కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లిదండ్రులారా, మీ అమూల్యమైన స్వాస్థ్యాన్ని కాపాడుకోండి

తల్లిదండ్రులారా, మీ అమూల్యమైన స్వాస్థ్యాన్ని కాపాడుకోండి

తల్లిదండ్రులారా, మీ అమూల్యమైన స్వాస్థ్యాన్ని కాపాడుకోండి

“జ్ఞానము ఆశ్రయాస్పదము . . . [అది] దాని పొందినవారి ప్రాణమును రక్షించును.”​—⁠ప్రసంగి 7:​12.

తల్లిదండ్రులు రూపురేఖల్లోను, వ్యక్తిత్వ లక్షణాల్లోను తమను పోలి ఉండే సజీవమైన ఒక కొత్త వ్యక్తిని ఈ ప్రపంచంలోకి తెస్తారు. అలాంటి పిల్లలను “యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము” అని బైబిలు పిలుస్తోంది. (కీర్తన 127:⁠3) యెహోవాయే నిజమైన జీవదాత కాబట్టి, ఆయన వాస్తవానికి తనకు చెందిన దానిని తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాడు. (కీర్తన 36:⁠9) తల్లిదండ్రులారా, దేవుని నుండి అలాంటి అమూల్యమైన బహుమతిని అందుకోవడాన్ని మీరు ఎలా దృష్టిస్తున్నారు?

2 అలాంటి బహుమతిని ఖచ్చితంగా వినయంతో, కృతజ్ఞతా భావంతో స్వీకరించాలి. 3,000 కన్నా ఎక్కువ సంవత్సరాల పూర్వం, తన భార్యకు దేవదూత కనబడి ఆమెకు ఒక కుమారుడు పుడతాడని ప్రకటించినట్లు ఇశ్రాయేలీయుడైన మానోహకు తెలిసింది. ఆ శుభవార్తను విన్నప్పుడు మానోహ, “నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మాయొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను” వేడుకున్నాడు. (న్యాయాధిపతులు 13:⁠8) తల్లిదండ్రులారా, మానోహ ఉదాహరణ నుండి మీరేమి నేర్చుకోవచ్చు?

ఇప్పుడు దేవుని సహాయం ఎందుకు అవసరం?

3 తల్లిదండ్రులకు తమ పిల్లలను పెంచడంలో యెహోవా సహాయం మునుపెన్నటికన్నా ఇప్పుడు ఎక్కువగా అవసరం ఉంది. ఎందుకు? అపవాదియైన సాతాను, అతని దయ్యాలు పరలోకం నుండి ఈ భూమ్మీదికి పడద్రోయబడ్డారు. అందుకే ‘భూమీ నీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై నీ యొద్దకు దిగివచ్చియున్నాడు’ అని బైబిలు హెచ్చరిస్తోంది. (ప్రకటన 12:​7-9, 12) సాతాను “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” అని బైబిలు వివరిస్తోంది. (1 పేతురు 5:⁠8) సింహాలు సాధారణంగా సులభంగా చేతికి చిక్కే వాటిని, ఎక్కువగా జంతువుల పిల్లలను వేటాడతాయి. కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడే విషయంలో యెహోవా మార్గనిర్దేశం కోసం చూడడం జ్ఞానయుక్తమైనది. మీ పిల్లలను కాపాడేందుకు మీరెంత కృషి చేస్తున్నారు?

4 మీ పరిసరాల్లో ఒక సింహం స్వేచ్ఛగా తిరుగుతోందని మీకు తెలిస్తే, మీ పిల్లలను రక్షించుకోవడం ఖచ్చితంగా మీకు అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా ఉంటుంది. సాతాను ఒక క్రూరమృగం. అతడు దేవుని ప్రజలను భ్రష్టుపట్టించి, వారికి దేవుని ఆమోదం లేకుండా చేయాలని చూస్తున్నాడు. (యోబు 2:​1-7; 1 యోహాను 5:​19) పిల్లలు అతనికి సులభంగా చిక్కిపోతారు. పిల్లలు అపవాది ఉరులను తప్పించుకోవాలంటే యెహోవాను తెలుసుకొని ఆయనకు లోబడి ఉండాలి. దానికి బైబిలు పరిజ్ఞానం ఆవశ్యకం. అందుకే “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము” అని యేసు చెప్పాడు. (యోహాను 17:⁠3) అంతేకాక, పిల్లలకు జ్ఞానం అవసరం అంటే తాము నేర్చుకున్నది అర్థం చేసుకొని అన్వయించుకునే సామర్థ్యం వారికి ఉండాలి. “జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును” కాబట్టి, తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల హృదయాల్లో సత్యాన్ని నాటాలి. (ప్రసంగి 7:​12) అయితే మీరు ఆ సత్యాన్ని వారిలో ఎలా నాటవచ్చు?

