కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పునరుత్థాన నిరీక్షణ—అది మీకు ఏ ప్రయోజనాలు చేకూరుస్తుంది?

పునరుత్థాన నిరీక్షణ—అది మీకు ఏ ప్రయోజనాలు చేకూరుస్తుంది?

పునరుత్థాన నిరీక్షణ​—⁠అది మీకు ఏ ప్రయోజనాలు చేకూరుస్తుంది?

“నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.”​—⁠కీర్తన 145:16.

తొమ్మిది సంవత్సరాల క్రిస్టెఫర్‌, అతని అన్న ఆ ఉదయం వాళ్ల చిన్నమ్మ చిన్నాన్నలతో, వాళ్ళ పిల్లలిద్దరితో కలిసి ఇంగ్లాండులోని మాంచెస్టర్‌కు దగ్గర్లో ఇంటింటి క్రైస్తవ పరిచర్యలో గడిపారు. అప్పుడు ఏం జరిగిందో కావలికోట సహ పత్రిక అయిన తేజరిల్లు! (ఆంగ్లం) ఇలా వివరించింది: “మధ్యాహ్నం వాళ్లు ఆసక్తికరమైన ప్రాంతాలను సందర్శించడానికి అక్కడికి దగ్గర్లోనే సముద్రాన్ని ఆనుకుని ఉన్న బ్లాక్‌పూల్‌ రిసార్ట్‌కు బయలుదేరారు. అయితే అక్కడ ఒక హైవే రోడ్డు ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదంలో చనిపోయిన 12 మందిలో ఈ ఆరుగురు కూడా ఉన్నారు, దానిని పోలీసులు ‘ఘోరాతి ఘోరమైన ప్రమాదం’ అని వర్ణించారు.”

2 ఆ దుర్ఘటన జరగడానికి ముందురాత్రి, ఆ కుటుంబం సంఘ పుస్తక అధ్యయనానికి హాజరైంది, అక్కడ మరణం అనే అంశంపై చర్చ జరిగింది. “క్రిస్టెఫర్‌ తెలివైన పిల్లవాడు. ఆ రాత్రి అతను నూతనలోకం గురించి భవిష్యత్తుకు సంబంధించిన తన నిరీక్షణ గురించి స్పష్టంగా మాట్లాడాడు. అలా మా చర్చ కొనసాగుతుండగా, క్రిస్టెఫర్‌ అకస్మాత్తుగా ఇలా అన్నాడు: ‘యెహోవాసాక్షులుగా ఉండడంలో ఒక ప్రయోజనం ఏమిటంటే, మరణం మనకు బాధ కలిగించినా ఏదో ఒకరోజు ఈ భూమ్మీద మనం మళ్లీ ఒకరినొకరు కలుసుకుంటామని మనకు తెలుసు.’ అక్కడున్న మేమెవ్వరమూ ఆ మాటలు ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంటాయని ఊహించలేదు” అని అతని తండ్రి వివరించాడు. *

3 దానికి అనేక సంవత్సరాల పూర్వం 1940లో, ఆస్ట్రియా దేశపు సాక్షి అయిన ఫ్రాంజ్‌కు తాను యెహోవాపట్ల అవిశ్వసనీయంగా ఉండడానికి నిరాకరించిన కారణంగా తనకు శిరచ్ఛేదనం తప్పదని అర్థమయింది. బెర్లిన్‌లోని ఒక నిర్బంధ కేంద్రం నుండి ఫ్రాంజ్‌ తన తల్లికి ఇలా వ్రాశాడు: “నాకు తెలిసినంత వరకు, నేను [సైనిక] ప్రమాణం చేసి ఉంటే, మరణపాత్రమైన పాపం చేసి ఉండే వాడిని. అది నాకు అంగీకారం కాదు. అలాచేస్తే నాకు పునరుత్థానం ఉండదు. . . . ప్రియమైన అమ్మకు, సహోదర సహోదరీలందరికీ, నా మరణ శిక్ష గురించి నాకు ఈ రోజే చెప్పారు. ఏ మాత్రం భయపడకండి. రేపు ఉదయం నాకు మరణశిక్ష అమలు చేయబడుతుంది. గతంలో నిజ క్రైస్తవులందరికీ ఎల్లప్పుడూ కలిగినట్లే నాకు కూడా దేవుని వలననే బలం కలుగుతోంది. . . . మీరు మరణం వరకు స్థిరంగా నిలబడితే, పునరుత్థానంలో మళ్లీ కలుద్దాం. . . . మనం తిరిగి కలుసుకునేంతవరకు ఇదే నా వీడ్కోలు.” *

