1:​14-16. ఓర్పా ‘తన జనులయొద్దకును తన దేవునియొద్దకును తిరిగి వెళ్ళిపోయింది.’ రూతు అలా వెళ్ళలేదు. ఆమె తన స్వదేశపు సౌకర్యాలను, భద్రతను వదిలిపెట్టి యెహోవాకు యథార్థంగా నిలిచింది. దేవునిపట్ల విశ్వసనీయమైన ప్రేమను పెంపొందించుకోవడం, స్వయం త్యాగపూరిత స్ఫూర్తిని కాపాడుకోవడం మనం స్వార్థపూరితమైన కోరికలకు లొంగిపోయి ‘నశించుటకు వెనుకతీసేవారముగా’ ఉండకుండా మనల్ని కాపాడుతుంది.​—⁠హెబ్రీయులు 10:39.

2:​2. పరదేశులు, బీదల ప్రయోజనార్థం చేయబడిన పరిగె ఏరుకొనే ఏర్పాటును రూతు సద్వినియోగం చేసుకుంది. ఆమె వినయ మనస్కురాలు. అవసరంలోవున్న క్రైస్తవుడు తన తోటి విశ్వాసుల ప్రేమపూర్వకమైన సహాయాన్ని స్వీకరించడానికి లేదా తాను పొందగల ప్రభుత్వ సహాయాన్ని స్వీకరించడానికి వెనుకతీసేలా మరీ గర్వంగా ఉండకూడదు.

2:⁠7. రూతుకు పరిగె ఏరుకునే హక్కు ఉన్నా ఆమె అలా చేయడానికి ముందు అనుమతి తీసుకుంది. (లేవీయకాండము 19:9, 10) అది ఆమె వినయస్థురాలని సూచిస్తోంది. మనం ‘వినయమును వెదకడం’ జ్ఞానయుక్తమైనది ఎందుకంటే “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు.”​—⁠జెఫన్యా 2:3; కీర్తన 37:11.

2:​11. రూతు నయోమికి కేవలం ఒక బంధువు మాత్రమే కాదు. ఆమె ఒక నిజమైన స్నేహితురాలిగా ఉంది. (సామెతలు 17:17) వారిద్దరి స్నేహం బలమైనది ఎందుకంటే అది ప్రేమ, విశ్వసనీయత, సానుభూతి, దయ, స్వయంత్యాగపూరిత స్ఫూర్తి వంటి లక్షణాలపై ఆధారపడింది. అంతకంటే ప్రాముఖ్యంగా అది వారి ఆధ్యాత్మికతపై అంటే యెహోవాకు సేవ చేయాలని ఆయన ఆరాధకుల మధ్య ఉండాలని వారికున్న కోరికపై ఆధారపడి ఉంది. మనం కూడా సత్యారాధకులతో యథార్థమైన స్నేహాలు పెంపొందించుకోవడానికి చక్కని అవకాశాలు ఉన్నాయి.

2:​15-17. బోయజు రూతు పనిభారాన్ని తగ్గించేందుకు ఏర్పాట్లు చేసినా కూడా ‘ఆమె అస్తమయము వరకు ఆ చేనిలో ఏరుకుంటూనే ఉంది.’ రూతు కష్టపడి పని చేసే వ్యక్తి. క్రైస్తవులు కష్టపడి పనిచేసే వారిగా పేరు తెచ్చుకోవాలి.

2:​19-22. నయోమి, రూతు సాయంకాలాలు హాయిగా మాట్లాడుకునేవారు, నయోమి తనకంటే చిన్నదైన రూతు వ్యవహారాల్లో ఆసక్తి చూపించేది, ఇద్దరూ మనస్సు విప్పి తమ తలంపులను, భావాలను స్వేచ్ఛగా పంచుకునేవారు. క్రైస్తవ కుటుంబంలో కూడా అలాగే ఉండాలి.

2:​22, 23. యాకోబు కూతురైన దీనాలా కాకుండా రూతు యెహోవా ఆరాధకులతో సహవసించాలని కోరుకుంది. ఆమె మనకు ఎంత చక్కని ఉదాహరణో కదా!​—⁠ఆదికాండము 34:1, 2; 1 కొరింథీయులు 15:33.

నయోమి మళ్ళీ ‘సమృద్ధిగలదానిగా’ అయ్యింది

(రూతు 3:1-4:22)

నయోమి ఇక పిల్లలు కనలేనంత వృద్ధురాలయ్యింది. కాబట్టి తనకు బదులుగా రూతు బంధువుని ధర్మము ద్వారా లేక మరిది ధర్మము ద్వారా పెళ్ళి చేసుకొని పిల్లలను కనాలని ఆమె చెప్పింది. నయోమి చెప్పిన ప్రకారమే రూతు తనకు బంధువుని ధర్మము జరిగించమని బోయజును కోరింది. బోయజు అలా చేయడానికి తాను సిద్ధమేనని చెప్పాడు. అయితే బోయజుకంటే దగ్గరి బంధువు ఇంకొక వ్యక్తి ఉండడంవల్ల అతనికి మొదటి అవకాశం ఇవ్వవలసి వచ్చింది.