5 మీరు మీ పిల్లలకు దేవుని వాక్యాన్ని చదివి వినిపించవచ్చు, అలా చదివి వినిపించాలి కూడా. అయితే వారు యెహోవాను ప్రేమించి ఆయనకు లోబడేందుకు అది మాత్రమే సరిపోదు, వారు విషయాలను అర్థం చేసుకోవడం అవసరం. ఉదాహరణకు, రోడ్డు దాటేటప్పుడు రెండు వైపులా చూసి ఆ తర్వాతే రోడ్డు దాటాలని పిల్లలకు చెప్పవచ్చు. అయినా కూడా కొందరు పిల్లలు ఆ మాటలను పట్టించుకోరు. ఎందుకు? పిల్లలు తమ ‘మూఢత్వాన్నిబట్టి’ ప్రమాదంలో చిక్కుకోకుండా, కారు వచ్చి గుద్దుకుంటే కలిగే పర్యవసానాల గురించి తరచూ తగినంతగా వివరించకపోవడం లేదా ప్రమాద తీవ్రత గురించి వారు అర్థం చేసుకునే విధంగా చెప్పకపోవడమే దానికి కారణం. పిల్లలకు జ్ఞానం కలిగించడానికి సమయంతోపాటు ఎంతో సహనం కూడా అవసరం. ఆ జ్ఞానం ఎంతో విలువైనదిగా ఉంటుంది. “దాని మార్గములు రమ్యమార్గములు, దాని త్రోవలన్నియు క్షేమకరములు. దాని నవలంబించువారికి అది జీవవృక్షము, దాని పట్టుకొనువారందరు ధన్యులు” అని బైబిలు చెబుతోంది.​—⁠సామెతలు 3:​13-18; 22:​15.

జ్ఞానాన్నిచ్చే బోధ

6 పిల్లలు తరచూ తప్పులు చేస్తారు, దానర్థం వారికి సరైనది బోధించలేదు అని కాదుగానీ, బోధించబడిన విషయాలు వారి హృదయానికి అంటే వారి అంతరంగానికి చేరలేదని అది చూపిస్తుంది. పిల్లల హృదయాలను పాడుచేయాలని అపవాది తెగ పోరాడుతున్నాడు. వారు ఈ లోకపు భక్తిహీన ప్రభావాలకు లొంగిపోవాలని అతడు పన్నాగాలు పన్నుతున్నాడు. వారికి వారసత్వంగా కలిగిన, చెడు చేయాలనే పాప స్వభావాన్ని తన స్వార్థానికి వాడుకోవడానికి కూడా అతడు ప్రయత్నిస్తున్నాడు. (ఆదికాండము 8:​21; కీర్తన 51:⁠5) కాబట్టి తమ పిల్లల హృదయాలను పాడుచేయడానికి పెద్ద యుద్ధమే జరుగుతోందని తల్లిదండ్రులు గుర్తించాలి.

7 తల్లిదండ్రులు తమ పిల్లలకు నైతిక సూత్రాలను బోధిస్తున్నామనే నమ్మకంతో సాధారణంగా వారికి ఏది తప్పో, ఏది ఒప్పో చెబుతుంటారు. వారు బహుశా అబద్ధం చెప్పడం, దొంగతనం చేయడం లేదా తమ వివాహజత కాని వారితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం తప్పు అని పిల్లలకు చెప్పవచ్చు. అయితే పిల్లలు దానికి విధేయత చూపించాలంటే, తన తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి ఆ మాటకు లోబడాలి అనే దానికన్నా మరింత బలమైన ప్రేరణ ఉండాలి. అవి యెహోవా ఇచ్చిన నియమాలు. దేవుని ఆజ్ఞలకు లోబడడంలోనే విజ్ఞత ఉందని పిల్లలు తెలుసుకోవాలి.​—⁠సామెతలు 6:​16-19; హెబ్రీయులు 13:⁠4.

8 విశ్వంలోని సంక్లిష్టత, జీవరాశుల వైవిధ్యం, రుతువులు మారడం వంటివన్నీ అత్యంత జ్ఞానవంతుడైన ఒక సృష్టికర్త ఉన్నాడని అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయం చేస్తాయి. (రోమీయులు 1:​20; హెబ్రీయులు 3:⁠4) అంతేకాక, పిల్లలను దేవుడు ప్రేమిస్తున్నాడని, వారికి నిత్యజీవం ఇచ్చేందుకు దేవుడు తన కుమారుణ్ణి బలిగా అర్పించాడని, దేవునికి లోబడడం ద్వారా ఆయనను సంతోషపెట్టవచ్చని వారికి బోధించాలి. అలా బోధించినప్పుడు, పిల్లలను అడ్డగించడానికి అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా, వారు యెహోవానే సేవించాలని కోరుకుంటారు.​—⁠సామెతలు 22:⁠6; 27:​11; యోహాను 3:​16.

