విజ్ఞానశాస్త్రం, బైబిలు నిజంగా పరస్పరం విరుద్ధమైనవా?
విజ్ఞానశాస్త్రం, బైబిలు నిజంగా పరస్పరం విరుద్ధమైనవా?
గెలీలియోకు, క్యాథలిక్ చర్చికి మధ్య వివాదం తలెత్తడానికి మూలకారణమైన వివాదపు బీజాలు కొపర్నికస్, గెలీలియో జన్మించడానికి ఎన్నో శతాబ్దాల పూర్వమే విత్తబడ్డాయి. ప్రాచీన గ్రీకులు సౌరమండలంలో భూమి కేంద్రంగా ఉందని విశ్వసించేవారు, తత్త్వవేత్త అయిన అరిస్టాటిల్ (సా.శ.పూ. 384-322), ఖగోళ శాస్త్రవేత్తా జ్యోతిశ్శాస్త్రవేత్తా అయిన టోలెమీ (సా.శ. రెండవ శతాబ్దం) ఆ తలంపును ప్రసిద్ధి చేశారు. *
విశ్వం గురించిన అరిస్టాటిల్ అభిప్రాయాన్ని, గ్రీసు దేశానికి చెందిన గణితశాస్త్రవేత్త, తత్త్వవేత్త అయిన పైథాగరస్ (సా.శ.పూ. ఆరవ శతాబ్దం) ఆలోచనా విధానం ప్రభావితం చేసింది. వృత్తం, గోళం పరిపూర్ణ ఆకారాలనే పైథాగరస్ సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకుని, ఉల్లి పొరల్లా విశ్వం ఒక వలయం లోపల మరో వలయంతో ఉందని అరిస్టాటిల్ విశ్వసించాడు. భూమి కేంద్రంగా ఉందని, విశ్వంలోని ప్రతి పొర స్ఫటికంతో చేయబడిందని, ఆ వలయాల్లో నక్షత్రాలు చలిస్తాయని, దైవశక్తికి పీఠంగా ఉన్న అన్నిటికన్నా వెలుపటి వలయం ప్రభావంవల్ల అవి చలిస్తాయని ఆయన నమ్మాడు. సూర్యుడు, ఇతర ఖగోళ గ్రహాలు పరిపూర్ణమని, వాటిపై ఎలాంటి మరకలూ మచ్చలూ ఉండవని, వాటిలో మార్పు ఉండదని కూడా అరిస్టాటిల్ విశ్వసించాడు.
అరిస్టాటిల్ గొప్ప ఆలోచనా విధానం
తత్త్వశాస్త్రం నుండి పుట్టిందే కానీ విజ్ఞానశాస్త్రం నుండి పుట్టింది కాదు. భూమి చలిస్తుందంటే అది సామాన్య విచక్షణా జ్ఞానానికి వ్యతిరేకమని ఆయన భావించాడు. చలించే భూమి రాపిడికి గురవుతుందని, నిరంతరం శక్తిని ఉపయోగించకపోతే భూమి ఆగిపోతుందని ఆయన నమ్మాడు కాబట్టి, శూన్యం లేదా అంతరిక్షం ఉందనే తలంపును కూడా ఆయన నిరాకరించాడు. అప్పటికి అందుబాటులో ఉన్న జ్ఞానాన్నిబట్టి అరిస్టాటిల్ ఆలోచనా విధానం సహేతుకంగానే అనిపించింది, అందుకే ప్రజలు దాదాపు 2,000 సంవత్సరాలపాటు దానినే విశ్వసించారు. 16వ శతాబ్దంలో కూడా ఫ్రెంచి తత్త్వవేత్త జీన్ బోడిన్ ప్రజాదరణ పొందిన ఆ ఆలోచనా విధానాన్నే వ్యక్తం చేస్తూ ఇలా అన్నాడు: “ఏ మాత్రం ఇంగితజ్ఞానం ఉన్న వ్యక్తి అయినా, భౌతికశాస్త్రం గురించి ఏ మాత్రం తెలిసిన వ్యక్తి అయినా, ఎంతో బరువుగా ఉండే భూమి . . . తన చుట్టూ తాను తిరుగుతు, సూర్యుని చుట్టూ . . . పరిభ్రమిస్తుందని అనుకోడు; ఎందుకంటే భూమి కొంచెం చలించినా నగరాలు, భవనాలు, పట్టణాలు, పర్వతాలు తల్లక్రిందులవుతాయి.”అరిస్టాటిల్ ఆలోచనా విధానాన్ని చర్చి స్వీకరించింది
