కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యం మీ త్రోవను వెలుగుమయం చేయనివ్వండి

దేవుని వాక్యం మీ త్రోవను వెలుగుమయం చేయనివ్వండి

దేవుని వాక్యం మీ త్రోవను వెలుగుమయం చేయనివ్వండి

‘నీ వాక్యము . . . నా త్రోవకు వెలుగై యున్నది.’​—⁠కీర్తన 119:105.

యెహోవా వాక్యాన్ని మనం అనుమతిస్తే అది మన త్రోవను వెలుగుమయం చేస్తుంది. అలాంటి ఆధ్యాత్మిక వెలుగు నుండి ప్రయోజనం పొందడానికి, మనం దేవుని లిఖిత వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేస్తూ, దాని ఉపదేశాన్ని అన్వయించుకునే విద్యార్థులుగా ఉండాలి. అలా చేసినప్పుడు మాత్రమే మన మనోభావాలు కీర్తనకర్త మనోభావాల్లా ఉంటాయి, ఆయన ఇలా అన్నాడు: “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.”​—⁠కీర్తన 119:​105.

2 మనం ఇప్పుడు కీర్తన 119:89-176ను పరిశీలిద్దాం. 11 గేయ భాగాలుగా కూర్చబడిన ఈ వచనాల్లో ఎంతో సమాచారం ఉంది. అది మనం నిత్యజీవపు మార్గంలోనే ఉండడానికి మనకు సహాయం చేయవచ్చు.​—⁠మత్తయి 7:​13, 14.

దేవుని వాక్యాన్ని ఎందుకు ప్రేమించాలి?

3 యెహోవా వాక్యంపట్ల ఉండే ప్రేమ ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని కలిగిస్తుంది. (కీర్తన 119:89-96) కీర్తనకర్త ఇలా ఆలపించాడు: “యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. . . . నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది.” (కీర్తన 119:89, 90) దేవుని వాక్యం ద్వారా అంటే ఆయన “ఆకాశమండలపు కట్టడల” మూలంగా ఆకాశ గ్రహాలు లోపరహితంగా వాటి కక్ష్యలో సంచరిస్తుండగా, భూమి నిత్యము నిలకడగా ఉండేలా స్థిరపర్చబడింది. (యోబు 38:31-33; కీర్తన 104:5) యెహోవా నోటనుండి వెలువడే ప్రతీ వాక్కుపై మనం ఆధారపడవచ్చు; దేవుడు సెలవిచ్చిన ప్రతీ మాట ఆయన సంకల్ప నెరవేర్పులో ‘సఫలం అవుతుంది.’​—⁠యెషయా 55:​8-11.

4 కీర్తనకర్త ‘దేవుని ధర్మశాస్త్రంలో సంతోషించి ఉండకపోతే’ ఆయన ‘తన శ్రమల్లో నశించి ఉండేవాడే.’ (కీర్తన 119:92) ఆయనను పరదేశులు హింసించలేదు, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన ఇశ్రాయేలీయులే ఆయనను ద్వేషించారు కాబట్టి ఆయనను హింసించారు. (లేవీయకాండము 19:17) అయితే ఇది ఆయనను భయపెట్టలేదు, ఎందుకంటే ఆయన తనకు శక్తినిచ్చే దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. అపొస్తలుడైన పౌలు, కొరింథులో ‘మిక్కిలి శ్రేష్ఠులైన అపొస్తలులతోపాటు’ “కపట సహోదరులవలని ఆపదలలో” పడ్డాడు. (2 కొరింథీయులు 11:5, 12-14, 26) అయినప్పటికీ, ఆయన దేవుని వాక్యాన్ని ప్రేమించాడు కాబట్టి ఆధ్యాత్మికంగా స్థిరంగా నిలబడగలిగాడు. మనం దేవుని లిఖిత వాక్యాన్ని ప్రేమిస్తూ, అది చెప్పేవాటిని అన్వయించుకుంటాం కాబట్టి మనం మన సహోదరులను ప్రేమిస్తాం. (1 యోహాను 3:15) మనల్ని ఈ లోకం ద్వేషించినా, మనం దేవుని ఆదేశాల్లో వేటినీ మరచిపోయేలా అది చేయలేదు. నిరంతరం ఆనందంగా యెహోవా సేవ చేయడానికి ఎదురుచూస్తూ మనం మన సహోదరులతో ప్రేమపూర్వకమైన ఐక్యతకలిగి ఎల్లప్పుడూ ఆయన చిత్తం చేస్తూనే ఉంటాం.​—⁠కీర్తన 119:​93.

