కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మీరు విలువపెట్టి కొనబడినవారు’

‘మీరు విలువపెట్టి కొనబడినవారు’

‘మీరు విలువపెట్టి కొనబడినవారు’

‘మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక దేవుని మహిమపరచుడి.’​—⁠1 కొరింథీయులు 6:20.

“ప్రాచీన లోకంలో దాసత్వం సర్వసామాన్యంగా, సర్వవ్యాప్తంగా ఆమోదించబడింది” అని హోల్‌మ్యాన్‌ ఇల్లస్ట్రేటెడ్‌ బైబిల్‌ డిక్షనరీ చెబుతోంది. అది ఇంకా ఇలా అంటోంది: “ఐగుప్తు, గ్రీసు, రోమ్‌ల ఆర్థికస్థితి దాసుల శ్రమ మీదే ఆధారపడింది. మొదటి క్రైస్తవ శతాబ్దంలో, ఇటలీలో ప్రతీ ముగ్గురిలో ఒకరు, ఇతర దేశాల్లో ప్రతీ ఐదుగురిలో ఒకరు దాసులుగానే పనిచేశారు.”

2 ప్రాచీన ఇశ్రాయేలులో కూడా దాసత్వం ఉన్నప్పటికీ, మోషే ధర్మశాస్త్రం హెబ్రీ దాసులకు రక్షణ కల్పించింది. ఉదాహరణకు, ఒక ఇశ్రాయేలీయుడు ఆరు సంవత్సరాలకంటే ఎక్కువకాలం దాసునిగా పనిచేయడానికి వీల్లేదని ధర్మశాస్త్రం ఆదేశించింది. ఏడవ సంవత్సరంలో ఆయన ‘ఏమియు ఇయ్యకయే స్వతంత్రుడు’ అవుతాడు. అయితే దాసులతో వ్యవహరించడానికి సంబంధించిన నియమాలు ఎంత నిష్పక్షపాతంగా, మానవీయంగా ఉండేవంటే, మోషే ధర్మశాస్త్రం వారి విషయంలో ఈ క్రింది ఏర్పాటు చేసింది: “ఆ దాసుడు—నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసికొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.”​—⁠నిర్గమకాండము 21:2-6; లేవీయకాండము 25:42, 43; ద్వితీయోపదేశకాండము 15:12-18.

3 స్వచ్ఛంద దాసత్వపు ఏర్పాటు నిజ క్రైస్తవుల దాసత్వానికి ముంగుర్తుగా ఉంది. ఉదాహరణకు పౌలు, యాకోబు, పేతురు, యూదా వంటి బైబిలు రచయితలు తమను తాము దేవునికి, క్రీస్తుకు దాసులుగా గుర్తించుకున్నారు. (తీతు 1:1; యాకోబు 1:1; 2 పేతురు 1:1; యూదా 1) థెస్సలొనీక క్రైస్తవులు ‘[తమ] విగ్రహములను విడిచి పెట్టి, జీవముగలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుని వైపునకు తిరిగారు’ అని పౌలు వారికి గుర్తుచేశాడు. (1 థెస్సలొనీకయులు 1:9) దేవునికి ఇష్టపూర్వకమైన దాసులగుటకు ఆ క్రైస్తవులను ఏది పురికొల్పింది? ఇశ్రాయేలీయుడైన దాసుడు తన వ్యక్తిగత స్వేచ్ఛను వదులుకోవడానికి అతనిని ఏ శక్తి పురికొల్పుతుంది? తన యజమానిపట్ల అతనికి ఉన్న ప్రేమే కాదా? క్రైస్తవ దాసత్వం కూడా దేవుని మీదున్న ప్రేమపై ఆధారపడి ఉంటుంది. మనం సత్యవంతుడైన, జీవముగల దేవుణ్ణి తెలుసుకుని, ఆయనను ప్రేమించినప్పుడు ‘పూర్ణమనస్సుతో, పూర్ణాత్మతో’ ఆయన సేవ చేయడానికి మనం పురికొల్పబడతాం. (ద్వితీయోపదేశకాండము 10:12, 13) అయితే దేవునికి, క్రీస్తుకు దాసులవడంలో ఏమి ఇమిడివుంది? మన దైనందిన జీవితాలను ఇది ఎలా ప్రభావితం చేస్తుంది?

“సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి”

4 దాసుడు “వేరొకరి లేదా ఇతరుల చట్టబద్ధమైన సొత్తుగా ఉండడమే కాక, సంపూర్ణ విధేయత చూపబద్ధుడై ఉన్నాడు” అని నిర్వచించబడ్డాడు. మనం యెహోవాకు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన చట్టబద్ధమైన సొత్తు అవుతాం. “మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు” అని అపొస్తలుడైన పౌలు వివరించాడు. (1 కొరింథీయులు 6:19, 20) మనం అభిషిక్త క్రైస్తవులమైనా లేక భూ నిరీక్షణగల వారి సహవాసులమైనా యేసుక్రీస్తు విమోచనా క్రయధన బలి ఆధారంగానే దేవుడు మనలను తన దాసులుగా అంగీకరిస్తాడు కాబట్టి ఆ బలి విలువతోనే మనం కొనబడ్డాం. (ఎఫెసీయులు 1:⁠7; 2:13; ప్రకటన 5:⁠9) ఆ విధంగా, బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి మనం “ప్రభువువారమై [‘యెహోవావారమై,’ NW]యున్నాము.” (రోమీయులు 14:8) యేసుక్రీస్తు అమూల్యమైన రక్తముచేత కొనబడ్డాం కాబట్టి, మనం ఆయనకు కూడా దాసులుగా ఉంటూ ఆయన ఆజ్ఞలు పాటించే బాధ్యత మనకు ఉంది.​—⁠1 పేతురు 1:18, 19.

5 దాసులు యజమానికి లోబడి ఉండాలి. మన దాసత్వం స్వచ్ఛందమైనది మరియు మన యజమానిపట్ల మనకున్న ప్రేమనుండే అది పుడుతుంది. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని 1 యోహాను 5:3 చెబుతోంది. కాబట్టి లోబడడమనేది మన ప్రేమకూ మన విధేయతకూ నిదర్శనమై ఉంది. మనం చేసే ప్రతీ పనిలో అది స్పష్టంగా కనిపిస్తుంది. “మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి” అని పౌలు చెప్పాడు. (1 కొరింథీయులు 10:31) మన దైనందిన జీవితంలో, చిన్న చిన్న విషయాల్లో కూడా ‘ప్రభువునే [‘యెహోవానే,’ NW] సేవిస్తున్నట్లు’ నిరూపించుకోవాలని మనం కోరుకుంటాం.​—⁠రోమీయులు 12:11.

6 ఉదాహరణకు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మనం జాగ్రత్తగా మన పరలోక యజమానియైన యెహోవా చిత్తమేమిటో పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటాం. (మలాకీ 1:6) కష్టమైన నిర్ణయాలు దేవునిపట్ల మన విధేయతను పరీక్షించవచ్చు. అలాంటి సమయాల్లో మన ‘మోసకరమైన, ఘోరమైన వ్యాధిగల’ హృదయ తలంపులను అనుసరించడానికి బదులు ఆయన హితబోధకే అవధానమిస్తామా? (యిర్మీయా 17:9) కొద్దికాలం క్రిందటే బాప్తిస్మం తీసుకున్న అవివాహిత క్రైస్తవురాలైన మెలిసెను ఒక యౌవనస్థుడు ఇష్టపడ్డాడు. అతను మంచివాడిలాగే కనిపించాడు, పైగా అతను అప్పటికే యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేస్తున్నాడు. అయినప్పటికీ, “ప్రభువునందు మాత్రమే” పెళ్లి చేసుకోమనే యెహోవా ఆజ్ఞను పాటించడంలోని విజ్ఞత గురించి ఒక పెద్ద మెలిసెతో మాట్లాడాడు. (1 కొరింథీయులు 7:39; 2 కొరింథీయులు 6:14) “ఈ సలహాను పాటించడం నాకు అంత సులభంగా అనిపించలేదు. అయితే దేవుని చిత్తం చేయడానికి నేను ఆయనకు సమర్పించుకున్నాను కాబట్టి ఆయన స్పష్టమైన ఆదేశాలకు విధేయత చూపించాలని నిర్ణయించుకున్నాను” అని ఆమె ఒప్పుకుంది. ఆ తర్వాత జరిగిన దానిని తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ ఆమె ఇలా అంటోంది: “ఆ సలహాను పాటించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఆ వ్యక్తి త్వరలోనే అధ్యయనం ఆపుజేశాడు. అతనితో నా పరిచయాన్ని కొనసాగించివుంటే, నేనిప్పుడు ఒక అవిశ్వాసికి భార్యనై ఉండేదాన్నే.”

