కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మాసిడోనియాలోని అవసరతను తీర్చడం

మాసిడోనియాలోని అవసరతను తీర్చడం

మాసిడోనియాలోని అవసరతను తీర్చడం

“నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుము.” (అపొస్తలుల కార్యములు 16:9) అపొస్తలుడైన పౌలుకు దర్శనములో కనిపించిన వ్యక్తి పలికిన ఈ మాటలు, దేవుని రాజ్య సువార్తను ఒక క్రొత్త క్షేత్రంలో అంటే నేటి గ్రీస్‌లో ఉన్న నగరాల్లో ప్రకటించవలసిన అవసరతను వెల్లడి చేశాయి.

నేటి మాసిడోనియా దేశములో ప్రతి 1,840 మంది నివాసులకు కేవలం ఒక్క యెహోవాసాక్షి మాత్రమే ఉన్నాడు. అక్కడున్న చాలామంది అసలు యెహోవా దేవుని గురించే వినలేదు. అవును మాసిడోనియా నివాసులు శాంతి సందేశం వినవలసిన అవసరత ఎంతో ఎక్కువగా ఉంది.​—⁠మత్తయి 24:​14.

ఆ అవసరతను తీర్చేందుకు దేవుడు ఒక మార్గాన్ని తెరిచాడు. 2003 నవంబరులో ఒకరోజు మాసిడోనియాలోని స్కోప్యేలోవున్న యెహోవాసాక్షుల కార్యాలయానికి అనుకోకుండా మాసిడోనియన్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ నుండి ఫోన్‌ వచ్చింది. నవంబరు 20న ప్రారంభమై మూడురోజులపాటు కొనసాగే ప్రదర్శనలో సాక్షులు తమ నమ్మకాలను వివరించడానికి ఒక పుస్తకశాలను ఏర్పాటు చేయమని ఆహ్వానం అందుకున్నారు. రాజ్య సువార్తను ఎన్నడూ వినని వేలాదిమందిని చేరుకోవడానికి ఒక చక్కని అవకాశం లభించింది.

మాసిడోనియన్‌ భాషలో యెహోవాసాక్షులు ప్రచురించిన వివిధ ప్రచురణలను సిద్ధం చేయడానికి స్వచ్ఛంద సేవకులు కష్టపడి పని చేశారు. సందర్శకులు ఒకవేళ కావాలనుకుంటే ఆ ప్రచురణలను తీసుకొని వెళ్ళడానికి అనువుగా అవి ప్రదర్శించబడ్డాయి. దానివల్ల చాలామందికి నూతనోత్తేజాన్నిచ్చే ఆధ్యాత్మిక జలాలను ఉచితంగా తీసుకొని వెళ్ళే అవకాశం లభించింది.​—⁠ప్రకటన 22:⁠17.

సందర్శకులు ముఖ్యంగా తమ జీవితాలకు నేరుగా సంబంధించిన ప్రచురణలను అంటే యువత అడిగే ప్రశ్నలు​—⁠ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం), కుటుంబ సంతోషానికిగల రహస్యము * వంటి పుస్తకాలను తీసుకోవడానికి ఇష్టపడ్డారు. యెహోవాసాక్షులు తమను సందర్శించాలని కోరుతూ 98 మంది తమ చిరునామాలను ఇచ్చి వెళ్ళారు. యెహోవాసాక్షులు చేస్తున్న చక్కని పని గురించి, వారి ప్రచురణల నాణ్యత గురించి చాలామంది ప్రశంసాత్మకంగా మాట్లాడారు.

ఒక వ్యక్తి తన చిన్న కుమారుడి చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ పుస్తకశాలకు వచ్చాడు. పిల్లల కోసం ఏవైనా పుస్తకాలు ఉన్నాయా అని ఆ తండ్రి అడిగాడు. సాక్షులు అతనికి నా బైబిలు కథల పుస్తకము * చూపించారు. అతను దానిలోని పేజీలను తిరగేసి చూసి, సంతోషంగా దాని ధర ఎంతో అడిగాడు. యెహోవాసాక్షులు చేసే విద్యాపని పూర్తిగా స్వచ్ఛంద విరాళాలతోనే నడుస్తుందని అతనికి వివరించినప్పుడు అతని సంతోషం రెట్టింపయ్యింది. (మత్తయి 10:⁠8) అతను ఆ పుస్తకాన్ని తన కుమారుడికి చూపించి ఇలా అన్నాడు: “ఈ పుస్తకం ఎంత బాగుందో! నేను నీకు ప్రతీరోజు ఒక కథ చదివి వినిపిస్తాను!”