9 పిల్లలను రక్షిస్తూ, సరైనది చేయడానికి వారిని పురికొల్పగల బోధకు సమయం, శ్రద్ధ, ప్రణాళిక అవసం. దానికి తల్లిదండ్రులు దేవుడు ఇచ్చే మార్గనిర్దేశాన్ని అంగీకరించాలి. బైబిలు ఇలా చెబుతోంది: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు [‘యెహోవా,’ NW] యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:⁠4) దీని భావం ఏమిటి? ఆదిమ గ్రీకు భాషలో, “బోధలోను” అనే మాటకు అక్షరార్థంగా “ఉద్దేశాన్ని మనస్సులో నాటడం” అనే అర్థం ఉంది. కాబట్టి తండ్రులు తమ పిల్లల్లో యెహోవా ఉద్దేశాన్ని నాటాలి అని బైబిలు ఉద్బోధిస్తోంది. అది పిల్లలకు ఎంత రక్షణకరంగా ఉంటుందో కదా! పిల్లల మనస్సుల్లో దేవుని తలంపులను, ఆయన ఆలోచనా విధానాన్ని నాటినప్పుడు, వారు తప్పు చేయకుండా కాపాడబడతారు.

ప్రేమచేత పురికొల్పబడిన కోరిక

10 పిల్లలను సరైన రీతిలో పెంచాలనే మీ కోరిక తీరాలంటే, మీ ప్రయత్నాలు ప్రేమచేత పురికొల్పబడాలి. దానికి చక్కని సంభాషణ ప్రాముఖ్యం. మీ పిల్లల జీవితంలో ఏమి జరుగుతుందో, వారి దృక్కోణాలు ఏమిటో తెలుసుకోండి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పి మీ పిల్లలు మాట్లాడేందుకు ప్రోత్సహించండి. కొన్నిసార్లు వారు చెప్పేది మీకు దిగ్భ్రాంతికరంగా ఉండవచ్చు. అయినా అతిగా స్పందించకుండా జాగ్రత్త పడండి. వారు చెప్పేదానిని శ్రద్ధగా వినండి.

11 మీరు మీ పిల్లలకు లైంగిక దుర్నీతిని నిషేధించే దేవుని నియమాలను బైబిలు నుండి బహుశా చాలాసార్లు చదివి వినిపించి ఉండవచ్చు. (1 కొరింథీయులు 6:​18; ఎఫెసీయులు 5:⁠5) అందువల్ల యెహోవాకు ఏది ఇష్టమో, ఏది అయిష్టమో మీ పిల్లలకు బాగా తెలిసి ఉండవచ్చు. అయితే యెహోవా ఉద్దేశాన్ని పిల్లల మనస్సులో నాటడానికి అది మాత్రమే సరిపోదు. యెహోవా నియమాల ప్రాముఖ్యతను గ్రహించడానికి పిల్లలకు సహాయం చేయాలి. ఆయన నియమాలు యుక్తమైనవని, ప్రయోజనకరమైనవని, వాటికి లోబడడం సరైనదని, ప్రేమపూర్వకమైనదని వారిని ఒప్పించాలి. మీ పిల్లలు దేవుని దృక్కోణాన్ని అంగీకరించే విధంగా మీరు వారితో లేఖనాల నుండి తర్కించినప్పుడు మాత్రమే, మీరు ఆయన ఉద్దేశాన్ని వారి మనస్సులో నాటారని చెప్పవచ్చు.

12 లైంగిక విషయాల గురించి మాట్లాడేటప్పుడు మీరు ఇలా అడగవచ్చు: “వివాహానికి ముందే లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దని యెహోవా ఇచ్చిన నియమానికి లోబడడం ఒక వ్యక్తి సంతోషాన్ని పాడు చేస్తుందని మీరు అనుకుంటున్నారా?” తమ జవాబును వివరించమని మీ పిల్లలను ప్రోత్సహించండి. పిల్లలను కనడానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన ఏర్పాటును సమీక్షించిన తర్వాత మీరు వారిని ఇలా ప్రశ్నించవచ్చు: “మన ప్రేమగల దేవుడు మనం జీవితాన్ని ఆనందించకుండా చేసే నియమాలు పెడతాడని అనుకుంటున్నారా? లేక మన ఆనందానికే, మనలను కాపాడడానికే ఆయన నియమాలు ఉన్నాయని అనుకుంటున్నారా?” (కీర్తన 119:​1, 2; యెషయా 48:​17) ఈ విషయంలో మీ పిల్లల ఆలోచన ఏమిటో తెలుసుకోండి. ఆ తర్వాత, లైంగిక దుర్నీతి వేదనలకు, కష్టాలకు ఎలా నడిపించిందో చూపించే ఉదాహరణలు మీరు వివరించవచ్చు. (2 సమూయేలు 13:​1-33) మీ పిల్లలు దేవుని దృక్కోణాన్ని అర్థం చేసుకొని అంగీకరించే విధంగా తర్కించడం ద్వారా, వారి మనస్సులో దేవుని ఉద్దేశాన్ని నాటడంలో మీరెంతో సాధించిన వారవుతారు. అయితే మీరు చేయగల సంగతి మరొకటి కూడా ఉంది.