5 యెహోవాపట్ల మనకున్న భక్తిని వ్యక్తం చేస్తూ మనమిలా ప్రార్థించవచ్చు: “నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము.” (కీర్తన 119:​94) రాజైన ఆసా దేవుణ్ణి వెదకి, యూదాలో మత భ్రష్టత్వం లేకుండా చేశాడు. ఆసా పరిపాలనలోని 15వ సంవత్సరంలో (సా.శ.పూ. 963లో) జరిగిన ఒక మహా సమావేశంలో, యూదా నివాసులు “యెహోవాయొద్ద విచారణ చేయుదుము” అని ప్రమాణం చేశారు. కాబట్టి ‘యెహోవా వారికి ప్రత్యక్షమై వారికి నెమ్మది కలుగజేశాడు.’ (2 దినవృత్తాంతములు 15:10-15) క్రైస్తవ సంఘం నుండి కొట్టుకుపోయిన వారు తిరిగి దేవుణ్ణి వెదికేందుకు ఈ ఉదాహరణ వారిని ప్రోత్సహించాలి. తన ప్రజలతో తిరిగి క్రియాశీలంగా సహవాసం చేయాలనుకునేవారిని ఆయన ఆశీర్వదించి, సంరక్షిస్తాడు.

6 ఆధ్యాత్మిక హానినుండి కాపాడగల జ్ఞానాన్ని దేవుని వాక్యం మనలో నింపుతుంది. (కీర్తన 119:97-104) దేవుని ఆజ్ఞలు మనలను మన శత్రువులకన్నా జ్ఞానులను చేస్తాయి. ఆయన శాసనములను పాటించడం మనకు అంతర్దృష్టిని ఇస్తుంది, ‘ఆయన ఉపదేశములను అనుసరించడం మనకు వృద్ధులకంటే విశేష జ్ఞానాన్ని ఇస్తుంది.’ (కీర్తన 119:98-100) యెహోవా వాక్యములు ‘మన నోటికి తేనెకంటె తీపిగా మన జిహ్వకు మధురంగా ఉంటే’ మనం ‘తప్పుడు మార్గాలన్నింటిని’ ద్వేషిస్తూ, వాటికి దూరంగా ఉంటాం. (కీర్తన 119:103, 104) ఈ అంత్యదినాల్లో అహంకారులను, క్రూరులను, భక్తిహీనులను ఎదుర్కొంటుండగా మనకు ఆధ్యాత్మిక హాని కలుగకుండా అది మనలను కాపాడుతుంది.​—⁠2 తిమోతి 3:​1-5.

మన పాదాలకు దీపం

7 దేవుని వాక్యం ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక వెలుగుకు మూలంగా ఉంటుంది. (కీర్తన 119:105-112) మనం అభిషిక్త క్రైస్తవులమైనా లేక వారి సహవాసులైన ‘వేరే గొఱ్ఱెలమైనా’ మనం ఇలా ప్రకటిస్తాం: “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.” (యోహాను 10:16; కీర్తన 119:​105) మనం ఆధ్యాత్మికంగా తొట్రిల్లిపోకుండా, దేవుని వాక్యం దీపంలా మన త్రోవలను వెలుగుమయం చేస్తుంది. (సామెతలు 6:23) అయితే, మనం వ్యక్తిగతంగా యెహోవా వాక్యాన్ని మన పాదాలకు దీపంగా ఉండేందుకు అనుమతించాలి.