7 మనం దేవునికి దాసులుగా ఉంటూ అదే సమయంలో మనుష్యులకు దాసులుగా ఉండలేము. (1 కొరింథీయులు 7:23) నిజమే, మనలో ఎవ్వరమూ ప్రజా వ్యతిరేకులుగా ఉండాలని కోరుకోము, అయితే లోకస్థులకు భిన్నంగా ఉన్న ప్రమాణాలు క్రైస్తవులకు ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. పౌలు ఇలా ప్రశ్నించాడు: “నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా?” కానీ ఆయన నిర్ణయమేమిటంటే, “నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.” (గలతీయులు 1:10) కాబట్టి మనం తోటివారి ఒత్తిడికి ఊరకనే లొంగిపోయి మనుష్యులను సంతోషపెట్టేవారిగా ఉండలేము. అలాంటప్పుడు, మనం కూడా వారిలాగే ప్రవర్తించాలనే తోటివారి ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు మనమేమి చేయవచ్చు?

8 స్పెయిన్‌లోని ఎలానా అనే ఒక క్రైస్తవ యువతి ఉదాహరణనే తీసుకోండి. ఆమె తోటి విద్యార్థుల్లో చాలామంది రక్తదానం చేస్తారు. యెహోవాసాక్షి అయిన ఎలానా రక్తదానం చేయడానికి లేదా రక్తమార్పిడికి అంగీకరించదని వాళ్లకు తెలుసు. తరగతి అంతటికీ తన దృక్కోణాన్ని వివరించే అవకాశం దొరికినప్పుడు ఎలానా ముందుకొచ్చింది. ఆమె ఇలా చెబుతోంది: “నిజానికి, అలా వివరించే ముందు నేను చాలా భయపడ్డాను. అయితే నేను బాగా సిద్ధపడి వెళ్లాను, ఫలితాలు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. నేను అనేకమంది తోటి విద్యార్థుల గౌరవాన్ని చూరగొన్నాను, నేను చేస్తున్న పనిని మెచ్చుకుంటున్నట్లు మా ఉపాధ్యాయుడు చెప్పాడు. అన్నింటికంటే మిన్నగా, యెహోవా నామాన్ని సమర్థించినందుకు, నా లేఖనాధార స్థానానికిగల కారణాలను స్పష్టంగా వివరించగలిగినందుకు నేనెంతో సంతృప్తిపడ్డాను.” (ఆదికాండము 9:3, 4; అపొస్తలుల కార్యములు 15:28, 29) అవును, దేవునికి దాసులుగా, క్రీస్తుకు దాసులుగా మనం భిన్నంగా నిలబడతాం. అయితే, గౌరవప్రదంగా మన నమ్మకాలను సమర్థించుకోవడానికి సిద్ధపడితే, ప్రజల గౌరవాన్ని చూరగొనవచ్చు.​—⁠1 పేతురు 3:15.

9 మనం దేవునికి దాసులమని గుర్తుంచుకోవడం మనం వినయస్థులుగా ఉండడానికి కూడా సహాయం చేస్తుంది. ఒక సందర్భంలో అపొస్తలుడైన యోహాను పరలోక యెరూషలేముకు సంబంధించిన మహిమాన్విత దర్శనంతో ఎంతగా పరవశుడయ్యాడంటే, దేవుని వాగ్దూతగా వచ్చిన దేవదూత పాదాలకు నమస్కారం చేయడానికి సాగిలపడ్డాడు. అయితే ఆ దేవదూత, “వద్దుసుమీ. నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని” ఆయనకు చెప్పాడు. (ప్రకటన 22:8, 9) దేవుని దాసులందరికీ ఆ దేవదూత ఎంత చక్కని మాదిరి ఉంచాడో కదా! కొందరు క్రైస్తవులు సంఘంలో ప్రత్యేక బాధ్యతల స్థానంలో ఉండవచ్చు. అయినప్పటికీ, యేసు ఇలా చెప్పాడు: “మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను.” (మత్తయి 20:26, 27) యేసు అనుచరులుగా మనమందరం దాసులమే.

