ఎవరు పునరుత్థానం చేయబడతారు?
ఎవరు పునరుత్థానం చేయబడతారు?
“దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.”—యోహాను 5:28, 29.
దాదాపు 3,500 సంవత్సరాలకన్నా ఎక్కువకాలం క్రితం ఒక అసాధారణ సంఘటన జరిగింది. మోషే, పితరుడైన యిత్రో మందలను కాస్తున్నాడు. అప్పుడు హోరేబు కొండకు సమీపంలో మండుతున్న ఒక పొదలో మోషేకు యెహోవా దూత కనబడ్డాడు. “అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు” అని నిర్గమకాండము వివరిస్తోంది. అప్పుడు ఆ పొదలోనుండి ఒక స్వరం వినిపించింది. “నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని” ఆ స్వరం ప్రకటించింది. (నిర్గమకాండము 3:1-6) ఆ తర్వాత ఆ మాటలను, సా.శ. మొదటి శతాబ్దంలో స్వయానా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తిరిగి జ్ఞాపకం చేశాడు.
2 పునరుత్థానాన్ని నమ్మని కొంతమంది సద్దూకయ్యులతో చర్చిస్తూ యేసు ఇలా అన్నాడు: “పొదను గురించిన భాగములో—ప్రభువు అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు, మృతులు లేతురని మోషే సూచించెను; ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారు.” (లూకా 20:27, 37-38) యేసు ఆ మాటలను చెప్పడంద్వారా దేవుని దృష్టికోణంలో, పూర్వం ఎప్పుడో చనిపోయిన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని జ్ఞాపకంలో ఇంకా సజీవంగానే ఉన్నారని నొక్కిచెప్పాడు. యోబులాగే వారు కూడా తమ “యుద్ధదినములన్నియు,” అంటే తమ మరణనిద్ర ముగిసేవరకు వేచివున్నారు. (యోబు 14:14) దేవుని నూతనలోకంలో వారు పునరుత్థానం చేయబడతారు.
3 మరి మానవ చరిత్రంతటిలో చనిపోయిన వందలకోట్ల ఇతర ప్రజల విషయం ఏమిటి? వారు కూడా పునరుత్థానం చేయబడతారా? ఆ ప్రశ్నకు సంతృప్తికరమైన జవాబు పొందడానికి ముందు, మనుషులు చనిపోయినప్పుడు వారికి ఏమవుతుందో మనం దేవుని వాక్యం నుండి కనుగొందాం.
చనిపోయినవారు ఎక్కడున్నారు?
4 “చచ్చినవారు ఏమియు ఎరుగరు” అని బైబిలు ప్రకటిస్తోంది. చనిపోయినవారికి నరకాగ్ని యాతన గానీ, లింబోలో బాధ అనుభవించడం గానీ ఉండవు, బదులుగా వారు కేవలం మట్టికి తిరిగి చేరతారు. అందుకే బ్రతికి ఉన్నవారికి దేవుని వాక్యం ఇలా సలహా ఇస్తోంది: “చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు ప్రసంగి 9:5, 10; ఆదికాండము 3:19) “షియోల్” అనే పదం చాలామందికి తెలియదు. మూలం ఏమిటో స్పష్టంగా తెలియని ఒక హీబ్రూ పదం అది. చనిపోయినవారు ఇంకా సజీవంగానే ఉన్నారని అనేక మతాలు బోధిస్తాయి, కానీ ప్రేరేపిత దేవుని వాక్యం మాత్రం షియోల్‌లో ఉన్నవారు మృతులని, వారు స్పృహ లేకుండా ఉన్నారని వివరిస్తోంది. షియోల్ అంటే మానవజాతి సామాన్య సమాధి.
