కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమాధానపడడంలోని ప్రయోజనాలు

సమాధానపడడంలోని ప్రయోజనాలు

సమాధానపడడంలోని ప్రయోజనాలు

ఎడ్‌ మరణశయ్య మీద ఉన్నాడు, బిల్‌కు అతనంటే పరమ ద్వేషం. రెండు దశాబ్దాల క్రితం, ఎడ్‌ తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా బిల్‌ ఉద్యోగం పోయింది, అది ఒకప్పటి ఆ ప్రాణ స్నేహితులను విడదీసింది. ఇప్పుడు ఎడ్‌ ప్రశాంతంగా చనిపోవాలనే ఉద్దేశంతో క్షమాపణ అడగాలని ప్రయత్నించాడు. కానీ బిల్‌ అతని మాటలు వినడానికి ఇష్టపడలేదు.

ఆ తర్వాత దాదాపు 30 సంవత్సరాలకు బిల్‌ మరణదశకు చేరుకున్నప్పుడు, తాను ఎడ్‌ను ఎందుకు క్షమించలేదో ఇలా వివరించాడు: “ఎడ్‌ ఒక ప్రాణ స్నేహితునికి చేయకూడని పని చేశాడు. అందువల్ల అది జరిగి 20 సంవత్సరాలు గడిచాక ఇప్పుడు నేను రాజీ పడదలచుకోలేదు. . . . నేను చేసింది తప్పే కావచ్చు, కానీ నాకెందుకో అలా అనిపించింది.” *

వ్యక్తిగత విభేదాలు సాధారణంగా అంతటి విషాదకరమైన పరిణామాలకు దారితీయవు, కానీ తరచూ అవి ప్రజల్లో మనసు గాయపడిన భావాలను లేదా వైరి భావాలను కలిగిస్తాయి. ఎడ్‌లాగ భావించే వ్యక్తి గురించి ఆలోచించండి. తన నిర్ణయం హాని కలిగించిందని గ్రహించిన ఆ వ్యక్తి అపరాధ భావనతో, నష్టపోయాననే కృంగదీసే భావనతో జీవించవచ్చు. అయితే మనసు గాయపడిన తన స్నేహితుడు, తమ స్నేహాన్ని పూచికపుల్లలా తీసిపడేయడాన్ని గురించి ఆలోచించినప్పుడు తను కూడా గాయపడినట్లు బాధపడతాడు.

అయితే బిల్‌లాగ ఆలోచించే వ్యక్తి, ఏ తప్పూచేయని బాధితునిగా తనను తాను పరిగణించుకుంటాడు, బహుశా తీవ్ర ద్వేషంతో పగతో కూడా రగిలిపోవచ్చు. అతని మనసులో, తనకు హాని కలుగుతుందని తెలిసినా ఆ స్నేహితుడు కావాలనే అలా చేసుంటాడు అనే భావిస్తాడు. తరచుగా, ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరూ తన తప్పేమీ లేదు, తప్పంతా అవతలి వ్యక్తిదే అన్న నమ్మకంతో ఉంటారు. ఆ కారణంగానే, ఒకప్పటి స్నేహితులు ఆ తర్వాత ఒకరితో ఒకరు యుద్ధం చేస్తున్నట్లుగానే ప్రవర్తిస్తారు.

వారు నిశ్శబ్ద ఆయుధాలతో తమ యుద్ధాన్ని కొనసాగిస్తారు, ఒకరు ఎదురుపడితే మరొకరు ఇంకో పక్కకు వెళతారు, ఒక గుంపులో తారసపడితే ఒకరినొకరు తప్పించుకు తిరుగుతారు. వారు దూరదూరంగా ఉంటూనే ఒకరినొకరు గుట్టుగా గమనిస్తుంటారు లేదా ఉదాసీనంగా, చీత్కారంగా చూసుకుంటారు. వారు మాట్లాడుకునేటప్పుడు కఠినమైన మాటలను లేదా కత్తిపోటువంటి అవమానకరమైన మాటలను విసురుకుంటారు.