8కీర్తన 119 రచయిత ఎంత స్థిరంగా ఉన్నాడో మనమూ అంతే స్థిరంగా ఉండాలి. దేవుని ఉపదేశముల నుండి తొలగకుండా ఉండాలని ఆయన తీర్మానించుకున్నాడు. “నీ [యెహోవా] న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెరవేర్చుదును” అని ఆయన అన్నాడు. (కీర్తన 119:106) కాబట్టి క్రమ బైబిలు అధ్యయనాన్ని, క్రైస్తవ కూటాల్లో భాగం వహించడాన్ని మనం ఎన్నడూ తక్కువగా అంచనా వేయకుండా ఉందాం.

9 కీర్తనకర్త ‘దేవుని ఉపదేశముల నుండి తొలగి తిరగలేదు,’ అయితే యెహోవాకు సమర్పించుకున్న వ్యక్తికి అలా సంభవించే అవకాశం ఉంది. (కీర్తన 119:110) సొలొమోను రాజు యెహోవాకు సమర్పించుకున్న జనాంగ సభ్యునిగా ఉండి, మొదట్లో దేవుడు అనుగ్రహించిన జ్ఞానానుసారంగా నడుచుకున్నప్పటికీ, ఆయన ఆ తర్వాత తొలగిపోయాడు. ఆయన అబద్ధ దేవతారాధన చేసేలా పురికొల్పుతూ, ‘అన్యస్త్రీలు అతనిచేత కూడా పాపము చేయించారు.’​—⁠నెహెమ్యా 13:26; 1 రాజులు 11:​1-6.

10 ‘వేటగాడైన’ సాతాను అనేక ఉరులు పన్నుతాడు. (కీర్తన 91:3) ఉదాహరణకు, పూర్వ సహవాసి ఒకరు ఆధ్యాత్మిక వెలుగు మార్గం నుండి తొలగిపోయి మతభ్రష్ట అంధకారంలో పడిపోయేందుకు మనల్ని ప్రేరేపించడానికి ప్రయత్నించవచ్చు. తుయతైరలోని క్రైస్తవుల మధ్య “యెజెబెలను స్త్రీ” ఉండేది. ఆ స్త్రీ విగ్రహారాధన చేయమని, జారత్వానికి పాల్పడమని ఇతరులకు బోధిస్తున్న ఒక స్త్రీల గుంపును సూచిస్తుండవచ్చు. అలాంటి దుష్ట క్రియలను యేసు సహించలేదు, మనమూ సహించకూడదు. (ప్రకటన 2:18-22; యూదా 3, 4) కాబట్టి, యెహోవా ఉపదేశాల నుండి తొలగిపోకుండా, దైవిక వెలుగులో నిలిచి ఉండేలా మనకు సహాయం చేయమని ఆయనకు ప్రార్థించాలి.​—⁠కీర్తన 119:​111, 112.

దేవుని వాక్యముచేత బలపర్చబడడం

11 మనం దేవుని నియమాల నుండి ఎన్నడూ వైదొలగకుండా ఉంటే, ఆయన మనలను బలపరుస్తాడు. (కీర్తన 119:113-120) నేడు నులివెచ్చని నామకార్థ క్రైస్తవులను యేసు ఆమోదించనట్లే, మనమూ “ద్విమనస్కులను” ఆమోదించం. (కీర్తన 119:113; ప్రకటన 3:16) మనం పూర్ణహృదయంతో యెహోవాను సేవిస్తున్నాము కాబట్టి ఆయన మనకు ‘మరుగైన చోటుగా ఉండి’ మనలను బలపరుస్తాడు. కపటమైన ఆలోచనలతో, మోసముతో ఆయన ‘కట్టడలను మీరే వారినందరిని ఆయన నిరాకరిస్తాడు.’ (కీర్తన 119:114, 117, 118; సామెతలు 3:32) అలాంటి దుష్టులను ఆయన వెండి, బంగారం వంటి విలువైన లోహాల నుండి తొలగించిన మష్టులా అంటే కల్మషంలా దృష్టిస్తాడు. (కీర్తన 119:119; సామెతలు 17:⁠3) మనం నాశనమయ్యే చెత్తలాంటి దుష్టులతో ఉండాలని కోరుకోము కాబట్టి, మనం ఎల్లప్పుడూ దేవుని శాసనాలపట్ల ప్రేమను ప్రదర్శిద్దాం.

