కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వాగ్యుద్ధాలు—ఎందుకు హాని చేస్తాయి?

వాగ్యుద్ధాలు—ఎందుకు హాని చేస్తాయి?

వాగ్యుద్ధాలు​—⁠ఎందుకు హాని చేస్తాయి?

“మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి?”​—⁠యాకోబు 4:⁠1.

ఈప్రశ్నను బైబిలు రచయిత అయిన యాకోబు, ఆ కాలంలో యుద్ధాలు చేస్తున్న రోమా సైనికులను ఉద్దేశించి అడగడం లేదు. సా.శ. మొదటి శతాబ్దంలోని యూదా సికారియొయి లేదా డాగర్‌ మెన్‌ చేస్తున్న గెరిల్లా పోరాట ఉద్దేశాల గురించి అడగడం లేదు. ఆయన కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే తగాదాలను సూచిస్తున్నాడు. ఎందుకు? ఎందుకంటే యుద్ధాల్లాగే వ్యక్తిగత తగాదాలు కూడా వినాశకరమైనవే. ఈ బైబిలు వృత్తాంతాలను గమనించండి.

పూర్వీకుడైన యాకోబు కుమారులు తమ తమ్ముడు యోసేపును చాలా ద్వేషించారు, చివరకు అతడ్ని బానిసగా అమ్మేశారు. (ఆదికాండము 37:​4-28) ఆ తర్వాత, ఇశ్రాయేలు రాజైన సౌలు దావీదును చంపడానికి ప్రయత్నించాడు. కారణమేమిటి? అతనికి దావీదు మీద ఉన్న ఈర్ష్యే. (1 సమూయేలు 18:​7-11; 23:​14, 15) మొదటి శతాబ్దంలో యువొదియ, సుంటుకే అనే ఇద్దరు క్రైస్తవ స్త్రీలు తమ తగాదాలతో మొత్తం సంఘంలోని శాంతినే పాడుచేశారు.​—⁠ఫిలిప్పీయులు 4:⁠2.

ఇటీవలి కాలాల వరకు, ప్రజలు పరస్పరం పిస్తోళ్లతో తలపడి తమ భేదాభిప్రాయాలను పరిష్కరించుకునేవారు. అలాంటి పోరాటాల్లో తరచూ ఒక వ్యక్తి మరణిస్తాడు లేదా జీవితాంతం వికలాంగుడవుతాడు. నేడు, కలహపడుతున్నవారు సాధారణంగా కఠినమైన, వ్యంగ్యమైన మాటలనే తమ ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారు. అలాంటి వాగ్దాడులు రక్తం చిందించకపోయినా, మనోభావాలకూ ప్రతిష్ఠకూ హాని చేస్తాయి. అలాంటి “యుద్ధాల్లో” అమాయకులే ఎక్కువగా బాధపడతారు.

కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆంగ్లికన్‌ చర్చి ప్రీస్టు, చర్చి ఆర్థిక వ్యవహారాలను సరిగా చూసుకోవడం లేదని మరొక ప్రీస్టును తప్పు పట్టినప్పుడు ఏమి జరిగిందో పరిశీలించండి. వారి తగాదా వీధికెక్కింది, చివరకు వారు సేవ చేస్తున్న సంఘం అంతఃకలహాలతో చీలిపోయింది. కొందరు సభ్యులు తమ ప్రత్యర్థి వర్గానికి చెందిన ప్రీస్టు నిర్వహించే కూటాలకు తాము హాజరు కామన్నారు. వారి మధ్య చెలరేగిన తిరస్కారం ఎంతటి తీవ్రరూపం దాల్చిందంటే, చివరకు వారు చర్చిలో ఆరాధనా సమయంలోనే ఒకరినొకరు చూసుకోకుండా ముఖాలు తిప్పుకునేవారు. తప్పుపట్టిన ప్రీస్టు మీద లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణ పడేసరికి తగాదా ఇంకా తీవ్రతరమైంది.

క్యాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ వారి తగాదాను “క్యాన్సర్‌,” “మన ప్రభువును అవమానపరిచే కళంకం” అంటూ గొడవ మానుకోండని ఆ మతగురువులను ఇద్దరినీ కోరాడు. 1997లో వారిలోని ఒక ప్రీస్టు పదవి నుండి తొలగిపోయేందుకు అంగీకరించాడు. రెండవ ప్రీస్టు తనకు తప్పనిసరి పదవీ విరమణ పొందవలసిన వయస్సు వచ్చేంత వరకు పదవిలోనే కొనసాగాడు. అతను తనకు సాధ్యమైన చివరి క్షణం వరకు ఉండి, 2001 ఆగస్టు 7న తన 70వ జన్మదినాన పదవీ విరమణ చేశాడు. అతను పదవీ విరమణ చేసిన రోజు “సెయింట్‌” విట్రిసియస్‌ వేడుక దినం అని ద చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ న్యూస్‌పేపర్‌ పేర్కొంది. “సెయింట్‌” విట్రిసియస్‌ ఎవరు? నాల్గవ శతాబ్దానికి చెందిన ఒక బిషప్పు, సైన్యంలో చేరి యుద్ధం చేయడానికి నిరాకరించినందుకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడని చెబుతారు. ఆ పేపర్‌ ఇరువురి దృక్పథాల మధ్య భిన్నత్వాన్ని సూచిస్తూ ఇలా వ్యాఖ్యానించింది: “[రిటైర్‌ అవుతున్న ప్రీస్టుకు] చర్చిలో కొట్లాడడం సరైనది కాదని నిరాకరించే లక్షణం లేదు.”

ఆ ప్రీస్టులు “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగియుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి” అన్న రోమీయులు 12:​17, 18లోని హితవును అన్వయించుకున్నట్లయితే తమకు తాము హాని చేసుకోకుండా, ఇతరులకు హాని కలిగించకుండా ఉండేవారే.

మీ విషయం ఏమిటి? ఎవరైనా మీ మనస్సు నొప్పిస్తే, మీలోని కోపం మిమ్మల్ని వాగ్యుద్ధానికి పురికొల్పుతుందా? లేక మీరు కఠినమైన మాటలు మాట్లాడకుండా సమాధానపడే మార్గాన్ని తెరచి ఉంచుతారా? మీరు ఎవరి మనసునైనా నొప్పిస్తే, మీరు ఆ వ్యక్తి నుండి తప్పించుకు తిరుగుతూ అలా కొద్దికాలం ఆగితే అవతలి వ్యక్తి ఆ విషయం మరచిపోతాడని భావిస్తారా? లేక వెంటనే క్షమాపణలు అడుగుతారా? మీరు క్షమించమని అడిగినా లేక వేరే వ్యక్తిని క్షమించినా, సమాధానం నెలకొల్పడానికి ప్రయత్నించడం మీ సంక్షేమానికే తోడ్పడుతుంది. దీని తర్వాతి ఆర్టికల్‌ చూపిస్తున్నట్లుగా, దీర్ఘకాలం నుండి ఉన్న తగాదాలను పరిష్కరించుకోవడానికి కూడా బైబిలు సలహా మనకు సహాయపడుతుంది.