కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేను బలహీనుడనే అయినా బలవంతుడను

నేను బలహీనుడనే అయినా బలవంతుడను

జీవిత కథ

నేను బలహీనుడనే అయినా బలవంతుడను

లెయొపోల్ట్‌ ఇంగ్‌లైట్న్‌ చెప్పినది

ఆ ఎస్‌.ఎస్‌. అధికారి తన పిస్తోలును బయటకు తీసి, నా తల దగ్గర పెట్టి, “నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నావా?” అని అడిగాడు. “నువ్వు మారే మనిషివి కాదు కాబట్టి నిన్ను కాల్చి పారేయడమే మంచిది” అన్నాడు. నా స్వరంలో బెదురు లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ “అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను” అని చెప్పి, కళ్ళు మూసుకొని, ఊపిరి బిగబట్టి అతను పిస్తోలు కాల్చడం కోసం ఎదురు చూశాను, కానీ ఏమీ జరగలేదు. అతను నా తల దగ్గరనుండి పిస్తోలును వెనక్కి తీసుకుంటూ “నువ్వు చావడానికి కూడా పనికిరాని మూర్ఖుడివి!” అని గట్టిగా అరిచాడు. అంతటి ప్రమాదకరమైన పరిస్థితిలో నేను ఎలా చిక్కుకున్నాను?

నేను ఆస్ట్రియన్‌ ఆల్ప్స్‌ పర్వతాల మధ్య ఉన్న ఐజెన్‌ఫోగల్‌హ్యూబ్‌ పట్టణంలో 1905, జూలై 23న జన్మించాను. మా నాన్న రంపపుమిల్లులో పనిచేసేవాడు, మా అమ్మ స్థానిక రైతు కూతురు, నేను వారికి పుట్టిన పిల్లల్లో పెద్దవాడిని. నా తల్లిదండ్రులు పేదవారే అయినా చాలా కష్టపడి పనిచేసేవారు. నా బాల్యమంతా సాల్స్‌బర్గ్‌కు దగ్గర్లోని బాటిషెల్‌ పట్టణంలో గడిచింది. అది అందమైన చెరువులు, కొండల మధ్యవున్న పట్టణం.

నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు, జీవితంలో కొందరు ఎందుకు ఇన్ని బాధలు అనుభవిస్తారు అని ఆలోచించేవాడిని. నేను అలా ఆలోచించింది కేవలం నా కుటుంబం పేదరికాన్ని అనుభవిస్తున్నందుకే కాక, నాకు పుట్టుకతోనే వెన్నెముక కొంచెం వంకరగా ఉన్నందువల్ల కూడా. ఆ లోపంవల్ల కలిగే నడుము నొప్పి కారణంగా నేను నిటారుగా నించోవడం కూడా కష్టమయ్యేది. పాఠశాలలో నన్ను శరీర వ్యాయామాల్లో పాల్గొనడానికి అనుమతించేవారు కాదు, ఆ కారణంగా నా తోటి విద్యార్థులు నన్ను ఎగతాళి చేసేవారు.

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేసరికి, ఇంకా 14 సంవత్సరాలు కూడా నిండని నేను పేదరికం నుండి బయటపడడానికి ఉద్యోగం చేయడం ప్రారంభిస్తే మంచిదని నిర్ణయించుకున్నాను. ఆకలి మంటలు నా నిత్య సహవాసులుగా ఉండేవి, కోట్లాదిమంది ప్రాణాలను బలిగొన్న స్పానిష్‌ ఫ్లూ కారణంగా పదేపదే వచ్చే విపరీతమైన జ్వరంతో నేను మరింత బలహీనంగా తయారయ్యాను. నేను పని కోసం వెళ్ళినప్పుడు చాలామంది రైతులు, “నీలాంటి బలహీనుడికి మా దగ్గరేమి పనుంటుంది?” అనేవారు. అయితే ఒక దయగల రైతు మాత్రం నన్ను పనిలో చేర్చుకున్నాడు.

దేవుని ప్రేమ గురించి తెలుసుకొని సంతోషించడం

మా అమ్మ నిష్ఠగల క్యాథలిక్‌ అయినా నేను చాలా అరుదుగా చర్చికి వెళ్ళేవాడిని, దానికి ముఖ్య కారణం మా నాన్నే, ఆయనకు మతంపట్ల మరింత విశాలమైన దృక్కోణాలు ఉండేవి. నేను మాత్రం రోమన్‌ క్యాథలిక్‌ చర్చిలో ఎంతో విస్తృతంగా ఉండే విగ్రహారాధనను చూసి చాలా కలత చెందేవాడిని.