13 యెహోవాకు అవిధేయత చూపించడంవల్ల కలిగే పర్యవసానాల గురించి మీ పిల్లలకు బోధించడమే కాక, మన జీవన విధానం యెహోవాను వ్యక్తిగతంగా ఎలా ప్రభావితం చేస్తుందో కూడా వివరించడం జ్ఞానయుక్తం. మనం యెహోవా చిత్తం చేయనప్పుడు ఆయన మనస్సును నొప్పిస్తామని బైబిలు నుండి మీ పిల్లలకు చూపించండి. (కీర్తన 78:​41) “యెహోవాను నొప్పించకూడదని మీరు ఎందుకు కోరుకుంటున్నారు?” అని ప్రశ్నించిన తర్వాత, “మనం స్వార్థపూరిత కారణాలతోనే యెహోవాను సేవిస్తున్నామే గాని, ఆయన మీద మనకు ప్రేమ ఉన్నందువల్ల కాదని దేవుని శత్రువైన సాతాను వాదిస్తున్నాడు” అని వివరించండి. ఆ తర్వాత యోబు తన యథార్థత కాపాడుకోవడం ద్వారా దేవుని హృదయాన్ని సంతోషపెట్టి, సాతాను అబద్ధ ఆరోపణకు జవాబు ఇచ్చేలా చేశాడని వివరించండి. (యోబు 1:​9-11; 27:⁠5) తాము తమ ప్రవర్తన ద్వారా యెహోవా సంతోషపడేలా లేదా దుఃఖపడేలా చేయగలమని పిల్లలు అర్థం చేసుకోవాలి. (సామెతలు 27:​11) వీటితోపాటు ఇంకా అనేక ఆవశ్యక పాఠాలను గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం) * పుస్తకాన్ని ఉపయోగించి పిల్లలకు బోధించవచ్చు.

సంతృప్తికరమైన ఫలితాలు

14 క్రోయేషియాలోని ఒక తాతయ్య, ఏడు సంవత్సరాల తన మనవడికి బోధకుడు పుస్తకాన్ని చదివి వినిపిస్తాడు. తన మనవడు తనతో ఇలా చెప్పాడని ఆయన వ్రాశాడు: “మమ్మీ నాకొక పని చెప్పింది, నాకు ఆ పని చేయబుద్ధి కాలేదు. అప్పుడు నాకు ‘విధేయత మిమ్మల్ని కాపాడుతుంది’ అనే అధ్యాయం గుర్తొచ్చింది, వెంటనే నేను మమ్మీ దగ్గరకు వెళ్లి, ఆమె చెప్పిన పని చేస్తానని చెప్పాను.” “మనం అబద్ధం ఎందుకు చెప్పకూడదు?” అనే అధ్యాయం గురించి, అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఒక జంట ఇలా వ్రాసింది: “పిల్లలు తమ హృదయాలు విప్పి, తమంతట తామే తప్పులను అంగీకరించేలా చేసే ప్రశ్నలు అందులో ఉన్నాయి.”

15 ఈ బోధకుడు పుస్తకంలో 230 కన్నా ఎక్కువ బొమ్మలున్నాయి, ప్రతి బొమ్మకు లేదా కొన్ని బొమ్మలకు కలిపి ఒక వ్యాఖ్యానం లేదా వివరణ ఉంది. కృతజ్ఞతా భావంగల ఒక తల్లి ఇలా వ్రాసింది, “తరచూ మా అబ్బాయి బొమ్మలను చూస్తూ అక్కడే ఆగిపోతాడు, పేజీ తిప్పనివ్వడు. పుస్తకంలోని బొమ్మలు ఆకర్షణీయంగా ఉండడమే కాక, స్వయంగా అవే పాఠాలు నేర్పే విధంగా ఉన్నాయి లేదా కనీసం పిల్లలు ప్రశ్నలు అడిగేలా చేస్తాయి. చీకటిగా ఉన్న గదిలో కూర్చొని టీవీ చూస్తున్న పిల్లవాడి బొమ్మను చూపిస్తూ మా అబ్బాయి, ఆ పిల్లవాడు ఏదో తప్పు చేస్తున్నాడని తనకు తెలుసు అనే భావమిచ్చే స్వరంతో ‘మమ్మీ, ఈ పిల్లవాడు ఏమి చేస్తున్నాడు?’ అని అడిగాడు.” ఆ బొమ్మకు సంబంధించిన వ్యాఖ్యానం ఇలా ఉంది: “మనం చేసే ప్రతి పనిని ఎవరు చూడగలరు?”