12 “నీ [యెహోవా] భయమువలన నా శరీరము వణకుచున్నది” అని కీర్తనకర్త అన్నాడు. (కీర్తన 119:120) దేవుడు తన సేవకులను బలపరచాలంటే, ఆయన ఆమోదించని వాటికి దూరంగా ఉంటూ ఆయనపట్ల ఆరోగ్యదాయకమైన భయంతో ఉండడం ఆవశ్యకం. యెహోవాపట్ల భక్తిపూర్వక భయమే యోబు నీతియుక్తంగా జీవించడానికి కారణమైంది. (యోబు 1:1; 23:15) మనమేమి సహించాల్సి వచ్చినా దైవానుగ్రహ స్థితిలో పట్టుదలతో కొనసాగేందుకు దైవభయమే మనకు శక్తినిస్తుంది. అయితే, సహనానికి విశ్వాసంతో కూడిన మనఃపూర్వక ప్రార్థన అవసరం.​—⁠యాకోబు 5:​15.

విశ్వాసంతో ప్రార్థించండి

13 దేవుడు మనకు మేలు చేస్తాడనే విశ్వాసంతో మనం ప్రార్థించవచ్చు. (కీర్తన 119:121-128) కీర్తనకర్తలాగే, మన ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు. ఎందుకు? ఎందుకంటే, మనం దేవుని ఆజ్ఞలను ‘బంగారంకంటె, అపరంజికంటె’ ఎక్కువగా ప్రేమిస్తాం. అంతేకాక, మనం ‘దేవుని ఉపదేశాలన్నింటినీ యథార్థములుగా పరిగణిస్తాం.’​—⁠కీర్తన 119:127, 128.

14 మనం విశ్వాసంతో ప్రార్థించడమే కాక, ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా పాటిస్తాం కాబట్టి యెహోవా మన విజ్ఞాపనలు ఆలకిస్తాడు. (కీర్తన 65:⁠2) కానీ కొన్నిసార్లు ఏమని ప్రార్థించాలో కూడా తెలియని చిక్కు సమస్యలు ఎదురైతే అప్పుడెలా? అలాంటప్పుడు ‘ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తుంది.’ (రోమీయులు 8:26, 27) అలాంటి సమయాల్లో, దేవుడు తన వాక్యంలోని మాటలనే మన అవసరాలను సూచించే విన్నపాలుగా అంగీకరిస్తాడు.

15 ‘ఉచ్చరింప శక్యముకాని మన మూలుగులకు’ సంబంధించిన అనేక ప్రార్థనలు, తలంపులు లేఖనాల్లో ఉన్నాయి. మచ్చుకు, కీర్తన 119:121-128 పరిశీలించండి. ఇక్కడ వ్యక్తపరచబడిన మాటలు మన పరిస్థితులకు సరిగ్గా సరిపోవచ్చు. మనం మోసపోతామని భయపడినప్పుడు కీర్తనకర్త అడిగిన విధంగా మనం దేవుని సహాయం అడగవచ్చు. (121-123 వచనాలు) మనం చాలా కష్టమైన ఒక నిర్ణయం తీసుకోవాలనుకుందాం. అలాంటప్పుడు, యెహోవా ఉపదేశాలను జ్ఞాపకం చేసుకొని వాటిని అన్వయించుకునేందుకు సహాయం చేయమని మనం యెహోవా ఆత్మ కోసం ప్రార్థించవచ్చు. (124-125 వచనాలు) మనం ‘సమస్త అబద్ధ మార్గాలను అసహ్యించుకున్నా,’ దేవుని నియమాన్ని ఉల్లంఘించాలనే శోధన ఎదురైనప్పుడు దానిని అధిగమించేందుకు సహాయం చేయమని మనం ఆయనను అడగవచ్చు. (126-128 వచనాలు) మనం ప్రతీ దినం బైబిలు చదివినట్లయితే, మనం యెహోవాకు విజ్ఞాపన చేసినప్పుడు అలాంటి సహాయకరమైన లేఖనాలు మనకు గుర్తుకు రావచ్చు.

