కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వివాహిత జంటలకు జ్ఞానవంతమైన మార్గనిర్దేశం

వివాహిత జంటలకు జ్ఞానవంతమైన మార్గనిర్దేశం

వివాహిత జంటలకు జ్ఞానవంతమైన మార్గనిర్దేశం

“స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి.”​—⁠ఎఫెసీయులు 5:22, 25.

“ఏకశరీరముగా” ఉండేందుకు దేవుడు జతపరచిన స్త్రీపురుషుల బంధమే వివాహమని యేసు చెప్పాడు. (మత్తయి 19:​5, 6) దీనిలో విభిన్న వ్యక్తిత్వాలున్న ఇద్దరు వ్యక్తులు సమిష్టి ఆసక్తిని పెంపొందించుకోవడాన్ని నేర్చుకోవడం, సాధారణ లక్ష్యసాధన కోసం కలిసి పనిచేయడం ఇమిడివుంది. వివాహమనేది జీవితకాలపు నిబద్ధతే గానీ, తేలికగా కొట్టిపారేసే సాధారణ ఒప్పందం కాదు. అనేక దేశాల్లో విడాకులు తీసుకోవడం కష్టమేమీ కాదు, కానీ ఒక క్రైస్తవుని దృష్టిలో వివాహబంధం పవిత్ర బంధం. గంభీరమైన కారణం ఉంటేనే అది రద్దవుతుంది.​—⁠మత్తయి 19:9.

2 వివాహ సలహావేత్త ఒకరు ఇలా చెప్పారు: “కొత్తగా ఉత్పన్నమయ్యే సమస్యలకు తగ్గట్టు మారుతూ, తలెత్తే సమస్యలతో వ్యవహరిస్తూ, జీవితంలోని ప్రతీ దశలో అందుబాటులోవున్న వనరులను ఉపయోగిస్తూ ఎడతెగక ముందుకు సాగిపోయే ప్రక్రియే విజయవంతమయ్యే వివాహం.” క్రైస్తవ దంపతులకు ఆ వనరుల్లో బైబిల్లోని జ్ఞానయుక్తమైన సలహా, తోటి క్రైస్తవుల మద్దతు, యెహోవాతో సన్నిహితమైన ప్రార్థనాపూర్వక సంబంధం ఒక భాగం. విజయవంతమయ్యే వివాహం కష్టాలను అధిగమించడమే కాక, సంవత్సరాలు గడిచేకొద్దీ భార్యాభర్తలకు సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది. అంతకంటే ప్రాముఖ్యంగా అది వివాహ ఆరంభకుడైన యెహోవా దేవుణ్ణి ఘనపరుస్తుంది.​—⁠ఆదికాండము 2:18, 21-24; 1 కొరింథీయులు 10:31; ఎఫెసీయులు 3:15; 1 థెస్సలొనీకయులు 5:17.

యేసును ఆయన సంఘాన్ని అనుకరించండి

3 రెండువేల సంవత్సరాల పూర్వం, అపొస్తలుడైన పౌలు క్రైస్తవ జంటలకు జ్ఞానయుక్తమైన సలహా ఇస్తూ ఇలా వ్రాశాడు: “సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.” (ఎఫెసీయులు 5:​24, 25) ఇక్కడ విషయం ఎంత చక్కగా పోల్చి చెప్పబడిందో గదా! తమ భర్తలకు వినయంతో లోబడే క్రైస్తవ భార్యలు శిరస్సత్వపు సూత్రాన్ని గుర్తిస్తూ, దానిని పాటిస్తూ సంఘాన్ని అనుకరిస్తారు. అనుకూల సమయాల్లోనూ పరీక్షా సమయాల్లోనూ తమ భార్యలను ప్రేమించే విశ్వాసులైన భర్తలు సంఘాన్ని ప్రేమిస్తూ, దానిని కాపాడే క్రీస్తు మాదిరిని సన్నిహితంగా అనుసరిస్తున్నామని చూపిస్తారు.

