కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిరాశ మధ్యనూ చిగురించిన ఆశ శరణార్థి శిబిరంలో సమావేశం

నిరాశ మధ్యనూ చిగురించిన ఆశ శరణార్థి శిబిరంలో సమావేశం

నిరాశ మధ్యనూ చిగురించిన ఆశ శరణార్థి శిబిరంలో సమావేశం

కాకుమా శరణార్థి శిబిరం కెన్యాకు ఉత్తర భాగాన, సూడాన్‌ సరిహద్దుకు సమీపాన ఉంది. ఆ శిబిరంలో 86,000 కంటే ఎక్కువమందే ఉన్నారు. అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉండి, పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌ వరకు చేరుతుంది. శరణార్థుల మధ్య దౌర్జన్యపూరిత చర్యలు సర్వసాధారణం. చాలామంది శరణార్థులకు ఆ శిబిరం నిరాశకు నిలయమైతే, మరికొందరికి అదొక ఆశాకిరణంగా ఉంది.

శరణార్థుల్లో చాలామంది యెహోవాసాక్షులున్నారు, వాళ్ళు అక్కడ ఉత్సాహంగా రాజ్య సువార్త ప్రకటిస్తున్నారు. వారు, అక్కడికి దక్షిణాన 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోడ్వార్‌లోని చిన్న సంఘానికి చెందిన వారు. లోడ్వార్‌కు దగ్గరలోవున్న సంఘానికి చేరుకోవాలంటే ఎనిమిది గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

శరణార్థులు శిబిరం విడిచి వెళ్లకూడదు కాబట్టి, అందులోవున్న చాలామంది యెహోవాసాక్షుల సమావేశాలకు హాజరు కాలేకపోతున్నారు. ఆ కారణం చేత, ఆ శిబిరంలోనే ప్రత్యేక సమావేశ దినాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి.

ఉత్తరంగా ప్రయాణించడం

ఈ సమావేశానికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఆ శిబిరానికి దక్షిణాన 480 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్డోరెట్‌ పట్టణంలోని 15 మంది సాక్షులు స్వచ్ఛందంగా ముందుకు రావడమే కాక, వేడిగా ఉండే ఉత్తరభాగానికి ఎంతో ప్రయాసతో కూడిన ప్రయాణానికి సిద్ధమయ్యారు, దానికి ఒక బైబిలు విద్యార్థి తన మినీ బస్సును, డ్రైవరును ఇవ్వడానికి ముందుకొచ్చాడు. తమ సహోదరులను ప్రోత్సహించి బలపరచాలన్నదే వారి హృదయపూర్వక కోరిక.

ఒక చల్లని ఉదయాన కెన్యాలోని పశ్చిమ పర్వత ప్రాంతం నుండి వారి ప్రయాణం ప్రారంభమైంది. ఎగుడుదిగుడుగా ఉన్న ఆ రోడ్డు పంటపొలాలు, అడవుల మధ్యగా ఎత్తుపల్లాలగుండా చివరకు వేడిగా ఉన్న ఎడారి తుప్పల్లో నుండి ముందుకు సాగింది. ఆ బంజరు ప్రాంతంలో మేకల మందలు, ఒంటెలు మేస్తున్నాయి. దుడ్డుకర్రలు, విల్లు, బాణాలు పట్టుకుని సాంప్రదాయ దుస్తుల్లో మన్యప్రజలు నడిచివెళ్తున్నారు. ఆ సాక్షులు 11 గంటలపాటు ప్రయాణించిన తర్వాత, మండుటెండలో, దాదాపు 20,000 మంది ఉన్న లోడ్వార్‌కు చేరుకున్నారు. అక్కడి సాక్షులు వారిని సాదరంగా ఆహ్వానించడంతో, వారాంత కార్యక్రమాల కోసం సిద్ధంగా ఉండగలిగేలా వారు వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకున్నారు.