గెలీలియోకు, చర్చికి మధ్య వివాదానికి కారణమైన మరొక సంఘటన 13వ శతాబ్దంలో జరిగింది. క్యాథలిక్ అధికారి థామస్ అక్వినాస్ (1225-74) దానికి కారణం. ఆయన అరిస్టాటిల్‌ను ప్రముఖ తత్త్వవేత్తగా పరిగణించి ఎంతో గౌరవించాడు. ఆయన అరిస్టాటిల్ తత్త్వాన్ని చర్చి బోధతో జత చేయడానికి ఐదు సంవత్సరాలు పోరాడాడు. గెలీలియో కాలానికల్లా, “అరిస్టాటిల్ తత్త్వాన్ని, చర్చి బోధను కలిపి ఆయన తయారు చేసిన సంకర సిద్ధాంతం రోము చర్చి ప్రాథమిక బోధగా తయారైంది” అని వేడ్ రొలాండా తన పుస్తకమైన గెలీలియోస్ మిస్టేక్‌లో వ్రాశాడు. ఆ రోజుల్లో వైజ్ఞానిక సమాజమంటూ ఏదీ లేదని కూడా మనం గుర్తుంచుకోవాలి. విద్య చాలామేరకు చర్చి చేతుల్లోనే ఉండేది. మతం మీదా, విజ్ఞానశాస్త్రం మీదా ఎక్కువగా చర్చికే అధికారం ఉండేది.
అలాంటి పరిస్థితుల్లోనే చర్చికి, గెలీలియోకు మధ్య వివాదానికి రంగం సిద్ధమైంది. గెలీలియో ఖగోళశాస్త్ర అధ్యయనంలో నిమగ్నం కాకముందే చలనం మీద ఒక వ్యాసం వ్రాశాడు. ఆ వ్యాసం గౌరవనీయుడైన అరిస్టాటిల్ తలంపుల్లో అనేక తలంపును సవాలు చేసింది. అయితే సౌరమండలానికి సూర్యగ్రహమే కేంద్రంగా ఉందనే ఆలోచనకు గెలీలియో పట్టువిడువకుండా మద్దతు ఇవ్వడం, అది లేఖనాలతో పొందికగా ఉందని వాదించడం, 1633లో ఆయన ఇంక్విజిషన్ ఎదుట విచారణకు నిలబడడానికి కారణమైంది.
గెలీలియో తనను తాను సమర్ధించుకుంటూ బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమని తనకు బలమైన విశ్వాసం ఉందని నొక్కిచెప్పాడు. లేఖనాలు సామాన్య ప్రజల కోసం వ్రాయబడ్డాయని, సూర్యగ్రహం చలిస్తున్నదని బైబిలు చెబుతున్న దాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదని కూడా ఆయన వాదించాడు. ఆయన వాదనలు వ్యర్థమయ్యాయి. గ్రీకు తత్త్వం ఆధారంగా లేఖనాలకు భావం చెప్పడాన్ని గెలీలియో అంగీకరించలేదు కాబట్టి ఆయన ఖండించబడ్డాడు! గెలీలియోకు తీర్పు చెప్పడంలో తప్పు జరిగినట్లు క్యాథలిక్ చర్చి 1992 వరకు అధికారికంగా అంగీకరించలేదు.
నేర్చుకోవలసిన పాఠాలు
ఈ సంఘటనల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది, గెలీలియో బైబిలును ఏ మాత్రం శంకించలేదు. బదులుగా, ఆయన చర్చి బోధలను ప్రశ్నించాడు. ఒక మత రచయిత ఇలా పేర్కొన్నాడు: “గెలీలియో ఉదాహరణనుండి మనం నేర్చుకునేది, చర్చి బైబిలు సత్యాలకు అతిగా అంటిపెట్టుకుని ఉందని కాదు, అది అసలు అవసరమైనంతగా కూడా అంటిపెట్టుకుని లేదు అనే విషయం.” చర్చి తాను బోధించే వేదాంతాలను గ్రీకుతత్త్వం ప్రభావితం చేయడానికి అనుమతించడం ద్వారా, బైబిలు బోధలను అనుసరించే బదులు పారంపర్యాచారానికి తల ఒగ్గింది.
ఇదంతా బైబిలు ఇస్తున్న ఈ హెచ్చరికను మనకు గుర్తుచేస్తుంది: “ఆయనను [క్రీస్తును] అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.”—కొలొస్సయులు 2:8.
