కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమ్సోను యెహోవా శక్తితో జయించాడు!

సమ్సోను యెహోవా శక్తితో జయించాడు!

సమ్సోను యెహోవా శక్తితో జయించాడు!

ఆయనను బంధించినవారు తమ పగ తీర్చుకోవడానికి ఆయన కళ్ళు ఊడపీకి, ఆయనతో వెట్టిచాకిరీ చేయించారు. ఆ తర్వాత వారు ఆయనను చెరసాల నుండి బయటకు రప్పించి ప్రజలకు వినోదం కలిగించడం కోసం ఆయనను ఒక అన్యమత ఆలయంలోకి తెచ్చారు. వారు ఆయనను వేలాదిమంది ప్రేక్షకుల ఎదుటకు నడిపించి, ఆయనను ఎగతాళి చేశారు. బంధీగా ఉన్న ఆ వ్యక్తి నేరస్థుడూ కాదు, శత్రుసైన్యపు అధిపతీ కాదు. ఆయన యెహోవా ఆరాధకుడు, 20 సంవత్సరాలపాటు ఇశ్రాయేలులో ఒక న్యాయాధిపతిగా సేవ చేశాడు.

జీవించినవారిలోకెల్లా అత్యంత బలవంతుడైన సమ్సోను ఇంతటి అవమానకరమైన పరిస్థితిలో ఎలా చిక్కుకున్నాడు? ఆయన అసాధారణమైన శక్తి ఆయనను కాపాడిందా? సమ్సోను బలానికి రహస్యమేమిటి? ఆయన జీవిత కథనుండి మనమేమైనా నేర్చుకోవచ్చా?

ఆయన ‘ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెడతాడు’

ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు సత్యారాధననుండి పక్కకు మళ్ళారు. కాబట్టి వారు “మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా నలువది సంవత్సరములు వారిని ఫిలిష్తీయులచేతికి అప్పగించెను.”​—⁠న్యాయాధిపతులు 13:⁠1.

మానోహ అనే ఇశ్రాయేలీయుని భార్య గొడ్రాలు, ఆమెకు దేవదూత కనిపించి, ఆమెకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడని తెలియజేయడంతో సమ్సోను వృత్తాంతం మొదలవుతుంది. “అతని తలమీద మంగలకత్తి వేయకూడదు; ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టును” అని ఆ దేవదూత ఆమెకు చెప్పాడు. (న్యాయాధిపతులు 13:2-5) సమ్సోను తల్లి గర్భము ధరించకముందే, సమ్సోనుకు ఒక నిర్దిష్టమైన నియామకం ఇవ్వాలని యెహోవా నిర్ణయించాడు. ఆయన పుట్టినప్పటినుండి దేవునికి నాజీరు చేయబడినవాడిగా ఉండాలి, అంటే ఒక ప్రత్యేక విధమైన పరిశుద్ధ సేవకు ఎంపిక చేసుకోబడినవాడిగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు.

“ఆమె నాకిష్టమైనది”

సమ్సోను పెద్దవాడవుతున్న కొద్దీ “యెహోవా అతని నాశీర్వదించెను.” (న్యాయాధిపతులు 13:24) ఒకరోజు సమ్సోను తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి, “తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లిచేయవలెను” అని కోరాడు. (న్యాయాధిపతులు 14:2) ఆ మాటలు విని వారు ఎంత ఆశ్చర్యపోయి ఉంటారో ఊహించండి. తమ కుమారుడు నిరంకుశులైన ఫిలిష్తీయులనుండి ఇశ్రాయేలీయులను విడిపించే బదులు వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు. అన్య దేవతల ఆరాధకులను పెళ్ళి చేసుకోవడం దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధమైనది. (నిర్గమకాండము 34:11-16) కాబట్టి ఆ తల్లిదండ్రులు తమ అభ్యంతరాన్ని ఇలా వ్యక్తం చేశారు: “నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని, సున్నతి పొందని ఫిలిష్తీయులలోనుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్లుచున్నావా?” అయినా కూడా సమ్సోను, “ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నాకొరకు తెప్పించుము” అని పట్టుబట్టాడు.​—⁠న్యాయాధిపతులు 14:⁠3.