నేటి కోసం ఆవశ్యక విద్య

16 పిల్లలు తమ మర్మాంగాల యుక్తాయుక్త ఉపయోగం గురించి తెలుసుకోవాలి. అయితే ఈ అంశం గురించి వారితో మాట్లాడడం అంత సులభం కాదు. మర్మాంగాలను సూచించే పదాలను ఉపయోగించడం అమర్యాదగా పరిగణించబడిన కాలంలో తాను పెరిగానని ఒక వార్తాపత్రిక విలేఖరి చెప్పంది. తన పిల్లలకు ఈ విషయాలు బోధించడం గురించి ఆమె ఇలా వ్రాసింది: “నేను నా ఇబ్బందిని అధిగమించి వారితో మాట్లాడాలి.” అవును, ఇబ్బందికరం అని తల్లిదండ్రులు లైంగిక అంశాలు వివరించకుండా ఉంటే, అది పిల్లలను రక్షించదు. లైంగిక అత్యాచారాలకు పాల్పడేవారు అమాయకులైన పిల్లలను మోసం చేస్తారు. గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి పుస్తకం ఆ అంశాన్ని ఆరోగ్యదాయకమైన, గౌరవప్రదమైన రీతిలో వివరిస్తుంది. పిల్లలకు లైంగిక విషయాలు వివరించడం వారి అమాయకత్వాన్ని తొలగించదు, కానీ అలా వివరించకపోవడమే వారు మోసపోవడానికి దారి తీయగలదు.

17 పదవ అధ్యాయంలో, దుష్టదూతలు భూమ్మీదికి వచ్చి పిల్లలను కనడం గురించి చర్చించేటప్పుడు, పిల్లలకు ఈ ప్రశ్న వేయబడింది: “లైంగిక సంబంధాల గురించి మీకు ఏమి తెలుసు?” ఆ ప్రశ్నకు పుస్తకం సులభమైన, గౌరవప్రదమైన జవాబు ఇస్తోంది. ఆ తర్వాత, 32వ అధ్యాయం పిల్లలను లైంగిక అత్యాచారాలకు పాల్పడేవారి నుండి ఎలా కాపాడవచ్చో వివరిస్తుంది. అలాంటి బోధ అవసరమని అనేక ఉత్తరాలు నివేదించాయి. ఒక తల్లి ఇలా వ్రాసింది: “పోయిన వారం మా అబ్బాయి జావన్‌ను పిల్లల డాక్టరు దగ్గరకు తీసుకెళ్లినప్పుడు, మర్మాంగాల సరైన ఉపయోగం గురించి మీరు అతనితో మాట్లాడారా అని ఆ డాక్టరు అడిగింది. కొత్త పుస్తకం ఉపయోగిస్తూ మేము ఆ విషయాన్ని చర్చించామని చెప్పినప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోయింది.”

18 మరో అధ్యాయం, బబులోను రాజ్యానికి ప్రతీకగా ఉన్న ప్రతిమకు నమస్కారం చేయడానికి నిరాకరించిన షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే ముగ్గురు హెబ్రీ యువకుల గురించిన బైబిలు వృత్తాంతాన్ని చర్చిస్తుంది. (దానియేలు 3:​1-30) బోధకుడు పుస్తకం సూచిస్తున్నట్లుగా, ప్రతిమకు నమస్కారం చేయడానికి జెండా వందనానికిగల సంబంధాన్ని కొందరు అర్థం చేసుకోలేకపోవచ్చు. అయితే యు.ఎస్‌. క్యాథలిక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్రంథకర్త ఎడ్వర్డ్‌ గాఫనీ ఏమన్నాడో గమనించండి. తన కూతురు ప్రభుత్వ పాఠశాలకు మొదటిరోజు హాజరై ఇంటికి వచ్చిన తర్వాత “పాఠశాలలో ఒక కొత్త ప్రార్థన” నేర్చుకున్నాను అని చెప్పిందని, ఆ ప్రార్థన ఏమిటో తనకు చెప్పమని తాను అడిగానని చెప్పాడు. “అప్పుడు మా పాప గుండెల మీద చెయ్యి పెట్టుకొని ‘పతాకానికి భక్తి విశ్వాసాలతో కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను . . .’ అని గర్వంగా చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడు నాకు వెంటనే ఓ విషయం అర్థమైంది. యెహోవాసాక్షులు చెప్పింది నిజమే. మన పాఠశాలల్లో అతి పిన్న వయస్సులోనే పిల్లలకు జాతీయ ఆరాధన, అంటే అచంచల విశ్వసనీయత అనే అంశం నేర్పించబడుతోంది.”

కృషికి తగిన ఫలితం

19 మీ పిల్లలకు బోధించడం మీ కృషికి తగిన ఫలితాన్నిస్తుంది. అమెరికాలోని కెన్సాస్‌లో ఉన్న తన కుమారుని నుండి ఉత్తరం అందుకున్న ఓ తల్లి కళ్ల నీళ్ల పర్యంతం అయింది. ఆ ఉత్తరంలో ఇలా ఉంది: “ఇతరులతో పోలిస్తే భావోద్వేగపరంగా నేను స్థిరంగా, ఆరోగ్యదాయకంగా ఉండేలా మీరు నన్ను పెంచినందుకు నేను చాలా ధన్యుణ్ణి అని భావిస్తున్నాను. ఈ విషయంలో మీరూ, డాడీ ఎంతో అభినందనీయులు.” (సామెతలు 31:​28) ఈ అమూల్య స్వాస్థ్యాన్ని కాపాడుకునేలా తమ పిల్లలకు బోధించడానికి గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి పుస్తకం ఇంకా చాలామంది తల్లిదండ్రులకు సహాయం చేయగలదు.

20 మన పిల్లలు మనం ఇవ్వగల పూర్తి సమయానికి, శ్రద్ధకు, ప్రయత్నానికి అర్హులు. వారు ఎప్పటికీ పిల్లలుగానే ఉండరు. వారితో ఉండడానికి, సహాయం చేయడానికి ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలా చేసినందుకు మీరు ఎన్నటికీ దుఃఖపడరు. వారు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీ పిల్లలు దేవుడు మీకిచ్చిన బహుమతి అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. వారెంతో అమూల్యమైన స్వాస్థ్యము. (కీర్తన 127:​3-5) కాబట్టి వారిని దేవుని బహుమతిగా పరిగణించి, వారి పెంపకం విషయంలో మీరు దేవునికి జవాబుదారులన్నట్టు వారిని జాగ్రత్తగా చూసుకోండి, నిజానికి మీరు జవాబుదారులే.

[అధస్సూచి]

^ పేరా 18 యెహోవాసాక్షులు ప్రచురించినది. “దేవుణ్ణి సంతోషపెట్టడం ఎలా?” అనే 40వ అధ్యాయం చూడండి.

మీరు ఎలా సమాధానమిస్తారు?

• తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు కాపాడాలి?

• ఎలాంటి బోధ జ్ఞానాన్ని కలిగిస్తుంది?

• నేడు మీ పిల్లలతో చర్చించవలసిన ఆవశ్యకమైన అంశాలు ఏమిటి?

• తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించడంలో బోధకుడు పుస్తకం ఏ విధంగా సహాయం చేసింది?

[అధ్యయన ప్రశ్నలు]

1. తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక బహుమతిగా ఎందుకు దృష్టించాలి?

2. మానోహ తాను తండ్రి కాబోతున్నాడనే సంగతిని విన్నప్పుడు ఎలా స్పందించాడు?

3. పిల్లలను పెంచడంలో నేడు ప్రత్యేకంగా దేవుని సహాయం ఎందుకు అవసరం?

4. (ఎ) పరిసరాల్లో సింహం స్వేచ్ఛగా తిరుగుతోందని తెలిసిన్నప్పుడు తల్లిదండ్రులు తక్షణమే ఎలా స్పందించాలి? (బి) పిల్లలకు రక్షణ కావాలంటే వారికి ఏమి ఉండాలి?

5. (ఎ) పిల్లలకు జ్ఞానాన్ని ఎలా కలిగించవచ్చు? (బి) జ్ఞానానికి ఉన్న విలువను సామెతలు ఎలా వర్ణిస్తోంది?

6. (ఎ) పిల్లలు తరచూ ఎందుకు మూఢత్వంతో ప్రవర్తిస్తారు? (బి) ఎలాంటి యుద్ధం జరుగుతోంది?

7. పిల్లలకు తప్పొప్పులు చెప్పడం మాత్రమే ఎందుకు సరిపోదు?

8. పిల్లలు జ్ఞానయుక్తంగా ప్రవర్తించేందుకు వారికి ఎలాంటి బోధ సహాయం చేస్తుంది?

9. (ఎ) ప్రాణ రక్షణగా ఉండే బోధకు ఏమి కావాలి? (బి) తండ్రులు ఏమి చేయాలని ఉపదేశించబడ్డారు, దీనిలో ఏమి ఇమిడివుంది?

10. మీ పిల్లలకు సమర్థవంతంగా ఉపదేశిండానికి మీరు ఏమి తెలిసికొని ఉండడం ప్రాముఖ్యం?

11. తల్లి లేదా తండ్రి పిల్లల మనస్సులో దేవుని ఉద్దేశాన్ని ఎలా నాటవచ్చు?

12. లైంగిక సంబంధాల విషయంలో సరైన దృక్కోణం అలవర్చుకునేలా తల్లి లేదా తండ్రి తన పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు?

13. ప్రత్యేకంగా, ఏ విషయాన్ని అర్థం చేసుకోవడం యెహోవాకు లోబడేలా పిల్లలను పురికొల్పుతుంది?

14, 15. (ఎ) బోధకుడు పుస్తకంలోని ఏ పాఠాలు పిల్లలను పురికొల్పాయి? (బి) ఆ పుస్తకాన్ని ఉపయోగించిన కారణంగా మీకు ఎలాంటి సత్ఫలితాలు వచ్చాయి? (18-19వ పేజీల్లోని బాక్సు కూడా చూడండి.)

16. నేడు పిల్లలకు ఏ విషయం బోధించడం ఆవశ్యకం, ఎందుకు ఆవశ్యకం?

17. తల్లిదండ్రులు తమ పిల్లలకు లైంగిక విషయాలు బోధించడానికి బోధకుడు పుస్తకం ఎలా సహాయం చేస్తుంది?

18. జాతీయ చిహ్నాలపట్ల భక్తిని ప్రదర్శించడాన్ని బోధకుడు పుస్తకం ఎలా చర్చిస్తోంది?

19. పిల్లలకు బోధించడం ద్వారా ఎలాంటి ప్రతిఫలం లభిస్తుంది?

20. తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఏమి గుర్తుంచుకోవాలి, అది వారి మీద ఎలాంటి ప్రభావం చూపించాలి?

[18, 19వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం

తల్లిదండ్రులు గాని ఇతర పెద్దలు గాని యేసుక్రీస్తు బోధల గురించి పిల్లలకు చదివి వినిపించడానికి, వారితో చర్చించడానికి అనువుగా ఉండేందుకు గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం) అనే పుస్తకం రూపొందించబడింది. అయితే ఈ పుస్తకాన్ని పెద్దలు కూడా చదివారు, వారు తాము నేర్చుకున్నవాటిపట్ల యథార్థమైన కృతజ్ఞతను వ్యక్తం చేశారు.

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఒక వ్యక్తి ఇలా చెప్పాడు: “గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి పుస్తకం ఎంతో సరళమైనది, అది అన్ని వయస్సులవారిని కదిలిస్తుంది, 76 సంవత్సరాలుగల నన్ను కూడా కదిలించింది. యౌవనం నుండి యెహోవా సేవ చేసిన నేను మీకు ఎన్నో కృతజ్ఞతలు చెబుతున్నాను.”

ఇంగ్లాండ్‌లోని లండన్‌కు చెందిన ఒక పాఠకురాలు ఇలా చెప్పింది: “పుస్తకంలోని అందమైన చిత్రాలు తల్లిదండ్రుల హృదయాలను, పిల్లల హృదయాలను ఇట్టే ఆకట్టుకుంటాయి. దానిలోని ప్రశ్నలు, అది కూర్చబడిన విధానం అద్భుతంగా ఉన్నాయి. ‘యేసు ఎలా కాపాడబడ్డాడు?’ అనే 32వ అధ్యాయంలో కనిపించేటట్లు సున్నితమైన విషయాలు కూడా ఎంతో చక్కగా చర్చించబడ్డాయి.” ఆమె చివరిగా ఇలా చెప్పింది: “ఈ పుస్తకం నిస్సందేహంగా యెహోవాసాక్షుల పిల్లల కోసమే రూపొందించబడినా, ఉపాధ్యాయులు, ఇతరులు కూడా ఈ పుస్తకాన్ని స్వీకరించడానికి సంతోషిస్తారు అని నాకు అనిపిస్తుంది. రానున్న నెలల్లో, సంవత్సరాల్లో దీనిని ఉపయోగించడానికి నేను ఎదురు చూస్తున్నాను.”

అమెరికాలోని మస్సాచుస్సెట్స్‌కు చెందిన ఒక స్త్రీ పుస్తకంలో ఉన్న అనేక “ఆలోచనాపూర్వకమైన చిత్రాల” గురించి వ్యాఖ్యానించింది. ఆమె ఇలా వ్రాసింది: “ఈ పుస్తకం పిల్లల కోసం రూపొందించబడినా, దీనిలో చర్చించబడిన విషయాలు యెహోవాతో మనకున్న వ్యక్తిగత సంబంధం గురించి ఆలోచించడానికి పెద్దలమైన మనకు కూడా సహాయం చేయగలవు.”

