పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
క్రైస్తవ భార్య గురించి మాట్లాడుతూ, “శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును” అని పౌలు ఎందుకు వ్రాశాడు?—1 తిమోతి 2:15.
పౌలు మాటల భావం గురించి ఈ లేఖన సందర్భం ఏమి వెల్లడి చేస్తోంది? ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద, సంఘంలో క్రైస్తవ స్త్రీల పాత్ర గురించి ఉపదేశిస్తున్నాడు. ఆయన ఇలా వ్రాశాడు: “స్త్రీలు అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.” (1 తిమోతి 2:9, 10) పౌలు తన క్రైస్తవ సహోదరీలు అణకువతో ఉండాలని, అలంకరణను ఎంపిక చేసుకునేటప్పుడు సమతుల్యతను చూపించాలని, తమను తాము ‘సత్‌క్రియలతో అలంకరించుకోవాలని’ ప్రోత్సహించాడు.
ఆ తర్వాత పౌలు సంఘంలో శిరసత్వ ఏర్పాటు గురించి మాట్లాడుతూ ఇలా వివరించాడు: “స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.” (1 తిమోతి 2:12; 1 కొరింథీయులు 11:3) సాతానుచేత ఆదాము మోసగించబడలేదు గానీ హవ్వ “మోసపరచబడి అపరాధములో పడెను” అని చూపిస్తూ ఆయన శిరసత్వ ఏర్పాటుకున్న ఆధారాన్ని వివరించాడు. హవ్వ చేసినలాంటి పాపం చేయకుండా క్రైస్తవ స్త్రీ ఎలా కాపాడబడుతుంది? పౌలు దానికి ఇలా సమాధానమిస్తున్నాడు: “స్వస్థబుద్ధి కలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండినయెడల శిశుప్రసూతిద్వారా ఆమె రక్షింపబడును.” (1 తిమోతి 2:14, 15) పౌలు వ్రాసిన ఈ మాటల భావమేమిటి?
కొంతమంది అనువాదకులు, ఒక స్త్రీ రక్షణ ఆమె పిల్లలను కనడంపైనే ఆధారపడి ఉందని సూచిస్తున్నట్లుంది. ఉదాహరణకు పవిత్ర గ్రంథము - క్యాతలిక్ అనువాదము ఇలా చెబుతోంది: “స్త్రీలు బిడ్డలను కనెడి ధర్మమువలన రక్షించబడుదురు.” అయితే పౌలు మాటలను అలా అనువదించడం సరైనది కాదు. ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఆయన యెహోవా గురించి తెలుసుకోవాలని, యేసును నమ్మి ఆయనపై విశ్వాసముంచాలని, ఆ విశ్వాసాన్ని తన క్రియల ద్వారా ప్రదర్శించాలని చాలా లేఖనాలు చూపిస్తున్నాయి. (యోహాను 17:3; అపొస్తలుల కార్యములు 16:30, 31; రోమీయులు 10:10; యాకోబు 2:26) అంతేకాకుండా విశ్వాసులైన స్త్రీలకు సురక్షిత ప్రసవం జరుగుతుందని కూడా పౌలు సూచించలేదు. స్త్రీలు విశ్వాసులైనా అవిశ్వాసులైనా సురక్షితంగానే పిల్లలను కన్నారని చెప్పడానికి లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. విచారకరంగా కొంతమంది స్త్రీలు విశ్వాసులా, అవిశ్వాసులు అన్నదానితో ప్రమేయం లేకుండా పిల్లలను కనేటప్పుడు తమ ప్రాణాలు కోల్పోయారు.—ఆదికాండము 35:16-18.
పౌలు మాటల భావమేమిటో అర్థం చేసుకోవడానికి, ఆయన అదే లేఖలో స్త్రీల గురించి ఇచ్చిన అదనపు ఉపదేశం మనకు సహాయం చేస్తుంది. ‘ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాండ్రగుటకు మాత్రమేగాక, ఆడరాని మాటలాడుచు, వదరుబోతులును పరులజోలికి పోవువారిగా’ ఉండే యౌవన విధవరాండ్ర గురించి ఆయన హెచ్చరించాడు. పౌలు ఇచ్చిన సలహా ఏమిటి? ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “కాబట్టి యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను.”—1 తిమోతి 5:13, 14.
కుటుంబ ఏర్పాటులో స్త్రీలకున్న అనుకూలమైన పాత్రను పౌలు నొక్కి చెప్పాడు. ‘పిల్లలను కని గృహపరిపాలన జరిగించడం’ వంటి కార్యకాలాపాలతో చురుగ్గా ఉండే స్త్రీ “విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా” ఉంటూ క్షేమాభివృద్ధికాని ప్రవర్తనవైపు ఆకర్షించబడదు. ఆమె ఆధ్యాత్మికత కాపాడబడుతుంది లేదా ‘రక్షించబడుతుంది.’ (1 తిమోతి 2:15) అలా చేయడం ద్వారా చాలామంది యౌవన స్త్రీలు సాతాను ఉరులను తప్పించుకోగలుగుతారు.
పౌలు తిమోతికి చెప్పిన మాటలు మనందరికి—పురుషులైనా, స్త్రీలైనా—మన సమయాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించుకొమ్మని గుర్తు చేస్తున్నాయి. దేవుని వాక్యం క్రైస్తవులందరికీ ఈ సలహా ఇస్తోంది: “అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.”—ఎఫెసీయులు 5:15.