తర్వాతి రోజు, వారు కొన్ని చూడదగిన ప్రదేశాలకు వెళ్ళారు. టుర్కానా సరస్సు కెన్యాలోకెల్లా పెద్దది, దాన్ని చూసి తీరవలసిందే. ఎన్నో కిలోమీటర్ల మేర పొదలతో నిండివున్న ఆ సరస్సులోనే ప్రపంచంలో ఇతర స్థలాల్లో ఉన్నవాటన్నిటి కంటే ఎక్కువ సంఖ్యలో మొసళ్లున్నాయి. దాని తీరం వెంబడి నివసించే కొంతమందికి క్షార గుణాలుగల ఆ నీరే ఆధారం. ఆ సాయంకాలం వారు స్థానిక సంఘంతో కలిసి దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు, సేవా కూటానికి హాజరై ఆనందించారు. అక్కడ ఒక అందమైన రాజ్య మందిరం ఉంది, అది పరిమిత వనరులుగల దేశాల్లో నిర్మాణ పనులు నిర్వహించే సాక్షుల కార్యక్రమంలో భాగంగా 2003లో నిర్మించబడింది.

ప్రత్యేక సమావేశ దినం

ఆదివారం ప్రత్యేక సమావేశ దినం కోసం కేటాయించబడింది. లోడ్వార్‌ సంఘంతోపాటు సందర్శిస్తున్న సహోదరులకు ఉదయం ఎనిమిది గంటలకల్లా శిబిరంలోకి ప్రవేశించడానికి అనుమతి లభించింది కాబట్టి త్వరగా ప్రారంభించాలని సాక్షులు ఉత్సుకతతో ఉన్నారు. మలుపులు తిరుగుతూ వెళ్తున్న రోడ్డు బీడు ప్రాంతాల మీదుగా సూడాన్‌ సరిహద్దుకు చేరుకుంది. మొనతేలిన పర్వతాలు రోడ్డుకు ఇరువైపులా ఎంతో ఎత్తుగా ఉన్నాయి. కాకుమా గ్రామం వద్దకు చేరుకునేటప్పటికి చుట్టూ సువిశాల ప్రదేశం కనబడుతుంది. వర్షం కురుస్తుండడంతో శిబిరంలోకి వెళ్ళే ఆ రోడ్డులో అక్కడక్కడా నీళ్ళు నిలిచి ఉన్నాయి. చాలా ఇళ్ళు మట్టి ఇటుకలతో నిర్మించబడ్డాయి, వాటిపై రేకు లేదా టార్పాలిన్‌ పైకప్పుగా ఉంది. ఇతియోపియా, సోమాలియా, సూడాన్‌ వాసుల గుంపు ఇంకా ఇతరులు తమ తమ స్థలాల్లో నివసిస్తారు. సందర్శిస్తున్న సహోదరులకు శరణార్థులు ఉత్సాహంగా స్వాగతం పలికారు.

ఒక శిక్షణ కేంద్రంలో సమావేశం జరిగింది. గోడల మీది చిత్రాలు శరణార్థి జీవితపు భయానక విషయాల గురించి తెలియజేస్తాయి, కానీ ఆ రోజున ఆ హాలులో పూర్తిగా ఆశావహ స్ఫూర్తి నెలకొని ఉంది. ప్రసంగాలన్నీ ఆంగ్లంలోనూ స్వాహిలీలోనూ ఇవ్వబడ్డాయి. రెండు భాషలూ బాగా వచ్చిన కొంతమంది ప్రసంగీకులు తమ ప్రసంగాన్ని తామే మరో భాషలో కూడా చెప్పారు. సూడాన్‌ నుండి వచ్చిన ఒక శరణార్థి సహోదరుడు “మీ సూచనార్థక హృదయాన్ని పరీక్షించుకోవడం” అనే మొదటి ప్రసంగాన్ని ఇచ్చాడు. మిగతా భాగాలను, సందర్శిస్తున్న పెద్దలు ఇచ్చారు.