నేడు కూడా, క్రైస్తవమత సామ్రాజ్యంలోని అనేకులు బైబిలుకు వ్యతిరేకమైన సిద్ధాంతాలను, తత్త్వాలను అనుసరిస్తూనే ఉన్నారు. దానికి ఒక ఉదాహరణ, డార్విన్ ప్రవేశపెట్టిన పరిణామ సిద్ధాంతం. ఆదికాండములోని సృష్టి వృత్తాంతాన్ని అంగీకరించే బదులు వారు డార్విన్ సిద్ధాంతాన్ని అంగీకరించారు. ఇలా అంగీకరించడం ద్వారా చర్చీలు డార్విన్‌ను ఆధునిక *
అరిస్టాటిల్‌గా, పరిణామ సిద్ధాంతాన్ని ప్రాథమిక మత నమ్మకంగా చేశాయి.నిజమైన విజ్ఞానశాస్త్రానికి, బైబిలుకు పొందిక ఉంది
పై విషయాలు విజ్ఞానశాస్త్రంలో మన ఆసక్తిని ఎంతమాత్రం తగ్గించకూడదు. నిజానికి, దేవుని సృష్టికార్యాల నుండి తెలుసుకోమని, మనం చూసే దానినుండి దేవుని అద్భుతమైన లక్షణాలను గ్రహించమని బైబిలే స్వయంగా మనల్ని ఆహ్వానిస్తోంది. (యెషయా 40:26; రోమీయులు 1:20) అయితే బైబిలు విజ్ఞానశాస్త్రాన్ని బోధించడానికి రూపొందించబడిన పుస్తకమేమీ కాదు. అది దేవుని ప్రమాణాలను, సృష్టి మాత్రమే బోధించలేని ఆయన వ్యక్తిత్వంలోవున్న అంశాలను, మానవుల విషయంలో ఆయన సంకల్పాన్ని వెల్లడి చేస్తుంది. (కీర్తన 19:7-11; 2 తిమోతి 3:16) అయినప్పటికీ, బైబిలు ప్రకృతి కార్యాల గురించి చెప్పినప్పుడు అది ఖచ్చితంగా సత్యాన్నే చెబుతోంది. గెలీలియో స్వయంగా ఇలా చెప్పాడు: “పరిశుద్ధ లేఖనాలు, ప్రకృతి రెండూ దేవుని ఆజ్ఞ ద్వారా వచ్చినవే. . . . రెండు సత్యాలు ఎప్పుడూ ఒక దానిని మరొకటి విభేదించలేవు.” ఈ క్రింది ఉదాహరణలు పరిశీలించండి.
నక్షత్రాల చలనం, గ్రహాల చలనం కంటే మరింత ప్రాథమికమైన విషయమేమిటంటే విశ్వంలోని సమస్తమూ గురుత్వాకర్షణశక్తి వంటి నియమాలతో నడుస్తోంది అన్నదే. భౌతిక నియమాల గురించి బైబిల్లో కాకుండా ఇతర పుస్తకాల్లో ప్రస్తావించబడింది పైథాగరస్ ద్వారానే, విశ్వాన్ని అంకెలలో వివరించవచ్చునని ఆయన విశ్వసించాడు. రెండు వేల సంవత్సరాల తర్వాత, చివరకు గెలీలియో, కెప్లర్, న్యూటన్ వంటివారు భౌతిక విశ్వం సహేతుకమైన నియమాలతో నడుస్తోందని నిరూపించారు.
ప్రకృతి నియమం గురించి బైబిలులో మొదటిగా యోబు గ్రంథంలో ప్రస్తావించబడింది. దాదాపు సా.శ.పూ. 1600లో, దేవుడు యోబును ఇలా అడిగాడు: “ఆకాశమండలపు కట్టడలను [లేక, నియమాలను] నీవెరుగుదువా?” (యోబు 38:33) సా.శ.పూ. ఏడవ శతాబ్దంలో వ్రాయబడిన యిర్మీయా గ్రంథం యెహోవా “చంద్ర నక్షత్రములను నియమించువాడు,” “భూమ్యాకాశములను గూర్చిన విధులను నియమించువాడు” అని చెబుతోంది. (యిర్మీయా 31:35; 33:26) ఈ వ్యాఖ్యానాల దృష్ట్యా, బైబిలు వ్యాఖ్యాత జి. రావిల్‌సన్ ఇలా పేర్కొన్నాడు: “భౌతిక విశ్వంలో నియమాలు ఉండడాన్ని ఆధునిక విజ్ఞానశాస్త్రం ఎంత బలంగా నొక్కిచెబుతుందో బైబిలు రచయితలు కూడా అంతే బలంగా నొక్కిచెప్పారు.”