4 క్రిస్టెఫర్‌కూ, ఫ్రాంజ్‌కూ పునరుత్థానం చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఉంది. అది వారికి వాస్తవిక విషయంగా ఉంది. వారి వృత్తాంతాలు మన హృదయాన్ని తప్పక స్పృశిస్తాయి. యెహోవాపట్ల మన కృతజ్ఞతా భావాన్ని మరింత ప్రగాఢం చేసుకుంటూ మన పునరుత్థాన నిరీక్షణను బలపరచుకోవడానికి, పునరుత్థానం ఎందుకు జరుగుతుంది, అది వ్యక్తిగతంగా మన మీద ఎలాంటి ప్రభావం చూపించాలి అనే అంశాలను పరిశీలిద్దాం.

భూసంబంధ పునరుత్థాన దర్శనం

5 క్రీస్తుయేసు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో జరిగే సంఘటనల దర్శనంలో అపొస్తలుడైన యోహాను భూసంబంధ పునరుత్థానాన్ని చూశాడు. “గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. . . . సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును [“హేడిస్‌,” NW] వాటి వశముననున్న మృతుల నప్పగించెను.” (ప్రకటన 20:​12, 13) వారి హోదా ఏదైనా సరే, ‘గొప్పవారైనా’ లేక ‘కొద్దివారైనా’ మానవజాతి సామాన్య సమాధి అయిన హేడిస్‌ [షియోల్‌] వశములో ఉన్నవారందరూ విడుదల పొందుతారు. ఆ కాలంలో సముద్రంలో తమ ప్రాణాలు కోల్పోయినవారు కూడా తిరిగి బ్రతుకుతారు. ఈ అద్భుత సంఘటన యెహోవా సంకల్పంలో ఒక భాగమే.

6 సాతానును బంధించి అగాధంలో పడవేయడంతో క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన ఆరంభమవుతుంది. పునరుత్థానం చేయబడేవారిలో లేదా మహాశ్రమలు తప్పించుకునే వారిలో ఏ ఒక్కరూ ఆ పరిపాలనా కాలంలో సాతానుచేత మోసగించబడరు ఎందుకంటే అప్పుడు అతడు నిష్క్రియునిగా ఉంటాడు. (ప్రకటన 20:1-3) ఆ వెయ్యేండ్లు మీకు బహుశా దీర్ఘకాలంగా ఉండవచ్చు, కానీ వాస్తవానికి, యెహోవా దానిని “ఒకదినమువలె” దృష్టిస్తాడు.​—⁠2 పేతురు 3:⁠8.

7 ఆ దర్శనం ప్రకారం క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన ఒక తీర్పు దినంగా ఉంటుంది. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పుపొందిరి. . . . వారిలో ప్రతివాడు తన క్రియలచొప్పున తీర్పుపొందెను.” (ప్రకటన 20:12, 13) అయితే ఆ తీర్పు ఒక వ్యక్తి చనిపోవడానికి ముందు ఏమి చేశాడు, ఏమి చేయలేదు అనేదాని ఆధారంగా ఉండదని గమనించండి. (రోమీయులు 6:7) బదులుగా, ఆ తీర్పు విప్పబడే “గ్రంథముల” ఆధారంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఆ గ్రంథాల్లోని విషయాలను తెలుసుకున్న తర్వాత చేసే క్రియల ఆధారంగా అతని పేరు “జీవగ్రంథము”లో నమోదు చేయాలో వద్దో నిర్ణయించబడుతుంది.

