కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

దావీదు, ఆయన మనుష్యులు సముఖపు రొట్టెలను తినడం, కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని నియమాలను ఉల్లంఘించేవారికి శిక్ష విధించబడదని సూచిస్తోందా?​—1 సమూయేలు 21:1-6.

లేవీయకాండము 24:​5-9 ప్రకారం, ప్రతి సబ్బాతు దినమున మార్చబడే సముఖపు రొట్టెలను కేవలం యాజకులు మాత్రమే తినాలి. ఆ రొట్టెలు పరిశుద్ధమైనవి, అవి దేవుని సేవ చేసేవారికి ఆహారంగా ఉపయోగపడాలి అనే సూత్రాన్ని బట్టి వాటిని యాజకులు మాత్రమే భుజించడం సముచితం. వాటిని ఒక సాధారణ పనివాడికి ఇవ్వడం లేదా వాటిని సరదాగా తినడం ఖచ్చితంగా తప్పే. అయితే యాజకుడైన అహీమెలెకు ఆ రొట్టెలను దావీదుకు, అతని మనుష్యులకు ఇచ్చినప్పుడు ఎలాంటి పాపమూ చేయలేదు.

ఆ సమయంలో దావీదు, బహుశా సౌలు రాజు అప్పగించిన ఒక ప్రత్యేకమైన నియామకాన్ని నెరవేరుస్తున్నట్లుంది. అతను, అతని మనుష్యులు ఆకలిగా ఉన్నారు. వారు ఆచారం ప్రకారం పవిత్రంగా ఉన్నట్లు అహీమెలెకు నిశ్చయపర్చుకున్నాడు. వారు సముఖపు రొట్టెలను తినడం చట్టపరంగా చూస్తే తప్పే, అయితే అది వాటిని దేవుని సేవకులు మాత్రమే తినాలి అనే ప్రాథమిక సూత్రానికి మాత్రం అనుగుణంగానే ఉంది. విషయాన్ని అలా పరిగణించి అహీమెలెకు వారి విషయంలో ఆ నియమాన్ని మినహాయించాడు. పరిసయ్యులు అర్థం చేసుకున్న ప్రకారం సబ్బాతు నియమాలను అత్యంత కఠినంగా అన్వయించడం ఎంత తప్పో చూపించడానికి యేసుక్రీస్తు స్వయంగా ఆ సంఘటనను పేర్కొన్నాడు.​—⁠మత్తయి 12:1-8.

అయితే దానర్థం పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు దేవుని నియమాలను ఉల్లంఘించవచ్చు అని మాత్రం కాదు. ఉదాహరణకు, ఇశ్రాయేలు యోధులు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు చాలా గంభీరమైనదిగా అనిపించే ఒక పరిస్థితి ఎదురైంది. “నేను నా శత్రువులమీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును” అని సౌలు రాజు అన్నాడు. ‘ఆ దినమున జనులు ఫిలిష్తీయులను హతము చేశారు’ అని బైబిలు చెబుతోంది. యుద్ధం చేసిన సైనికులు అలసిపోయి ఆకలితో ఉండడంవల్ల ‘గొఱ్ఱెలను ఎడ్లను పెయ్యలను తీసికొని నేలమీద వాటిని వధించి రక్తముతోనే భక్షించారు.’ (1 సమూయేలు 14:24, 31-33) యెహోవా రక్తం విషయంలో విధించిన నియమాలను ఉల్లంఘించడం ద్వారా వారు పాపం చేశారు. వారి క్రియలు, పాపములకు ‘ప్రాయశ్చిత్తము చేయడానికి’ మాత్రమే రక్తం ఉపయోగించబడాలని దేవుడు సూచించినదానికి అనుగుణంగా లేవు. (లేవీయకాండము 17:10-12; ఆదికాండము 9:3, 4) పాపం చేసినవారి కోసం అర్పించబడిన ప్రత్యేక బలులను యెహోవా దయతో అంగీకరించాడు.​—⁠1 సమూయేలు 14:34, 35.

అవును, మనం అన్ని పరిస్థితుల్లోను తన నియమాలకు విధేయత చూపించాలని యెహోవా ఆశిస్తున్నాడు. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట” అని అపొస్తలుడైన యోహాను చెప్పాడు.​—⁠1 యోహాను 5:⁠3.

[30వ పేజీలోని చిత్రం]

ప్రతి సబ్బాతు రోజున గుడారములో క్రొత్త సముఖపు రొట్టెలు ఉంచబడేవి