కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని జ్ఞానంతో బలపర్చబడిన కుటుంబాలు

దేవుని జ్ఞానంతో బలపర్చబడిన కుటుంబాలు

“యెహోవా వలననే నాకు సహాయము కలుగును”

దేవుని జ్ఞానంతో బలపర్చబడిన కుటుంబాలు

“బెర్లిన్‌ గోడ.” అర్జెంటీనాలోని ఒక వివాహిత జంట తమ ఇంటిని రెండు భాగాలుగా విడదీయడానికి కట్టుకున్న గోడకు ఆ పేరు పెట్టుకున్నారు! వారిద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు ఉండేవి; వారిద్దరూ ఒకరినొకరు తీవ్రంగా ద్వేషించునేవారు.

విచారకరంగా, ఆ జంట ఉన్న పరిస్థితి అసాధారణమైనదేమీ కాదు. చాలా కుటుంబాలు తగవులతో, నమ్మకద్రోహంతో, శత్రుత్వంతో పీడించబడుతున్నాయి. ఇది నిజంగా విచారించవలసిన పరిస్థితే, ఎందుకంటే కుటుంబ ఏర్పాటును స్వయంగా దేవుడే స్థాపించాడు. (ఆదికాండము 1:27, 28; 2:23, 24) దేవుడిచ్చిన ఆ బహుమతి ప్రగాఢమైన ప్రేమను కనబరచడానికి కావలసిన వాతావరణాన్ని కల్పిస్తుంది. (రూతు 1:9) కుటుంబ సభ్యులు దేవుడు తమకు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చడం ద్వారా యెహోవాను ఘనపర్చవచ్చు, ఒకరికొకరు ఆశీర్వాదకరంగా ఉండవచ్చు. *

దేవుడే కుటుంబ ఏర్పాటును స్థాపించాడు కాబట్టి, కుటుంబాలు పని చేయవలసిన విధానంపై ఆయనకున్న ఆలోచనా విధానమే మన అవగాహనను ప్రభావితం చేయనివ్వాలి. ప్రత్యేకించి సవాళ్ళు ఎదురైనప్పుడు కుటుంబాలు వాటిని విజయవంతంగా అధిగమించడానికి సహాయపడేందుకు రూపొందించబడిన ఆచరణాత్మకమైన ఉపదేశం ఆయన వాక్యంలో ఉంది. భర్తల పాత్ర గురించి బైబిలు ఇలా చెబుతోంది: “పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు.” భర్తలు ఆ నియమాన్ని పాటించినప్పుడు, ఆయన భార్య ‘తన భర్తయందు భయము కలిగియుండడానికి’ అంటే ఆయనపట్ల ప్రగాఢమైన గౌరవం చూపించడానికి సంతోషిస్తుంది.​—⁠ఎఫెసీయులు 5:25-29, 33.

తల్లిదండ్రులకు, వారి పిల్లలకు మధ్య ఉండవలసిన సంబంధం గురించి మాట్లాడుతూ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:4) అలా చేసినప్పుడు కుటుంబంలో ప్రేమపూర్వకమైన వాతావరణం నెలకొంటుంది, అది పిల్లలు తమ తల్లిదండ్రులు చెప్పిన మాట వినడాన్ని మరింత సులభం చేస్తుంది.​—⁠ఎఫెసీయులు 6:⁠1.

పైన చెప్పబడిన విషయాలు, కుటుంబ జీవితం గురించి బైబిలులో ఉన్న ఆధారపడదగిన సలహాలకు కేవలం ఉదాహరణలు మాత్రమే. దైవిక సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా చాలామంది తమ ఇంట్లో సంతోషాన్ని అనుభవిస్తారు. ఉదాహరణకు, ఆర్టికల్‌ ఆరంభంలో ప్రస్తావించబడిన వివాహిత జంట విషయమే పరిశీలించండి. వారు మూడు నెలలపాటు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేసిన తర్వాత, వివాహానికి సంబంధించి దానిలోవున్న జ్ఞానయుక్తమైన సలహాలను అన్వయించుకోవడం ప్రారంభించారు. వారు తమ మధ్య సంభాషణను మెరుగుపర్చుకోవడానికి, ఒకరి అవసరాలపట్ల ఒకరు శ్రద్ధ కలిగివుండడానికి, క్షమించేవారిగా ఉండడానికి ఎంతో కృషి చేశారు. (సామెతలు 15:22; 1 పేతురు 3:7; 4:8) వారు తమ కోపాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకొని, పరిస్థితి చెయ్యి దాటుతుంది అనిపించినప్పుడు దేవుని సహాయం కోసం ప్రార్థించడం నేర్చుకున్నారు. (కొలొస్సయులు 3:19) అనతి కాలంలోనే వారిద్దరి మధ్య ఉన్న “బెర్లిన్‌ గోడ” కూలిపోయింది!

దేవుడు కుటుంబాన్ని బలపర్చగలడు

దేవుని ప్రమాణాలను తెలుసుకొని వాటిని అన్వయించుకుంటే, ఒత్తిళ్ళు ఎదుర్కోవడానికి కుటుంబాలను బలపరచగలదు. అలా చేయడం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే మన కాలంలో కుటుంబ వ్యవస్థపై తీవ్రమైన దాడి జరుగుతుందని ముందే ప్రవచించబడింది. ప్రస్తుత కాలంలోని నైతిక పతనం, మానవ సమాజపు పతనం గురించి పౌలు ముందుగానే చెప్పాడు. “అంత్యదినములలో” ప్రజలు నమ్మకద్రోహులుగా ఉంటారని, “అనురాగము” ఉండదని, పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారని, “పైకి భక్తిగలవారివలె” కనిపించేవారికి కూడా అలాంటి లక్షణాలు ఉంటాయని ఆయన చెప్పాడు.​—⁠2 తిమోతి 3:​1-5.

దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించడం, కుటుంబంపై అలాంటి హానికరమైన ప్రభావాలు పడకుండా కాపాడుతుంది. తాము ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి ఆధ్యాత్మిక సహాయం అవసరం అని చాలా కుటుంబాలు గ్రహించాయి. కుటుంబ సభ్యులు దేవునితో మంచి సంబంధాన్ని కాపాడుకోవాలని కోరుకుంటే, వారు బైబిలు సూత్రాలను అన్వయించుకోవాలి, అన్నింటికంటే ప్రాముఖ్యంగా “యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే” అని వారు గ్రహించాలి. (కీర్తన 127:1) కుటుంబ జీవితంలో దేవునికి మొదటిస్థానం ఇస్తే అది, కుటుంబ సంతోషాన్ని కాపాడుకోవడానికి తోడ్పడుతుంది.​—⁠ఎఫెసీయులు 3:14, 15.

హవాయ్‌కు చెందిన డెన్నిస్‌ అనే వ్యక్తి అదెంత నిజమో గ్రహించాడు. ఆయన క్రైస్తవుడినని చెప్పుకున్నా, బూతులు, కొట్లాటలే ఆయన జీవిత విధానంగా మారాయి. సైన్యంలో పని చేసిన తర్వాత ఆయన ఇంకా క్రూరంగా, ద్వేషపూరితంగా తయారయ్యాడు. ఆయన ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “నేను ఎప్పుడూ కొట్లాడుతూ ఉండేవాడిని. నాకేమి జరిగినా నేను పట్టించుకునేవాడిని కాదు, చావంటే భయపడేవాడిని కాదు. బూతులు తిట్టడం, కొట్లాడడం అనుదిన కార్యక్రమంగా మారాయి. యెహోవాసాక్షియైన నా భార్య, బైబిలు అధ్యయనం చేయమని నన్ను ప్రోత్సహించింది.”

డెన్నిస్‌ తన భార్య ప్రయత్నాలను ప్రతిఘటించాడు. అయితే ఆమె క్రైస్తవ నడవడి ఆయన ప్రతికూల వైఖరిని తగ్గించింది. చివరకు డెన్నిస్‌ తన భార్యా పిల్లలతో కలిసి ఒక క్రైస్తవ కూటానికి హాజరయ్యాడు. ఆ తర్వాత డెన్నిస్‌తో బైబిలు అధ్యయనం ప్రారంభించబడింది, ఆయన చక్కని పురోగతిని సాధించాడు. ఆయనకు 28 సంవత్సరాలుగా ఉన్న పొగత్రాగే అలవాటును మానుకున్నాడు, తాను మానుకోవాలనుకుంటున్న పనులను చేసే స్నేహితులతో సహవాసం మానేశాడు. యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ డెన్నిస్‌ ఇలా చెప్పాడు: “నా కుటుంబ జీవితం ఎంతో మెరుగుపడింది. మేము ఒక కుటుంబంగా కూటాలకు హాజరవడం, పరిచర్యకు వెళ్ళడం ప్రారంభించాము. నా ఇద్దరు పిల్లలు ఇప్పుడు నన్ను చూసి భయంతో వణకరు, ఎందుకంటే నేను నా కోపాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకున్నాను, బూతులు తిట్టడం మానేశాను. మేము బైబిలు విషయాల గురించి చర్చించడాన్ని ఆనందిస్తున్నాము. నేను బైబిలును అధ్యయనం చేయకపోయి ఉంటే, ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు; చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటూ ఉండేవాడిని.”

కుటుంబాలు యెహోవా చిత్తం చేయడానికి కృషి చేస్తే సంతోషంగా ఉండవచ్చు. కుటుంబంలో ఒక్క సభ్యుడు బైబిలు సూత్రాలను అన్వయించుకున్నా, పరిస్థితులు మరింత మెరుగ్గా ఉంటాయని అనుభవాలు చూపిస్తున్నాయి. క్రైస్తవ కుటుంబాన్ని నిర్మించుకోవడం కష్టమైన పని, దానికి నైపుణ్యమూ సమయమూ అవసరం. అయితే అలా నిర్మించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను యెహోవా తప్పకుండా ఆశీర్వదిస్తాడని కుటుంబ సభ్యులు నమ్మకంతో ఉండవచ్చు. వారు కీర్తనకర్త మాటలనే పలకవచ్చు: “యెహోవావలననే నాకు సహాయము కలుగును.”​—⁠కీర్తన 121:⁠2.

[అధస్సూచి]

^ పేరా 4 యెహోవాసాక్షుల క్యాలెండర్‌—⁠2005 (ఆంగ్లం), మే/జూన్‌ చూడండి.

[9వ పేజీలోని బ్లర్బ్‌]

‘పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము దేవునిబట్టియే కుటుంబమని పిలువబడుచున్నది.’​—⁠ఎఫెసీయులు 3:​14-15.

[8వ పేజీలోని బాక్సు]

యెహోవా కుటుంబ ఏర్పాటును ఎంతో విలువైనదిగా పరిగణిస్తాడు

“దేవుడు వారిని ఆశీర్వదించెను; . . . మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడని . . . వారితో చెప్పెను.”​—⁠ఆదికాండము 1:28.

“యెహోవాయందు భయభక్తులు కలిగిన . . . వారందరు ధన్యులు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును.”​—⁠కీర్తన 128:1, 3.