“జీవపునరుత్థానము” లేదా “తీర్పుపునరుత్థానము”

8 అంతకుముందు యోహాను దర్శనంలో, యేసు “మరణము యొక్కయు పాతాళలోకము [“హేడిస్‌,” NW]” యొక్కయు తాళపుచెవులు” తన స్వాధీనంలో ఉన్నట్లు వర్ణించబడ్డాడు. (ప్రకటన 1:18) ఆయన “సజీవులకును మృతులకును తీర్పుతీర్చు” అధికారం పొందిన యెహోవా “జీవాధిపతి”గా పనిచేస్తాడు. (అపొస్తలుల కార్యములు 3:15; 2 తిమోతి 4:1) ఆయన ఆ పనిని ఎలా చేస్తాడు? మరణ నిద్రలో ఉన్నవారిని తిరిగి బ్రతికించడం ద్వారా. యేసు తాను ప్రకటించిన జనసమూహములతో ఇలా అన్నాడు: “దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలుచేసినవారు జీవ పునరుత్థానమునకును కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.” (యోహాను 5:28-30) దీన్నిబట్టి, పూర్వకాలపు విశ్వాసులైన స్త్రీపురుషులకు ఏమి వేచి ఉంది?

9 ఈ పూర్వకాలపు విశ్వాసులు పునరుత్థానం చేయబడినప్పుడు, వారు తాము నమ్మిన వాగ్దానాలు ఇప్పుడు నిజమైనట్లు తెలుసుకుంటారు. బైబిల్లో ఆదికాండము 3:15లోని మొదటి ప్రవచనంలో పేర్కొనబడిన దేవుని స్త్రీ సంతానం ఎవరో తెలుసుకోవడానికి వారెంత ఆసక్తిని ప్రదర్శిస్తారో కదా! ఆ వాగ్దత్త మెస్సీయ అయిన యేసు మరణం వరకు నమ్మకంగా ఉండి, తన ప్రాణాన్ని విమోచనా క్రయధన బలిగా అర్పించాడని విని వారెంత సంతోషిస్తారో కదా! (మత్తయి 20:28) వారిని తిరిగి జీవానికి స్వాగతించే వారు ఈ విమోచనా క్రయధన ఏర్పాటు యెహోవా అపారమైన కృపకు, కనికరానికి వ్యక్తీకరణగా ఉందని అర్థం చేసుకొనేందుకు వారికి సహాయం చేయడంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు. పునరుత్థానం చేయబడిన వారు ఈ భూమిపట్ల యెహోవా సంకల్పాన్ని నెరవేర్చడంలో దేవుని రాజ్యం సాధిస్తున్నది తెలుసుకున్నప్పుడు, వారి హృదయాలు యెహోవా స్తుతి పలుకులతో నిస్సందేహంగా ఉప్పొంగుతాయి. తమ పరలోక తండ్రిపట్ల, ఆయన కుమారునిపట్ల తమ విశ్వాస్యతను ప్రదర్శించే అపారమైన అవకాశం వారికి ఉంటుంది. సమాధుల్లో నుండి బయటకు వస్తున్న వందల కోట్ల మందికి బోధించవలసిన విస్తృతమైన విద్యా పనిలో భాగం వహించడంలో సజీవులందరూ ఎంతో సంతోషిస్తారు, అంతేగాక వారు దేవుని విమోచనా క్రయధన ఏర్పాటును అంగీకరించడం కూడా అవసరం.

10 పునరుత్థానం చేయబడిన అబ్రాహాము తాను ఎదురుచూసిన ‘పట్టణపు’ పరిపాలనలో వాస్తవ జీవితాన్ని అనుభవించడంలో గొప్ప ఓదార్పును పొందుతాడు. (హెబ్రీయులు 11:10) పూర్వీకుడైన విశ్వసనీయ యోబు తన జీవన విధానం యథార్థతా పరీక్షలు ఎదుర్కొన్న ఇతర యెహోవా సేవకులను బలపరిచిందని తెలుసుకున్నప్పుడు ఎంత పులకరించిపోతాడో కదా! ప్రేరణ క్రింద తాను వ్రాసిన ప్రవచనాల నెరవేర్పు ఎలా జరిగిందో తెలుసుకోవాలని దానియేలు ఎంతగా కోరుకుంటాడో కదా!