యెహోవా శాసనముల ద్వారా సహాయం పొందడం

16 మన ప్రార్థనలను దేవుడు ఆలకించాలంటే, మనం ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే, మనం దేవుని జ్ఞాపికలను లేదా శాసనములను తప్పకుండా లక్ష్యపెట్టాలి. (కీర్తన 119:129-136) మనం మరచిపోయే అవకాశం ఉంది కాబట్టి, దేవుని ఉపదేశాన్ని, ఆజ్ఞలను మనకు గుర్తుచేసే యెహోవా అద్భుతమైన జ్ఞాపికలు మనకు అవసరం. దేవుని వాక్యానికి సంబంధించి ప్రతీ క్రొత్త అవగాహన ద్వారా ప్రసరించే ఆధ్యాత్మిక వెలుగుకు మనం కృతజ్ఞులం. (కీర్తన 119:129, 130) ‘ఇతరులు దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన కారణంగా మన కన్నీరు ఏరులైపారినా’ యెహోవా తన ఆమోదంతో ‘మన మీద తన ముఖకాంతిని ప్రకాశింపజేసినందుకు’ కూడా మనం కృతజ్ఞులం.​—⁠కీర్తన 119:135, 136; సంఖ్యాకాండము 6:​25.

17 దేవుని నీతియుక్త శాసనములకు కట్టుబడి ఉంటే మనకు ఆయన అనుగ్రహం నిరంతరం ఉంటుంది. (కీర్తన 119:137-144) యెహోవా తన నీతియుక్త శాసనములను మన అవధానానికి తెచ్చి వాటిని మనం పాటించవలసిన ఆజ్ఞలుగా మన మీద నియమించే హక్కు ఆయనకు ఉందని ఆయన సేవకులుగా మనం గుర్తిస్తాం. (కీర్తన 119:138) కీర్తనకర్త దేవుని ఆజ్ఞలకు లోబడ్డాడు కదా, అలాంటప్పుడు ఆయన “నేను అల్పుడను, నిరాకరింపబడినవాడను” అని ఎందుకు అన్నాడు? (కీర్తన 119:141) నిజానికి, ఆయన తన శత్రువులు తనను దృష్టించిన విధానాన్ని సూచిస్తున్నాడు. మనం నీతి విషయంలో రాజీపడని ధోరణిని కాపాడుకున్నప్పుడు, ఇతరులు మనలను చిన్న చూపు చూడవచ్చు. అయితే, మనం యెహోవా నీతియుక్త శాసనాలకు అనుగుణంగా జీవిస్తున్నందుకు యెహోవా మనలను అనుగ్రహపూర్వకంగా చూడడమే నిజానికి మనకు కావలసింది.

భద్రతతో, సమాధానంతో ఉండడం

18 దేవుని శాసనాలకు కట్టుబడి ఉండడం మనలను ఆయనకు సన్నిహితంగా ఉంచుతుంది. (కీర్తన 119:145-152) మనం యెహోవా శాసనాలకు అవధానం ఇస్తాం కాబట్టి, ఆయనకు పూర్ణహృదయంతో ధైర్యంగా ప్రార్థించడమే కాక, ఆయన మన ప్రార్థనలు వింటాడని ఎదురుచూస్తాం. “తెల్లవారకమునుపే” మనం మేల్కొని సహాయం కోసం ఆయనకు మొరపెట్టవచ్చు. ప్రార్థించడానికి అది ఎంత చక్కని సమయమో కదా! (కీర్తన 119:145-147) మనం దుర్నీతికరమైన ప్రవర్తనకు దూరంగా ఉంటూ, యేసు దృష్టించినట్లే ఆయన వాక్యాన్ని సత్యమని దృష్టిస్తాం కాబట్టి దేవుడు మనకు కూడా చేరువగా ఉన్నాడు. (కీర్తన 119:150, 151; యోహాను 17:17) యెహోవాతో మనకున్న సంబంధం ఈ కష్టభరిత లోకంలో మనలను బలపరచి, ఆయన మహా యుద్ధమైన అర్మగిద్దోనులో మనలను తప్పిస్తుంది.​—⁠ప్రకటన 7:9, 14; 16:​13-16.