4 క్రైస్తవ భర్తలు తమ కుటుంబానికి శిరస్సుగా ఉన్నప్పటికీ, వారికి కూడా ఒక శిరస్సు ఉన్నాడు, ఆయన యేసు. (1 కొరింథీయులు 11:3) కాబట్టి యేసు సంఘంపట్ల శ్రద్ధ చూపినట్లే, భర్తలు కూడా స్వయంత్యాగం చేయవలసి వచ్చినప్పటికీ తమ కుటుంబ ఆధ్యాత్మిక, భౌతిక విషయాలపట్ల ప్రేమపూర్వకంగా శ్రద్ధ చూపిస్తారు. వారు తమ సొంత కోరికలు, అభీష్టాలకంటే తమ కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తారు. యేసు ఇలా చెప్పాడు: “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:12) ఆ సూత్రం ప్రత్యేకంగా వివాహంలో అన్వయిస్తుంది. పౌలు ఇలా చెబుతూ దానిని చూపించాడు: “పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. . . . తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును.” (ఎఫెసీయులు 5:28, 29) ఒక పురుషుడు తనను తాను ఏ విధంగా శ్రద్ధగా పోషించి సంరక్షించుకుంటాడో, అదే ప్రకారం తన భార్యను కూడా పోషించి సంరక్షించాలి.

5 దైవభక్తిగల భార్యలు క్రైస్తవ సంఘాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. యేసు భూమ్మీద ఉన్న కాలంలో ఆయన అనుచరులు తమ గత జీవితపు వృత్తులను విడిచిపెట్టి ఆయనను సంతోషంగా అనుసరించారు. ఆయన మరణించిన తర్వాత కూడా వారు ఆయనకు లోబడుతూ వచ్చారు, అంతేకాక, దాదాపు గత 2,000 సంవత్సరాలుగా నిజ క్రైస్తవ సంఘం యేసుకు విధేయత చూపిస్తూ అన్ని విషయాల్లో ఆయన నాయకత్వాన్ని అనుసరించింది. క్రైస్తవ భార్యలు కూడా అదే విధంగా తమ భర్తలను అలక్ష్యం చేయరు లేదా వివాహంలో లేఖనాధారమైన శిరస్సత్వపు ఏర్పాటును చులకనగా చూడడానికి ప్రయత్నించరు. బదులుగా వారు తమ భర్తలకు మద్దతిస్తూ, లోబడుతూ, సహకరిస్తూ వారిని ప్రోత్సహిస్తారు. ఎప్పుడైతే భార్యాభర్తలిద్దరూ ఇలా ప్రేమపూర్వకంగా ప్రవర్తిస్తారో అప్పుడు వారి వివాహం తప్పక విజయవంతమవుతుంది, వారిద్దరూ తమ సంబంధంలో ఆనందిస్తారు.

వారితో కాపురం చేయండి

6 అపొస్తలుడైన పేతురు కూడా వివాహిత జంటలకు సలహా ఇచ్చాడు, ప్రత్యేకంగా ఆయన భర్తలకిచ్చిన ఉపదేశం చాలా శక్తిమంతంగా ఉంది. ఆయనిలా చెప్పాడు: “పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో [మీ భార్యలతో] కాపురము చేయుడి.” (1 పేతురు 3:7) పేతురు సలహాలోని గంభీరత ఆ వచనంలోని చివరి మాటల్లో కనబడుతుంది. భర్త తన భార్యను సన్మానించడంలో విఫలమైతే, దాని ప్రభావం యెహోవాతో ఆయనకున్న సంబంధంపై పడుతుంది. ఆయన ప్రార్థనలకు ఆటంకం కలుగుతుంది.