11 నిజానికి నీతియుక్త నూతనలోకంలో పునరుత్థానం ద్వారానైనా లేదా మహాశ్రమలు తప్పించుకోవడం ద్వారానైనా జీవం పొందే వారందరూ భూమిపట్ల, దాని నివాసులపట్ల యెహోవా సంకల్పం గురించి తెలుసుకోవలసింది ఎంతో ఉంటుంది. నిత్యం జీవిస్తూ, యుగయుగాలు యెహోవాను స్తుతించే ఉత్తరాపేక్ష వెయ్యేండ్ల విద్యా కార్యక్రమాన్ని నిస్సందేహంగా ఆనందమయం చేస్తుంది. అయితే, ఆ గ్రంథాల్లోని విషయాలను తెలుసుకునే కొద్దీ మనమేమి చేస్తామనేది అత్యంత ప్రాముఖ్యం. మనం నేర్చుకున్నది అన్వయించుకుంటామా? మనలను సత్యం నుండి ప్రక్కకు మళ్ళించాలని సాతాను చేసే చివరి ప్రయత్నాన్ని త్రిప్పికొట్టేందుకు మనలను బలపరిచే ఆవశ్యక సమాచారాన్ని ధ్యానిస్తూ, అన్వయించుకుంటామా?

12 క్రీస్తు విమోచనా క్రయధన బలి ప్రయోజనాల అన్వయింపు ద్వారా కలిగే అద్భుతమైన ఆశీర్వాదాలను మనం మరచిపోకూడదు. పునరుత్థానం ద్వారా తిరిగి జీవానికి తీసుకురాబడేవారికి ప్రస్తుతం అనుభవిస్తున్న వ్యాధులు, వైకల్యాలు ఉండవు. (యెషయా 33:24) పునరుత్థానం చేయబడే వందల కోట్ల మందికి ఉపదేశించే విద్యాపనిలో పూర్తిగా భాగం వహించేందుకు నూతనలోక నివాసులందరికీ బలమైన శరీరం, పరిపూర్ణ ఆరోగ్యపు ఉత్తరాపేక్ష సహాయం చేస్తాయి. అలాగే యెహోవాకు స్తుతి కలిగేలా ఈ భూగ్రహాన్నంతా పరదైసుగా మార్చే బృహత్తర కార్యక్రమంలో కూడా ఆ నివాసులు పాల్గొంటారు.

13 చివరి పరీక్ష నిమిత్తం సాతాను అగాధం నుండి విడుదల చేయబడినప్పుడు, అతడు మానవులను మళ్లీ ఒకసారి మోసగించడానికి ప్రయత్నిస్తాడు. ప్రకటన 20:7-9 ప్రకారం సాతాను దుష్ట ప్రభావం క్రిందికి వచ్చేలా ‘మోసపోయిన జనములన్నీ’ లేదా ప్రజల సమూహాలన్నీ నాశనానికే అర్హులనే తీర్పును ఎదుర్కొంటాయి. ‘పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించివేస్తుంది.’ వెయ్యేండ్ల కాలంలో పునరుత్థానం చేయబడి అలా నాశనమయ్యేవారు దండనాత్మక తీర్పు పునరుత్థానాన్ని పొందిన వారవుతారు. దానికి భిన్నంగా, పునరుత్థానం తర్వాత తమ యథార్థతను కాపాడుకున్న వారు నిత్యజీవమనే బహుమానాన్ని అందుకుంటారు. వారి పునరుత్థానం నిజంగా ‘జీవ పునరుత్థానముగా’ ఉంటుంది.​—⁠యోహాను 5:​29.

14 పునరుత్థాన నిరీక్షణ ఇప్పుడు కూడా మనలను ఎలా ఓదార్చగలదు? ముఖ్యంగా, మనం భవిష్యత్తులో దాని ప్రయోజనాలు తప్పక పొందాలంటే ఏమి చేయాలి?

ఇప్పుడు నేర్చుకోవలసిన పాఠాలు

15 ఇటీవలే మీరు మీ ప్రియమైన వారినెవరినైనా పోగొట్టుకొని, ఆ నష్టంవల్ల కలిగిన పెద్ద మార్పుతో పోరాడుతుండవచ్చు. అయితే సత్యం తెలియని వారికి లభించని అంతరంగ మనశ్శాంతినీ, బలాన్నీ పొందడానికి పునరుత్థాన నిరీక్షణ మీకు సహాయం చేస్తుంది. “నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు” అని పౌలు థెస్సలొనీకయులను ఓదార్చాడు. (1 థెస్సలొనీకయులు 4:13) పునరుత్థానాన్ని కళ్లారా చూస్తున్న వారిగా నూతనలోకంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? అలాగైతే, మీ ప్రియమైన వారిని మళ్లీ కలుసుకునే భావి నిరీక్షణ గురించి ధ్యానించడం ద్వారా ఓదార్పు పొందండి.

