కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

దావీదు, బత్షెబలు వ్యభిచారం చేసినందుకు చంపబడడానికి బదులు వారికి క్రొత్తగా జన్మించిన శిశువు ఎందుకు చనిపోయాడు?

మోషే ధర్మశాస్త్రం ఇలా ఆజ్ఞాపించింది: “ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడినయెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు.” (ద్వితీయోపదేశకాండము 22:​22) దావీదు, బత్షెబలు చేసిన పాపానికి సంబంధించిన న్యాయపరమైన సమస్యను మానవ న్యాయాధిపతులు ధర్మశాస్త్ర ప్రకారంగా చేపట్టేందుకు యెహోవా దేవుడు అనుమతించి ఉంటే, వ్యభిచారం చేసిన వారిద్దరూ మరణశిక్షకు గురయ్యేవారు. మానవ న్యాయాధిపతులు హృదయాన్ని చదవలేరు కాబట్టి, వాస్తవాలనుబట్టి రుజువైన తప్పిదస్థుల చర్యల ఆధారంగానే వారు తీర్పు తీర్చేవారు. వ్యభిచారం చేసినవారికి మరణశిక్ష విధించాలని ధర్మశాస్తం ఆజ్ఞాపించింది. ఆ పాపాన్ని క్షమించే అధికారం ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులకు లేదు.

మరోవైపు నిజమైన దేవుడు హృదయాన్ని చదవగలడు, పాపాలను క్షమించగల ఆధారం ఆ వ్యక్తుల్లో కనబడితే ఆయన వారి పాపాలను క్షమిస్తాడు. ఈ సమస్యలో తాను రాజ్య నిబంధన చేసిన దావీదు ఉన్నాడు కాబట్టి, దానిని ఒక మినహాయింపుగా తీసుకొని తానే ఆ సమస్యతో వ్యవహరించేందుకు యెహోవా నిశ్చయించుకున్నాడు. (2 సమూయేలు 7:​12-16) ‘సర్వలోకమునకు తీర్పు తీర్చే ఆయనకు’ అలా నిశ్చయించే హక్కు ఉంది.​—⁠ఆదికాండము 18:⁠25.

యెహోవా దావీదు హృదయాన్ని పరీక్షించినప్పుడు ఆయన ఏమి చూశాడు? “దావీదు బత్షెబయొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు” ఆయనలో కలిగిన భావాలను ఈ కీర్తన వెల్లడి చేస్తున్నట్లు 51వ కీర్తన పైవిలాసం చెబుతోంది. కీర్తన 51:1-4 ఇలా చెబుతోంది: “దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నా యెదుట నున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చుచున్నప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.” యెహోవా దావీదు హృదయంలోని ఈ తీవ్ర పశ్చాత్తాపాన్ని నిజమైన పశ్చాత్తాపంగా దృష్టించి ఆ తప్పు చేసినవారి మీద కనికరం చూపేందుకు ఆధారం ఉందని నిర్ణయించి ఉండవచ్చు. అంతేకాక, దావీదు కూడా కనికరంగల వ్యక్తి, కనికరం గలవారికి యెహోవా కనికరం చూపిస్తాడు. (1 సమూయేలు 24:​4-7; మత్తయి 5:⁠7; యాకోబు 2:​13) అందుకే దావీదు తన పాపాన్ని అంగీకరించిన తర్వాత నాతాను ఆయనతో ఇలా అన్నాడు: “నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.”​—⁠2 సమూయేలు 12:​13.

దావీదు, బత్షెబలు తాము చేసిన పాపపు పర్యవసానాలన్నిటినీ తప్పించుకోలేరు. ‘అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించావు గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును’ అని నాతాను దావీదుతో చెప్పాడు. దావీదు ఏడు దినములు ఉపవాసం ఉండి, దుఃఖించినా వారి కుమారుడు జబ్బుపడి, మరణించాడు.​—⁠2 సమూయేలు 12:​14-18.

“తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు” అని ద్వితీయోపదేశకాండము 24:⁠16 చెబుతోంది, కాబట్టి కుమారుడు ఎందుకు చనిపోవాలి అనేది అర్థం చేసుకోవడం కొందరికి కష్టంగా ఉంటుంది. సమస్యను ఒకవేళ మానవ న్యాయాధిపతులే చేపట్టి ఉంటే తల్లిదండ్రులతో పాటు గర్భస్థ శిశువు కూడా ప్రాణాన్ని పోగొట్టుకొనేవాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బత్షెబతో చేసిన పాపం కారణంగా, యెహోవా ఎంత మనస్తాపం చెందాడో దావీదు స్పష్టంగా గుర్తించేందుకు ఆయన కుమారుని మరణం దోహదపడి ఉండవచ్చు. “దేవుని మార్గము దోషరహితమైనది” కాబట్టి యెహోవా ఆ సమస్యతో న్యాయంగా వ్యవహరించాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు.​—⁠2 సమూయేలు 22:⁠31, పరిశుద్ధ బైబిల్‌.

[31వ పేజీలోని చిత్రం]

దావీదు నిజమైన పశ్చాత్తాపం కనబరిచాడు