మీ విశ్వాసం చర్య తీసుకునేలా మిమ్మల్ని పురికొల్పుతుందా?
మీ విశ్వాసం చర్య తీసుకునేలా మిమ్మల్ని పురికొల్పుతుందా?
ఆ సైనికాధికారికి తన సేవకుడి పక్షవాతాన్ని యేసు నయం చేయగలడని పూర్తి నమ్మకం ఉంది. కానీ ఆ సైనికాధికారి యేసును తన ఇంట్లోకి ఆహ్వానించలేదు, దానికి కారణం ఆయన తాను అనర్హుడనని భావించి ఉండవచ్చు లేదా తాను అన్యుడైనందువల్ల కావచ్చు. కాబట్టి యూదుల్లోని కొందరు పెద్దలు యేసు దగ్గరికి వెళ్లి, ఆయనతో ఇలా చెప్పేలా ఆ సైనికాధికారి ఏర్పాటు చేశాడు: “ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.” యేసు తాను దూరంలో ఉండి కూడా స్వస్థపరచగలడనే విశ్వాసం ఆ సైనికాధికారికి ఉందని గ్రహించి, తనను అనుసరిస్తున్న జనసమూహంతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.”—మత్తయి 8:5-10; లూకా 7:1-10.
ఆ అనుభవం, విశ్వాసానికి సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన వాస్తవానికి ప్రత్యేక అవధానం ఇచ్చేలా మనకు సహాయం చేస్తుంది. నిజమైన విశ్వాసం కేవలం క్రియాశూన్య నమ్మకం కాదు; అది క్రియారూపకంగా కనిపించాలి. బైబిలు రచయిత యాకోబు ఇలా వివరించాడు: “విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.” (యాకోబు 2:17) విశ్వాసం క్రియలు లేనిదైతే ఏమి జరిగే అవకాశం ఉందో చూపించే నిజ జీవిత ఉదాహరణను పరిశీలించడం ద్వారా మనం ఆ వాస్తవాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
సా.శ.పూ. 1513లో ధర్మశాస్త్ర నిబంధన ద్వారా ఇశ్రాయేలు జనాంగం యెహోవాతో ఒక బంధాన్ని ఏర్పరచుకుంది. ఆ నిబంధనకు మధ్యవర్తిగా మోషే ఇశ్రాయేలీయులకు దేవుని వాక్యాన్ని ఇలా అందజేశాడు: “మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు . . . పరిశుద్ధమైన జనముగా ఉందురు.” (నిర్గమకాండము 19:3-6) అవును, ఇశ్రాయేలీయుల పరిశుద్ధత, వారి విధేయతపై ఆధారపడి ఉంది.
అనేక శతాబ్దాల తర్వాత, యూదులు ధర్మశాస్త్రంలోని సూత్రాలను అన్వయించుకోవడంకంటే, దాని అధ్యయనానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జీసస్ ద మెస్సీయ అనే తన పుస్తకంలో ఆల్‌ఫ్రెడ్ అడర్‌షీమ్ ఇలా వ్రాశాడు: “[రబ్బీలు] అంటే ‘ప్రపంచ ప్రముఖులు’ క్రియలకంటే అధ్యయనానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని పూర్వం ఎప్పుడో తీర్మానించుకున్నారు.”
నిజమే, దేవుడు కోరేవాటిని అకుంటిత దీక్షతో అధ్యయనం చేయాలని ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించబడింది. దేవుడే స్వయంగా ఇలా చెప్పాడు: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను.” (ద్వితీయోపదేశకాండము 6:6, 7) అయితే ధర్మశాస్త్రానికి అనుగుణమైన లేక అది సూచించిన క్రియలను చేయడంకంటే ధర్మశాస్త్ర అధ్యయనానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని యెహోవా ఎప్పుడైనా ఉద్దేశించాడా? మనమా విషయాన్ని పరిశీలిద్దాం.