19 దేవుని వాక్యంపట్ల మనకున్న ప్రగాఢ గౌరవం కారణంగా మనం నిజమైన భద్రతను అనుభవిస్తున్నాం. (కీర్తన 119:153-160) దుష్టులు తొలగిపోయినట్లు మనం ‘యెహోవా శాసనాల నుండి తొలగలేదు.’ మనం దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తున్నాం కాబట్టే ఆయన కృపవల్ల సురక్షితంగా ఉన్నాం. (కీర్తన 119:157-159) ఆయా ప్రత్యేక పరిస్థితుల్లో యెహోవా మననుండి ఏమి కోరుతున్నాడో గుర్తుంచుకోవడానికి ఆయన శాసనాలు మన జ్ఞాపకశక్తిని పురికొల్పుతాయి. మరోవైపున దేవుని ఆజ్ఞలు ఆయనిచ్చే నిర్దేశాలే, మనలను నిర్దేశించడానికి సృష్టికర్తకున్న హక్కును మనం ఇష్టపూర్వకంగా గుర్తిస్తాం. ‘దేవుని వాక్య సారాంశము సత్యమనీ,’ మనం స్వతంత్రంగా మన మార్గాన్ని నిర్దేశించుకోలేమనీ తెలిసిన మనం దేవుని నిర్దేశాన్ని ఆనందంగా అంగీకరిస్తాం.​—⁠కీర్తన 119:160; యిర్మీయా 10:​23.

20 యెహోవా నియమాలపట్ల మనకున్న ప్రేమ మనకు సమృద్ధిగా నెమ్మదిని లేదా సమాధానాన్ని తీసుకొస్తుంది. (కీర్తన 119:161-168) హింస అసమానమైన ‘దేవుని సమాధానాన్ని’ మన నుండి తీసివేయలేదు. (ఫిలిప్పీయులు 4:6, 7) యెహోవా న్యాయవిధులను మనం ఎంత ఉన్నతంగా ఎంచుతామంటే, వాటి విషయంలో మనం తరచూ అంటే “దినమునకు ఏడు మారులు” ఆయనను స్తుతిస్తాం. (కీర్తన 119:161-164) “నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు” అని కీర్తనకర్త ఆలపించాడు. (కీర్తన 119:165) వ్యక్తిగతంగా మనం దేవుని నియమాలను ప్రేమిస్తూ, దానిని అవలంబిస్తూ ఉంటే, వేరొకరు చేసిన పని కారణంగా లేదా ఏదైనా విషయం కారణంగా మనం ఆధ్యాత్మికంగా అభ్యంతరపడము.

21 బైబిల్లో పేర్కొనబడిన చాలామంది దేనినీ తమకు ఎల్లప్పుడూ అభ్యంతరపడేందురు కారణంగా ఉండనివ్వలేదు. ఉదాహరణకు, దియొత్రెఫే యొక్క భక్తిహీన ప్రవర్తననుబట్టి, క్రైస్తవుడైన గాయు అభ్యంతరపడక ‘సత్యమును అనుసరిస్తూ నడుచుకొన్నాడు.’ (3 యోహాను 1-3, 9, 10) క్రైస్తవ స్త్రీలైన యువొదియ, సుంటుకేల మధ్య ఉత్పన్నమైన చిక్కుల కారణంగా పౌలు వారిని “ప్రభువునందు ఏకమనస్సుగలవారై” ఉండవలెనని వేడుకున్నాడు. వారు సహాయం పొంది తమ సమస్యను పరిష్కరించుకొని యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగి ఉంటారు. (ఫిలిప్పీయులు 4:2, 3) కాబట్టి సంఘంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం అభ్యంతరపడవలసిన అవసరం లేదు. ‘మన మార్గాలన్నీ ఆయన ఎదుట ఉన్నాయని’ గుర్తుంచుకొని మనం యెహోవా ఆజ్ఞలను అనుసరించడం మీదే దృష్టి కేంద్రీకరిద్దాం. (కీర్తన 119:168; సామెతలు 15:3) అలా చేసినప్పుడు, మనకున్న ‘ఎంతో నెమ్మదిని’ ఏదీ శాశ్వతంగా దోచుకోలేదు.