16 ఆదాము తిరుగుబాటు ఫలితంగా వచ్చిన భౌతిక పర్యవసానాల మూలంగా మీరు అనారోగ్యంతో బాధపడుతుండవచ్చు. నూతనలోకంలో పునరుత్థానం మూలంగా మళ్లీ బ్రతికి, ఉత్తేజకరమైన ఆరోగ్యాన్ని, శక్తిని పొందే ఆనందకరమైన ఉత్తరాపేక్షను మరచిపోయేలా చేసేందుకు ఈ దుఃఖ భారాన్ని అనుమతించకండి. అప్పుడు మీరు కళ్లు తెరిచి, మీ పునరుత్థానపు ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఆత్రంగా ఎదురుచూస్తున్న వారిని చూసినప్పుడు, దేవుని ప్రేమపూర్వక దయనుబట్టి మీరాయనకు కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండలేరు.

17 ఈలోగా మనం గుర్తుపెట్టుకోవలసిన రెండు పాఠాలను పరిశీలించండి. మొదటిది ఇప్పుడే యెహోవాకు పూర్ణాత్మతో సేవ చేయడం ప్రాముఖ్యమనే విషయం. మన యజమాని క్రీస్తుయేసును అనుకరించే మన స్వయం త్యాగపూరిత జీవితం యెహోవాపట్ల మన పొరుగువారిపట్ల మన ప్రేమను ప్రదర్శిస్తుంది. వ్యతిరేకత లేదా హింస మన జీవనాధారాన్ని లేదా మన స్వేచ్ఛను పాడు చేసినా, మనకు ఎలాంటి పరీక్షలు ఎదురైనా విశ్వాసంలో దృఢంగా నిలబడడానికే మనం తీర్మానించుకుంటాం. వ్యతిరేకులు మనల్ని చంపేస్తామని బెదిరించినా, యెహోవాపట్ల ఆయన రాజ్యంపట్ల విశ్వసనీయంగా ఉండేందుకు పునరుత్థాన నిరీక్షణ మనలను ఓదార్చి బలపరుస్తుంది. అవును, రాజ్యాన్ని ప్రకటించే, శిష్యులను చేసే పనిపట్ల మనకున్న ఆసక్తి, నీతిమంతుల కోసం యెహోవా దాచిపెట్టిన నిత్యాశీర్వాదాలు పొందే ఉత్తరాపేక్షను మనకిస్తుంది.

18 రెండవ పాఠం, మన అపరిపూర్ణ శరీరం కలిగించే శోధనలను మనం ఎలా ఎదుర్కొంటాం అనేదానికి సంబంధించినది. పునరుత్థాన నిరీక్షణకు సంబంధించిన మన జ్ఞానం, యెహోవా అపారమైన కృపపట్ల మనకున్న కృతజ్ఞతా భావం విశ్వాసంలో దృఢంగా ఉండాలనే మన తీర్మానాన్ని బలపరుస్తుంది. అపొస్తలుడైన యోహాను ఇలా హెచ్చరించాడు: “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (1 యోహాను 2:15-17) ఈ లోకం ఆశ చూపే ఐశ్వర్యాసక్తిని “వాస్తవమైన జీవము”తో పోల్చినప్పుడు అది వెలవెలపోతుంది. (1 తిమోతి 6:17-19) లైంగిక దుర్నీతికి పాల్పడే శోధన కలిగినప్పుడు మనం దానిని దృఢంగా ఎదిరిస్తాం. ఒకవేళ మనం యెహోవాకు సంతోషం కలిగించని ప్రవర్తనలో కొనసాగుతూ అర్మగిద్దోనుకు ముందే చనిపోతే, మనం కూడా పునరుత్థాన ఉత్తరాపేక్ష లేనివారి స్థితిలోనే ఉంటామని మనం గ్రహిస్తాం.