1931 అక్టోబరులో ఒకరోజు, బైబిలు విద్యార్థులు (అప్పట్లో యెహోవాసాక్షులు అలా పిలవబడేవారు) నిర్వహించే కూటానికి తనతోపాటు రమ్మని నా స్నేహితుడు నన్ను అడిగాడు. విగ్రహాలను ఆరాధించడం దేవునికి ఇష్టమేనా? (నిర్గమకాండము 20:4, 5) అగ్నితో మండుతూ ఉండే నరకం ఉందా? (ప్రసంగి 9:5) మృతులు పునరుత్థానం చేయబడతారా? వంటి ప్రాముఖ్యమైన ప్రశ్నలకు అక్కడ నాకు బైబిలు నుండి సమాధానాలు లభించాయి.​—⁠యోహాను 5:28, 29.

దేవుని పేరిట మానవుడు రక్తపాతంతో నిండిన యుద్ధాలు చేసినప్పటికీ, ఆయన మాత్రం వాటిని ఆమోదించడు అనే విషయం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. “దేవుడు ప్రేమాస్వరూపి” అని, ఆయనకు యెహోవా అనే ఉన్నతమైన నామం ఉందని నేను తెలుసుకున్నాను. (1 యోహాను 4:8; కీర్తన 83:18) యెహోవా రాజ్యం ద్వారా మానవులు భూవ్యాప్త పరదైసులో నిరంతరం సంతోషంగా జీవించగలుగుతారు అని తెలుసుకొని నేనెంతో పులకరించిపోయాను. దేవుడు ఎంపిక చేసుకున్న కొంతమంది అపరిపూర్ణ మానవులకు ఆయన పరలోక రాజ్యంలో యేసుతోపాటు పరిపాలించే అద్భుతమైన ఉత్తరాపేక్ష ఉందని కూడా నేను తెలుసుకున్నాను. ఆ రాజ్యం కోసం నా జీవితాన్నంతా ధారపోయడానికి నేను సిద్ధపడ్డాను. కాబట్టి 1932 మే నెలలో నేను బాప్తిస్మం తీసుకొని యెహోవాసాక్షినయ్యాను. ఆ సమయంలో పూర్తిగా రోమన్‌ క్యాథలిక్‌ దేశంగా ఉన్న ఆస్ట్రియాలోని మత వివక్ష కారణంగా బాప్తిస్మం తీసుకోవడానికి నాకు చాలా ధైర్యం అవసరమయ్యింది.

తిరస్కారాన్ని, వ్యతిరేకతను ఎదుర్కోవడం

నేను చర్చిని విడిచిపెట్టినప్పుడు నా తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు, ప్రీస్టు వెంటనే వేదికపైనుండి ఆ వార్తను అందరికీ తెలియజేశాడు. మా పొరుగువాళ్ళు తమ తిరస్కారాన్ని చూపించడానికి నా ముందు నేలపై ఉమ్మేవారు. అయినా కూడా నేను పూర్తికాల సేవకుడిని కావాలని నిర్ణయించుకున్నాను, దానితో 1934 జనవరిలో నేను పయినీరు సేవ ప్రారంభించాను.

మా ప్రాంతంలో నాజీ పార్టీ అధికారం ఎక్కువవుతున్న కొద్దీ రాజకీయ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా తయారయ్యింది. ఎన్స్‌ అనే స్టిరియన్‌ లోయలో నేను పయినీరు సేవ చేసేటప్పుడు పోలీసులు ఎప్పుడూ నన్ను వెంబడిస్తూ ఉండేవారు, నేను ‘పామువలె వివేకంతో’ ప్రవర్తించవలసి వచ్చేది. (మత్తయి 10:16) 1934 నుండి 1938 వరకూ హింస నా అనుదిన జీవితంలో విడదీయరాని భాగంగా తయారయ్యింది. నాకు ఉద్యోగం లేకపోయినా, నిరుద్యోగ భృతి మాత్రం లభించేది కాదు, నా ప్రకటనా పని కారణంగా నాకు ఎన్నోసార్లు స్వల్పకాల జైలు శిక్షలు, నాలుగుసార్లు దీర్ఘకాల శిక్షలు విధించబడ్డాయి.

