కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమూయేలు మొదటి గ్రంథములోని ముఖ్యాంశాలు

సమూయేలు మొదటి గ్రంథములోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

సమూయేలు మొదటి గ్రంథములోని ముఖ్యాంశాలు

అది సా.శ.పూ. 1117వ సంవత్సరం. యెహోషువ వాగ్దాన దేశాన్ని జయించి అప్పటికి దాదాపు మూడు వందల సంవత్సరాలు గడిచిపోయాయి. ఇశ్రాయేలులోని పెద్దలు యెహోవా ప్రవక్త దగ్గరికి ఒక అసాధారణ విజ్ఞప్తితో వస్తారు. ఆ ప్రవక్త దాని గురించి ప్రార్థించడంతో, యెహోవా వారి విజ్ఞప్తిని అంగీకరిస్తాడు. దానితో న్యాయాధిపతుల కాలం ముగిసి మానవ రాజుల కాలం ప్రారంభమవుతుంది. బైబిలులోని సమూయేలు మొదటి గ్రంథము, ఇశ్రాయేలు జనాంగపు చరిత్రలోని ఆ మలుపుకు సంబంధించిన ఉత్తేజకరమైన సంఘటనలను తెలియజేస్తుంది.

సమూయేలు, నాతాను, గాదు వ్రాసిన సమూయేలు మొదటి గ్రంథము సా.శ.పూ. 1180 నుండి 1078 వరకున్న 102 సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటనలను తెలియజేస్తుంది. (1 దినవృత్తాంతములు 29:​29) అది ఇశ్రాయేలుకు చెందిన నలుగురు నాయకుల వృత్తాంతం. ఇద్దరు న్యాయాధిపతులుగా సేవచేస్తే మరో ఇద్దరు రాజులుగా పరిపాలించారు; ఇద్దరు యెహోవాకు విధేయత చూపించగా మరో ఇద్దరు అవిధేయత చూపించారు. మనం ఇద్దరు మాదిరికరమైన స్త్రీల గురించి, ధైర్యవంతుడూ అణకువగలవాడూ అయిన ఒక యోధుడి గురించి కూడా చదువుతాం. అలాంటి ఉదాహరణలు, మనం అనుకరించవలసిన, నివారించవలసిన దృక్పథాల గురించి, చర్యల గురించి విలువైన పాఠాలను అందజేస్తాయి. కాబట్టి సమూయేలు మొదటి గ్రంథములోని విషయాలు మన తలంపులపై, క్రియలపై ప్రభావం చూపించగలవు.​—⁠హెబ్రీయులు 4:12.

ఏలీ తర్వాత సమూయేలు న్యాయాధిపతి కావడం

(1 సమూయేలు 1:1-7:​17)

అది ఫలసంగ్రహపు పండుగ సమయం, రామాలో నివసించే హన్నాకు పట్టలేనంత ఆనందంగా ఉంది. * యెహోవా ఆమె ప్రార్థనలకు జవాబిచ్చాడు, ఆమె ఒక కుమారుని కన్నది. హన్నా తన మొక్కు చెల్లించడానికి, తన కుమారుడైన సమూయేలు యెహోవా “మందిరము”లో సేవ చేయగలిగేలా ఆయనను అక్కడకు తీసుకువెళ్తుంది. అక్కడ ఆ బాలుడు “యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్య చేయ[డం]” ప్రారంభిస్తాడు. (1 సమూయేలు 1:24; 2:​11) సమూయేలు ఇంకా చిన్న వయస్సులో ఉండగానే, యెహోవా ఆయనతో మాట్లాడి ఏలీ కుటుంబానికి వ్యతిరేకంగా తీర్పు ప్రకటిస్తాడు. సమూయేలు పెద్దవాడవుతున్న కొద్దీ ఇశ్రాయేలు ప్రజలందరూ ఆయనను యెహోవా ప్రవక్తగా అంగీకరిస్తారు.

ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధానికి వస్తారు. వాళ్ళు మందసాన్ని స్వాధీనం చేసుకుని, ఏలీ ఇద్దరు కుమారులను చంపేస్తారు. ఆ వార్త విని, వృద్ధుడైన ఏలీ మరణిస్తాడు, ఆయన “నలువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయము తీ[ర్చాడు].” (1 సమూయేలు 4:​18) మందసాన్ని తమ దగ్గర ఉంచుకోవడం ఫిలిష్తీయులకు నాశనకరంగా పరిణమించడంతో వాళ్లు దాన్ని ఇశ్రాయేలీయులకు తిరిగి ఇచ్చేస్తారు. ఆ తర్వాత కాలంలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయం తీరుస్తాడు, అప్పుడు ఆ దేశంలో శాంతి నెలకొంటుంది.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

2:​10​—⁠ఇశ్రాయేలీయులపై మానవ రాజు లేని కాలంలో, యెహోవా ‘రాజుకు బలమివ్వాలని’ హన్నా ఎందుకు ప్రార్థించింది? ఇశ్రాయేలీయులకు భవిష్యత్తులో మానవ రాజు ఉంటాడని మోషే ధర్మశాస్త్రంలో ముందుగానే తెలియజేయబడింది. (ద్వితీయోపదేశకాండము 17:​14-18) యాకోబు తన మరణశయ్యపై ఇలా ప్రవచించాడు: “యూదా యొద్దనుండి దండము [రాజ్యాధికారానికి గుర్తు] తొలగదు.” (ఆదికాండము 49:​10) అంతేగాక ఇశ్రాయేలీయుల పూర్వీకురాలైన శారా గురించి యెహోవా ఇలా చెప్పాడు: “జనముల రాజులు ఆమెవలన కలుగుదురు.” (ఆదికాండము 17:​16) కాబట్టి హన్నా ఒక భవిష్యత్తు రాజు గురించి ప్రార్థించింది.

3:3​—⁠సమూయేలు నిజంగానే అతిపరిశుద్ధ స్థలంలో నిద్రించాడా? లేదు, ఆయన అక్కడ నిద్రించలేదు. సమూయేలు యాజకులుకాని కహతీయుల కుటుంబానికి చెందిన లేవీయుడు. (1 దినవృత్తాంతములు 6:​33-38) అంతేగాక ఆయన “పరిశుద్ధస్థలమును . . . చూచుటకు లోపలికి రాకూడదు.” (సంఖ్యాకాండము 4:​17-20) కాబట్టి మందిరంలో సమూయేలు వెళ్ళగల ఏకైక స్థలం ఆలయ గుడారపు ఆవరణనే. ఆయన అక్కడనే నిద్రపోయి ఉండవచ్చు. ఏలీ కూడా ఆవరణలోనే ఎక్కడో ఒకచోట నిద్రించి ఉండవచ్చు. “దేవుని మందసమున్న” స్థలమనే పదబంధం గుడార ప్రాంతాన్నే సూచిస్తుందని స్పష్టమవుతోంది.

7:​7-9, 17​—⁠యెహోవా ఎంచుకున్న స్థలంలోనే క్రమంగా బలులు అర్పించబడవలసి ఉండగా, సమూయేలు మిస్పాలో దహనబలి ఎందుకు అర్పించాడు, రామాలో బలిపీఠం ఎందుకు కట్టాడు? (ద్వితీయోపదేశకాండము 12:4-7, 13, 14; యెహోషువ 22:​19) షిలోహులోని ఆలయ గుడారములో నుండి పరిశుద్ధ మందసం తీసివేయబడిన తర్వాత, అక్కడిక యెహోవా ప్రత్యక్షత లేకుండా పోయింది. కాబట్టి దేవుని ప్రతినిధిగా సమూయేలు, మిస్పాలో దహనబలి అర్పించి, రామాలో బలిపీఠం కట్టాడు. ఈ చర్యలను యెహోవా ఆమోదించాడని స్పష్టమవుతోంది.

మనకు పాఠాలు:

1:​11, 12, 21-23; 2:​19. హన్నా ప్రార్థనాపూర్వక దృక్పథం, ఆమె వినయం, యెహోవా కనికరంపట్ల ఆమెకున్న కృతజ్ఞతాభావం, దీర్ఘకాలం నిలిచిన ఆమె మాతృవాత్సల్యం దైవభయం గల స్త్రీలందరికీ ఆదర్శప్రాయం.

