కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విజ్ఞానశాస్త్రం, బైబిలు వివాద ఆరంభం

విజ్ఞానశాస్త్రం, బైబిలు వివాద ఆరంభం

విజ్ఞానశాస్త్రం, బైబిలు వివాద ఆరంభం

మరణ శయ్యపై ఉన్న 70 ఏళ్ళ ఖగోళ శాస్త్రజ్ఞుడు తన చేతుల్లో ఉన్న కాగితాలను చదవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. తనే స్వయంగా వ్రాసిన ఆ చేతివ్రాత ప్రతులు, పుస్తక ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ఆయన వ్రాసిన ఆ పుస్తకం విశ్వానికి సంబంధించి మానవాళి దృక్కోణాన్ని పూర్తిగా మార్చివేస్తుందని ఆయన అప్పుడు ఊహించి ఉండడు. అంతేగాక, అది క్రైస్తవమత సామ్రాజ్యంలో ఒక తీవ్రమైన అలజడినే సృష్టిస్తుందని కూడా ఆయన అనుకొని ఉండడు, ఆ ప్రభావాలను మనం నేటికీ చూడవచ్చు.

అది 1543వ సంవత్సరం, మరణ శయ్యపై ఉన్న ఆ వ్యక్తి నికోలస్‌ కొపర్నికస్‌, ఆయన పోలాండ్‌ దేశానికి చెందిన క్యాథలిక్‌ మతస్థుడు. కొపర్నికస్‌ వ్రాసిన ఆన్‌ ద రెవల్యూషన్స్‌ ఆఫ్‌ ద హెవెన్లీ స్పియర్స్‌ అనే పుస్తకం, సౌరమండల కేంద్రం భూమి కాదు గానీ సూర్యగ్రహం అని తెలియజేసింది. కొపర్నికస్‌ ఒక్కదెబ్బతో, సౌరమండలంలో భూమి కేంద్రంగా ఉందనే ఎంతో సంక్లిష్టమైన సిద్ధాంతం స్థానంలో అత్యంత సరళమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు.

అది ఒక వివాదంగా మారుతుంది అనడానికి ఎలాంటి సూచనా కనబడలేదు. ఎందుకంటే కొపర్నికస్‌ తన తలంపులను అందరికి వెల్లడి చెయ్యలేదు. అంతేగాక, సౌరమండలంలో భూమి కేంద్రంగా ఉందనే దృక్కోణాన్ని స్వీకరించిన క్యాథలిక్‌ చర్చి, ఆ సమయానికి వైజ్ఞానిక తలంపులను అంగీకరించడానికి మరింత సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. కొపర్నికస్‌ వ్రాసిన పుస్తకాన్ని ప్రచురించమని స్వయంగా పోపు కూడా ఆయనను కోరాడు. చివరికి కొపర్నికస్‌ దాన్ని ప్రచురించాడు. అయితే భయస్థుడైన సంపాదకుడు దానికి తన స్వంత ముందు మాట వ్రాస్తూ సౌరమండలంలో సూర్యుడు కేంద్రంగా ఉన్నాడనే తలంపు గణితశాస్త్రపరమైన సూత్రం కావచ్చు కానీ అది ఖగోళ సంబంధిత సత్యం కానవసరం లేదని పేర్కొన్నాడు.

వివాదం తీవ్రతరం కావడం

ఆ వివాదంలో తర్వాతి సభ్యుడు ఇటలీకి చెందిన ఖగోళశాస్త్రజ్ఞుడు, గణితశాస్త్రవేత్త, భౌతికశాస్త్రంలో ప్రావీణ్యంగలవాడు అయిన గెలీలియో గెలిలీ (1564-1642), ఈయన కూడా క్యాథలిక్‌ మతస్థుడే. ఆ మధ్యనే కనుగొనబడిన కటకాలను ఉపయోగించి తాను తయారుచేసిన దుర్భిణి యంత్రాల సహాయంతో గెలీలియో ఆకాశాన్ని నిశితంగా పరిశీలించాడు. ఆయన గమనించిన విషయాలు కొపర్నికస్‌ చెప్పింది సరైనదేనని ఆయనను ఒప్పించాయి. అందరూ ఎంతో ప్రాముఖ్యమైనదిగా పరిగణించే తత్త్వసంబంధమైన, మతపరమైన మరో నమ్మకాన్ని అంటే సూర్యగ్రహం మారదు, అది పాడయ్యే అవకాశమే లేదు అనే నమ్మకాన్ని సవాలు చేసేలా గెలీలియో సూర్యునిపై మచ్చలు ఉన్నాయని కూడా చూశాడు, నేడు అవి సూర్యగ్రహ బిందువులని పిలువబడుతున్నాయి.