సమ్సోను ఆ ఫిలిష్తీయురాలిని ఎందుకు ‘ఇష్టపడ్డాడు’? ఆమె “అందంగా, ఆకర్షణీయంగా” ఉందని కాదుగానీ “తన సంకల్పాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ఆమె సరిగ్గా సరిపోతుందనే” ఆయన ఆమెను ఇష్టపడ్డాడు అని మెక్‌క్లింటాక్‌ అండ్‌ స్ట్రాంగ్స్‌ సైక్లోపీడియా చెబుతోంది. ఏ సంకల్పం నెరవేర్చుకోవడానికి ఆమె సరిపోతుంది? సమ్సోను ‘ఫిలిష్తీయులకేమైన చేయుటకై రేపబడెను’ అని న్యాయాధిపతులు 14:4 వివరిస్తోంది. సమ్సోను ఆ ఉద్దేశంతోనే ఆ స్త్రీని ఇష్టపడ్డాడు. సమ్సోను యుక్తవయసుకు చేరుకునే సరికి ‘యెహోవా ఆత్మ అతని రేపుటకు మొదలుపెట్టెను’ అంటే చర్య తీసుకోవడానికి ఆయనను ప్రేరేపించడం ప్రారంభించింది. (న్యాయాధిపతులు 13:25) కాబట్టి సమ్సోను తనకు ఫిలిష్తీయురాలైన భార్య కావాలని వింత కోరిక కోరడానికి, అలాగే ఇశ్రాయేలుపై న్యాయాధిపతిగా సేవ చేసిన సంవత్సరాలన్నింటిలోనూ ఆయనను యెహోవా ఆత్మే నడిపించింది. సమ్సోనుకు తాను వెదుకుతున్న అవకాశం లభించిందా? ముందుగా మనం, సమ్సోనుకు తన మద్దతు ఉందని యెహోవా ఎలా హామీ ఇచ్చాడో చూద్దాం.

సమ్సోను తనకు కాబోయే భార్య పట్టణమైన తిమ్నాతుకు ప్రయాణమయ్యాడు. ఆయన “తిమ్నాతు ద్రాక్షతోటలవరకు వచ్చినప్పుడు, కొదమసింహము అతని యెదుటికి బొబ్బరించుచువచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా . . . అతడు దానిని చీల్చెను” అని లేఖనాల్లోని వృత్తాంతం చెబుతోంది. సమ్సోను ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా అసాధారణ రీతిలో ఆయన శక్తి ప్రదర్శించబడింది. అక్కడ జరిగినదానిని ఎవ్వరూ చూడలేదు. సమ్సోను నాజీరు చేయబడినవాడని, ఆయనకు దేవుడు ఇచ్చిన నియామకాన్ని నెరవేర్చే సామర్థ్యం ఉందని యెహోవా ఈ విధంగా సమ్సోనుకు హామీ ఇచ్చాడా? అలా అని బైబిలు చెప్పడం లేదు, అయితే అంతటి అసాధారణమైన శక్తి తనది కాదని సమ్సోను ఖచ్చితంగా గ్రహించాడు. అది దేవుని నుండే వచ్చివుండాలి. తన ముందున్న పనిలో యెహోవా తనకు మద్దతునిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చని ఆయనకు అర్థమయ్యింది. సింహాన్ని చంపిన సంఘటనతో బలపర్చబడి సమ్సోను తన ప్రయాణాన్ని కొనసాగించి “అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాటలాడినప్పుడు ఆమెయందు [ఆయనకు] ఇష్టము కలిగెను.”​—⁠న్యాయాధిపతులు 14:5-7.

సమ్సోను ఆ తర్వాత ఆ స్త్రీని ఇంటికి తీసుకొని రావడానికి తిరిగి వెళ్ళేటప్పుడు “ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు, సింహపు కళేబరములో తేనెటీగల గంపును తేనెయు కనబడెను.” సమ్సోను ఆ విషయాన్ని తన వివాహమప్పుడు గుర్తు చేసుకొని తనతో ఉన్న 30 మంది ఫిలిష్తీయుల స్నేహితులకు ఈ విప్పుడు కథ వేశాడు: “బలమైనదానిలోనుండి తీపి వచ్చెను, తిను దానిలోనుండి తిండి వచ్చెను.” వారు ఆ విప్పుడు కథ భావాన్ని చెప్పగలిగితే వారికి 30 సన్నపు నారబట్టలు, 30 దుస్తులు ఇస్తానని సమ్సోను చెప్పాడు. వారు చెప్పలేకపోతే వారే సమ్సోనుకు వాటిని ఇవ్వాలి. ఫిలిష్తీయులు ఆ విప్పుడు కథ భావము కనుక్కోలేక మూడురోజులపాటు తికమకపడ్డారు. నాలుగవ రోజున వారు సమ్సోను భార్యను బెదిరించడానికి ప్రయత్నించారు. వారు ఆమెతో ఇలా చెప్పారు: “నీ పెనిమిటి ఆ విప్పుడు కథభావమును మాకు తెలుపునట్లు అతని లాలనచేయుము, లేనియెడల మేము అగ్నివేసి నిన్ను నీ తండ్రి యింటివారిని కాల్చివేసెదము.” అదెంత క్రూరమైన స్వభావమో కదా! ఫిలిష్తీయులు తమ స్వంత ప్రజలతోనే ఇలా వ్యవహరిస్తే, వారు అణచివేస్తున్న ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి!​—⁠న్యాయాధిపతులు 14:8-15.