[“షియోల్‌లో,” NW] పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” (5 బైబిల్లో “షియోల్” అనే మాట మనకు మొట్టమొదట ఆదికాండము 37:35లో కనబడుతుంది. పితరుడైన యాకోబు తన ప్రియకుమారుడైన యోసేపు చనిపోయాడని భావించి, ఓదార్పు పొందలేక ఇలా అన్నాడు: “నేను అంగలార్చుచు మృతుల లోకమునకు [“షియోల్‌కు,” NW] నా కుమారుని యొద్దకు వెళ్లెదను.” తన కుమారుడు చనిపోయాడని నమ్మిన యాకోబు తానుకూడా చనిపోయి షియోల్‌కు చేరుకోవాలని కోరుకున్నాడు. ఆ తర్వాత, యాకోబు 9 మంది పెద్ద కుమారులు కరవునుండి బయట పడేందుకు ఆయన చిన్న కుమారుడైన బెన్యామీనును ఐగుప్తుకు తీసుకెళతామని అడిగారు. అయితే యాకోబు అందుకు నిరాకరిస్తూ వారితో ఇలా అన్నాడు: “నా కుమారుని మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి [“షియోల్‌కు,” NW] దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురు.” (ఆదికాండము 42:36, 38) ఈ రెండు సందర్భాలు మరణాన్ని ఏదోవిధమైన మరణానంతర జీవితానికి కాదుగానీ షియోల్‌కు ముడిపెడుతున్నాయి.
6 యోసేపు ఐగుప్తులో ఆహార సరఫరా అధికారి అయ్యాడని ఆదికాండములోని వృత్తాంతం వెల్లడిస్తోంది. ఆ కారణంగా యాకోబు అక్కడికి వెళ్లి తిరిగి యోసేపును ఆనందంగా కలుసుకోగలిగాడు. ఆ తర్వాత యాకోబు వృద్ధుడై 147 సంవత్సరాల వయస్సులో మరణించేంత వరకు ఆ దేశంలోనే నివసించాడు. ఆయన చివరి కోరిక ప్రకారం ఆయన కుమారులు ఆయన శవాన్ని తీసుకెళ్లి కనాను దేశములోని మక్పేలా గుహలో సమాధి చేశారు. (ఆదికాండము 47:28; 49:29-31; 50:12, 13) ఆ విధంగా, యాకోబు తన తండ్రియైన ఇస్సాకు, తాతయైన అబ్రాహాముల పక్కనే పాతిపెట్టబడ్డాడు.
‘తమ పితరులయొద్దకు చేర్చబడుట’
7 అంతకుపూర్వం యెహోవా అబ్రాహాముతో నిబంధన చేసి ఆయన సంతానం విస్తారమవుతుందని వాగ్దానం చేసినప్పుడు, అబ్రాహాముకు ఏమి జరుగుతుందో సూచించాడు. “నీవు క్షేమముగా నీ పితరులయొద్దకు పోయెదవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు” అని యెహోవా చెప్పాడు. (ఆదికాండము 15:15) ఖచ్చితంగా అలాగే జరిగింది. ఆదికాండము 25:8 ఇలా చెబుతోంది: “అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను.” ఈ పితరులు ఎవరు? ఆదికాండము 11:10-26 నోవహు కుమారుడైన షేము వరకున్న ఆయన పూర్వీకులను పేర్కొంటోంది. కాబట్టి అబ్రాహాము షియోల్‌లో అప్పటికే నిద్రిస్తున్న ఈ పితరుల వద్దకు చేర్చబడ్డాడు.
8 ‘పితరులయొద్దకు చేర్చబడుట’ అనే మాట హీబ్రూ లేఖనాల్లో తరచూ కనబడుతుంది. కాబట్టి అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు, మోషే అన్న అహరోను మరణించినప్పుడు వాళ్ళిద్దరు కూడా షియోల్‌కు చేరారు. వారు అక్కడనుండి పునరుత్థానం చేయబడతారని చెప్పడం న్యాయబద్ధమే. (ఆదికాండము 25:17; సంఖ్యాకాండము 20:23-29) అదే ప్రకారం, మోషే సమాధి ఎక్కడ ఉందో ఎవరికీ తెలియకపోయినా ఆయన కూడా షియోల్‌కే చేరుకున్నాడు. (సంఖ్యాకాండము 27:13; ద్వితీయోపదేశకాండము 34:5, 6) అలాగే మోషే తర్వాత ఇశ్రాయేలుకు నాయకుడైన యెహోషువ, ఆయనతోపాటు ఆ తరము వారందరూ మరణించి షియోల్‌కు చేరుకున్నారు.—న్యాయాధిపతులు 2:8-10.
