కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పునరుత్థానం ఒక అద్భుతమైన నిరీక్షణ

పునరుత్థానం ఒక అద్భుతమైన నిరీక్షణ

పునరుత్థానం ఒక అద్భుతమైన నిరీక్షణ

పునరుత్థానాన్ని చాలామంది నమ్ముతారు. ఇస్లామ్‌ పవిత్ర గ్రంథమైన ఖురాన్‌లో పునరుత్థానానికి సంబంధించి ఒక అధ్యాయమే ఉంది. 75వ సురహ్‌లో కొంతభాగం ఇలా చెబుతోంది: “నేను పునరుత్థాన సమయము ప్రమాణము చేయుచున్నాను . . . మేము అతని ఎముకలు ప్రోగు చేయలేమని మానవుడు భావించునా? . . . “పునరుత్థాన దినము ఎప్పుడు వచ్చును” అని అతడు అడుగుచుండును. మృతులను బ్రతికించు శక్తి ఇతనికి (అల్లాహ్‌కు) లేదా?”​—⁠సురహ్‌ 75:​1-6, 40.

“జోరాస్ట్రియన్లు చివరకు కీడు అంతమవుతుందనీ, నీతిమంతులూ అనీతిమంతులూ పునరుత్థానం చేయబడతారనీ, అంతిమ తీర్పు ఉంటుందనీ, నీతిమంతుల కోసం పరిశుభ్రమైన ప్రపంచం పునరుద్ధరించబడుతుందనీ నమ్ముతారు” అని ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది.

పునరుత్థానం అంటే “మృతులందరూ చివరకు తమతమ భౌతిక శరీరాలతో తిరిగి జీవానికివచ్చి భూమ్మీద జీవిస్తారనే నమ్మకం” అని ఎన్‌సైక్లోపీడియా జుడైకా నిర్వచిస్తోంది. మానవుల్లో అమర్త్యమైన ఆత్మ ఉందనే నమ్మకాన్ని యూదా మతం స్వీకరించడం గలిబిలిని సృష్టిస్తోందని అదే గ్రంథం వ్యాఖ్యానిస్తోంది. అదిలా ఒప్పుకుంటోంది: “ప్రాథమికంగా పునరుత్థానం, ఆత్మ అమర్త్యం అనే ఈ రెండు నమ్మకాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.”

మానవుడు అనేకమార్లు పునర్జన్మిస్తాడని లేదా తిరిగి అవతరిస్తాడని హిందూమతం బోధిస్తోంది. అదే నిజమైతే, మనిషికి మరణం తర్వాత కూడా జీవిస్తూ ఉండే ఆత్మ ఉండాలి. హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత ఇలా చెబుతోంది: ‘శరీరమంతటిలో వ్యాపించివున్నది నాశనరహితమైనది. అవినాశకమైన ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు.’

బౌద్ధమతానికి హిందూమతానికి ఉన్న తేడా ఏమిటంటే, అమర్త్యమైన ఆత్మ ఉనికిలో లేదని బౌద్ధమతం బోధిస్తుంది. అయితే సుదూర ప్రాచ్య దేశాల్లో నేడు చాలామంది బౌద్ధమతస్థులు అమర్త్యమైన ఆత్మ దేహాంతరం పొందుతుందని నమ్ముతున్నారు. *

పునరుత్థాన బోధకు సంబంధించిన గందరగోళం

క్రైస్తవమత సామ్రాజ్యం నిర్వహించే అంత్యక్రియల కార్యక్రమాలు మరణం తర్వాత ఆత్మ జీవిస్తుందని, పునరుత్థానం ఉందని ఈ రెంటినీ సూచిస్తాయి. ఉదాహరణకు, ఆంగ్లికన్‌ మతనాయకులు సాధారణంగా ఈ మాటలు వల్లిస్తారు: “ఇక్కడ మనలను ఎడబాసిన మన ప్రియ సహోదరుని ఆత్మను తన సన్నిధికి చేర్చుకోవడం మహాకృపగల సర్వశక్తిగల దేవుని చిత్తం కాబట్టి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్యజీవార్థమైన పునరుత్థానపు నిశ్చయమైన, నిర్దిష్టమైన నిరీక్షణతో ఆయన భౌతికకాయాన్ని తిరిగి మన్నైనది మంటికి, బూడిదైనది బూడిదకు, ధూళియైనది ధూళికి అప్పగిస్తున్నాము.”​—⁠ద బుక్‌ ఆఫ్‌ కామన్‌ ప్రేయర్‌.

