కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం మన కోసమే జీవించకుండా ఉండడం

మనం మన కోసమే జీవించకుండా ఉండడం

మనం మన కోసమే జీవించకుండా ఉండడం

‘జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొందిన క్రీస్తుకొరకే జీవించాలి.’​—⁠2 కొరింథీయులు 5:15.

అది యేసు భూమ్మీద గడిపిన చివరి రాత్రి. ఇక కొన్ని గంటల్లో, తనపై విశ్వాసముంచే వారందరి కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పిస్తాడు. ఆ రాత్రి యేసు తన నమ్మకమైన అపొస్తలులకు ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. వాటిలో తన అనుచరులను గుర్తించే చిహ్నంగా ఉండే ఆవశ్యక లక్షణానికి సంబంధించిన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఇలా చెప్పాడు: “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.”​—⁠యోహాను 13:34, 35.

2 నిజ క్రైస్తవులు పరస్పరం స్వయంత్యాగ ప్రేమను కనబరచుకుంటూ, తమ క్షేమంకన్నా తమ తోటి విశ్వాసుల సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ‘తమ స్నేహితుల కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా’ వారు వెనుకాడకూడదు. (యోహాను 15:13) ఆ కొత్త ఆజ్ఞకు తొలి క్రైస్తవులు ఎలా స్పందించారు? రెండవ శతాబ్దపు రచయిత టెర్టూలియన్‌ తన ప్రఖ్యాత గ్రంథమైన అపాలజీలో క్రైస్తవుల గురించి ఇతరులు పలికిన మాటలను ఇలా ఉల్లేఖించాడు: ‘వాళ్ళు ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో, ఒకరి కోసం ఒకరు చనిపోవడానికి కూడా ఎలా సిద్ధంగా ఉన్నారో చూడండి.’

3 మనం కూడా ‘ఒకని భారముల నొకడు భరిస్తూ, క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి.’ (గలతీయులు 6:2) కానీ క్రీస్తు నియమానికి లోబడుతూ ‘పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో మన దేవుడైన యెహోవాను ప్రేమించడానికి, మనలాగే మన పొరుగువారిని ప్రేమించడానికి’ స్వార్థం ఒక పెద్ద అడ్డంకుగా ఉంటుంది. (మత్తయి 22:​37-39) మనం అపరిపూర్ణులం కాబట్టి, స్వార్థపూరితంగా ఉండడానికే మొగ్గుచూపుతాం. దీనికితోడు దైనందిన జీవితంలో ఒత్తిళ్లు, పాఠశాలలో లేదా ఉద్యోగ స్థలంలో కనబడే పోటీతత్వం, జీవితావసరాల కోసం పోరాటం ఈ సహజ ప్రవృత్తిని తీవ్రతరం చేస్తాయి. స్వార్థంవైపు మొగ్గుచూపే ఈ స్వభావం తగ్గుముఖం పట్టడం లేదు. అపొస్తలుడైన పౌలు ఇలా హెచ్చరించాడు: “అంత్యదినములలో . . . స్వార్థప్రియులు [ఉంటారు].”​—⁠2 తిమోతి 3:1, 2.

4 యేసు తన భూ పరిచర్య చివరిరోజుల్లో, స్వార్థాన్ని అధిగమించడానికి తన శిష్యులకు సహాయం చేయగల మూడు చర్యల గురించి చెప్పాడు. ఆ చర్యలేమిటి, ఆయన ఆదేశాలనుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

సరైన విరుగుడు!