హిట్లర్‌ దళాలు ఆస్ట్రియాను ఆక్రమించుకోవడం

1938 మార్చిలో హిట్లర్‌ దళాలు ఆస్ట్రియాను ఆక్రమించుకున్నాయి. కొద్ది రోజుల్లోపే 90,000 కంటే ఎక్కువమంది, అంటే వయోజనుల జనాభాలో దాదాపు 2 శాతంమంది అరెస్టు చేయబడి, నాజీ పరిపాలనను వ్యతిరేకిస్తున్నారనే ఆరోపణలతో జైళ్ళకు, నిర్బంధ శిబిరాలకు పంపించబడ్డారు. ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి యెహోవాసాక్షులు సిద్ధంగానే ఉన్నారు. 1937 వేసవిలో నేను ఇంతకుముందు సహవసించిన సంఘంనుండి చాలామంది సభ్యులు సైకిలు తొక్కుకుంటూ 350 కిలోమీటర్లు ప్రయాణించి ప్రేగ్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యారు. అక్కడ వారు జర్మనీలోని తోటి విశ్వాసులకు వ్యతిరేకంగా జరుగుతున్న దారుణకృత్యాల గురించి విన్నారు. ఆ తర్వాత మా వంతు వచ్చింది.

హిట్లర్‌ దళాలు ఆస్ట్రియాలో అడుగుపెట్టిన రోజు నుండి యెహోవాసాక్షుల కూటాలు వారి కార్యకలాపాలు రహస్యంగా జరుపుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. స్విట్జర్లాండ్‌నుండి సాహిత్యాలు రహస్యంగా తీసుకురాబడినా, అవి అందరికీ సరిపోయేవి కాదు. కాబట్టి వియన్నాలోని తోటి క్రైస్తవులు రహస్యంగా సాహిత్యాలను ముద్రించేవారు. అలా ముద్రించబడిన సాహిత్యాలను సాక్షులకు అందజేస్తూ నేను తరచూ కొరియర్‌లా పని చేసేవాడిని.

నిర్బంధ శిబిరానికి

1939, ఏప్రిల్‌ 4వ తేదీన మేము బాటిషెల్‌లో క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకుంటున్నప్పుడు రహస్య పోలీసులు వచ్చి నన్ను, మరో ముగ్గురు సహోదరులను అరెస్టు చేశారు. మా అందరిని కారులో ఎక్కించుకొని లిన్జ్‌లో ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్ళారు. నేను కారులో ప్రయాణించడం అదే మొదటిసారి, కానీ అప్పుడు దాన్ని ఆనందించే స్థితిలో నేను లేను. లిన్జ్‌లో నన్ను పదేపదే ప్రశ్నిస్తూ క్రూరంగా హింసించారు, అయినా నేను నా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఐదునెలల తర్వాత నన్ను అప్పర్‌ ఆస్ట్రియా న్యాయాధిపతి ఎదుట ప్రవేశపెట్టారు. నేను ఊహించని విధంగా నాపై చేయబడిన నేరారోపణలు హఠాత్తుగా తొలగించబడ్డాయి; అయితే దానితోనే నా కష్టాలు అంతమవలేదు. ఈ లోపు మిగతా ముగ్గురు సహోదరులు నిర్బంధ శిబిరాలకు పంపించబడ్డారు, అక్కడ వారు చివరివరకూ నమ్మకంగా ఉండి మరణించారు.

నన్ను కస్టడీలోనే ఉంచి, 1939 అక్టోబరు 5న, నన్ను జర్మనీలోని బుచెన్వాల్డ్‌ నిర్బంధ శిబిరానికి తరలిస్తున్నామని తెలియజేశారు. ఖైదీలుగా ఉన్న మా కోసం లిన్జ్‌ రైల్వే స్టేషనులో ఒక ప్రత్యేక రైలు సిద్ధంగా ఉంది. ఆ రైలు పెట్టెల్లో ఇద్దరిద్దరు ఖైదీలు ఉండడానికి చిన్న చిన్న గదుల్లాంటివి ఏర్పాటు చేయబడ్డాయి. నాతోపాటు అలాంటి ఒక గదిలో ఉన్న వ్యక్తి మరెవరో కాదు, అప్పర్‌ ఆస్ట్రియా మాజీ గవర్నరు డా. హెన్రిక్‌ గ్లీసెనర్‌.