భయపడిన ఆ స్త్రీ, విప్పుడు కథ భావము చెప్పమని సమ్సోనును పోరుపెట్టింది. ప్రేమరాహిత్యాన్ని ప్రదర్శించి నమ్మకద్రోహం చేస్తూ ఆమె వెంటనే ఆ సమాధానాన్ని ఫిలిష్తీయులకు తెలియజేసింది. వారు ఆ విప్పుడు కథ భావము చెప్పినప్పుడు, వారికి ఆ సమాధానం ఎలా తెలిసిందో సమ్సోను గ్రహించాడు. కాబట్టి ఆయన వారితో ఇలా అన్నాడు: “నా దూడతో దున్నకపోయినయెడల నా విప్పుడు కథను విప్పలేకయుందురు.” సమ్సోను అంతవరకూ ఎదురు చూసిన అవకాశం ఆయనకు లభించింది. “యెహోవా ఆత్మ అతనిమీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో ముప్పదిమందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పినవారికి బట్టలనిచ్చెను.”​—⁠న్యాయాధిపతులు 14:​18, 19.

అష్కెలోనువద్ద సమ్సోను చేసిన పని పగ తీర్చుకోవాలనే కోరికతో చేసినదా? కాదు. అది దేవుడు తాను ఎంపిక చేసుకున్న విమోచకునితో చేయించిన పని. సమ్సోను ద్వారా, యెహోవా తన ప్రజలను క్రూరంగా అణచివేస్తున్నవారికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు. ఆ పోరాటం అక్కడితో ముగిసిపోలేదు. సమ్సోను తన భార్యను కలవడానికి వచ్చినప్పుడు దానిని కొనసాగించేందుకు ఆయనకు మరో అవకాశం లభించింది.

ఒంటి చేత్తో యుద్ధం

సమ్సోను తిమ్నాతుకు చేరుకున్నప్పుడు, తాను తన భార్యను ద్వేషిస్తున్నాడని తలంచి ఆమె తండ్రి ఆమెను మరో పురుషునికిచ్చి పెళ్ళి చేశాడు అని తెలుసుకున్నాడు. సమ్సోను తనకు బాధ కలిగినట్లుగా నటించాడు. ఆయన 300 నక్కలను పట్టుకొని, రెండేసి నక్కలను తోకల దగ్గర కట్టి, వాటి తోకల మధ్య ఒక్కొక్క దివిటీ కట్టి వాటిని వదిలేశాడు. అవి చేలను, ద్రాక్షతోటలను, ఒలీవతోటలను తగలబెట్టి ఆ సంవత్సరానికి ఫిలిష్తీయుల మూడు ప్రముఖ పంటలను నాశనం చేశాయి. కోపంతో రగిలిపోయిన ఫిలిష్తీయులు క్రూరంగా ప్రవర్తించారు. సమ్సోను చేసినదానికి ఆయన భార్య, ఆమె తండ్రే కారణమని భావించి వారిద్దరిని దహించారు. వాళ్ళు అలా క్రూరంగా పగ తీర్చుకోవడం సమ్సోను ఉద్దేశాన్ని నెరవేర్చింది. ఆయన కూడా వాళ్ళలో చాలామందిని చంపుతూ వాళ్ళపై దాడి చేశాడు.​—⁠న్యాయాధిపతులు 15:1-8.

యెహోవా దేవుడు సమ్సోనును ఆశీర్వదిస్తున్నాడని అర్థం చేసుకొని ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల అధికారాన్ని అంతం చేయడానికి ఆయనతో చేతులు కలిపారా? లేదు. యూదా పురుషులు తాము సమస్యల్లో ఇరుక్కోకుండా ఉండడానికి, దేవుడు ఎంపిక చేసుకున్న నాయకుణ్ణి బంధించి ఆయనను శత్రువులకు అప్పగించడానికి 3,000 మందిని పంపించారు. ఇశ్రాయేలీయులు ఇలా నమ్మకద్రోహం చేయడంతో తన శత్రువులకు మరింత హాని చేసే అవకాశం సమ్సోనుకు లభించింది. ఆయన తన శత్రువులకు అప్పగించబడేటప్పుడు “యెహోవా ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చినందున అతనిచేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనుపనారవలె నాయెను; సంకెళ్లును అతనిచేతులమీదనుండి విడిపోయెను.” అప్పుడు ఆయన గాడిద పచ్చి దవడ ఎముకను తీసుకొని దానితో వెయ్యిమంది శత్రువులను హతం చేశాడు.​—⁠న్యాయాధిపతులు 15:10-15.

యెహోవాకు మొరపెట్టుకుంటూ సమ్సోను ఇలా అన్నాడు: “నీవు నీ సేవకుని చేతివలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి, సున్నతి పొందనివారి చేతిలోకి పడవలెనా?” యెహోవా సమ్సోను ప్రార్థన విని దానికి సమాధానమిచ్చాడు. “దేవుడు . . . ఒక గోతిని చీల్చెను, దానినుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రదికెను.”​—⁠న్యాయాధిపతులు 15:18, 19.

సమ్సోను తన సంకల్ప నెరవేర్పుపై అంటే ఫిలిష్తీయులతో యుద్ధం చేయడంపై తన మనస్సును కేంద్రీకరించాడు. ఆయన దేవుని శత్రువులతో పోరాడాలన్న ఉద్దేశంతోనే గాజా వద్ద ఒక వేశ్య ఇంట్లో ఉన్నాడు. సమ్సోనుకు శత్రువుల పట్టణంలో రాత్రి గడపడానికి స్థలం కావలసి వచ్చింది, అది ఒక వేశ్య ఇంట్లో లభించింది. సమ్సోను ఎలాంటి అనైతిక ఉద్దేశాలతో అక్కడికి వెళ్ళలేదు. ఆయన ఆ స్త్రీ ఇంటిని మధ్యరాత్రి విడిచిపెట్టి, పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను ఊడదీసి వాటిని పట్టుకొని దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోవున్న హెబ్రోను వద్దవున్న కొండపైకి తీసుకొనివెళ్ళాడు. అది దైవాంగీకారంతో, దేవుడిచ్చిన శక్తితోనే చేశాడు.​—⁠న్యాయాధిపతులు 16:1-3.

సమ్సోను విషయంలో పరిశుద్ధాత్మ పనిచేసిన తీరు అసాధారణమైనది, ఎందుకంటే అప్పటి పరిస్థితులు కూడా అసాధారణమైనవే. నేడు దేవుని నమ్మకమైన సేవకులు శక్తి కోసం ఆ పరిశుద్ధాత్మపైనే ఆధారపడవచ్చు. యెహోవా “తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును” అని యేసు తన అనుచరులకు హామీ ఇచ్చాడు.​—⁠లూకా 11:13.

యెహోవా ఎందుకు ‘సమ్సోనును ఎడబాసాడు?’

కొంతకాలం తర్వాత సమ్సోను దెలీలా అనే స్త్రీని ప్రేమించాడు. ఫిలిష్తీయుల ఐదుగురు సర్దారులు సమ్సోనును ఓడించాలని ఎంతగా కోరుకున్నారంటే వారు దెలీలా సహాయం అడిగారు. వారు దెలీలా దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పారు: “నీవు అతని లాలనచేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమేలాగు అతని గెలువ వచ్చునో తెలిసికొనుము.” ఆ పని చేస్తే ఆ ఐదుగురు సర్దారులు తమలో “ప్రతివాడును వెయ్యిన్నినూరు వెండి నాణెములు” ఇస్తామని ఆమెకు చెప్పారు.​—⁠న్యాయాధిపతులు 16:4, 5.

ఆ వెండి నాణెములు ఒక్కొక్కటి 11.4 గ్రాముల బరువుంటే, వారు ఇస్తామన్నది 5,500 వెండి నాణెములు కాబట్టి అది మొత్తం 62,700 గ్రాముల వెండి అవుతుంది, అది భారీ లంచమే. అబ్రాహాము తన భార్యను పాతిపెట్టడం కోసం 400 తులముల వెండి చెల్లించి స్థలం కొన్నాడు, ఒక దాసుడు కేవలం 30 తులముల వెండికి అమ్మబడేవాడు. (ఆదికాండము 23:14-20; నిర్గమకాండము 21:​32) ఆ ఐదుగురు సర్దారులు, అంటే ఫిలిష్తీయుల ఐదు పట్టణాల పాలకులు దెలీలాకు డబ్బు ఆశ చూపించారే తప్ప ఆమె తన జనులపట్ల తనకున్న విశ్వసనీయతను ప్రదర్శించడానికి ఆ పని చేయాలని చెప్పలేదు అనే విషయం ఆమె బహుశా ఒక ఇశ్రాయేలీయురాలు అయివుంటుంది అని సూచిస్తోంది. ఏది ఏమైనా దెలీలా వారికి సహాయం చేయడానికి ఒప్పుకుంది.