5 గలిలయ ఉత్తరభాగంలో ఉన్న ఫిలిప్పుదైన కైసరయ దగ్గర్లో యేసు ప్రకటిస్తున్నాడు. ప్రశాంతమైన, ప్రకృతి అందాలతో విరాజిల్లిన ఈ ప్రాంతం నియమ నిష్ఠలకు సంబంధించిన విషయాల గురించి నేర్చుకోవడానికి బదులు హాయిగా విశ్రాంతి తీసుకోవడానికే అనుకూలమైన స్థలంగా అనిపించి ఉండవచ్చు. కానీ యేసు అక్కడ ఉన్నప్పుడు “తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని” తన శిష్యులకు వెల్లడిచేయడం మొదలుపెట్టాడు. (మత్తయి 16:21) తమ నాయకుడు భూమ్మీద రాజ్యాన్ని స్థాపిస్తాడని అప్పటివరకు ఎదురుచూస్తున్న యేసు శిష్యులకు ఈ మాటలు ఎంత దిగ్భ్రాంతిని కలిగించి ఉంటాయో కదా!​—⁠లూకా 19:11; అపొస్తలుల కార్యములు 1:6.

6 పేతురు వెంటనే “[యేసు] చేయిపట్టుకొని​—⁠ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను.” యేసు ఎలా స్పందించాడు? “ఆయన పేతురువైపు తిరిగి​—⁠సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను.” ఆ రెండు దృక్పథాల మధ్య ఎంత వ్యత్యాసమో కదా! దేవుడు తనకు అప్పగించిన స్వయంత్యాగ విధానాన్ని అంటే ఇక కొద్దినెలల్లో తాను హింసాకొయ్య మీద మరణించడానికి దారితీసే జీవితాన్ని యేసు ఇష్టపూర్వకంగా అంగీకరించాడు. కానీ పేతురు సుఖవంతమైన జీవితాన్ని సిఫారసు చేశాడు. “అది నీకు దూరమగుగాక” అని అన్నాడు. పేతురుకు మంచి ఉద్దేశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. అయినప్పటికీ, యేసు ఆయనను గద్దించాడు, ఎందుకంటే పేతురు ఆ సందర్భంలో సాతాను ప్రభావం తన మీద పడేలా అనుమతించాడు. పేతురు ‘మనుష్యుల సంగతులనే తలంచాడు గాని దేవుని సంగతులను తలంచలేదు.’​—⁠మత్తయి 16:22, 23.

7 యేసుతో పేతురు పలికిన మాటల ప్రతిధ్వనిని నేడు మనం వినవచ్చు. ‘అది నీకు దూరమగుగాక’ లేదా ‘సులభమైన మార్గం ఎన్నుకో’ అని ఈ లోకం తరచూ ఒక వ్యక్తిని ప్రేరేపిస్తుంది. మరోవైపున యేసు దానికి పూర్తిగా భిన్నమైన మానసిక దృక్పథాన్ని సిఫారసు చేశాడు. ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని [‘హింసాకొయ్య నెత్తుకొని,’ NW] నన్ను వెంబడింపవలెను.” (మత్తయి 16:24) “ఈ మాటలు శిష్యులు కావడానికి బయటివారికి ఇచ్చిన ఆహ్వానం కాదుగానీ, క్రీస్తు ఆహ్వానానికి అప్పటికే ప్రతిస్పందించిన వారు శిష్యరికం యొక్క భావాన్ని పునరాలోచించమని వారికివ్వబడిన ఆహ్వానమే” అని ద న్యూ ఇంటర్‌ప్రెటర్స్‌ బైబిల్‌ చెబుతోంది. ఆ లేఖనంలో వ్రాయబడినట్లుగా, విశ్వాసులు యేసు పేర్కొన్న ఆ మూడు చర్యలను చేపట్టాలి. ప్రతీ చర్యను మనం విడివిడిగా పరిశీలిద్దాం.