22 మనం అన్ని సందర్భాల్లో యెహోవాకు విధేయులుగా ఉంటే, ఆయనను ఎల్లప్పుడూ స్తుతించే ఆధిక్యత మనకు ఉంటుంది. (కీర్తన 119:​169-176) దేవుని నియమాలకు అనుగుణంగా జీవించడం ద్వారా మనం ఆధ్యాత్మిక భద్రతను అనుభవించడమే కాక, ‘మన పెదవులతో యెహోవాను ఉత్సాహంగా స్తుతించడంలో’ కూడా కొనసాగుతాం. (కీర్తన 119:169-171, 174) ఇది ఈ అంత్యదినాల్లో మనకు ఉండగల అత్యంత గొప్ప ఆధిక్యత. నిరంతరం జీవిస్తూ యెహోవాను ఎల్లప్పుడూ స్తుతించాలని కీర్తనకర్త కోరుకున్నాడు, అయితే మనకు తెలియని రీతిలో ఆయన ‘తప్పిపోయిన గొఱ్ఱెవలె త్రోవవిడిచి తిరిగాడు.’ (కీర్తన 119:175, 176) క్రైస్తవ సంఘాన్ని వదిలి వెళ్ళిపోయిన కొందరు దేవుణ్ణి ఇంకా ప్రేమిస్తూ, ఆయనను స్తుతించాలని కోరుకోవచ్చు. కాబట్టి వారు మళ్లీ ఆధ్యాత్మిక భద్రతను కనుగొని, యెహోవా ప్రజలతో కలిసి ఆయనను స్తుతించే ఆనందాన్ని అనుభవించేందుకు వారికి సహాయం చేయడానికి మనం శాయశక్తులా ప్రయత్నిద్దాం.​—⁠హెబ్రీయులు 13:15; 1 పేతురు 5:⁠6, 7.

మన త్రోవకు శాశ్వత వెలుగు

23కీర్తన 119 మనకు వివిధ రీతుల్లో ప్రయోజనం చేకూర్చగలదు. ఉదాహరణకు, మనం మరింత ఎక్కువగా దేవునిపై ఆధారపడేలా అది చేయగలదు, ఎందుకంటే, “యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకోవడం” మూలంగానే నిజమైన సంతోషం వస్తుందని అది చూపిస్తోంది. (కీర్తన 119:1) ‘దేవుని వాక్య సారాంశము సత్యము’ అని కీర్తనకర్త మనకు గుర్తుచేస్తున్నాడు. (కీర్తన 119:160) ఇది దేవుని లిఖిత వాక్యంపట్ల మన కృతజ్ఞతాభావాన్ని తప్పక అధికం చేయాలి. 119వ కీర్తనను ధ్యానించడం లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేసేందుకు మనలను పురికొల్పాలి. కీర్తనకర్త పదేపదే దేవుణ్ణి ఇలా వేడుకున్నాడు: “నీ కట్టడలను నాకు బోధించుము.” (కీర్తన 119:12, 68, 135) ఆయన ఇంకా ఇలా ప్రార్థించాడు: “నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము.” (కీర్తన 119:66) మనం కూడా అలా ప్రార్థించాలి.

24 యెహోవా బోధ ఆయనతో సన్నిహిత సంబంధాన్ని సాధ్యం చేస్తుంది. కీర్తనకర్త పదేపదే తనను తాను దేవుని సేవకుడని పిలుచుకున్నాడు. వాస్తవానికి, ఆయన యెహోవాతో ఈ ప్రేరణాత్మక మాటలు అన్నాడు: ‘నేను నీవాడను.’ (కీర్తన 119:17, 65, 94, 122, 125; రోమీయులు 14:8) యెహోవాసాక్షుల్లో ఒకరిగా ఆయన సేవ చేస్తూ, ఆయనను స్తుతించడం ఎంత గొప్ప ఆధిక్యతో కదా! (కీర్తన 119:7) రాజ్య ప్రచారకునిగా మీరు ఆనందంగా దేవుని సేవ చేస్తున్నారా? అలాగైతే, ఎల్లప్పుడూ ఆయన వాక్యంపై నమ్మకం ఉంచుతూ, దానిని మీ త్రోవకు వెలుగుగా ఉంచుకుంటే తన సేవ చేయడానికి యెహోవా మిమ్మల్ని ఎల్లప్పుడూ బలపరుస్తూ, ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.