డా. గ్లీసెనర్‌కు నాకు మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఆయన నా పరిస్థితిని చూసి నిజంగా బాధపడ్డాడు, తను అధికారంలో ఉన్నప్పుడు కూడా తన ప్రాంతంలో యెహోవాసాక్షులు ఎన్నో చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వచ్చినందుకు ఆయన ఎంతో బాధపడ్డాడు. ఆయన చింతిస్తూ ఇలా అన్నాడు: “ఇంగ్‌లైట్న్‌గారు, జరిగిన తప్పులను నేను సరిచేయలేను, కానీ వాటికి నేను క్షమాపణ మాత్రం చెప్పగలను. మా ప్రభుత్వం సరైన న్యాయాన్ని అందజేయలేకపోయిందని అనిపిస్తోంది. మీకు ఎప్పుడైనా ఎలాంటి సహాయమైనా అవసరమైతే, నేను చేయగలిగినదంతా చేయడానికి సంతోషిస్తాను.” యుద్ధం ముగిసిన తర్వాత మేము మరోసారి కలుసుకున్నాము. ఆయన నాజీ పరిపాలన బాధితుల కోసం ప్రభుత్వం ఇచ్చే రిటైర్‌మెంట్‌ డబ్బును పొందేలా నాకు సహాయం చేశాడు.

“నేను నిన్ను కాల్చి చంపుతాను”

1939, అక్టోబరు 9న నేను బుచెన్వాల్డ్‌ నిర్బంధ శిబిరానికి చేరుకున్నాను. కొద్ది రోజుల తర్వాత, శిబిరంలోని జైలు అధికారికి, కొత్తగా వచ్చిన ఖైదీలలో ఒక యెహోవాసాక్షి కూడా ఉన్నాడనే సమాచారం అందింది, దానితో నేను అతని గురిగా మారాను. అతను నన్ను క్రూరంగా కొట్టాడు. నేను నా విశ్వాసాన్ని వదులుకొనేలా తాను చేయలేనని గ్రహించినప్పుడు అతను ఇలా అన్నాడు: “ఇంగ్‌లైట్న్‌, నేను నిన్ను కాల్చి చంపుతాను. కానీ అలా చేసేముందు, నువ్వు నీ తల్లిదండ్రులకు ఒక వీడ్కోలు ఉత్తరం వ్రాయడానికి అనుమతిస్తాను.” నేను నా తల్లిదండ్రులకు వ్రాయగల ఓదార్పుకరమైన మాటల గురించి ఆలోచించాను, కానీ నేను వాటిని వ్రాయడానికి కలం పేపరుపై పెట్టిన ప్రతీసారి అతను నా కుడి మోచేతిని కొట్టాడు, దానివల్ల నేను సరిగ్గా వ్రాయలేకపోయాను. అతను నన్ను ఇలా ఎగతాళి చేశాడు: “ఎంత మూర్ఖుడో! కనీసం రెండు వాక్యాలను కూడా సరిగ్గా వ్రాయలేడు. అయితేనేం బైబిలు చదవడానికి మాత్రం సిద్ధమైపోతాడు.”

ఆ తర్వాత ఆ అధికారి తన పిస్తోలు తీసి, నా తల దగ్గర ఉంచి, నేను పైన వివరించినట్లుగా నన్ను కాల్చి చంపుతానని బెదిరించాడు. ఆ తర్వాత అతను నన్ను అప్పటికే చాలామంది ఖైదీలతో కిక్కిరిసిపోయి ఉన్న చిన్న గదిలోకి తోశాడు. నేను ఆ రాత్రంతా నిలబడే ఉండాల్సి వచ్చింది. ఒకవేళ పడుకోవడానికి స్థలం ఉన్నా నాకు నిద్ర పట్టేది కాదేమో, ఎందుకంటే నా ఒళ్ళంతా విపరీతమైన నొప్పులతో ఉంది. “ఒక మూఢత్వపు మతం కోసం చనిపోవడం వ్యర్థం!” అనే మాటలే నా తోటి ఖైదీలు నాకు ఇచ్చిన “ఓదార్పు.” డా. గ్లీసెనర్‌ పక్క గదిలోనే ఉన్నాడు. నేనున్న గదిలో జరుగుతున్నదంతా ఆయన విని, ఇలా అన్నాడు: “క్రైస్తవులను హింసించడం మళ్ళీ ప్రారంభమయ్యింది!”