అయితే, వారు ఒకరినొకరు పూర్తిగా వ్యతిరేకించుకుంటున్నట్లు కనబడినా, బహుశా కొన్ని విషయాల్లో ఏకీభవించవచ్చు. వారు తమలో గంభీరమైన సమస్యలు ఉన్నాయనీ, ప్రాణ స్నేహితుడ్ని కోల్పోవడం అత్యంత విషాదకరమనీ అంగీకరించవచ్చు. అంతర్గతంగా బాధపెడుతున్న గాయం కారణంగా ఇరువురూ బాధపడుతుండవచ్చు, దాన్ని నయం చేయడానికి ఏదోకటి చేయాలని ఇద్దరికీ తెలుసు. అయితే విచ్ఛిన్నమైన బంధాన్ని తిరిగి నెలకొల్పడానికీ సమాధానపడడానికీ మొదటి అడుగు ఎవరు వేస్తారు? అందుకు ఎవరూ సిద్ధంగా లేరు.

రెండు వేల సంవత్సరాల క్రితం, యేసుక్రీస్తు అపొస్తలులు కొన్ని సందర్భాల్లో తీవ్రంగా వాదించుకున్నారు. (మార్కు 10:​35-41; లూకా 9:​46; 22:​24) ఒకసారి అలాంటి ఒక వివాదం తర్వాత, యేసు వారిని ‘మీరు ఒకరితో ఒకరు దేని గురించి వాదించుకుంటున్నారు’ అని అడిగాడు. సిగ్గుతో నోరు పెగలక ఎవ్వరూ జవాబు ఇవ్వలేదు. (మార్కు 9:​33, 34) వారు మళ్ళీ సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి యేసు బోధలు వారికి దోహదపడ్డాయి. ఆయన సలహాలు, ఆయన శిష్యుల్లోని కొందరు ఇచ్చిన సలహాలు, ఇప్పటికీ ప్రజలు తమలోని తగాదాలను పరిష్కరించుకోవడానికీ తెగిపోయిన తమ స్నేహబంధాలను పునఃస్థాపించుకోవడానికీ తోడ్పడుతున్నాయి. అవి ఎలా తోడ్పడుతున్నాయో చూద్దాం.

సమాధానపడేందుకు కృషి చేయండి

“నేను ఆ వ్యక్తితో మాట్లాడను. ఇకపై ఆమె ముఖం కూడా చూడను.” మీరు ఎవరి గురించైనా అలాంటి మాటలు మాట్లాడితే, బైబిల్లోని ఈ భాగాల్లో వివరిస్తున్నట్లు మీరు చర్య తీసుకోవలసిన అవసరం ఉంది.

యేసు ఇలా బోధించాడు: “నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము.” (మత్తయి 5:​23, 24) ఆయన ఇంకా ఇలా అన్నాడు: “నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము.” (మత్తయి 18:​15) మీరు ఎవరి మనసునైనా గాయపరచినా లేక మీ మనసును ఎవరైనా గాయపరచినా, ఆ విషయం గురించి మీరే అవతలి వ్యక్తితో వెంటనే మాట్లాడాలని యేసు మాటలు నొక్కిచెబుతున్నాయి. అయితే మీరు మాట్లాడేటప్పుడు “సాత్వికమైన మనస్సుతో” మాట్లాడాలి. (గలతీయులు 6:⁠1) మీ సంభాషణా లక్ష్యం, మిమ్మల్ని మీరు సమర్థించుకొంటూ మీ దృక్కోణాన్ని కాపాడుకోవడం గానీ మీ ప్రత్యర్థి చేత బలవంతంగా క్షమాపణలు చెప్పించుకోవడం గానీ కాదు. సమాధానపడడమే దాని లక్ష్యం. ఈ బైబిలు సలహా పని చేస్తుందా?