7 అయితే, భర్తలు తమ భార్యలను ఎలా సన్మానించవచ్చు? భార్యను సన్మానించడమంటే గౌరవ మర్యాదలతో ఆమెను ప్రేమగా చూసుకోవడమని అర్థం. భార్యను అలా చూడడమంటే చాలామందికి వింతగా అనిపిస్తుండవచ్చు. ఒక గ్రీకు విద్వాంసుడు ఇలా వ్రాశాడు: “రోమా చట్టం క్రింద స్త్రీకి ఎలాంటి హక్కులూ లేవు. చట్టం దృష్టిలో ఆమె ఎప్పుడూ చిన్నపిల్లగానే పరిగణించబడేది. . . . ఆమె పూర్తిగా తన భర్తకు లోబడి అతని దయాదాక్షిణ్యాల మీదే బ్రతకాలి.” క్రైస్తవ బోధలకు అదెంత భిన్నమో కదా! క్రైస్తవ భర్త తన భార్యను సన్మానించేవాడు. ఆమెతో ఆయన వ్యవహారాలు వ్యక్తిగత అభీష్టాన్నిబట్టి కాదుగానీ క్రైస్తవ సూత్రాలతో నడిపించబడేవి. అంతేకాక, ఆమె బలహీనమైన ఘటమనే విషయం పరిగణలోకి తీసుకుంటూ ఆయన “జ్ఞానము చొప్పున” ఆమెతో కాపురము చేసేవాడు.

ఏ విధంగా ఆమె “బలహీనమైన ఘటము”?

8 స్త్రీ “బలహీనమైన ఘటము” అని పేతురు చెబుతున్నప్పుడు, ఆమె తెలివిలో లేదా ఆధ్యాత్మికతలో పురుషునికంటే బలహీనమైనదని ఆయన ఉద్దేశం కాదు. నిజమే, స్త్రీలు ఆశించని ప్రత్యేక సేవాధిక్యతలు సంఘంలో చాలామంది క్రైస్తవ పురుషులకు ఉండవచ్చు, పైగా స్త్రీలు కుటుంబంలో తమ భర్తలకు లోబడివుండాలి. (1 కొరింథీయులు 14:35; 1 తిమోతి 2:12) అయినప్పటికీ, స్త్రీపురుషులందరి నుండి ఒకే విధమైన విశ్వాసం, సహనం, ఉన్నత నైతిక ప్రమాణాలు కోరబడుతున్నాయి. పేతురు చెప్పినట్లుగా, భార్యాభర్తలిద్దరూ “జీవమను కృపావరములో . . . పాలివారైయున్నారు.” రక్షణకు సంబంధించినంత వరకు యెహోవా దేవుని ఎదుట వారికి సమాన స్థానముంది. (గలతీయులు 3:28) పేతురు మొదటి శతాబ్దపు అభిషిక్త క్రైస్తవులకు వ్రాస్తున్నాడు. కాబట్టి, “క్రీస్తుతోడి వారసు[లుగా]” వారికీ, వారి భార్యలకూ ఒకే విధమైన పరలోక నిరీక్షణ ఉందని ఆయన మాటలు క్రైస్తవ భర్తలకు గుర్తుచేశాయి. (రోమీయులు 8:17) ఒకనాటికి, స్త్రీలు పురుషులు దేవుని పరలోక రాజ్యంలో రాజులుగా, యాజకులుగా సేవచేస్తారు.​—⁠ప్రకటన 5:​9-10.

9 అభిషిక్త క్రైస్తవ భార్యలు తమ అభిషిక్త క్రైస్తవ భర్తలకు ఏ మాత్రం తక్కువైనవారు కాదు. సూత్రప్రాయంగా, భూ సంబంధ నిరీక్షణగల వారి విషయంలోనూ అదే నిజం. “గొప్పసమూహము”లోని స్త్రీపురుషులు ఇరువురూ గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకుంటారు. అటు స్త్రీలు ఇటు పురుషులు ప్రపంచవ్యాప్తంగా “రాత్రింబగళ్లు” మహాశబ్దముతో యెహోవాను స్తుతించడంలో భాగం వహిస్తారు. (ప్రకటన 7:9, 10, 14, 15) స్తీపురుషులు ఇరువురూ తాము ‘వాస్తవమైన జీవాన్ని’ ఆనందించేటప్పుడు, “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము” అనుభవిస్తామని ఎదురు చూస్తారు. (రోమీయులు 8:​20-21; 1 తిమోతి 6:​18-19) అభిషిక్తులైనా, వేరేగొర్రెలైనా క్రైస్తవులందరూ కలిసి ‘ఒకే కాపరి క్రింద’ ‘ఒకే మందగా’ యెహోవాను సేవిస్తారు. (యోహాను 10:16) కాబట్టి క్రైస్తవ భార్యాభర్తలు పరస్పరం తగిన గౌరవం చూపించుకోవడానికి అదెంత బలమైన కారణమో కదా!