19 అన్నిటికన్నా ప్రాముఖ్యంగా, ఇప్పుడూ ఎల్లప్పుడూ యెహోవా హృదయాన్ని సంతోషపెట్టే అమూల్యమైన ఆధిక్యతను మనమెన్నటికీ మరచిపోకూడదు. (సామెతలు 27:11) మరణం వరకు నమ్మకంగా ఉండడం లేదా ఈ దుష్ట విధానాంతం వరకు యథార్థంగా ఉండడం మనం విశ్వ సర్వాధిపత్యపు వివాదంలో ఎటువైపు ఉన్నామనేది యెహోవాకు రూఢిపరుస్తుంది. అలా మహాశ్రమ దాటుకొని లేదా అద్భుతమైన పునరుత్థానం పొందడం ద్వారా భూపరదైసులో జీవించడం ఎంత ఆనందకరమో కదా!

మన కోరికలను తీర్చుకోవడం

20 పునరుత్థానానికి సంబంధించిన మన చర్చ కొన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు. వివాహితులైయుండి మరణించినవారి విషయంలో యెహోవా ఎలాంటి ఏర్పాట్లు చేస్తాడు? (లూకా 20:34, 35) ప్రజలు చనిపోయిన ప్రాంతంలోనే పునరుత్థానం అవుతారా? పునరుత్థానం చేయబడేవారు తమ కుటుంబీకుల సమీప ప్రాంతంలోనే తిరిగి బ్రతుకుతారా? పునరుత్థానానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి ఇలా అనేక ఇతర ప్రశ్నలు వస్తాయి. ఏదేమైనప్పటికీ, యిర్మీయా పలికిన ఈ మాటలను మనం గుర్తుపెట్టుకోవాలి: “తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయాళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు. నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణకొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.” (విలాపవాక్యములు 3:25, 26) యెహోవా నిర్ణయకాలంలో మనకు సంపూర్ణ తృప్తి కలిగే మేరకు అన్ని విషయాలు వెల్లడి చేయబడతాయి. ఈ విషయంలో మనం ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?

21 యెహోవాను స్తుతిస్తూ ప్రేరేపిత కీర్తనకర్త పలికిన ఈ మాటలను ధ్యానించండి: “నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.” (కీర్తన 145:16) మన వయస్సు పెరుగుతున్నకొద్దీ మన కోరికలు మారుతుంటాయి. మనం చిన్నప్పుడు కోరుకున్నదే ఇప్పుడు మన కోరికగా ఉండదు. మన జీవన దృక్కోణం మన అనుభవాలతోపాటు మన నిరీక్షణల కారణంగా కూడా ప్రభావం చెందుతుంది. అయినప్పటికీ, నూతనలోకంలో మన యుక్తమైన కోరికలు ఏవైనప్పటికీ యెహోవా వాటిని తప్పకుండా తీరుస్తాడు.

22 నమ్మకంగా ఉండాలనేదే ప్రస్తుతం మనలో ప్రతీ ఒక్కరికీ ప్రాముఖ్యం. “గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.” (1 కొరింథీయులు 4:2) మహిమగల దేవుని రాజ్య సువార్తకు మనం గృహనిర్వాహకులుగా ఉన్నాం. మనం కలిసే వారందరికీ శ్రద్ధగా సువార్త ప్రకటించడం మనలను జీవమార్గంలో ఉంచుతుంది. మనందరికీ “కాలవశముచేతను, అనూహ్యంగానూ” ఏదైనా జరగవచ్చనే వాస్తవాన్ని ఎన్నటికీ మరచిపోకండి. (ప్రసంగి 9:​11, NW) జీవిత అనిశ్చితలు కలిగించే అనవసరమైన ఎలాంటి చింతనైనా ఎదుర్కోవడానికి పునరుత్థానం గురించిన అద్భుతమైన నిరీక్షణకు హత్తుకొని ఉండండి. మీరు క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనకు ముందే మరణిస్తారని మీకనిపిస్తే, విడుదల తప్పక వస్తుందనే హామీనిబట్టి ఓదార్పు పొందండి. యెహోవా నిర్ణయకాలంలో మీరు సృష్టికర్తను ఉద్దేశించి యోబు పలికిన ఈ మాటలనే ప్రతిధ్వనించగలుగుతారు: “నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను.” తన జ్ఞాపకంలో ఉన్న వారందరినీ తిరిగి బ్రతికించాలని కోరుకునే యెహోవాకు స్తుతి కలుగును గాక!​—⁠యోబు 14:​15.