తత్త్వజ్ఞానాన్ని బోధించే ఒక ప్రొఫెసర్‌ ఆ పుస్తకశాలకు వచ్చాడు. ఆయనకు మతంపట్ల ప్రత్యేకంగా యెహోవాసాక్షుల నమ్మకాలపట్ల ఎంతో ఆసక్తి ఉంది. దేవుని కోసం మానవాళి అన్వేషణ (ఆంగ్లం) * అనే పుస్తకాన్ని తిరగేస్తూ ఆ ప్రొఫెసర్‌ ఇలా అన్నాడు: “దీనిలోని సమాచారం ఎంతో తర్కబద్ధంగా సమర్పించబడింది! విషయం ఎలా చర్చించబడాలని నేను అనుకున్నానో ఇది సరిగ్గా అలాగే చర్చించింది!” ఆ తర్వాత ఆయన పనిచేసే విద్యాలయం నుండి కొంతమంది విద్యార్థులు వచ్చి ఆ ప్రొఫెసర్‌ తీసుకున్న పుస్తకపు ప్రతులు తమకు కూడా కావాలని అడిగారు. ఆ పుస్తకాన్ని తాము కూడా అధ్యయనం చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఆయన దానిలోని విషయాలను తాను బోధించే పాఠాల్లో ఉపయోగిస్తాడని వారు అనుకున్నారు.

ఆ ప్రదర్శన కారణంగా కొంతమంది మొదటిసారిగా లేఖనాధారిత సత్యాలను తెలుసుకున్నారు. బధిరులైన యౌవనస్థులు కొంతమంది తమకు నచ్చే పుస్తకాలేమైనా ఉన్నాయేమో చూడడానికి అక్కడకు వచ్చారు. ఒక సాక్షి వారికి ఒక చిన్న ప్రసంగం ఇచ్చాడు, దానిని అక్కడే ఉన్న ఒక అమ్మాయి సంజ్ఞా భాషలోకి అనువదించి వారికి వివరించింది. జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి * అనే పుస్తకంలోని బొమ్మలను ఉపయోగిస్తూ, యేసు రోగులను, అలాగే బధిరులను కూడా బాగు చేశాడని ఆయన వివరించాడు. త్వరలోనే యేసు నేడు భూమిపై జీవిస్తున్నవారి కోసం కూడా అలాంటి అద్భుతాలు చేస్తాడని “విని” వారు ఎంతో సంతోషించారు. వారిలో చాలామంది బైబిలు ఆధారిత ప్రచురణలను సంతోషంగా స్వీకరించారు, సంజ్ఞా భాష తెలిసిన ఒక సహోదరుడు వారిని సందర్శించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి.

మాసిడోనియన్‌ భాషలోనే కాక అల్బేనియన్‌, ఆంగ్లం, టర్కిష్‌ భాషల్లో కూడా సాహిత్యాలు ప్రదర్శించబడ్డాయి. మాసిడోనియన్‌ భాషరాని ఒక వ్యక్తి ఆంగ్ల సాహిత్యం కోసం అడిగాడు. కావలికోట, తేజరిల్లు! పత్రికలను తీసుకొన్న తర్వాత, తాను టర్కిష్‌ భాష మాట్లాడతానని చెప్పాడు. సాక్షులు అతనికి అతని స్వంత భాషలో ఉన్న సాహిత్యాలను చూపించినప్పుడు అతను తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు! యెహోవాసాక్షులు ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలనుకుంటున్నారని అతను గ్రహించాడు.

ఆ సందర్భంగా ఎంతో చక్కని సాక్ష్యం ఇవ్వబడింది, ఎంతోమంది బైబిలు సత్యంపట్ల ఆసక్తి చూపించడం ఎంతో ప్రోత్సాహకరంగా అనిపించింది. అవును మాసిడోనియాలో మరి ఎక్కువమంది రాజ్య సువార్తను వినేందుకు యెహోవా ఓ మార్గాన్ని తెరిచాడు.

[అధస్సూచీలు]

^ పేరా 6 అన్నీ యెహోవాసాక్షులు ప్రచురించినవే.

^ పేరా 7 అన్నీ యెహోవాసాక్షులు ప్రచురించినవే.

^ పేరా 8 అన్నీ యెహోవాసాక్షులు ప్రచురించినవే.

^ పేరా 9 అన్నీ యెహోవాసాక్షులు ప్రచురించినవే.

[9వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

ఒక మలుపురాయి!

2003, మే 17న జరిగిన ఒక సంఘటన, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి చేయబడుతున్న కృషికి తోడయ్యింది. స్కోప్యేలో యెహోవాసాక్షుల కార్యాలయం ప్రారంభించబడి, ప్రతిష్ఠించబడింది. దాని నిర్మాణ పని రెండు సంవత్సరాలపాటు జరిగింది, ఇంతకుముందు ఉన్న కార్యాలయం కంటే అది నాలుగురెట్లు పెద్దది.

దానిలో మూడు వేర్వేరు భవనాలు ఉన్నాయి. వాటిలో కార్యనిర్వాహక కార్యాలయాలు, అనువాద కార్యాలయాలు, స్వచ్ఛంద సేవకులు ఉండడానికి గదులు, వంటగది, లాండ్రీ ఉన్నాయి. యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన గై పియర్స్‌ ప్రతిష్ఠాపన ప్రసంగం ఇచ్చాడు. పది దేశాలకు చెందిన సందర్శకులు ఆ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యారు. అందమైన ఆ కొత్త భవంతులను చూసి అందరూ సంతోషించారు.

[8, 9వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

బల్గేరియా

మాసిడోనియా

స్కోప్యే

అల్బేనియా

గ్రీస్‌

[8వ పేజీలోని చిత్రం]

స్కోప్యే, మాసిడోనియా