10 అయితే ఏ విధంగా స్త్రీలు ‘బలహీనమైన ఘటాలుగా’ ఉన్నారు? స్త్రీలు సగటున పురుషులకంటే చిన్నగా, శారీరకంగా తక్కువ బలంతో ఉండడాన్ని బహుశా పేతురు సూచిస్తుండవచ్చు. అంతేకాక, మానవుల అపరిపూర్ణ స్థితినిబట్టి పిల్లలకు జన్మనిచ్చే అద్భుతమైన ఆధిక్యత స్త్రీల ఆరోగ్యంపై గట్టి ప్రభావం చూపుతుంది. పిల్లలుకనే వయస్సుగల స్త్రీలు క్రమంగా శారీరక అసౌకర్యానికి గురికావచ్చు. అలాంటి అసౌకర్యాలకు గురైనప్పుడు లేదా తీవ్ర అలసటకు కారణమయ్యే గర్భిణిగా ఉన్న సమయంలో, ప్రసవ సమయంలో వారిపట్ల ప్రత్యేక శ్రద్ధాసక్తులు చూపించడం అవసరం. తన భార్యకు అవసరమైన భావోద్రేక మద్దతునిస్తూ ఆమెను సన్మానించే భర్త వివాహజీవిత విజయానికి ఎంతగానో తోడ్పడతాడు.

మతపరంగా విభాగించబడిన కుటుంబంలో

11 వివాహమైన తర్వాత దంపతుల్లో ఒకరు మాత్రమే క్రైస్తవ సత్యాన్ని అంగీకరించి మరొకరు అంగీకరించని కారణంగా వారిద్దరిలో విభిన్న మత దృక్కోణాలు ఉంటే అప్పుడేమిటి? అలాంటి వివాహం విజయవంతం కాగలదా? చాలామంది జీవితానుభవాలు అలా కాగలవనే జవాబిస్తున్నాయి. భార్యాభర్తలకు మతపరంగా విభిన్న దృక్కోణాలు ఉన్నప్పటికీ, స్థిరంగా ఉండగల, వారిద్దరికీ సంతోషాన్నివ్వగల విజయవంతమైన వివాహం సాధ్యం కాగలదు. అంతేకాదు, ఆ వివాహానికి యెహోవా దృష్టిలో విలువుంటుంది; వారు ‘ఏకశరీరులు’గానే ఉంటారు. కాబట్టి, అవిశ్వాసియైన భాగస్వామికి అంగీకారమైతే, ఆ వ్యక్తితోనే ఉండాలని క్రైస్తవ భాగస్వాములకు హితవు చెప్పబడింది. ఒకవేళ వారికి పిల్లలు ఉంటే, వారు క్రైస్తవ తల్లి లేదా తండ్రికివున్న విశ్వసనీయత నుండి ప్రయోజనం పొందవచ్చు.​—⁠1 కొరింథీయులు 7:12-14.

12 మతపరంగా విభాగించబడిన కుటుంబాల్లో నివసిస్తున్న క్రైస్తవ స్త్రీలను ఉద్దేశించి పేతురు ప్రేమపూర్వక సలహా ఇచ్చాడు. ఆయన మాటలు సూత్రప్రాయంగా అదే పరిస్థితిలో ఉన్న క్రైస్తవ భర్తలు కూడా అన్వయించుకోవచ్చు. పేతురు ఇలా వ్రాశాడు: “స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.”​—⁠1 పేతురు 3:​1-2.