9 ఆ తర్వాత అనేక శతాబ్దాలకు దావీదు ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజయ్యాడు. మరణించినప్పుడు ఆయన ‘తన పితరులతో కూడ నిద్రించాడు.’ (1 రాజులు 2:10) ఆయన కూడా షియోల్‌కు చేరుకున్నాడా? ఆసక్తికరమైన విషయమేమిటంటే, సా.శ. 33 పెంతెకొస్తునాడు అపొస్తలుడైన పేతురు దావీదు మరణాన్ని ప్రస్తావిస్తూ, “నీవు నా ఆత్మను పాతాళములో [“షియోల్‌లో,” NW] విడిచిపెట్టవు” అనే మాటలున్న కీర్తన 16:10ని ఉల్లేఖించాడు. దావీదు ఇంకా సమాధిలోనే ఉన్నాడని పేర్కొన్న తర్వాత, పేతురు ఆ మాటలను యేసుకు అన్వయిస్తూ, “క్రీస్తు పాతాళములో [“హేడిస్‌లో,” NW] విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము” అని సూచించాడు. (అపొస్తలుల కార్యములు 2:29-32) పేతురు ఇక్కడ, “షియోల్” అనే హీబ్రూ పదానికి సమానార్థక గ్రీకు పదమైన “హేడిస్”ను ఉపయోగించాడు. కాబట్టి హేడిస్‌లో ఉన్నారని చెప్పబడిన వారు కూడా షియోల్‌లో ఉన్నారని చెప్పబడిన వారి స్థితిలోనే ఉన్నారు. వారు నిద్రిస్తూ, పునరుత్థానం కోసం వేచి ఉన్నారు.
షియోల్‌లో అనీతిమంతులు ఉన్నారా?
10 మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తునుండి బయటకు నడిపించిన తర్వాత, అరణ్యంలో కొందరు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటుకు కారకులైన కోరహు, దాతాను, అబీరాముల నుండి దూరంగా వెళ్ళమని మోషే ప్రజలకు చెప్పాడు. వారు ఘోరంగా మరణిస్తారు. మోషే ఇలా వివరించాడు: “మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందినయెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో [“షియోల్‌లో,” NW] కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మ్రింగి వేసినయెడల వారు యెహోవాను అలక్ష్యముచేసిరని మీకు తెలియును.” (సంఖ్యాకాండము 16:29, 30) కాబట్టి భూమి నోరు తెరచి వారిని మ్రింగివేసినా లేక కోరహు, 250 మంది లేవీయుల విషయంలో జరిగినట్లు అగ్ని వారిని దహించివేసినా ఆ తిరుగుబాటుదారులందరూ షియోల్‌లో లేదా హేడిస్‌లో కూరుకుపోయారు.—సంఖ్యాకాండము 26:10.
11 దావీదు రాజును శపించిన షిమీ, దావీదు వారసుడైన సొలొమోను చేతిలో శిక్ష అనుభవించాడు. “వానిని నిర్దోషిగా ఎంచవద్దు; నీవు సుబుద్ధిగలవాడవు గనుక వానినేమి చేయవలెనో అది నీకు తెలియును; వాని నెరసిన తలవెండ్రుకలు రక్తముతో సమాధికి [“షియోల్‌కు,” NW] దిగజేయుము” అని దావీదు ఆజ్ఞాపించాడు. బెనాయా ద్వారా సొలొమోను ఆ శిక్షను అమలు చేశాడు. (1 రాజులు 2:8, 9, 44-46) ఇశ్రాయేలు మాజీ సైనికాధికారి యోవాబు కూడా బెనాయా కత్తివాతకు గురయ్యాడు. అతని నెరసిన తలవెండ్రుకలు ‘సమాధికి [“షియోల్‌కు,” NW] నెమ్మదిగా దిగలేదు.’ (1 రాజులు 2:5, 6, 28-34) ఈ రెండు ఉదాహరణలు కూడా, దావీదు ప్రేరేపిత కీర్తనలోని ఈ సత్యత్వాన్ని నిరూపిస్తున్నాయి: “దుష్టులును దేవుని మరచు జనులందరును పాతాళమునకు [“షియోల్‌కు,” NW] దిగిపోవుదురు.”—కీర్తన 9:17.