8 మొదట, మనలను మనం ఉపేక్షించుకోవాలి. “తన్నుతాను ఉపేక్షించుకొని” అని అనువదించబడిన గ్రీకు పదం స్వార్థపూరిత కోరికలను లేదా వ్యక్తిగత సుఖాలను త్యజించడానికి చూపే ఇష్టతను సూచిస్తోంది. మనలను మనం ఉపేక్షించుకోవడం అంటే ఆయా సుఖాలను మనం ఎప్పుడో ఒకసారి పరిత్యజించడమూ కాదు, సన్యాసం పుచ్చుకోవడమనో స్వయంగా హాని కొనితెచ్చుకోవడమనో కూడా కాదు. మన జీవితంలో ఉన్నవన్నీ యెహోవాకు ఇష్టపూర్వకంగా అప్పగించడంతో మనమిక ఎంతమాత్రం ‘మన సొత్తుగా ఉండము.’ (1 కొరింథీయులు 6:19, 20) స్వార్థంతో నిండి ఉండే బదులు మన జీవితంలో దేవుని సేవించడమే కేంద్ర బిందువుగా ఉంటుంది. మనలను మనం ఉపేక్షించుకోవడం అంటే మన అపరిపూర్ణత మనకు అడ్డువచ్చినప్పటికీ దేవుని చిత్తం చేయడానికే నిర్ణయించుకోవడమని అర్థం. మనం దేవునికి సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం సంపూర్ణంగా కేవలం ఆయనకే అంకితమయ్యామని చూపిస్తాం. ఆ మీదట మన శేష జీవితంలో మనం మన సమర్పణకు తగినట్టుగా జీవించడానికి కృషి చేస్తాం.

9 రెండవ చర్య ఏమిటంటే మనం మన హింసాకొయ్యను ఎత్తుకోవాలి. మొదటి శతాబ్దంలో హింసాకొయ్య బాధకు, అవమానానికి, మరణానికి ప్రతీకగా నిలిచింది. సాధారణంగా, నేరస్థులు మాత్రమే హింసాకొయ్య మీద చంపబడేవారు లేదా వారి మృత శరీరాలు ఆ కొయ్య మీద వ్రేలాడదీయబడేవి. యేసు ఈ మాటను ఉపయోగిస్తూ, క్రైస్తవుడు ఈ లోక సంబంధి కాడు కాబట్టి అతడు హింసను, తృణీకారాన్ని లేదా మరణాన్ని సైతం అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలని చూపించాడు. (యోహాను 15:18-20) మన క్రైస్తవ ప్రమాణాలు లోకంనుండి మనలను వేరుగా ఉంచుతాయి కాబట్టి, లోకం ‘మనలను దూషిస్తుంది.’ (1 పేతురు 4:4) ఇది పాఠశాలలో, ఉద్యోగ స్థలంలో లేదా కుటుంబంలో కూడా జరగవచ్చు. (లూకా 9:23) అయినప్పటికీ, మనం ఈ లోక తృణీకారాన్ని సహించడానికే ఇష్టపడతాం ఎందుకంటే మనం మన కోసమే జీవించడం లేదు. కాబట్టి, యేసు ఇలా చెప్పాడు: “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును.” (మత్తయి 5:11, 12) అవును, దేవుని అనుగ్రహం పొందడమే మనకు అత్యంత ప్రాముఖ్యం.

10 మూడవది, మనమాయనను ఎడతెగక వెంబడించాలని యేసుక్రీస్తు చెప్పాడు. డబ్ల్యు. ఇ. వైన్‌ వ్రాసిన యాన్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ న్యూ టెస్టమెంట్‌ వర్డ్స్‌ ప్రకారం, వెంబడించడం అంటే సహవాసిగా ఉండడం లేదా “ఒకే మార్గంలో వెళ్లేవాడిగా” ఉండడమని అర్థం. మొదటి యోహాను 2:​5-6 ఇలా చెబుతోంది: “ఆయనయందు [దేవునియందు] నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన [క్రీస్తు] ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు.” యేసు ఎలా నడుచుకున్నాడు? యేసుకు పరలోకపు తండ్రిపట్ల, తన శిష్యులపట్ల ఉన్న ప్రేమ కారణంగా ఆయన తనలో ఎలాంటి స్వార్థానికీ చోటివ్వలేదు. ‘క్రీస్తు తన్ను తాను సంతోషపరచుకొనలేదు’ అని పౌలు వ్రాశాడు. (రోమీయులు 15:3) యేసు అలసిపోయినప్పుడు లేదా ఆకలితో ఉన్నప్పుడు కూడా తన అవసరాలకంటే ఇతరుల అవసరాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. (మార్కు 6:31-34) రాజ్య ప్రకటనా పనిలో, బోధనా పనిలో కూడా యేసు తీవ్రంగా శ్రమించాడు. ‘సమస్త జనులను శిష్యులనుగా చేస్తూ యేసు ఏ యే సంగతులను ఆజ్ఞాపించాడో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించమనే’ ఆజ్ఞను అత్యంత ఆసక్తితో నెరవేరుస్తూ మనం ఆయనను అనుకరించవద్దా? (మత్తయి 28:19, 20) క్రీస్తు ఈ సమస్త విషయాల్లో మనకు ఒక మాదిరి ఉంచాడు, మనం ఆయన ‘అడుగుజాడలయందు నడుచుకోవాలి.’​—⁠1 పేతురు 2:21.

