కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వ్యతిరేకతను ధైర్యంగా ఎదుర్కోవడం

వ్యతిరేకతను ధైర్యంగా ఎదుర్కోవడం

వ్యతిరేకతను ధైర్యంగా ఎదుర్కోవడం

అల్లరిమూక ఒకటి అపొస్తలుడైన పౌలు సహచరులైన గాయిను, అరిస్తర్కును బలవంతంగా ఎఫెసులోని ఒక నాటకశాలలోకి తీసుకొని వెళ్లింది. అక్కడి ప్రజలు ఆవేశంతో పిచ్చిపట్టినట్టు రెండు గంటలపాటు, “ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి!” అని కేకలు పెట్టారు. (అపొస్తలుల కార్యములు 19:28, 29, 34) ఆ వ్యతిరేకత ఎదురైనప్పుడు పౌలు సహచరులు స్థిరంగా నిలబడ్డారా? అసలు వారికి ఆ పరిస్థితి ఎందుకు ఎదురయ్యింది?

పౌలు దాదాపు మూడు సంవత్సరాలపాటు ఎఫెసు నగరంలో విజయవంతంగా ప్రకటనా పనిని కొనసాగించాడు. తత్ఫలితంగా చాలామంది ఎఫెసీయులు విగ్రహాలను ఆరాధించడం మానేశారు. (అపొస్తలుల కార్యములు 19:26; 20:31) ఎఫెసులో సర్వసాధారణంగా సంతాన సాఫల్య దేవతయైన అర్తెమి ఆలయపు వెండి విగ్రహాలు కనిపిస్తాయి, ఆ దేవతకు సంబంధించిన ఓ గొప్ప ఆలయం కొండపై ఉండేది. ఆ ఆలయ నమూనాలో చేయబడిన చిన్న విగ్రహాలను ప్రజలు తాయెత్తులుగా కట్టుకునేవారు లేదా ఇళ్ళలో పెట్టుకునేవారు. అయితే క్రైస్తవులు ఆ విగ్రహాలను కొనేవారు కాదు.​—⁠1 యోహాను 5:21.

కంసాలివాడైన దేమేత్రి, పౌలు పరిచర్యవల్ల తన లాభసాటి వ్యాపారం దెబ్బ తింటోందని భావించాడు. అతను అర్ధసత్యాలను చెప్పి, విషయాన్ని గోరంతలు కొండంతలుగా చేసి చెప్పి, కొంతకాలానికి ఆసియా మైనరు అంతటా ప్రజలు అర్తెమిదేవిని ఆరాధించడం మానేస్తారు అని తన తోటి పనివాళ్ళను నమ్మించాడు. కోపంతో రెచ్చిపోయిన ఆ కంసాలులు అర్తెమిదేవిని స్తుతించడం మొదలు పెట్టేసరికి, అల్లర్లు ప్రబలి నగరమంతా గందరగోళంగా తయారయ్యింది.​—⁠అపొస్తలుల కార్యములు 19:24-29.

దాదాపు 25,000 మంది ప్రేక్షకులు కూర్చోడానికి వీలుగా ఉండే నాటకశాలలో వేలాదిమంది సమకూడారు. ఆ అల్లరిమూకతో మాట్లాడడానికి పౌలు ముందుకు వచ్చాడు, కానీ స్నేహపూర్వకమైన అధికారులు అలా చేయవద్దని ఆయనను వారించారు. చివరకు ఆ నగరపు కరణం ప్రజలను శాంతింపజేశాడు, గాయి, అరిస్తర్కు అక్కడనుండి సురక్షితంగా తప్పించుకోగలిగారు.​—⁠అపొస్తలుల కార్యములు 19:35-41.

నేడు దేవుని ప్రజలు కూడా తమ పరిచర్యను కొనసాగిస్తుండగా వ్యతిరేకులను, అల్లర్లను ఎదుర్కోవచ్చు. వారు తరచూ విగ్రహారాధన, అనైతికత, అపరాధం ప్రబలి ఉన్న నగరాల్లో సువార్తను ప్రకటిస్తారు. అయితే వారు ఎఫెసు నగరంలో “బహిరంగముగాను, ఇంటింటను” ప్రకటించడాన్ని మానని అపొస్తలుడైన పౌలు మాదిరిని ధైర్యంగా అనుకరిస్తారు. (అపొస్తలుల కార్యములు 20:20) అలాగే వారు యెహోవా ‘వాక్యము ప్రబలమై వ్యాపించడాన్ని’ చూసినప్పుడు కూడా పౌలు సంతోషించినట్లే సంతోషిస్తారు.​—⁠అపొస్తలుల కార్యములు 19:20.

[30వ పేజీలోని చిత్రం]

ఎఫెసులోని నాటకశాల శిథిలాలు