“మేము చేయవలసినవే చేసియున్నాము”

10 అపరిపూర్ణ మానవులకు దేవుని చిత్తం చేయడం ఎల్లప్పుడూ సులభం కాదు. ఐగుప్తుకు వెళ్లి దాసత్వం నుండి ఇశ్రాయేలీయులను తోడుకొని రమ్మని యెహోవా అడిగినప్పుడు ఆ ఆజ్ఞకు లోబడేందుకు మోషే ప్రవక్త సంకోచించాడు. (నిర్గమకాండము 3:​10, 11; 4:1, 10) నీనెవె ప్రజలకు తీర్పు సందేశాన్ని ప్రకటించే నియామకం ఇవ్వబడినప్పుడు, యోనా “యెహోవా సన్నిధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవ[డానికి]” సిద్ధపడ్డాడు. (యోనా 1:2, 3) యిర్మీయా ప్రవక్తకు లేఖికునిగా పనిచేసిన బారూకు తాను అలసిపోయానని ఫిర్యాదు చేశాడు. (యిర్మీయా 45:2, 3) మన వ్యక్తిగత కోరిక లేదా అభిలాష దేవుని చిత్తం చేయడానికి విరుద్ధంగా ఉంటే మనమెలా స్పందించాలి? యేసు చెప్పిన ఒక ఉపమానం దానికి జవాబిస్తుంది.

11 రోజంతా తన యజమాని మందను మేపిన ఒక దాసుని గురించి యేసు మాట్లాడాడు. దాదాపు 12 గంటలపాటు పనిచేసి అలసిపోయి ఆ దాసుడు ఇంటికి వచ్చినప్పుడు, అతని యజమాని వచ్చి కూర్చొని, భోజనం చేయమని ఆహ్వానించలేదు. బదులుగా అతని యజమాని ఇలా అన్నాడు: “నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చును.” (లూకా 17:7-10) ఆ దాసుడు తన యజమానికి సేవచేసిన తర్వాత మాత్రమే తన అవసరాలు తీర్చుకోవాలి. యేసు ఈ మాటలు చెబుతూ ఆ ఉపమానాన్ని ముగించాడు: “అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత​—⁠మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడి.”​—⁠లూకా 17:7-10.

12 యెహోవా తన సేవలో మనం చేసే దానిని విలువైనదిగా పరిగణించడని చూపించడానికి యేసు ఈ ఉపమానం చెప్పలేదు. బైబిలు స్పష్టంగా ఇలా చెబుతోంది: ‘మీరు చేసిన కార్యమును, తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.’ (హెబ్రీయులు 6:10) బదులుగా, యేసు ఉపమానంలోని ముఖ్య విషయమేమిటంటే ఆ దాసుడు తననుతాను సంతోషపెట్టుకోలేడు లేదా తన సొంత సుఖాలపై దృష్టి కేంద్రీకరించలేడు. దేవునికి సమర్పించుకుని ఆయనకు దాసులుగా ఉండడానికి మనం నిర్ణయించుకున్నప్పుడు మన సొంత చిత్తానికి బదులు ఆయన చిత్తానికే ప్రాధాన్యతనిస్తామని ఒప్పుకున్నాం. కాబట్టి మన చిత్తంకంటే దేవుని చిత్తానికే మనం ప్రాధాన్యతనివ్వాలి.

13 దేవుని వాక్యాన్ని, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” సాహిత్యాలను క్రమంగా చదవడానికి మనం తీవ్రంగా ప్రయత్నించవలసి ఉండవచ్చు. (మత్తయి 24:45) చదవడం మనకు అన్ని సమయాల్లో కష్టంగా ఉన్నట్లయితే లేదా ఒకానొక సాహిత్యం “దేవుని మర్మములను” చర్చిస్తుంటే అలాంటి పరిస్థితి రావచ్చు. (1 కొరింథీయులు 2:10) అయితే వ్యక్తిగత అధ్యయనానికి మనం సమయం తీసుకోవద్దా? కూర్చొని సావధానంగా అధ్యయనం చేసేలా సమయం తీసుకోవడానికి మనలను మనం క్రమశిక్షణలో పెట్టుకోవలసి ఉంటుంది. అలా చేయకపోతే, ‘వయస్సు వచ్చిన వారికి తగిన బలమైన ఆహారాన్ని’ మనమెలా రుచి చూడగలం?​—⁠హెబ్రీయులు 5:14.