కొపర్నికస్‌లా కాకుండా గెలీలియో తన తలంపులను ధైర్యంగా, ఆసక్తిగా ప్రకటించాడు. ఆ సమయానికల్లా క్యాథలిక్‌ చర్చి కొపర్నికస్‌ సిద్ధాంతాన్ని బహిరంగంగా వ్యతిరేకించడం ప్రారంభించడంతో మతపరమైన వాతావరణం మరింత ప్రతికూలంగా తయారైనా కూడా గెలీలియో తన తలంపులను ధైర్యంగా ప్రకటించాడు. ఆ తర్వాత, గెలీలియో సౌరమండలంలో సూర్యగ్రహం కేంద్రంగా ఉందనే సిద్ధాంతం సరైనదనే కాక అది లేఖనాలకు అనుగుణంగా ఉందని కూడా వాదించేసరికి, చర్చి అది మతవిభేదమన్నట్లుగా శంకించింది. *

గెలీలియో తనను తాను సమర్థించుకోవడానికి రోముకు వెళ్ళాడు గానీ ప్రయోజనం లేకపోయింది. కొపర్నికస్‌ తరఫున వాదించడం మానుకోమని చర్చి ఆయనను 1616లో ఆజ్ఞాపించింది. గెలీలియో కొంతకాలం మౌనంగానే ఉన్నాడు. కానీ 1632లో ఆయన కొపర్నికస్‌ను సమర్థిస్తూ మరో పుస్తకం ప్రచురించాడు. ఆ మరుసటి సంవత్సరమే ఇంక్విజిషన్‌ (మతనియమాల ఉల్లంఘనలను విచారించే క్రైస్తవమత న్యాయసభ) ఆయనకు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. అయితే వారు ఆయన వయస్సును పరిగణలోకి తీసుకుని ఆ శిక్షను సత్వరమే గృహనిర్బంధంగా మార్చారు.

చాలామంది గెలీలియోకు చర్చితో ఉన్న వివాదాన్ని మతం మీద విజ్ఞానశాస్త్రం సాధించిన ఘనవిజయంగా, మరింత వివరంగా చెప్పాలంటే బైబిలు మీద సాధించిన ఘనవిజయంగా దృష్టిస్తారు. అయితే, మనం తర్వాతి ఆర్టికల్‌లో చూడబోతున్నట్లుగా, మనం అలాంటి ముగింపుకు చేరుకుంటే, మనం అనేక వాస్తవాలను అలక్ష్యం చేసినవాళ్ళం అవుతాం.

[అధస్సూచి]

^ పేరా 7 గెలీలియో చమత్కారంగా మాట్లాడుతూ ఇతరులను తీవ్రంగా విమర్శించడంవల్ల, పలుకుబడిగల వ్యక్తులను తనకు అనవసరంగా శత్రువులుగా చేసుకున్నాడు. అంతేగాక, సౌరమండలంలో సూర్యగ్రహం కేంద్రంగా ఉందనే సిద్ధాంతం లేఖనాలకు అనుగుణంగా ఉందని వాదించడం ద్వారా ఆయన తనను తాను మతం మీద అధికారం ఉన్న వ్యక్తిగా చూపించుకున్నాడు, దానితో చర్చి మరింత ఆగ్రహించింది.

[3వ పేజీలోని చిత్రం]

కొపర్నికస్‌

[చిత్రసౌజన్యం]

Giordano Bruno and Galilei (జర్మను సంచిక) నుండి తీసుకోబడింది

[3వ పేజీలోని చిత్రం]

రోమన్‌ ఇంక్విజిషన్‌ ఎదుట తనను తాను సమర్థించుకొంటున్న గెలీలియో

[చిత్రసౌజన్యం]

The Historian’s History of the World, Vol. IX, 1904 అనే పుస్తకం నుండి

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

వెనక కనిపిస్తున్న చిత్రం: Chart depicting Copernicus’ concept of the solar system