ప్రతీ సమావేశంలో బాప్తిస్మపు ప్రసంగం ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. బాప్తిస్మ ప్రసంగం ముగింపులో, అందరి కళ్ళూ బాప్తిస్మం తీసుకోబోయే ఒకే ఒక సభ్యునిపై నిలిచాయి. గిల్‌బర్ట్‌ 1994లో జరిగిన జాతి నిర్మూలనా సమయంలో తన తండ్రితో పాటు తన స్వంత ఊరి నుండి పారిపోయి అక్కడికి చేరుకున్నాడు. మొదట్లో, వారు బురుండీలో తలదాచుకోవాలని ఆశించారు గానీ అక్కడ కూడా ప్రమాదం పొంచి ఉందని వారు వెంటనే గ్రహించారు. గిల్బర్ట్‌ అడవిలో అక్కడక్కడా దాక్కుంటూ, మొదట జైరీకి, ఆ తర్వాత టాంజానియాకు, చివరికి కెన్యాకు పారిపోయాడు. ప్రసంగీకుడు ఆయనను సంఘంలోకి సహోదరునిగా ఆహ్వానించినప్పుడు చాలామంది కళ్ళు చెమర్చాయి. గిల్‌బర్ట్‌ 95 మంది ఉన్న ఆ చిన్న సమావేశం ముందు భాగంలో నిలబడి, ప్రసంగీకుడు అడిగిన రెండు ప్రశ్నలకు “న్డీయో” అని స్వాహిలీలో స్పష్టంగా, నమ్మకంగా సమాధానం ఇచ్చాడు, దానికి “అవును” అని అర్థం. ఆయనతోపాటు ఇంకా కొంతమంది సహోదరులు చేతులతో ఒక చిన్న గుంట తవ్వి, శిబిరంలో ఆయన ఇంటికి ఒకప్పుడు పైకప్పుగా ఉన్న టార్పాలిన్‌ను దానిలో అమర్చారు. బాప్తిస్మం తీసుకోవాలనే ఉత్సుకతను ప్రదర్శిస్తూ ఆయన ఒక్కడే ఆ ఉదయం బకెట్లతో ఆ గుంటలో నీళ్ళు నింపాడు!

మధ్యాహ్న కార్యక్రమ ఉన్నతాంశాల్లో ఒకటి శరణార్థి సాక్షుల ప్రత్యేక పరిస్థితికి సంబంధించిన అనుభవాలను చెప్పడం. ఒక చెట్టు క్రింద కూర్చుని ఉన్న ఒక వ్యక్తిని తానెలా సమీపించాడో ఒక సహోదరుడు ఇలా వివరించాడు.

“చెట్టు క్రింద కూర్చోవడం అన్ని సమయాల్లోనూ సురక్షితమేనా?”

“సురక్షితమే, కానీ రాత్రిపూట మాత్రం అంత సురక్షితం కాదు” అని ఆ వ్యక్తి బదులిచ్చాడు.

“ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును” అని చెబుతున్న మీకా 4:3, 4 వచనాలను ఆ సహోదరుడు ఆయనకు చదివి వినిపించాడు. “కాబట్టి దేవుని నూతనలోకంలో, అన్ని సమయాల్లోనూ చెట్టు క్రింద కూర్చోవడం సురక్షితమే” అని వివరించాడు. ఆ వ్యక్తి బైబిలు అధ్యయనానికి సహాయపడే ప్రచురణలను తీసుకున్నాడు.

కాకుమాకు వెళ్ళిన ఒక సహోదరి, ఇటీవలే తన కుటుంబ సభ్యుల్లో ముగ్గురిని కోల్పోయింది. శిబిరంలోని సహోదరుల గురించి వ్యాఖ్యానిస్తూ ఆమె ఇలా చెప్పింది: “అది ఎన్నో కష్టాలున్న స్థలం; అయినా వారు తమ విశ్వాసాన్ని దృఢంగా ఉంచుకున్నారు. వారు అసంతోషకరమైన స్థలంలో నివసిస్తున్నా సంతోషంగా యెహోవా సేవ చేస్తున్నారు. వారు దేవునితో సమాధానకరమైన సంబంధం కలిగివున్నారు. సమాధానం కలిగివుండి యెహోవా సేవ చేయడానికి నేను పురికొల్పబడ్డాను. నాకు చింతించవలసిన విషయమంటూ ఏమీ లేదు.”

త్వరలోనే సమావేశ దినం ముగింపుకు వచ్చింది. ముగింపు ప్రసంగంలో ప్రసంగీకుడు, ఎనిమిది దేశాల ప్రతినిధులు అక్కడ ఉన్నారని చెప్పాడు. సాక్షియైన ఒక శరణార్థి, ఈ సమావేశం విభాగిత లోకంలో యెహోవాసాక్షుల మధ్యవున్న ఐక్యతకు, ప్రేమకు నిదర్శనమని అన్నాడు. వాళ్ళది నిజంగా క్రైస్తవ సహోదరత్వమే.​—⁠యోహాను 13:​35.