14 రోజంతా పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చినప్పటి సంగతేమిటి? క్రైస్తవ కూటాలకు హాజరయ్యేందుకు బహుశా మనం గట్టిగా ప్రయత్నించవలసి ఉంటుంది. లేదా కొత్తవారికి ప్రకటించడం మన సహజ స్వభావానికి విరుద్ధంగా ఉండవచ్చు. ‘మనం ఇష్టపడకపోయినను’ సువార్త ప్రకటించే సమయాలు ఉండగలవని పౌలు స్వయంగా గుర్తించాడు. (1 కొరింథీయులు 9:17) అయితే మనం ప్రేమించే మన పరలోకపు యజమాని అయిన యెహోవా మనం చేయాలని చెబుతున్నాడు కాబట్టి మనం ఇవన్నీ చేస్తాం. అయితే అధ్యయనం చేయడానికి, కూటాలకు హాజరవడానికి, ప్రకటించడానికి తీవ్ర ప్రయత్నం చేసిన తర్వాత మనం అన్ని సమయాల్లో సంతృప్తి చెందినట్లు, సేదదీరినట్లు భావించమా?​—⁠కీర్తన 1:​1, 2; 122:⁠1; 145:10-13.

“వెనుకతట్టు” చూడకండి

15 యేసుక్రీస్తు సర్వోత్తమ రీతిలో తన పరలోకపు తండ్రికి విధేయతను చూపించాడు. “నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని” అని యేసు తన శిష్యులకు చెప్పాడు. (యోహాను 6:​38) గెత్సేమనే తోటలో ఆయన తీవ్రబాధలో ఉన్నప్పుడు, ఇలా ప్రార్థించాడు: “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము.”​—⁠మత్తయి 26:39.

16 దేవునికి దాసులుగా ఉండాలనే మన నిర్ణయానికి మనం నమ్మకంగా కట్టుబడి ఉండాలని యేసుక్రీస్తు కోరుతున్నాడు. ఆయన ఇలా చెప్పాడు: “నాగటిమీద చెయ్యి పెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడు.” (లూకా 9:62) దేవునికి దాసులుగా ఉన్న మనం విడిచిపెట్టిన వాటి గురించి ఆలోచించడం ఖచ్చితంగా సరైన పనికాదు. బదులుగా, దేవునికి దాసులుగా ఉండడానికి నిర్ణయించుకోవడం ద్వారా మనకు లభించిన దానిని విలువైనదిగా ఎంచాలి. ఫిలిప్పీయులకు పౌలు ఇలా వ్రాశాడు: ‘నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొను నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.’​—⁠ఫిలిప్పీయులు 3:​8-10.

17 దేవునికి దాసునిగా ఆధ్యాత్మిక ప్రతిఫలాల నిమిత్తం పౌలు పెంటగా పరిగణించి విసర్జించిన వాటి గురించి ఆలోచించండి. ఆయన లోక సుఖభోగాలను మాత్రమే కాదుగానీ, భవిష్యత్తులో యూదామత నాయకునిగా తయారయ్యే అవకాశాన్ని కూడా వదులుకున్నాడు. పౌలు యూదా మతాచరణలో కొనసాగివుంటే, పౌలుకు విద్యనేర్పిన గమలియేలు కుమారుడైన సుమెయోను స్థానానికి ఎదిగి ఉండేవాడే. (అపొస్తలుల కార్యములు 22:3; గలతీయులు 1:14) సుమెయోనుపరిసయ్యులకు నాయకుడవడమే కాక, సా.శ. 66-70లో రోముకు వ్యతిరేకంగా జరిగిన యూదా తిరుగుబాటుకు సంబంధించి తనకు సందేహాలు ఉన్నప్పటికీ, ఆ తిరుగుబాటులో కీలకపాత్ర వహించాడు. ఆ పోరాటంలో ఆయన యూదామత తీవ్రవాదుల చేతుల్లోనో, రోమా సైన్యం చేతుల్లోనో మరణించాడు.

