కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాను స్తుతించే యౌవనస్థులు తమ జీవితాలను సుసంపన్నం చేసుకుంటారు

యెహోవాను స్తుతించే యౌవనస్థులు తమ జీవితాలను సుసంపన్నం చేసుకుంటారు

“యెహోవా వలననే నాకు సహాయము కలుగును”

యెహోవాను స్తుతించే యౌవనస్థులు తమ జీవితాలను సుసంపన్నం చేసుకుంటారు

“జీవితంలో సర్వశ్రేష్ఠమైనవి పొందాలని నేను కోరుకుంటున్నాను!” ఒక యౌవనస్థుడు తన కోరికలను అలా వర్ణించాడు. అయితే ఒక యౌవనస్థుడు జీవితంలో సర్వశ్రేష్ఠమైనవి ఎలా పొందగలడు? బైబిలు దానికి సూటియైన సమాధానం ఇలా ఇస్తోంది: “నువ్వింకా యౌవ్వనావస్థలో వుండగానే నీ సృష్టికర్తని నువ్వు గుర్తుచేసుకో.”​—⁠ప్రసంగి 12:​2, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

యెహోవాను స్తుతిస్తూ ఆయన సేవ చేయవలసింది కేవలం పెద్దవాళ్ళు మాత్రమే కాదు. ఎల్కానా హన్నాల కుమారుడైన సమూయేలు ఆలయ గుడారంలో యెహోవాకు సేవ చేయనారంభించినప్పుడు చాలా చిన్నవాడు. (1 సమూయేలు 1:19, 20, 24; 2:​11) సిరియా సైన్యాధిపతియైన నయమాను తనకున్న కుష్టురోగం నుండి స్వస్థత పొందడానికి ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్ళాలని చిన్న వయస్కురాలైన ఒక హెబ్రీ బాలిక సూచించినప్పుడు ఆమె యెహోవాపై ప్రగాఢమైన విశ్వాసాన్ని చూపించింది. (2 రాజులు 5:​2, 3) కీర్తన 148:​7, 12 వచనాల్లో, యెహోవాను స్తుతించాలని కన్యలకు, బాలురకు ఆజ్ఞాపించబడింది. * యేసు పన్నెండేళ్ళ వయస్సులోనే తన తండ్రి సేవ చేయడంలో అమితాసక్తి చూపించాడు. (లూకా 2:​41-49) కొంతమంది బాలురు లేఖనాల్లో తమకు లభించిన శిక్షణ కారణంగా, ఆలయంలో యేసును చూసినప్పుడు “దావీదు కుమారునికి జయము” అని కేకలు వేశారు.​—⁠మత్తయి 21:​15, 16.

నేడు యెహోవాను స్తుతించడం

నేడు యెహోవాసాక్షుల్లో చాలామంది యౌవనస్థులు తమ నమ్మకాలనుబట్టి అతిశయిస్తూ వాటి గురించి పాఠశాలలోనూ మరితర స్థలాల్లోనూ ఇతరులతో ధైర్యంగా మాట్లాడతారు. రెండు ఉదాహరణలు పరిశీలించండి.

బ్రిటన్‌లో, 18 ఏళ్ళ స్టిఫనీ చదువుతున్న తరగతిలో గర్భస్రావం గురించి, ఇతర నైతిక అంశాల గురించి చర్చ జరిగింది. ఈ కాలంలో గర్భస్రావాలు సర్వసాధారణంగా అంగీకరించబడుతున్నాయని, ఏ యౌవనస్థురాలూ ఈ పద్ధతిని వ్యతిరేకించకూడదని వాళ్ళ ఉపాధ్యాయుడు నొక్కి చెప్పాడు. తరగతిలోని వారంతా ఈ దృక్కోణంతో ఏకీభవించినప్పుడు, స్టిఫనీ మాత్రం తన బైబిలు ఆధారిత స్థానాన్ని సమర్థించుకోవడానికి పురికొల్పబడింది. ఉపాధ్యాయుడు స్టిఫనీని తన అభిప్రాయం చెప్పమన్నప్పుడు ఆమెకు ఆ అవకాశం లభించింది. స్టిఫనీ మొదట్లో కాస్త భయపడినా, లేఖనాధారిత దృక్కోణాన్ని తెలియజేయడానికి ఆమె ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంది. ఆమె నిర్గమకాండము 21:22-24 వచనాలను చెప్పి, ఇంకా జన్మించని శిశువుకు హాని చేయడం తప్పైనప్పుడు గర్భస్రావం కూడా తప్పకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకమైనదని స్పష్టమవుతోందని వివరించింది.

మతనాయకుడైన ఆ ఉపాధ్యాయుడు ఈ వచనాలను ఎప్పుడూ చదవలేదు. స్టిఫనీ ధైర్యంగా ఇచ్చిన సాక్ష్యం, తన తోటి విద్యార్థినులతో వివిధ అంశాలపై ఎన్నో చక్కని చర్చలు జరపడానికి దారితీసింది. ఇప్పుడు ఒకమ్మాయి కావలికోట, తేజరిల్లు! తాజా పత్రికలను క్రమంగా తీసుకుంటోంది, స్టిఫనీ దేవునికి తాను చేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకోవడాన్ని చూడడానికి ఇద్దరమ్మాయిలు యెహోవాసాక్షుల జిల్లా సమావేశానికి హాజరయ్యారు.