12 అహీతోపెలు దావీదు వ్యక్తిగత సలహాదారు. ఆయన ఆలోచన, యెహోవా నుండి వచ్చిన సలహావలే విలువైనదిగా పరిగణించబడేది. (2 సమూయేలు 16:23) అయితే విచారకరంగా, ఈ నమ్మినబంటు విశ్వాసఘాతకునిగా మారి దావీదు కుమారుడైన అబ్షాలోము పన్నిన కుట్రలో పాలుపంచుకున్నాడు. దావీదు స్పష్టంగా ఈ నమ్మకద్రోహాన్నే ప్రస్తావిస్తూ ఇలా వ్రాశాడు: “నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చును నామీద మిట్టిపడువాడు నాయందు పగపట్టిన వాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును.” దావీదు ఇంకా ఇలా అన్నాడు: “వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక, సజీవులుగానే వారు పాతాళమునకు [“షియోల్‌కు,” NW] దిగిపోవుదురు గాక; చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమునందును ఉన్నది.” (కీర్తన 55:12-15) మరణించిన తర్వాత అహీతోపెలు అతని సహచరులు షియోల్‌కు దిగిపోయారు.
గెహెన్నాలో ఎవరున్నారు?
13 గొప్ప దావీదు అయిన యేసుకు ఎదురైన అనుభవంతో దావీదు పరిస్థితిని పోల్చండి. యేసు 12మంది అపొస్తలుల్లో ఒకడైన యూదా ఇస్కరియోతు అహీతోపెలులాగే నమ్మకద్రోహి అయ్యాడు. యూదా చేసిన నమ్మకద్రోహం అహీతోపెలు చేసిన దానికన్నా మరీ ఘోరమైనది. యూదా దేవుని అద్వితీయ కుమారునికే ద్రోహం తలపెట్టాడు. తన భూసంబంధ పరిచర్య ముగింపులో చేసిన ప్రార్థనలో దేవుని కుమారుడు తన అనుచరుల గురించి ఇలా నివేదించాడు: “నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.” (యోహాను 17:12) యూదాను “నాశన పుత్రుడు” అని ప్రస్తావిస్తూ, యూదా చనిపోయినప్పుడు అతనికి పునరుత్థాన నిరీక్షణ ఉండదని యేసు సూచించాడు. అతను దేవుని జ్ఞాపకంలో సజీవునిగా లేడు. అతను షియోల్‌కు కాదుగానీ గెహెన్నాకే వెళ్లాడు. అయితే ఈ గెహెన్నా అంటే ఏమిటి?
14 యేసు తన కాలంలోని మతనాయకులను ఖండించాడు, ఎందుకంటే వాళ్లు తమ శిష్యుల్లో ప్రతీ ఒక్కరిని ‘నరకపాత్రునిగా [“గెహెన్నాకు పాత్రునిగా,” NW] చేశారు.’ (మత్తయి 23:15) చెత్తా చెదారం పడేసే కసువు దొడ్డిగా ఉపయోగించబడిన హిన్నోము లోయ గురించి ఆ కాలంనాటి ప్రజలకు తెలుసు. మరణశిక్ష విధించబడి సమాధికి అనర్హులుగా పరిగణించబడిన నేరస్థుల కళేబరాలను ఆ లోయలో పడేసేవారు. అంతకుముందు, యేసే స్వయంగా తన కొండమీది ప్రసంగంలో గెహెన్నా గురించి మాట్లాడాడు. (మత్తయి 5:29, 30) * దాని సూచనార్థక భావం ఆయన శ్రోతలకు స్పష్టమైంది. ఎలాంటి పునరుత్థాన నిరీక్షణాలేని సంపూర్ణ నాశనానికి గెహెన్నా ప్రతీకగా ఉంది. యేసు కాలంనాటి యూదా ఇస్కరియోతే కాక, ఇతరులెవరైనా మరణించినప్పుడు షియోల్‌కు లేదా హేడిస్‌కు వెళ్ళే బదులు గెహెన్నాకు వెళ్ళారా?
