కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ మీద యేసుక్రీస్తు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాడు?

మీ మీద యేసుక్రీస్తు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాడు?

మీ మీద యేసుక్రీస్తు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాడు?

మనం దీని ముందరి ఆర్టికల్‌లో పరిశీలించిన దాన్నిబట్టి చూస్తే, యేసు బోధలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపించాయనడంలో ఏమైనా సందేహం ఉందా? అయినా ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, “యేసు బోధలు వ్యక్తిగతంగా నా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?”

యేసు బోధల్లో అనేక రకాల అంశాలు చోటు చేసుకున్నాయి. అవి అందించే విలువైన పాఠాలు మన జీవితంలోని అన్ని రంగాలను ప్రభావితం చేయగలవు. జీవితంలో ప్రాథమ్యాలను ఏర్పరచుకోవడం, దేవునితో స్నేహాన్ని పెంపొందించుకోవడం, ఇతరులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, సమస్యలను పరిష్కరించుకోవడం, దౌర్జన్యపు క్రియలకు దూరంగా ఉండడం వంటి విషయాల గురించి యేసు బోధించినవాటి మీద దృష్టి సారిద్దాం.

జీవితంలో ప్రాథమ్యాలను ఏర్పరచుకోండి

శరవేగంతో పరుగెడుతున్న నేటి లోకం, మన సమయాన్నీ సామర్థ్యాలనూ ఎంతగా హరించివేస్తుందంటే, తత్ఫలితంగా మనకు ఆధ్యాత్మిక విషయాల కోసం సమయమే దొరకదు. జెర్రీ అనే 20 ఏండ్ల యువకుని విషయమే గమనించండి. ఆయన ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడేందుకు ఇష్టపడతాడు, ఆ సంభాషణల ద్వారా నేర్చుకున్నవాటిని ఆయన చాలా విలువైనవిగా పరిగణిస్తాడు. అయితే ఆయన ఇలా విలపిస్తున్నాడు: “నేను అలాంటి సంభాషణల్లో క్రమంగా పాల్గొనడానికి నాకు సమయమే దొరకడం లేదు. నేను వారంలో ఆరు రోజులు పని చేస్తాను. నాకు ఆదివారం మాత్రమే సెలవు దొరకుతుంది. ఆ రోజు చేసుకోవలసిన పనులతోనే నేను అలసిపోతాను.” మీ పరిస్థితి కూడా అలాంటిదే అయితే, కొండమీది ప్రసంగంలో యేసు బోధించిన వాటినుండి మీరు ప్రయోజనం పొందవచ్చు.

యేసు మాటలు వినడానికి ఆయన చుట్టూ చేరిన ప్రజలతో, ఆయన ఇలా అన్నాడు: “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటె ప్రాణమును, వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా? ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా? . . . కాబట్టి​—⁠ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:​25-33) ఈ మాటల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

యేసు ఇక్కడ మనం మన భౌతికావసరాలను, మన కుటుంబ సభ్యుల భౌతికావసరాలను పట్టించుకోకూడదు అని సూచించడం లేదు. “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును” అని బైబిలు చెబుతోంది. (1 తిమోతి 5:⁠8) అయితే మనం ప్రాముఖ్యమైన విషయాల మీద శ్రద్ధ చూపించి, ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తే మన ఇతర అవసరాలు తీరేలా దేవుడు చూస్తాడని యేసు వాగ్దానం చేశాడు. ప్రాథమ్యాలను ఏర్పరచుకోవాలనేది మనం ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం. ఈ సలహాను పాటించడం సంతోషానికి దారితీస్తుంది, ఎందుకంటే ‘తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు సంతోషంగా ఉంటారు.’​—⁠మత్తయి 5:⁠3, NW.

దేవునితో స్నేహాన్ని పెంపొందించుకోండి

తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు, దేవునితో మంచి సంబంధాన్ని పెంపొందించుకోవలసిన అవసరాన్ని కూడా గుర్తిస్తారు. మనం ఒక వ్యక్తితో మంచి సంబంధాన్ని ఎలా ఏర్పరచుకుంటాం? మనం ఆ వ్యక్తి గురించి బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించమా? మనం ఆయన మనోవైఖరి, దృక్పథాలు, సామర్థ్యాల గురించీ, ఆయన సాధించినవాటి గురించీ, ఆయన ఇష్టాయిష్టాల గురించీ తెలుసుకోవడానికి సమయం వెచ్చించాలి. మనం దేవునితో స్నేహాన్ని పెంపొందించుకోవడం కూడా అలాంటిదే. ఆయన గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానం సంపాదించాలి. యేసు తన శిష్యుల గురించి దేవునికి ప్రార్థిస్తూ, ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:⁠3) అవును, దేవునితో సాన్నిహిత్యం పెంచుకోవాలంటే మనం ఆయన గురించి తెలుసుకోవాలి. ఆ పరిజ్ఞానం పొందడానికి మనకు ఉన్న ఏకైక ఆధారం దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలు. (2 తిమోతి 3:​16) కాబట్టి మనం ఆ లేఖనాలను అధ్యయనం చేయడానికి తప్పకుండా సమయం కేటాయించాలి.