విద్యాసంపన్నమైన అధ్యయనం
ధర్మశాస్త్ర అధ్యయనానికి అమిత ప్రాముఖ్యతను ఇవ్వడం ఇశ్రాయేలీయులకు సహేతుకమైనదిగా అనిపించి ఉండవచ్చు. ఎందుకంటే యూదులు, దేవుడు కూడా ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ప్రతీరోజు మూడు గంటలు వెచ్చిస్తాడని విశ్వసించేవారు. స్వయంగా ‘దేవుడే ధర్మశాస్త్రాన్ని క్రమంగా అధ్యయనం చేస్తే, మరి ఆయన
భూసంబంధ ప్రాణులు కూడా అధిక శ్రద్ధతో అలాగే చేయవద్దా’ అని కొందరు ఎందుకు తర్కిస్తారో మీరు అర్థం చేసుకోవచ్చు.సా.శ. మొదటి శతాబ్దానికల్లా, రబ్బీలు ధర్మశాస్త్రాన్ని విశ్లేషించడం, దాని భావం చెప్పడం వంటి వాటిలోనే మునిగి ఉండడం వారి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. యేసు ఇలా చెప్పాడు: “శాస్త్రులును పరిసయ్యులును . . . చెప్పుదురే గాని చేయరు. మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు.” (మత్తయి 23:2-4) ఆ మతనాయకులు సామాన్య ప్రజలపై అసంఖ్యాకమైన నియమ నిబంధనలు విధించారు గానీ వేషధారణతో వారు, ఆ కట్టడలను ఆచరించకుండా ఉండేందుకు తమకు అవకాశం ఇచ్చే లొసుగులను సృష్టించుకున్నారు. అంతేగాక, అకుంటిత దీక్షతో చేసే అధ్యయనంపై మనస్సు నిలిపినవారు ‘ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారు.’—మత్తయి 23:16-24.
శాస్త్రులు, పరిసయ్యులు తమ స్వనీతిని స్థాపించుకోవడానికి, తాము ఉన్నతంగా పరిగణిస్తున్నామని చెప్పుకునే ధర్మశాస్త్రాన్నే అతిక్రమించేవారిగా తయారవడం ఎంత అసంబద్ధమో కదా! ధర్మశాస్త్రంలోని పదాల గురించి, ఇతర సూక్ష్మ వివరాల గురించి శతాబ్దాలపాటు చర్చలు జరిపినా అవి వారిని దేవునికి సన్నిహితం చేయలేదు. వాటి ప్రభావం అపొస్తలుడైన పౌలు ప్రస్తావించిన “వట్టి మాటలు,” “విపరీతవాదములు,” అబద్ధ “జ్ఞానము” అని పిలిచిన వాటిలాగే పక్కదారి పట్టింది. (1 తిమోతి 6:20, 21) అయితే మరో గంభీరమైన సమస్య ఏమిటంటే, అంతులేని పరిశోధన వారిపై చూపించిన ప్రభావం. వాళ్ళు సరైన చర్య గైకొనడానికి తమను పురికొల్పేలాంటి విశ్వాసాన్ని పెంపొందించుకోలేదు.
తెలివైన బుర్రలు, అవిశ్వాస హృదయాలు
దేవుని ఆలోచనా విధానానికి, యూదా మతనాయకుల ఆలోచనా విధానానికి ఎంత తేడా ఉందో కదా! ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ఇక ప్రవేశిస్తారనగా మోషే వారికిలా చెప్పాడు: “మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మనస్సులలో పెట్టుకొని, మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనలెనని వారి కాజ్ఞాపింపవలెను.” (ద్వితీయోపదేశకాండము 32:46) కాబట్టి దేవుని ప్రజలు కేవలం ధర్మశాస్త్ర విద్వాంసులుగా కాదు గానీ దాన్ని పాటించేవారిగా ఉండాలని స్పష్టమవుతోంది.
అయితే, ఇశ్రాయేలు జనాంగం ఎన్నోసార్లు యెహోవాకు నమ్మకద్రోహం చేసింది. ఇశ్రాయేలీయులు సరైన క్రియలు చేయడానికి బదులు ‘యెహోవాను నమ్ముకొనక ఆయన మాటను వినలేదు.’ (ద్వితీయోపదేశకాండము 9:23; న్యాయాధిపతులు 2:15, 16; 2 దినవృత్తాంతములు 24:18, 19; యిర్మీయా 25:4-7) చివరికి, యూదులు మెస్సీయ అయిన యేసును నిరాకరించి అన్నిటికంటే ఘోరమైన నమ్మకద్రోహానికి పాల్పడ్డారు. (యోహాను 19:14-16) తత్ఫలితంగా, యెహోవా దేవుడు ఇశ్రాయేలును నిరాకరించి, ఇతర జనాంగాలవైపు తన అవధానాన్ని మళ్ళించాడు.—అపొస్తలుల కార్యములు 13:46.