18 అనేకమంది యెహోవాసాక్షులు పౌలు మాదిరిని అనుసరించారు. “పాఠశాల విద్య ముగిసిన కొద్ది సంవత్సరాల్లోనే, లండన్‌లో ఒక ప్రముఖ న్యాయవాది దగ్గర కార్యదర్శి ఉద్యోగంలో చేరాను. ఆ ఉద్యోగం నాకు బాగా నచ్చింది, ఆ ఉద్యోగంలోనే ఉంటే నేను డబ్బు సంపాదించుకోగలిగేదాన్నే. అయితే యెహోవాకు నేనింకా ఎక్కువ సేవ చేయగలనని నాకు తెలుసు. చివరకు నేను నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పయినీరు సేవ ఆరంభించాను. దాదాపు 20 సంవత్సరాల క్రితం నేను ఆ చర్య తీసుకున్నందుకు నేనెంతో కృతజ్ఞురాలిని. ఆ పూర్తికాల సేవ ఎలాంటి కార్యదర్శి ఉద్యోగంకంటే ఎక్కువగా నా జీవితాన్ని సంపన్నం చేసింది. ఒక వ్యక్తి జీవితాన్ని యెహోవా వాక్యం ఎలా మార్చగలదో చూడడాన్ని మించిన సంతృప్తి మరొకటి ఉండదు. ఆ ప్రక్రియలో వంతు కలిగి ఉండడం మహాద్భుతం. యెహోవా నుండి మనకు లభించే దానితో పోలిస్తే ఆయనకు మనమిచ్చేది శూన్యమే” అని జీన్‌ చెబుతోంది.

19 కాలాన్నిబట్టి మన పరిస్థితులు మారవచ్చు. అయితే దేవునికి మన సమర్పణ మారదు. మనమింకా యెహోవాకు దాసులమే, అయితే మన సమయాన్ని, శక్తిని, సామర్థ్యాలను, ఇతర అర్హతలను ఏ విధంగా ఉపయోగించుకోవడం శ్రేష్ఠంగా ఉంటుందనేది నిర్ణయించుకోవడాన్ని ఆయన మనకే వదిలేస్తున్నాడు. కాబట్టి, ఈ మేరకు మనం తీసుకునే నిర్ణయాలు దేవునిపట్ల మన ప్రేమను ప్రతిబింబించగలవు. మనం ఎంతమేరకు వ్యక్తిగత త్యాగాలు చేయడానికి ఇష్టపడుతున్నామో కూడా చూపిస్తాయి. (మత్తయి 6:33) మన పరిస్థితులు ఎలావున్నా, యెహోవాకు శ్రేష్ఠమైనది ఇవ్వడానికి మనం తీర్మానించుకోవద్దా? పౌలు ఇలా వ్రాశాడు: “మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును.”​—⁠2 కొరింథీయులు 8:12.

‘మీకు ఫలం లభిస్తుంది’

20 దేవునికి దాసులుగా ఉండడం అణచివేతగా ఉండదు. బదులుగా అది మన సంతోషాన్ని కబళించే హానికరమైన బానిసత్వాన్నుండి తప్పించుకోవడానికి సహాయం చేస్తుంది. “ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము” అని పౌలు వ్రాశాడు. (రోమీయులు 6:22) మనం దేవునికి దాసులుగా ఉండడం మనలో పరిశుద్ధతా ఫలాన్ని కలిగిస్తుంది, అంటే అది మనకు పరిశుద్ధమైన లేదా నైతికంగా పరిశుభ్రమైన ప్రవర్తనవల్ల కలిగే ప్రయోజనాలను తీసుకురావడమే కాక, భవిష్యత్తులో నిత్యజీవానికి కూడా నడిపిస్తుంది.

21 యెహోవా తన దాసులపట్ల ఔదార్యం ప్రదర్శిస్తాడు. ఆయన సేవలో మనం శక్తివంచన లేకుండా పనిచేసినప్పుడు ఆయన “ఆకాశపువాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా” మనమీద “దీవెనలు” కుమ్మరిస్తాడు. (మలాకీ 3:10) యుగయుగములు ఎడతెగక యెహోవాకు దాసులుగా సేవచేయడం ఎంత ఆనందకరమో కదా!