1940 వేసవి కాలంలో ఒక ఆదివారం ఖైదీలందరూ రాళ్ళగనిలో పనిచేయడానికి రావాలని ఆదేశించబడింది. సాధారణంగా ఆదివారాలు మాకు సెలవు రోజు, అయితే కొంతమంది ఖైదీలు చేసిన “తప్పులకు” ప్రాయశ్చిత్తంగా మేము ఆ రోజు కూడా పనికి వెళ్ళవలసి వచ్చింది. రాళ్ళగని నుండి పెద్ద పెద్ద రాళ్ళను మోసుకొని శిబిరానికి తీసుకురావాలని మాకు ఆజ్ఞాపించబడింది. ఇద్దరు ఖైదీలు నా వీపుమీద ఒక పెద్ద బండను పెట్టడానికి ప్రయత్నించారు, అయితే దాని బరువుకు నేను దాదాపు క్రింద పడిపోయాను. అయితే అందరూ భయపడే మా శిబిరం పర్యవేక్షకుడు ఆర్థర్‌ రాడల్‌ ఊహించని విధంగా నన్ను ఆదుకున్నాడు. ఆ బండను మోయడానికి నేను పడుతున్న కష్టాన్ని చూసి ఆయన నాతో ఇలా అన్నాడు: “ఆ బండను మోసుకెళితే నువ్వు శిబిరానికి చేరుకోవు! దానిని క్రింద పెట్టు!” ఆ ఆజ్ఞను పాటించడానికి నేను సంతోషించాను. ఆ తర్వాత రాడల్‌ దానికంటే ఎంతో చిన్న రాయిని చూపించి, “దానిని శిబిరానికి తీసుకొని రా. దానిని మోయడం సులభం!” అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన మా అధికారివైపు తిరిగి, “బైబిలు విద్యార్థులను తిరిగి వారి బారకాసులకు వెళ్ళనివ్వు. వాళ్ళు ఒక రోజుకు సరిపడా పనిచేశారు, ఇక చాలు!” అని చెప్పాడు.

ప్రతీరోజు సాయంత్రం నేను నా ఆధ్యాత్మిక కుటుంబంతో సహవసించడానికి ఎంతో ఆనందించేవాడిని. ఆధ్యాత్మిక ఆహారాన్ని పంచిపెట్టుకునే ఏర్పాట్లు మాకుండేవి. ఒక సహోదరుడు చిన్న కాగితంపై ఒక బైబిలు వచనాన్ని వ్రాసి దానిని అందరికీ పాస్‌ చేసేవాడు. మేము నిర్బంధ శిబిరంలోకి రహస్యంగా ఒక బైబిలు కూడా తెచ్చుకున్నాము. దానిని విడదీసి వేర్వేరు పుస్తకాలుగా చేశాము. మూడు నెలలపాటు నాకు యోబు పుస్తకం ఇవ్వబడింది. దానిని నేను నా సాక్సుల్లో దాచుకునేవాడిని. నేను స్థిరంగా నిలబడడానికి యోబు వృత్తాంతం నాకు సహాయం చేసింది.

చివరకు 1941, మార్చి 7న నీడర్‌హాగెన్‌ నిర్బంధ శిబిరానికి తరలించబడిన పెద్ద ఖైదీల గుంపులో నేను కూడా ఉన్నాను. నా ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తూ వచ్చింది. ఒకరోజు, పనిముట్లను పెట్టెల్లో సర్దమని నాకు, మరో ఇద్దరు సహోదరులకు ఆజ్ఞాపించబడింది. అది చేసిన తర్వాత మేము మరో ఖైదీల గుంపుతో కలిసి బారకాసులకు తిరిగి వచ్చాము. నేను వేగంగా నడవలేక వెనకబడిపోతున్నానని ఒక ఎస్‌.ఎస్‌. గార్డు గమనించాడు. అతనికి ఎంత కోపం వచ్చిందంటే ఎలాంటి హెచ్చరికా లేకుండా నన్ను వెనుక నుండి గట్టిగా తన్నాడు, దానివల్ల నేను తీవ్రంగా గాయపడ్డాను. ఆ నొప్పిని నేను భరించలేకపోయాను, అయినా కూడా నేను మరుసటి రోజు పనికి వెళ్ళాను.