ఈ మాటలనుబట్టి ఒకరు, బైబిలు పునరుత్థానాన్ని బోధిస్తుందా లేక అమర్త్యమైన ఆత్మ సిద్ధాంతాన్ని బోధిస్తుందా అని ఆశ్చర్యపోతారు. అయితే ఫ్రెంచి ప్రొటస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆస్కార్‌ కుల్‌మాన్‌ చేసిన వ్యాఖ్యానాన్ని గమనించండి. ఇమ్మోర్టాలిటీ ఆఫ్‌ ద సోల్‌ ఆర్‌ రిసరెక్షన్‌ ఆఫ్‌ ద డెడ్‌? అనే తన పుస్తకంలో ఆయన ఇలా వ్రాశాడు: “మృతుల పునరుత్థానానికి సంబంధించిన క్రైస్తవ నిరీక్షణకు గ్రీసుదేశస్థుల అమర్త్యమైన ఆత్మకు సంబంధించిన నమ్మకానికి చాలా తేడా ఉంది. . . . క్రైస్తవత్వం ఆ తర్వాత ఈ రెంటికీ సంబంధం కలిపినప్పటికీ, నేడు సగటు క్రైస్తవుడు వాటి తేడాను చూడలేకపోతున్నప్పటికీ, నేనూ ఇతర విద్వాంసులు అనేకమంది సత్యమని పరిగణించే విషయాన్ని దాచిపెట్టడానికి కారణమేమి నాకు కనిపించడం లేదు. . . . కొత్త నిబంధనలోని తాత్పర్యం మరియు ఉద్దేశం అంతటిలో పునరుత్థాన విశ్వాసమే ప్రధానాంశంగా ఉంది. . . . నిజంగా చనిపోయిన, సంపూర్ణ వ్యక్తి దేవుని నూతన సృష్టికార్యం ద్వారా తిరిగి జీవానికి తీసుకురాబడతాడు.”

కాబట్టి మరణ పునరుత్థానాల గురించి సాధారణ ప్రజానీకం ఎందుకు గందరగోళంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ గందరగోళాన్ని పరిష్కరించడానికి మనం మానవులను సృష్టించిన యెహోవా దేవుడు వెల్లడిచేసిన సత్యాలున్న బైబిలును పరిశీలించాలి. బైబిల్లో అనేక పునరుత్థానాల నివేదికలు ఉన్నాయి. మనం వాటిలో నాల్గింటిని పరిశీలించి అవి ఏమి వెల్లడి చేస్తున్నాయో చూద్దాం.

“స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి”

అపొస్తలుడైన పౌలు క్రైస్తవులుగా మారిన యూదులకు తాను వ్రాసిన ఉత్తరంలో, విశ్వాసులైన స్త్రీలు “మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి” అని వ్రాశాడు. (హెబ్రీయులు 11:​35) వారిలో ఒక స్త్రీ మధ్యధరా తీర ప్రాంతంలో సీదోనుకు దగ్గర్లోని కనాను పట్టణమైన సారెపతులో నివసించింది. ఆమె ఒక విధవరాలు, ఆమె దేవుని ప్రవక్తయైన ఏలియాను సాదరంగా తన ఇంట్లోకి ఆహ్వానించి, తీవ్రమైన కరవు ప్రబలిన కాలంలో కూడా ఆయనకు ఆహారం పెట్టింది. విచారకరంగా, ఆ స్త్రీ కుమారుడు రోగియై చివరకు మరణించాడు. ఏలియా వెంటనే తాను బసచేసిన మేడగదిలోకి ఆ పిల్లవాణ్ణి తీసుకొనిపోయి అతణ్ణి తిరిగి బ్రతికించమని యెహోవాకు ప్రార్థించాడు. అప్పుడొక అద్భుతం జరిగి, ఆ పిల్లవానికి ‘ప్రాణము మరలా వచ్చింది.’ ఏలియా ఆ పిల్లవాణ్ణి అతని తల్లికి అప్పగించి “ఇదిగో నీ కుమారుడు. వాడు బ్రదుకుచున్నాడు” అని చెప్పాడు. దానికి ఆమె ఎలా స్పందించింది? సంతోషం పట్టలేక ఆమె ఇలా అంది: “నీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదును.”​—⁠1 రాజులు 17:22-24.