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

మనం ఏ కారణం చేత దేవునికి దాసులుగా తయారవుతాం?

దేవుని చిత్తానికి లోబడడాన్ని మనమెలా ప్రదర్శిస్తాం?

మన చిత్తంకంటే యెహోవా చిత్తానికే ప్రాధాన్యతనివ్వడానికి మనమెందుకు సిద్ధంగా ఉండాలి?

మనమెందుకు ‘వెనుకతట్టు తిరిగి చూడకూడదు’?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలీయులు తమ దాసులతో ఎలా వ్యవహరించాలి? (బి) తన యజమానిని ప్రేమించే దాసునికి ఎలాంటి ఎంపిక ఉండేది?

3. (ఎ) మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలాంటి దాసత్వాన్ని అంగీకరించారు? (బి) దేవుణ్ణి సేవించడానికి మనలను ఏది పురికొల్పుతుంది?

4. మనం దేవునికి, క్రీస్తుకు ఎలా దాసులమవుతాం?

5. యెహోవాకు దాసులముగా మనకు ఏ ప్రాథమిక బాధ్యత ఉంది, దానిని మనం ఎలా నెరవేర్చగలం?

6. దేవునికి దాసులుగా ఉండడం జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దీనిని సోదాహరణంగా వివరించండి.

7, 8. (ఎ) మనుష్యులను సంతోషపెట్టే విషయంలో మనం ఎందుకు అధికంగా చింతించకూడదు? (బి) మనుష్య భయాన్ని ఎలా అధిగమించవచ్చో సోదాహరణంగా వివరించండి.

9. అపొస్తలుడైన యోహానుకు ప్రత్యక్షమైన దేవదూత నుండి మనమేమి నేర్చుకుంటాం?

10. దేవుని నమ్మకమైన సేవకులు ఎల్లప్పుడూ ఆయన చిత్తం చేయడం సులభం కాదన్నట్లు తలంచారని చూపించిన లేఖనాధార ఉదాహరణలు ఇవ్వండి.

11, 12. (ఎ) లూకా 17:7-10లో వ్రాయబడిన యేసు ఉపమానాన్ని క్లుప్తంగా వివరించండి. (బి) యేసు ఉపమానం నుండి మనమే పాఠం నేర్చుకుంటాం?

13, 14. (ఎ) ఎలాంటి పరిస్థితుల్లో మన ఇష్టాలను అధిగమించవలసి ఉంటుంది? (బి) మనమెందుకు దేవుని చిత్తానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి?

15. దేవునికి విధేయత చూపే విషయంలో యేసు ఎలాంటి మాదిరి ఉంచాడు?

16, 17. (ఎ) మనం విడిచిపెట్టిన సంగతుల విషయంలో మనమెలాంటి దృక్కోణంతో ఉండాలి? (బి) లోకసంబంధ ఉత్తరాపేక్షలను “పెంటగా” పరిగణించడంలో పౌలు ఎలా వాస్తవిక దృక్కోణం చూపించాడో వివరించండి.

18. ఆధ్యాత్మికంగా సాధించినవి ప్రతిఫలదాయకమని చూపించేందుకు ఒక ఉదాహరణ ఇవ్వండి.

19. మన తీర్మానం ఏమైయుండాలి, అలా ఎందుకు ఉండాలి?

20, 21. (ఎ) దేవుని దాసులు ఎలాంటి ఫలాన్ని ఫలిస్తారు? (బి) శ్రేష్ఠమైనది అర్పించేవారికి యెహోవా ఎలాంటి ప్రతిఫలమిస్తాడు?

[16, 17వ పేజీలోని చిత్రం]

ఇశ్రాయేలులో స్వచ్ఛంద దాసత్వపు ఏర్పాటు క్రైస్తవ దాసత్వానికి ముంగుర్తుగా ఉంది

[17వ పేజీలోని చిత్రం]

బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం దేవునికి దాసులవుతాం

[17వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవులు దేవుని చిత్తానికి ప్రథమస్థానమిస్తారు

[18వ పేజీలోని చిత్రం]

మోషే తనకివ్వబడిన నియామకాన్ని అంగీకరించడానికి సంకోచించాడు