అర్నెస్ట్‌ అనే వ్యక్తి ఒక పెద్ద కార్యాలయంలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. * చాలా సంవత్సరాలుగా, ఆయన తన ఉద్యోగరీత్యా అన్ని రకాల ప్రజలకు సంబంధించిన సున్నితమైన విషయాలతో వ్యవహరించడం, వారితో కలిసి పని చేసేందుకు సత్సంబంధాలను కాపాడుకోవడం అవసరం అయ్యేది. వ్యక్తిగత విభేదాలు ఎంత సులభంగా తలెత్తగలవో ఆయన చూశాడు. ఆయన ఇలా అంటున్నాడు: “అప్పుడప్పుడు నాకు ఇతరులతో భేదాభిప్రాయాలు వచ్చాయి. అయితే అలాంటి సందర్భాల్లో, నేను ఆ వ్యక్తితో కూర్చొని ఆ సమస్య గురించి చర్చిస్తాను. నేరుగా వారి దగ్గరకే వెళతాను. సమాధానపడాలనే లక్ష్యంతో వారిని ముఖాముఖిగా కలుసుకుంటాను. అది ఎన్నడూ విఫలం కాదు.”

ఆలీసియాకు అనేక రకాల సంస్కృతుల నుండి వచ్చిన స్నేహితులు ఉన్నారు, ఆమె ఇలా అంటోంది: “కొన్నిసార్లు నేను ఏదో మాట్లాడేస్తాను, ఆ తర్వాత నేను ఎవరి మనసునైనా గాయపరిచానేమో అని అనిపిస్తుంది. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి క్షమాపణలు అడుగుతాను. నేను అవతలి వ్యక్తిని గాయపరచకపోయినా, నేను అడగాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువసార్లే క్షమాపణలు అడుగుతుంటాను, అలా అడగడం వల్ల నాకు హాయిగా ఉంటుంది. అప్పుడు ఎలాంటి అపార్థాలకు తావుండదని నాకు తెలుసు.”

ఆటంకాలను అధిగమించడం

అయితే వ్యక్తిగత తగాదాలను పరిష్కరించుకునే మార్గంలో తరచుగా ఆటంకాలు ఎదురవుతాయి. “సమాధానపడడం కోసం నేనే మొదట ఎందుకు వెళ్ళాలి? సమస్యకు కారణం అతనే” అని మీరు ఎప్పుడైనా అన్నారా? లేక మీరు ఒక సమస్యను పరిష్కరించుకునేందుకు ఎవరి దగ్గరికైనా వెళ్తే అతను “నేను మీతో ఏమీ మాట్లాడదలచుకోలేదు” అని అన్నాడా? కొందరు ఆ విధంగా స్పందించడానికి కారణం వారి మనసుకు తగిలిన గాయమే. సామెతలు 18:⁠19 ఇలా చెబుతోంది: “బలమైన పట్టణమును వశపరచుకొనుటకంటె ఒకనిచేత అన్యాయమునొందిన సహోదరుని వశపరచుకొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు.” కాబట్టి అవతలి వ్యక్తి భావాలను పరిగణలోకి తీసుకోండి. అతను మిమ్మల్ని తిరస్కరిస్తే, కొంతకాలం ఆగి మళ్ళీ ప్రయత్నించండి. అప్పుడు ఆ “బలమైన పట్టణము” వశం కావచ్చు, రాజీ అనే తలుపులకు వేసిన “అడ్డగడియ” తొలగిపోవచ్చు.

సమాధానానికి మరొక ఆటంకం ఒక వ్యక్తి ఆత్మాభిమానమే కావచ్చు. కొంతమంది క్షమాపణలు అడగడమన్నా లేక తమ ప్రత్యర్థితో మాట్లాడడమన్నా అవమానకరంగా భావిస్తారు. ఆత్మాభిమానం గురించి ఆలోచించడం మంచిదే, కానీ సమాధానపడడానికి అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఆత్మాభిమానం పెరుగుతుందా లేక తరుగుతుందా? ఇలా ఆత్మాభిమానం అని భావించే దాంట్లో గర్వం దాగివుండే అవకాశముందా?

బైబిలు రచయిత అయిన యాకోబు వైర స్వభావానికీ గర్వానికీ మధ్య సంబంధం ఉందని చూపిస్తున్నాడు. క్రైస్తవుల మధ్య ‘యుద్ధాలు,’ ‘పోరాటాలు’ ఉన్నాయని వెల్లడి చేసిన తర్వాత, ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.” (యాకోబు 4:​1-3, 6) సమాధానపడకుండా అహంకారం లేదా గర్వం ఎలా అడ్డుకుంటుంది?