హృదయంలో విశ్వాసం లేకున్నా తెలివైన బుర్రతో దేవుణ్ణి ఆరాధించగలమని ఆలోచిస్తూ మనం కూడా అదే ఉరిలో చిక్కుకోకుండా తప్పక జాగ్రత్త వహించాలి. మరో విధంగా చెప్పాలంటే, కేవలం జ్ఞానం సంపాదించుకోవడానికే మనం బైబిలు అధ్యయనం చేయకూడదు. ఖచ్చితమైన జ్ఞానం మన హృదయాలను చేరి మేలు చేసేవిధంగా మన జీవితాలపై ప్రభావం చూపించాలి. కూరగాయ తోట గురించి అధ్యయనం చేసి అసలు విత్తనాలే నాటకుండా ఉండడం తెలివైన పనేనా? నిజమే, అలా అధ్యయనం చేస్తే తోట పెంపకం గురించి కాస్త జ్ఞానం లభించవచ్చునేమో గానీ మనకు పంట అంటూ ఏదీ దక్కదు! అదేవిధంగా, బైబిలు అధ్యయనం ద్వారా దేవుడు కోరేవాటి గురించి తెలుసుకునే ప్రజలు సత్య విత్తనాలు తమ హృదయాన్ని చేరి అందులో వేరుపారి మొలకెత్తి చర్య తీసుకునేలా తమను పురికొల్పేందుకు అనుమతించాలి.—మత్తయి 13:3-9, 19-23.
‘వాక్యప్రకారము ప్రవర్తించువారై ఉండండి’
అపొస్తలుడైన పౌలు, “వినుట వలన విశ్వాసము కలుగును” అని చెప్పాడు. (రోమీయులు 10:17) సహజంగా జరిగే ఈ మార్పు, అంటే దేవుని వాక్యాన్ని విని ఆయన కుమారుడైన యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచడం, మనం నిత్యజీవం సంపాదించుకునేలా చేస్తుంది. అవును, ‘నేను దేవుణ్ణి, క్రీస్తును విశ్వసిస్తున్నాను’ అని చెప్పడం మాత్రమే సరిపోదు.
చర్య తీసుకొనేలా పురికొల్పగల విశ్వాసం ఉండాలని యేసు తన అనుచరులకు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు.” (యోహాను 15:8) ఆ తర్వాత, యేసుకు సవతి తమ్ముడైన యాకోబు ఇలా వ్రాశాడు: ‘మీరు వినువారు మాత్రమైయుండక వాక్యప్రకారము ప్రవర్తించువారై యుండుడి.’ (యాకోబు ) అయితే ఏమి చేయాలో మనమెలా తెలుసుకోవచ్చు? దేవుణ్ణి సంతోషపరచడానికి మనమేమి చేయాలో యేసు తన మాట ద్వారా, మాదిరి ద్వారా చూపించాడు. 1:22
యేసు భూమ్మీద ఉన్నప్పుడు రాజ్య సంబంధమైన విషయాలను పెంపొందింపజేయడానికి, తన తండ్రి నామాన్ని ఘనపరచడానికి తీవ్రంగా కృషి చేశాడు. (యోహాను 17:4-8) ఏ విధంగా? యేసు రోగులను స్వస్థపరుస్తూ చేసిన అద్భుతాలు చాలామందికి జ్ఞాపకం ఉండే ఉంటాయి. అయితే మత్తయి సువార్త ప్రాముఖ్యమైన ఒక విధానాన్ని ఇలా స్పష్టం చేస్తోంది: “యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారముచేసెను.” గమనార్హమైన విధంగా, యేసు తన పరిచర్యను కేవలం కొంతమంది స్నేహితులతో, పరిచయస్థులతో లేదా స్థానికంగా తన దగ్గరకు వచ్చినవారితో మాట్లాడడానికి మాత్రమే పరిమితం చేయలేదు. ఆయన, “గలిలయయందంతట” ఉన్న ప్రజలను కలిసి మాట్లాడడానికి తనకు అందుబాటులో ఉన్న కార్యపద్ధతులన్నీ ఉపయోగించుకుని తీవ్రంగా కృషి చేశాడు.—మత్తయి 4:23, 24; 9:35.