[అధస్సూచీలు]

^ పేరా 4 యెహోవాసాక్షులు ప్రచురించిన తేజరిల్లు! (ఆంగ్లం) జూలై 8, 1988 10వ పేజీ చూడండి.

^ పేరా 5 యెహోవాసాక్షులు ప్రచురించిన యెహోవాసాక్షులు​—⁠దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) పుస్తకంలో 662వ పేజీ చూడండి.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

వెయ్యేండ్ల కాలంలో ప్రజలు దేని ఆధారంగా తీర్పు పొందుతారు?

కొందరికి “జీవపునరుత్థానము” మరికొందరికి “తీర్పుపునరుత్థానము” ఎందుకు ఉంటుంది?

పునరుత్థాన నిరీక్షణ మనలను ఇప్పుడు ఏవిధంగా ఓదార్చగలదు?

పునరుత్థానం గురించి జవాబు దొరకని ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి కీర్తన 145:16లోని మాటలు మనకు ఎలా సహాయం చేస్తాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1-3. భవిష్యత్తుకు సంబంధించి కొందరికి ఎలాంటి నిరీక్షణ ఉంది? వివరించండి.

4. పైన చెప్పిన అనుభవాలు మీ మీద ఎలాంటి ప్రభావం చూపించాయి, తర్వాత మనం ఏమి పరిశీలిస్తాం?

5, 6. అపొస్తలుడైన యోహాను ప్రకటన 20:12, 13లో వ్రాసిన దర్శనము ఏమి వెల్లడి చేస్తోంది?

7. క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో జరిగే తీర్పుకు ఏది ఆధారంగా ఉంటుంది?

8. పునరుత్థానం చేయబడేవారికి ఏ రెండు ఫలితాలు ఉండే అవకాశముంది?

9. (ఎ) పునరుత్థానం చేయబడిన తర్వాత చాలామంది నిస్సందేహంగా ఏమి తెలుసుకుంటారు? (బి) ఎలాంటి విస్తృతమైన విద్యాపని జరుగుతుంది?

10, 11. (ఎ) భూమ్మీదున్న వారందరికీ వెయ్యేండ్ల పరిపాలన ఎలాంటి అవకాశాలను ఇస్తుంది? (బి) అది మనలను ఎలా ప్రభావితం చేయాలి?

12. ఇటు విద్యా పనిలో అటు భూమిని పరదైసుగా మార్చడంలో పూర్తిగా భాగం వహించేందుకు ప్రతీ ఒక్కరికి ఏది సహాయం చేస్తుంది?

13, 14. చివరి పరీక్షలో సాతానును విడుదల చేయడంలోని ఉద్దేశం ఏమిటి, వ్యక్తిగతంగా మనకు ఎలాంటి ఫలితం లభించే అవకాశం ఉంది?

15. పునరుత్థాన నమ్మకం ఇప్పుడు ఎలా సహాయం చేయగలదు?

16. పునరుత్థానం చేయబడినప్పుడు బహుశా మీ భావాలు ఎలా ఉంటాయి?

17, 18. మనం ఏ రెండు ప్రాముఖ్యమైన పాఠాలను గుర్తుపెట్టుకోవాలి?

19. మనం ఎలాంటి అమూల్యమైన ఆధిక్యతను మరచిపోకూడదు?

20, 21. పునరుత్థానం గురించి జవాబు దొరకని ప్రశ్నలు ఉన్నప్పటికీ నమ్మకంగా ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? వివరించండి.

22. యెహోవాను స్తుతించడానికి మనకు ఎందుకు మంచి కారణం ఉంది?

[21వ పేజీలోని చిత్రాలు]

పునరుత్థానంలో నమ్మకం మనకు ఇప్పుడు ఎలా సహాయం చేయవచ్చు?