విలక్షణమైన విజయం
విలక్షణమైన విజయం
ఉద్యోగ స్థలంలో, పాఠశాలలో, కుటుంబంలో, లేదా ప్రభుత్వం ఆంక్షలు విధించిన కారణంగా మీ విశ్వాసానికి వ్యతిరేకత ఎదురవుతోందా? అయితే నిరుత్సాహపడకండి. యెహోవాసాక్షులు చాలామంది అలాంటి పరీక్షలనే ఎదుర్కొన్నారు, అయితే వారు వాటిని విజయవంతంగా అధిగమించారు. ఎర్నా లుడాల్ఫ్ ఉదాహరణను పరిశీలించండి.
ఎర్నా 1908లో జర్మనీలోని ల్యుబెక్‌లో జన్మించింది. ఆమె కుటుంబమంతటిలో ఆమె ఒక్కతే యెహోవా సేవకురాలు. 1933లో హిట్లర్ అధికారానికి వచ్చినప్పుడు యెహోవాసాక్షులకు కష్టకాలాలు మొదలయ్యాయి. హిట్లర్‌కు గౌరవవందనం చేయనందుకు ఎర్నా సహోద్యోగులు ఆమెను బహిరంగంగా విమర్శించారు, ఆ కారణంగా నాజీలు ఆమెను అరెస్టు చేశారు. ఆమె వేర్వేరు జైళ్ళలో, హ్యాంబర్గ్-ఫల్స్‌బ్యూటెల్, మారినెన్, లిక్టెన్‌బర్గ్, రావెన్స్‌బ్రూక్‌లలోని నిర్బంధ శిబిరాల్లో ఎనిమిది సంవత్సరాలు గడిపింది. ఎర్నా రావెన్స్‌బ్రూక్ నిర్బంధ శిబిరంలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది, అది ఆమె విజయం సాధించడానికి దారితీసింది.
అసాధారణమైన పనిమనిషి
ప్రొఫెసర్ ఫ్రెడ్రిక్ హాల్ట్స్, ఆయన భార్య ఆలిసె బెర్లిన్‌లో నివసించేవారు. వారు నాజీ పార్టీ సభ్యులు కాదు, దాని సిద్ధాంతాలకు మద్దతు ఇచ్చేవారు కాదు. అయితే కొన్ని నిర్బంధ శిబిరాల్లోని ఖైదీలను చూసుకునే ఒక సీనియర్ ఎస్.ఎస్. అధికారి వారికి బంధువు. కాబట్టి ప్రొఫెసర్, ఆయన భార్య ఒక పనిమనిషి కోసం చూస్తున్నప్పుడు, ఆ ఎస్.ఎస్. అధికారి శిబిరంలోనుండి ఒక ఆడ ఖైదీని ఎంపిక చేసుకోమని వారికి చెప్పాడు. అలా 1943 మార్చిలో ఆలిసె ఒక పనిమనిషిని ఎంపిక చేసుకోవడానికి రావెన్స్‌బ్రూక్ నిర్బంధ శిబిరానికి వెళ్ళింది. ఆమె ఎవరిని ఎంపిక చేసుకుంది? ఎర్నా లుడాల్ఫ్‌నే. ఆమె హాల్ట్స్ కుటుంబంతోపాటు నివసించడం ప్రారంభించింది, వారు ఆమెను బాగా చూసుకునేవారు. యుద్ధం ముగిసిన తర్వాత ఆమె ఆ కుటుంబంతోపాటు జాలే నది ఒడ్డున ఉన్న హాలే నగరానికి వెళ్ళింది. అక్కడ మరోసారి ఎర్నా వ్యతిరేకతను ఎదుర్కొంది, అయితే ఈసారి తూర్పు జర్మనీలోని సోషలిస్టు అధికారులు ఆమెను వ్యతిరేకించారు. 1957లో హాల్ట్స్ కుటుంబం బలవంతంగా పశ్చిమ జర్మనీకి వెళ్లిపోవలసి వచ్చింది, ఎర్నా కూడా వారితోపాటు వెళ్ళింది. చివరికి ఎర్నాకు స్వతంత్రంగా తన మతాన్ని అవలంబించే అవకాశం లభించింది.
మరి ఎర్నా విలక్షణమైన విజయాన్ని ఎలా సాధించింది? ఎర్నా చక్కని నడవడి కారణంగా, బైబిలు సందేశాన్ని నైపుణ్యవంతంగా బోధించడం కారణంగా ఆలిసె హాల్ట్స్, ఆమె ఐదుగురు పిల్లలు యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నారు. అంతేకాకుండా ఆలిసె 11 మంది మనవళ్ళు, మనవరాళ్ళు కూడా సాక్షులయ్యారు. వారిలో ఇద్దరు ప్రస్తుతం జర్మనీలో సెల్టర్స్‌లోవున్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవ చేస్తున్నారు. “మా కుటుంబం సత్యంలో ఉండడానికి కారణం ఎర్నా మాదిరే” అని ఆలిసె కూతుర్లలో ఒకరైన సుజాన్ చెబుతోంది. ఎర్నా చూపించిన సహనం గొప్పగా ఆశీర్వదించబడింది. మరి మీ పరిస్థితి ఏమిటి? కష్ట పరిస్థితుల్లో నమ్మకంగా సహించడం ద్వారా మీరు కూడా అలాంటి ఆశీర్వాదకరమైన ఫలితాలను పొందవచ్చు. అవును మంచి నడవడి, నైపుణ్యవంతమైన ప్రకటనా పని మీరు విలక్షణమైన విజయం సాధించడానికి సహాయం చేయవచ్చు. *
[అధస్సూచి]
^ పేరా 6 ఈ ఆర్టికల్‌ను ప్రచురణ కోసం సిద్ధం చేస్తున్న సమయంలో 96 సంవత్సరాల ఎర్నా లుడాల్ఫ్ మరణించింది. ఆమె చివరివరకూ నమ్మకంగా ఉంది.
[31వ పేజీలోని చిత్రం]
హాల్ట్స్ కుటుంబ సభ్యులతోపాటు ఎర్నా లుడాల్ఫ్ (కూర్చొని ఉంది)