11 మనలను మనం ఉపేక్షించుకొంటూ, మన హింసాకొయ్యను ఎత్తుకొని మన మాదిరికర్తను ఎడతెగక వెంబడించడం ఆవశ్యకం. మనమలా చేయడం, స్వయంత్యాగ ప్రేమను ప్రదర్శించడానికి పెద్ద అడ్డంకుగా ఉన్న స్వార్థానికి విరుగుడుగా పనిచేస్తుంది. అంతేకాక, యేసు ఇలా చెప్పాడు: “తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?”​—⁠మత్తయి 16:25, 26.

ఇద్దరు యజమానులకు మనం దాసులుగా ఉండలేము

12 తమనుతాము ఉపేక్షించుకోవాలని యేసు తన శిష్యులకు నొక్కిచెప్పిన కొన్ని నెలల తర్వాత, ధనవంతుడైన ఒక యువ అధిపతి ఆయన దగ్గరకు వచ్చి, “బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను” అడిగాడు. దానికి యేసు, “ఆజ్ఞలను గైకొనుమని” చెప్పి వాటిలో కొన్నింటిని ఉదాహరించాడు. అప్పుడు ఆ యువకుడు, “ఇవన్నియు అనుసరించుచునే యున్నాను” అన్నాడు. అతను నిష్కపటంగా ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలకు లోబడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని స్పష్టమవుతోంది. కాబట్టే అతను “ఇకను నాకు కొదువ ఏమని ఆయనను” అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా, యేసు ఆ యువకునికి ఒక ఉదాత్తమైన ఆహ్వానమిస్తూ ఇలా అన్నాడు: “నీవు పరిపూర్ణుడవగుటకు [“లోపము లేకుండా ఉండాలని” పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం] కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుము.”​—⁠మత్తయి 19:16-21.

13 యెహోవాను పూర్ణాత్మతో సేవించడానికి అతని జీవితంలోని పెద్ద అవరోధాన్ని అంటే ఆ యువకుడు తన ఐశ్వర్యాన్ని వదులుకొనే అవసరాన్ని యేసు చూశాడు. క్రీస్తు నిజ శిష్యుడు ఇద్దరు యజమానులకు దాసునిగా ఉండలేడు. ఆయన ‘దేవునికిని సిరికిని దాసునిగా ఉండలేడు.’ (మత్తయి 6:24) ఆయన తన “కన్ను తేటగా” ఉంచుకోవాలి, అంటే ఆయన ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరించాలి. (మత్తయి 6:22) వస్తుసంపదను విడిచిపెట్టి దానిని బీదలకు ఇవ్వడంలో స్వయంత్యాగముంది. వస్తుసంపదను త్యాగం చేయడానికి ప్రతిఫలముగా యేసు ఆ యువ అధిపతికి పరలోకంలో ధనం సమకూర్చుకునే అమూల్యమైన అవకాశమిచ్చాడు. ఆ ధనం అతనికి నిత్యజీవాన్ని ఇవ్వడమే కాక, చివరకు క్రీస్తుతోపాటు పరలోకంలో పరిపాలించే ఉత్తరాపేక్షకు కూడా దారితీస్తుంది. ఆ యువకుడు తనను తాను ఉపేక్షించుకోవడానికి సిద్ధంగా లేడు. ‘అతను మిగుల ఆస్తిగలవాడు గనుక వ్యసనపడుచు వెళ్లిపోయాడు.’ (మత్తయి 19:22) కానీ యేసు అనుచరులు మాత్రం మరో విధంగా స్పందించారు.