గర్వం మనుషులను మోసగిస్తుంది, తాము ఇతరుల కన్నా మంచివాళ్ళమనే నమ్మకం కలిగిస్తుంది. అహంకారులు తమ తోటివారి నైతిక విలువలను తీర్మానించే అధికారం తమకు ఉన్నట్లు భావిస్తారు. ఏ విధంగా? భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వారు తమ ప్రత్యర్థులు మారే వ్యక్తులు కానట్లూ, వారిలో మెరుగుపడే అవకాశం ఏమీ లేనట్లూ చూస్తారు. తమకు భిన్నంగా ఉన్నవారి విషయంలో తాము శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదనీ, క్షమాపణ చెప్పడానికి వారు తగనివారనీ భావించేలా గర్వం కొందరిని పురికొల్పుతుంది. కాబట్టి తమ గర్వంతో పురికొల్పబడేవారు తగాదాలను సరైన రీతిలో పరిష్కరించుకోవడానికి బదులు వాటిని అలాగే కొనసాగనిస్తారు.

రహదారి మీది ట్రాఫిక్‌ను ఒక బ్యారికేడ్‌ ఆపినట్లే, సమాధానానికి నడిపించే క్రియలను తరచూ గర్వం ఆపేస్తుంది. కాబట్టి మీరు ఒక వ్యక్తితో సమాధానపడడానికి చేసే ప్రయత్నాలను నిరోధిస్తున్నట్లు గమనిస్తే, గర్వం మిమ్మల్ని అడ్డగిస్తుండవచ్చు. ఆ గర్వాన్ని మీరు ఎలా అధిగమించవచ్చు? దానికి భిన్న లక్షణమైన వినయాన్ని పెంపొందించుకోవడం ద్వారానే.

పూర్తిగా భిన్నమైనది చేయండి

బైబిలు వినయాన్ని చాలా ఎక్కువగా సిఫార్సు చేస్తుంది. “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.” (సామెతలు 22:⁠4) వినయస్థులనూ, గర్విష్ఠులనూ దేవుడు ఎలా పరిగణిస్తాడో కీర్తన 138:⁠6లో మనం చూస్తాం: “యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.”

చాలామంది వినయాన్ని అవమానంతో సమానంగా చూస్తారు. లోక పాలకులు అలాగే భావిస్తారు. ప్రజలందరూ తమ చిత్తానికే లోబడి ఉన్నా, తమ తప్పులను వినయంతో ఒప్పుకునే ధైర్యం రాజకీయ నాయకులకు లేదు. ఒక నాయకుడు “నన్ను క్షమించండి” అని అంటే అదొక పెద్ద వార్త అవుతుంది. ఇటీవల ఒక మాజీ ప్రభుత్వాధికారి ఒక ఘోరమైన విపత్తులో తన వైఫల్యానికి క్షమాపణ చెప్పాడు, ఆయన మాటలు వార్తల్లోని ప్రధాన శీర్షికల్లో చోటు చేసుకున్నాయి.

వినయాన్ని ఒక నిఘంటువు ఎలా వర్ణించిందో గమనించండి: “నమ్రతా స్వభావం లేదా తనను తాను తక్కువగా భావించుకోవడం . . . గర్వానికి లేదా అహంకారానికి భిన్నమైనది.” కాబట్టి వినయం ఒక వ్యక్తి తనను తాను ఎలా దృష్టించుకుంటున్నాడనేదాన్నే సూచిస్తుంది కానీ ఆ వ్యక్తి గురించి ఇతరులు అభిప్రాయపడేదాన్ని సూచించదు. ఒక వ్యక్తి తన తప్పులను వినయంతో అంగీకరించి నిజాయితీగా క్షమాపణ అడిగితే అది అతనికి అవమానాన్ని తీసుకురాదు. బదులుగా అది అతని కీర్తిని అధికం చేస్తుంది. బైబిలు ఇలా చెబుతోంది: “ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును. ఘనతకు ముందు వినయముండును.”​—⁠సామెతలు 18:​12.

తమ తప్పులకు క్షమాపణలు కోరని రాజకీయ నాయకుల గురించి ఒక లెక్చరర్‌ ఇలా అన్నాడు: “విచారకరంగా, తప్పులను ఒప్పుకోవడాన్ని వారు బహుశా బలహీనతకు సూచనగా భావిస్తున్నారేమో అనిపిస్తోంది. బలహీనులు, భద్రతా భావం లేనివారు ‘క్షమించండి’ అని ఎన్నడూ అనరు. విశాల హృదయులూ, ధైర్యస్థులే ‘నేనొక తప్పు చేశాను’ అని చెబుతారు, దానివల్ల వారు తమ ఆత్మాభిమానాన్ని కోల్పోరు.” రాజకీయ అధికారం లేనివారి విషయంలో కూడా ఇది నిజం. మీరు గర్వానికి బదులు వినయాన్ని చూపించడానికి ప్రయత్నిస్తే, వ్యక్తిగత తగాదాలను పరిష్కరించుకుని సమాధానం పొందే అవకాశాలు చాలా మెరుగుపడతాయి. ఈ సత్యాన్ని ఒక కుటుంబం ఎలా కనుగొన్నదో గమనించండి.

జూలీ, ఆమె తమ్ముడు విలియమ్‌ ఒక విషయాన్ని అపార్థం చేసుకున్న కారణంగా వారి మధ్య ఉద్వేగాలు నెలకొన్నాయి. దాంతో విలియమ్‌కు బాగా కోపం వచ్చింది, ఆయన తన అక్క జూలీ, బావ జోసెఫ్‌లతో తెగతెంపులు చేసుకున్నాడు. ఆయన అక్కాబావలు తనకు అనేక సంవత్సరాలుగా ఇస్తూ వచ్చిన కానుకలను కూడా తిరిగి ఇచ్చేశాడు. అలా కొన్ని నెలలు గడిచేసరికి, ఆ అక్కా తమ్ముళ్ళు ఒకప్పుడు అనుభవించిన అనురాగం స్థానంలో ద్వేషం చోటుచేసుకుంది.

అయితే జోసెఫ్‌ మత్తయి 5:​23, 24 వచనాలను అన్వయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తన బావమరిదిని సాత్వికమైన మనస్సుతో కలవాలనే ప్రయత్నంతో, మనస్సు నొప్పించినందుకు క్షమించమంటూ ఉత్తరాలు వ్రాశాడు. తన తమ్ముడ్ని క్షమించమని ఆయన తన భార్యను ప్రోత్సహించాడు. కొంతకాలానికి, తన అక్కాబావలు తనతో సమాధానపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు విలియమ్‌ గ్రహించాడు, దాంతో అతని మనసు మెత్తబడింది. విలియమ్‌ తన భార్యతో వచ్చి తన అక్కాబావలను కలిశాడు. వారందరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు, కౌగిలించుకున్నారు, తమ అనుబంధాన్ని తిరిగి నెలకొల్పుకున్నారు.

మీరు ఎవరితోనైనా వ్యక్తిగత తగాదాను పరిష్కరించుకోవాలని కోరుకుంటే, బైబిలు బోధలను సహనంతో పాటిస్తూ ఆ వ్యక్తితో సమాధానపడేందుకు కృషి చేయండి. మీకు యెహోవా సహాయం చేస్తాడు. ప్రాచీన ఇశ్రాయేలుకు దేవుడు చెప్పిన ఈ మాటలు మీ విషయంలోనూ నిజమవుతాయి: ‘నీవు నా ఆజ్ఞలను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.’​—⁠యెషయా 48:​18.

[అధస్సూచీలు]

^ పేరా 3 స్టాన్‌లీ క్లౌడ్‌, లిన్‌ ఓల్సన్‌లు వ్రాసిన ద ముర్రో బాయ్స్‌​—⁠పయినీర్స్‌ ఆన్‌ ద ఫ్రంట్‌ లైన్స్‌ ఆఫ్‌ బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిజమ్‌ అనే పుస్తకం ఆధారంగా.

^ పేరా 12 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[7వ పేజీలోని చిత్రాలు]

క్షమాపణ అడగడం తరచూ శాంతియుత సంబంధాలను నెలకొల్పుతుంది