[25వ పేజీలోని బాక్సు/చిత్రం]

సూడాన్‌కు చెందిన అనాథ బాలలు

సూడాన్‌లో 1983లో పౌర యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, 50 లక్షలమంది తమ ఇళ్ళనుండి వెళ్ళగొట్టబడ్డారు. వారిలో దాదాపు 26,000 మంది తమ కుటుంబాల నుండి వేరైపోయిన పిల్లలే ఉన్నారు. వారిలో వేలాదిమంది పిల్లలు ఇతియోపియాలోని శరణార్థి శిబిరాలకు పారిపోయి, దాదాపు మూడు సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. మళ్ళీ అక్కడి నుండి కూడా పారిపోవలసిన పరిస్థితి రావడంతో సైనికులు, బందిపోటు దొంగలు, రోగాలు, క్రూర జంతువులు వంటివాటి బారినపడి వారు సూడాన్‌ గుండా ఒక సంవత్సరం పాటు నడిచి ఉత్తర కెన్యాకు చేరుకున్నారు. ఈ కష్టభరితమైన ప్రయాణంలో చివరకు వారిలో సగంమంది పిల్లలు మాత్రమే మిగిలారు. చివరికి వీరు కాకుమా శరణార్థి శిబిరంలో ముఖ్య భాగమయ్యారు. సహాయ సంస్థలు వీరిని సూడాన్‌కు చెందిన అనాథ బాలలు అని పిలవడం ప్రారంభించాయి.

కాకుమా శరణార్థి శిబిరం ఇప్పుడు సూడాన్‌, సోమాలియా, ఇతియోపియా, ఇతర దేశాల శరణార్థులకు అంతర్జాతీయ నివాసం అయ్యింది. ఒక శరణార్థి శిబిరానికి వచ్చిన వెంటనే అతనికి ఇల్లు కట్టుకోవడానికి కొంత సామాగ్రి, పైకప్పు కోసం టార్పాలిన్‌ ఇవ్వబడతాయి. ప్రతి శరణార్థికి నెలకు రెండుసార్లు దాదాపు ఆరు కిలోల పిండి, ఒక కిలో బీన్సు, కొంచెం వంటనూనె, కొంచెం ఉప్పు ఇవ్వబడతాయి. చాలామంది శరణార్థులు ఈ వస్తువుల్లో కొంత ఇతరులకు ఇచ్చి వారి నుండి ఇతర వస్తువులు తీసుకుంటారు.

ఈ అనాథ బాలల్లో కొందరు తిరిగి తమ కుటుంబాలను కలుసుకున్నారు లేదా ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. ఒక శరణార్థుల పునరావాస కార్యాలయం ప్రకారం, “ఇంకా వేలాదిమంది దుమ్ము కొట్టుకుపోయిన, కీటకాలమయమైన కాకుమా శరణార్థి శిబిరంలోనే ఉండిపోయారు, అక్కడ వారు తిండికోసం విద్యకోసం ఎన్నో పాట్లు పడవలసి వస్తోంది.”

[చిత్రసౌజన్యం]

Courtesy Refugees International

[23వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

కెన్యా

కాకుమా శిబిరం

టుర్కానా సరస్సు

లోడ్వార్‌

ఎల్‌డోరెట్‌

నైరోబీ

[23వ పేజీలోని చిత్రం]

శిబిరంలో జీవన పరిస్థితులు చాలా కష్టభరితంగా ఉంటాయి

[23వ పేజీలోని చిత్రం]

కాకుమా శిబిరంలో నీళ్లు పరిమితంగా ఇవ్వబడతాయి

[23వ పేజీలోని చిత్రం]

కెన్యాకు చెందిన సాక్షులు తమ సహోదరులను ప్రోత్సహించడానికి కష్టతరమైన ప్రయాణం చేశారు

[24వ పేజీలోని చిత్రం]

స్థానిక ప్రత్యేక పయినీరు ఇస్తున్న ప్రసంగాన్ని ఒక మిషనరీ అనువదిస్తున్నాడు

[24వ పేజీలోని చిత్రం]

బాప్తిస్మం ఇవ్వడానికి ఉపయోగించిన గుంట

[23వ పేజీలోని చిత్రసౌజన్యం]

పరిమిత నీటి సరఫరా, కాకుమా శరణార్థి శిబిరం: Courtesy Refugees International