14 అప్పటికి దాదాపు రెండు సంవత్సరాల క్రితం పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను అనే పేర్లుగల నలుగురు జాలర్లకు యేసు అదే విధమైన ఆహ్వానాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో ఇద్దరు చేపలు పడుతుండగా, మిగతా ఇద్దరు తమ వలలు బాగుచేసుకుంటున్నారు. యేసు వారితో ఇలా అన్నాడు: “నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతును.” ఆ నలుగురు చివరకు తమ చేపలుపట్టే పనిని విడిచిపెట్టి, మిగిలిన తమ జీవితమంతా యేసును వెంబడించారు.​—⁠మత్తయి 4:18-22.

15 నేడు చాలామంది క్రైస్తవులు ఆ యువ అధిపతి మాదిరికి బదులు, ఆ నలుగురు జాలర్ల మాదిరిని అనుకరించారు. యెహోవాను సేవించడానికి వారు ఈ లోకపు ఐశ్వర్యాన్ని, పేరుప్రఖ్యాతులను త్యాగం చేశారు. “నాకు 22 సంవత్సరాల వయసున్నప్పుడు నేనొక గంభీరమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది” అని అంటూ డెబ్రా ఇలా వివరిస్తోంది: “నేను దాదాపు 6 నెలలు బైబిలు అధ్యయనం చేసిన తర్వాత నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవాలని కోరుకున్నాను, అయితే నా కుటుంబం నా నిర్ణయాన్ని చాలా వ్యతిరేకించింది. మాది కోటీశ్వరుల కుటుంబం, నేను సాక్షి కావడం సమాజంలో వారికి అవమానకరమని భావించారు. అందుకే నాకు సుఖప్రదమైన జీవితం కావాలో, సత్యం కావాలో నిర్ణయించుకోమని వాళ్లు నాకు 24 గంటల సమయమిచ్చారు. నేను సాక్షులతో నా సంబంధాలన్నీ తెంచుకోకపోతే, నా కుటుంబం నాకెలాంటి వారసత్వపు హక్కూ లేకుండా చేస్తుంది. అయితే సరైన నిర్ణయం తీసుకోవడానికి యెహోవా నాకు సహాయం చేసి, నా నిర్ణయంలో కొనసాగడానికి తగిన శక్తిని నాకు అనుగ్రహించాడు. నేను గత 42 సంవత్సరాలు పూర్తికాల సేవలో గడిపాను, ఆ విషయంలో నాకు ఏ విచారమూ లేదు. స్వార్థపూరితమైన, సుఖమే ప్రధానమనే జీవన విధానాన్ని తృణీకరించడం ద్వారా నేను నా కుటుంబ సభ్యుల మధ్య చూస్తున్న శూన్యభావాన్ని, అసంతోషాన్ని తప్పించుకోగలిగాను. నా భర్తతో కలిసి నేను వందకంటే ఎక్కువమంది సత్యం తెలుసుకోవడానికి సహాయం చేశాను. ఏ విధమైన భౌతిక సంపదలకంటే ఈ ఆధ్యాత్మిక పిల్లలే నాకు మరెంతో అమూల్యం.” లక్షలాదిమంది ఇతర యెహోవాసాక్షులకు ఆమెకున్నలాంటి మనోభావాలే ఉన్నాయి. మరి మీ విషయమేమిటి?

16 తాము తమ కోసమే జీవించకూడదనే కోరిక, పయినీర్లుగా లేదా పూర్తికాల రాజ్య ప్రచారకులుగా సేవ చేసేందుకు వేలాదిమంది యెహోవాసాక్షులను పురికొల్పింది. పూర్తికాల పరిచర్యలో భాగం వహించేందుకు తమ పరిస్థితులు అనుకూలించని వారు, తమ శక్తిమేరకు పయినీరు స్ఫూర్తిని వృద్ధి చేసుకొని రాజ్య ప్రకటనా పనికి మద్దతు ఇస్తున్నారు. తమ పిల్లలకు ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చేందుకు తమ సమయాన్ని వెచ్చిస్తూ, తమ వ్యక్తిగత అభీష్టాలను త్యాగం చేసినప్పుడు తల్లిదండ్రులు కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తారు. ఏదోక రీతిలో మనమందరం మన జీవితాల్లో రాజ్య సంబంధ విషయాలకు ప్రథమస్థానం ఉందని చూపించవచ్చు.​—⁠మత్తయి 6:33.