దెలీలా అడిగినప్పుడు సమ్సోను మూడుసార్లు ఆమెకు తప్పుడు సమాధానాలు ఇచ్చాడు, ఆ మూడుసార్లు ఆమె ఆయనను శత్రువులకు అప్పగించడానికి ప్రయత్నించడం ద్వారా ఆయనను మోసం చేసింది. కానీ “ఆమె అనుదినమును మాటలచేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను.” చివరకు సమ్సోను తన తలపై ఎన్నడూ మంగలకత్తి పెట్టబడలేదని అసలు విషయం చెబుతూ, తన జుట్టు కత్తిరించబడితే తాను బలహీనుడై ఇతర పురుషుల్లాగే ఉంటాడని ఆమెకు చెప్పాడు.​—⁠న్యాయాధిపతులు 16:6-17.

అదే సమ్సోను పతనానికి కారణమయ్యింది. దెలీలా ఆయన జుట్టు కత్తిరించబడేలా చూసింది. అయితే సమ్సోను శక్తి అక్షరార్థంగా ఆయన జుట్టులో లేదు. ఆయన జుట్టు ఒక నాజీరుగా దేవునితో ఆయనకున్న ప్రత్యేకమైన సంబంధాన్ని మాత్రమే సూచించింది. సమ్సోను తన జుట్టు కత్తిరించబడడంద్వారా, ఒక నాజీరుగా దేవునితో తనకున్న సంబంధం పాడవడానికి అనుమతించినప్పుడు ‘యెహోవా అతనిని ఎడబాసాడు.’ అప్పుడు ఫిలిష్తీయులు సమ్సోనును బంధించి, ఆయన కళ్ళు ఊడపీకి, చెరసాలలో వేశారు.​—⁠న్యాయాధిపతులు 16:18-21.

అది మనకు ఎంత శక్తిమంతమైన పాఠం నేర్పిస్తుందో కదా! మనం యెహోవాతో మనకున్న సంబంధాన్ని విలువైనదిగా ఎంచవద్దా? మనం మన క్రైస్తవ సమర్పణ విషయంలో ఏ విధంగానైనా రాజీ పడితే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉండాలని ఎలా ఆశించగలము?

“నేనును ఫిలిష్తీయులును చనిపోదుము గాక”

విజయోత్సాహంతో ఉన్న ఫిలిష్తీయులు సమ్సోనును ఓడించినందుకు తమ దేవతయైన దాగోనుకు పూజలు చేశారు. వారు సంతోషంతో పండుగ చేసుకుంటూ తమ బంధీగా ఉన్న సమ్సోనును దాగోను ఆలయంవద్దకు నడిపించారు. సమ్సోనుకు తాను ఓడిపోవడానికిగల నిజమైన కారణం తెలుసు. యెహోవా తనను ఎందుకు ఎడబాసాడో ఆయనకు తెలుసు, సమ్సోను ఆ విషయంలో విఫలమైనందుకు పశ్చాత్తాపపడ్డాడు. సమ్సోను చెరసాలలో ఉన్నప్పుడు ఆయన జుట్టు మళ్ళీ ఒత్తుగా పెరగటం ప్రారంభించింది. ఆయన వేలాదిమంది ఫిలిష్తీయుల ఎదుట నిలబడి ఉన్నప్పుడు ఎలాంటి చర్య తీసుకున్నాడు?

“యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసికొనుము, దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్ము” అని సమ్సోను ప్రార్థించాడు. ఆ తర్వాత ఆయన ఆ ఆలయానికి ఆధారంగావున్న రెండు మధ్యస్తంభములను పట్టుకొని ‘బలముతో వంగాడు.’ దాని ఫలితం? ఆ ఆలయం “ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపినవారి లెక్కకంటె ఎక్కువాయెను.”​—⁠న్యాయాధిపతులు 16:22-30.

శారీరక బలం విషయానికి వస్తే సమ్సోనుకు సాటియైనవారు ఎవ్వరూ లేరు. ఆయన శక్తిమంతమైన క్రియలు నిజంగా గమనార్హమైనవే. అయితే అన్నింటికంటే ప్రాముఖ్యమైన విషయమేమిటంటే యెహోవా వాక్యం, బలమైన విశ్వాసంగలవారిలో ఒకరిగా సమ్సోనును పేర్కొంటుంది.​—⁠హెబ్రీయులు 11:32-34.

[26వ పేజీలోని చిత్రం]

సమ్సోను బలానికి రహస్యమేమిటి?