1:⁠8. ఇతరులను మాటలతో బలపరచడంలో ఎల్కానా ఎంత చక్కని మాదిరి ఉంచాడో కదా! (యోబు 16:⁠5) దుఃఖిస్తున్న హన్నాను ఆయన ఏ మాత్రం నిందించకుండా ఇలా ప్రశ్నించాడు: “నీకు మనోవిచారమెందుకు కలిగినది?” ఇది తన భావాల గురించి మాట్లాడడానికి ఆమెను ప్రోత్సహించింది. అప్పుడు ఎల్కానా, “పదిమంది కుమాళ్లకంటె నేను నీకు విశేషమైనవాడను కానా?” అంటూ ఆమెపట్ల తనకున్న ప్రేమానురాగాన్ని వ్యక్తం చేశాడు.

2:​26; 3:​5-8, 15, 19. దేవుడిచ్చిన మన పనికి అంటిపెట్టుకొని ఉండడం ద్వారా, ఆధ్యాత్మిక శిక్షణ నుండి ప్రయోజనం పొందడం ద్వారా, మర్యాదపూర్వకంగా గౌరవప్రదంగా ఉండడం ద్వారా, మనం అటు దేవుని “దయయందు” ఇటు మనుష్యుల “దయయందు” వర్ధిల్లుతాము.

4:3, 4, 10. నిబంధన మందసమంత పరిశుద్ధమైన వస్తువు కూడా రక్షణ కల్పించే తాయెత్తు కాలేకపోయింది. మనం ‘విగ్రహాల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండాలి.’​—⁠1 యోహాను 5:​21.

ఇశ్రాయేలు మొదటి రాజు​—⁠విజయవంతమయ్యాడా, విఫలమయ్యాడా?

(1 సమూయేలు 8:1-15:35)

సమూయేలు తన జీవితమంతా యెహోవాపట్ల విశ్వసనీయంగా ఉన్నాడు గానీ ఆయన కుమారులు మాత్రం దైవిక మార్గాల్లో నడుచుకోలేదు. ఇశ్రాయేలులోని పెద్దలు మానవ రాజు కావాలని విజ్ఞప్తి చేసినప్పుడు యెహోవా దానిని అనుమతిస్తాడు. సమూయేలు యెహోవా నడిపింపును అనుసరించి, అందగాడు బెన్యామీనీయుడు అయిన సౌలును రాజుగా అభిషేకిస్తాడు. సౌలు అమ్మోనీయులను ఓడించడం ద్వారా రాజుగా తన స్థానాన్ని బలపరచుకుంటాడు.

సౌలు కుమారుడు, పరాక్రమవంతుడు అయిన యోనాతాను ఫిలిష్తీయుల దండును హతము చేస్తాడు. అప్పుడు ఫిలిష్తీయులు పెద్ద సైన్యంతో ఇశ్రాయేలీయులపైకి వస్తారు. సౌలు భయపడిపోయి అవిధేయతతో తానే స్వయంగా దహనబలి అర్పిస్తాడు. యోనాతాను తన ఆయుధములను మోసేవాడిని మాత్రమే వెంట తీసుకువెళ్ళి ఫిలిష్తీయుల మరో దండుపై ధైర్యంగా దాడి చేస్తాడు. అయితే సౌలు చేసిన తొందరపాటు మ్రొక్కుబడి మూలంగా అతనికి సంపూర్ణ విజయం లభించదు. సౌలు ‘నఖముఖాల తన శత్రువులైన వారందరితో యుద్ధము చేస్తాడు.’ (1 సమూయేలు 14:47) అయితే అమాలేకీయులను ఓడించిన తర్వాత, నాశనానికి ‘ప్రతిష్ఠించబడిన’ దానిని హతము చేయకుండా విడిచిపెట్టడం ద్వారా యెహోవాపట్ల అతను అవిధేయత చూపిస్తాడు. (లేవీయకాండము 27:​28, 29) తత్ఫలితంగా, యెహోవా సౌలును రాజుగా తిరస్కరిస్తాడు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

9:9​—⁠“ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి యనిపించుకొనెను” అనే పదబంధం యొక్క అర్థమేమిటి? ఈ మాటలు, సమూయేలు కాలంలో ప్రవక్తలు ఎంతో ప్రముఖులుగా తయారైనప్పుడు, ఇశ్రాయేలును రాజులు పరిపాలిస్తున్న కాలంలో, “దీర్ఘదర్శి” అనే పదానికి బదులు “ప్రవక్త” అనే పదం వాడుకలోకి వచ్చిందని సూచిస్తుండవచ్చు. ప్రవక్తలలో సమూయేలు మొదటివాడిగా పరిగణించబడుతున్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 3:​24.

