కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఉపయుక్తమైన ఒక అనువాద ఉపకరణం

ఉపయుక్తమైన ఒక అనువాద ఉపకరణం

ఉపయుక్తమైన ఒక అనువాద ఉపకరణం

బైబిలు గ్రంథకర్తయైన యెహోవా దేవుడు, తన రాజ్య సువార్త “ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును” ప్రకటించబడాలని కోరుతున్నాడు. (ప్రకటన 14:⁠6) తన లిఖిత వాక్యం మానవులందరికీ అందుబాటులో ఉండాలని ఆయన అభిలషిస్తున్నాడు. అందుకే ప్రపంచంలో మరే ఇతర పుస్తకం అనువదించబడనన్ని ఎక్కువ భాషల్లోకి బైబిలు అనువదించబడింది. దేవుని తలంపులను మరో భాషలోకి మార్చే ప్రక్రియలో వేలాదిమంది అనువాదకులు ఎంతో సమయాన్ని వెచ్చించి అవిరళ కృషి చేశారు.

అయితే బైబిలు కేవలం అనువాదయోగ్యమైన పుస్తకం మాత్రమే కాదు. అది ఎన్నోసార్లు ఇతర మూలపాఠాలను అనువదించడానికి కూడా ఒక ఉపకరణంగా దోహదపడింది. అనువాదకులు, కొన్ని పదాల సరైన అనువాదం కోసం వివిధ భాషల్లోని బైబిలు పదాలు ఎలా అనువదించబడ్డాయో పోల్చి చూశారు. అనువాద ఉపకరణంగా బైబిలుకున్న లక్షణాలు ఇప్పుడు కంప్యూటర్‌ ద్వారా చేసే అనువాదంలో కూడా ఉపయోగించబడుతున్నాయి.అర్థవంతంగా అనువదించడం కంప్యూటర్‌కు నిజంగా కష్టమే. అనువదించడం కంప్యూటర్‌ చేయలేని పని అని కూడా కొంతమంది నిపుణులు భావించారు. ఎందుకు? ఎందుకంటే, భాష అనేది కేవలం కొన్ని పదాల కూర్పు మాత్రమే కాదు. ప్రతీ భాషకు తనదైన పదాల మేళవింపు, సూత్రాలు, ఆ సూత్రాల్లో మినహాయింపులు, నుడికారాలు, సూచనార్థకాలు ఉంటాయి. ఇదంతా కంప్యూటర్‌కు నేర్పడానికి చేసిన ప్రయత్నాలు అంతగా విజయం సాధించలేదు. తత్ఫలితంగా ఉత్పన్నమైన కంప్యూటర్‌ అనువాదాలు అనేకం అంతగా అర్థం చేసుకునే విధంగా లేవు.

అయితే ఇప్పుడు కంప్యూటర్‌ శాస్త్రవేత్తలు కొత్త పద్ధతులను కనిపెడుతున్నారు. “మా పద్ధతి సరైన అనువాదాన్ని కనిపెట్టేలా సంఖ్యాశాస్త్రపరమైన నమూనాలను ఉపయోగిస్తుంది” అని ఫ్రాంజ్‌ జోసెఫ్‌ ఓక్‌ చెబుతున్నాడు, ఈయన కంప్యూటర్‌ అనువాదంలో సిద్ధహస్తుడు. ఉదాహరణకు, మీరు అంగ్లంలో ఉన్నదాన్ని తెలుగులోకి అనువదించాలని అనుకుంటున్నారనుకోండి. మొదట, రెండు భాషల్లోనూ ఉన్న కొంత మూలపాఠాన్ని మీరు తీసుకోండి. తర్వాత దాన్ని కంప్యూటర్‌లోకి ఎక్కించండి. అప్పుడు కంప్యూటర్‌ ఆ రెండు భాషల్లోని విషయాన్ని పోల్చి చూస్తుంది. ఉదాహరణకు, అది ఒకానొక సమాంతర ఆంగ్ల పదానికి “ఇల్లు” అనే తెలుగు పదమే పదేపదే వస్తున్నట్లుగా కనుగొంటే, ఆ ఆంగ్ల పదానికి “ఇల్లు” అన్నదే దాని అర్థమనే నిర్థారణకు అది వస్తుంది. దానికి దగ్గర్లో ఉన్న “పెద్ద,” “చిన్న,” “పాత,” లేక “క్రొత్త” అనే పదాలను అది విశేషణాలుగా గుర్తిస్తుంది. ఆ విధంగా, కంప్యూటర్‌ సంబంధిత పదాల, సంయుక్త పదాల పట్టికను తయారుచేసుకుంటుంది. కొన్ని రోజుల్లో లేదా వారాల్లో పూర్తయ్యే అలాంటి “శిక్షణ” తర్వాత, కంప్యూటర్‌ తాను “నేర్చుకున్న” విషయాలను క్రొత్త మూలపాఠాన్ని అనువదించడానికి ఉపయోగిస్తుంది. తద్వారా రూపొందిన అనువాదం వ్యాకరణం, శైలి వంటివాటిలో అంత శ్రేష్ఠంగా లేకపోయినా, అది అర్థాన్ని, ప్రాముఖ్యమైన వివరాలను అందజేయడంలో మామూలుగా చదవదగిన విధంగానే ఉంటుంది.

అనువాద నాణ్యత ఎక్కువ మేరకు, కంప్యూటర్‌లో ముందుగా ఎక్కించిన మూలపాఠం పరిమాణంపై, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడే బైబిలు చాలా ఉపయుక్తమైనదిగా నిరూపించబడింది. అది ఎంతో జాగ్రత్తగా అనేక భాషల్లోకి అనువదించబడింది, సుళువుగా లభ్యమవుతుంది, దానిలో చాలా పెద్ద పరిమాణంలో మూలపాఠం ఉంది. కాబట్టి కంప్యూటర్‌కు క్రొత్త భాషలో శిక్షణ ఇవ్వవలసి వచ్చినప్పుడు పరిశోధకులు మొట్టమొదటిగా బైబిలునే ఎంపిక చేసుకున్నారు.