ఏలియా వారసుడైన ఎలీషా ప్రవక్త గురించి శ్రద్ధ తీసుకున్న మరో ఉదారమైన జంట సారెపతుకు దక్షిణాన దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో నివసించారు. భార్య తన సొంత పట్టణమైన షూనేములో ప్రముఖ స్త్రీ. ఆ భార్యాభర్తలిద్దరూ తమ ఇంటి మేడగదిలో ఎలీషాకు బస ఇవ్వడానికి అంగీకరించారు. పిల్లలు లేరనే విచారంతో ఉన్నవారికి ఒక కుమారుడు కలగడంతో వారెంతో సంతోషించారు. ఆ పిల్లవాడు ఎదిగినప్పుడు తరచూ కోతకోయువారితో కలిసి పొలంలోవున్న తండ్రి దగ్గరకు వెళ్లేవాడు. ఒకరోజు అనుకోని విషాదం అలుముకుంది. ఆ పిల్లవాడు తనకు తలనొస్తుందని ఏడ్వడం మొదలుపెట్టాడు. దానితో ఒక పనివాడు ఆ పిల్లవాణ్ణి త్వరగా అతని తల్లి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ పిల్లవాడి తల్లి అతణ్ణి ఒడిలో పడుకోబెట్టుకుంది, కానీ కొద్దిసేపటికి అతను మరణించాడు. ఏమిచేయాలో తోచని ఆ తల్లి సహాయం కోసం ఎలీషా దగ్గరకు వెళ్లడానికి నిర్ణయించుకుంది. ఒక పనివానితో కలిసి ఆమె వాయవ్య దిశగా ఎలీషా ఉన్న కర్మెలు పర్వతంవైపుకు వెళ్లింది.

ఆ ప్రవక్త ప్రతిస్పందించి తన సేవకుడైన గేహజీని ముందుగా అక్కడికి పంపించాడు, అక్కడ ఆ బాలుడు నిజంగానే చనిపోయి ఉండడం ఆయన చూశాడు. ఆ వెనకే వచ్చిన ఎలీషా మరియు ఆ స్త్రీ చివరకు షూనేముకు చేరుకున్నప్పుడు అక్కడ ఏమి సంభవించింది? 2 రాజులు 4:32-37లోని వృత్తాంతం ఇలా వివరిస్తోంది: “ఎలీషా ఆ యింట జొచ్చి, బాలుడు మరణమైయుండి తన మంచముమీద పెట్టబడి యుండుట చూచి తానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి, యెహోవాకు ప్రార్థనచేసి మంచముమీద ఎక్కి బిడ్డమీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటిమీదను తన కండ్లు వాని కండ్లమీదను తన చేతులు వాని చేతులమీదను ఉంచి, బిడ్డమీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్టపుట్టెను. తాను దిగి యింటిలో ఇవతలనుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి, మరల మంచముమీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను. అప్పుడతడు గేహజీని పిలిచి​—⁠ఆ షూనేమీయురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతనియొద్దకు రాగా అతడు​—⁠నీ కుమారుని ఎత్తికొనుమని ఆమెతో చెప్పెను. అంతట ఆమె లోపలికివచ్చి అతని కాళ్లమీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొనిపోయెను.”