ఎవరి ప్రేమ మనలను బలవంతము చేస్తున్నది?

17 స్వయంత్యాగ ప్రేమను ప్రదర్శించడం అంత సులభమేమీ కాదు. కానీ మనలను బలవంతము చేస్తున్నదేమిటో ఆలోచించండి. పౌలు ఇలా వ్రాశాడు: “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక . . . జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.” (2 కొరింథీయులు 5:​14, 15) కాబట్టి మనం మన కోసమే జీవించకుండా ఉండేలా క్రీస్తు ప్రేమ మనలను బలవంతము చేస్తున్నది. అది ఎంత శక్తిమంతమైన ప్రేరణో కదా! క్రీస్తు మన కోసం చనిపోయాడు కాబట్టి, ఆయన కోసం జీవించవలసిన నైతిక బాధ్యత మనకు ఉందని మనం భావించమా? నిజానికి దేవుడు, క్రీస్తు చూపించిన ప్రగాఢమైన ప్రేమపట్ల మనకున్న కృతజ్ఞతా భావం, దేవునికి మన జీవితాలు సమర్పించుకొని, క్రీస్తు శిష్యులయ్యేలా మనలను బలవంతం చేసింది.​—⁠యోహాను 3:16; 1 యోహాను 4:10, 11.

18 మన కోసమే జీవించకుండా ఉండడం విలువైనదేనా? ఆ యువ అధిపతి క్రీస్తు ఆహ్వానాన్ని నిరాకరించి వెళ్లిపోయిన తర్వాత పేతురు యేసును ఇలా అడిగాడు: ‘ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకును?’ (మత్తయి 19:27) పేతురు, ఇతర అపొస్తలులు నిజంగా తమనుతాము ఉపేక్షించుకున్నారు. వారికి లభించే ప్రతిఫలమేమిటి? యేసు వారికి లభించే, పరలోకంలో తనతోపాటు పరిపాలించే ఆధిక్యత గురించి మొదట మాట్లాడాడు. (మత్తయి 19:28) అదే సందర్భంలో, తన అనుచరుల్లో ప్రతీ ఒక్కరూ అనుభవించగల ఆశీర్వాదాలను సూచించాడు. ఆయన ఇలా చెప్పాడు: ‘నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను ఆక్కచెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు నూరంతలుగాను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందును.’ (మార్కు 10:​29, 30) మనం త్యాగం చేసిన దానికంటే మరెంతో ఎక్కువగా పొందుతాం. రాజ్యం కోసం మనం నిరాకరించిన వాటికంటే మన ఆధ్యాత్మిక తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రు, పిల్లలు మరింత విలువైన వారు కాదా? ఎవరి జీవితం ఎక్కువ ప్రతిఫలదాయకమైనది పేతురుదా లేక ధనవంతుడైన ఆ యువ అధిపతిదా?

19 సంతోషమనేది ఇవ్వడం ద్వారా, సేవ చేయడం ద్వారానే వస్తుంది గానీ స్వార్థం మూలంగా రాదని యేసు తన మాటల ద్వారా, క్రియల ద్వారా చూపించాడు. (మత్తయి 20:28; అపొస్తలుల కార్యములు 20:35) మనం మన కోసమే జీవించక క్రీస్తును ఎడతెగక వెంబడించినప్పుడు మనం ప్రస్తుత జీవితంలో గొప్ప సంతృప్తిని అనుభవించడమే కాక, భవిష్యత్తులో నిత్యం జీవించే ఉత్తరాపేక్ష మనకు ఉంటుంది. అవును, మనలను మనం ఉపేక్షించుకున్నప్పుడు యెహోవాయే మన యజమాని అవుతాడు. తద్వారా మనం దేవుని దాసులమవుతాం. అయితే ఈ దాసత్వం ఎందుకు ప్రతిఫలదాయకమైనది? జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలపై అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ ప్రశ్నలను తర్వాతి ఆర్టికల్‌ చర్చిస్తుంది.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

స్వార్థ ఉద్దేశాలను మనమెందుకు అధిగమించాలి?