మనం పైథాగరస్ గురించి ఆలోచిస్తే, ఆయన చెప్పిన నియమాల గురించి యోబు పుస్తకంలో దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల ముందే వ్రాయబడ్డాయి. బైబిలు ఉద్దేశం భౌతిక వాస్తవాలను వెల్లడి చేయాలన్నది కాదు, యెహోవాయే సమస్తమును సృష్టించాడని, భౌతిక నియమాలను కూడా ఆయన సృష్టించగలడని మనకు స్పష్టం చేయాలన్నదే దాని ప్రాథమిక ఉద్దేశం అని మనం గుర్తుంచుకోవాలి.—యోబు 38:4, 12; 42:1, 2.
మనం పరిశీలించగల మరో ఉదాహరణ నీటిచక్రం, అంటే భూమ్మీదున్న నీళ్ళు ఎక్కడినుండి వచ్చాయో అక్కడికే తిరిగి వెళ్తాయనే విషయం. సరళంగా చెప్పాలంటే, సముద్రంలోని నీళ్ళు అవిరై, మేఘాలుగా మారి, వర్షంగా కురిసి, మళ్ళీ చివరికి సముద్రంలోకి ప్రవహిస్తాయి. బైబిలులో కాకుండా ఇతర పుస్తకాల్లో ఈ విషయం గురించి మొట్టమొదటిసారి సా.శ.పూ. నాలుగవ శతాబ్దంలోనే చెప్పబడింది. అయితే బైబిలు అంతకు కొన్ని వందల సంవత్సరాల ముందే ఈ విషయం గురించి చెప్పింది. ఉదాహరణకు, సా.శ.పూ. 11వ శతాబ్దంలో ఇశ్రాయేలు రాజైన సొలొమోను ఇలా వ్రాశాడు: “నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును.”—ప్రసంగి 1:7.
అలాగే దాదాపు సా.శ.పూ. 800లో, ఒక సామాన్య గొఱ్ఱెలకాపరి, రైతు అయిన ఆమోసు ప్రవక్త, యెహోవా “సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు” అని వ్రాశాడు. (ఆమోసు 5:8) సొలొమోను, ఆమోసు ఇద్దరూ సంక్లిష్టమైన, సాంకేతిక పదజాలాన్ని ఉపయోగించకుండానే నీటిచక్రం గురించి స్పష్టంగా వర్ణించారు, అయితే ఇద్దరూ కాస్త భిన్నమైన దృక్కోణాల నుండి విషయాన్ని చెప్పారు.
దేవుడు ‘శూన్యముపై భూమిని వ్రేలాడచేశాడు’ అని కూడా బైబిలు చెబుతోంది. (యోబు 26:7) ఆ మాటలు చెప్పబడిన కాలంలో, అంటే దాదాపు సా.శ.పూ. 1600లో అందుబాటులో ఉన్న జ్ఞానం దృష్ట్యా, ఒక ఘనపదార్థం ఎలాంటి భౌతిక ఆధారం లేకుండా శూన్యంలో వ్రేలాడుతూ ఉండగలదని చెప్పడానికి ఎంతో విశేషమైన ధైర్యం అవసరం. ముందు ప్రస్తావించినట్లుగా, అరిస్టాటిల్ శూన్యం ఉందనే తలంపునే నిరాకరించాడు, ఈయన ఆమోసు జీవించిన 1,200 కన్నా ఎక్కువకాలం తర్వాత జీవించాడు.
తప్పుడు తలంపులే అయినా ఇంగితజ్ఞానానికి అనుగుణంగా ఉన్నట్లు అనిపించిన ఆనాటి సిద్ధాంతాల మధ్య కూడా బైబిలు అంత ఖచ్చితమైన వ్యాఖ్యానాలు చేయడం మీకు ఆశ్చర్యాన్ని కలిగించడం లేదా? ఆలోచనాపరులైన ప్రజలకు, బైబిలు దేవునిచే ప్రేరేపించబడింది అనడానికి ఇది మరో నిదర్శనం. కాబట్టి మనం దేవుని వాక్యంతో పొందికలేని ఏ బోధకైనా, ఏ సిద్ధాంతానికైనా అంత సులభంగా ప్రభావితం కాకుండా ఉండడం జ్ఞానయుక్తం. చరిత్ర పదే పదే చూపించినట్లుగా, మానవ తత్త్వాలు, వాటిని ఎంత మేధావులు ప్రవేశపెట్టినా, అవి వస్తాయి, పోతాయి, కానీ ‘యెహోవా వాక్యము ఎల్లప్పుడు నిలుస్తుంది.’—1 పేతురు 1:24.