సారెపతులోని విధవరాలిలాగే షూనేము పట్టణస్థురాలైన ఈ స్త్రీకి కూడా ఆ కార్యం దేవుని శక్తి మూలంగానే జరిగిందని తెలుసు. ఈ స్త్రీలిద్దరూ తమ ప్రియ పుత్రులను దేవుడు తిరిగి జీవానికి రప్పించిన కారణంగా అమితానందాన్ని పొందారు.

యేసు పరిచర్య కాలంలోని పునరుత్థానాలు

దాదాపు 900 సంవత్సరాల తర్వాత, షూనేముకు ఉత్తరాన కొద్దిదూరంలో ఉన్న నాయీను అనే గ్రామం వెలుపల ఒక పునరుత్థానం జరిగింది. యేసు ఆయన శిష్యులు కపెర్నహూము నుండి ప్రయాణిస్తూ నాయీను గవిని దగ్గరకు వచ్చినప్పుడు, పాడెను మోసుకెళుతున్న గుంపు వారికి ఎదురయ్యింది, వారిలో తన ఒక్కగానొక్క కుమారుణ్ణి కోల్పోయిన విధవరాలిని యేసు చూశాడు. యేసు ఏడవవద్దని ఆమెకు చెప్పాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో వైద్యుడైన లూకా ఇలా వివరిస్తున్నాడు: “[యేసు] దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన​—⁠చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను.” (లూకా 7:​14, 15) ఈ అద్భుతాన్ని కళ్లారా చూసినవారు దేవుణ్ణి మహిమపరిచారు. ఆ పునరుత్థానపు వార్త దక్షిణదిక్కున యూదా, దాని పరిసర ప్రాంతమంతటా వ్యాపించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులు కూడా ఆ వార్తవిని ఆ అద్భుతాన్ని యోహానుకు తెలియజేశారు. యేసును కనుగొనడానికి ఆయన వారిని పంపి తాము ఎదురుచూస్తున్న మెస్సీయ ఆయనేనా అని అడిగిరమ్మని పురమాయించాడు. యేసు వారికి ఇలా చెప్పాడు: “మీరు వెళ్లి, కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.”​—⁠లూకా 7:22.

యేసు చేసిన పునరుత్థానపు అద్భుతాల్లో ఆయన సన్నిహిత స్నేహితుడైన లాజరు పునరుత్థానం చాలామందికి తెలుసు. లాజరు విషయంలో, ఆయన చనిపోయిన తర్వాత యేసు అతని ఇంటికి వచ్చేటప్పటికి కొంత ఆలస్యం అయింది. యేసు అక్కడికి వచ్చేటప్పటికి లాజరు చనిపోయి అప్పటికే నాలుగు రోజులయ్యింది. ఆయన పెట్టబడిన సమాధిని మూసిన రాయి తొలగించమని యేసు ఆదేశించినప్పుడు, మార్త అభ్యంతరం చెబుతూ ఇలా అంది: “ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టును.” (యోహాను 11:39) అయినప్పటికీ, లాజరు శరీరం కుళ్ళిపోయినా అది ఆయన పునరుత్థానాన్ని అడ్డుకోలేదు. యేసు ఆజ్ఞాపించిన వెంటనే ఆ “చనిపోయినవాడు కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను.” యేసు శత్రువులు ఆ తర్వాత చేసిన ప్రయత్నాలు ఆ పునరుత్థానం చేయబడినది నిజంగా లాజరేనని నిరూపించాయి.​—⁠యోహాను 11:​43, 44; 12:1, 9-11.