విషయాన్ని నిర్ణయించడానికి బోయజు వెంటనే చర్య తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయమే ఆయన బేత్లెహేముకు చెందిన పదిమంది పెద్దలను ఆ బంధువు దగ్గరకు పిలిపించి, అతను బంధువు ధర్మము చేయడానికి సుముఖంగా ఉన్నాడేమో అడిగాడు. ఆ వ్యక్తి అందుకు నిరాకరించాడు. కాబట్టి బోయజు రూతుకు బంధువు ధర్మము జరిగించి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు, ఆయన పేరు ఓబేదు, ఆయనే దావీదుకు తాతయ్య. అప్పుడు బేత్లెహేము స్త్రీలు నయోమితో ఇలా అన్నారు: “యెహోవా స్తుతినొందుగాక . . . నిన్ను ప్రేమించి యేడుగురు కుమారులకంటె నీ కెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను; ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగును.” (రూతు 4:14, 15) బేత్లెహేముకు “రిక్తురాలిగా” తిరిగి వచ్చిన స్త్రీ మళ్ళీ ‘సమృద్ధిగలదానిగా’ అయ్యింది.​—⁠రూతు 1:21.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

3:​11​—⁠రూతు “యోగ్యురాలు” అని ఎలా పేరు తెచ్చుకోగలిగింది? ఇతరులు రూతును ప్రశంసించడానికిగల కారణం “జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము” కాదు. దానికి బదులుగా ఆమె “హృదయ అంతరంగ స్వభావము” కారణంగా అంటే ఆమె విశ్వసనీయత, ప్రేమ, వినయం, సాత్వికము, కష్టపడి పనిచేసే లక్షణం, స్వయం త్యాగపూరిత స్ఫూర్తి కారణంగా ఇతరులు ఆమెను ప్రశంసించారు. రూతులాగే మంచి పేరు తెచ్చుకోవాలనుకునే దైవభక్తిగల స్త్రీలు ఎవరైనా సరే ఈ లక్షణాలను పెంపొందించుకోవడానికి కృషి చేయాలి.​—⁠1 పేతురు 3:3, 4; సామెతలు 31:28-31.

3:​14​—⁠రూతు బోయజులు తెల్లవారక ముందే ఎందుకు లేచారు? ఆ రాత్రి వారిద్దరి మధ్యా అనైతికమైనదేదో జరిగినందుకు, వారు దానిని రహస్యంగా ఉంచాలనుకున్నందుకు కాదు. రూతు ఆ రాత్రి చేసిన పనులు సాధారణంగా మరిది ధర్మము జరిగించుకునే హక్కు కోసం ప్రయత్నించే స్త్రీలు చేసేవాటికి అనుగుణంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది. ఆమె నయోమి ఉపదేశం ప్రకారమే ప్రవర్తించింది. అంతేకాకుండా, బోయజు ప్రతిస్పందించిన విధానాన్ని బట్టి రూతు క్రియల్లో ఆయనకు ఏ తప్పూ కనిపించలేదని కూడా స్పష్టమవుతోంది. (రూతు 3:2-13) కాబట్టి రూతు బోయజులు ఆధారంలేని పుకార్లకు తావివ్వకుండా ఉండాలని తెల్లవారక ముందే లేచి ఉంటారు.

3:​15​—⁠బోయజు రూతుకు ఆరుకొలల యవలు ఇవ్వడంలోని ప్రత్యేకత ఏమిటి? ఆయనలా చేయడం, ఆరు రోజులు పని చేసిన తర్వాత విశ్రాంతి దినం వచ్చినట్లే రూతు విశ్రాంతి దినం సమీపించిందని సూచిస్తుండవచ్చు. రూతు తన భర్త ఇంట్లో “నెమ్మదినొందునట్లు” బోయజు నిశ్చయపర్చుకున్నాడు. (రూతు 1:9; 3:1) అంతేకాకుండా రూతు తన తలపై మోసుకెళ్ళగలిగింది ఆరుకొలల యవలే కావచ్చు.

3:​16​—⁠హీబ్రూ మూలపాఠం ప్రకారం నయోమి రూతును ‘నా కుమారీ, నీవెవరవు?’ అని ప్రశ్నించింది. ఆమె ఎందుకు అలా అడిగింది? ఆమె తన కోడలిని గుర్తుపట్టలేదా? ఆ అవకాశం కూడా ఉంది, ఎందుకంటే రూతు నయోమి వద్దకు తిరిగి వచ్చినప్పుడు ఇంకా చీకటిగానే ఉండివుండవచ్చు. అయితే ఆ ప్రశ్న, బంధువు ధర్మము తర్వాత రూతుకు లభించిన కొత్త గుర్తింపు గురించి నయోమి అడుగుతోందని కూడా సూచించవచ్చు.