15 మొదటి మానవులైన ఆదాము హవ్వలు పరిపూర్ణంగా సృష్టించబడ్డారు. వారు ఉద్దేశపూర్వకంగా పాపం చేశారు. ఎంచుకోవడానికి వారి ఎదుట నిత్యజీవం, మరణం రెండూ ఉన్నాయి. వారు దేవునికి అవిధేయులై సాతాను పక్షం వహించారు. వారు చనిపోయినప్పుడు, క్రీస్తు విమోచనా
క్రయధన బలినుండి ప్రయోజనం పొందే ఎలాంటి ఉత్తరాపేక్షా వారికి లేదు. బదులుగా వారు గెహెన్నాకు వెళ్ళారు.16 ఆదాము మొదటి కుమారుడు కయీను తన తమ్ముడైన హేబెలును హత్యచేసి, ఆ తర్వాత తప్పించుకు తిరిగేవానిగా జీవించాడు. అపొస్తలుడైన యోహాను, కయీనును “దుష్టుని సంబంధి” అని వర్ణించాడు. (1 యోహాను 3:12) కాబట్టి కయీను కూడా మరణించినప్పుడు తన తల్లిదండ్రుల్లాగే గెహెన్నాకు చేరాడని చెప్పడం సహేతుకమే. (మత్తయి 23:33, 35) నీతిమంతుడైన హేబెలు పరిస్థితికి ఇదెంత భిన్నమైన పరిస్థితో కదా! “విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను” అని వివరిస్తూ పౌలు ఇంకా ఇట్లన్నాడు: “అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు.” (హెబ్రీయులు 11:4) అవును, హేబెలు పునరుత్థాన నిరీక్షణతో ఇప్పుడు షియోల్‌లో ఉన్నాడు.
“శ్రేష్ఠమైన,” “మొదటి” పునరుత్థానం
17 ఈ సమాచారం చదివే చాలామంది ఈ “అంత్యకాలము”లో చనిపోయేవారి పరిస్థితి గురించి ఆలోచిస్తారు. (దానియేలు 8:19) ప్రకటన 6వ అధ్యాయం, ఈ కాలంలో స్వారీ చేస్తున్న నలుగురు గుర్రపు రౌతులను వర్ణిస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, వీరిలో చివరి గుర్రపు రౌతు పేరు మృత్యువు, అతనిని హేడిస్ వెంబడిస్తోంది. కాబట్టి ముందు వెళ్తున్న గుర్రపు రౌతుల క్రియల కారణంగా అకాల మరణం చెందిన అనేకులు హేడిస్‌కు చేరుకుని దేవుని నూతనలోకంలో పునరుత్థానం చేయబడడం కోసం ఎదురుచూస్తారు. (ప్రకటన 6:8) కాబట్టి షియోల్‌కు (హేడిస్‌కు) చేరుకున్న వారికి ఎలాంటి ఉత్తరాపేక్ష ఉంది, గెహెన్నాకు వెళ్ళినవారికి ఏమి జరుగుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే, ముందు పేర్కొన్నవారు పునరుత్థానం పొందుతారు, తర్వాత పేర్కొన్నవారు నిత్య నాశనం అంటే ఉనికిలో లేకుండా పోతారు.
18 అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.” క్రీస్తు సహపరిపాలకులుగా ఉండేవారు “మొదటి పునరుత్థానములో” పాలుపంచుకుంటారు, అయితే మిగిలిన మానవులకు ఏ నిరీక్షణ ఉంది?—ప్రకటన 20:6.
19 దేవుని సేవకులైన ఏలియా, ఎలీషాల కాలంనుండి పునరుత్థాన అద్భుతం ప్రజలను తిరిగి బ్రతికించింది. “స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి” అని పౌలు గుర్తుచేశాడు. అవును, ఈ నమ్మకమైన యథార్థవంతులు, కేవలం మరికొన్ని సంవత్సరాల్లోనే చనిపోవడానికి కాదుగానీ నిత్యజీవ ఉత్తరాపేక్షగల పునరుత్థానం కోసం ఎదురుచూశారు. అది నిజంగా “మరి శ్రేష్ఠమైన పునరుత్థానము.”—హెబ్రీయులు 11:35.
20 ఈ దుష్ట విధానాన్ని యెహోవా నాశనం చేయకముందే మనమొకవేళ నమ్మకంగా ఉండి మరణిస్తే, మనకు తప్పకుండా “మరి శ్రేష్ఠమైన పునరుత్థానము” అంటే నిత్యజీవమనే నిరీక్షణగల పునరుత్థానం లభిస్తుంది. యేసు ఇలా వాగ్దానం చేశాడు: “దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.” (యోహాను 5:28, 29) మన తర్వాతి ఆర్టికల్ ఆ పునరుత్థాన సంకల్పాన్ని మరింతగా పరిశీలిస్తుంది. అది, మనం యథార్థవంతులుగా ఉండడానికి పునరుత్థాన నిరీక్షణ మనల్ని ఎలా బలపరుస్తుందో, స్వయం త్యాగ స్ఫూర్తిని వృద్ధి చేసుకోవడానికి ఎలా సహాయం చేస్తుందో వివరిస్తుంది.
