కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఒక క్రైస్తవుడు తన పనులు చేసిన ప్రభుత్వ ఉద్యోగికి టిప్‌ లేక బహుమతి ఇవ్వాలా, లేదా అది అతనికి లంచం ఇచ్చినట్లు అవుతుందా?

క్రైస్తవులు ఎక్కడ నివసిస్తున్నా, ఒక దేశంలో అంగీకారయోగ్యమైనది, చట్టబద్ధమైనది మరో దేశంలో పూర్తిగా అనంగీకారమైనదిగా, చట్టవిరుద్ధమైనదిగా ఉండే అవకాశం ఉందని గుర్తుంచుకొని స్థానిక పరిస్థితులతో వ్యవహరించేటప్పుడు వివేచనతో మెలగడానికి కృషి చేస్తారు. (సామెతలు 2:​6-9) అయితే, “[యెహోవా] గుడారములో అతిథిగా” ఉండాలనుకునే వారు లంచగొండితనానికి దూరంగా ఉండాలని ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.​—⁠కీర్తన 15:​1, 5; సామెతలు 17:​23.

లంచగొండితనం అంటే ఏమిటి? ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం “లంచగొండితనం అంటే, ఒక ప్రజా అధికారికి విలువైనదేదైనా ఇవ్వడం లేదా ఇవ్వజూపడం, అప్పుడు ఆ అధికారి తనకు కానుక ఇచ్చిన వ్యక్తికి ప్రయోజనం చేకూర్చడానికి తన బాధ్యతకు విరుద్ధంగా లేదా చట్టానికి విరుద్ధంగా పని చేసి పెడతాడు.” కాబట్టి ఒక వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నా, న్యాయాన్ని వక్రీకరించేందుకు ఒక న్యాయవాదికి గాని, ఒక పోలీసు అధికారికి గాని లేదా ఏదైనా లోపాన్నో జరిగిన తప్పునో చూసీచూడనట్లుగా వదిలేసేందుకు ఒక ఇన్‌స్పెక్టర్‌కు గాని డబ్బు లేదా బహుమతులు ఇవ్వడం లంచం క్రిందే లెక్క. వెయిటింగ్‌ లిస్టులో మీ పేరు ముందు ఉంచబడడం లేదా లైనులో ఇతరులను దాటి వెళ్ళనివ్వడం వంటి పనుల కోసం బహుమతులు ఇవ్వడం కూడా లంచమే. అలా చేయడం ప్రేమరాహిత్యాన్ని కూడా ప్రదర్శిస్తుంది.​—⁠మత్తయి 7:​12; 22:​39.

అయితే ఒక చట్టబద్ధమైన పని చేయించుకోవడానికి లేదా అన్యాయమైన వ్యవహారాన్ని నివారించడానికి ఒక ప్రజా అధికారికి టిప్‌ లేదా బహుమతి ఇస్తే అది లంచం ఇచ్చినట్లు అవుతుందా? ఉదాహరణకు, కొన్ని దేశాల్లోని అధికారులకు టిప్‌ ఇస్తే తప్ప వారు స్కూల్లో పిల్లలను చేర్చుకోవడానికి, ఒక వ్యక్తిని హాస్పిటల్లో చేర్చుకోవడానికి లేదా ఇమ్మిగ్రేషన్‌ దస్తావేజులను జారీ చేయడానికి సుముఖత చూపించరు. లేదా వారు లైసెన్సుల కాల పరిమితిని పొడిగించుకోవడానికి పెట్టుకున్న దరఖాస్తులను తొక్కి పెట్టవచ్చు.

టిప్‌ ఇచ్చే పద్ధతులు, వాటిపట్ల సాధారణ ప్రజల అభిప్రాయం ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. అలాంటి పద్ధతులు సర్వసాధారణంగా ఆచరించబడినప్పుడు లేదా ఆశించబడినప్పుడు అవి చట్టవిరుద్ధం కానంతవరకూ ఒక అధికారి తన బాధ్యతను నిర్వహించడానికి టిప్‌ ఇస్తే అది బైబిలు సూత్రాలను ఉల్లంఘించినట్లు కాదని కొందరు క్రైస్తవులు భావించవచ్చు. కొన్ని దేశాల్లో అలా బహుమతులు ఇవ్వడమనేది తక్కువ జీతానికి పని చేసే ప్రజా ఉద్యోగులకు సహాయం చేయడంగా కూడా దృష్టించబడవచ్చు. చట్టబద్ధమైన పని చేయడం కోసం బహుమతి ఇవ్వడానికీ చట్టవిరుద్ధమైన పని చేసేందుకు లంచం ఇవ్వడానికీ తేడా ఉందని గుర్తుంచుకోండి.

మరోవైపున అలా బహుమతులు ఇవ్వడం సర్వసాధారణమైన ప్రాంతాల్లో కూడా కొంతమంది యెహోవాసాక్షులు చట్టబద్ధమైన పనులు చేసి పెట్టడం కోసం ఇన్‌స్పెక్టర్‌లకు, సుంకపు అధికారులకు, లేదా ఇతరులకు టిప్‌ ఇవ్వడానికి నిరాకరించారు. సాక్షులు ఎంతో న్యాయబుద్ధిగలవారని, నిజాయితీగలవారని స్థానికంగా గుర్తించబడతారు కాబట్టి ఇతరులు డబ్బు చెల్లించి చేయించుకునే పనులు వారికి మామూలుగానే చేయబడతాయి.​—⁠సామెతలు 10:⁠9; మత్తయి 5:​16.

సంక్షిప్తంగా చెప్పాలంటే, ప్రతి యెహోవా సేవకుడు చట్టబద్ధమైన పని చేయించుకోవడానికి లేదా అన్యాయమైన వ్యవహారాన్ని నివారించడానికి తాను టిప్‌ ఇవ్వాలా వద్దా అనేది స్వయంగా నిర్ణయించుకోవాలి. అన్నింటికంటే ప్రాముఖ్యంగా ఆయన తన మనస్సాక్షిని అభ్యంతరపెట్టని, యెహోవా నామానికి కళంకం తీసుకురాని, ఇతరులకు అభ్యంతరం కలిగించని పద్ధతిని పాటించాలి.​—⁠మత్తయి 6:⁠9; 1 కొరింథీయులు 10:​31-33; 2 కొరింథీయులు 6:⁠3; 1 తిమోతి 1:⁠5.