13 భార్య తన భర్తకు తన విశ్వాసం గురించి యుక్తిగా వివరించగలిగితే, అది మెచ్చుకోదగిన విషయమే. కానీ ఆయన వినడానికి ఇష్టపడకపోతే అప్పుడేమిటి? అది ఆయనిష్టం. అయినప్పటికీ, ఆశ వదులుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే క్రైస్తవ నడవడే శక్తిమంతమైన సాక్ష్యంగా పనిచేస్తుంది. చాలామంది భర్తలు మొదట్లో ఆసక్తి చూపకపోయినా లేదా తమ భార్యల విశ్వాసాన్ని వ్యతిరేకించినా కూడా, ఆ తర్వాత తమ భార్యల చక్కని నడవడి చూసి ‘నిత్యజీవంపట్ల సరైన మనోవైఖరిగల’ వారయ్యారు. (అపొస్తలుల కార్యములు 13:​48, NW) భర్త క్రైస్తవ సత్యాన్ని అంగీకరించకపోయినా, తన భార్య నడవడినిబట్టి ముగ్ధుడయ్యే అవకాశముంది, అది వివాహంలో చక్కని ఫలితాలు సాధిస్తుంది. యెహోవాసాక్షి భార్యగా ఉన్న ఒక భర్త తానెన్నటికీ యెహోవాసాక్షుల ఉన్నత ప్రమాణాలను చేరుకోలేనని అంగీకరించాడు. అయినప్పటికీ తాను “మంచి భార్యతో ఆనందభరితుడైన భర్త”గా ఉన్నానని చెబుతూ ఆయన వార్తాపత్రికకు వ్రాసిన ఉత్తరంలో తన భార్యను, ఆమె తోటి సాక్షులను మనఃపూర్వకంగా ప్రశంసించాడు.

14 అదే విధంగా, పేతురు మాటల్లోని సూత్రాలను అన్వయించుకున్న క్రైస్తవ భర్తలు తమ మంచి ప్రవర్తన ద్వారా తమ భార్యలను గెలుచుకున్నారు. అవిశ్వాసులైన భార్యలు తమ భర్తలు బాధ్యతగా ప్రవర్తించడాన్ని, సిగరెట్లకు, మద్యానికి, జూదానికి డబ్బు ఖర్చుచేయకుండా, బూతులు మాట్లాడకుండా ఉండడం గమనించారు. అలాంటి వారిలో కొందరు క్రైస్తవ సంఘంలోని ఇతర సభ్యులను కలుసుకున్నారు. ప్రేమపూర్వక క్రైస్తవ సహోదరత్వాన్ని చూసి వారు ముగ్ధులవడమే కాక, సహోదరుల మధ్య వారు గమనించినది వారిని యెహోవాకు సన్నిహితులను చేసింది.​—⁠యోహాను 13:34, 35.

“అంతరంగ స్వభావము”

15 ఎలాంటి ప్రవర్తన భర్తను గెలుచుకోవడానికి సహాయం చేస్తుంది? నిజానికి, క్రైస్తవ స్త్రీలు సహజంగా అలవరచుకునే ప్రవర్తనే. పేతురు ఇలా చెబుతున్నాడు: “జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయమునకు బెదరకయున్న యెడల ఆమెకు పిల్లలగుదురు.”​—⁠1 పేతురు 3:3-6.

16 వెలుపటి రూపం మీద ఆధారపడవద్దని పేతురు క్రైస్తవ స్త్రీకి హితవు చెబుతున్నాడు. బదులుగా, ఆమె అంతరంగ స్వభావంపై బైబిలు బోధల ప్రభావాన్ని ఆమె భర్త గ్రహించగలగాలి. తన భార్యలో నవీన స్వభావం పనిచేస్తుండడాన్ని ఆయన కళ్లారా చూడాలి. ఆయన తన భార్య పూర్వ స్వభావానికి ఇప్పుడున్న స్వభావానికి తేడా గమనించవచ్చు. (ఎఫెసీయులు 4:22-24) ఆయన తప్పక తన భార్యలో ఉల్లాసకరమైన, ఆకర్షణీయమైన “సాధువైనట్టియు, మృదువైనట్టియునైన” స్వభావాన్ని చూస్తాడు. అలాంటి స్వభావం ఒక భర్తకు ప్రీతిపాత్రమైనదే కాక, “అది దేవుని దృష్టికి మిగుల విలువగలది[గా]” కూడా ఉంటుంది.​—⁠కొలొస్సయులు 3:12.

