కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆస్ట్రేలియా మారుమూల ప్రాంతాల్లో యోగ్యులను వెదకడం

ఆస్ట్రేలియా మారుమూల ప్రాంతాల్లో యోగ్యులను వెదకడం

రాజ్య ప్రచారకుల నివేదిక

ఆస్ట్రేలియా మారుమూల ప్రాంతాల్లో యోగ్యులను వెదకడం

ఆస్ట్రేలియా లోపలి భాగంలో ఉన్న ఒక సువిశాల భూభాగాన్ని మక్కువతో అవుట్‌బ్యాక్‌ అని పిలుస్తారు. ఈ భాగంలోని కొన్ని మారుమూల ప్రాంతాలకు 12 సంవత్సరాల నుండి సువార్త అందలేదు. అందుకే ఉత్తర ఆస్ట్రేలియా రాజధాని పట్టణమైన డార్విన్‌లోని యెహోవాసాక్షులు, ఆ ప్రాంతాల్లో యోగ్యులను వెదకడం కోసం తొమ్మిది రోజుల సమగ్ర ప్రకటనా పనికి ప్రణాళిక వేశారు.​—⁠మత్తయి 10:​11.

ఈ సమగ్ర ప్రకటనా పనిని ఆరంభించడానికి 12 నెలల ముందు నుండే శ్రద్ధతో కూడిన ప్రణాళిక వేయడం మొదలైంది, అందులో భాగంగా 8,00,000 చదరపు కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉండే ఆ భూభాగాన్ని, అంటే న్యూజీలాండ్‌ కన్నా మూడు రెట్లు పెద్దగా ఉండే ప్రాంతాన్ని మ్యాపులు వేయడం కూడా జరిగింది. ఆ మారుమూల ప్రాంతం ఎంత విశాలంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఈ క్రింది విషయాన్ని ఊహించండి, ఆ ప్రాంతంలో ఉండే పశుపాలనా క్షేత్రపు ముందు గేటుకూ ఇంటికీ మధ్య దూరం మామూలుగా 30 కిలోమీటర్ల కన్నా ఎక్కువే ఉంటుంది! అంతేకాదు, కొన్నిసార్లు ఒక పశుపాలనా క్షేత్రానికి మరో పశుపాలనా క్షేత్రానికి మధ్య 300 లేదా అంతకన్నా ఎక్కువ కిలోమీటర్ల దూరం ఉంటుంది.

ఆ ప్రకటనా పనిలో పాల్గొనడానికి మొత్తం 145 మంది సాక్షులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కొందరైతే టాస్మేనియా అంతటి దూరంలో ఉన్న ప్రాంతాల నుండి కూడా వచ్చారు. కొందరు నాలుగు చక్రాల వాహనాల్లో విడిది చేయడానికి అవసరమైన సాధన సామగ్రితోపాటు, వాహనానికి అవసరమయ్యే విడి భాగాలు, పెట్రోలు తీసుకుని వచ్చారు. మరి కొందరు ట్రేలర్లలో సామగ్రిని నింపుకొని వాటిని తమ వాహనాలకు తగిలించుకొని వచ్చారు. వాటితోపాటు, తమకు అనుకూలమైన వాహనాలు లేనివారు 22 సీట్లున్న రెండు బస్సులను అద్దెకు తీసుకుని వచ్చారు. బస్సులో ప్రయాణించేవారు ఆ ప్రాంతంలోని చిన్న చిన్న పట్టణాల్లోని ప్రజలకు సాక్ష్యం ఇవ్వడం మీద దృష్టి సారించారు.

ప్రయాణానికి ముందు, ఆ అసాధారణమైన క్షేత్రంలో సువార్తను ఎలా ప్రకటించాలో తెలిపేందుకు సహోదరులు ప్రసంగాలను, ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఉదాహరణకు, ఆదివాసీ సమాజాల్లో సమర్థవంతంగా ప్రకటించాలంటే సాధారణంగా నిర్దిష్టమైన ప్రవర్తనా నియమావళిని పాటించాలి, ఆదివాసీ ఆచారాలు తెలిసి ఉండాలి. వన్య ప్రాణులను కాపాడేందుకు సహాయపడే పర్యావరణ అంశాలు కూడా సహోదరులు చర్చించారు.