14:​24-32, 44, 45​—⁠యోనాతాను సౌలు మ్రొక్కుబడిని అతిక్రమిస్తూ తేనె తిన్నందుకు ఆయన దేవుని అనుగ్రహాన్ని కోల్పోయాడా? ఈ చర్య మూలంగా యోనాతాను దేవుని అనుగ్రహం కోల్పోయినట్లేమీ అనిపించడం లేదు. మొదటిగా, యోనాతానుకు తన తండ్రి మ్రొక్కుబడి గురించి తెలియదు. అంతేగాక, వక్రమైన ఆసక్తి మూలంగానో లేక రాజరిక అధికారాన్ని గురించిన తప్పు దృక్కోణం కారణంగానో పురికొల్పబడిన ఆ మ్రొక్కుబడి ప్రజలకు సమస్యలను తెచ్చింది. అలాంటి మ్రొక్కుబడికి దేవుని ఆమోదం ఎలా ఉంటుంది? యోనాతాను మ్రొక్కుబడిని అతిక్రమించడం ద్వారా కలిగే పర్యవసానాలను భరించడానికి సిద్ధపడినప్పటికీ ఆయన ప్రాణం ఆయనకు దక్కింది.

15:6​—⁠కేనీయులు సౌలు ప్రత్యేకమైన దయను ఎందుకు పొందారు? కేనీయులు మోషే మామ కుమారులు. వీరు, ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం నుండి బయల్దేరిన తర్వాత వారికి సహాయం చేశారు. (సంఖ్యాకాండము 10:​29-32) కనాను దేశంలో, కేనీయులు లేదా కేయిను కుమారులు కూడా కొంతకాలంపాటు యూదా వంశస్థులతోపాటు నివసించారు. (న్యాయాధిపతులు 1:​16) కేనీయులు ఆ తర్వాత అమాలేకీయులతో, ఇతర అనేకమంది ప్రజలతో నివసించినప్పటికీ, వారు ఇశ్రాయేలీయులతో స్నేహపూర్వకంగానే ఉన్నారు. కాబట్టి సౌలు మంచి కారణంతోనే కేనీయులను విడిచిపెట్టాడు.

మనకు పాఠాలు:

9:​21; 10:​22, 27. సౌలు మొదట రాజైనప్పుడు “పనికిమాలినవారు కొందరు” ఆయన రాజరికాన్ని అంగీకరించనప్పుడు కఠినంగా ప్రవర్తించకుండా ఆయనకున్న వినయం, అణకువ, ఆయనను కాపాడాయి. అలాంటి మనోదృక్పథం వివేచనరహితంగా ప్రవర్తించకుండా ఉండడానికి ఎంతగా సహాయం చేస్తుందో కదా!

12:​20, 21. మనుష్యులను నమ్ముకోవడం, దేశాల సైనిక శక్తిపై నమ్మకం ఉంచడం, లేదా విగ్రహారాధన వంటి “మాయా స్వరూపములు” యెహోవా సేవ చేయకుండా మిమ్మల్ని ఆటంకపరచనివ్వకండి.

12:​24. యెహోవాపట్ల భక్తిపూర్వక భయాన్ని కాపాడుకోవడానికి, పూర్ణ హృదయంతో ఆయనను సేవించడానికి, ప్రాచీన కాలంలోనూ ఆధునిక కాలాల్లోనూ తన ప్రజల కోసం ఆయన చేసిన “గొప్ప కార్యములను” ధ్యానించడం కీలకం.

13:​10-14, 15:​22-25, 30. అవిధేయ క్రియల ద్వారా లేదా గర్వించే దృక్పథం ద్వారా వ్యక్తమయ్యే అహంకారం విషయంలో జాగ్రత్తగా ఉండండి.​—⁠సామెతలు 11:⁠2.