[అధస్సూచి]
^ పేరా 20 తెలుగు పరిశుద్ధ గ్రంథములో గ్రీకు పదమైన “గెహెన్నా” నరకము అని అనువదించబడింది.
మీరు జ్ఞాపకం చేసుకోగలరా?
• యెహోవా “సజీవులకే” దేవుడు అని ఎందుకు వర్ణించబడ్డాడు?
• షియోల్‌కు చేరుకున్నవారి పరిస్థితి ఏమిటి?
• గెహెన్నాలో ఉన్నవారికి ఏమి జరుగుతుంది?
• “మరి శ్రేష్ఠమైన పునరుత్థానము” నుండి కొందరు ఎలా ప్రయోజనం పొందుతారు?
[అధ్యయన ప్రశ్నలు]
1. మండుతున్న పొద దగ్గర మోషే ఎలాంటి అసాధారణ ప్రకటన విన్నాడు, తర్వాత ఆ మాటలను తిరిగి ఎవరు జ్ఞాపకం చేశారు?
2, 3. (ఎ) అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఎలాంటి ప్రతిఫలం వేచి ఉంది? (బి) ఎలాంటి ప్రశ్నలు ఉత్పనమవుతాయి?
4. (ఎ) ప్రజలు చనిపోయినప్పుడు ఎక్కడికి చేరతారు? (బి) షియోల్ అంటే ఏమిటి?
5, 6. యాకోబు మరణించినప్పుడు ఎక్కడికి చేరుకున్నాడు, ఆయన ఎక్కడ పాతిపెట్టబడ్డాడు?
7, 8. (ఎ) అబ్రాహాము మరణించి ఎక్కడకు చేరుకున్నాడు? వివరించండి. (బి) ఇతరులు మరణించినప్పుడు వారుకూడా షియోల్‌కు చేరుకున్నారని ఏది చూపిస్తోంది?
9. (ఎ) హీబ్రూ పదమైన “షియోల్,” గ్రీకు పదమైన “హేడిస్” ఈ రెండూ ఒకే స్థలాన్ని సూచిస్తున్నాయని బైబిలు ఎలా చూపిస్తోంది? (బి) షియోల్‌లో లేదా హేడిస్‌లో ఉన్నవారికి ఎలాంటి భావి నిరీక్షణ ఉంది?
10, 11. అనీతిమంతులు కొందరు మరణించినప్పుడు షియోల్‌కు లేదా హేడిస్‌కు చేరతారని మనమెందుకు చెప్పవచ్చు?
12. అహీతోపెలు ఎవరు, అతను చనిపోయినప్పుడు ఎక్కడికి దిగిపోయాడు?
13. యూదా “నాశన పుత్రుడు” అని ఎందుకు పిలవబడ్డాడు?
14. గెహెన్నా దేనికి ప్రతీకగా ఉంది?
15, 16. మరణించినప్పుడు గెహెన్నాకు ఎవరు వెళ్లారు, అయితే వారు గెహెన్నాకు ఎందుకు వెళ్ళారు?
17. (ఎ) “అంత్యకాలము”లో ఎవరు షియోల్‌కు చేరతారు? (బి) షియోల్‌లో ఉన్నవారికి ఎలాంటి ఉత్తరాపేక్ష ఉంది, గెహెన్నాకు వెళ్ళినవారికి ఏమి జరుగుతుంది?
18. “మొదటి పునరుత్థానము” ఎలాంటి ఉత్తరాపేక్షను ఇస్తుంది?
19. కొందరు “మరి శ్రేష్ఠమైన పునరుత్థానము” నుండి ఎలా ప్రయోజనం పొందుతారు?
20. తర్వాతి ఆర్టికల్ దేనిని పరిశీలిస్తుంది?
[15వ పేజీలోని చిత్రం]
అబ్రాహాములాగే షియోల్‌కు చేరుకునేవారు పునరుత్థానం చేయబడతారు
[16వ పేజీలోని చిత్రాలు]
ఆదాము, హవ్వ, కయీను, యూదా ఇస్కరియోతు గెహెన్నాకు ఎందుకు వెళ్ళారు?