అక్కడకు వెళ్ళిన సహోదరులకు అనేక అద్భుతమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఉదాహరణకు, ఒక ఆదివాసీ గూడెంలో బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం ఇచ్చేందుకు సహోదరులు ఏర్పాటు చేశారు. దాని గురించి ఆ సమాజ నాయకురాలు స్వయంగా వెళ్ళి ప్రజలకు తెలిపింది. ఆ తర్వాత, ప్రసంగానికి హాజరైనవారికి 5 పుస్తకాలు, 41 బ్రోషుర్లు పంచిపెట్టారు. మరో గూడెంలో సహోదరులు ఒక ఆదివాసీ వ్యక్తిని కలిశారు. ఆయన వద్ద కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ బైబిలు ఉంది, కానీ అది పాతబడి చిరిగిపోయి ఉంది. దేవుని పేరు తెలుసా అని ఆయనను అడిగినప్పుడు, ఆయన తెలుసని చెప్పి తన కోటు జేబులో నుండి ఒక పాత కావలికోట సంచికను తీశాడు. ఆ పత్రికలో పేర్కొన్న మార్కు 12:30వ వచనాన్ని ఆయన చదివాడు. అక్కడిలా ఉంది: ‘నీవు నీ పూర్ణహృదయముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.’ “ఆ లేఖనం అంటే నాకు చాలా ఇష్టం” అని ఆయన చెప్పాడు. సుదీర్ఘమైన బైబిలు చర్చ తర్వాత, ఆయన ఒక కొత్త బైబిలుతోపాటు బైబిలు ఆధారిత ఇతర ప్రచురణలను తీసుకున్నాడు.

కార్పంటేరియా సింధుశాఖ సమీపంలో, పది లక్షల ఎకరాల విస్తీర్ణంగల పశుపాలనా క్షేత్రం అధిపతి అయిన ఒక వ్యక్తి రాజ్య సందేశంపట్ల ఆసక్తి చూపించాడు. ఆయనకు నా బైబిలు కథల పుస్తకము, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము * పుస్తకాలను చూపించినప్పుడు, క్రియోల్‌ భాషలో ఏవైనా పుస్తకాలు ఉన్నాయా అని అడిగాడు. అది అసాధారణమైన కోరిక, ఎందుకంటే ఆదివాసీలు చాలామంది క్రియోల్‌ భాషలో మాట్లాడతారు కానీ దాన్ని కొద్దిమందే చదవగలుగుతారు. ఆ పశుపాలనా క్షేత్రంలో పనిచేసే మొత్తం 50 మంది క్రియోల్‌ చదవగలరని తెలిసింది. ఆ అధిపతి క్రియోల్‌ భాషలో బైబిలు సాహిత్యాలను ఆనందంగా స్వీకరించాడు, తనను సంప్రదించడానికి ఆయన సంతోషంగా తన ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు.

తొమ్మిది రోజులపాటు సమగ్రంగా సాక్ష్యమివ్వడంలో సహోదరులు మొత్తం 120 బైబిళ్ళు, 770 పుస్తకాలు, 705 పత్రికలు, 1,965 బ్రోషుర్లు పంచిపెట్టారు. అంతేగాక 720 పునర్దర్శనాలు చేసి, 215 బైబిలు అధ్యయనాలు ఆరంభించారు.

సువిశాలమైన ఆ ప్రాంతంలో అక్కడక్కడా నివసిస్తూ ఆధ్యాత్మిక ఆకలితో ఉన్న అనేకమంది యోగ్యులు చివరకు సంతృప్తి చెందారు.​—⁠మత్తయి 5:⁠6.

[అధస్సూచి]

^ పేరా 8 యెహోవాసాక్షులు ప్రచురించినవి.

[30వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఆస్ట్రేలియా

ఉత్తర ప్రాంతం

డార్విన్‌

కార్పంటేరియా సింధుశాఖ

సిడ్నీ

టాస్మేనియా