ఊహించని విడుదల

1943 ఏప్రిల్‌లో నీడర్‌హాగెన్‌ శిబిరం ఖాళీ చేయబడింది. ఆ తర్వాత ఖైదీలను ఒక పద్ధతి ప్రకారం హతమార్చే రావెన్స్‌బ్రూక్‌ శిబిరానికి నన్ను పంపించారు. అయితే 1943 జూన్‌లో నేను ఊహించని విధంగా, ఆ నిర్బంధ శిబిరం నుండి విడుదల పొందే అవకాశం నాకు లభించింది. ఈ సారి నా విశ్వాసాన్ని త్యజిస్తే విడుదల చేస్తామనే షరతు పెట్టలేదు. నేను నా మిగతా జీవితమంతా వెట్టిచాకిరీ చేస్తానని అంగీకరించాలి అంతే. నిర్బంధ శిబిరపు దారుణకృత్యాలనుండి తప్పించుకోవడానికి నేను అలా చేయడానికి సిద్ధపడ్డాను. నేను ఆఖరి పరీక్ష కోసం శిబిరంలోని డాక్టరు దగ్గరకు వెళ్ళాను. ఆ డాక్టరు నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. “నువ్వు ఇంకా యెహోవాసాక్షిగానే ఉన్నావా!” అని అడిగాడు. “అవును డాక్టరుగారు” అని నేను సమాధానమిచ్చాను. “అలాగైతే నిన్ను ఎందుకు విడుదల చేస్తున్నారో నాకర్థం కావడం లేదు. అయినా నీలాంటి పనికిరాని మనిషిని వదిలించుకోవడమే మంచిది” అని అన్నాడు.

ఆయన అన్నదాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు. నా ఆరోగ్య పరిస్థితి నిజంగానే ప్రమాదకరంగా ఉంది. నా చర్మంలో కొంత భాగాన్ని పేలు తినేశాయి, నేను తిన్న దెబ్బల కారణంగా ఒక చెవికి వినికిడి శక్తి పోయింది, నా శరీరమంతా చీముతో నిండిన పుండ్లతో ఉంది. 46 నెలలపాటు లేమితో, అంతులేని ఆకలితో ఉండి, వెట్టిచాకిరీ చేసిన తర్వాత నా బరువు 28 కిలోలు మాత్రమే ఉంది. ఆ పరిస్థితిలో నేను 1943 జూలై 15న రావెన్స్‌బ్రూక్‌నుండి విడుదలయ్యాను.

నన్ను రైలులో నా స్వంత పట్టణానికి పంపించారు, నాతోపాటు సైనికులెవ్వరూ రాలేదు, నేను లిన్జ్‌లోని రహస్య పోలీసుల ప్రధాన కార్యాలయానికి వెళ్ళాను. అక్కడున్న అధికారి నా విడుదల పేపర్లను నా చేతికిచ్చి ఇలా హెచ్చరించాడు: “నువ్వు నీ రహస్య కార్యకలాపాలను కొనసాగించడానికి మేము నిన్ను విడుదల చేస్తున్నాము అని అనుకుంటే, నువ్వు పొరబడ్డట్టే! నువ్వు ప్రకటిస్తున్నప్పుడు మేము మళ్ళీ నిన్ను పట్టుకుంటే నిన్ను ఆ దేవుడే రక్షించాలి.”

చివరకు నేను ఇంటికి చేరుకున్నాను! నేను మొదటిసారిగా 1939 ఏప్రిల్‌ 4న అరెస్టు చేయబడినప్పటినుండి మా అమ్మ నా గదిలో వస్తువులేమీ మార్చలేదు. నా మంచం పక్కనున్న బల్లపై నేను తెరిచి ఉంచిన బైబిలు కూడా అలాగే ఉంది! నేను మోకాళ్ళూని దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.

నేను ఒక కొండపై ఉన్న వ్యవసాయ క్షేత్రంలో పని చేయడానికి నియమించబడ్డాను. నా చిన్ననాటి స్నేహితుడైన ఆ రైతు తను ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా నాకు కొంత జీతం కూడా ఇచ్చేవాడు. యుద్ధానికి ముందు ఆయన తన ఇంట్లో కొంత బైబిలు సాహిత్యాన్ని దాచి పెట్టడానికి నాకు అనుమతి ఇచ్చాడు. అప్పుడు నేను దాచిపెట్టిన ఆ సాహిత్యాలను ఆధ్యాత్మిక బలం సంపాదించుకోవడానికి ఉపయోగించుకునేందుకు నేను సంతోషించాను. నా అవసరాలన్నీ తీర్చబడ్డాయి, యుద్ధం ముగిసేవరకూ నేను ఆ వ్యవసాయ క్షేత్రంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాను.

