ప్రపంచవ్యాప్తంగా యేసు చూపించిన ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా యేసు చూపించిన ప్రభావం
“యేసు ఏకాంతంగా, బహిరంగంగా మాట్లాడినట్లు సువార్తల్లో నివేదించిన విషయాలన్నీ ఆయన రెండు గంటల్లోనే చెప్పి ఉండవచ్చు. అయినా ఆ కొద్ది సమాచారమే ఎంత ప్రేరణాత్మకంగా, పురికొల్పేలా, హృదయాంతరాళాల్లోకి చొచ్చుకొనిపోయేలా ఉందంటే, వేరే ఎవ్వరూ ఈ లోకాన్ని ఇంతగా ప్రభావితం చేయలేదు అని అందరూ ఒప్పుకోవలసిందే” అని బైబిలు అనువాదకుడైన ఎడ్గర్ గుడ్‌స్పీడ్ వ్రాశారు.
సా.శ. 33లో యేసుక్రీస్తు తన భూపరిచర్యను ముగించేసరికి, కనీసం 120 మంది స్త్రీ పురుషులు ఆయన అనుచరులుగా ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 1:15) నేడు 200 కోట్లకన్నా ఎక్కువ మంది తాము క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. ఇంకా అనేక కోట్లమంది యేసును ప్రవక్తగా గుర్తిస్తున్నారు. ఆయన బోధలు మానవాళి మీద అసాధారణమైన ప్రభావం చూపించాయనేది వాస్తవం.
ప్రపంచవ్యాప్తంగా యేసు చూపించిన ప్రభావాన్ని క్రైస్తవేతర నాయకులు కూడా అంగీకరించారు. ఉదాహరణకు, యూదామత రబ్బీ (బోధకుడు) హైమన్ ఇనెలో ఇలా వ్రాశారు: “మానవజాతి మత చరిత్రలో యేసు అత్యంత ప్రఖ్యాతిగాంచిన, అధికంగా అధ్యయనం చేయబడిన, అత్యధికంగా ప్రభావం చూపించిన వ్యక్తి అయ్యాడు.” ఇనెలో ఇంకా ఇలా వ్యాఖ్యానించారు: “మానవత్వం మీద యేసు చూపించిన ప్రభావాన్ని ఎవరు అంచనా వేయగలరు? ఆయన ప్రోత్సహించిన ప్రేమ, ఆయన ఇచ్చిన ఓదార్పు, ఆయన చేసిన సత్క్రియలు, ఆయన వెలిగించిన నిరీక్షణా ఆనందాలు ఇవన్నీ మానవ చరిత్రలోనే అసమానమైనవి. ఇప్పటివరకు
జీవించిన వారిలో సత్క్రియలకు ప్రఖ్యాతిగాంచిన ఏ వ్యక్తీ కూడా విశ్వవ్యాప్తంగా యేసుకు ఉన్న ఆకర్షణకు, ఆయన చూపించిన ప్రభావానికి సాటిరారు. చరిత్రలోనే ఆయన అత్యంత ఆసక్తికరమైన వ్యక్తి అయ్యాడు.” హిందూ నేత మోహన్‌దాస్ కె. గాంధీ ఇలా అన్నారు: “నాకు తెలిసినంత వరకు, మానవత్వానికి యేసు చేసినంతగా వేరే ఎవరూ చేయలేదు. వాస్తవానికి క్రైస్తవత్వంలో ఏ తప్పూ లేదు.” అయితే ఆయన ఇంకా ఇలా అన్నారు: “ఉన్న సమస్యల్లా క్రైస్తవులమని చెప్పుకుంటున్న మీతోనే. మీరు మీ బోధలకు అనుగుణంగా జీవించడమే లేదు.”క్రైస్తవ మత సామ్రాజ్యం యేసు బోధలకు అనుగుణంగా జీవించడంలో విఫలమైందనడానికి పెద్ద చరిత్రే ఉంది. క్రైస్తవ చరిత్రకారుడైన సీసల్ జాన్ కాడొక్స్ ఇలా పేర్కొన్నాడు: “చర్చి అంతటా ఒక విధమైన నైతిక నిర్లక్ష్యం క్రమంగా వృద్ధి చెందుతూ, క్రీ.శ. 140 నాటికే క్రైస్తవ నాయకుల దృష్టికి వచ్చింది.” ఆయన ఇంకా ఇలా అన్నాడు: “ఆరంభంలో ఉన్న నైతిక దృఢత్వం క్రమేణా సడలిపోవడం సహజంగానే ఈ లోకపు పోకడలను హత్తుకొనేలా చేస్తుంది.”
ఈ నైతిక పతనం, రోమన్ చక్రవర్తి కాన్‌స్టంటైన్ క్రైస్తవత్వాన్ని స్వీకరించిన నాలుగవ శతాబ్దంలో ఊపందుకుంది. “కాన్‌స్టంటినస్‌తో ఏర్పరచుకున్న సంబంధం కోసం చర్చి రాజీపడిన తీరును చరిత్రకారులు గమనించడమే కాక, కొందరు తమ దుఃఖాన్ని వెలిబుచ్చారు” అని కాడొక్స్ వ్రాశాడు. అప్పటినుండి, ఆ తర్వాతి శతాబ్దాలలో, క్రైస్తవులమని చెప్పుకున్నవారు క్రీస్తు పేరును అవమానపరిచే అనేక తుచ్ఛమైన పనులు చేశారు.
కాబట్టి మనం పరిశీలించాల్సిన ప్రశ్నలు ఏమిటంటే, వాస్తవానికి యేసు ఏమి బోధించాడు? ఆయన బోధలు మన మీద ఎలాంటి ప్రభావం చూపించాలి?
[3వ పేజీలోని చిత్రం]
“నాకు తెలిసినంత వరకు, మానవత్వానికి యేసు చేసినంతగా వేరే ఎవరూ చేయలేదు.”—మోహన్‌దాస్ కె. గాంధీ
[3వ పేజీలోని చిత్రం]
“వేరే ఎవ్వరూ ఈ లోకాన్ని ఇంతగా ప్రభావితం చేయలేదు.”—ఎడ్గర్ గుడ్‌స్పీడ్
[చిత్రసౌజన్యం]
Culver Pictures