అమెరికాలోని మెయిన్‌కు చెందిన ఒక స్త్రీ, “ఆహా! ఇది ఎంత అద్భుతమైన పుస్తకమో!” అని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఇంకా ఇలా అంది: “అది కేవలం పిల్లల కోసం కాదు, అది దేవుని పిల్లలమైన మనందరి కోసం. అది నా హృదయాంతరంగాల్లోకి చేరుకొని నా భావోద్వేగాలను కదిలించింది, ఆ తర్వాత వాటికి ఉపశమనం కలిగించింది, ఇప్పుడు నా మనస్సు ప్రశాంతంగా ఉంది. నేను నా తండ్రియైన యెహోవాకు ఎంతో సన్నిహితంగా ఉన్నట్లు భావిస్తున్నాను. ఆయన గడచిన సంవత్సరాలన్నింటిలోనూ నాకు కలిగిన దుఃఖాన్ని తుడిచివేసి, తన సంకల్పాలను మరింత స్పష్టం చేశాడు” అని చెబుతూ చివరికి ఇలా అంది: “‘దయచేసి ఈ పుస్తకాన్ని చదవండి’ అని నేను ప్రతి ఒక్కరికీ చెబుతున్నాను.”

జపాన్‌లోని క్యోటోకు చెందిన స్త్రీ ఈ పుస్తకాన్ని తన మనవళ్ళకూ మనవరాళ్ళకూ చదివి వినిపించేటప్పుడు వాళ్ళు, “‘ఈ అబ్బాయి ఏమి చేస్తున్నాడు? ఈ చిన్న పాపకు ఎందుకు చీవాట్లు పడుతున్నాయి? ఈ తల్లి ఏమి చేస్తోంది? ఈ సింహం ఏమి చేస్తోంది?’” అంటూ ఎన్నో ప్రశ్నలు వేశారు అని చెప్పింది. “అది మనకు ఆసక్తిగల విషయాలను నేర్పిస్తుంది. గ్రంథాలయాల్లో దొరికే వేరే ఏ పుస్తకాన్ని నేను ఇంతగా ఇష్టపడను” అని ఆమె చెప్పింది.

కెనడాలోని కల్గరీకి చెందిన తండ్రి ఈ పుస్తకాన్ని అందుకున్న వెంటనే తన ఆరేళ్ళ కూతురికి, తొమ్మిదేళ్ళ కుమారుడికి దానిని చదివి వినిపించడం ప్రారంభించానని చెప్పాడు. “వారు దానికి అద్భుతంగా ప్రతిస్పందించారు. నా పిల్లలు దానిని శ్రద్ధగా వింటూ, దానిలోని ప్రశ్నలకు హృదయపూర్వకంగా సమాధానాలు చెప్పడం ప్రారంభించారు. అధ్యయనంలో తమకు కూడా ఒక భాగముందని వాళ్ళు భావించారు, అది వాళ్ళు తాముగా స్పందించి మాట్లాడే అవకాశాన్నిచ్చింది. వాళ్ళు అత్యుత్సాహంగా దానిలో పాల్గొంటారు, నా కూతురైతే ప్రతి రాత్రి ఆ క్రొత్త పుస్తకం నుండి అధ్యయనం చేస్తానంటుంది” అని ఆయన చెప్పాడు.

ఒకసారి అధ్యయనం ముగిసిన తర్వాత ఏమి జరిగిందో ఆ తండ్రి ఇలా వివరించాడు: “నేను, నా కుమారుడు యెహోవా గురించి ఆయన సంకల్పాల గురించి గంటల తరబడి మాట్లాడుకున్నాము. పుస్తకంలోని సమాచారం గురించి వాడు నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగాడు. వాడు పడుకోవడానికి వెళుతూ ‘నాన్నగారు, మనం మళ్ళీ ఇలా మాట్లాడుకుందామా? నేను మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడగాలి, నేను యెహోవా గురించి అంతా తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నప్పుడు నా కళ్ళు చెమర్చాయి.”

[15వ పేజీలోని చిత్రం]

తల్లిదండ్రులారా, మానోహ ఉదాహరణ నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

[16వ పేజీలోని చిత్రం]

పిల్లలారా, ముగ్గురు హెబ్రీ యువకుల ఉదాహరణ నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

[17వ పేజీలోని చిత్రాలు]

“బోధకుడు” పుస్తకంలోని బొమ్మలు, వాటి క్రింద వ్యాఖ్యానాలు శక్తిమంతమైన బోధనా ఉపకరణాలు

అననీయ పేతురుతో ఏమని అబద్ధం చెబుతున్నాడు?

మనం చేసే ప్రతి పనిని ఎవరు చూడగలరు?