కొండల్లో దాక్కోవడం

అయితే స్వతంత్రంగా, ప్రశాంతంగా గడిపే ఆ జీవితం ఎంతోకాలం నిలవలేదు. 1943 ఆగస్టు నెలలో వైద్య పరీక్ష చేయించుకోవడానికి ఒక మిలటరీ డాక్టరు దగ్గరకు వెళ్ళమని నాకు ఆదేశించబడింది. మొదట, నా వెన్నెముక అనారోగ్యం కారణంగా నేను సైన్యంలో పనిచేయడానికి పనికిరానని ఆయన చెప్పాడు. అయితే ఒక వారం తర్వాత ఆ డాక్టరే తన నివేదికను మార్చి, “యుద్ధభూమిలో పనిచేయడానికి అర్హుడు” అని వ్రాశాడు. ఆ తర్వాత కొంతకాలం వరకూ సైన్యం నన్ను కనుక్కోలేకపోయింది, అయితే 1945, ఏప్రిల్‌ 17న యుద్ధం ముగిసే ముందు వారు నన్ను కనుగొన్నారు. యుద్ధభూమిలో పనిచేయడానికి నన్ను రమ్మని ఆదేశించారు.

కొన్ని బట్టలు, ఆహారం, ఒక బైబిలు తీసుకొని దాక్కోవడానికి నేను దగ్గర్లోని కొండలకు పారిపోయాను. మొదట్లో నేను ఆరు బయట పడుకునేవాడిని, కానీ ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి, అర మీటరు ఎత్తున మంచు కురిసింది. నేను పూర్తిగా తడిచిపోయాను. నేను సముద్ర మట్టానికి 1,200 మీటర్ల ఎత్తులో ఒక కొండపై ఉన్న కుటీరానికి చేరుకున్నాను. చలికి వణికిపోతున్న నేను ఒక చిన్నమంట వేసుకున్నాను, ఆ మంటలో చలి కాచుకుని నా బట్టలు ఆరబెట్టుకోగలిగాను. ఎంతో అలసిపోయి ఉన్న నేను ఆ మంటకు ఎదురుగా ఉన్న బెంచిపై పడుకొని నిద్రపోయాను. ఎంతోసేపు గడవకముందే భరించరాని నొప్పితో నాకు అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. నాకు నిప్పు అంటుకుంది! మంటలను ఆర్పడానికి నేను నేలపై దొర్లాను. నా వీపంతా బొబ్బలు వచ్చేశాయి.

నేను పట్టుబడే ప్రమాదమున్నా, తెల్లవారకముందే నేను పనిచేసిన రైతు యొక్క వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాను, ఆ రైతు భార్య నన్ను చూసి ఎంతో భయపడి నన్ను పట్టుకోవడానికి మనుషులు వెతుకుతున్నారని చెప్పి నన్ను పంపేసింది. కాబట్టి నేను నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాను. మొదట నా తల్లిదండ్రులు కూడా నన్ను ఇంట్లోకి రానివ్వడానికి సందేహించారు, అయితే చివరకు నన్ను గడ్డిదాచే గదిలో పడుకొమ్మన్నారు, అమ్మ నా గాయాలకు మందు రాసింది. రెండు రోజుల తర్వాత, నా తల్లిదండ్రులు ఎంతో ఆందోళనపడుతున్నారని గమనించి నేను మళ్ళీ కొండలకు పారిపోయి అక్కడే దాక్కోవడం మంచిదని నిర్ణయించుకున్నాను.

1945, మే 5న ఒక పెద్ద శబ్దంతో నాకు మెలకువ వచ్చింది. మిత్రపక్షాల విమానాలు ఆకాశంలో ఎగరడం చూశాను. దానితో హిట్లర్‌ పరిపాలన ముగిసిందని నాకు అర్థమయ్యింది! నమ్మశక్యం కానంత కష్టమైన పరిస్థితులను సహించడానికి యెహోవా ఆత్మ నాకు బలమిచ్చింది. కీర్తన 55:⁠22లోని మాటల వాస్తవికతను నేను చవిచూశాను, నాకు కష్టాలు ప్రారంభమైనప్పుడు ఆ మాటలే నన్ను ఓదార్చాయి. నేను నా ‘భారాన్ని యెహోవామీద మోపాను,’ కాబట్టి నేను శారీరకంగా బలహీనంగా ఉన్నా నేను “గాఢాంధకారపు లోయలో” నడుస్తుండగా ఆయన నన్ను కాపాడాడు.​—⁠కీర్తన 23:⁠4.

