కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇంగితజ్ఞానం ఎందుకు ఇంత అరుదుగా ఉంది?

ఇంగితజ్ఞానం ఎందుకు ఇంత అరుదుగా ఉంది?

ఇంగితజ్ఞానం ఎందుకు ఇంత అరుదుగా ఉంది?

“ఏమయ్యింది అతనికి? ఇలాంటి పని చేయకూడదని అతనికి తెలియదా?” అని ఒకాయన అన్నాడు. ఇంకొకాయన తల అడ్డంగా ఊపుతూ “అతనికి కొంచెమైనా ఇంగితజ్ఞానం ఉంటే, అలాంటి పని చేసేవాడే కాదు” అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. మీరు ఎప్పుడైనా ఇలాంటి వ్యాఖ్యానాలు విన్నారా? “ఇంగితజ్ఞానం” అంటే ఏమిటి?

ఇంగితజ్ఞానం అనే పదానికి “ఖచ్చితమైన పరిగ్రహణం,” “అవగాహన,” “యుక్తాయుక్త పరిజ్ఞానం లేదా గుణాగుణ వివేచన” అనే నిర్వచనాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి వివేచనతో ఆలోచించే, తెలివిగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉందని అది సూచిస్తుంది. కాబట్టి ఇంగితజ్ఞానం ఉండాలంటే మనం మన ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించాలి. చాలామంది తమ కోసం ఇతరులు ఆలోచించాలని ఆశిస్తారు. నిర్ణయాలు తీసుకోవడానికి వారు సమాచార మాధ్యమాలపై, తమ స్నేహితులపై, లేదా సాధారణ ప్రజల అభిప్రాయాలపై ఆధారపడతారు.

నేటి లోకంలో ఇంగితజ్ఞానం ఎంతగా లోపించినట్లు కనిపిస్తుందంటే ఒక వ్యక్తి ఇలా వ్యాఖ్యానించాడు: ‘ఇంగితజ్ఞానం చాలా అరుదుగా ఉంది.’ మనం ఇంగితజ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవచ్చు? దాని ప్రయోజనాలేమిటి?

ఎలా సంపాదించుకోవచ్చు?

మంచి జ్ఞానాన్ని, వివేచనను సంపాదించుకోవడానికి సమయం, విషయాన్ని అన్ని కోణాలనుండి జాగ్రత్తగా పరిశీలించడం, తదేక ప్రయత్నం అవసరం, అయితే ఇంగితజ్ఞానాన్ని సంపాదించుకోవడం అసాధ్యం కాదు. ఇంగితజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సహాయం చేసే మూడు విషయాలను పరిశీలించండి.

బైబిలును అధ్యయనం చేసి, దాని సలహాను పాటించండి. అత్యుత్తమమైన భాషలో స్పష్టమైన తర్కంతో వ్రాయబడిన బైబిలు, జ్ఞానాన్ని, వివేచనను సంపాదించుకోవడానికి ఒక అద్భుతమైన సాధనం. (ఎఫెసీయులు 1:8) ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులకు ఇలా ఉద్బోధించాడు: “యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటిమీద ధ్యానముంచుకొనుడి.” (ఫిలిప్పీయులు 4:8) మనం ఆ సలహాను పాటిస్తే వివేచనతో, యుక్తాయుక్త పరిజ్ఞానంతో ప్రవర్తిస్తాము.

అనుభవం నుండి నేర్చుకోండి. ఇంగితజ్ఞానాన్ని జీవితానుభవంతో ముడిపెడుతూ ఒక స్విస్‌ కవి ఇలా వ్రాశాడు: “ఇంగితజ్ఞానం . . . అనుభవంతోను, ముందు చూపుతోను రూపొందించబడింది.” నిజమే “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.” (సామెతలు 14:15) మనం విషయాలను గమనించడంద్వారా, శిక్షణద్వారా, అనుభవంద్వారా ఇంగితజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. కాలం గడుస్తున్న కొద్దీ పనులను మరింత బాగా చేయడం నేర్చుకోవచ్చు. అయితే మనం మన తప్పులనుండి నేర్చుకోవడానికి మనకు వినయం అవసరం. ఈ అంత్యదినాల్లోని ప్రజలు చూపించే లక్షణాలైన గొప్పలు చెప్పుకోవడం, అహంకారం, మొండిగా ప్రవర్తించడం వంటివి ఇంగితజ్ఞానాన్ని సూచించవు.​—⁠2 తిమోతి 3:1-5.

సహవాసులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. వివేచనతో లేదా ఇంగితజ్ఞానంతో ప్రవర్తించే విషయంలో మన సహవాసులు మనకు సహాయం చేయవచ్చు లేదా మనల్ని ఆటంకపరచవచ్చు. సామెతలు 13:⁠20 ఇలా చెబుతోంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” దేవునికి అవిధేయత చూపిస్తూ ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారి ఆలోచనా విధానాన్ని లేదా వారి తలంపులను మనం అంగీకరించవలసిన అవసరం లేదు. సామెతలు 17:⁠12 విషయాన్ని ఇలా వివరిస్తోంది: “పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంటిని ఎదుర్కొన వచ్చును గాని మూర్ఖపుపనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు.”

ప్రయోజనాలేమిటి?

ఇంగితజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ప్రయోజనకరమైనది. అది జీవితాన్ని మరింత ఆసక్తికరంగా చేసి ఎంతో సమయాన్ని ఆదా చేస్తుంది. ఆలోచనారహితంగా పనులు చేయడంవల్ల కలిగే నిస్పృహను కూడా ఇంగితజ్ఞానం తగ్గిస్తుంది. వివేచన లేనివారు తమ జీవితాన్ని మరింత కష్టభరితం చేసుకుంటారు. “ఊరికి పోవు త్రోవ యెరుగనివారై బుద్ధిహీనులు తమ ప్రయాసచేత ఆయాస పడుదురు” అని బైబిలు చెబుతోంది. (ప్రసంగి 10:15) అలాంటి వ్యక్తులు అవిశ్రాంతంగా కష్టపడి పనిచేసినా యోగ్యమైనదేదీ సాధించలేరు.

బైబిలు పరిశుద్ధతపై, ఇతరులతో సంభాషించడంపై, కష్టపడి పనిచేయడంపై, పేదరికంలో జీవించడంపై, జీవితంలోని మరెన్నో అంశాలపై ఎన్నో ఆచరణాత్మకమైన సలహాలు ఇస్తోంది. తమ జీవితాలు సఫలమవుతాయా లేదా విఫలమవుతాయా అనేది తాము వివేచనతో ప్రవర్తించడానికి సహాయం చేసే బైబిలు సూత్రాలను ఎంతవరకూ అన్వయించుకున్నామనే దానిపై ఆధారపడి ఉందని లక్షలాదిమంది ధృవీకరించగలరు.

కేవలం వివరణాత్మకమైన ఉపదేశాలను లేదా నియమాలను పాటించడం కంటే ఎక్కువే చేయడానికి ఇంగితజ్ఞానం మనకు సహాయం చేస్తుంది. అది మన బాధ్యతలను నెరవేర్చడానికి మనకు సహాయం చేస్తుంది. అయితే ఇంగితజ్ఞానం, జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రత్యామ్నాయం కాదు. “జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును” అని సామెతలు 1:5 చెబుతోంది. మనం సమకూర్చుకున్న సమాచారాన్ని విశ్లేషించి దానినుండి సరైన ముగింపుకు రావడం కూడా మనం నేర్చుకోవాలి. మనం ‘జ్ఞానవంతంగా ప్రవర్తించడానికి’ అది సహాయం చేస్తుంది.​—⁠సామెతలు 28:​26.

వినయానికి, ఇంగితజ్ఞానానికి సన్నిహిత సంబంధముంది. మనం చాలా బాధ్యతలను చేపట్టాలని ఆశించవచ్చు, అయితే మనం వివేచనతో ఆలోచించి, మన పరిమితులను గుర్తించాలి. నిజమే ‘ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికి ఆసక్తులై’ ఉండమని అపొస్తలుడైన పౌలు మనకు చెబుతున్నాడు. (1 కొరింథీయులు 15:58) అయితే ఆ సలహాను ప్రసంగి 9:4లోని ఈ సూత్రంతో సమతుల్యపరచాలి: “చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా.” మనం యెహోవా సేవ చేస్తుండగా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటే, మనం ఇంకా ఎక్కువకాలం జీవించి ఆయన సేవను క్రియాశీలంగా చేయవచ్చు. మనం సహేతుకమైన సమతుల్యతతో పనులు చేసేందుకు ఇంగితజ్ఞానం సహాయం చేయగలదు, అప్పుడు మనం మన సంతోషాన్ని పోగొట్టుకోకుండానే అవసరమైన పనులను చేయగలుగుతాము. అవును ఇంగితజ్ఞానం ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.

[14వ పేజీలోని చిత్రం]

బైబిలులో ఆధారపడదగిన సలహాలు సమృద్ధిగా ఉన్నాయి

[15వ పేజీలోని చిత్రం]

ఇంగితజ్ఞానాన్ని గమనించడం ద్వారా, శిక్షణ ద్వారా, అనుభవం ద్వారా సంపాదించుకోవచ్చు