[అధస్సూచీలు]
^ పేరా 2 సా.శ.పూ. మూడవ శతాబ్దంలో, సేమస్‌కు చెందిన అరిస్టార్కస్ అనే గ్రీసు దేశస్థుడు సౌరమండలంలో సూర్యగ్రహం కేంద్రంగా ఉందనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, కానీ ఆయన తలంపులు తిరస్కరించబడి, అరిస్టాటిల్ తలంపులు అంగీకరించబడ్డాయి.
^ పేరా 12 ఈ విషయం మీద లోతైన చర్చ కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన జీవం—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) అనే పుస్తకంలో, “చాలామంది పరిణామ సిద్ధాంతాన్ని ఎందుకు అంగీకరిస్తున్నారు?” అనే 15వ అధ్యాయాన్ని చూడండి.
[6వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
పొటస్టెంట్ల దృక్కోణం
ప్రొటస్టెంట్ మత సంస్కరణోద్యమ నాయకులు కూడా సౌరమండలానికి సూర్యగ్రహం కేంద్రంగా ఉందనే తలంపును వ్యతిరేకించారు. వారిలో మార్టిన్ లూథర్ (1483-1546), ఫిలిప్ మెలాంక్‌టన్ (1497-1560), జాన్ కాల్విన్ (1509-64) ఉన్నారు. కొపర్నికస్ గురించి లూథర్ ఇలా అన్నాడు: “ఈ మూర్ఖుడు మొత్తం ఖగోళ శాస్త్రాన్నే తలక్రిందులు చేయాలనుకుంటున్నాడు.”
ప్రొటస్టెంట్లు యెహోషువ 10వ అధ్యాయంలో ఉన్న వృత్తాంతం వంటి కొన్ని లేఖనాలను అక్షరార్థంగా అర్థం చేసుకొని వాటిని తమ వాదనలకు ఆధారంగా తీసుకున్నారు. ఆ వృత్తాంతం సూర్యుడు, చంద్రుడు “ఆకాశమధ్యమున నిలిచి యించుమించు ఒకనాడెల్ల అస్తమింప త్వరపడలేదు” అని చెబుతోంది. * ప్రొటస్టెంట్లు ఎందుకిలా విశ్వసించారు? ప్రొటస్టెంట్ మత సంస్కరణోద్యమంవల్ల ప్రొటస్టెంట్‌లు రోమన్ క్యాథలిక్ చర్చి నుండైతే విడిపోయారు గానీ అరిస్టాటిల్ మరియు థామస్ అక్వినాస్‌ల “ప్రాథమిక అధికారం నుండి బయటపడడంలో” మాత్రం విఫలమయ్యారు, వారి దృక్కోణాలను “క్యాథలిక్‌లు, ప్రొటస్టెంట్లు” ఒకేలా అంగీకరించారు అని గెలీలియోస్ మిస్టేక్ అనే పుస్తకం వివరిస్తోంది.
[అధస్సూచి]
^ పేరా 28 విజ్ఞానశాస్త్రపరంగా చెప్పాలంటే, మనం “సూర్యోదయం” గురించి “సూర్యాస్తమయం” గురించి చెప్పడానికి తప్పుడు పదాలను ఉపయోగిస్తున్నాం. కానీ అనుదిన సంభాషణలో, మనం భూమ్మీది నుండి విషయాన్ని పరిశీలిస్తున్నామని మనస్సులో ఉంచుకుంటే, ఈ పదాలు అంగీకృతమైనవే, ఖచ్చితమైనవే. అదే విధంగా, యెహోషువ ఖగోళశాస్త్రం గురించి చర్చించడం లేదు; ఆయన తాను చూసినవి చూసినట్లుగా వ్రాశాడు అంతే.
[చిత్రాలు]
లూథర్
కాల్విన్
[చిత్రసౌజన్యం]
Servetus and Calvin, 1877 అనే పుస్తకం నుండి
[4వ పేజీలోని చిత్రం]
అరిస్టాటిల్
[చిత్రసౌజన్యం]
◀A General History for Colleges and High Schools, 1900 అనే పుస్తకం నుండి
[5వ పేజీలోని చిత్రం]
థామస్ అక్వినాస్
[చిత్రసౌజన్యం]
Encyclopedia of Religious Knowledge, 1855 అనే పుస్తకం నుండి
[6వ పేజీలోని చిత్రం]
ఐజక్ న్యూటన్
[7వ పేజీలోని చిత్రం]
3,000 సంవత్సరాల కన్నా ఎక్కువకాలం క్రితమే బైబిలు నీటిచక్రం గురించి వివరించింది