యెహోవా శక్తి ‘బలహీనతయందు పరిపూర్ణము’ చేయబడింది

యుద్ధం ముగిసిన తర్వాత, జీవితం మెల్లగా మామూలు స్థితికి వచ్చింది. మొదట నేను నా స్నేహితుని వ్యవసాయ క్షేత్రంలోనే కూలివాడిగా పనిచేశాను. 1946 ఏప్రిల్‌లో అమెరికా సైన్యం జోక్యం చేసుకున్న తర్వాతే నేను జీవితమంతా పొలంలో వెట్టిచాకిరీనుండి నాకు విడుదల లభించింది.

యుద్ధం ముగిసినప్పుడు బాటిషెల్‌లోని, చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని క్రైస్తవ సహోదరులు క్రమంగా కూటాలను నిర్వహించడం ప్రారంభించారు. వాళ్ళు నూతనోత్తేజంతో ప్రకటించడం మొదలుపెట్టారు. నాకు ఒక కర్మాగారంలో నైట్‌ వాచ్‌మ్యాన్‌ ఉద్యోగం దొరికింది, అలా నేను నా పయినీరు సేవను కొనసాగించగలిగాను. చివరకు నేను సెయింట్‌ వుల్ఫ్‌గ్యాంగ్‌ ప్రాంతంలో స్థిరపడ్డాను, 1949లో నేను థెరెసియా కూర్జ్‌ను పెళ్ళి చేసుకున్నాను. ఆమెకు అప్పటికే ఒక కూతురు ఉంది. మేము 32 సంవత్సరాలు కలిసి జీవించాము, ఆ తర్వాత 1981లో నా ప్రియమైన భార్య మరణించింది. నేను ఆమెకు ఏడు సంవత్సరాలకంటే ఎక్కువకాలం సపర్యలు చేశాను.

థెరెసియా చనిపోయిన తర్వాత నేను నా పయినీరు సేవను కొనసాగించాను, ఆమె లేని లోటునుండి కోలుకోవడానికి అది నాకు సహాయం చేసింది. నేను ప్రస్తుతం బాటిషెల్‌లోని సంఘంలో పయినీరుగా, పెద్దగా సేవ చేస్తున్నాను. నేను చక్రాల కుర్చీకే పరిమితం కాబట్టి, బాటిషెల్‌ పార్కులోనో లేదా నా ఇంటి ముందో కూర్చొని ప్రజలకు బైబిలు సాహిత్యాలు అందించి, వారితో రాజ్య నిరీక్షణ గురించి మాట్లాడతాను. వాళ్ళతో నేను జరిపే చక్కని బైబిలు చర్చలు నాకు ఎంతో ఆనందాన్నిస్తాయి.

నేను గతం గురించి ఆలోచించినప్పుడు, నేను అనుభవించవలసి వచ్చిన ఘోరమైన పరిస్థితులు నాలో ప్రతికూల భావాలను కలుగజేయలేదనే నేను చెప్పగలను. నిజమే, నేను అనుభవించిన కష్టాల కారణంగా కొన్నిసార్లు నేను మానసికంగా కృంగిపోయాను. అయితే యెహోవా దేవునితో నాకున్న ప్రేమపూర్వకమైన సంబంధం, ఆ కృంగుదలను అధిగమించడానికి నాకు సహాయం చేసింది. “బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది” అని పౌలుతో ప్రభువు అన్న మాటలు నా జీవితంలో కూడా నిజమని నిరూపించబడ్డాయి. ఇప్పుడు దాదాపు 100 సంవత్సరాల వయస్సున్న నేను పౌలుతో ఏకీభవిస్తూ ఇలా అనగలను: “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.”​—⁠2 కొరింథీయులు 12:9, 10.

[25వ పేజీలోని చిత్రాలు]

రహస్య పోలీసులు అరెస్టు చేసినప్పుడు, 1939, ఏప్రిల్‌లో

నిందారోపణలతో ఉన్న పోలీసు దస్తావేజులు, 1939, మే

[చిత్రసౌజన్యం]

రెండు చిత్రాలు: Privatarchiv; B. Rammerstorfer

[26వ పేజీలోని చిత్రం]

దగ్గర్లోని కొండలు నాకు ఆశ్రయమిచ్చాయి

[23వ పేజీలోని చిత్రసౌజన్యం]

Foto Hofer, Bad Ischl, Austria