దక్షిణ అమెరికాలోని సురినామ్‌లో నివసిస్తున్న ఆరేళ్ళ వరెటా తన ఉపాధ్యాయురాలికి ఓదార్పు అవసరమైనప్పుడు, దేవుణ్ణి స్తుతించడానికి ఆ సందర్భాన్ని ఉపయోగించుకుంది. ఆ ఉపాధ్యాయురాలు మూడు రోజుల సెలవు తర్వాత పాఠశాలకు వచ్చి, తాను ఈ మూడు రోజులు పాఠశాలకు ఎందుకు రాలేదో తెలుసా అని విద్యార్థులను అడిగింది. “మీకు ఒంట్లో బాలేదు, అవునా?” అని వాళ్ళు జవాబిచ్చారు. “కాదు. మా అక్క చనిపోయింది, అందుకు నాకు చాలా దుఃఖంగా ఉంది. కాబట్టి మీరు నిశ్శబ్దంగా ఉండాలి” అని ఆమె వాళ్లకు చెప్పింది.

ఆ మధ్యాహ్నం వరెటా వాళ్ళ అమ్మ నిద్రపోతున్న సమయంలో, పాత పత్రికలు తిరగేస్తూ వాటి శీర్షికలు చూడడం మొదలుపెట్టింది. అలా చూస్తున్న ఆమెకు “మరణం తర్వాత జీవితం ఉందా?” అనే శీర్షికగల కావలికోట, జూలై 15, 2001 కనిపించింది. ఆమె ఎంతో ఉత్సాహంగా తన తల్లిని నిద్రలేపి, “మమ్మీ, మమ్మీ, చూడు! మా టీచర్‌కు ఇవ్వడానికి, మరణానికి సంబంధించిన ఒక పత్రిక నాకు దొరికింది!” అని చూపించింది. వరెటా వ్రాసిన ఒక ఉత్తరాన్ని జతచేసి ఆ పత్రికను ఉపాధ్యాయురాలికి పంపించారు. ఆ ఉత్తరంలో వరెటా ఇలా వ్రాసింది: “ఇది ప్రత్యేకంగా మీ కోసం. మీరు పరదైసులో మీ అక్కను మళ్ళీ చూడవచ్చు, ఎందుకంటే యెహోవా ఎప్పుడూ అబద్ధాలు చెప్పడు. ఆయన తాను పరలోకంలో కాదుగానీ ఈ భూమి మీద పరదైసును తీసుకువస్తానని వాగ్దానం చేశాడు.” ఈ ఆర్టికల్స్‌ అందజేసిన బైబిలు ఆధారిత ఓదార్పుకు ఆ ఉపాధ్యాయురాలు తన ప్రగాఢమైన కృతజ్ఞతను వ్యక్తం చేసింది.

భవిష్యత్తుకోసం నిర్మించుకోవడం

యెహోవా “సంతోషంగా ఉండే దేవుడు,” యౌవనస్థులు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. (1 తిమోతి 1:​11, NW) ఆయన వాక్యమిలా చెబుతోంది: “నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము.” (ప్రసంగి 11:⁠9) యెహోవా ప్రస్తుత కాలం కన్నా ముందుకు చూసి, మంచి ప్రవర్తనకు, చెడు ప్రవర్తనకు ఉండే దీర్ఘకాల పర్యవసానాలను అర్థం చేసుకుంటాడు. అందుకే ఆయన వాక్యం యౌవనస్థులను ఇలా ఉద్బోధిస్తోంది: “దుర్దినములు రాకముందే​—⁠ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, . . . నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.”​—⁠ప్రసంగి 12:​1, 2.

అవును, యౌవనస్థులు జీవమనే అమూల్యమైన బహుమానాన్ని పూర్తిగా ఆనందించాలని యెహోవా కోరుకుంటున్నాడు. యౌవనస్థులు దేవుడ్ని గుర్తుతెచ్చుకుని, ఆయనను స్తుతించడం ద్వారా అర్థవంతమైన, ప్రతిఫలదాయకమైన జీవితాన్ని గడపవచ్చు. కష్టాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ధైర్యంగా ఇలా చెప్పవచ్చు: “యెహోవావలననే నాకు సహాయము కలుగును.”​—⁠కీర్తన 121:⁠2.

[అధస్సూచి]

^ పేరా 4 యెహోవాసాక్షుల క్యాలెండర్‌​—⁠2005 (ఆంగ్లం) మార్చి/ఏప్రిల్‌ చూడండి.

[9వ పేజీలోని బ్లర్బ్‌]

‘యౌవనులారా, కన్యలారా, భూమిమీది నుండి యెహోవాను స్తుతించుడి.’

​—⁠కీర్తన 148:​7, 12.

[8వ పేజీలోని బాక్సు]

యెహోవా యౌవనస్థులకు మద్దతు ఇస్తాడు

“నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యమునుండి నా ఆశ్రయము నీవే.”​—⁠కీర్తన 71:⁠5.

“పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగుచుండునట్లు [దేవుడు] మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు.”​—⁠కీర్తన 103:⁠5.