రాజ్యాధికారానికి గొర్రెలుకాసే పిల్లవాడు ఎంపిక చేసుకోబడడం

(1 సమూయేలు 16:1-31:13)

సమూయేలు, యూదా గోత్రానికి చెందిన దావీదును భవిష్యత్తు రాజుగా అభిషేకిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి దావీదు, భారీకాయుడు, ఫిలిష్తీయుడు అయిన గొల్యాతును ఒకే వడిసెల రాయితో హతమారుస్తాడు. దావీదు యోనాతానుల మధ్య స్నేహబంధం ఏర్పడుతుంది. సౌలు దావీదును తన యోధులపై నియమిస్తాడు. దావీదు సాధించిన అనేక విజయాలకు ప్రతిస్పందనగా, ఇశ్రాయేలులోని స్త్రీలు ఇలా పాడతారు: “సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిరి.” (1 సమూయేలు 18:⁠7) సౌలు అసూయతో నిండుకొని దావీదును చంపడానికి ప్రయత్నిస్తాడు. సౌలు మూడుసార్లు దాడి చేసిన తర్వాత, దావీదు అక్కడినుండి వెళ్లిపోయి పలాయితుడవుతాడు.

దావీదు పలాయితునిగా తిరుగుతున్న కాలంలో, రెండుసార్లు సౌలును చంపకుండా విడిచిపెడతాడు. అంతేగాక, దావీదు అందమైన అబీగయీలును కలిసి, చివరికి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులపై దాడి చేసినప్పుడు, సౌలు యెహోవాను విచారిస్తాడు. కానీ యెహోవా అతడిని విడిచిపెట్టాడు. సమూయేలు మరణించాడు. దిక్కుతోచని సౌలు ఆత్మలను సంప్రదించి, ఫిలిష్తీయులతో చేసే యుద్ధంలో తాను మరణిస్తాడని తెలుసుకుంటాడు. ఆ యుద్ధంలో, సౌలు తీవ్రంగా గాయపడతాడు, అతని కుమారులు చంపబడతారు. సౌలు విఫలుడై మరణించడంతో ఆ వృత్తాంతం ముగుస్తుంది. దావీదు ఇంకా అజ్ఞాతంలోనే ఉంటాడు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

16:14​—⁠సౌలును ఏ దురాత్మ భయపెట్టింది? సౌలుకు మనశ్శాంతి లేకుండా చేసిన దురాత్మ ఆయన మనోహృదయాల్లోని దుష్ట కోరిక, తప్పు చేయాలని ఆయనకు అంతర్గతంగా ఉన్న కోరిక. యెహోవా తన పరిశుద్ధాత్మను వెనక్కి తీసుకున్నప్పుడు, సౌలుకు కాపుదల లేకుండా పోయింది, దానితో ఆయన తన సొంత దుష్ట స్వభావం మూలంగా పీడించబడ్డాడు. ఆ స్వభావం తన పరిశుద్ధాత్మ స్థానాన్ని తీసుకోవడానికి దేవుడు అనుమతించాడు కాబట్టి, ఈ దుష్ట స్వభావం ‘యెహోవా యొద్దనుండి వచ్చిన దురాత్మగా’ పేర్కొనబడింది.

17:55​—మొదటి సమూయేలు 16:17-23 వచనాల దృష్ట్యా, దావీదు ఎవరి కుమారుడని సౌలు ఎందుకు అడిగాడు? సౌలు కేవలం దావీదు తండ్రి పేరు గురించి అడగలేదు. భారీకాయుడ్ని హతమార్చే అద్భుతమైన కార్యాన్ని సాధించిన పిల్లవాడి తండ్రి ఎలాంటి వ్యక్తి అనేది ఆయన తెలుసుకోవాలనుకుని అడిగి ఉండవచ్చు.

మనకు పాఠాలు:

16:6, 7. ఇతరుల బాహ్య రూపాన్నిబట్టి ప్రభావితం కాకుండా లేదా తొందరపాటుగా ఒక నిర్ణయానికి రాకుండా, మనం వారిని యెహోవా దృష్టించేలా దృష్టించడానికి ప్రయత్నించాలి.

17:​47-50. మనం గొల్యాతులాంటి శత్రువుల నుండి వ్యతిరేకతను లేదా హింసను ధైర్యంగా ఎదుర్కోవచ్చు ఎందుకంటే “యుద్ధము యెహోవాదే.”

18:​1, 3; 20:​41, 42. యెహోవాను ప్రేమించేవారి మధ్యన నిజమైన స్నేహితులను కనుగొనవచ్చు.

21:​12, 13. జీవితంలోని కష్ట పరిస్థితులతో వ్యవహరించడానికి మనం మన మానసిక శక్తిసామర్థ్యాలను ఉపయోగించాలని యెహోవా భావిస్తాడు. ఆయన మనకు తన ప్రేరేపిత వాక్యాన్నిచ్చాడు, అది మనకు బుద్ధి, తెలివి, వివేచన ఇస్తుంది. (సామెతలు 1:⁠4) మనకు నియమిత క్రైస్తవ పెద్దల సహాయం కూడా ఉంది.

24:⁠6; 26:​11. యెహోవా అభిషిక్తునిపట్ల నిజమైన గౌరవం చూపించడంలో దావీదు మనకు ఎంత చక్కని మాదిరి ఉంచాడో కదా!

25:​23-33. అబీగయీలు వివేచన మాదిరికరమైనది.

28:​8-19. దుష్టాత్మలు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి లేదా వారికి హాని చేయడానికి, తాము మరణించిన ఫలానా వ్యక్తులు అన్నట్లే నటిస్తాయి. కాబట్టి మనం అన్ని రకాలైన అభిచారానికి దూరంగా ఉండాలి.​—⁠ద్వితీయోపదేశకాండము 18:​10-12.

30:​23, 24. సంఖ్యాకాండము 31:⁠27 ఆధారితమైన ఈ నిర్ణయం, సంఘంలో మద్దతునిచ్చే పాత్రల్లో సేవ చేసేవారిని యెహోవా విలువైనవారిగా ఎంచుతాడని చూపిస్తుంది. కాబట్టి మనం ఏమి చేస్తున్నా, “అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా” చేద్దాము.​—⁠కొలొస్సయులు 3:​23.

“బలులు అర్పించుటకంటె” ఏది “శ్రేష్ఠము”?

ఏలీ, సమూయేలు, సౌలు, దావీదుల అనుభవాల ద్వారా ఏ ప్రాథమిక సత్యం నొక్కిచెప్పబడింది? అదేమిటంటే: “బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము. తిరుగుబాటు చేయుట సోదెచెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము.”​—⁠1 సమూయేలు 15:​22, 23.

ప్రపంచవ్యాప్తంగా రాజ్య ప్రకటనాపనిలో, శిష్యులను చేసేపనిలో భాగంవహించే గొప్ప ఆధిక్యత మనకుంది! యెహోవాకు మనం ‘ఎడ్లకు బదులుగా పెదవులను’ అర్పించుచుండగా, ఆయన తన లిఖిత వాక్యం ద్వారా, తన సంస్థ యొక్క భూసంబంధమైన భాగం ద్వారా అందజేస్తున్న నిర్దేశానికి విధేయత చూపించడానికి మనం చేయగలిగినదంతా చేయాలి.​—⁠హోషేయ 14:2; హెబ్రీయులు 13:​15.

[అధస్సూచి]

^ పేరా 7 సమూయేలు మొదటి గ్రంథములో పేర్కొనబడిన వివిధ స్థలాలను పరిశీలించడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన “మంచి దేశమును చూడండి” బ్రోషుర్‌లోని 18-19 పేజీలను చూడండి.

[23వ పేజీలోని చిత్రం]

ఇశ్రాయేలు మొదటి రాజు అణకువగల, వినయస్థుడైన పరిపాలకుని నుండి గర్విష్టి, అహంకారి అయిన రాజుగా మారాడు

[24వ పేజీలోని చిత్రం]

గొల్యాతువంటి శత్రువుల నుండి వ్యతిరేకత ఎదురైనప్పుడు మనం దేని విషయంలో నమ్మకం కలిగివుండవచ్చు?