అయితే కేవలం పరిజ్ఞానం సంపాదించడం మాత్రమే సరిపోదు. యేసు అదే ప్రార్థనలో ఇంకా ఇలా అన్నాడు: “వారు [శిష్యులు] నీ వాక్యము గైకొని యున్నారు.” (యోహాను 17:⁠6) మనం దేవుని పరిజ్ఞానాన్ని పొందడం మాత్రమే కాక, ఆ పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రవర్తించాలి కూడా. ఇంకా ఏ విధంగా మనం దేవునికి స్నేహితులం కావచ్చు? మనం కావాలనే ఒక వ్యక్తి తలంపులకూ సూత్రాలకూ భిన్నంగా ప్రవర్తిస్తూ, ఆయనతో మన స్నేహం పెరుగుతుందని నిజంగా ఆశించగలమా? కాబట్టి దేవుని దృక్పథాలు, సూత్రాలు మన జీవితంలోని ప్రతీ చర్యకు మార్గదర్శకంగా ఉండాలి. ఆయన చెప్పినవాటిలో రెండు సూత్రాలు, ఇతరులతో ఉన్న మన సంబంధాలకు ఎలా అన్వయిస్తాయో గమనించండి.

ఇతరులతో సత్సంబంధాలు ఏర్పరచుకోండి

మానవ సంబంధాల గురించి ఒక విలువైన పాఠం బోధించడానికి యేసు ఒక సందర్భంలో ఒక చిన్న ఉపమానం చెప్పాడు. తన దాసుల వద్ద లెక్కలు పరిష్కరించుకోవాలని కోరుకున్న ఒక రాజు గురించి ఆయన చెప్పాడు. అయితే వారిలో ఒకడు చాలా పెద్ద మొత్తంలో అప్పు ఉన్నట్లు తేలింది, ఆ అప్పు తీర్చడానికి అతని వద్ద ఏమీ ఉండదు. ఆ రాజు అతడ్నీ, అతని భార్యనూ, పిల్లలనూ, అతనికి ఉన్నదంతా అమ్మేసి అప్పు తీర్చమని ఆదేశిస్తాడు. అప్పుడు ఆ దాసుడు సాగిలపడి “నాయెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతును” అని వేడుకుంటాడు. కనికరంతో హృదయం ద్రవించిపోయిన యజమాని ఆ దాసుని అప్పు రద్దు చేస్తాడు. కానీ ఆ దాసుడు అక్కడి నుండి వెళ్ళి, తనకు చాలా తక్కువ మొత్తంలో అప్పు ఉన్న తోటి దాసుడ్ని, తన అప్పు తీర్చమని బలవంతపెడతాడు. తన తోటి దాసుడు కనికరించమని వేడుకున్నప్పటికీ, మొదటి దాసుడు అతడ్ని తన అప్పంతా తీర్చేంత వరకు చెరసాలలో వేయిస్తాడు. రాజుకు ఈ విషయం తెలిసి ఉగ్రుడవుతాడు. “నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా” అని గట్టిగా అడుగుతాడు. క్షమించని ఆ దాసుడ్ని తన అప్పు మొత్తం తీర్చేంత వరకు చెరసాలలో వేయిస్తాడు. ఈ కథ నుండి నేర్చుకోవలసిన పాఠం గురించి చెబుతూ యేసు ఇలా అన్నాడు: “మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయును.”​—⁠మత్తయి 18:​23-35.

అపరిపూర్ణ మానవులుగా మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. మనం దేవునికి విరుద్ధంగా చేసే తప్పిదాల ద్వారా మూట కట్టుకున్న అతి పెద్ద రుణాన్ని ఎన్నడూ తిరిగి చెల్లించలేము. మనం చేయగలిగిందల్లా, క్షమించమని ఆయనను వేడుకోవడమే. యెహోవా దేవుడు మన అతిక్రమములన్నిటినీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, అయితే ఒక్క షరతు, మన సహోదరులు మనకు విరుద్ధంగా చేసిన తప్పిదాలను మనం కూడా క్షమించాలి. ఎంత బలమైన పాఠమో కదా! యేసు తన అనుచరులకు ఇలా ప్రార్థించాలని బోధించాడు: “మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.”​—⁠మత్తయి 6:​12.

సమస్యకు మూలకారణమేమిటో తెలుసుకోండి

మానవ నైజాన్ని అర్థం చేసుకోవడంలో యేసు అనుభవసిద్ధుడు. సమస్యల మూలకారణాన్ని సరిదిద్దడం ద్వారా వాటిని పరిష్కరించుకోవడాన్ని ఆయన ఇచ్చిన సలహా సూచించింది. ఈ క్రింది రెండు ఉదాహరణలను పరిశీలించండి.

“నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారుగదా. నేను మీతో చెప్పునదేమనగా​—⁠తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును” అని యేసు అన్నాడు. (మత్తయి 5:​21, 22) యేసు ఇక్కడ హత్యకు అసలు కారణం కేవలం దౌర్జన్యపూరిత చర్య మాత్రమే కాదని చెబుతూ ఆ సమస్యకు మూలకారణాన్ని చూపించాడు. హంతకుని హృదయంలో పెరుగుతున్న ధోరణిలోనే ఆ కారణం ఉంది. ప్రజలు ద్వేష భావాన్ని లేక కోపాన్ని పెంచుకోకుండా ఉంటే, పథకం వేసుకొని చేసే దౌర్జన్యం మటుమాయం అవుతుంది. ఈ బోధను అన్వయించుకుంటే ఎంతటి రక్తపాతాన్ని నివారించవచ్చో కదా!

తీవ్ర మనోవేదన కలిగించే మరో సమస్యకు మూలకారణాన్ని యేసు ఎలా చూపించాడో గమనించండి. ఆయన జనసమూహంతో ఇలా అన్నాడు: “వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగా​—⁠ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము.” (మత్తయి 5:​27-29) యేసు ఇక్కడ అనైతిక ప్రవర్తనకు దారితీసే అసలు కారణం గురించి బోధించాడు. అది ఆ ప్రవర్తనకన్నా ముందుగా కలిగే అనైతిక కోరికల్లో ఉంది. ఒక వ్యక్తి అనుచితమైన కోరికల్లో డోలలాడకుండా వాటిని తన మనస్సులో నుండి ‘పెరికివేస్తే,’ అతను అనైతిక ప్రవర్తనకు దారితీయగల సమస్యను అధిగమిస్తాడు.

“నీ కత్తి వరలో తిరిగి పెట్టుము”

యేసు వంచనకు గురై బంధీ అయిన రాత్రి, ఆయన శిష్యులలో ఒకరు ఆయనను కాపాడడానికి కత్తి దూశాడు. యేసు అతడ్ని ఇలా ఆజ్ఞాపించాడు: “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.” (మత్తయి 26:​52) ఆ మరుసటి ఉదయం, యేసు పొంతి పిలాతుతో ఇలా చెప్పాడు: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదు.” (యోహాను 18:​36) ఈ బోధ ఆచరణాత్మకమైనది కాదా?

దౌర్జన్యానికి పాల్పడకండి అనే యేసు బోధ విషయంలో, ఆయన తొలి శిష్యులు ఎలాంటి మనోవైఖరి చూపించారు. ది ఎర్లీ క్రిస్టియన్‌ ఆటిట్యూడ్‌ టు వార్‌ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “ఇతరులకు వ్యతిరేకంగా చేసే ఎలాంటి దౌర్జన్యమైనా చట్టవిరుద్ధమని నిషేధించిన [యేసు బోధలు], యుద్ధంలో పాల్గొనడం అక్రమమని స్పష్టంగా సూచించాయి. . . . తొలి క్రైస్తవులు అక్షరాలా యేసు చెప్పినట్లు చేయడమే కాక, సున్నితంగా ఉండడం, ఎదురాడకుండా ఉండడమే ఆయన బోధల సారమని కూడా అర్థం చేసుకున్నారు. వారు తమ మతంతో సమాధానాన్ని అనుసంధానించారు. రక్తపాతం జరిగే యుద్ధాన్ని వారు దృఢంగా ఖండించారు.” క్రైస్తవులమని చెప్పుకుంటున్న వాళ్ళందరూ నిజంగా ఈ బోధను పాటించి ఉంటే, చరిత్ర ఎలా ఉండేదో కదా!

యేసు బోధలన్నిటి నుండి మీరు ప్రయోజనం పొందవచ్చు

మనం పరిశీలించిన యేసు బోధలు అద్భుతమైనవి, సరళమైనవి, శక్తిమంతమైనవి. ఆయన బోధలను తెలుసుకోవడం ద్వారా, వాటిని ఆచరించడం ద్వారా మానవాళి ప్రయోజనం పొందవచ్చు. *

ఏ మానవుడూ చెప్పనటువంటి అత్యంత జ్ఞానవంతమైన బోధల నుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకోవడానికి మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులు మీకు సంతోషంగా సహాయం చేస్తారు. వారిని సంప్రదించడానికి లేదా ఈ పత్రికలోని 2వ పేజీలోని చిరునామాకు వ్రాయడానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.

[అధస్సూచి]

^ పేరా 22 యేసు బోధలన్నిటినీ క్రమబద్ధంగా పరిశీలించడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకం చూడండి.

[5వ పేజీలోని చిత్రం]

“మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు”

[7వ పేజీలోని చిత్రం]

యేసు బోధలు మీ జీవితం మీద మంచి ప్రభావం చూపించగలవు