17 శారా ఒక చక్కని ఉదాహరణగా పేర్కొనబడింది, తమ భర్తలు విశ్వాసులైనా కాకపోయినా క్రైస్తవ భార్యలకు ఆమె మంచి ఆదర్శంగా ఉదహరించబడింది. శారా అబ్రాహామును తన శిరస్సుగా దృష్టించిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆమె తన హృదయంలో సహితం ఆయనను “యజమానుడని” భావించింది. (ఆదికాండము 18:12) అయినప్పటికీ అది ఆమె గౌరవాన్ని తక్కువేమీ చేయలేదు. యెహోవా మీద ఆమెకున్న విశ్వాసాన్నిబట్టి ఆమె ఆధ్యాత్మికంగా బలమున్న స్త్రీ అనే విషయం స్పష్టమయింది. అవును, ‘మేఘమువలె మనలను ఆవరించియున్న గొప్ప సాక్షి సమూహములో’ ఆమె ఒక భాగం, వారి విశ్వాస మాదిరి ‘మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తడానికి’ మనలను పురికొల్పాలి. (హెబ్రీయులు 11:​11; 12:1) కాబట్టి శారాలా ఉండడం క్రైస్తవ భార్యకు ఏ మాత్రం అవమానకరమైన విషయం కాదు.

18 మతపరంగా విభాగించబడిన కుటుంబాల్లోనూ భర్తే శిరస్సు. ఆయన విశ్వాసియైతే, తన విశ్వాసం విషయంలో రాజీ పడకుండానే తన భార్య నమ్మకాలను అవమానపరచడు. భార్య విశ్వాసియైతే ఆమె కూడా తన విశ్వాసం విషయంలో రాజీ పడదు. (అపొస్తలుల కార్యములు 5:29) అలాగని ఆమె తన భర్త శిరస్సత్వాన్ని సవాలు చేయదు. ఆయన స్థానాన్ని గౌరవిస్తూ “భర్త విషయమైన ధర్మశాస్త్రము”నకు లోబడివుంటుంది.​—⁠రోమీయులు 7:2.

బైబిలుయొక్క జ్ఞానయుక్తమైన నిర్దేశం

19 నేడు చాలా విషయాలు వివాహం మీద ఒత్తిడి తెస్తాయి. కొందరు పురుషులు తమ బాధ్యతలు నిర్వర్తించరు. కొందరు స్త్రీలు తమ భర్తల శిరస్సత్వాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తారు. కొన్ని వివాహాల్లో ఒకరివల్ల మరొకరు హింసకు గురవుతున్నారు. ఆర్థిక ఒత్తిళ్లు, మానవ అపరిపూర్ణత, లైంగిక దుర్నీతితో వక్రీకరించబడిన విలువలతో నిండివున్న ఈ లోకపు స్వభావం క్రైస్తవుల విశ్వసనీయతను పరీక్షించగలవు. అయినప్పటికీ, బైబిలు సూత్రాలను అనుసరించే క్రైస్తవ స్త్రీ పురుషుల పరిస్థితి ఏదైనా, వారికి యెహోవా ఆశీర్వాదం లభిస్తుంది. వివాహంలో కేవలం ఒక్క భాగస్వామి బైబిలు సూత్రాలు అన్వయించుకున్నా ఆ వివాహ బంధం, భార్యాభర్తలిద్దరూ బైబిలు సూత్రాలు అన్వయించుకోని వివాహ బంధం కంటే ఎంతో మెరుగ్గా ఉంటుంది. అంతేకాక, కష్ట సమయాల్లోనూ తమ వివాహ ప్రమాణాలకు నమ్మకంగా కట్టుబడివుండే తన సేవకులను యెహోవా ప్రేమిస్తాడు, వారికి సహాయం చేస్తాడు. వారి విశ్వసనీయతను ఆయన మరచిపోడు.​—⁠కీర్తన 18:25; హెబ్రీయులు 6:10; 1 పేతురు 3:12.

20 వివాహిత స్త్రీపురుషులకు హితవు చెప్పిన తర్వాత అపొస్తలుడైన పేతురు ఆప్యాయత నిండిన ప్రోత్సాహకరమైన మాటలతో ముగించాడు. ఆయన ఇలా చెప్పాడు: “తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణయైనను చేయక దీవించుడి.” (1 పేతురు 3:8, 9) అందరికీ ప్రత్యేకంగా వివాహిత జంటలకు ఇది నిజంగా జ్ఞానయుక్తమైన సలహా!

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

క్రైస్తవ భర్తలు యేసును ఎలా అనుకరిస్తారు?

క్రైస్తవ భార్యలు సంఘాన్ని ఎలా అనుకరిస్తారు?

భర్తలు తమ భార్యలను ఏ విధంగా సన్మానించవచ్చు?

భర్త విశ్వాసికానప్పుడు క్రైస్తవ భార్య ఎలాంటి శ్రేష్ఠమైన మార్గాన్ని అనుసరించాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1. వివాహం విషయంలో సరైన దృక్కోణమేమిటి?

2. (ఎ) వివాహిత జంటలకు ఏ సహాయం అందుబాటులో ఉంది? (బి) వివాహాన్ని విజయవంతం చేసుకోవడానికి కృషి చేయడం ఎందుకు ప్రాముఖ్యం?

3. (ఎ) వివాహిత జంటలకు పౌలు ఇచ్చిన సలహాను క్లుప్తంగా చెప్పండి. (బి) యేసు ఎలాంటి చక్కని మాదిరి ఉంచాడు?

4. భర్తలు యేసు మాదిరిని ఎలా అనుకరించవచ్చు?

5. భార్యలు క్రైస్తవ సంఘాన్ని ఎలా అనుకరించవచ్చు?

6. పేతురు భర్తలకు ఎలాంటి సలహా ఇచ్చాడు, అది ఎందుకు ప్రాముఖ్యం?

7. భర్త తన భార్యను ఎలా సన్మానించాలి?

8, 9. ఏయే విధాలుగా స్త్రీలు పురుషులతో సమానముగా ఉన్నారు?

10. ఏ భావంలో స్త్రీలు ‘బలహీనమైన ఘటాలుగా’ ఉన్నారు?

11. భార్యాభర్తలు విభిన్న మతస్థులైనప్పటికీ ఏ భావంలో వారి వివాహం విజయవంతం కాగలదు?

12, 13. పేతురు సలహాను అనుసరిస్తూ క్రైస్తవ భార్యలు అవిశ్వాసులైన తమ భర్తలకు ఎలా సహాయం చేయవచ్చు?

14. భర్తలు అవిశ్వాసులైన తమ భార్యలకు ఎలా సహాయం చేయవచ్చు?

15, 16. క్రైస్తవ భార్యయొక్క ఎలాంటి ప్రవర్తన అవిశ్వాసియైన తన భర్తను గెలుచుకోవచ్చు?

17. క్రైస్తవ భార్యలకు శారా ఎలా ఒక మంచి ఆదర్శంగా ఉంది?

18. మతపరంగా విభాగించబడిన కుటుంబంలో ఏ సూత్రాలను గుర్తుపెట్టుకోవాలి?

19. వివాహ బంధాలపై ఒత్తిడితెచ్చే కొన్ని పరిస్థితులు ఏమిటి, అయితే అలాంటి ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవచ్చు?

20. క్రైస్తవులందరికీ పేతురు ఇచ్చిన సలహా ఏమిటి?

[16వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ భర్త తన భార్యను ప్రేమిస్తూ, శ్రద్ధగా చూసుకుంటాడు

క్రైస్తవ భార్య తన భర్తను గౌరవిస్తుంది, ఘనపరుస్తుంది

[17వ పేజీలోని చిత్రం]

రోమా చట్టంలా కాక, క్రైస్తవ బోధలు భర్త తన భార్యను సన్మానించాలని కోరాయి

[18వ పేజీలోని చిత్రం]

‘గొప్పసమూహానికి’ చెందిన స్త్రీపురుషులు ఇరువురూ పరదైసులో నిత్యజీవం కోసం ఎదురుచూస్తారు

[20వ పేజీలోని చిత్రం]

అబ్రాహామును శారా యజమానిగా దృష్టించింది