మీరెలా సమాధానమిస్తారు?

మనం దేవుని వాక్యాన్ని ఎందుకు ప్రేమించాలి?

దేవుని వాక్యం ద్వారా మనం ఎలా బలపరచబడతాం?

యెహోవా శాసనాల ద్వారా మనకు ఏయే విధాలుగా సహాయం లభిస్తుంది?

యెహోవా ప్రజలు ఎందుకు భద్రతతో, సమాధానంతో ఉన్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. ఎలాంటి పరిస్థితుల్లో యెహోవా వాక్యం మన త్రోవను వెలుగుమయం చేస్తుంది?

3. మనం దేవుని వాక్యంపై ఆధారపడవచ్చని కీర్తన 119:89, 90 ఎలా చూపిస్తున్నాయి?

4. శ్రమలనుభవించే దేవుని సేవకులకు ఆయన వాక్యంపట్ల వారికున్న ప్రేమ ఎలా సహాయం చేస్తుంది?

5. రాజైన ఆసా యెహోవాను ఎలా వెదికాడు?

6. మనలను ఆధ్యాత్మిక హాని నుండి ఏది కాపాడుతుంది?

7, 8. కీర్తన 119:105కు అనుగుణంగా మనమేమి చేయాలి?

9, 10. యెహోవాకు సమర్పించుకున్న వ్యక్తులు ‘ఆయన ఉపదేశముల నుండి తొలగిపోగలరు’ అని మనకు ఎలా తెలుసు, అయితే మనకు అలా జరగకుండా మనం ఎలా నివారించవచ్చు?

11. కీర్తన 119:​119 ప్రకారం, దుష్టులను దేవుడు ఎలా దృష్టిస్తాడు?

12. యెహోవాపట్ల భయం ఎందుకు అవసరం?

13-15. (ఎ) మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుందని మనం ఎందుకు విశ్వసించవచ్చు? (బి) ఏమని ప్రార్థించాలో మనకు తెలియనప్పుడు, ఏమి జరగవచ్చు? (సి) ‘ఉచ్చరింప శక్యముకాని మన మూలుగులకు’ కీర్తన 119:121-128కి ఎలాంటి సంబంధముందో ఉదాహరించండి.

16, 17. (ఎ) మనకు దేవుని జ్ఞాపికలు ఎందుకు అవసరం, మనం వాటిని ఎలా దృష్టించాలి? (బి) ఇతరులు మనలను ఎలా దృష్టించవచ్చు, అయితే నిజానికి మనకు కావలసినది ఏమిటి?

18, 19. దేవుని శాసనాలకు కట్టుబడి ఉండడంవల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి?

20. మనకు “ఎంతో నెమ్మది” ఎందుకు ఉంటుంది?

21. సంఘంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం అభ్యంతరపడవలసిన అవసరం లేదని ఏ లేఖన ఉదాహరణలు చూపిస్తున్నాయి?

22. (ఎ) మనం దేవునికి విధేయులమైతే, ఎలాంటి ఆధిక్యతను అనుభవించగలం? (బి) క్రైస్తవ సంఘాన్ని వదిలి వెళ్ళిపోయిన కొందరిని మనం ఎలా దృష్టించాలి?

23, 24. కీర్తన 119 నుండి మీకు ఎలాంటి ప్రయోజనాలు లభించాయి?

[16వ పేజీలోని చిత్రం]

దేవుని వాక్యం ఆధ్యాత్మిక వెలుగుకు ఊటలాంటిది

[17వ పేజీలోని చిత్రం]

మనం యెహోవా శాసనాలను ప్రేమిస్తే, ఆయన మనల్ని ఎన్నటికీ “మష్టువలె” పరిగణించడు

[18వ పేజీలోని చిత్రాలు]

మనం ప్రతీరోజు బైబిలు చదివితే, మనం ప్రార్థిస్తున్నప్పుడు సహాయకరమైన లేఖనాలు మనకు జ్ఞాపకం రావచ్చు