అలాగే యేసు, శిష్యులను చేసే పనిలో పాల్గొనేలా తన అనుచరులకు కూడా నిర్దేశమిచ్చాడు. నిజానికి, వాళ్ళు అనుకరించేలా ఆయన ఒక పరిపూర్ణమైన మాదిరి ఉంచాడు. (1 పేతురు 2:21) అందుకే యేసు తన నమ్మకమైన శిష్యులకు ఇలా చెప్పాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.”—మత్తయి 28:19, 20.
ప్రకటనా పనిలో పాల్గొనడం నిజమైన సవాలును మన ఎదుట ఉంచుతుందనే విషయం ఒప్పుకోవలసిందే. యేసు స్వయంగా ఇలా చెప్పాడు: “ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను.” (లూకా 10:3) మనకు వ్యతిరేకత ఎదురైనప్పుడు, సహజంగా మన దృక్పథం ఎలా ఉంటుందంటే, అనవసరమైన బాధ లేదా వేదన తప్పించుకోవడానికి నోరు మెదపకుండా ఉంటే సరిపోతుందని అనిపిస్తుంది. యేసు నిర్బంధించబడిన సాయంకాలం అదే జరిగింది. అపొస్తలులు భయంతో పారిపోయారు. ఆ తర్వాత, ఆ రాత్రే తనకు యేసు తెలియదని పేతురు మూడుసార్లు బొంకాడు.—మత్తయి 26:56, 69-75.
అంతేగాక, చివరికి అపొస్తలుడైన పౌలు కూడా సువార్త ప్రకటించడానికి తాను ఎంతో పోరాడానని చెప్పాడని తెలుసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆయన థెస్సలొనీకలోని సంఘానికి ఇలా వ్రాశాడు: “యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమి.”—1 థెస్సలొనీకయులు 2:1, 2.
పౌలు, ఆయన తోటి అపొస్తలులు దేవుని రాజ్యం గురించి ఇతరులతో మాట్లాడే భయాన్ని అధిగమించగలిగారు, మీరు కూడా అలాగే అధిగమించవచ్చు. ఎలా? దానికి ఒక ప్రాముఖ్యమైన చర్య ఏమిటంటే, యెహోవాపై ఆధారపడడం. మనం యెహోవాపై పూర్తి విశ్వాసం ఉంచితే, ఆ విశ్వాసం మనల్ని చర్య గైకొనడానికి పురికొల్పుతుంది, మనం ఆయన చిత్తం చేయగలుగుతాము.—అపొస్తలుల కార్యములు 4:17-20; 5:18, 27-29.
మీ క్రియలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది
యెహోవా సేవ చేయడానికి మనం చేసే కృషి ఎలాంటిదో ఆయనకు బాగా తెలుసు. ఉదాహరణకు, మనకు అనారోగ్యంగా ఉంటే లేదా మనం అలిసిపోయి ఉంటే అదీ ఆయనకు తెలుసు. మన భయాల గురించి సందేహాల గురించి కూడా ఆయనకు తెలుసు. ఆర్థిక భారాలు మనల్ని కృంగదీసినప్పుడు, మన ఆరోగ్యం లేదా భావోద్వేగాలు మనల్ని నిరుత్సాహపరచినప్పుడు, కూడా యెహోవాకు మన పరిస్థితి ఏమిటో తెలుసు.—2 దినవృత్తాంతములు 16:9; 1 పేతురు 3:12.
మనకు అపరిపూర్ణతలు, కష్టాలు ఉన్నా మన విశ్వాసం మనల్ని చర్య తీసుకునేలా పురికొల్పినప్పుడు యెహోవా ఎంతగా సంతోషిస్తాడో కదా! యెహోవాకు తన నమ్మకమైన సేవకులపట్ల నిష్ఫలమైన భావన ఏ మాత్రం లేదు, బదులుగా ఆయన వారికి ఒక వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.”—హెబ్రీయులు 6:10.
“ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు,” “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడు” అని బైబిలు యెహోవా గురించి వర్ణిస్తున్నదాన్ని మీరు నమ్మవచ్చు. (ద్వితీయోపదేశకాండము 32:4; హెబ్రీయులు 11:6) ఉదాహరణకు, అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఒక స్త్రీ ఇలా గుర్తు తెచ్చుకుంటోంది: “మా నాన్నగారు కుటుంబాన్ని ఏర్పరచుకోక ముందు పది సంవత్సరాలపాటు పూర్తికాల సేవ చేశారు. ఆయన, పరిచర్యలో యెహోవా తనను ఎలా బలపరిచాడో తెలిపే కథలు చెబుతుంటే నాకు ఎంతో సంతోషం కలిగేది. ఆయన చాలాసార్లు పరిచర్యకు వెళ్ళడానికి పెట్రోల్ నింపుకునేందుకు తన దగ్గరున్న ప్రతి పైసా ఖర్చు చేసేవారు. ఆయన పరిచర్య నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి, తరచూ తలుపు దగ్గర ఆయన కోసం ఏవో సరుకులు ఉండేవి.”
“కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు,” మనకు వస్తుపరమైన మద్దతును ఇవ్వడమే గాక భావోద్వేగ, ఆధ్యాత్మిక మద్దతును కూడా ఇస్తాడు. (2 కొరింథీయులు 1:3) గడిచిన సంవత్సరాల్లో అనేక శ్రమలు అనుభవించిన ఒక సాక్షి, ఇలా చెబుతోంది: “యెహోవాపై ఆధారపడడం మనకు ఎంతో ఊరటనిస్తుంది. యెహోవాపై నమ్మకం ఉంచి ఆయన మనకు ఎలా సహాయం చేస్తాడో చూడడానికి మనకు అవకాశాన్నిస్తుంది.” ‘ప్రార్థన ఆలకించువానికి’ వినయంగా ప్రార్థిస్తూ, మీ వ్యక్తిగత చింతలను ఆయన వింటాడనే భరోసాతో ఉండవచ్చు.—కీర్తన 65:2.
ఆధ్యాత్మిక కోతపనివారు పొందే ఆశీర్వాదాలు, ప్రతిఫలాలు అనేకం. (మత్తయి 9:37, 38) బహిరంగ పరిచర్యలో పాల్గొనడం మూలంగా అనేకులకు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చేకూరాయి, మీకు కూడా అలాగే జరగవచ్చు. అయితే అంతకంటే ప్రాముఖ్యంగా, ఇతరులకు సాక్ష్యం ఇవ్వడం దేవునితో మంచి సంబంధాన్ని బలపర్చుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.—యాకోబు 2:23.
మేలు చేస్తూ ఉండండి
దేవుని సేవకులు తాము వృద్ధాప్యంవల్ల వచ్చే బలహీనత కారణంగా పరిచర్యలో తాము చేయాలనుకున్నంతగా చేయలేకపోతే యెహోవా నిరాశ చెందుతాడని అనుకోవడం పొరపాటు. అనారోగ్యం మూలంగా, కుటుంబ బాధ్యతల మూలంగా, లేక ఇతర పరిస్థితుల మూలంగా తాము చేయాలనుకున్నంత చేయలేకపోతున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది.
అపొస్తలుడైన పౌలు ఒక అశక్తత వల్లనో అవరోధం వల్లనో బలహీనమైనప్పుడు, ‘అది తొలగిపోవాలని ముమ్మారు ప్రభువును వేడుకున్నాడు.’ యెహోవా దేవుని సేవలో ఎక్కువగా సాధించగలిగేలా పౌలును స్వస్థపరిచే బదులు ఆయన ఇలా చెప్పాడు: “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది.” (2 కొరింథీయులు 12:7-10) కాబట్టి, మీరు ఎలాంటి కష్టతరమైన పరిస్థితులను భరిస్తున్నా, ఆయనకు ఇష్టమైన విషయాలను పెంపొందింపజేయడానికి మీరు చేయగలిగినది చేసినప్పుడు మీ పరలోక తండ్రి దాన్ని విలువైనదిగా ఎంచుతాడనే నిశ్చయతతో ఉండండి.—హెబ్రీయులు 13:15, 16.
మన ప్రేమగల సృష్టికర్త మనం ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వాలని కోరడు. చర్య గైకొనడానికి పురికొల్పేలాంటి విశ్వాసంతో మనం ఉండాలని మాత్రమే ఆయన చెబుతున్నాడు.
[26వ పేజీలోని చిత్రం]
ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయడం మాత్రమే సరిపోతుందా?
[29వ పేజీలోని చిత్రాలు]
మనం మన విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి