కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“శ్రమల్లో విశ్వసనీయత”

“శ్రమల్లో విశ్వసనీయత”

“శ్రమల్లో విశ్వసనీయత”

వెస్టర్న్‌ సోవియట్‌ యూనియన్‌లోని ఒక అమాయక క్రైస్తవుల గుంపు అయిన యెహోవాసాక్షుల మీద 1951 ఏప్రిల్‌ ఆరంభంలో శక్తిమంతమైన సోవియట్‌ ప్రభుత్వం హఠాత్తుగా విరుచుకుపడింది. చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధులతోపాటు వేలాది కుటుంబాలను రైలు పెట్టెల్లో నింపి సైబీరియాకు పంపించారు. అలసట కలిగించే 20 రోజుల ప్రయాణం తర్వాత వారు అక్కడికి చేరుకున్నారు. వారు కఠినమైన, అమానుషమైన పరిస్థితుల మధ్య శాశ్వత చెరకు గురయ్యారు.

2001 ఏప్రిల్‌లో, చరిత్రాత్మకమైన ఆ ఘటన జరిగి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా మాస్కోలో ఒక వీడియో విడుదల చేశారు, అందులో గతంలోని సోవియట్‌ యూనియన్‌లో యెహోవాసాక్షుల మీద దశాబ్దాలపాటు సాగిన అణచివేతను చూపించారు. ఆ డాక్యుమెంటరీలో, యెహోవాసాక్షులు ఎలా బ్రతికి బయటపడ్డారో, తీవ్రమైన ఒత్తిడి ఎదురైనప్పటికీ వారు ఎలా వర్ధిల్లారో తెలియజేసే చరిత్రకారుల, ప్రత్యక్ష సాక్షుల కథనాలు ఉన్నాయి.

శ్రమల్లో విశ్వసనీయత​—⁠సోవియట్‌ యూనియన్‌లోని యెహోవాసాక్షులు అనే ఈ డాక్యుమెంటరీ, ఇప్పటికే రష్యాలోనూ ఇతర ప్రాంతాల్లోనూ లక్షలాది మంది చూశారు. సాధారణ ప్రజలు, చరిత్రకారులు దీన్ని ఎంతో మెచ్చుకున్నారు. ప్రభుత్వ బహిష్కరణకు గురైన అనేకమంది సాక్షుల కుటుంబాలు వెళ్ళిన ప్రాంతంలోనే ఉంటున్న ఇద్దరు రష్యన్‌ విద్వాంసులు ఈ విధంగా వ్యాఖ్యానించారు:

“ఈ వీడియో చాలా బాగుంది. మీ మత ప్రతినిధులంటే నాకు ఎప్పుడూ ఇష్టమే, అయితే ఈ వీడియో చూసిన తర్వాత, మీ మీద నాకున్న సదభిప్రాయం మరింత బలపడింది. దీని చిత్రీకరణ చాలా బాగుంది! ముఖ్యంగా మీరు ఒక్కో వ్యక్తిని చూపించిన విధానం నాకు బాగా నచ్చింది. నేను ఒక ఆర్థోడాక్స్‌ను, నా మతం మార్చుకోవాలన్న ఉద్దేశం నాకు లేకున్నా, సాక్షులంటే నాకు ఇష్టమే. మా బోధనా విభాగంలో ఈ వీడియో కాపీ ఒకటి ఉండాలని కోరుకుంటున్నాను. దీన్ని మా విద్యార్థులకు చూపించాలనీ వారి పాఠ్యక్రమంలో కూడా దీన్ని చేర్చాలనీ నేను నా సహోద్యోగులు నిర్ణయించుకున్నాం.”​—⁠ప్రొఫెసర్‌ సిర్గ్యే నిఖలాయ్‌విచ్‌ రూబ్ట్‌సావ్‌, డీన్‌ ఆఫ్‌ ద ఫాకల్టీ ఆఫ్‌ హిస్టరీ ఆఫ్‌ ద స్టేట్‌ పెడగోగికల్‌ యూనివర్సిటీ, ఇర్‌కుట్స్‌క్‌, రష్యా.

“ఈ వీడియో ఆవిష్కరణను నేను స్వాగతిస్తున్నాను. అణచివేత గురించి చిత్రీకరిస్తున్నప్పుడు, తర్కసహితంగా కథనాన్ని నిర్మించడం చాలా కష్టం. కానీ మీరు దానిని సాధించగలిగారు. మీరు ఇకముందు నిర్మించే చిత్రాలను దయచేసి నాకు ఇవ్వడానికి సంకోచించకండి.”​—⁠ప్రొఫెసర్‌ సిర్గ్యే ఇల్యీచ్‌ కూస్‌నెట్సవ్‌, డీన్‌ ఆఫ్‌ ద ఫాకల్టీ ఆఫ్‌ హిస్టరీ ఆఫ్‌ ఇర్‌కుట్స్‌క్‌ స్టేట్‌ యూనివర్సిటీ, రష్యా.

సైబీరియాలోని యెహోవాసాక్షులు కూడా ఈ డాక్యుమెంటరీ చూసి చాలా ఆనందించారు. వారి స్పందనలకు ఈ క్రిందివి ఉదాహరణలు:

“ఈ వీడియోలో చిత్రించిన ఘటనలు జరుగుతున్న కాలంలో, రష్యాలోని చాలామందికి యెహోవాసాక్షుల కార్యకలాపాల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత, వారు గతంలో భావించినట్లు మన సంస్థ ఒక తెగ కాదని తెలుసుకుంటారు. ఇటీవలి కాలాల్లో సాక్షులైన ఇతరులు ఇలా అన్నారు: ‘ఇంతగా సహించిన క్రైస్తవ సహోదరులతోనే మేము నివసిస్తున్నామనీ వారితో కలిసి పనిచేస్తున్నామనీ ఊహించనే లేదు!’ ఈ వీడియో చూసిన తర్వాత ఒక సాక్షి తాను పూర్తికాల పయినీరు సేవకురాలిని కావాలని కోరుకుంటున్నానని తెలిపింది.”​—⁠అన్నా వవ్‌షుక్‌, ప్రభుత్వ బహిష్కరణకు గురై సైబీరియా వెళ్ళిన వ్యక్తి.

“ఈ వీడియోలో ఒక సాక్షి ఇంటి తలుపును రహస్య పోలీసులు తట్టడాన్ని చూపించినప్పుడు, నేను భయంతో వణికిపోయాను. అది మా ఇంటి తలుపులను పోలీసులు తట్టిన ఘటనను నాకు గుర్తు చేసింది, అప్పుడు మా అమ్మ ‘ఎక్కడో బహుశా నిప్పు రగులుకున్నట్లుంది’ అని అనడం నాకు ఇంకా గుర్తుంది. అయితే ఈ వీడియో, చాలామంది సాక్షులు నేను పడ్డ బాధల కన్నా ఎక్కువ బాధలు పడ్డారని కూడా నాకు గుర్తు చేసింది. ఈ సమాచారం అంతా, మేము యెహోవాను సేవించడంలో కొనసాగేందుకు మాకు గొప్ప శక్తినీ ఉత్సాహాన్నీ ఇస్తోంది.”​—⁠స్టైపన్‌ వవ్‌షుక్‌, ప్రభుత్వ బహిష్కరణకు గురై సైబీరియాకు వెళ్ళిన వ్యక్తి.

“ప్రభుత్వ బహిష్కరణకు గురైన సాక్షుల కొడుకును నేను. అందుకే, ఆ కాలాల గురించి నాకు ఇప్పటికే చాలా తెలుసు అనుకునేవాడిని. కానీ ఈ వీడియో చూసిన తర్వాత, నిజానికి నాకు ఏమీ తెలియదు అని గ్రహించాను. ఇంటర్వ్యూలు వింటున్నప్పుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఇప్పుడు ఆ అనుభవాలు నాకు కేవలం కథలు కాదు, నిజ జీవితాలు. ఈ వీడియో, దేవునితో నాకున్న సంబంధాన్ని బలపరచడమే కాక, భవిష్యత్తులోని అన్ని కష్టాలను సహించేలా సిద్ధపడేందుకు కూడా సహాయపడింది.”​—⁠వ్లాడ్యీమ్‌యిర్‌ కవాష్‌, ఇర్‌కుట్స్‌క్‌.

“నాకైతే, వ్రాసిన వృత్తాంతం కన్నా ఈ వీడియో శక్తిమంతంగా అనిపించింది. మన సహోదరులతో చేసిన ఇంటర్వ్యూలను చూస్తూ వారి మాటలు విన్నప్పుడు, నేను వారితో పాటే ఉండి వారి శ్రమలన్నిటిలో పాలుపంచుకున్నట్లు అనిపించింది. చెరసాలనుండి తన కూతుర్లకు పోస్ట్‌కార్డులు తయారుచేసి పంపించిన ఒక సహోదరుని మాదిరి, నేను కూడా నా పిల్లల హృదయాలను బైబిలు సత్యాలతో పురికొల్పడానికి ప్రయత్నించేలా నన్ను ప్రేరేపించింది. ధన్యవాదాలు! ఈ వీడియో, రష్యాలోని యెహోవాసాక్షులు ఇంతకుముందు కన్నా ఎక్కువగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా సంస్థలో తామూ ఒక భాగమే అని భావించేలా చేసింది.”​—⁠టాట్యానా కాలిన, ఇర్‌కుట్స్‌క్‌.

“‘వందసార్లు విన్నదాని కన్నా ఒక్కసారి చూడడం మేలు’ అనే సామెత ఈ వీడియోకు సరిగ్గా అన్వయిస్తుంది. ఇది మాకు ఎంతో సజీవంగా, వాస్తవికంగా, సన్నిహితంగా ఉంది! దీన్ని చూసిన తర్వాత, నేను ఆలోచించడానికి చాలా సమయం తీసుకున్నాను. ఈ వీడియో, ప్రభుత్వ బహిష్కారానికి గురైన సాక్షుల జీవితాల్లో నేను లీనమయ్యేలా చేసింది. ఇప్పుడు నేను నా పరిస్థితులను వారి పరిస్థితులతో పోల్చుకొని చూడడం, మన ప్రస్తుత సమస్యలను మరో దృక్కోణంతో చూసేందుకు నాకు సహాయపడింది.”​—⁠లిడియా బీడా, ఇర్‌కుట్స్‌క్‌.

శ్రమల్లో విశ్వసనీయత అనే ఈ వీడియో ఇప్పటి వరకు 25 భాషల్లో విడుదలైంది, ప్రపంచవ్యాప్తంగా దానికి ఎంతో ఆదరణ లభిస్తోంది. * ఓమ్‌స్క్‌లోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో, రష్యాలోని ఇతర పట్టణాల్లో ఉన్న దూరదర్శిని కేంద్రాల ద్వారా మొత్తం డాక్యుమెంటరీ ప్రసారం చేశారు. యుక్రేనియన్‌ పట్టణాలైన విన్నిట్స్యా, కెర్చ్‌, మెలిటొపోల్‌లలోనూ లవీఫ్‌ ప్రాంతంలోనూ దీనిని ప్రసారం చేశారు. దీనికి ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ రివ్యూ బోర్డుల నుండి అవార్డులు కూడా లభించాయి.

హింసాయుతమైన అనేక సంవత్సరాల్లో అసాధారణ ధైర్యాన్నీ ఆధ్యాత్మిక బలాన్నీ ప్రదర్శించిన వేలాది మంది సాధారణ ప్రజల ఉదాహరణల్లో ఈ డాక్యుమెంటరీలోని సందేశానికి ఉన్న శక్తి కనబడుతుంది. సోవియట్‌ యూనియన్‌లోని యెహోవాసాక్షులు శ్రమల్లో కూడా విశ్వసనీయంగా ఉంటామని నిజంగా నిరూపించుకున్నారు. మీరు ఈ డాక్యుమెంటరీ చూడాలనుకుంటే, యెహోవాసాక్షులు దాన్ని మీకు సంతోషంగా అందిస్తారు. దయచేసి మీ ప్రాంతంలోని ఒక యెహోవాసాక్షిని సంప్రదించండి.

[అధస్సూచి]

^ పేరా 13 ఈ వీడియో ఆంగ్లం, ఇండోనేషియన్‌, ఇటాలియన్‌, కంటోనీస్‌, కొరియన్‌, గ్రీక్‌, జపనీస్‌, జర్మన్‌, జెక్‌, డచ్‌, డానిష్‌, నార్వేజియన్‌, పోలిష్‌, ఫిన్నిష్‌, ఫ్రెంచ్‌, బల్గేరియన్‌, మండరిన్‌, రష్యన్‌, రొమేనియన్‌, లితువేనియన్‌, స్పానిష్‌, స్వీడిష్‌, స్లొవేనియన్‌, స్లోవాక్‌, హంగేరియన్‌ భాషల్లో లభ్యమవుతుంది.

[8వ పేజీలోని చిత్రసౌజన్యం]

స్టాలిన్‌: U.S. Army photo

[9వ పేజీలోని చిత్రసౌజన్యం]

స్టాలిన్‌: U.S. Army photo