పునరుత్థానానికి సంబంధించిన ఈ నాలుగు వృత్తాంతాల నుండి మనమేమి అర్థం చేసుకుంటున్నాం? పునరుత్థానం చేయబడిన ప్రతీవ్యక్తి అదే వ్యక్తిగా తిరిగి జీవానికి వచ్చాడు. వారి సన్నిహిత బంధువులతోసహా అందరూ వారిని గుర్తించారు. పునరుత్థానం చేయబడిన వారిలో ఏ ఒక్కరూ తామున్న ఆ కొద్దిపాటి మృత స్థితిలో ఏమి జరిగిందో ఏమీ చెప్పలేదు. వారిలో ఎవ్వరూ తాము వేరొక లోకానికి ప్రయాణమై వెళ్ళినట్లు చెప్పలేదు. వారందరూ తిరిగి మంచి ఆరోగ్యంతో పునరుత్థానం చేయబడ్డారని స్పష్టమవుతోంది. యేసు చెప్పినట్లుగానే, అది వారికి కాస్సేపు నిద్రించి తిరిగి మేల్కొన్నట్లుగా ఉంది. (యోహాను 11:11) ఏదేమైనప్పటికీ, కొంతకాలం తర్వాత వారందరూ తిరిగి మరణించారు.

ప్రియమైన వారిని తిరిగి కలుసుకోవడం—⁠ఒక అద్భుతమైన ఉత్తరాపేక్ష

ముందరి ఆర్టికల్‌లో పేర్కొనబడిన ఓయెన్‌ విషాద మరణం తర్వాత కొద్దికాలానికి, అతని తండ్రి తమ పొరుగువారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఒక బల్లపై ఆయన యెహోవాసాక్షులు ఏర్పాటుచేసిన బహిరంగ ప్రసంగాన్ని ప్రచారం చేస్తున్న కరపత్రాన్ని చూశాడు. “మృతులు ఎక్కడ ఉన్నారు?” అనే శీర్షిక ఆయనను ఆకర్షించింది. సరిగ్గా ఆ ప్రశ్నే ఆయన మదిలో ఉంది. ఆయన ఆ ప్రసంగానికి హాజరై బైబిలు నుండి నిజమైన ఓదార్పును పొందాడు. మృతులు బాధించబడరని ఆయన తెలుసుకున్నాడు. నరకాగ్నిలో బాధలు అనుభవించడానికి లేదా దేవదూతలయ్యేందుకు దేవునిచేత తీసుకొనిపోబడడానికి బదులు ఓయెన్‌తోసహా, చనిపోయినవారు పునరుత్థానంలో తిరిగి లేపబడేవరకు సమాధిలో వేచివుంటారు.​—⁠ప్రసంగి 9:5, 10; యెహెజ్కేలు 18:4.

మీ కుటుంబంలో విషాదం ఏర్పడిందా? ఓయెన్‌ తండ్రిలాగే మీరు కూడా చనిపోయిన మీ ప్రియమైనవారు ఇప్పుడు ఎక్కడున్నారు, వారిని తిరిగి కలుసుకునే అవకాశం ఉందా అని ఆలోచిస్తున్నారా? అలాగైతే, పునరుత్థానం గురించి బైబిలు ఇంకా ఏమి చెబుతుందో పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు బహుశా ‘ఆ పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది? దానినుండి ఖచ్చితంగా ఎవరు ప్రయోజనం పొందుతారు’ అని ఆలోచిస్తుండవచ్చు. వీటితోపాటు మరితర ప్రశ్నల చర్చకోసం దయచేసి తర్వాతి ఆర్టికల్స్‌ చదవండి.

[అధస్సూచి]

^ పేరా 6 యెహోవాసాక్షులు ప్రచురించిన దేవుని కోసం మానవజాతి అన్వేషణ (ఆంగ్లం) అనే పుస్తకంలోని 150-4 పేజీలు చూడండి.

[5వ పేజీలోని చిత్రం]

పిల్లవాని ప్రాణాన్ని పునరుద్ధరించమని ఏలియా యెహోవాను వేడుకున్నాడు

[5వ పేజీలోని చిత్రం]

షూనేమీయురాలి కుమారుణ్ణి పునరుత్థానం చేయడానికి యెహోవా ఎలీషాను ఉపయోగించుకున్నాడు

[6వ పేజీలోని చిత్రం]

నాయీను విధవరాలి కుమారుణ్ణి యేసు పునరుత్థానం చేశాడు

[7వ పేజీలోని చిత్రం]

పునరుత్థానం బంధువులు తమ ప్రియమైనవారిని తిరిగి కలుసుకునేలా చేస్తుంది