కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

అపొస్తలుడైన పౌలు, “నేను పరిసయ్యుడను” అని సమాజమందిరం ఎదుట చెప్పినప్పుడు ఆయన తన క్రైస్తవ విశ్వాసం విషయంలో రాజీపడ్డాడా?

అపొస్తలుల కార్యములు 23:6లో ఉన్న పౌలు వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకోవాలంటే మనం దాని సందర్భాన్ని పరిశీలించాలి.

యెరూషలేములోని యూదుల చేతుల్లో దాడికి గురైన తర్వాత పౌలు ఆ జనసమూహాన్ని ఉద్దేశించే మాట్లాడాడు. తాను ‘యెరూషలేము పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనయ్యానని’ ఆయన పేర్కొన్నాడు. జనసమూహాలు ఆయన వాదనను కొద్దిసేపు విని ఆ తర్వాత, ఆయనపై ఆగ్రహించినప్పుడు, కూడావున్న సైనికాధికారి పౌలును సైనిక స్థావరానికి తీసుకువెళ్ళాడు. తనను కొరడాలతో కొట్టే ముందు పౌలు ఆయనను ఇలా అడిగాడు: “శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా?”​—⁠అపొస్తలుల కార్యములు 21:27-22:​29.

మరునాడు, ఆ సైనికాధికారి పౌలును యూదుల న్యాయసభకు తీసుకువెళ్ళాడు. పౌలు వారివైపు తేరి చూచి అక్కడ సద్దూకయ్యులు, పరిసయ్యులు ఉండడం గమనించాడు. అప్పుడాయన ఇలా అన్నాడు: “నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణగూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నాను.” తత్ఫలితంగా పరిసయ్యులకు, సద్దూకయ్యులకు మధ్య కలహము పుట్టింది, ఎందుకంటే “సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు.” పరిసయ్యుల గుంపుకు చెందిన కొందరు కోపంగా ఇలా వాదించారు: ‘ఈ మనుష్యునియందు ఏ దోషమును మాకు కనబడలేదు.’​—⁠అపొస్తలుల కార్యములు 23:​6-10.

ఎంతో ఆసక్తిగల క్రైస్తవుడని నలుగురికీ తెలిసిన పౌలు తాను పరిసయ్యుల తెగలో కార్యశీల సభ్యుడనని న్యాయసభను ఒప్పించగలిగేవాడు కాదు. అక్కడున్న పరిసయ్యులు రాజీపడడాన్ని, తప్పుడు ప్రాతినిధ్యాన్ని ఏ మాత్రం అంగీకరించి ఉండేవారు కాదు. కాబట్టి తాను పరిసయ్యుడనని పౌలు చెప్పడానికి పరిమిత అర్థం మాత్రమే ఉంది, అక్కడున్న పరిసయ్యులు ఆ సందర్భంలో పౌలు మాటల భావాన్ని అర్థం చేసుకుని ఉండవచ్చు.

మృతుల పునరుత్థాన నిరీక్షణ గురించి తాను తీర్పుకు గురవుతున్నానని పౌలు అన్నప్పుడు ఈ విషయంలో తాను పరిసయ్యునిలా ఉన్నానన్నదే ఆయన స్పష్టమైన ఉద్దేశం. ఈ విషయానికి సంబంధించిన ఏ వివాదంలోనైనా, పౌలు విశ్వాసాన్ని పునరుత్థానాన్ని విశ్వసించని సద్దూకయ్యుల విశ్వాసంతో కాదుగానీ పరిసయ్యుల విశ్వాసంతోనే పోల్చాలి.

పునరుత్థానం, దేవదూతలు, ధర్మశాస్త్రంలోని కొన్ని విషయాలు వంటివాటిలో క్రైస్తవునిగా పౌలు విశ్వసించిన వాటికి పరిసయ్యుల నమ్మకాలకు ఏ విరుద్ధతా లేదు. (ఫిలిప్పీయులు 3:⁠5) కాబట్టి ఆ పరిధిలో పౌలు తనను తాను పరిసయ్యులతో జతచేసుకోవచ్చు, సమాజమందిరంలో ఉన్నవారు కూడా ఆయన మాటలను ఆ పరిమిత భావంలోనే అర్థం చేసుకున్నారు. ఆ విధంగా ఆయన, పక్షపాతంగల యూదా న్యాయసభలో మాట్లాడడానికి తన పూర్వరంగాన్ని ఉపయోగించుకున్నాడు.

పౌలు తన విశ్వాసం విషయంలో రాజీపడలేదు అనడానికి అతి గొప్ప నిదర్శనం, ఆయనకు యెహోవా అనుగ్రహం ఇంకా ఉండడమే. పౌలు, పైవిధంగా మాట్లాడిన మరుసటి రాత్రే, యేసు ఆయనతో ఇలా అన్నాడు: “ధైర్యముగా ఉండుము! యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలోకూడ సాక్ష్యమియ్యవలసియున్నది.” పౌలుకు దేవుని ఆమోదం ఉంది కాబట్టి, మనం ఆయన తన క్రైస్తవ విశ్వాసం విషయంలో రాజీపడలేదనే నిర్ధారణకు రావచ్చు.​—⁠అపొస్తలుల కార్యములు 23:⁠11.