మనలను మనం ఉపేక్షించుకోవడం, మన హింసాకొయ్యను ఎత్తుకోవడం, ఎడతెగక యేసును వెంబడించడం అంటే అర్థమేమిటి?

మనం మన కోసమే జీవించకుండా ఉండడానికి మనలను ఏది పురికొల్పుతుంది?

స్వయంత్యాగపూరిత జీవితం జీవించడం ఎందుకు విలువైనది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. మొదటి శతాబ్దపు యేసు అనుచరులు తమ స్వార్థాన్ని అధిగమించేందుకు వారిని ఏ లేఖనాధార ఆజ్ఞ ప్రేరేపించింది?

3, 4. (ఎ) స్వార్థాన్ని మనం ఎందుకు అధిగమించాలి? (బి) ఈ ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

5. గలిలయ ఉత్తర ప్రాంతంలో ప్రకటిస్తున్నప్పుడు యేసు తన శిష్యులకు ఏమి వెల్లడిచేశాడు, అది వారికి ఎందుకు దిగ్భ్రాంతి కలుగజేసి ఉంటుంది?

6. యేసు పేతురును ఎందుకు తీవ్రంగా గద్దించాడు?

7. మత్తయి 16:24లో వ్రాయబడినట్లుగా యేసు తన శిష్యులు చేపట్టవలసిన ఏ విధానాన్ని పేర్కొన్నాడు?

8. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవడం అంటే ఏమిటో వివరించండి.

9. (ఎ) యేసు భూమ్మీద ఉన్న కాలంలో హింసాకొయ్య దేనికి ప్రతీకగా నిలిచింది? (బి) మనం ఏ విధంగా మన హింసాకొయ్యను ఎత్తుకుంటాం?

10. ఎడతెగక యేసును వెంబడించడంలో ఏమి ఇమిడివుంది?

11. మనలను మనం ఉపేక్షించుకొంటూ, మన హింసాకొయ్యను ఎత్తుకొని యేసుక్రీస్తును ఎడతెగక వెంబడించడం ఎందుకు ప్రాముఖ్యం?

12, 13. (ఎ) యేసును సలహా అడిగిన యువ అధిపతికి ఏది ప్రాముఖ్యమైనదిగా ఉంది? (బి) ఆ యువకునికి యేసు ఏ సలహా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు?

14. తనను వెంబడించమని యేసు ఇచ్చిన ఆహ్వానానికి నలుగురు జాలరులు ఎలా స్పందించారు?

15. యేసును వెంబడించడానికి, ఆధునిక దిన యెహోవాసాక్షి ఒకరు ఎలాంటి త్యాగం చేశారు?

16. మనం మన కోసమే జీవించడం లేదని ఎలా చూపించవచ్చు?

17. త్యాగాలు చేయడానికి మనలను ఏది పురికొల్పుతుంది?

18. స్వయంత్యాగ విధానం ఎందుకు విలువైనది?

19. (ఎ) నిజమైన సంతోషం దేనిపై ఆధారపడి ఉంటుంది? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాము?

[11వ పేజీలోని చిత్రం]

“ప్రభువా, అది నీకు దూరమగుగాక”

[13వ పేజీలోని చిత్రం]

యేసును అనుసరించకుండా యువ అధిపతిని అడ్డుకున్నది ఏమిటి?

[15వ పేజీలోని చిత్రాలు]

ఆసక్తిగల రాజ్య ప్రచారకులుగా సేవ చేయడానికి ప్రేమ యెహోవాసాక్షులను పురికొల్పుతుంది