4:​6​—⁠బంధువుని ధర్మము జరిగించే వ్యక్తి ఆ ధర్మము జరిగించడం ద్వారా తన స్వాస్థ్యమును ఎలా ‘పోగొట్టుకొనే’ అవకాశం ఉంది? బీదవాడిగా మారిన వ్యక్తి తన స్వాస్థ్యములోని స్థలాన్ని అమ్మితే, బంధువు ధర్మము జరిగించే వ్యక్తి ఆ స్థలాన్ని అమ్మినది మొదలుకొని తర్వాతి సునాద సంవత్సరము వరకు మిగిలివున్న సంవత్సరములను లెక్కించి దానినిబట్టి నిర్ణయించబడిన సొమ్ము కట్టి ఆ స్థలాన్ని విడిపించాలి. (లేవీయకాండము 25:25-27) అలా చేయడంవల్ల ఆయన ఆస్తి తక్కువవుతుంది. అంతేకాకుండా రూతుకు కుమారుడు పుడితే, బంధువు ధర్మము జరిగించిన వ్యక్తి సమీప బంధువులకు కాకుండా రూతు కుమారునికే ఆ పొలం స్వాస్థ్యంగా లభిస్తుంది.

మనకు పాఠాలు:

3:​12; 4:​1-6. బోయజు యెహోవా ఏర్పాటును చాలా జాగ్రత్తగా పాటించాడు. మనం దైవపరిపాలనా పద్ధతులను జాగ్రత్తగా పాటిస్తున్నామా?​—⁠1 కొరింథీయులు 14:39.

3:​18. నయోమికి బోయజుపై దృఢమైన విశ్వాసం ఉంది. మనకు కూడా నమ్మకమైన తోటి విశ్వాసులపై అలాంటి దృఢ విశ్వాసం ఉండవద్దా? రూతు తనకు అసలు పరిచయంలేని వ్యక్తిని, బైబిలులో పేరు తెలియజేయబడని వ్యక్తిని మరిది ధర్మము ప్రకారం పెళ్ళి చేసుకోవడానికి సుముఖత చూపించింది. (రూతు 4:1) ఎందుకు? ఎందుకంటే ఆమెకు దేవుని ఏర్పాటుపై నమ్మకం ఉంది. మనకు అలాంటి నమ్మకం ఉందా? ఉదాహరణకు మనం వివాహ భాగస్వామి కోసం వెతికేటప్పుడు “ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసికొనవలెను” అనే ఉపదేశాన్ని లక్ష్యపెడతామా?​—⁠1 కొరింథీయులు 7:39.

4:​13-16. రూతు అంతకుముందు మోయాబీయురాలిగా ఉండి, కెమోషు దేవతను ఆరాధించినా కూడా ఆమెకు ఎంత గొప్ప ఆధిక్యత లభించిందో కదా! అది “పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలనవైనను కాదు గాని, కరుణించు దేవునివలననే అగును” అనే సూత్రాన్ని ఉదాహరిస్తోంది.​—⁠రోమీయులు 9:16.

“దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును”

రూతు పుస్తకం యెహోవాను ప్రేమపూర్వక దయవున్న దేవునిగా, తన విశ్వసనీయ సేవకుల పక్షాన చర్య తీసుకునే దేవునిగా చిత్రీకరిస్తోంది. (2 దినవృత్తాంతములు 16:9) రూతు ఎలా ఆశీర్వదించబడిందో ఆలోచించినప్పుడు మనం “ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు” పూర్తిగా నమ్ముతూ స్థిర విశ్వాసంతో దేవునిపై నమ్మకముంచడంలోని విలువను గ్రహిస్తాము.​—⁠హెబ్రీయులు 11:⁠6.

రూతు, నయోమి, బోయజు యెహోవా ఏర్పాటుపై తమ పూర్తి నమ్మకాన్నుంచారు, ఆ కారణంగా వారు సత్ఫలితాలనే పొందారు. అదే విధంగా “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగు[తాయి].” (రోమీయులు 8:28) కాబట్టి మనం అపొస్తలుడైన పేతురు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని అన్వయించుకుందాము: “దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.”​—⁠1 పేతురు 5:6, 7.

[26వ పేజీలోని చిత్రం]

రూతు నయోమిని ఎందుకు విడిచిపెట్టలేదో మీకు తెలుసా?

[27వ పేజీలోని చిత్రం]

రూతు “యోగ్యురాలు” అని ఎలా పేరు తెచ్చుకోగలిగింది?

[28వ పేజీలోని చిత్రం]

రూతుకు యెహోవానుండి ఎలాంటి “సంపూర్ణమైన బహుమానం” లభించింది?